జీవితాల లోతు తెలిపే ముకుల

Spread the love

కుప్పిలి పద్మ గారు చాలా కాలం ముందు నుండి తెలిసినా కూడా నేరుగా చూసింది మాత్రం డిసెంబర్లో జరిగిన కథా ఉత్సవం వేడుకలోనే. అక్కడే పద్మ గారితో మొదటి సారి మాట కలిపాను. చెప్పాలంటే పద్మ గారే ముందు పలకరించారు. ఫేస్ బుక్లో మీరు పుస్తకాల గురించి రాస్తుంటారు చూస్తూ ఉంటాను అన్నారు. ఇలానే రాస్తూ ఉండండి అని దీవించారు కూడా. అప్పుడు బయటకి ఎక్కువ సంతోషం వ్యక్తపరచలేదు కాని మనసులో మాత్రం చాలా ఉల్లాసం కలిగింది. కేవలం సాహిత్యంతో ప్రయాణం చేస్తుంటే పరిచయం అయిన వారే వీరంతా కూడాను. ఎంత పెద్ద వారు సాహిత్యంలో, ఎన్ని జీవితాలు చూసి ఉంటారు, ఎన్ని ఒడిదుడుకులు దాటి ఉంటారు, అయినా కూడా పక్క మనిషిని చూస్తే అదే చిరునవ్వు, అదే పలకరింపు. వీరిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. నిజంగా పద్మ గారు మీరు మాట్లాడాక చాలా శక్తి లోన వచ్చి చేరింది.

ఇకపోతే మా ఊరి పుస్తక విక్రయ కేంద్రంలో కుప్పిలి పద్మ గారి పుస్తకాలు అందుబాటులో ఉన్నా కూడా నాకు పెద్దగా అవగాహన లేకపోవడం వలన ఆ పుస్తకాలు కొనలేదు, అవి చదవనందుకు నా మీద నాకే ఒక భావన ఏర్పడింది. ఎలా నేను ఈ కథల పుస్తకాలు చదవకుండా వెనుకపడ్డాను అని. ఇప్పుడొస్తున్న రచయితలు చాలా మంది కొన్ని విషయాలు తేల్చి పారేస్తున్నారు. చెప్పాల్సిన విషయం చెప్పాల్సిన విధంగా చెప్పడం లేదేమో అనిపిస్తుంది. కేవలం వారు చెప్పడానికి ఎంచుకున్న పద్ధతి అది నాకు నేను సరిపెట్టుకున్నాను కాని, అది సరైన పద్ధతి కాదు నాకు ముందు నుండి కూడా అనిపిస్తూ ఉంది. అదే నిన్న చదివిన ఒక పుస్తకంలో నిరూపితమైంది. “ఉన్న మంచినే చెబుతాం, ఉన్నా చెడు చెప్పం” అన్న మాటలు విని ఆశ్చర్యపోయాను. చెప్పాల్సిన విషయం సున్నితంగా చెబితే ప్రతీ ఒక్కరూ వింటారని హామీ లేదు. అయినా కూడా చెప్పాల్సిన విషయం అనేది సున్నితంగానే చెప్పాలి, కొన్ని సున్నితమైన విషయాలు ఎవ్వరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా చెప్పడం కత్తి మీద సాము లాంటిది. చెప్పడంలో కాస్త తొణికినా బెనికే వరకూ వెళుతుంది. అలాంటిది చెప్పాల్సిన విషయాలను ఇంత సున్నితంగా చదవడం ఇదే మొదటి సారి. అదేంటో ఇప్పుడు చూద్దాం.

ముకుల సింహాచలం నాయుడు, ప్రసన్న గార్లకు ఏకైక పుత్రిక. పదో తరగతి వరకు ఉన్న ఊరిలో, ఇంటర్ రెండు సంవత్సరాలు పక్క ఊరిలో చదివి, ఇంజనీరింగ్ మాత్రం ఢిల్లీలో సీట్ తెచ్చుకుని అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది. ఉన్నట్టుండి ఒకరోజు ఏడుస్తూ సింహాచలానికి ఫోన్ చేసి నేను ఉండను ఇంటికి వచ్చేస్తాను అని చెబుతుంది. వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళలో అంత దూరం వెళ్ళి చదువుకుంటుంది తన కూతురు ఒక్కటే అని మురిసిపోతున్న సింహాచలానికి ఏమి అర్థం కాదు. అస్సలు ముకుల ఎందుకు అలా ఏడ్చింది? దాని వెనుక కారణాలు ఏంటి? అక్కడ జరిగే ప్రతీ విషయం పూస గుచ్చినట్టు చెప్పే ముకుల ఉన్నట్టుండి ఇలా మారడానికి కారణం ఏంటి? ఇంతకీ ముకుల అక్కడే ఉంటుందా? లేక మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందా? అనేది మిగిలిన కథ. ఈ కథలో అనేక రకాల భయాలు ఉన్నాయి. భయాలను ఎదిరించే గొంతులూ ఉన్నాయి. బ్రతకడానికి భయపడితే ఎక్కడ ఉన్నా భయపడుతూనే బ్రతుకుతామనే సవాలు ఉంది. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

తేయాకు తోటల్లో పని చేసే కార్మికులు అక్కడే కొండలలో నివాసం ఉంటారు. వలస వచ్చిన వారు తేయాకు తెంపడం అయ్యాక వారి గ్రామాలకు వారు వెళతారు. అలా కొండలో నివాసం ఉంటున్నారు కమ్లిని కుటుంబం. తేయాకు కోయడానికి పక్క ఊరి నుండి వచ్చిన గోవింద్ ముండా నచ్చి కమ్లినికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అలా ఉన్న ఊరిని వదిలిపెట్టి పక్క ఊరికి వెళుతుంది. అలా వెళ్ళాక గోవింద్ వాళ్ళు పని చేస్తున్న తీరుని చూసి వీళ్ళు పూర్తి స్థాయిలో తేయాకు మాత్రమే కాదు, చేతికి దొరికిన పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని అర్థం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా గోవింద్కి, కమ్లినికి ఒక పాప పుడుతుంది. పాప పుట్టాక ఎక్కువ డబ్బు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాలని గోవింద్ ఆంధ్రాకి వలస వెళతాడు. వెళ్ళిన కొద్ది కాలంలోనే కరోనా మహమ్మారి వచ్చి పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? గోవింద్కి పని దొరికిందా? మళ్ళీ తిరిగి ఊరు చేరాడా? లేదా? కమ్లిని, గోవింద్ మళ్ళీ కలిశారా? అనేది మిగిలిన కథ. ఈ కథలో జీవితాలు నిజం. కదిలిన కాలం నిజం. ఎదుర్కొన్న పరిస్థితులు నిజం. ఇన్ని నిజాలను కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా వలస జీవితాలు ఎలా చిన్నాభిన్నం అయ్యాయి? ఎందుకు అవుతున్నాయి? అన్న దానికి ఉదాహరణలు ఉన్నాయి. వలస వెళ్ళడం అంటే మన ఉనికిని, అస్థిత్వాన్ని వదిలి వెళ్ళడమే. ఇందులో ఇంకో పాత్ర మనల్ని ఆలోచనల్లో పడేలా చేస్తుంది. ఆ పాత్ర పేరు నీలాక్షి. ఇంతకీ నీలాక్షి ఎవరు? నీలాక్షికి, కమ్లినికి ఏంటి సంబంధం? అవేంటో మీరే చదివి తెలుసుకోండి.

మైనా, మైత్రి, రేవంత్ యూ.ఎస్ నుండి తిరిగి ఇండియాకి వచ్చి ఉంటారు. వారు యూ ఎస్ నుండి వచ్చే లోపే ఇల్లు అది అన్నీ చక్కబెట్టుకుని ఎవరికి ఏ పనులు కావాలి, వాటికి ఎలాంటి వ్యక్తులు కావాలి అని అన్నీ ఏజెన్సీతో మాట్లాడుకుంటూ ముందే ఒక ప్రణాళికతో వచ్చి ఉంటారు. అలా మైత్రిని, స్ట్రాబెర్రిని చూసుకోవడానికి మంగను నియమించుకుంటారు. మంగ, రమేష్ భార్యాభర్తలు వారికి రేఖ అనే పాప కూడా ఉంటుంది. ఎదగాలి అనే కారణంతో సొంతూరు వదిలి పట్నం వచ్చి బ్రతుకుతూ ఉంటారు. అలా రమేష్ సంపాదనకు తోడుగా ఉంటుందని మంగ కూడా ఉద్యోగంలో చేరుతుంది. అలా ఇద్దరూ వెళ్ళేసరికి పాపని చూసుకోవడం కష్టం అవ్వడంతో అస్సలు ఆ తర్వాత మంగ ఏం చేసింది? ఎటువంటి కష్టాలను ఎదురుకుంది? పాప ఎన్ని కష్టాలు పడింది? అవన్నీ మాసిపోవడానికి మంగ ఏం చేసింది అనే గొప్ప కథే ఈ మెట్రోకావల. ఈ కథ ఇప్పుడు చదువుకునే పిల్లలతో చదివించడం చాలా అవసరం. ఈ కథ ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలలో ఒకటిగా నిలవాలి. లైంగిక ప్రవర్తనలు ఎన్ని విధాలుగా ఉంటాయో తెలియాలంటే మీరు కూడా ఈ కథ చదివి తెలుసుకోవలసిందే. 

శేకరం, తులశమ్మ వలస వచ్చి అయ్యర్ల వీధిలో నివాసం ఉంటూ ఉంటారు. అప్పటికే వారికి పావని అనే పాప కూడా ఉంటుంది. అక్కడే హోటల్లో పని దొరికితే శేకరం చేరి పని సాగిస్తూ ఉంటారు. తులశమ్మ పక్క ఇంటిలో వాళ్ళు అగరుబత్తులు చూడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. అలా తులశమ్మ కూడా ఆగరుబత్తులు చుట్టడం నేర్చుకుని, తన కూతురు పావని ఇద్దరూ కూడా చూడుతూ చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటారు. ఇదిలా ఉండగా పావనికి చెల్లెళ్ళు పుడతారు వారే కృష్ణవేణి, పరిమళ. అలా సాగుతున్న జీవితంలో అవాంతరం వచ్చినట్టు శేకరం మంచాన పడతాడు. కేవలం ఆగరుబత్తుల మీద బ్రతుకుతూ కృష్ణవేణి, పరిమళ చదువు కొనసాగిస్తారు. ఆ తర్వాత పావని పెళ్లీడుకు వచ్చి, పావనిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించాక తులశమ్మకి కృష్ణవేణి తోడుగా నిలిచి ఆగరుబత్తులు చూడుతుంది. కేవలం ఇంట్లో మాత్రమే పరిమళం ఉంటుందే కాని జీవితాలలో కాదు, తినే ముద్దలో కాదు. అలా ఉండగా పావనికి పాప పుడుతుంది. పాప పుడుతుందే కాని పావని మరణిస్తుంది. పావని మరణించడంతో పాపని తులశమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు పావని భర్త. అలా ఉండగా వచ్చిన కరోనా మహమ్మారి వల్ల తులశమ్మ వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పడ్డారు అనేదే మిగిలిన కథ. ఈ కథలో పరిమళంతో నిండిన బ్రతుకులు కేవలం ఆ పరిమళంతోనే ముగిసాయా లేక ఎలా మారాయి అనేదే పరిమళ కథ.

యెక్స్ అనేది ఆమె స్నేహితురాలి పేరు. ఆమె పేరు ఎక్కడా చెప్పొద్దు అన్న కారణంగా యెక్స్ గా మనకు పరిచయం అవుతుంది. యెక్స్ ఉండే ఊరు మణిపూర్. మణిపూర్లో ఉండే సమాజ రాజకీయాలతో కథ మొదలవుతుంది. యెక్స్ కి చెల్లెలు ఉంటుంది. ఆ చెల్లి పెళ్లి చేసుకుని నాలుగేళ్ల కుమారుడితో, ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు రేగిన అల్లర్లలో భర్త నుండి వేరు పడుతుంది. అలా వేరు పడిన తాను, వేరు కాబడ్డ వాళ్ళ అక్క, తన స్నేహితురాలికి వారి పరిస్థితి వివరిస్తూ రాసిన ఉత్తరమే ఈ కథ. ఈ కథ చదువుతున్నప్పుడు తెలియని బరువు ఒక్కటి గుండెల మీద బలంగా కూర్చుంటుంది. దారం తెగిన గాలిపటంలాగా మారిన జీవితాలు ఎన్నో కళ్ళ ముందు కదలాడతాయి. అవేంటో మీరే చదివి తెలుసుకోండి.

వర్ణం అంటే రంగు. ఈ సువర్ణ లోకంలో అందంగా లేకపోతే ఎన్ని కోల్పోవాలో అన్నీ కోల్పోతూ వచ్చే వారికి వర్ణం చాలా అవసరం. అలా అందంగా తయారవ్వాలంటే మగాళ్లు జుట్టు కత్తిరించుకోవాలి, గెడ్డం గీసుకోవాలి, ఇంక ఆడవారికైతే చెప్పాల్సిన పని లేదు బోలెడు ఉంటాయ్. అలా సంజన, సంజన తమ్ముడు సిలిగురి నుండి వచ్చి హైదరాబాద్లో సంజన బ్యూటీ పార్లర్లోనూ, తమ్ముడు రెస్టారెంట్లోనూ పనికి కుదురుకుని, నెల నేలా వచ్చిన డబ్బుతో ఇంటిని చక్కదిద్దుకుంటారు. ఆ తర్వాత సంజన పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చాక కూడా హాయిగా పని చేసుకుంటూ కాలం గడుపుతున్న సమయంలో వచ్చింది కరోనా మహమ్మారి. అందరిలాగే ఈ వృత్తిలో దూరంగా ఉంటూ చేయడం కుదరని పని, అలా కరోనా విధించిన ఆంక్షలతో జనం రాక పార్లర్ ఇంక తెరవకపోవడంతో జీతం లేక ఇల్లు గడవడం చాలా కష్టంగా మారుతుంది. ఆ తర్వాత సంజన ఏమి చేసింది? అనేది మిగిలిన కథ. ఈ కథ చదువుతున్నప్పుడు అందానికి ఎంత ప్రాధాన్యత పెరిగింది కదా అనిపించింది. అందంగా లేకపోతే వారిని గుంపులో కలవనివ్వకుండా దూరంగా ఉంచిన రోజులు గుర్తుకు వచ్చాయి. అవసరం మనల్ని అవకాశం కోసం వెతుక్కునేలా చేస్తుంది. అవకాశం అడ్డదారులు తొక్కేలా చేస్తుంది. ఈ కథ చివర్లో తన మునివేళ్ళకు చెప్పిన ఒక పని ఒళ్ళంతా వికారంగా, కంపరంగా మారుతుంది, అదేంటో మీరే చదివి తెలుసుకోండి.

రాఘవరావు, ప్రభాకర్ ఇద్దరూ అన్నదమ్ములు. ప్రభాకర్ బాగా చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని పుష్యమిని పెళ్లి చేసుకుని పట్నంలో స్థిరపడిపోయాడు. రాఘవరావు మాత్రం వ్యవసాయం చేసుకుంటూ పెదవడ్లపూడిలోనే ఉండిపోయాడు. అలా సాగుతున్న వీరి జీవితంలోకి పథకాలు వచ్చి చేరాయి. ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి పథకాలు వర్తిస్తాయి అని ఉన్న స్థలాన్ని పార్టిషన్ డీడ్ చేసుకుందామని తమ్ముడిని సంతకాలు పెట్టి పంపించమని ముసలయ్యతో పేపర్లు పంపించాడు రాఘవరావు. ముసలయ్య వచ్చిన రెండు రోజులకే మొదటి వేవ్ కరోనా షరతులు రావడం, ఆ ముసలయ్యకు పట్నం పడకపోవడం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాత ప్రభాకర్ సంతకం పెట్టి ముసలయ్యని పంపాడా? పట్నంలో ముసలయ్య ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? అస్సలు ముసలయ్య మళ్ళీ వాళ్ళ ఊరు చేరాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ హృదయ విధారకమైన కథ చదవాల్సిందే.

ప్రకాష్, భార్గవిలకు ఇద్దరూ కూతుర్లు వారే స్వేచ్ఛాగీతిక, క్రాంతిలు. ప్రకాష్ తమ్ముడు సురేష్, మరదలు అరుణ కుమారి వారికి అల, గౌతమ్ లు సంతానం. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పెంపకం మీద దృష్టి సరిగ్గా సారించకపోతే పిల్లలు ఎలా తయారవుతారు అన్నది ఒకప్పుడు. ఇప్పుడు పిల్లల ఇష్టాలు పిల్లలవి, ఏం చదవాలి? ఏ బట్టలు వేసుకోవాలి? ఏమి తినాలి? ఎప్పుడు పడుకోవాలి? ఎప్పుడు లేవాలి? ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా మారుతున్న కాలంతో పాటు మారిన అలవాట్లు కానీ, స్వేచ్చాగీతిక మాత్రం దీనికి భిన్నం. ఏదైనా ఒక పని మొదలు పెట్టి ఆదిలోనే హంస పాదు అన్నట్టు మొదలుపెట్టిన ఒక్క పని మీద ఆసక్తి లేక అన్నీ సగంలోనే వదిలేస్తుంది. అలా వదిలేసిన తనకి ఒక కోర్స్ నిమిత్తం శశికిరణ్ పరిచయం అవుతాడు. అలా పరిచయం అయిన శశికిరణ్ వల్ల గీతికా ఎన్నో విషయాలు నేర్చుకుంటుంది. ఆ విషయాలు ఏంటి? మనకు కూడా ఏమైనా ఉపయోగపడతాయా లేదా? తెలుసుకోవాలంటే మాత్రం ఈ కథ చదవాల్సిందే.

కరుణ కుమార్, జీవనిలకు లీల, వినయ్ లు సంతానం. కరుణకుమార్, జీవని పిల్లలను చదివించి వారిని ఒక మంచి స్థాయికి తీసుకురావడానికి చాలా త్యాగాలే చేసి ఉంటారు. కానీ, ఇక్కడ స్వేచ్ఛ అబ్బాయిలకు ఉన్నంతగా అమ్మాయిలకు ఉండదని లీలకి అర్థం అవుతుంది. అలా అర్థం అయిన లీల బయట జరిగే అన్యాయాలను ఎదిరించే ప్రొటెస్ట్లలో, ర్యాలీలలో పాల్గొంటూ న్యాయం వైపు నిలబడాలని నిశ్చయించుకుంటుంది. అవన్నీ చూసిన వినయ్ వాళ్ళ నాన్నకు లీల గురించి చెబుతాడు. అప్పటి నుండి నిర్భందంలో ఉన్న లీల మళ్ళీ తాను అనుకున్నది చేసిందా? అసలైన ప్రపంచం అంటే ఏంటో తెలుసుకుందా? అనేదే మిగిలిన కథ. సమాజంలో బ్రతకాలంటే నీతిగా, న్యాయంగా ఉంటే కాదు, ఒకరి కింద ఊడిగం చేస్తూ వారి మోచేతి నీళ్ళు తాగడమే ఏ కష్టం లేకుండా సుఖంగా బ్రతకడానికి ఒక తోవ అనిపిస్తుంది వినయ్ జీవితం చూస్తే, ఈ కథ చదువుతున్నప్పుడు నిజంగా లీల మాటలు, జీవనితో సంభాషణలు ఎంతో గొప్పగా ఉన్నాయి. ఈ కథ చదివి మీరు కూడా అదేంటో తెలుసుకోండి.

ప్రొఫెసర్ అనురాగ్, టీచర్ అనిల వారి వారి ఉద్యోగాలలో ఉంటూనే సమాజాన్ని తీర్చిదిద్దే పనులు చేస్తూ ఉంటారు. స్కూల్లో చురుకుగా ఉంటూ పక్కవారికి సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటుంది కృతి. అలా అనిలకి కృతి ఇష్టమైన విద్యార్థిగా మారుతుంది. అలా అనిల, అనురాగ్ వారం వారం నిర్వహించే డిస్కషన్లో కృతి తప్పనిసరిగా ఉండేది. అలా వారిని అభిమానిస్తూనే వారిని అనుసరించి, పెద్దయ్యాక ఎమ్మెల్యేగా గెలుస్తుంది. అందరికీ ఒక రోల్ మోడల్ అవుతుంది అని అనిల, అనురాగ్ సంతోషంగా ఉంటారు. అప్పుడే ఒక ఘటన జరుగుతుంది. ఆ ఘటనపై కృతి ఏమి స్పందించదు. అస్సలు ఆ ఘటన ఏంటి? కృతి ఎందుకు స్పందించలేదు? రోల్ మోడల్ అవుతుంది అనుకున్న కృతి ఎందుకు స్పందించలేదో అనిల, అనురాగ్ లకు తెలుస్తుందా? తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

నీలిమ, విశాల్, ఆర్యన్ ఒక కుటుంబం. నీలిమకి సాకేత్ తమ్ముడు, మరదలు కాజోల్. నీలిమ, సాకేత్ల తల్లి రూపాదేవి. నీలిమ బయటకు వెళ్ళేప్పుడు అన్నీ సమకూర్చి వెళుతుంది. విశాల్కి, ఆర్యన్కి ఏమేం కావాలో అన్నీ చేసి మరీ వెళుతుంది. సాకేత్, కాజోల్లకి పెళ్ళై పట్టుమని మూడు నెలలు కూడా కాకముందే గొడవలు మొదలు అయ్యాయని ఫోన్ చేసి నీలిమకి చెబుతుంది రూపాదేవి. అస్సలు ఆ గొడవకి కారణం ఏంటి? నీలిమ విశాల్ బంధంలో లేని గొడవలు, కొత్తగా పెళ్ళయిన జంటలో ఎందుకొస్తున్నాయో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే. ఇలాంటి కథలు ప్రతీ ఒక్కరూ చదవాల్సిందే. కొత్తగా పెళ్లి అయ్యే ఈ తరం వారికి ఈ కథ చక్కగా వర్తిస్తుంది. బాధ్యత అంటే కేవలం అమ్మాయిలే తీసుకోవాలి అనుకునేవారికి ఈ కథ ఒక చక్కని ఉదాహరణ.

రైతు కుటుంబం వెంకట్ వాళ్ళది. తండ్రి వారిస్తున్నా కూడా తల్లి వరమ్మ తొడుతో మంచిగా చదువుకుని కెనడాలో సీటు సంపాదించి, అదే ఊరిలో పెద్ద కులంలో ఉన్న మాలకొండయ్య సహాయంతో అక్కడికెళ్ళి చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు వెంకట్. వెంకట్ అక్కడ ఉండగానే తండ్రి తుది శ్వాస విడుస్తాడు కాని కడచూపుకు కూడా నోచుకొడు వెంకట్. ఇలా ఉండగానే వెంకట్కి మాలకొండయ్య కూతురు స్వర్ణలతని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇక వెంకట్ అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడతాడు. వారికి హర్ష, ఆమోధలు పుడతారు. అలా పుట్టిన పిల్లలను చూసుకోవడానికి మాలకొండయ్య దంపతులు, వరమ్మ చెరో ఆరునెలలు చూసుకోవడానికి వస్తారు. వెంకట్ సంపాదించిన డబ్బుతో వరమ్మ ఒక నాలుగు ఎకరాలు పొలం కొని కౌలుకి ఇచ్చి ఉంటారు. ఆ కౌలుకి ఇచ్చిన డబ్బులు ఇప్పించుకుని, పొలం చూసుకుని వస్తాను అని చెప్పి ఇండియాకి వస్తుంది వరమ్మ. అదే సమయంలో కరోనా రావడంతో ఇక్కడే చిక్కుకుపోతుంది. అలా వచ్చిన వరమ్మ మళ్ళీ వెంకట్ దగ్గరకి వెళ్ళిందా లేదా? అనే ఈ కథ చదివి తెలుసుకోవలసిందే. తల్లిదండ్రులు వయసు మరలే కొద్ది వారికి పిల్లల సహాయం ఎంత అవసరమో ఈ కథ అద్దం పడుతుంది. ఈ కథ నేటి పాఠ్య పుస్తకాలలో చేర్చి పిల్లలకు తల్లిదండ్రుల విలువ తెలియజేయాలి.

ఇంకొక్క విషయం చివరగా ఏమిటంటే నాకు బాగా నచ్చింది ఈ కథల పేర్లు. కథల పేర్లు చాలా వరకు సాధారణంగా చిన్నగా ఉండేలా చూసుకుంటారు, ఇందులో మాత్రం ఎంతో హాయిగా అచ్చ తెలుగు పలుకుల లాగా, అందమైన బాణీల లాగా శ్రావ్యంగా, అమ్మ పిలిచే పిలుపులాగా ఉండటమే కాకుండా ఒక్కసారిగా కథలో ఏముందో అనే ఉత్సుకతను కలిగించాయి. ముందుగా కవర్ పేజీతోనే మనసుకు ప్రశాంతమైన రూపు తీసుకురావడం ఒక ఎత్తైతే, లోపలి బొమ్మలు ప్రతీ కథకు చాలా మంచి అర్థాన్ని చేరేలా చేశాయి. సున్నితమైన భావాలు కలిగిన వారికే కాకుండా అందరి వద్దకు ఈ “ముకుల” చేరాలి. ఈ కథలు చదవాలి, చదివి జీవితాల లోతు తెలుసుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ప్రతుల కోసం సంప్రదించండి:

అమెజాన్: https://amzn.in/d/bElLPDT

ఆరుద్ర ఈశ్వర్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *