జపాన్ పెన్ 

Spread the love

ఆరోజే శాస్త్రిగారికి ఫేర్‌వెల్ పార్టీ. క్రితం రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు కూడాను. అన్నీ శాస్త్రి మాస్టారు గురించిన ఆలోచనలే! మర్నాడు పొద్దునే లేచి స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకున్నాను. స్కూలుకెళ్ళటానికి తయారవుతున్నాను. నా బాక్సులోంచి ఫౌంటెన్ పెన్ తీస్తే నాన్నగారు గుర్తుకొచ్చారు. నాన్నగార్ని బతిమాలగా బతిమాలగా ఈ పెన్ తెచ్చిపెట్టారు మాస్టార్‌గార్కి కానుకగా ఇచ్చేందుకు. కాసేపు దానివంక చూస్తూ వుండిపోయాను. నలుపురంగులో అందంగా వుందది. చిన్నకాగితం తీసుకొని రాశాను – “పూజ్యులైన మాస్టారుగార్కి ఈ చిరుకానుక” దాని కింద నాపేరు, తేదీ రాశాను. పెద్ద ఉత్తరమే రాసి, నా మనోభావాలను వ్యక్తం చేసుకుందామని అయితేవుంది, కాని ఇలాంటప్పుడు ఇలా క్లుప్తంగానే రాయటం సబబు! కాబట్టి ఊరుకున్నాను. 

స్కూలుకెళ్తున్నప్పుడు దారిపొడుగునా మాస్టారుగారి ఆలోచనలే మెదులుతున్నాయి. క్లాసులో నోట్సు రాసుకెళ్ళకపోతే బెత్తంతో కొట్టేవారు. సంధులు కరెక్ట్‌గా చెప్పకపోతే గోడకుర్చీ వేయించేవారు. ఇన్నిచేసినా మాకు ఆయనంటే ప్రేమ, గౌరవమూనూ! ఆయన పైజామా ఎప్పుడూ మాసిపోయివుండేది. అప్పుడప్పుడు దానికి చిరుగులు కూడా వుండేవి. మా హృదయాలలో ఈ మాస్టారుగారికున్న స్థానం మరొకరికి లేదసలు. ఆయన ఎప్పుడైనా క్లాసుకొస్తూ దారిలో ‘శంభూగాడి దుకాణం’ దగ్గర పాలుతాగి వచ్చినట్లయితే, దాని తాలూకు గుర్తుగా ఆయన మీసాలు తెల్లగా వుండేవి. అది చూసి మాలో మేము నవ్వుకునేవాళ్ళం. ఏదియేమయినా ఎవరయినా మా ఎదుట మాస్టారుగారి మీద జోకులు వేసినా, హేళన చేసినా మేము ఊరుకునేవాళ్ళం కాదు. మాకు ఒళ్ళు మండిపోయేది. వాళ్ళతో పోట్లాటకి దిగేవాళ్ళం. 

ఐదునుంచి తొమ్మిదోతరగతి వరకూ నేను ఈ మాస్టారుగారి దగ్గరే చదువుకున్నాను. చలికాలంలో నవంబరు, డిసెంబరు మాసాల్లో ఆయన క్లాసును మేడమీద చిరు ఎండలోనే తీసుకొనేవారు. అప్పుడప్పుడు మాకు రాసుకునే పనిచెప్పి, తాను కుర్చీలోనే ఓ కునుకుతీసేవారు. అది చూసి మేము ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళం. 

ఇవాళ నాకు క్లాసులో కూర్చోవటం అంటే బోర్‌ కొట్టి, దొంగలాగా బయటకొచ్చేశాను. ఒక కొండ ఎక్కి పెద్దరాయి మీద కూర్చున్నాను. సాయంకాలం నాలుగు గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నాను 

ఇంతలో కింద నా క్లాసుమేట్ అనూప్ వెళ్తుంటే చూసి, పైకి పిలిచాను రమ్మని. 

“హిస్టరీ క్లాసుకు ఎటెండ్ కాలేదా?” అడిగాడు అనూప్.

“నాకు వెళ్ళబుద్ధి కాలేదు క్లాసుకి. న్యాయంగా ఇవాళ సెలవు ఇవ్వాల్సింది. ఫేర్‌వెల్ కదా..” అన్నాను. 

“అవును కదూ..” గుర్తుతెచ్చుకుంటూ అన్నాడు అనూప్. 

నేను అనూప్‌ వైపు చూశాను. మాస్టారుగారి ఫేర్‌వెల్ తుచ్ఛమైనదిగా తోచిందా అంత తేలికగా మరచిపోయాడు! నాకు అనూప్ మీద పట్టరాని కోపం వచ్చింది. కోపాన్ని దిగమింగటానికి నా దృష్టి ఎదుటవున్న కొండమీద కేంద్రీకరించాను. కింద బెల్ మోగడం వినిపిస్తోంది. ఆరవ పిరియడ్ ముగిసింది. సెవెంత్ పీరియడ్ క్లాస్‌లేదు. ఇక్కడే కూర్చోవడం మంచిది అనుకున్నాను. అనూప్‌ని అనవసరంగా పిలిచాను. దానికంటే ఒంటరిగా కూర్చోవడమే బావుండేది!

అనూప్ ఏదో సినిమా పాట కూనిరాగం తీస్తున్నాడు.

నేను ఇక మౌనంగా వుండలేకపోయాను. 

“మాస్టారుగారు వచ్చేనెల, ఆల్మోడా దగ్గర తమ పల్లెకు వెళ్ళిపోతారంట, కొందరు కుర్రాళ్ళు అనుకుంటున్నారు” అన్నాను. 

“నీకు తెలుసా.. కొత్త మాస్టారుగారు పేంటు-షర్టు వేసుకుంటారట”

నేను ఉలిక్కిపడ్డాను. “ఏమిటీ నువ్వు కొత్త మాస్టారుగార్ని చూశావా?”

“మూడు నాలుగు రోజులక్రితం కొత్త మాష్టారుగారు హెడ్మాస్టర్‌గారి గదిలో ఉన్నారు. నాకు ఎటెండర్‌నించి తెలిసింది. నేను బయటనే నిలబడ్డాను. ఆయన బయటకు వచ్చినపుడు పరీక్షగా చూశాను. ఆయన ముసలాడు కాదు. తల వెంట్రుకలన్నీ నల్లగానే ఉన్నాయి” ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు అనూప్.

నాకుమాత్రం ఉత్సాహంగా లేదు. పైపెచ్చు చిరాగ్గా వుంది. 

“కాని పాత మాస్టారుగారి పద్ధతే వేరు! ఆయన తెల్లమీసం ఎండలో ఎలా మెరిసేదో..” అన్నాను కాసేపు తర్వాత. 

అనూప్ నవ్వి అన్నాడు… “అవును అవును… ఆయన పాలు తాగినపుడు అది ఇంకా తెల్లబడేదిలే”

నాకు పట్టరానంత కోపం వచ్చింది. అనూప్ బలానికి నేను భయపడ్డాను గానీ లేకుంటే ఆ చెంపా ఈ చెంపా వాయించేసుండేవాణ్ణి. వాడి స్థానంలో ఇంకో కుర్రాడెవరైనా వుంటే అడిగి వుండేవాణ్ణి “మాస్టారుగారు వెళ్ళిపోతున్నారంటే బాధగా లేదూ?” అని. అనూప్‌ని ఎలాగైనా దెబ్బతీయాలనిపించింది. వాడిని కించపరచాలనిపించింది. అసలే కోపంగా వుంది వాడిమీద.

“మాస్టారుగారికోసం కానుకేమైనా తెచ్చావా?” అడిగాను. 

“నా దగ్గర డబ్బులు లేవు. ఉన్నా తెచ్చివుండేవాణ్ణికాను” 

నేను బాక్సులోంచి ఫౌంటెన్‌పెన్ తీసి చూపిస్తూ అన్నాను. “ఇది విదేశీ పెన్ను. మాల్‌ రోడ్డు మీద రామా & కంపెనీ నుంచి మా నాన్నగారు కొని తెచ్చారు” 

ఆ నలుపు రంగు పెన్నును అనూప్ పరీక్షగా చూశాడు కాసేపు. నేననుకున్నాను మనసులోనే ‘వాడు దాన్ని మెచ్చుకుంటున్నాడు. కానీ కేవలం ఈర్ష్య మూలాన దాన్ని బయటపెట్టడం లేదని’ నాకు లోలోన నవ్వు వచ్చింది నా ఆలోచనకే.

అనూప్ ఠక్కున లేచి కూర్చున్నాడు, “అరె – ఈ పెన్ను జపాన్‌దిరా! చూడు.. దీనిమీద రాసుంది- మేడ్ ఇన్ జపాన్!” గట్టిగా నవ్వసాగాడు. 

నా గుండె ఒక్కక్షణం కొట్టుకోవడం మానేసింది. అనూప్ మాటల మీద వెంటనే విశ్వాసం కలగలేదు. చటుక్కున వాడి చేతిలోంచి పెన్ను లాక్కున్నాను. దానిమీద ‘మేడ్ ఇన్ జపాన్’ అని నిజంగానే రాసుంది! నాకు నాన్నగారిమీద కోపం వచ్చింది. నాన్నగారు జపాన్ పెన్ను ఎందుకు తెచ్చారు. తెచ్చారుపో… నాతో అబద్ధం ఎందుకు ఆడారు. నాకు ఏడుపొక్కటే తరువాయి. అనవసరంగా పెన్ను అనూప్‌కి చూపించానే అనిపించింది. ఎవరికీ తెలీకుండా ఫేర్‌వెల్ అప్పుడు మాస్టారుగారికి ఇచ్చేస్తే పోయేది. నా కళ్ళనిండా నీళ్ళు బుగ్గల మీద జారడానికి సిద్ధమయ్యాయి. ఆ రోజుల్లో జపాను నుంచి వచ్చిన వస్తువులను హీనంగా చూసేవారు. 

“జపాన్ పెన్ను అయితే మాత్రం? అయిదు రూపాయలకు తక్కువ వుండదు” అన్నాను. 

నా వైపు కౄరంగా చూస్తూ “నాతో లోఆర్ బజారుకు పద, ఇదే పెన్ను అయిదున్నర అణాలకిప్పిస్తాను. అబద్ధాలు ఆడితే స్కూలంతా చెప్పేస్తాను” 

అన్నంత పని చేస్తాడేమోనని భయం వేసింది.

“నువ్వు నన్ను సిన్మాకి తీసుకెళ్తానంటే ఇది ఎవరికీ చెప్పను”

నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఒప్పుకుంటున్నట్లు తలవూపాను. స్నేహంగా అనూప్ చేతులు పట్టుకున్నాను.

మాకు ఆఖరు పిరియడ్ పి.టి. గ్రౌండుకు వెళ్ళక తప్పదు. వెళ్ళి ఓ పక్కన బెంచిమీద కూర్చున్నాను. ఫుట్‌బాల్ ఆడే మూడ్‌లో లేను. ఆడేవాళ్ళను చూస్తూ కూర్చున్నాను. ఫౌంటెన్ పెన్ గురించి అనూప్ అందరికీ చెప్పేస్తాడన్న భయం తాత్కాలికంగా పోయింది. ఆడుకుంటోన్న కుర్రాళ్ళను చూస్తోంటే చిరాకు కలిగింది. కోపమూ వచ్చింది. ఈరోజు మాస్టారుగారి ఫేర్‌వెల్ పార్టీ వుంది. కాని స్కూలు కార్యక్రమంలో ఎలాంటి మార్పూ లేదు. ఎప్పటిలాగానే జరుగుతోంది. ఈ సందర్భంగా హెడ్మాస్టర్‌గారు కనీసం ఒకపూట సెలవైనా ఇవ్వాల్సింది. మాస్టారుగారు ముప్పై ఏళ్ళపాటు ఈ స్కూల్లో పనిచేశారు. ఎప్పుడైనా మాకు పాఠంమీద ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే మాకు ఏవో కథలు చెప్పేవారు మాస్టారుగారు. అప్పుడప్పుడు తన పాత జ్ఞాపకాలు కథలుగా చెప్పేవారు. తను కొత్తగా ఈ స్కూలుకి వచ్చినప్పుడు ముప్పయిమంది విద్యార్థులు మాత్రమే వుండేవారట. మాష్టారుగారు అతిగర్వంతో చెప్పుకొనేవారు ఈ స్కూల్లో అందరికంటే పాత మాష్టారు తనేనని.

సాయంత్రం నాలుగయింది. విద్యార్థులందరూ హాల్‌కేసి దారితీశారు. హాల్లోనే మరి పార్టీ జరిగేది. నేనూ, దేవవ్రత్ ముందువరుసలో వెళ్ళి కూర్చున్నాము. మా ముందువరుసల్లో మాష్టార్లందరూ కూర్చొనివున్నారు. 

దేవవ్రత్ మా క్లాసులో చాలా తెలివైన కుర్రాడు. సంస్కృతంలో ఎప్పుడూ తనే ఫస్ట్ వచ్చేవాడు. మాస్టారుగారికి, దేవవ్రత్ అంటే అభిమానం. దేవవ్రత్ వాళ్ళ నాన్నగారు ఏమంత వున్నవాళ్ళు కాదు. అతను ఒక ఆఫీసులో సాధారణ గుమాస్తా. దేవవ్రత్ చదువు అతికష్టం మీద సాగుతోంది. నాకూ, దేవవ్రత్‌కీ మధ్య క్లోజ్ ఫ్రెండ్‌షిప్ వుండటం మూలాన తన ఇంట్లో సంగతులన్నీ విపులంగా, నిస్సంకోచంగా చెప్పేవాడు.

“ఇదంతా మన హెడ్మాస్టరుగారు చేసిందే. ఆయన చెప్పడంవల్లనే మన మాష్టారుగారు మానేయాల్సివస్తోంది” మెల్లగా అన్నాడు దేవవ్రత్.

“మాస్టారుగారికి అంత వయస్సు మళ్ళలేదు. ఆయన చేస్తున్నట్లుగా పని ఇంకెవరూ చెయ్యడంలేదు” 

“కాని దేవవ్రత్! మాష్టారుగారి వయసు డెబ్భయి ఏళ్ళుకదూ?”

“అయితే?” ఎదురుప్రశ్న వేశాడు దేవవ్రత్.

“దుబే మాష్టారు వయసులో వున్నా, ఎంతో నీర్సంగా కనబడుతుంటారు. సరిగ్గా పాఠాలు చెప్పరు, తిన్నగా నిలబడునూ లేరు” 

విద్యార్థులందరూ గోల చేస్తున్నారు. 

“అయితే ఇక మాష్టారుగారు ఏం చేస్తారంటావ్? ఆయనకి ఇక ఎలా గడుస్తుంది?” అడిగాను. దేవవ్రత్ బదులివ్వలేదు.

మాష్టారుగారు వచ్చి కుర్చీలో ఆసీనులయ్యారు. పిల్లల్లో కాస్త గోల తగ్గింది. నేను ఒకసారి వెనుతిరిగి చూశాను. అనూప్ తన ఫ్రెండ్స్‌తో కూర్చుని వున్నాడు. 

అనూప్ నన్ను చూసి నవ్వుతున్నట్లనిపించింది. సిన్మాకు నేను తీసుకెళ్తానని చెప్పినా, వాడి నిజాయితీ మీద నాకు నమ్మకం లేదు. నేను తెచ్చిన పెన్ను జపాన్‌దని అందరికీ చెప్పేస్తాడని భయం వేస్తోంది.

నేను మాష్టారుగారివైపు తదేకంగా చూశాను. ఇవాళ ఆయన నల్లకోటు వేసుకున్నారు. ఆయన ముఖంలో ఏదో తేజస్సు వుంది. ఒక్కక్షణం ఓ ఆలోచన వచ్చింది– “ఈ ముఖం ఇక చూడటానికి లేదు” నా కళ్ళు కన్నీటితో నిండిపోయాయి, గొంతు కూడా రుద్ధంగా అయింది. 

హెడ్మాస్టర్ గారు ఇంగ్లీషులో అన్నారు “ఈరోజు మన స్కూలు చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. మన మాష్టారుగారు ఈ స్కూలు వున్నతిని తన కళ్ళారా చూశారు. ఈ స్కూలు వున్నతికి కారకులలో మన మాష్టారుగారు ఒకరిని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆయన ఇంకా కొన్నేళ్ళు ఈ స్కూల్లో పనిచేస్తే బావుంటుందనిపిస్తోంది. కాని ఆయన వయస్సు దానికి సాయపడటంలేదు. ఆయన ఎక్కడవున్నా ఈ స్కూలు ఉన్నతినే కోరుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను”

దేవవ్రత్ నా చెవుల్లో అన్నాడు “ఈరోజయినా హెడ్మాస్టరుగారు హిందీలో మాట్లాడాల్సింది. మాష్టారుగారికి ఇంగ్లీషేం అర్థమవుతుంది?”

నాకు దేవవ్రత్ చెప్పింది సబబేనపించింది.

హెడ్మాస్టర్ గారి తర్వాత ఇంకొందరు మాష్టర్లు స్పీచ్ ఇచ్చారు. పదవతరగతి విద్యార్థులు కొందరు మాట్లాడారు. తర్వాత హెడ్మాస్టరుగారు తన తరుఫున కానుకగా ఒక టీ కెటిల్ ఇచ్చారు. మాష్టార్లందరూ కలిసి ఒక శాలువ కప్పారు. తర్వాత నా పేరు పిలువబడ్డది. నా గుండె వేగంగా కొట్టుకోనారంభించింది. నేను తడబడుతూ లేచి వెళ్ళాను. తలవంచి వెళ్ళి మాష్టారుగారి చేతిలో పెన్ వుంచి వచ్చేశాను. ఆయన ముఖంలోనైనా చూడలేదు. ఏదో తప్పు చేసినవాడిలా ఫీలయ్యాను. నేనిచ్చిన కానుక చూసి అందరూ నవ్వుతున్నట్లు తోచింది. నేను మాష్టారుగార్ని మోసం చేస్తున్నాననిపించింది. ఎంత గర్వంగా ఈ పెన్నును కానుకగా ఇద్దామని పొద్దున ఊహించాను. ఎంత నిస్సారంగా కానుక ఇచ్చాను. అందరూ చప్పట్లు కొడుతున్నా నాకు వినిపించటం లేదు. మెదడు అంతా శూన్యం.

నేను తిరిగి వచ్చి నా స్థానంలో కూర్చున్నాను. దేవవ్రత్ స్నేహంగా నా భుజంమీద చేయి వేశాడు. పెన్ను కానుకగా ఇవ్వడంలో నేను మాష్టారుగారి మీద నాకున్న గౌరవాన్ని అభివ్యక్తం చేసుకుంటున్నానని అతడనుకుంటున్నాడు. పాపం అతనికేం తెలుసు– నేనిచ్చిన పెను జపాన్‌దని! 

మాష్టారుగారు లేచి చెప్పనారంభించారు. “హెడ్మాస్టర్‌గారు, ఇతర మాస్టర్లకు నా మీద వున్న అభిమానానికి నేను సదా కృతజ్ఞుడిని. నా జీవితంలో ఇలాంటి వ్యధాభరితమైన రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. బతికుండగానే నేను ఈ స్కూలు వీడాల్సివస్తుందనుకోలేదు. పిల్లలకి పాఠాలు చెబుతూనే నేను చివరి శ్వాస తీసుకుంటాననుకున్నాను. బహుశా ఆ పైవాడికి అది ఇష్టం లేదేమో! ఇవాళ అనిపిస్తోంది నేను నిజంగా ముసలివాణ్నయిపోయానేమోనని. లేకుంటే నేనెప్పుడూ నా వయసు లెక్కపెట్టుకోలేదు… ఇక నేను పాఠాలు చెప్పలేను కాబోలు..” ఆయన కంఠం గద్గదమైంది.

దేవవ్రత్ కళ్ళల్లోనూ నీరు! దాన్ని దాచాలని వ్యర్థప్రయత్నం చేస్తున్నాడు.

ఫేర్‌వెల్ పార్టీ అయ్యాక నేనూ, దేవవ్రత్ ఇంటిదారిపట్టాం. ఎవరూ మాట్లాడలేదు మాలో, దారి పొడుగునా.

మాష్టారుగారు ఇంకో నాలుగేళ్ళు పాఠాలు చెప్పగలిగి వుండేవారు. ఆయనకీ స్కూలు మానటం ఇష్టంలేదు. నువ్వు విన్నావుగా ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆ గొంతులో ఎంత కరుణ వున్నదో” మౌనం భంగపరుస్తూ అన్నాను.

ఇదంతా ఆ హెడ్మాస్టరు కుతంత్రం” దేవవ్రత్ కళ్ళలో అంత కోపం నేనెన్నడూ చూడలేదు.

కాసేపు తర్వాత దేవవ్రతే తిరిగి అన్నాడు “నా దగ్గరేగనుక డబ్బులు వుంటే నేనూ ఏదో ఒక కానుక ఇచ్చివుండేవాణ్ణి! నువ్వు ఫౌంటెంట్ పెన్ ఇచ్చావుగా, నువ్వాయనకు గుర్తుండిపోతావు!”

“నిన్నూ మాష్టారుగారు మరువలేరు. ఎందుకంటే క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ నువ్వే!” అన్నాను.

“దాందేముంది?! ప్రతి క్లాసులో ఎవరో ఒకడు ఫస్ట్ వస్తూనేవుంటారు. ఇలా ప్రతియేడూ ఎంతమందిని మాష్టారుగారు గుర్తుపెట్టుకోగలరు? నువ్వు ఇచ్చిన పెన్‌తో రాస్తున్నప్పుడల్లా నువ్వు ఆయనకు గుర్తుకొస్తావు”

నేను మాట్లాడలేదు. కాస్త గర్వం ఫీలయ్యాను. దారిపొడుగునా నేను ఆలోచిస్తున్నదేమిటంటే – అనూప్‌ని సిన్మాకు తీసుకెళ్ళడం ఎలా. 

అలా రోజులు గడుస్తున్నాయి. కొత్త మాష్టారికి మేమందరం అలవాటుపడ్డాం. చాలామంది పాత మాష్టారుకంటే కొత్త మాష్టారు నయం అని భావిస్తున్నారు. అప్పుడప్పుడు ఆయన క్లాసులు క్యాన్సిల్ చేయడంవలన మంచివాడని కూడా అనుకుంటున్నారు.

ఓరోజు దేవవ్రత్ అన్నాడు – “ఇవాళ పాత మాష్టారుగారు వూరు వెళ్తున్నారు. స్టేషనుకొస్తావా?!”

“ఇంకా నాలుగు పీరియడ్స్ వున్నాయే…?” నసిగాను.

“వెళ్లొద్దు క్లాసుకి”

“హెడ్మాస్టర్‌గారికి తెలిస్తే మా నాన్నగార్కి రిపోర్ట్ చేస్తారు” 

దేవవ్రత్‌కి నామీద కోపం వచ్చింది. “సరే… అయితే నేను ఒక్కడినే వెళ్తాను. నువ్వు మాష్టారుగార్ని పూర్తిగా మరిచిపోయావు”

“నేనూ వస్తున్నా… నేను మాష్టారుగార్ని మరిచిపోలేదు” అని అరిచాను, దేవవ్రత్‌ననుసరిస్తూ. ఇద్దరం స్టేషనుకెళ్ళాం.

మేం వెతుక్కుంటూ మాష్టారుగారి దగ్గరికెళ్ళాం.

మమ్మల్ని చూసి నవ్వారాయన. కాని ఆ నవ్వు సహజంగా లేదు.

“అరె… మీరిద్దరూ వచ్చారా! స్కూలుకెళ్ళలే?” అన్నారు. 

నేను లోపల చూశాను. పదకొండేళ్ళ కొడుకు ధన్నూ వున్నాడు తండ్రి పక్కనే. ముసుగు వేసుకుని ఆయన భార్య కూర్చునివుంది ధన్నూ పక్కన.

మాష్టారన్నారు, “స్కూలునుంచి ఎవరూ రారు కాబోలు. అయినా నేనిక మాష్టార్నికానుగా. ఇలా ఒక్కణ్నే నేను వెళ్ళిపోతానని కలలోనైనా అనుకోలేదు…”

ఆయన ముఖం ఉదాసీనంగా వుంది.

“సిమ్లాలో ముప్ఫయి ఏళ్ళు వున్నాను. వెళ్తున్నాను. చివరిసారిగా కలవడానికి ఎవరూ రాలేదు. ప్చ్..ప్రాప్తం!” అన్నారు.

నేను తప్పు చేసినవాడిలా ఫీలవసాగాను.

“మీరు ఆల్మోడాకు ఎప్పుడు చేరుకుంటారు?” దేవవ్రత్ అడిగాడు.

మాస్టరుగారు వినట్లు లేరు “నేను చదువు చెప్పిన కుర్రాళ్ళెవరూ సంస్కృతంలో ఫెయిలవలేదు. హెడ్మాస్టరేమో నేను ముసలివాణ్నయ్యానని అనుకుంటున్నాడు. నేనిక చదువు చెప్పలేనట!”

“లెమన్ తాగుతారా?” కాసేపాగి అడిగాను. మాస్టారుగారు వద్దన్నట్లు తలవూపారు. ధన్ను మాత్రం “నేను తాగుతాను… దాహంగా వుంది” అన్నాడు.

నేను లెమన్ తెచ్చాను.

మాస్టరుగారు నా తలనిమిరి అన్నారు, “బాగా కష్టపడి చదివి పైకి రావాలి! నువ్విచ్చిన పెన్ బాగా రాస్తోంది. జాగ్రత్తగా దాస్తాను!”

దేవవ్రత్ వైపు తిరిగి, “నీకు తప్పకుండా స్కాలర్‌షిప్ వస్తుంది. కాలేజీలో చేరు. నేనుంటే మీ నాన్నగారితో మాట్లాడేవాణ్ణి” అన్నారు. దేవవ్రత్ మంచినీళ్ళకు కాబోలు ఎటో వెళ్ళాడు. “మాస్టరుగారూ…. ఒకదానికి క్షమించాలి నన్ను” అన్నాను మెల్లిగా.

“ఏమిటి నాయనా… ఏం?”

“ఆరోజు నేనిచ్చిన ఫౌంటెన్‌పెన్…”

“దాచాను నాయనా… ఏం?”

“అది జపాన్ పెన్ను మాష్టారూ!” ఏడుస్తూ అన్నాను.

ఇంతలో మంచినీళ్ళు తేవడానికి వెళ్ళిన దేవవ్రత్ తిరిగి వచ్చాడు. ఏడుస్తున్న నన్ను వింతగా చూశాడు.

“మాష్టారుగారూ… వెళ్ళగానే వుత్తరం రాయండి” అన్నాడు.

బండి కదిలింది.

దేవవ్రత్ మాటలు ఆయన చెవులకు సోకనేలేదు.

మా కళ్ళముందు బండి అలా సాగిపోయింది.

నేను ఆ పెన్ను సంగతి చెప్పకుండా వుండాల్సిందనిపించింది. చెప్పకపోతే… ఎలా… తర్వాత తెలిస్తే…. మాష్టారుగారికి కోపం రాదూ….!

పరేశ్ దోశి
1964లో విజయవాడలో జన్మించారు. ఉద్యోగ పదవీ విరమణ చేసి  ప్రస్తుతం హైదరాబాద్ లో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. 'తేరే బినా జిందగీ', 'లగ్ జా గలె', 'లవ్ యు జిందగీ' (సినిమా పాటల పరామర్శ); 'పిచ్చి కుక్క' (కథలు); 'వరద గుడి'(అనువాద కథలు), 'వానతనం' (కవిత్వం), 'గుండెను తట్టిన సినిమాలు' (సినిమా వ్యాసాలు) ప్రచురించబడ్డాయి.
రామ్ కుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *