అంతఃకరణలను ప్రేరేపించే నవల ఇది

Spread the love

“క్రైమ్ అండ్ పనిష్మెంట్” తరవాత దోస్తాయివ్స్కీ ముఖ్యమైన రచన “ది ఈడియట్”. తన రచనలలో ఇది అత్యంత మార్మికమయినదేకాక, కొంత గందరగోళానికి గురి చేసేది కూడా. అదేసమయంలో అసంఖ్యాకమైన పాఠక బృందానికి ఇదో ప్రత్యేకమైన ఆకర్షణ(special appeal). ఒక ఉత్తరంలో దోస్తాయివ్స్కీ ఈ నవల గురించి రాస్తూ,”ఇది నా అత్యుత్తమ రచనగా ప్రస్తుతించిన వారందరూ వారివారి ప్రవృత్తులలో(mentality) ఏదో ప్రత్యేకమయినదానిని నాతో పంచుకొనేవారే. అది నాకు సదా ఆకట్టుకొనేదిగానూ, ఆహ్లాదకరంగానూ ఉంటుంది” అని అంటాడు. రచయిత తన జీవితంలోని అంశాలను, నవలలోని ప్రధాన పాత్ర చిత్రణలో ఎలా ఉపయోగించుకోగలిగాడనే అర్థంలో, ఈ నవల మిగిలిన నవలల కన్నా చాలా ఆత్మకథాత్మకం. ఇదే దీనికున్న ఆకర్షణకు ఒక కారణం.

కానీ, దోస్తాయివ్స్కీ ఇలాంటి వ్యక్తిగతమయిన విషయాలకు ఎల్లప్పుడూ, తన కాలపు సమస్యలకు అనుగుణంగా, వాటికి విశాలార్థాన్నిచ్చాడు (క్రైమ్ అండ్ పనిష్మెంట్, ద డెవిల్స్ లో లాగా). లేదా తనజీవితంలో సైబీరియన్ కాలపు అనుభవాల తర్వాత, తనలో ఆందోళనలను రేకిత్తించిన, మత విశ్వాస సంబంధిత ప్రధాన అంశాలకనుగుణంగా వాటిని రూపాంతరీకరించాడు. ఆధునిక సాహిత్యంలోని గొప్ప నవలలలో “ద ఈడియట్” తప్పని సరిగా ఉంటుంది. క్రీస్తును పోలిన(christ figure) వర్తమాన రూపాన్ని( contemporary image), ఈ నవల పైకెత్తడానికి ప్రయత్నిస్తుంది.

1849లలో రాజకీయ కుట్రదాదారునిగా శిక్షకు గురి కావడానికి ముందు, తను అనుభవించిన “మాక్ ఎగ్జిక్యూషన్”ను తన నవలలలో ప్రధాన ఘట్టంగా దోస్తాయివ్స్కీ ఉపయోగిస్తాడు. సామాజిక- రాజకీయ, నైతిక – మానసిక తలాలనుండి తన రచనా ప్రపంచాన్ని చాటే ఒక రచయిత, తన దిగంతాలను విస్తరిస్తూ మత, అధిభౌతిక అంశాలకు రూపాంతరం చెందేందేకు ఈ అనుభవం ఒక ఆరంభంగా దోహదపడింది. దోస్తాయివ్స్కీ చావుతో చేసిన పెనుగులాట, తదననంతరం తను ఎలాంటి రచయిత కానున్నాడో- దానికి దోహదపడింది. ఆ అనుభవానికే తను “ద ఈడియట్” లో రూపాన్నిచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ నవలలోని కథా నాయకుడు, రచయితా ఇద్దరూ ఒకే రకమైన జబ్బు- మూర్చ రోగం తో బాధపడతారు. ఆశ్చర్యకరంగా ఈ జబ్బు, నవలా నాయకుడు- ప్రిన్స్ మిష్కిన్ కు సంపూర్ణతకు సంబంధించిన తాత్కాలిక అనుభవాన్ని, ప్రపంచంతో సామరస్యాన్నీ ఇస్తుంది. అదేవిధంగా ఇహలోక మానవ జీవితంలో అతి సాధారణ కోరికలకు కూడా కొరగానివాడిగా పరిగణింపజేస్తుంది.

ఈ నవలను  చదువుతున్నప్పుడు, మొదట- గతంలో మనం అవలంబించిన పద్ధతులను ఉపయోగించి విశ్లేషించడం కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా, కళాత్మక సంవాదాలుగా (artistic polemics)- రాడికల్ బుద్ధి జీవులకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టి రాసిన, “నోట్స్ ఫ్రం అండర్ గ్రౌండ్”, “క్రైం అండ్ పనిష్ మేంట్”లలో కనిపించే రచనా చట్రం ఈ నవలలో కనిపించదు. “నోట్స్ ఫ్రం అండర్ గ్రౌండ్” లో చెర్నెషెవ్ స్కీ సిద్ధాంతాలు శోధించబడతాయి. “క్రైం అండ్ పనిష్ మెంట్”  లక్ష్యము – తుర్గేనివ్ రచనలలో కనిపించే రాడికల్ చిత్రణ. ఈ రాడికల్ భావాలను నిహిలిస్ట్ అయిన పిసరేవ్ అభివృద్ధి పరిచాడు. అటువంటి భావాల వలన, చిత్రణ వలన తలెత్తే అన్ని నైతిక, మానవీయ పర్యవసానాలను దోస్తాయివ్స్కీ, తన రచనా కృషిద్వారా, ఈ నవలల ద్వారా వెతికిపట్టుకుంటాడు. సమస్యకు ఉన్న మూలాన్ని గతంలోనికి ప్రయాణించి,”క్రైం అండ్ పనిష్ మెంట్”లో మాదిరిగా, రష్యన్ ఆర్థోడాక్స్ సంప్రదాయపు మత వారసత్వం వల్ల రూపొందిన మనస్తత్వపు లోతులలో కనిపెడతాడు. ఈ రకమైన ప్రణాళిక(schema) ఈ నవలలో దాదాపుగా కనపడదు

ఈ నవలలో కూడా దోస్తాయివ్స్కీ యువ నిహిలిస్టుల ప్రమేయం వలన  ఏర్పడే పరిణామాలను (అధ్యాయం-8- రెండవ భాగం) రాస్తాడు. ఈ యువ రాడికల్స్ ను కొంత వరకు హేళన కూడా చేస్తాడు. వారికి కొన్ని మంచి లక్షణాలను(redeeming features) కూడా ఇస్తాడు. అయితే వారిని హేళనగానూ, దయనీయమయిన వారిగానూ ఆయన చూపిస్తాడే కానీ ప్రమాదకారులుగానూ, అపకారులుగానూ కాదు.  ఈ నవలలో రోగోఝిన్ అనుమానంతో నేరం చేస్తాడు. తను ఒక వ్యాపారి కొడుకు. తన ఉద్వేగాలు రాడికల్ ఆలోచనల వలన గానీ, రాడికల్ భావజాల పర్యవసానాల వలన కానీ ప్రేరణ పొంది తలెత్తినవికావు. అతను ఇంకా రష్యన్ మత సంప్రదాయపు లోతయిన ప్రభావంలో ఉన్నవాడే. రోగోఝిన్ చేసిన నేరము భావావేశానికి( passion) సంబంధించినది. భావాలకు(ideas) సంబంధించినది కాదు. కాబట్టి ఈ అర్థంలో, దోస్తాయివ్స్కీ తన గత నవలలలో ఉపయోగించిన రచనా చట్రం ఈ నవలా రచనలో ఆకస్మికంగా ఆగిపోతుంది

అయితే, ఈ నవలలో సంభవించే సంఘటనలను వ్యాఖ్యానించడం కోసం, వాటిని విస్తృత పరచినపుడు పై నవలలకు ఉపయోగపడిన సాధారణ విశ్లేషణా చట్రమే దీనికి కూడా వర్తిస్తుంది. ఒక సాధారణ పరమ విలువను లేదా ఆదర్శాన్ని మనిషి భావావేశాలకు, అనుభూతులకూ వర్తింపజేయడం అనే సూత్రం మీద ఈ విశ్లేషణా చట్రం ఆధారపడి ఉంటుంది. ఇట్లా వర్తింపజేసి, ఆయా విలువలకు, ఆదర్శాలకు ఉన్న పరిమితులను వెల్లడి చేయడం దోస్తాయివ్స్కీ ఉద్దేశం. “క్రైం అండ్ పనిష్ మెంట్” నవలలో, రస్కోల్నికోవ్ సిద్ఢాంతము- మానవీయ నేరమ(humanitarian crime) విఫలమవుతుంది. ఎందుకంటే, ఒక నేరాన్ని చేయాలంటే మనిషి స్వీయాన్ని(igoism) విడిచిపెట్టాల్సి ఉంటుంది. చివరకు ఆ నేరం వల్ల వచ్చే ఫలితం కూడా ఇక అదే అవుతుంది.

ఇదే పద్ధతి “ది ఇడియట్” నవలలో కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ, పరీక్షకు గురయ్యే ఆదర్శమూ, పరమ విలువ(absolute value), దోస్తాయివ్స్కీ సొంతమయినది. ఈ నవలలో క్రీస్తు( తన ఊహించినంత మేరకూ) ఉన్నతాదర్శాలకు రూపమనుకోదగ్గ ఒక పాత్రను రచయిత సృష్టించాడని అనుకున్నట్లయితే, అదే పాత్ర ద్వారా-ఆ ఆదర్శాలను జీవితంలో పాటింపజేయ చూసినపుడు అవి ఈ ప్రపంచంలో ఇమడకపోవడాన్ని కూడా దోస్తాయివ్స్కీ చూపుతాడు. ఆ ఆదర్శాలు మానవజీవితాన్ని మెరుగుపరిచే మార్పును ఏ విధంగానూ తీసుకరావు. నవలలో దానికి విరుద్ధంగా, చాలా రోజుల క్రితం ఎత్తిచూపినట్టూగానే, ప్రిన్స్ మిష్కిన్- అతని సాధుత్వపు శాపము(curse of saintliness) (మిష్కిన్ సాధుత్వము దీవెన కాదు అది శాపమే), ప్రతీ వ్యక్తికీ సమస్యలను సంక్లిష్టము చేస్తుంది. చివరకు అది మిష్కిన్ ను పిచ్చివాడిగా మార్చి, స్విట్జర్లాండ్ కు తిరిగి మరలేలా చేస్తుంది. రస్కోల్నికోవ్ ఎలాగయితే తన ఆదర్శాలతో పరాజితుడవుతాడో, మిష్కిన్ కూడా అదే స్థితికి చేరుకుంటాడు. ఈ నవలలో కూడా పాఠకులకు చివరకు మిగిలేది ఆదర్శానికీ వాస్తవానికీ మధ్య ఉండే సంఘర్షణను తిరిగి తిరిగి ఎత్తిపట్టే నమూనాయే

ఇతర నవలకూ, ఈ నవలకూ ఉన్న సామ్యతను విమర్శకులు పట్టించుకోలేదు. లేదా దానిని దోస్తాయివ్స్కీబలహీనతకో, తన కళాత్మక సామర్ధ్యాల పరాజయానికో ఆపాదించారు. ప్రపంచపు మోరల్, ఎథికల్ సమస్యల పరిష్కరణలో క్రిష్టియానిటి విజయాన్ని, సమర్ధతనూ చూపించేందుకు ఈ నవలను దోస్తాయివ్స్కీ రాసాడని కూడా వారు అన్నారు. “ది ఇడియట్” నవల రాయడానికి ఆయన రాసుకున్న నోట్స్ లో దీనికి కొంత ఆధారముంది. నవల చివరదాకా తన వ్యక్తిగత విశ్వాసాలపై మిష్కిన్ నమ్మకాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. రోగోఝిన్-నస్తాష్యా మధ్య ఉన్న ప్రేమ- ద్వేష సంబంధ సమస్యను పరిష్కరించడంలో తను సహాయపడగలననే అనుకుంటుంటాడు. కానీ అలా ఎన్నటికీ జరగకపోగా దానికి పూర్తి వ్యతి రేకంగా జరుగుతుంటుంది. దోస్తాయివ్స్కీ ఇష్టాలకూ, కళాత్మక ఉద్ధేశాలకూ వ్యతిరేకంగా, ఆయన క్రైస్తవ ఆదర్శాలు ఓడిపోతాయి

క్రీస్తు లాంటి(christ-figure) పాత్రతో ప్రపంచంలోని ప్రజానీకానికి సంతోషాన్ని తెచ్చే అద్భుతాన్ని దోస్తాయివ్స్కీ తన నవలలో  నిజంగానే రాయాలనుకున్నాడా? ఈ విషయాన్ని ఆరవ అధ్యాయంలో, మొదటి భాగంలో మేరీ కథ మనకు సూచిస్తుంది. ఈ కథ మున్ముందు జరగడానికి వీలున్న తీర్మానాల నమూనాని(pattern of possible resolutions) పాఠకుల ముందుంచుతుంది. కానీ నవల మొత్తాన్ని- ఇదే విధంగా, సెంటిమెంట్లతో కూడిన, హితోపదేశ స్వరంతో  కొనసాగించగలననిగానీ, మిష్కిన్ – ఇతర పాత్రల కష్టాలన్నింటికీ పరిష్కారాన్ని చూపించగలడనిగానీ దోస్తాయివ్స్కీ అనుకొని ఉంటాడని ఊహించడం కష్టం. ఈ అధ్యాయంలో మిష్కిన్ చెప్పిన నీతికథ(parable) పిల్లల మీద ప్రభావం చూపడాన్ని మనం గమనించవచ్చు. బహుశా దానికి కారణం-పిల్లలకుండే అమాయకత్వం. మిష్కిన్ మేరీ మీద చూపే ప్రేమకు, వారి తల్లితండ్రులు ఒకరి మీద మరొకరు చూపుకొనే ప్రేమకూ గల తేడాను పిల్లలు గమనించలేరు. మిష్కిన్ కు మేరీ పై గల ప్రేమ సానుభూతి, దయలనుండి పుట్టింది కాగా తల్లితండ్రుల మధ్య పుట్టే ప్రేమ లైంగికమయినదిగానూ, తీవ్ర భావావేశయుతమయినదిగానూ(passionate) ఉంటుంది. ఇతివృత్తానికి సంబంధించిన ఈ విషయం గురించి దోస్తాయివ్స్కీకు బాగా తెలుసు. నవల గురించి తను రాసుకున్న నోట్స్ లో ” నవలలో మూడు రకాల ప్రేమలు ఉన్నా”యని రాసుకున్నాడు. 1. తీవ్ర భావావేశాయుత ఆకస్మికోద్రేక ప్రేమ- రోగోఝిన్( passionate and impulsive love) 2.ఆడంభరరహిత ప్రేమ- గన్యా( love out of vanity) 3. క్రైస్తవ ప్రేమ- ది ప్రిన్స్( christian love)

నవల గురించి రచయిత రాసుకున్న నోట్స్ అనేక రకాలుగా(so varied), వైవిధ్యభరితంగా(diversified) ఉంటుంది. కాబట్టి దీని ఆధారంగా నవలపై మనం ఒక అంచనాకు రావడం కష్టం. ఏదిఏమైనా, ఈ నవలకున్న భాహ్య చరిత్ర,  దోస్తాయివ్స్కీ రచనా సంచయంలోని మిగిలిన అన్నింటికన్నా సంక్లిష్టమయిందన్నది నోట్స్ లోని విషయాలు స్పష్టం చేస్తాయి. జనవరి 1868లో దోస్తాయివ్స్కీ రాసిన ఉత్తరంలోని ఒక పేరా, ఆయన భావాలను వెలుగులోకి తేవడంలో చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. నవల మొదటి భాగంలోని  ఐదు అధ్యాయాలను ప్రచురణకు పంపాక  ఈ ఉత్తరాన్ని దోస్తాయివ్స్కీ రాసాడు. దానిలో తను నవలలో ఏమి రాయబోతున్నాడో వివరించడానికి ప్రయత్నించాడు. తను ఒక “సానుకూల సుందర మానవు”ని( a positively beautiful human being) గురించి రాస్తున్నట్టుగా ఆయన దానిలో అన్నాడు. ఉత్తరంలో ఆయన పదేపదే ఈ మాటనే రాసాడు. ఈ ఉత్తరంలోని మిగిలిన భాగం కూడా నవలను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

“ప్రపంచంలో ఉన్న ఒకే ఒక సానుకూల సుందర మానవుడు క్రీస్తు మాత్రమే” అని ఆయన ఆ ఉత్తరంలో రాస్తాడు. “కాబట్టి, అవధులు లేని, ఆ అనంత సుందరుని సాక్షాత్కారం తనంత తానుగా అంతులేని అధ్బుతమే అవుతుంది” అని ఆయన అంటాడు (యోహాను సువార్త- ఆయన అవతరణలోనే అధ్బుతమంతా ఉంది. అది అందానికి వ్యక్తీకరణ అని అంటున్నది) . డాన్ కహోటీ, పిక్విక్, జో వల్జో(లె మిజరాబుల్) పాత్రల కల్పనను, క్రీస్తును పోలిన ప్రాతినిథ్య పాత్రలుగా మలిచే ప్రయత్నాలుగా దోస్తాయివ్స్కీ గుర్తిస్తాడు. కానీ తన రచనకు అవి ఎంత మాతమూ సరిపోవని ఆయన అంటాడు. తన ఉత్తరంలో డాన్ కహోటీ పాత్ర హాస్యాస్పదంగానూ అదే విధంగా అందంగానూ ఉందని అంటాడు.  తన ఆదర్శాన్ని ఈ ప్రపంచంలో నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ డాన్ కహోటీ చేసే  ప్రవర్తన, అతనిని హాస్యాస్పదుడిని చేసిందని అంటాడు. ప్రిన్స్ మిష్కిన్ కు కూడా అలాంటి నిష్క్రియాత్మకతను ఇచ్చినట్లయితే తను కూడా డాన్ కహోటీ లాగానే హాస్యాస్పదుడవుతాడనే సంగతి  దోస్తాయివ్స్కీకి తెలిసినట్టే అనిపిస్తుంది. పిక్విక్ విషయం కూడా అలాంటిదే. అతను డాన్ కహోటీకి సరిజోడి. జో వల్జో విషయానికి వస్తే అతడు పరారీలో ఉన్న నేరస్తుడు. తర్వాత అతడు మానవాళికి పరోపకారి అవుతాడు. తను ఈ చర్యా పరంపరలో భాగంగా బాధలకు గురవుతాడు. సామాజిక న్యాయ బాధితుడవుతాడు. ఈ కారణాల వలన సానుభూతిని రేకిత్తించగలుగుతాడు.

కానీ దోస్తాయివ్స్కీ ఈ సాహిత్య నమూనాలను నిరాకరించాడు. “నా నవలలో అలాంటివేవీ ఉండవు” అని ఉత్తరంలో అంటాడు. తన నవలలో, పుస్తకం తెరవగానే, రాబోయే రోజుల్లో అదృష్టం వరించనున్న పాత్రగా ప్రిన్స్ మిష్కిన్ రూపొందించబడతాడు. కానీ ఆ అదృష్టం వల్ల కలిగే ఆకర్షణకు అతడు దూరం చేయబడతాడు. అతడు నటుడు కానీ బాధితుడు కానీ కాదు. అతడు కేవలం ఒక ఉనికి. ఒక రకమయిన స్వీయ నైతికా ప్రకాశం. అతడు, యోహాను సువార్తలో  దోస్తాయివ్స్కీఎలాంటీ క్రీస్తు సాక్షాత్కారాన్ని  పొందాడో సరిగ్గా అలాంటివాడు. మిష్కిన్ ఎలాంటి అద్భుతాలనూ చేయడు.  కానీ వాస్తవంగా అతని ఉనికి ఒక ఆధ్యాత్మిక శక్తి. ఆ ఆధ్యాత్మిక శక్తి తన తోటి వారిని ఏమి చేయగలదో, అదే ఘటనాఘటన సర్వస్వమై నవలను నడిపిస్తుంది. క్రీస్తును పోలిన పాత్రను ముఖ్యమయినదిగా ఉంచుతూ, ఆ పాత్రను ఘర్షణలను పరిష్కరించే మార్గదర్శకుడిగా  ఒక నవల రాయాలని,  బహుశా దోస్తాయివ్స్కీఎన్నడూ అనుకొని ఉండడు. కానీ దానికి బదులుగా, నడయాడిన ప్రతీ చోట, సంపర్కంలోకి వచ్చిన ప్రతీ మనిషి మీదా చెరగని ముద్రను వదిలివెళ్ళే ఒక మనిషిని మాత్రం ఆయన ఊహించి ఉంటాడు.

దోస్తాయివ్స్కీ తన సృజన ద్వారా, క్రైస్తవ ఆదర్శాలను వాస్తవిక ప్రపంచంలో వీలుకానివిగా చిత్రించి తనను తానే ఈ నవలలో ఓడించుకొన్నాడని విమర్శకులు అంచనా వేసారు. ఈ పరాజయం దోస్తాయివ్స్కీ విశ్వసించే క్రైస్తవ విలువలకే కాదు. మతాన్ని ప్రపంచమంతా చురుకుగానూ, విజయవంతంగానూ ఒకరకమైన సామాజిక సంస్కరణగా(social gospel) అమలుపరుస్తున్న భావనకే పరాజయమని కూడా వారు విమర్శించారు. అయితే ఇది, తనదయిన గొప్ప ఆలోచనా స్థాయికి(matured) చేరిన దోస్తాయివ్స్కీ దృక్పథానికి  ఎంత మాత్రమూ వర్తించదు. మతానికి చెందిన ఆయన భావనకు ఎంతమాత్రమూ సరిపోలదు. 1840లలో తను ఒక రకమైన  క్రిష్టియన్ సోషలిజానికి దగ్గరయినప్పటికీ,  “ది ఈడియట్” నవల రాసే నాటికి, ఆ వైఖరితో దోస్తాయివ్స్కీకి ఎంత మాత్రమూ సంబంధము లేకుండా పోయింది. అప్పటికల్లా ఆయన క్రిష్టియానిటీ- క్రీస్తు బాధగా, క్రీస్తు పొందిన అవమానంగా మారింది. క్రీస్తు రాకడ ప్రపంచానికి విమోచన, రక్షణలనిచ్చేందుకుగానూ త్యాగం చేయడం కోసమే కానీ ఈ నేలపై అధిపతి కావడానికి ఎంతమాత్ర్రమూ కాదు అనే అవగాహనగా అయింది.

రష్యన్ క్రిష్టియానిటీని అధ్యయనం చేస్తున్న విద్యార్ధి, జి.పి ఫెదరోవ్, ఈ మధ్యనే “ద రష్యన్ రెలిజస్ మైండ్” ( THE RUSSION RELIGIOUS MIND)  అనే పేరుతో రెండు సంపుటాలుగా ఒక పుస్తకాన్ని రాసాడు. దానిలో తాను, స్థానిక రష్యన్ మత సంప్రదాయాన్ని(Indigenous Russian Religious Tradition) నిర్వచించాడు.  క్రీస్తు భువికి దిగి వచ్చిన తర్వాత తను దివ్యత్వాన్ని( ఆయన దైవజనుడే అయినప్పటికీ) వదిలి వేయడాన్ని అది నొక్కి వక్కాణిస్తున్నది కాబట్టి,  స్థానిక రష్యన్ మతసంప్రదాయం అంటే “మరీ ముఖ్యంగా పరిత్యజించడం”(Kenotic) అని ఆ పుస్తకంలో ఫెదరెవ్ నిర్వచించాడు. ఇక్కడ క్రీస్తు- ఘనతనొందిన ప్రకాశకునిగా( respledent magesty) కాక, చెడును నిరోదించని త్యాగమయ బాధిత (sacrificial victim) బాధాతప్త మానవునిగా మాత్రమే కనిపిస్తాడు. రష్యన్ మత సంపదాయానికి చెందిన ఈ అవగాహనని దోస్తాయివ్స్కీ గాఢంగా అనుభూతి చెందాడు కాబట్టే, దానికి “తన లెజెండ్ ఆఫ్ ద గ్రాండ్ ఇన్క్విజిటర్” (ద బ్రదర్స్ కరమాజొవ్- అధ్యాయం-6, బుక్-5) లో దానికి గొప్ప రూపాన్నిచ్చాడు.

రష్యన్ పరిత్యజన- అనే ఈ భావన “ది ఈడియట్” నవలకు సంబంధించిన కొన్ని విషయాలని వివరించడానికి దోహదపడుతుంది. ఉదాహరణకు- ప్రిన్స్ మిష్కిన్ తో అగ్లాయా ఎపంచినాకు ఉన్న సంబంధం. పావ్లోవ్స్క్ పార్కు వద్ద జరిగిన సంఘటన తర్వాత ప్రిన్స్ మిష్కిన్ ఒక సవాల్ ను ఎదొర్కోబోతున్నాడని అగ్లాయా నిశ్చయంగా భావిస్తుంది. ఆమె మిష్కిన్ ను ద్వంద్వ యుద్ధాన్ని నేర్చుకోమని అడుగుతుంది. అలా ద్వంద్వయుద్ధానికి దిగడం క్రైస్తవానికి పూర్తి వ్యతిరేకమయినప్పటికీ ఆకాలపు కట్టుబాట్లను మిష్కిన్ పాటిస్తాడని ఆమె అనుకుంటుంది. ఆమె మిష్కిన్ లో, పూష్కిన్ రాసిన “పూర్ నైట్”(Poor Knight)లోని యూరోపియన్ మధ్య యుగాల కాలమునాటి వీరోచిత రోమన్ క్యాథలిక్ యోధుడిని చూసుకుంటుంది. కానీ నిజానికి మిష్కిన్ అలాంటివాడు కాదు. మతము, ప్రాపంచిక అధికారాల ప్రతిరూపమే రోమన్ క్యాథలిక్ ఆదర్శమని స్లావోఫిల్స్(Slavophils) అవగాహన. ఈ అవగాహనే నవలలో అగ్లాయా భవిష్యత్తు రూపంలో దోస్తాయివ్స్కీ పాఠకులతో పంచుకుంటాడు. నవల ముగింపుకు చేరేసరికి అగ్లాయాకు పోలిష్ రోమన్ క్యాథలిక్ కౌంట్ గా నటిస్తూ, దమ్మిడీ కూడా లేని మాయగాడితో దోస్తాయివ్స్కీ పెండ్లి చేస్తాడు. చివరకు ఆమె రోమన్ క్యాథలిక్ సంకెలలలో పడుతుంది.

నవలలోని మత భావనలను అర్థం చేసుకోవడానికి ఇది మనకు ఒక సాధారణమైన అవగాహనా చట్రాన్ని ఇస్తుంది. ఇక్కడే మనము, మరో డాక్యుమెంట్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అది  దోస్తాయివ్స్కీ అసలైన మత విశ్వాసాలను మనకు సూటిగా అందిస్తుంది. ఈ డాక్యుమెంట్ ప్రిన్స్ మిష్కిన్ పాత్రను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయొగకరమైనది కూడా. దీనిని దోస్తాయివ్స్కీ తన మెదటి భార్య చనిపోయినపుడు, ఆమె శవపేటిక పక్కన రాత్రిపూట జాగారం చేస్తూ ఒక నోట్ బుక్ లో నమోదు చేసాడు.  ఆరోజు తేదీ- 1864, ఏప్రిల్ 16. అప్పుడు తను, “నోట్స్ ఫ్రం అండర్ గ్రౌండ్” రెండవ భాగాన్ని రాస్తున్నాడు. కానీ అప్పుడు తను రాసుకున్న మాటలు నిజానికి ప్రిన్స్ మిష్కిన్ గురించి తన హృదయంలో ఉన్న భావనలే. క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన సూత్రాలను గురించి  దోస్తాయివ్స్కీ ఏమి ఆలోచించాడన్న విషయాన్ని వివరించే ప్రాథమికమైన నాన్ ఫిక్షనల్ ఆధారం(first  hand non fictional soursce) ఏదైనా ఉన్నదంటే  అది ఈ ఒక్క డాక్యుమెంటే. దానిలో దోస్తాయివ్స్కీ, తన నమ్మకాలను తనకు తాను చెప్పుకోవడమేకాక, వాటిని తన హృదయపు లోతులలో ఉన్న విలువైన వ్యక్తీకరణగా, పాఠకులు అంగీకరించేందుకుగానూ వారి ముందుంచే ప్రయత్నం చేస్తాడు. ఈ డాక్యుమెంట్ 1926లోనే జర్మన్ లోకి అనువాదమయింది. 1932న యూరప్ లో రష్యన్ భాషలోకి ముద్రణ అయింది. కానీ అది ఇటీవల దాకా విమర్శకుల దృష్టిని ఆకర్షించకపోవడం ఆసక్తిగా అన్పిస్తుంది.

ఆయన ఇలా మొదలుపెడతాడు. “మాషా బల్లపై పడుకొని ఉంది. మాషాను నేను తిరిగి చూస్తానా?” తను వేసుకున్న ఈ ప్రశ్నను చూడగానే వెనువెంటనే అది అమరత్వానికి(immortality) సంబంధించినదిగా అనిపిస్తుంది. దోస్తాయివ్స్కీ వేసుకున్న ఈ ప్రశ్న కొంత సంశయవాదంగా కూడా అనిపిస్తుంది. అది విశ్వాసాన్ని ధృవపరిచేది కాదు. అంతమాత్రాన, ఈ ప్రశ్నను క్రైస్తవ విశ్వాసాలను నిరాకరించేదిగా అనుకోకూడదు. ఇది మరణానంతరం ఉనికి అనేది ఎలా కొనసాగనున్నది అనేదానికి సంబంధించిందే కానీ అట్లాంటి ఉనికిని అసలెంత మాత్రమూ అనుమానించేదికాదు. ఇదే రకమైన అర్థంలో, “ది ఈడియట్” నవలలోని ఒక పేరాలో ప్రిన్స్ మిష్కిన్ మరణ దండనకు ఎదురుచూస్తున్న మనిషి అనుభూతులను వివరిస్తుంటాడు. ఇవి మరణదండన గురించి దోస్తాయివ్స్కీ మనసులో ఎలాంటి అనుభూతులు గాఢంగా ముద్రపడి ఉన్నాయో, సరిగ్గా అలాంటివే.

చర్చీ గోపురంనుండి ప్రతిఫలిస్తున్న సూర్యకాంతి వైపు అతను ఎంతో వేదనగా చూస్తుంటాడు. అది అతని గురించిన ఒక సవివరణలాగా లేదా అతనికే చెందినదానితో నింపబడ్డ ఒక సంకేతాత్మకమయినదానిలాగా అనిపిస్తుంది : ” ఆ కిరణాలు అతనికి తన నూతన స్వభావంగానూ, మరి మూడు నిమిషాల్లో తను వాటిలో కరిగి పోనున్నాడనీ అనిపించింది… ఉండనున్న, సంభవించనున్న నూతన పరిణామాల పట్ల అనిశ్చతి, వ్యతిరేకత దారుణమైనది”(అధ్యాయము-5, బుక్- 1).  ఈ అనుభూతి తెలియనిదానిపట్ల ఉండే భయాన్ని వెల్లడి చేస్తుంది. దోస్తాయివ్స్కీ నమ్మిన ఒక విధమయిన చైతన్యం- కానీ అది ఏ రూపంలో ఉండనున్నదో తను ఊహింపజాలనిది- ఉనికిలోనే లేకుండినట్లయితే ఇలాంటి భయం కలగడానికి హేతువు ఉండదు.  వాస్తవానికి దోస్తాయివ్స్కీ తనతో తాను మరణదండనానంతరం, అతను “క్రీస్తుతో ఉంటా”డని చెప్పుకుంటాడు.

నోట్ బుక్ లో అమరత్వాన్ని గురించిన రాసుకున్న ప్రశ్న, తనతో పాటుగా కొన్ని స్వీయ నైతిక(moral reflections) విషయాలను కూడా ముందుకు తెస్తుంది. “నీవలెనే ఇతరులను ప్రేమించ”మని,  “క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ అసాధ్య”మని ఆయన నోట్ బుక్ లో రాస్తాడు. ఈ ప్రకటన పూర్తిగా అసాధారణమయినది. అంటే దోస్తాయివ్స్కీ ప్రకారము, దీని అర్థము క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ దారితప్పిస్తున్నదని కాదు. మానవాళికంతటికీ అది ఒక ఆదర్శంగా, కృషిచేసేందుకు ఇవ్వబడినదనీ,  దానికై క్రీస్తే తనకు తానుగా తన జీవితంలో భువిపై అవతరించాడనీ ఆయన వివరించాడు. “తనవలెనే ఇతరులనూ ప్రేమించవలెననే ఆజ్ఞను పాటించేందుకు క్రీస్తు ఒక్కడే సమర్ధుడు. కానీ, శాశ్వత ఆదర్శమయిన క్రీస్తును సమీపించడానికి వ్యక్తి తప్పనిసరిగా ప్రకృతి నియమాల(laws of nature)ననుసరించి ప్రయత్నము చేయాలి”. ప్రకృతి నియమాలగురించి ప్రత్యేకించి చేసిన ఈ విజ్ఞప్తి పాఠకులకు అనుకోకుండానే చెర్నిషేవ్స్కీని గుర్తుకు తెస్తుంది. కానీ ఇక్కడ ప్రస్తావించిన ప్రకృతి నియమాలు ఎంతమాత్రమూ తాజా శాస్త్రీయ ఆవిష్కరణలు కాదు. అవి క్రీస్తు ద్వారా రచయితకు వెల్లడి అయిన మానవ ఆధ్యాత్మిక ప్రకృతి(spiritual nature) మాత్రమే. దీనినే దోస్తాయివ్స్కీ మానవావతార భావన( the idea of man incarnate)అంటాడు. చెర్నిషేవ్స్కీలాంటి రాడికల్ బుద్ధిజీవులు తమవిగా  సొంతం చేసుకున్న  ప్రకృతి  నియమాలను దోస్తాయివ్స్కీ తీవ్రంగా వ్యతిరేకించాడు.

భువిపై క్రీస్తు ఆజ్ఞను పాటించడం ఎందుకు అసాధ్యం? ఈ ప్రశ్నకు జవాబుగా “భువిపై వ్యక్తిత్వ నియమం (law of individuality on earth) కట్టడి చేస్తుంది. నేను ( అహం-ego) ఆటంకపరుస్తుంది, అని దోస్తాయివ్స్కీ అంటాడు. ఆ విధంగా మానవ వ్యక్తిత్వమనేది మానవ స్వభావానికి సంబంధించిన మరే ఇతర అంశానికన్నా విడిగా తనకుతాను గొప్ప సంకటమవుతుంది. క్రైస్తవ ప్రేమను నెరవేర్చడంలో ఆటంకమవుతుంది. కానీ ఇప్పుడు, ఈ సంకటం ఉన్నప్పటికీ -దాని పరిష్కారమనేది “పగటివెలుగంతటి”(as clear as day) స్పష్టంగా ఉంది. వ్యక్తి యొక్క ఉన్నతమయిన, అంతిమమయిన అభివృద్ధిగా, భగవానుని అవతరణ జరిగాక క్రీస్తును అనుకరించడం, వ్యక్తిత్వాన్ని త్యాగం చేయడమే ఆ పరిష్కారం. పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన అహాన్ని హెచ్చుగా ఉపయోగించడం వల్లనే వ్యక్తిత్వమనేది రూపొందుతుంది. ఆ వ్యక్తిత్వమే తనను తాను ప్రతిఒక్కరికీ హృదయపూర్వకంగా, నిస్వార్ధంగా సపర్పించుకునేందుకుగాను అహాన్ని నిర్మూలన చేస్తుంది. అదే గొప్ప సంతోషమయి ఉంటుంది.”అహము- అందరూ”(the ego and all) అనే దానికి అర్థాన్ని, “మానవతావాద నియమం”గా (the law of humanism), “క్రీస్తు యొక్క పరదైసు” (the paradise of christ)గా  దోస్తాయివ్స్కీ చాటుతాడు. అతని ప్రకారం సమస్త చరిత్ర, మానవాళి అంతా ఒక మొత్తంగానో, లేక  ఒక్కొక్కరూ విడివిడిగానో ఆ లక్ష్యాన్ని చేరుకొనేందుకు “చేసే పోరాటమో, ప్రయత్నమాత్రమో”అయి  ఉంటుంది.

ఇక్కడ మనం దోస్తాయివ్స్కీకి చెందిన చరిత్ర యొక్క అలౌకిక దృక్పధానికి (acolyptic view of history) – అతని పాత్రల అంతర్గత స్వీయ నైతిక- ఆధ్యాత్మిక సంక్షోభాలు, సందిగ్ధతలకు( inner moral- spiritual crises and dilemmas) ఉన్న సంబంధాన్ని పరిశీలిద్దాము. ఈ రెండూ కూడా ఒకే ఎరుకను పొందడానికిగానూ ఒకే పోరాటంలో భాగమవుతాయి. దీన్నే ప్రఖ్యాత అమెరికన్ థియాలిజియన్ రైన్హోల్డ్ నీబర్ (Reinhold Niebhur) తన పుస్తకం “ద నేచర్ అండ్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్” లో “అసాధ్యపు సాధ్యత” (imposiible possibility) అని అంటాడు. ఇక్కడ నీబర్, దోస్తాయివ్స్కీని చెప్పకపోయినప్పటికీ అతని ఆలోచనలు దోస్తాయివ్స్కీ క్రైస్తవ దృక్కోణాన్ని( christian point of view) వివరిస్తాయి.

పోరాటం నిరంతర అవసరమనీ, అయినా అది భూమిమీద పరిపూర్ణంగా సఫలతనీయదనీ దోస్తాయివ్స్కీ నమ్ముతాడు. ఆయన నమ్ముతున్నదాన్నిబట్టి, అదే మానవాళి యొక్క అంతిమ లక్ష్యమయినట్లయితే, దాని సఫలత నిజానికి మానవ జీవితానికీ, చరిత్రకూ ముగింపు అవుతుంది. ఉన్నతమయిన ఈ ఆదర్శానికి చేరడానికి మనిషి చేసే పోరాటమే జీవితమని నిర్వచింపబడినందున, ఒకసారి ఈ ఆదర్శాన్ని అందుకున్నట్లయితే జీవించాల్సిన అవసరతే ఉండదు. కాబట్టి,  దోస్తాయివ్స్కీ మాటల ప్రకారం, భూమిపై ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందుతున్న జీవి. అంతేకానీ తత్ఫలితంగా ఒక తుదకంటూ చేరుకున్న వాడు కాదు. పరివర్తన చెందుతున్నవాడు మాత్రమే. అందువలన  ఏ వ్యక్తి అయినా తను అత్యున్నతంగా అభివృద్ధికి చెంది, ఆ శక్తినుపయోగించి “ప్రేమ నియ”మాన్ని సాకారం చేయడానికి ప్రయత్నిస్తే  అది తప్పనిసరిగా అసంపూర్ణమే అయి తీరుతుంది. ప్రిన్స్ మిష్కిన్ ను దోస్తాయివ్స్కీ ఎలా చిత్రించాడో తెలుసుకోవడానికి ఈ అవగాహన చాలా ముఖ్యమయినది. మిష్కిన్ భువిపై క్రీస్తు అత్యున్నత ఆదర్శానికి ప్రతిరూపమే అయినప్పటికీ అతను క్రీస్తు ఆదర్శాన్ని నెరవేర్చడంలో విఫలమవుతాడు.

ఈ ముగింపును దోస్తాయివ్స్కీ అమరత్వానికి అనుకూలమైన వాదనగా ఉపయోగించుకుంటాడు. జీవితమన్నది భూమిమీద ఆవశ్యకంగా అసంపూర్ణమయినప్పుడు, ఆ తర్వాత భవిష్యత్తుగా పరదైసు జీవితమనేది( heavenly life) ఉండి తీరాలి. కానీ ఈ భవిష్యత్తు జీవితముతో, మనకు తెలిసిన ఇహజీవితానికి ఎలాటి సంబంధం కలిగి ఉందన్నది వివరించడంలో రచయిత వాచకం(text) అస్పష్టంగా ఉంది: “అది ఏమై ఉంటుంది, ఎక్కడ, ఏ గ్రహం మీద, ఏ కేంద్రంపై, ఒక వేళ ఆది ఉన్నట్లయితే అంతిమ కేంద్రం పైనేనా, అంటే అది సార్వత్రికమయిన సంశ్లేషాణా వక్షస్థలంలోనేనా(bosom of the universal synthesis)- అంటే ఆ దేవునిలోనా?”- మనము ఎరుగము. మనకు తెలినదల్లా క్రీస్తు ముందుగానే ఎరుకపరిచినది- ఆయన మత్తయ సువార్తగా చూపించినది: “వారు వివాహము నొందడంగానీ వివాహములో లొంగిపోవడముగానీ చేయరు. వారు దేవదూతల వలే యుందురు”. ఈ విధంగా దోస్తాయివ్స్కీ సంపూర్ణ రతి రాహిత్య జీవితాన్ని(sexless life) భవిష్యత్ స్వర్గ జీవితపు ఆదర్శ స్థితిగా గుర్తిస్తాడు.

ఈ విషయాన్ని ఇంకా వివరిస్తూ ఆయన, ఇంతకు ముందు  లేవనెత్తిన ఇగోఇజమ్, వ్యక్తిత్వాల వద్దకు తిరిగి వస్తాడు. దోస్తాయివ్స్కీ కూడా రాడికల్స్ లాగానే వివాహంపై, కుటుంబాలపై దాడిచేస్తాడు. కానీ ఆయన పద్ధతి రాడికల్స్ లాగా కాకుండా ఇంకో విధంగా ఉంటుంది.  స్త్రీలకు మరింత స్వేచ్చ ఉండాలనే విషయంలో రాడికల్స్ అనుకూలంగా ఉంటారు. వారికి సంప్రదాయ కుటుంబమనే భావన అడ్డుగా ఉంటుంది. దోస్తాయివ్స్కీకి కూడా కుటుంబమనేది ఒక ఆటంకమే. కానీ ఆయన కుటుంబాన్ని ఇగోయిస్టిక్, స్వీయకేంద్రీకృతాలతో నెత్తురోడుతున్న చోటుగా చూస్తాడు. ఆయన ఇలా రాస్తాడు.” అది మానవత్వం నుండి గొప్ప నిష్క్రమణలాగా ఉంది. ప్రతీ ఒక్కరి నుండి జంట విడివడి ఉండడం ( సమాజానికి వారి నుండి లభించేది ఇక దాదాపుగా ఉండదు). కుటుంబము- అది ప్రకృతి యొక్క నియమము( రచయిత: కుటుంబమనేది ప్రత్యుత్పత్తి కోసమే అనే అర్థంలో) ఇప్పటికీ అదే అసాధారణమయిన, దాని పూర్తి అర్థంలో ఇగోయిస్టిక్ గానూ….ఈ ప్రకృతి నియమం ద్వారా మనిషి అభివృద్ధి చెంది లక్ష్యాన్ని చేరుకుంటాడు. దీనికై కుటుంబమనేది అత్యున్నత పవిత్ర విషయమై ఉంది( తరాలు మారడానికని అర్థం). కానీ అదే సమయంలో ప్రకృతి నియమం అనే దానిని, మనిషి చేరాల్సిన అంతిమ లక్ష్యాన్ని బట్టి ( రచయిత: మానవుని ఆధ్యాత్మిక ప్రకృతి)నిరంతరంగా నిరాకరించవలసి ఉంటుంది”(ద్వంద్వత్వము).

ఆస్తికులతో వాదిస్తూ, అమరత్వము(immortality), దాని రహస్యాల గురించి తన ఊహలను, భువిపై వ్యక్తులు పడే అంతర్గత సంఘర్షణను దోస్తాయివ్స్కీ క్లుప్తంగా ఇలా చెబుతాడు. “మనిషి తన ప్రకృతికి వ్యతిరేకమయిన ఆదర్శ సాధనదిశగా కృషిచేస్తాడు. మానవులు ఆ ఆదర్శం కోసం కృషి చేయకపోయినట్లయితే -అంటే, తమ ప్రేమను ప్రజలకోసం లేదా ఇతరుల కోసం త్యాగం చేయకపోయినట్లయితే, వారు భాధకు లోనవుతారు. పాపమనే స్థితి ఇది. కాబట్టి మనిషి తప్పని సరిగా ఎడతెగని బాధలను అనుభవించితీరాలి. ఈ బాధలు దేవుని నియమాన్ని పరిపూర్ణం చేయడంవల్ల కలిగే పరలోకపు ఆనందంతో పరిహరింపబడుతాయి. త్యాగము వల్లనే అది సాధ్యపడుతుంది”.

ఈ మాటలతో “ది ఈడియట్” నవలకు దగ్గరి సంబంధం ఉంది. జీవితం గురించి తనకున్న అభిప్రాయాలతో, వాటిని మనిషి యొక్క స్వీయనైతిక- సాంఘిక సంఘర్షణలను పరిష్కరించే శక్తిని కలిగినవాటిగా చూపేందుకోసమే క్రీస్తుతో సారూప్యత కలిగిన మానవుడిని గానీ లేదా స్వయంగా క్రీస్తును గానీ రచయిత ఈ నవలలో చిత్రించలేదు. క్రీస్తు నియమం ప్రాథమికంగానే మనిషి వ్యక్తిత్వాన్ని వ్యతిరేకిస్తుంది. అందువలన ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించేవారికి దాని ప్రభావము అంతర్గత సంఘర్షణలోనే వెల్లడి అవుతుంది. మిష్కిన్ పైనా, అతనితో సంబంధాలలో ఉన్నవారిపైనా ఉన్నది సరిగ్గా ఇటువంటి ప్రభావమే. మిష్కిన్ తన చుట్టూ ఉన్న వ్యక్తుల అంతఃకరణలను (conscience) ప్రేరేపిస్తాడు. తద్వారా వారివారి సాధారణ స్వీయాలతో(usual selves) వారు ఘర్షణ పడేలా చేస్తాడు.

ఈ నవలలో మిష్కిన్, మిగిలిన పాత్రల మాదిరిగా ఇగోయిజం, క్రైస్తవ ప్రేమ నియమం(christian law of love) అనే రెండు ద్వంద్వాల మధ్యన పడి నలిగిపోనప్పటికీ మిగిలిన అన్ని పాత్రల మాదిరిగానే, దాదాపుగా అదే రకమయిన ఘర్షణను మరింత ఉన్నత స్థాయిలో అనుభవించడానికి కారణం ఏమిటన్న దానిని అర్థం చేసుకొనేందుకు దోస్తాయివ్స్కీ నోట్ బుక్ లో రాసుకున్న విషయాలు సహాయపడతాయి. మిష్కిన్ స్థితికి కారణము- మానవప్రేమ, లైంగిక ప్రేమ, కుటుంబానికి మూలాధారమయినది- దోస్తాయివ్స్కీ దృష్టిలో ఇది తనంత తాను ఇగోయిస్టిక్. అగ్లాయా పట్ల మిష్కిన్ ప్రేమ ఇలాంటిదే. నేలపై జీవము కొనసాగడానికి అది ముఖ్యమయినదే, కానీ అది ఇంకా ఇగోయిస్టిక్ గానే ఉన్నది. ఈ విధమయిన ప్రేమతో నస్టాష్యా పట్ల ఉన్న ప్రేమ ఘర్షణ పడుతుంది. నస్టాష్య పట్ల ఉన్న ప్రేమ సానుభూతి, దయలతో కూడినది. అది అచ్చంగా మేరీ పట్ల చూపినటువంటిది. కాబట్టి, మిష్కిన్ బాధను  ఆధునిక థియాలజీలో భేదాత్మకంగా చెప్పినట్టుగా, రెండు రకాలైన ప్రేమల మధ్య జరిగే ఘర్షణగా వివరించవచ్చు. అవి: ఎరోస్ (eros-లైంగిక ప్రేమ), అగాపే (agape- క్రైస్తవ ప్రేమ)లు.

“అగాపే అండ్ ఎరోస్” (agape and eros) అనే పేరుతో ఆందెర్స్ నైగ్రెన్(Anders Nygren) అనే రచయిత గొప్ప థియాలజీ పుస్తకాన్ని రాసాడు. గ్రీకు భావనలపై ఆధారపడి నడిచే ప్రాచీన సంప్రదాయ ప్రపంచంపై, క్రైస్తవ నైతిక భావనల ప్రభావాన్ని అధ్యయనం చేసి రాసిన పుస్తకమిది. ప్రేమ అనే గ్రీకు భావనను ప్లాటో నిర్వచించాడు. అది సౌందర్యప్రేమతో మొదలవుతుంది.  అక్కడ నుండి అది ప్రేమించిన వస్తువును సొంతం చేసుకోవాలనే కాంక్షకు దారి తీస్తుంది. వాస్తవానికి అది ఆ స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ ఉన్నతాత్ములలో (finer spirits) అది మరింత ఉత్తమమయిన మంచిని (highest good) సొంతం చేసుకునేందుకు ప్రేరేపిస్తుంది.  ప్లాటో ప్రకారం ఈ “మరింత ఉత్తమమయి”న అనే చింతన “భావన”గా (the idea) ఉంటుంది (ప్లాటో ఉపయోగించిన “భావన” అనే ఈ పదం ఏకోశ్వరోపాసనా మతాలలోని దేవుడు అనే దానికి సమానం). అప్పుడది ఇంద్రియసంబంధమయిన, ఇహానుభవాలతో కూడిన ప్రపంచం నుండి మరలి పరమమనే (absolute) మార్మిక చింతనలోనికి దారితీస్తుంది.

ప్రేమ అనే ఈ గ్రీకు భావన అంతిమంగా ఇగోయిస్టిక్ గానూ స్వార్థపూరితంగానూ ఉంటుంది. సొంతం చేసుకోవాలనే కాంక్షతో మొదలై లక్ష్యోన్ముఖంగా సాగుతుంది. భౌతికంగా సొంతం చేసుకోవాలనే చింతననుండి మరలిపోయినప్పటికీ, దాని సాధనలో భాగంగా, మరింత మెరుగయి చివరకు ఆధ్యాత్మికమవుతుంది. అప్పుడు కూడా అది ప్రేమించబడిన దానికి ఉండే వెల, విలువ (worth and value) అనే భావనతోనే ముడిపడి ఉంటుంది. అంటే ప్రియమైన వస్తు విలువల వ్యవహారమే ప్రేమ అనే అర్థం వస్తుంది. ప్రేమ గురించి దీనికి పూర్తి వ్యతిరేకమయిన భావనను ప్రపంచానికి క్రైస్తవం పరిచయం చేసిందని నైగ్రెన్ అంటాడు. ఆయన ప్రకారం ఊర్ధ్వ దిశలో ఉన్న “మరింత ఉత్తమమయిన”  లక్ష్యాన్ని పొందడానికి మనిషి ఇక ప్రయత్నం చేయనవసరం లేదు. ఆ ఉత్తమమయిన విలువను క్రీస్తు అనే బహుమతిగా మనిషికి అందించడానికి భగవానుడే ఆ రూపంలో దిగివచ్చాడు. కానీ వాస్తవానికి మనిషి ఈ బహుమతిని పొందడానికి అర్హుడు కాదు. కాబట్టి విలువ, ప్రేమల మధ్య ఉన్న సంబంధం తారుమారయింది. ఎరోస్ (eros) ప్రేమ ఉన్నతమయిన విలువ దిశగా కాంక్షిస్తుంది. కానీ అగాపే (agape) ప్రేమ ఉన్నతము నుండి దిగువకు ప్రసరిస్తుంది. క్రైస్తవ భగవానుడు పాపులను ప్రేమిస్తాడు. అంటే  గ్రీకు సంప్రదాయ విలువల కొలమానం ఇక్కడ పూర్తిగా తారుమారయిందన్నమాట. ఆదిమ క్రైస్తవంలో ప్రేమించబడేవారు విలువైనవారుకాదు, వారు ఏ మాత్రమూ విలువలేని వారే అయి ఉంటారు. ఉన్నతమయిన ప్రేమ రూపము క్రీస్తు స్వీయ త్యాగంలో ముర్తీభవించి ఉంది. ఆయన మానవాళి అంతటికీ ఒక నమూనా. శాశ్వతమైన ఆకాంక్ష.

నైగ్రెన్ సాంస్కృతిక చరిత్రకారుడు, థియాలజియన్. సాహిత్యంతో ఆయనకు సంబంధం లేదు. మతవిశ్వాసాల రీత్యా లూథరియన్. రష్యన్ ఆర్థోడాక్స్ కాదు. కానీ ఆయన ఆలోచనలు దోస్తాయివ్స్కీను అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవలలో, ఒక సత్రంలో మర్మెలదోవ్ చేసిన ప్రసంగం దీనికి ఉదాహరణ. ఆ  ప్రసంగంలో మర్మెలదోవ్, దేవుడు అనర్హులనే (unworthy) ఇష్టపడతాడు. వారినే కాపాడుతాడు. ఎందుకంటే వారికి మాత్రమే పతనము(debasement) లోతులు తెలుసని అంటాడు. ఇది విరోదభాసకు (paradox) సంబంధించిన అధ్భుతమైన ప్రకటన. “ది ఈడియట్” నవలలో మిష్కిన్ సాధారణ మానవత్వాన్ని, భవిష్యత్తులో భార్య అయ్యే అవకాశమున్న అగ్లాయాపై మిష్కిన్ కు ఉన్న ప్రేమను(eros)- నస్తాష్యా ఫిలిపోవ్నా పై తను చూపిన సానుభూతి, సహాయపడాలనే కోరిక, అగాపే (agape) ప్రేమ జోక్యం చేసుకుంటుంది. అంతిమంగా అది అతనిలోని ఘర్షణగా మారి, ఎంతమాత్రమూ పరిష్కారము కాకపోవడాన్ని  దోస్తాయివ్స్కీ ఈ నవలలో  చిత్రిస్తాడు.

సంపూర్ణమయిన అగాపే (agape) ప్రేమ మనుషులకు సాధ్యమని దోస్తాయివ్స్కీ నిజంగానే నమ్మలేదు. అది క్రీస్తుకు మాత్రమే అందుబాటులో ఉండేది. మానవుల ప్రకృతి కారణంగా, వారిలో ఎప్పుడూ ఎరోస్ (eros) ప్రేమ అంశీభూతమై (component ) ఉంటుంది. కానీ ఈ కారణం వల్లనే క్రీస్తు రాక జరిగి, ఆయన మానవాళి కృషి చేయవలసిన అగాపే (agape) ప్రేమ అయినాడు.

(ది ఇడియట్ నవలపై జోసెఫ్ ఫ్రాంక్ చేసిన మొదటి ఉపన్యాసం )

జోసెఫ్ ఫ్రాంక్
నాగరాజు అవ్వారి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *