“తినండి శ్రీకాంత్. సంక్రాంతి పిండి వంటలు. మా వైఫ్ ది కూడా మీ జిల్లానే. మీకు నచ్చుతాయి” అన్నాడు రవీంద్ర డెస్క్ మీద టప్పర్ వేర్ బాక్స్ పెట్టి. బాక్స్ నిండా అరిసెలు. నేనూ ఆంధ్రా నుంచే వచ్చాను కానీ నాకీ పిండి వంటలూ అవీ అస్సలు నచ్చవు. అసలు ఇండియన్ ఫుడ్డే పెద్దగా ఎక్కదు మనకి. కానీ ఈ విషయం ఎవరికి చెప్పినా ఇప్పటి వరకూ అందరూ వింతగానే చూసారు. ఇప్పటి వరకూ దేశం బైట కాలు పెట్టకుండా ఇక్కడే బ్రతుకుతూ ఈ దేశపు వంటలే నచ్చవంటే విడ్డూరంగా చూడక ఏం చేస్తారులే అని నేనే చెప్పటం మానేసాను. ఇప్పుడు నా పర్సనల్ ప్రిఫెరెన్సుల గురించి ఉపన్యాసం ఇచ్చే ఆసక్తి ఏ మాత్రం లేక మొహమాటానికి ఒక అరిసె తీసుకున్నాను. నేను అరిసె కొరికి ఒక్కసారిగా నొస్టాల్జియాలోకి జారిపోతే నన్ను చెయ్యి పట్టుకొని పైకి లాగటానికి రెడీగా ఉన్నట్టు అతని ఫేస్ నిండా చిరాకు పెట్టే ఓ అతి ఉత్సుకత కనపడింది. “ఓరి బాబూ” అని మనసులోనే అనుకొని, స్మైల్ వెడల్పు తగ్గితే అది ప్లాస్టిక్ అని ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతో అలాగే కాస్త కొరికి, కళ్లెగరేసి కాఫీ బ్రాండ్లకి వచ్చే టీవీ కమర్షియల్ లో లేడీ లాగ ఓవర్ యాక్టింగ్ చేసి, “మ్మ్మ్” అన్నాను. సోషల్ కాంట్రాక్టు తీరిపోయింది. చైర్ తన సిస్టం వైపు తిప్పేసుకొని తన పనిలో తను పడిపోయాడు రవీంద్ర.
అరిసె ముక్క ఇంకా నా నోట్లోనే నానుతుంది. మెల్లగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి, పైన తేలిక పొర తెగిపోయి, నాలుక మీద రవ్వ కరుకు టెక్స్చర్ తగులుతూ తీపి మొత్తం నోరంతా పాకింది. ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ మెదడు దాకా చేరాక అది ఉలిక్కిపడి patterns వెతకడం మొదలుపెట్టింది. ఈ రుచి, ఈ వాసన ఇంతకు ముందు తగిలినప్పటి సమయాల్ని పొరల కింద నుంచి పైకి లాక్కొచ్చి విసిరేసింది. ఇప్పుడు గాల్లో మొత్తం ఏవో చిన్నప్పటి జ్ఞాపకాలు స్లో మోషన్ లో తేలుతూ, వాటి మధ్యలో నేను, నన్ను రుచి చూసేందుకు విశ్వం తన నాలుక తిప్పినట్టు, చుట్టూ బలంగా వీచే గాలులు నన్ను పొరలు వొలుస్తూ ఉంటే మెల్లగా disintegrate అవుతూ, ఆలోచనలు ఊడి పడిపోతూ తేలికైపోతున్నాను. చేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో అరిసెని ఇంకా అలాగే పట్టుకున్న స్పర్శ మాత్రం తెలుస్తూనే ఉంది.
“అదేం యూరిన్ శాంపిల్ కాదు. అరిసె. సరిగ్గా పట్టుకో. తిను, బావుంటది” విసుక్కుంది సుజి. తను సంక్రాంతికి ఊరెళ్ళి వస్తూ హాస్టల్ కి పోకుండా ముందు నా రూమ్ లో దిగింది, ఈ సంక్రాంతి స్వీట్లు నాకు ఇవ్వడానికి. ఆ పండగ పిండి వంటల బాక్స్ లు ఓపెన్ చేసేసరికి రూమ్ మొత్తం ఇప్పటిలానే అదే వాసన. ఆ బాక్స్ లు తీసేందుకు తను బైట పెట్టిన బట్టలు మళ్ళీ సూట్కేస్ లో సర్దుకుంటుంది. ఈలోపు ఓ చివర కొరికాను. అరిసెలు నచ్చవు. అందులోనూ ఇంత పొద్దున్న అంత తీపి తినాలి అనిపించదు. మిగిలింది పక్కనే ఉన్న బాక్స్ లోనే పెట్టేసాను.
“ఉండిపో ఇక్కడ. ఈవినింగ్ నేను దింపుతాలే హాస్టల్ లో” అన్నాను.
“ఊహూ. వెళ్తా. పడుకోవాలి. ఫుల్ టైర్డ్ ఉన్నా. వారం రోజులూ, మా ఇంట్లో టాపిక్ మొత్తం పెళ్లి పెళ్లి పెళ్లి” అంది డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని రెడీ అవుతూ. పర్పుల్ కలర్ చుడీదార్ వేసుకుంది. (అప్పుడప్పుడూ రెడ్ అని గుర్తొస్తుంది కానీ ఈ రోజు ఖచ్చితంగా పర్పులే అని రూఢి అయ్యింది. అరిసె ఎఫెక్ట్ అనుకుంటా). బస్ ప్రయాణపు అలసట ఒంటికి కాస్త అంటుకున్నట్టు తనలో కొంచెం మెరుపు తగ్గింది. నేనలాగే మంచం మీద పడుకొని తననే చూస్తూ ఉన్నా. శీతాకాలం ఉదయపు చలి కిటికీ ఖాళీల్లోంచి తెల్లగా ధారపడుతుంది. లేచి వెళ్లి కిటికీలు గట్టిగా బిగించి, కర్టెన్లు సరిచేస్తూ “ఓహ్… చేసుకుంటున్నావా మరి పెళ్లి?” అన్నాను సరదాగా.
“నిన్నా?”
“హ హ… నన్ను చేసుకుంటే ఛస్తావ్” మళ్ళీ వచ్చి మంచం మీద కూలబడ్డాను. మళ్ళీ ఎందుకో అరిసె ఇంకో చిన్న ముక్క తినాలి అనిపించి ఇంకోసారి తీసుకొని మెల్లగా అంచు కొరికి మళ్ళీ బాక్స్ లో పెట్టేసాను.
“జోక్ కాదు. సీరియస్ గా అడుగుతున్నాను”, తల నా వైపు తిప్పి చూసింది. నిన్న రాత్రంతా జీవితం, భవిష్యత్తు, ప్రేమ, దాని పర్యవసానాలు లాంటి విషయాలు మొత్తం మొహం మీద దొర్లినట్టు స్పష్టంగా కనపడుతుంది. తను సూటిగా చూస్తున్నప్పుడు బుల్షిట్ చెప్పడం కష్టం. సుజియేనా ఇలా అడుగుతుంది? ఇదెప్పటి నుంచి? అంతా అయోమయం.
“ఇప్పుడు నేను ఆఫీస్ కి వెళ్ళాలి. నైట్ వస్తావ్ కదా, మాట్లాడదాం” అప్పటికప్పుడు ఏం చెప్పాలో తెలీక ఏదో అనేశాను.
“రాను”
“ఏ?”
“ఎంత కాలం ఇలా? నా పెళ్లి అయ్యే వరకూనా?”
“హా”
“ఆఁహాఁ? నాకు అలా కరెక్ట్ అనిపించట్లేదు”, తను ఎప్పుడూ మాట్లాడేప్పుడు మాటల అంచులో పదునుగా తెలిసే కాన్ఫిడెన్స్ లేదు ఈ వాక్యంలో. ఓ చిన్నపిల్ల అమాయకత్వం ఉంది.
“అసలు రిలేషన్షిప్ స్టార్ట్ చేసే ముందే, నువ్వే అడిగావు కొంపతీసి నీకు పెళ్లి లాంటి ఆలోచనలు ఏం లేవు కదా అని. నేను అలాంటివేం లేవు అంటే హమ్మయ్య అన్నావ్. గుర్తుందా? ఇప్పుడేదో నేనే ఒప్పుకోట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నావ్” నవ్వుతూనే తనకు గుర్తు చేశాను.
“నిజమే. ఈ పెళ్ళీ అదీ పెద్ద పెంట, నేను కూడా చేసుకోవద్దు అనుకున్నాను. కానీ చేసుకోకుండా ఇలా నేను లైఫ్ లాంగ్ హాస్టల్ లో ఉండాలా? మా ఇంట్లో వాళ్ళు ఎంత కాలం ఊరుకుంటారు? నాకు నీతో బావుంది. నువ్వు బాగా చూసుకుంటావ్. అందుకే అడుగుతున్నా.” చాలా ఆలోచించే అడిగింది. డామిట్. ఇది నేనెందుకు ఊహించలేదు? ఊహించి ఉంటే ఏదో పదునైన జవాబు సిద్ధంగా ఉండి ఉండేది.
ఏమీ తోచనప్పుడు నిజం, నిజాయితీనే సులువు. “హ్మ్మ్… పెళ్లి అంటే కష్టమే మరి” సూటి బాణం వదిలేసాను. “అయినా చూద్దాం, ఇప్పటికిప్పుడు అల్టిమేటమ్ ఇస్తే ఎలా? ఒక సిక్స్ మంత్స్ టైం ఇవ్వు” అని లేచి తన దగ్గరికి వెళ్లి….
అప్పటికి అరిసె అయిపోయింది. రవీంద్ర సీరియస్ గా పని చేసుకుంటున్నాడు. ఆఫీస్ మొత్తం కీబోర్డ్ టకటకల మినహా నిశ్శబ్దం. నూనె అంటిన చేతులు కడుక్కునేందుకు వాష్ రూమ్ కి వెళ్ళాను. పదేళ్ల క్రితం జరిగిన సంభాషణ చాలా కాలం తర్వాత యథాతథంగా గుర్తొచ్చింది అనిపించింది కానీ, చివర్లో “అయినా కొన్నాళ్ళు ఆగు చూద్దాం” అన్న మాట నిజంగా అప్పుడు అన్నానా, అన్నట్టు తర్వాత నా మెమరీ నన్ను సర్దిపుచ్చిందా? ఈ ప్రశ్నతో ఇప్పుడే కాదు, గత కొన్నేళ్లుగా కుస్తీ పడుతూనే ఉన్నాను. నేను సబ్బు చేతులతో అద్దం ముందు అలాగే నిలబడటం నా వెనుక వెయిట్ చేస్తున్న వాడికి అర్థం కాకపోవడం అద్దంలో కనిపించి గబగబా చేతులు కడిగి బయటకొచ్చాను.
బ్రేకప్ తర్వాత కూడా సుజితో చాలా కాలం ఫ్రెండ్షిప్ నడిచింది. కానీ ఎప్పుడూ ఇక ఆ ప్రస్తావన పెద్దగా రాలేదు. తను ఒకసారి అడిగేసి ఊరుకుంది. మెల్లగా కలవటం మానేసింది కానీ ఫోన్లు నడిచాయి. ఎప్పుడన్నా కలుద్దాం అంటే, “వద్దు. నాకు మళ్ళీ ఫీలింగ్స్ ఒస్తాయ్” అనేది. దానికి నా దగ్గర కూడా సమాధానం లేక నేనూ ఎక్కువ కదిలించలేదు. తర్వాత ఫోన్లూ తగ్గిపోయాయి. సుజి నన్నొదిలేశాక ఇంకా చాలా మంది అమ్మాయిలు పరిచయం అయ్యారు, చాలా మంది ఇష్టపడ్డారు, చాలా మంది అటెన్షన్ తో ఉక్కిరి బిక్కిరి చేసారు. బిందు – గుండ్రటి మొహం, స్వాతి – ఫుల్ లిప్స్, రచన – ఈ పిల్లకి ఉన్నంత existential angst జెర్మన్ ఫిలోసఫర్లకు కూడా ఉండదు, దేవిక – ప్రపంచం చుట్టేయ్యాలి అని అలాగే సుడిగాలిలా వెళ్ళిపోయింది, పూర్ణ – టెక్నికల్ గా వన్ నైట్ స్టాండే కానీ గుర్తుండిపోయే పిల్ల, ప్రియ – అన్ని విధాలుగా బావుంటుంది కానీ మొదలైన రోజు నుంచే ఎలా వదిలించుకోవాలా అని పాట్లు పడ్డాను – ఎందుకో తెలీదు. తర్వాత కొన్నాళ్ళు ఎవరన్నా ఇష్టపడ్డా వాళ్ళ ఇష్టం అర్థం కానట్టే నటించి ఓ బ్రేక్ తీసుకున్నాను. ఈ మొత్తం ప్రవాహంలో సుజి అప్పుడప్పుడూ తళుక్కున నా whatsapp status చూసినట్టు కనపడి మెరిసేది. ఎప్పుడన్నా పబ్ వెలుగు జిలుగుల్లో, తలపైకి పాకుతున్న మత్తు ఓ రెండు ఇంచులు జారి బుర్రలో గతం గడ్డకట్టిన చోట తడిపితే తను చిలకలా అల్లరి చేస్తూ, పడుకున్న నా మీద కూర్చొని నా జుట్టుతో ఆడుతున్న విజువల్స్ భళ్ళుమని బద్దలయ్యి పెద్ద శబ్దం చేసేవి.
తను నా కోసం కొన్నాళ్ళు ఏడ్చిందని ప్రజ్ఞ చెప్పేటప్పటికే మేం విడిపోయీ మూడేళ్లు అయిపోయింది. “తనని కొన్నాళ్ళు ఆగమన్నాను. తనే నన్ను వెంటనే కట్ చేసింది” అంటే ప్రజ్ఞ కొంత ఆశ్చర్యపోయింది. అంటే ప్రజ్ఞకి వేరేలా చెప్పిందా సుజి? అబద్ధం చెప్పిందా? లేక నాకే సరిగ్గా గుర్తు లేదా? అన్నానా లేదా?
మెమరీ వండే పిండి వంటలు చాలానే ఉంటాయి. మనకు ఏదీ యథావిధిగా గుర్తుండదు. ఎలా జరిగిండచ్చు అని మనసు ఆశ పడుతుందో ఆ కథతో గతానికి రంగు పూస్తుంది. మనవైపు తప్పు లేదని మన గిల్ట్ ని జోకొట్టే క్రమంలో కథను తారుమారు చేస్తుంది మెదడు. ఎప్పుడన్నా వర్తమానం నుంచి పారిపోవటానికి ఓ దీవి అవసరపడుతుందని గతాన్ని ఓ రంగుల వనంగా ముస్తాబు చేసి పెడుతుంది నొస్టాల్జియా. ఇంత సైకలజికల్ పొల్యూషన్ మధ్య మనసు చీకట్లలో ఎక్కడో నిద్రపోతున్న అసలు నిజాన్ని, మెటీరియల్ వాస్తవాన్ని, తట్టి లేపడానికి ఓ ఫిజికల్ థింగ్ అవసరం. అదే ఈ అరిసె ముక్క, దాని రుచి, వాసన.
“టేస్ట్ కి, ఇంకా ప్రత్యేకించి స్మెల్ కి మెమోరీస్ ని చాలా ప్రిసైజ్ గా ఇన్వోక్ చేసే పవర్ ఉంటుంది. అప్పటి లాంటి అరిసే మళ్ళీ తింటే కలిసిపోయిన వైర్ల మధ్యలో అసలు వైరు కనెక్ట్ అయ్యి బల్బ్ వెలుగుద్ది. నాకిప్పుడు అదే స్వచ్ఛమైన కోనసీమ అరిసె కావాలి. అందుకే వెళ్తున్నా” అన్నాను గణేష్ తో.
“ఇప్పుడు అవన్నీ హైదరాబాద్ లోనే దొరుకుతున్నాయి. అమ్మమ్మ అరిసెలు, నానమ్మ జంతికలు అని ఏవేవో వచ్చేసాయి సిటీ మొత్తం”
“అవన్నీ ట్రై చేశా. ఇంట్లో చేసిన ఫ్లేవర్ లేదు. బ్రాండెడ్ అరిసెలతో పనవ్వదు”
“అచ్చ…. నువ్వు పండక్కి ఊరొస్తున్నావ్ అంటే బాబ్జి గాడు అసలు నమ్మడు. ఇంతకీ ఎక్కడ దిగుతున్నావ్? బాబ్జి గాడి ఇంట్లోనేనా? లేదా మీ చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో దిగుతావా?”
“ఎవర్నీ ఇబ్బంది పెట్టను. నాన్న పోయిన తర్వాత ఇంక మా వీధిలోకి వెళ్లిందే లేదు. నా స్థలం వాళ్ళకి అమ్మలేదని మా చిన్నమ్మ ఇంకా నా మీద ఇంకా కోపం గానే ఉంది. లాడ్జిలో దిగుతా. అరిసె తినడానికి మాత్రం బాబ్జి గాడి ఇంటికి వెళ్తా. వాళ్ళ అమ్మ అచ్చం మా అమ్మలానే చేసేది.”
“హ్మ్మ్… నేను అప్పట్లోనే చెప్పా…. సుజినే నీకు కరెక్ట్, పెళ్లి చేసుకోరా అని. అప్పుడేమో పోజ్ కొట్టి ఇప్పుడు అన్నీ తవ్వుకుంటున్నావ్”
“పెళ్ళా? పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా సుజినే చేసుకునేవాణ్ణి. అది లెక్కలోంచి తీసేయ్ లే కానీ, తను ప్రజ్ఞతో నేనే బ్రేక్ అప్ చేశా అని చెప్పిందంట. తనే కదా నన్ను కలవకూడదు అని డిసైడ్ అయ్యి కట్ చేసింది?”
“ప్రజ్ఞ అలా ఏం చెప్పలేదు మనకి. విడిపోయాక తను బాగా ఏడ్చేది అని చెప్పింది అంతే.”
“అదే.. దానర్థం బ్రేక్ అప్ అవ్వడానికి కారణం నేననే కదా ప్రజ్ఞ దృష్టిలో కూడా?”
“పెళ్లి చేసుకోను అని ఖరాఖండీగా నువ్వే కదా చెప్పావ్.”
“కానీ ఆగమని కూడా చెప్పాను.”
“నీతో పెళ్లి అని థింక్ చెయ్యడం అసలు ఉపయోగం ఉండేది కాదు అన్నావ్ కదా ఇందాకే.”
“తను ఆగి ఉంటే ఏమైయ్యుండేదో మనకి తెలీదు కదా రా. మే బీ నా థియరీలు అన్నీ వదిలేసి మ్యారేజ్ ట్రై చేసేవాణ్ణేమో.”
“తను ఆగకుండా వెళ్లిపోయిన తర్వాత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఉంటావ్. తన పెళ్ళైపోయాక ఇంక ఫైట్ చేసే అవసరం లేదు కాబట్టి, ఇలా what could have been అని ఊహించుకుంటూ ఉండడం సులువు కాబట్టి అదే చేసావ్ ఇన్నేళ్లు. అది మెల్లగా బాగా బరువైపోయింది కాబట్టి అప్పట్లో నువ్వు ఆగమన్నట్టు, ఆ పిల్ల ఆగనట్టు వెర్షన్ రాసుకున్నావ్”
“అయ్యిందా నీ సైకో ఎనాలిసిస్? రెడీగా ఉంటావ్. నా కంఫర్ట్ కోసం నన్ను నేను మోసం చేసుకునేట్టు ఐతే ఇప్పుడు నా fabrication తప్పని తేలే అవకాశం ఉన్న పని ఎందుకు చేయడానికి వెళ్తున్నాను?”
“అరిసె తింటే flashback గుర్తొచ్చేస్తది అనే తింగరి థియరీ నువ్వు కూడా ఏం నమ్మట్లేదు. నీ ఫేక్ మెమరీ మీద నీకే డౌట్ కాబట్టి, ఆ డౌట్ నిన్ను తిన్నంగా ఉండనివ్వదు కాబట్టి, దానికి ఒక అగ్ని పరీక్ష కావాలి. దానికి ఇలాంటి థియరీ ఒకటి తయారు చేసావ్. ఇదంతా గుర్తు చేసుకున్నట్టు ఓ నాటకం ఆడించుకుని నీకు convenientగా ఉండేది నిజం అని తెలుస్తావ్ చివరికి.”
“హ హ హ హ… నేను నువ్వనుకున్నంత వెధవనైనా బాగుండు. తను వెళ్లిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటో నీకు తెలీదు.”
“హ్మ్మ్… ఊరకే అన్నాలే. మన ఎనాలిసిస్సుల్లోకి సింపుల్ గా ఒదిగిపోయేంత సింపుల్ మెదళ్లుంటే బాగుండు కదా మనకి.”
“హ్మ్మ్”
“వచ్చేటప్పుడు అరిసెలు కొంచెం ఎక్కువ తీసుకురా.”
* * *
పది గంటలు ప్రయాణం. పండగ జనం మొత్తం రైల్వే స్టేషన్ లోనే ఉన్నారు. రైల్వే స్టేషన్ వాసన గతంలో ఊరికి చేసిన ప్రయాణలన్నిటినీ slice చేసి, దండ గుచ్చి, బుర్రలో రైలాట ఆడిస్తుంది. ఆ మాయో ఏంటో ఇంటికి వెళుతున్నాననే ఆనందం కాస్త గతం లోంచి ఇప్పట్లోకి లీక్ అయ్యింది, కారణం లేకుండానే (ఇప్పుడక్కడ నాకు ఇల్లే లేదు). ఎప్పుడూ తలుపులూ, కిటికీలూ వేసి ఉండే నా రూమ్ లో నేను తప్పించుకునే చలి, స్టేషన్ లో నన్ను పట్టుకుంది. అది పొరలు పొరలుగా లాగితే మళ్ళీ ఆ పాత ఆలోచనల పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతాను. ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకుండిపోవాలి.
బోగీలో ఎక్కడో ఒక ఫ్యామిలీ స్టీల్ బాక్సులో ఇడ్లీ, పంచదార తెచ్చుకున్నట్టున్నారు. వాళ్ళు అది ఓపెన్ చెయ్యగానే మా అమ్మ బ్రతికున్నప్పుడు మమ్మల్ని పెద్దమ్మ ఇంటికి తీసుకెళ్లేందుకు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కించిన రోజు గుర్తొచ్చింది. అమ్మ చేతి గాజు స్పర్శ, తన నెయిల్ పాలిష్, పసుపు రంగు టర్కీ టవల్, అప్పుడు ట్రైన్ కిటికీ లోంచి చూస్తే బలంగా వెనక్కి విసరబడుతున్నట్టు కనపడ్డ కొబ్బరి చెట్లు, పెద్దమ్మ ఇంటికెళ్లి ఓ మూడు నెలలు వేసవి సెలవులు స్కూల్ బాధల్లేకుండా ఆడుకోవచ్చు అన్న ఆనందం మొత్తం జీవితంలో ఏ బాదరబందీ లేనంత ఉప్పెన లాంటి ఆనందం, ఆ రోజు మా ఎదురుగా కూర్చున్న కళ్లద్దాల అంకుల్, రైల్వే ప్లాట్ఫారం మీద ‘యూస్ మీ’ కుందేళ్లు, కోకా కోలా హోర్డింగ్ లు, ఇవన్నీ ఇప్పుడే నా ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నాది సుత్తి థియరీ అంటాడా ఆ గణేష్ గాడు.
ఐదున్నరకే దిగిపోయాను. నన్ను లాడ్జి దగ్గర దింపేందుకు బాబ్జి గాడు వస్తా అన్నాడు కానీ, అంత పొద్దున్నే ఈ చలిలో వాణ్ణి లేపడం ఎందుకని కాసేపు అక్కడే కూర్చున్నాను. ఐదేళ్లు అవుతుంది నేనిక్కడికొచ్చీ. స్టేషన్ నా చిన్నప్పటి నుంచీ మరీ ఎక్కువేం మారలేదు. ఆ ఇనుము వాసన మాత్రం అలానే ఉంది. నిన్న రాత్రి వర్షం పడిందనుకుంటా, గచ్చు మొత్తం తడి. చుట్టూ చెట్లు నల్లగా, ఇంకా చివరి చినుకులు రాల్చుకుంటూ ఉన్నాయి. తడి బరువుతో గాలి కాస్త భారంగా వేస్తుంది. ఆణువణువూ చలి పాకి ఓ దట్టమైన మంచు పొరలో ఊరు మొత్తం చుట్టబడ్డట్టు ఓ ప్రపంచం స్తంభించిపోయిన ఫీలింగ్. నేను సంక్రాంతి రంగుల్ని, అరిసెల వాసనల్ని, ముగ్గుల్ని, కోడి పందాల్ని, గారెల్ని, కొబ్బరి చట్నీని ఉన్నట్టు ఊహించుకొని వచ్చిన ఊరు ఈ తెల్లవారు ఝామున ఓ మినీ రష్యన్ వింటర్ ని తగిలించుకుని కనపడింది. నాకు కావాల్సిన ఊరు వాటన్నిటితో స్టేషన్ అవతల ఉంది లే. కొంచెం మంచు కరిగాక స్టేషన్ దాటాలి. ఇక అక్కడే కూర్చొని అటూ ఇటూ చూస్తుంటే తగిలింది నాకు షాక్.
సుజి కనపడింది. వాళ్ళ హస్బెండ్ తో పాటు హడావుడిగా నడుచుకుంటూ, ప్లాట్ఫారం మీద ఆగి ఉన్న ట్రైన్ లో వాళ్ళ బోగీ వైపుకి చకచకా వెళ్ళిపోతుంది. రెడ్ కలర్ శారీ, ఆ నడకలో అదే చురుకు. అతను హైటు వెయిటు బాగానే ఉన్నాడు. ఇద్దరూ నవ్వుకుంటూ వేగంగా నడుస్తూ వెళ్లిపోతున్నారు. నేను లేచి వెళ్లి, కొంచెం దూరంలో వాళ్ళ వెనుకే నడుస్తున్నాను. ఏమన్నా రిస్క్ అవుతుందా? ఎలా అయినా సరే ఒక్క మాటైనా మాట్లాడాలి తనతో, అనిపించింది. తనకీ నాకూ ఏదో కాస్మిక్ కనెక్షన్ ఉంది. లేదంటే సరిగ్గా ఇప్పుడే ఇక్కడే ఎందుకు మళ్ళీ కనిపిస్తుంది? అసలు తను నాకు పరిచయం అవ్వడమే మిలియన్ టు వన్ షాట్. అన్ని కోయిన్సిడెన్సెస్ జరగడం, అంత బ్యూటిఫుల్ స్టోరీ, నా లైఫ్ లో ఇంకెప్పుడూ అలా అవ్వలేదు.
కానీ… ఇప్పుడు ఎలాగూ తనని పిలవలేను. నా గురించి అతనికి చెప్పిందో లేదో తెలీదు. పాపం తనకి ఇబ్బంది అవుతుంది, ఆగిపోవాలేమో నేను. లేదు. మాట్లాడను, పిలవను. కానీ ఇంకొంచెం సేపు వాళ్ళ వెనకాలే వెళ్తాను. ఐతే వీళ్ళు సుఖంగానే ఉన్నారన్న మాట. నాతో వస్తే ఇలా ఐతే ఉండేది కాదు తను. నాతో నాకే నికరం ఉండదు. చాలా మంచి పనే చేశాను. ప్రపంచం ఎంత కాంప్లెక్స్! ఒక మనిషికి వాడి జీవితానికి దారి దొరకడమే గగనం. ఇంకో మనిషిని పక్కన పెట్టుకుని, వాళ్ళ బాధ్యతలు కూడా తగిలించుకుని ఇలా ట్రైన్లు ఎక్కి ఎక్కడెక్కడికో వెళ్లే ఈ ధైర్యం ఎలా వస్తుంది ప్రపంచానికి? అతనికి ఈ ఆలోచనలేం ఉన్నట్టు లేవు. హ్యాపీగా తన పక్కన నడిచేస్తున్నాడు. ట్రైన్ లో అనౌన్స్మెంట్ వస్తుంది. ట్రైన్ ఏ ప్లాట్ఫారం మీదకొస్తుందో చెబుతుంది. దారి తెలీని వాళ్ళకి దారి చూపించుకోడానికి ప్రపంచం చాలా సపోర్ట్ సిస్టమ్స్ ని పెట్టుకుంది. స్టేషన్ లో అందరూ ఆ సిస్టం మీద భరోసా ఉన్నట్టు, ఏ టెన్షన్ లేకుండానే కనపడుతున్నారు. స్టాక్ ఎక్స్చేంజి, ప్రపంచ ప్రభుత్వాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, మొబైల్ యాప్స్ అన్నీ చుట్టూ అలా దొర్లుకుంటూ తిరుగుతున్నాయి. నిప్పు, చక్రం దగ్గర నుంచి తేలిగ్గా లొంగని రియాలిటీని తన బుర్ర ఉపయోగించి బలవంతంగా పని చేయించుకునే నేర్పు అలవాటు చేసుకున్నాడు మనిషి. సరే. రియాలిటీ ఎంత బండగా తన పెద్ద పెద్ద చక్రాలు వేసుకొని తొక్కేసుకుంటూ వెళ్ళిపోయినా, ధైర్యంగా నిలబడి బుర్ర ఉపయోగిస్తే చాలా వరకూ జీవితాన్ని ఈదచ్చు. వెళ్ళచ్చు. కానీ జీవితపు uncertainity? ఏదో ఒక రోజు “ఇది కాన్సర్ సర్. ఆమెను ఇక మీరే జాగ్రత్తగా చూసుకోవాలి” అని డాక్టర్ చెబితే అప్పటికప్పుడు జీవితపు డెఫినిషన్లు మళ్ళీ తిరగరాసుకోవాలి. దానికంటే ఇలా చప్పగా గడిచిపోవటమే మేలు. నేనైతే ఎప్పుడూ లాడ్జిలో కస్టమర్ లాగే ఉంటాను కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదు. ఇంకో మనిషికి ఏ మనిషి దగ్గరా చోటు ఉండదు. వాడెవడో సినిమా డైరెక్టర్ అన్నట్టు, స్పేస్ create చేసుకుంటారు. What a bunch of fools! ఇవేవీ పని చెయ్యవు రా సన్నాసుల్లారా! ఎప్పుడు ఏ సునామీ వచ్చి మీకు ఉన్నవన్నీ పట్టుకెళ్లిపోతుందో తెలీదు. అప్పుడు మీ మీదే ఆధారపడి మీ వైపు చూసే వాళ్లకు ఏం సమాధానం చెప్తార్రా అంకుల్ రావులూ? ఈ dilemma ని సాల్వ్ చెయ్యకుండా బ్రతకడంలో ఎలా బిజీ అయిపోతారు? మెల్లగా నడవాలని మర్చిపోయి వేగంగా నడుస్తూ వాళ్ళకి చాలా దగ్గరగా వెళ్ళిపోయాను. అప్పుడు తను తల తిప్పి వెనక్కి చూసింది. తను సుజి కాదు. దూరం నుంచి చూస్తే తనలా ఉందంతే. ఉన్నపళంగా ప్రపంచం సుళ్ళు తిరగటం ఆపేసింది. అయినా సుజి మా ఊరి రైల్వే స్టేషన్ లో ఎందుకుంటుంది. నాకు నిద్ర సరిపోలేదు.
మెల్లగా ఉదయం ఆరింటి వెలుగొచ్చింది. నేను చూడాలునుకున్న ఊరు మెల్లగా రంగుల బట్టలు వేసుకుంటుంది. దూరంగా ఓ భోగి మంట. స్టేషన్ బైటికెళ్లి ఆటోవాడితో బస్ స్టాండ్ కి డ్రాప్ మాట్లాడుకున్నాను. బస్ స్టాండ్ లో దిగి విజయవాడ బస్ టైం అడిగితే ఇంకో అరగంటలో ఉందని చెప్పాడు. విజయవాడలో దిగి హైదరాబాద్ బస్ ఎక్కితే రాత్రయ్యే సరికి రూమ్ లో ఉంటాను. బాబ్జి ఫోన్ చేస్తున్నాడు.
“ఆ… శ్రీకాంత్ బావా… అలారం సౌండ్ ఇనపల్లేదురా.. ఇప్పుడే లేచాను. ఫోన్ చెయ్యలేదు నువ్వు, ఇంకా రాలేదా ఏంటి?”
“రేయ్ బాబ్జి…. నేను మళ్ళీ వెనక్కి వెళ్లిపోతున్నా రా. అర్జెంటు పనొచ్చింది”
“అదేంట్రా… ఇప్పుడే కదా దిగావ్? ఎక్కడున్నావిప్పుడు?”
“నేను కార్ మాట్లాడుకుని పోతున్న… ఆల్రెడీ మన ఊరు దాటేసాను”
“అవునా.. అదేంట్రా.. ఏం అర్జెంటు పని పండగ రోజు కూడా… రాక రాక వచ్చావ్. అరిసె తింటా అన్నావ్? హ హ”
“నాకు అరిసెలు నచ్చవేహే. తెలుసు కదా నీకు”
“అది ఇప్పుడు గుర్తొచ్చిందేంట్రా? హ హ హ హ…. బావా.. నువ్వు గొప్పోడివిరా బాబూ… ఎప్పుడూ అర్థం కావు. ఏంటో. ఏం మారలేదు నువ్వు.”
“హ హ.. సరే రా. మళ్ళీ కలుద్దాం లే. నువ్వే హైదరాబాద్ రా.”
“హ హ.. ఒస్తాను రా. కానీ ఏదో జరిగింది బావా. చెప్పట్లేదు నువ్వు”
“మెల్లగా చెప్తాలేరా”
“సరే సరే. దిగాక చెయ్యి ఐతే”