కేరళకు చెందిన సుప్రసిద్ధ రచయిత ఎం.టి. వాసుదేవ నాయర్ తొంభైఒక్క ఏళ్ళ వయస్సులో 25 డిసెంబర్ 2024న కన్నుమూశారు. రచయితకి ఘన నివాళిగా కేరళ ప్రభుత్వం రెండు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. అంతేకాదు అక్కడి మీడియా సంస్థలు ప్రింట్ బదులు ఈ ఎడిషన్లు మాత్రమే విడుదల చేశాయి. ఇది సంతాపం అనుకుంటే పొరపాటే, ఇది రచయిత మీద వారికున్న ప్రేమ, గౌరవ ప్రకటన. దేశ నలుములలా సాధారణ వ్యక్తుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ జ్ఞాపకాలను మీడియా వేదికగా పంచుకున్నారు.
16వ ఏట నుండే ఎం. టి. వాసుదేవన్ నాయర్ కవిత్వం రాయడం మొదలుపెట్టారు. క్రమేణా కథలు, వ్యాసాలు రాసారు. కవిత్వంతో మొదలైన ఆయన ప్రయాణం కథల వైపు కొనసాగింది.
ది న్యూయార్క్ హెరాల్డ్ & హిందుస్థాన్ టైమ్స్ పత్రిక సంయుక్తంగా నిర్వహించిన వరల్డ్ షార్ట్ స్టోరీస్ పోటీలో, వళర్తుమృగంగల్ (పెంపుడు జంతువులు) పేరుతో వాసుదేవన్ రాసిన కథకు గుర్తింపు లభించింది. ఆయన ప్రస్థానం గురించి ప్రపంచమంతా కోడై కూసింది.
ఆయన రచనలు సమకాలీన సమాజపు వాస్తవాలకు ప్రతిభింబాలు.
“విశ్వగోశం” కథలో విషు పండగకు ధనవంతుల ఇళ్లలో నుండి వచ్చే టపాసుల చప్పుడు విని మొట్టమొదటి సారి తన పేదరికాన్ని, అసమానతలను అర్ధం చేసుకున్న పిల్లాడి కథతో కంటతడి పెట్టిస్తారు. చిన్న వయసులో అందరి పిల్లలాగే మనం కూడా ఉండాలని మనసు కేరింతలు కొడుతుంది. కానీ ఆర్ధిక అసమానతలంటే ఏంటో తెలియని వయస్సు. అలాంటిది ఆ పిల్లాడు ఊర్లో అందరు టపాసులు కాలుస్తుంటే, ఆ వెలుగు, శబ్దాలు విని తన దగ్గర టపాసులు లేవని ఆకాశంలో వచ్చే వెలుగు, పొగ చూస్తూ కూర్చునేవాడు. అప్పుడతని మనసు మదనపడుతుంది. టపాసులన్నా, వాటి శబ్దం, పొగ ఇవ్వంటే అతనికి విరక్తి కలుగుతుంది. కోపపడతాడు. ఇది కేవలం కథ మాత్రమే అనుకుంటే తప్పే, ఎందుకంటే ‘నేను – మీ బ్రహ్మానందం’ పుస్తకంలో బ్రహ్మానందం గారు చిన్నతనంలో దీపావళి పండగ గురించి చెప్పిన విషయాలు విశ్వగోశం కథలో వాసుదేవన్ రచించినవి దాదాపు ఒకేలా ఉన్నాయి. ఎన్ని దేశాలు రాష్ట్రాలు మారినా మనుషులంతా ఒకటే కదా అనిపించేలా రాసిన గొప్ప రచయిత వాసుదేవన్.
“వళర్తుమృగంగల్లో” మనం చిన్నప్పుడు చూసి కేరింతలు కొట్టే సర్కస్ వెనుక ఆ జంతువులను ఎలా చిత్ర హింసలు పెడుతున్నారో వాటిని మెటాఫర్గా వాడుతూ, సందర్భం వల్ల బోనులో ఉండే జంతువుల్లా అల్లాడుతున్న మనుషులను, వారిని హింసిస్తున్న తోటి నరరూప రాక్షసులను ఎండగట్టారు. అప్పట్లో ఆడవాళ్లు ఎంత దారుణమైన ఇబ్బందులెదుర్కోవాల్సి వచ్చేదో ఈ పుస్తకం ద్వారా కళ్ళకు ప్రత్యేక్షంగా చూపించారు.
ఇక నాలుకేట్టు కథ ద్వారా విచ్చిన్నం అవుతున్న ఉమ్మడి కుటుంబం, వాటి వెనుక కారణాలు రాసుకొచ్చారు. ఈ నవలని తెలుగులో “సమిష్టి కుటుంబం” పేరుతో అనువదించారు.
వీటిన్నిటితో పాటు మహాభారతంలో భీముడి గురించి “రండమూలం” నవలను రాసారు. మహాభారతాన్ని భీముడి దృక్కోణంలో ఆవిష్కరించారు. అద్భుతమైన పుస్తకం ఇది.
మహాభారతంలో బలవంతులనగానే ఎవరికైనా అర్జునుడు, కర్ణుడు గుర్తొస్తారు. నేర్పరులు, తెలివిగలవారి ప్రస్తావన వస్తే అర్జునుడు, ధర్మరాజు గుర్తొస్తారు. వేరే ఇంకేవైన పాత్రలని అడిగితే కూడా దుర్యోధనుడు గుర్తొస్తాడేమో కానీ భీముడుకి తగిన గుర్తింపు రానే లేదు. ‘భీముడు బలాఢ్యుడు, కండలు తిరిగిన శరీరం ఉంటుందనే గుర్తిస్తారు. కానీ ఆ శరీరంలోనే ఒక మనసు ఉందని ఎవ్వరూ గుర్తి౦చరు ?!’ అని పుస్తకంలో ఒక చోట భీముడు మనసులో మాట ఉంటుంది. నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే భీముడు ద్రౌపదిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. కానీ ద్రౌపది అర్జునిడిని ఇష్టపడుతుంది. అయినా కూడా భీముడికి ద్రౌపది మీదున్న ప్రేమ ఎన్నడూ తగ్గలేదు. వస్త్రాపహరణం అప్పుడు మిగతా వారంతా మౌనం పాటించినా, భీముడు చాలా ఉద్వేగానికి లోనవుతాడు. ఆరోజు ద్రౌపదికి చేసిన వాగ్దానాన్ని కురుక్షేత్రంలో నెరవేర్చుకుంటాడు . భీముడికి ఎదుర్కొన్న వివక్ష అంతా ఇంతా కాదు. భీముడి కుమారుడు ఘటోడ్గజుడు కురుక్షేత్రంలో చనిపోయాడు కానీ అభిమన్యుడి గురించే కదా అందరు ప్రస్తావిస్తారు. ఈ విషయాలేవీ కొత్తగా రాసినవి కావు. వ్యాస మహాభారతంలో ఉన్నవే. కానీ భీముడి దృక్కోణంలో ఆలోచించి, వాటిని ప్రశ్నిస్తూ అద్భుతంగా రాసారు. ఎవ్వరు పట్టించుకోని భీముడిని పట్టించుకున్నాడు వాసుదేవన్.
కథలా? కవితలా? ఏది ఎక్కువ ఇష్టం అని ఎం. టి. వాసుదేవన్ నాయర్ గారిని అడిగినప్పుడు, “నేను మొదటిగా కవితలే రాసేవాడిని. కానీ నాచుట్టూ ఉన్న జీవితాన్ని ఒడిసిపట్టడానికి నాకు కవితల కన్నా కథలు చాలా సరైన మాధ్యమం అనిపించింది. అందులోను షార్ట్ స్టోరీస్ అంటే ఎక్కువ ఇష్టం.” అని చెప్పారు.
ఇలా వైవిధ్యమైన నిజ జీవిత కథలతో పాఠకుల హృదయాలు దోచుకున్నారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల, కూటి కోసం దాదాపు 50 సినిమాలకు స్క్రీన్ ప్లే రాసారు. కాగితాల మీదే కాదు తెరమీద కూడా కథ చెప్పడంలో తనదైన ముద్రని చాటుకున్నారు. “ఇరువర్ (ఇద్దరు) సినిమాకి మూల కథ ఐడియా ఇచ్చింది వాసుదేవన్ నాయర్” అని మణిరత్నం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కొన్ని సినిమాల తరువాత మళ్ళీ సాహిత్యానికి పరిమితమయ్యారు. తరువాత ఎంత మంది అడిగినా సినిమాకు వెళ్ళకుండా, సాహితి సేవకు అంకితమయ్యారు.
మాతృభూమి పత్రికకు సంపాదకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. 1990 లలో నెల్సన్ మండేలా జైలు నుండి విడుదలయినప్పుడు ఒక మంచి టైటిల్‌తో ఆర్టికల్ రాయాల్సిందిగా చైర్మన్ కోరారు. అన్నీ పత్రికలూ, న్యూస్ ఛానళ్ళు మండేలా విడుదలని సెలెబ్రేట్ చేస్కుంటూ, ఎవరికీ వాళ్ళు గొప్ప ఆర్టికల్ రాయాలని ఉవ్విళ్లూరుతున్న సమయంలో, జైలు పుల్లి నెంబర్. 466 (వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాట౦ చేసి జైలుకి వెళ్ళిన 466వ ఖైదీ మండేలా) అనే పేరుతో వాసుదేవన్ రాసిన ఆర్టికల్ అ౦దరి ప్రశ౦సలు చొరగొన్నది.అలాగే ఆయన సంపాదకుడిగా ఉన్నపుడు యువ రచయితలను కూడా పరిచయం చేసారు. పిల్లల కోసం కథలు రాసారు. వారి కోసం మాగజైన్లో ప్రత్యేక కాలమ్స్ కేటాయించి కథలు, కామిక్స్, జోక్స్ రాయించారు.
సినిమాలో తనదైన ముద్రతో ఆయన కొత్తతరానికి వెలుగు చూపారు. సినిమా రిఫరెన్స్ కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన చుట్టూ ఎన్నో కథలుంటాయి- వాటి సారాన్ని పట్టుకోగలిగితే చాలు అని ‘ఒరు వడక్కన్ వీరగాథ’ ద్వారా చూపించారు. అంతే కాదు వాసుదేవన్ సినిమాలలో బలమైన పాత్రలుంటాయి. కమర్షియల్ అంశాల మీద ఆధారపడకుండా, చుట్టూ ఉండే జీవితంలోని ఎమోషన్స్ వాడుతూ పట్టు తప్పకుండా రాయగలడు.
అలాగే వాసుదేవన్ సాహిత్యానికి సినిమాకి మధ్య ఒక వారధిని కట్టారని చెప్పచ్చు. తన సినిమా కథల్లో పాత్రలకు పుస్తకాలనుండి, పురాణాల నుండి ప్రేరణ తీసుకుని క్యారెక్టర్లు, స్క్రీన్ ప్లే రాసేవారు.
వాసుదేవన్ గారి పుస్తకాల, సినిమాల వల్ల ఎందరో ప్రభావితమయ్యారు. వాసుదేవన్ గారు సమాజాన్ని, అక్కడి ప్రజల జీవితాన్ని, మారుతున్న కాలాన్ని పట్టు తప్పకుండా కథగా మలిచేవారు. ఈ మధ్య వెలువడిన వెబ్ సిరీస్ మనోరథంగల్, వాసుదేవన్ గారు రాసిన తొమ్మిది చిన్న కథలను తీసుకుని తెరకెక్కించినదే. ఆ వెబ్ సిరీస్ చూసినంత సేపు అందులో ఉన్న పాత్రలు పోలిన వ్యక్తులు మన మధ్యలోకి వచ్చి వెళ్తుంటారు.
ఎం. టి . వాసుదేవన్ నాయర్ సాధారమైన జీవితం గడిపేవారు. పేరు ప్రఖ్యాతల పట్టింపు ఉండేది కాదు. ఎటువంటి ఆడంబరాలకు పోలేదు. జీవితంలో నిజాయితీగా అవసరమైనంత వరకు మాత్రమే డబ్బు సంపాదించాలనేది ఆయన సూత్రం. “మనమేమి ధనవంతులం కాదు. కేవలం అవసరానికి సరిపడా మాత్రమే మన దగ్గర ఉంటుంది” అని ఆయన తన కూతురు అశ్వతికి చెప్పేవారు. ఈ సందర్బంగా ఒక సంఘటన కూడా అశ్వతి గుర్తుచేసుకున్నారు. “కొన్నేళ్ల క్రితం ఒక కథ రాయడానికి కమల్ హాసన్ ఇచ్చిన అడ్వాన్స్ ని లెక్కలో రాసుకుని, ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా అలానే ఉంచుకున్నారు. ఒకరోజు ఈ విషయం అశ్వతికి చెప్పి ఆ డబ్బు కమల్ కి తిరిగి పంపేశారు. డబ్బు ఇచ్చిన విషయం కమల్ హాసన్ గారికి కూడా గుర్తుకులేదట”. కానీ డబ్బు విషయంలో అంత నిజాయితీగా ఉండేవారట. ఎం. టి . వాసుదేవన్ నాయర్ పుస్తకాల మధ్య గడపటాన్ని లగ్జరి లైఫ్ గా భావించేవారు. పుస్తకాలే తన ఆస్తి అని చెప్పుకుంటారు.
తన 90 వ పుట్టిన రోజు వేడుకలో ఎం. టి. వాసుదేవన్ నాయర్ మాట్లాడుతూ “మా కుటుంబంలో నాల్గవ పిల్లాడిగా పుట్టిన నాకు వేడుకలు చెయ్యడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాంటిది అదే పిల్లాడి 90 వ పుట్టినరోజుని కేరళ రాష్ట్రమంతా వేడుకల చేసుకుంటుంది.” అని అన్నారు.
ఆరోగ్య కారణాల వల్ల కొన్ని ఏళ్లుగా ఆయన ఇంట్లోనే ఉంటున్నా, ఆ ఇల్లేప్పుడు నిరంతరం వచ్చిపోయే యువ రచయితలు, నాయర్ గారి స్నేహితులు, సినిమా వాళ్ళు, సాహితి చర్చలతో ఇలా జన సందోహంతో నిండిపోయి సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతమంతా మూగబోయింది.
తను చుసిన వెలుగును తన తోటివారైనా ఎందరికో చూపించి, కేరళ సాహిత్యానికి కొత్త మెరుగులు అద్దిన కలం ఆగిపోయింది. రండమూలంలో ఎం. టి. వాసుదేవన్ నాయర్ గారు “మన జీవితంలో మరణం కూడా అతి ముఖ్యమైన వేడుక. . . పుట్టినరోజులానే “అని రాసారు. కానీ ఎం. టి. వాసుదేవన్ నాయర్ గారి మరణం భారతీయ సాహిత్యనికి తీరని లోటు. ఎందరికో ఇదో వెంటాడే విషాదం.
