కె.ఎన్. మల్లీశ్వరి రాసిన ‘సుక్ర బల్ముచు’ కథలో మనకి కనిపించేది కేవలం ఆదివాసీ కూలీ మరణం మాత్రమే కాదు; దాని చుట్టూ తిరిగే కాంట్రాక్టు వ్యవస్థ, కార్మికుడి భద్రత పట్ల నిర్లక్ష్యం, పరిహారం కోసం జరిగే బేరసారాలు, పోలీసు వ్యవస్థ, మీడియా, మధ్యవర్తులు, యజమాని వర్గపు నైతికత, చివరికి దానధర్మంగా మారిపోయే పరిహారం కనిపిస్తాయి. అయితే, ఈ కథని కేవలం ‘ఆదివాసీ కార్మికుడి దుర్మరణం’ మీద రాసిన కథగానే కుదిస్తే దాని పరిధినీ, సంక్లిష్టతనీ తగ్గించినట్టే అవుతుంది. నిజానికి అసలు కథ సుక్ర చావులో లేదు; ఆ చావు తర్వాత ఉండే మనుషుల ప్రవర్తన తీరులో ఉంది.
సుక్ర కలలోని బురుబొంగా అనే అదృశ్య ప్రపంచం కథ అంతటా ఒక అంతర్లీన నీడలా కనిపిస్తూనే ఉంటుంది. కానీ కథలో సుక్ర వ్యక్తిత్వం కంటే ‘కార్మికుడు’గా ఉండటమే ఎక్కువ కనిపిస్తుంది. ఇది కథాదృష్టికోణంలో కనిపించే ఒక పరిమితి. అయితే, కథ తన దృష్టిని సుక్ర వ్యక్తిత్వం కంటే అతని చావు తర్వాత పనిచేసే వ్యవస్థపై కేంద్రీకరించినందు వల్ల, దీన్ని పూర్తి కథాలోపంగా చూడలేం.
కథలో సంక్లిష్టమైన నైతిక స్థితి దండాసి పాత్రలో కనిపిస్తుంది. దండాసి, సుక్ర శవాన్ని పట్టాల మీద నుంచి లాగి, బెల్టును కత్తిరించి పడేస్తాడు. ‘నాకోసం కాదు, అందరి కోసం ఇలా చేశాను’ అన్న దండాసి మాట కథలో అత్యంత బలమైన నైతిక వాక్యం. దండాసి తనని తాను సమర్థించుకుంటున్నాడా? లేక నిజంగానే అందరి కోసం చేశానని నమ్ముతున్నాడా? అన్న సందిగ్ధతే ఈ పాత్రకి బలం.
కథలో ప్రమాద సన్నివేశం కళ్లకి కట్టినట్టుగా నిర్మించారు రచయిత్రి. సుక్ర చావుకి కారణమైన బెల్టును దండాసి తీసేసి నీటిలో పడేయటంలో ప్రమాదం వెనుక నిజాన్ని దాచే ప్రయత్నమున్నా, చివరికి అదే అతనిలో పాపభీతిని కలిగిస్తుంది. దండాసిని అంత సులువుగా ‘నేరస్థుడు’ అనలేం. అతని చర్య వెనుక పని ఆగిపోతే అందరి పొట్టలు కొట్టుకుపోతాయన్న వ్యవస్థాత్మక భయముంది. అంటే, నేరం వ్యక్తిగతమైనదే అయినప్పటికీ దాని మూలాలు మాత్రం వ్యవస్థాత్మకమైనవి.
ప్రఫుల్లకి కాంట్రాక్టు ఆలస్యమైతే తన మార్జిన్ తగ్గిపోతుంది, పార్ట్ పేమెంట్లు రావు, అప్పులపై వడ్డీలు పెరుగుతాయి; కొడుకుతో గొడవ, గుండెపోటు భయం, పోలీసులకూ, మీడియాకూ, చివరికి పరిహారానికీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సుక్ర మరణం అతని దగ్గరకి ‘చావు వార్త’గా రాదు; ‘ఇంకా ఎంత ఖర్చు?’ అన్న ప్రశ్నగానే వస్తుంది. అతను సుక్ర కుటుంబానికి రెండు లక్షలివ్వటానికొప్పుకుంటాడు. కొడుకు అదనంగా ఇరవై వేలివ్వగానే అతనికి కోపమొస్తుంది. కానీ దామి తన పిల్లల్ని అతని కాళ్లమీద పడేసినప్పుడు, తనలో పుణ్యం పొందినట్టు ఉప్పొంగుతాడు. ‘కథ దామిని బానిసగా చూపించిందా? లేక ఆమె బతుకే ఆమెని అట్లా ప్రవర్తింపజేసిందా?’ అన్న ప్రశ్నకి సమాధానం సులభం కాకపోవచ్చు.
ఇక్కడ ప్రఫుల్ల కొడుకు సంతోష్ ఔదార్యం అనుమానాస్పదమైనది. అది వ్యవస్థకు వెలుపల నిలిచిన మానవత్వం కాదు; ఆ వ్యవస్థలోనే పనిచేసే ఒక వ్యూహం. అతను వ్యవస్థను ప్రశ్నించడు; దాని లోపలే మరింత సమర్థంగా పనిచేస్తాడు. అతని ఔదార్యం సుక్ర మరణానికి న్యాయం చేయదు; కాస్త అదనపు నష్టపరిహారాన్ని ఇప్పిస్తుందంతే. అతను భద్రతా లోపాన్ని ప్రశ్నించడు; కేసును చాకచక్యంగా మూసేస్తాడు. గమనిస్తే..’ఇక్కడ మానవత్వం వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాలేదు; వ్యవస్థను మరింత సాఫీగా నడిపించే నైపుణ్యంగా మారింది.’ అన్నది స్పష్టంగా అర్థమవుతుంది.
కథలో డబ్బుదీ ఓ పాత్రే. అదే డబ్బు ప్రఫుల్లకు నష్టంగా, పోలీసులకు ‘కాంప్రమైజ్’గా, రిపోర్టర్‌కు ‘వార్త ఆపేందుకు వెల’గా, కుశరాజుకు ‘మధ్యవర్తిత్వపు లెక్క’గా, దామికి ‘భర్త చావుకి పరిహారం’గా, సంతోష్‌కి ‘ఔదార్య ప్రదర్శన’గా మారుతుంది. ఇక్కడ డబ్బు నైతిక విలువలను మార్చడం కంటే, వాటికి వెల కట్టే శక్తిగా మారటంతో రెండు లక్షలు ఇవ్వటానికి సిద్ధమైన ప్రఫుల్ల, దామి లక్షే అడగడంతో లోపల్లోపల సంబరపడిపోతాడు.
‘ఒక అమాయక ఆదివాసీ ప్రాణం నిష్కారణంగా…’ అంటూ ఆవేశంగా మాట్లాడే రిపోర్టర్, వెంటనే ‘ఎంత?’ అన్న ప్రశ్నకి లొంగిపోతాడు. పెన్నూ, పుస్తకం, గుడ్డసంచీ లాంటి ఈ బాహ్య లక్షణాలూ, ఖర్జూరం పండ్ల సీనూ అతన్ని చూస్తే నవ్వించేలా చేస్తాయి; కానీ పాత్రని కార్టూన్‌గా కుదిస్తాయి. అంటే, వృత్తి గుర్తింపులు ఒక మనిషి నైతికతకు హామీ కావు. కాజాలవు.
దండాసి, వంటతను, కుశరాజు లాంటి పాత్రల మాటల్లోని ప్రాంతీయ భాష కథకు జీవం తెస్తుంది. ‘కొండ మేళం’, ‘బకాసురుడి బాబాయ్’, ‘రాకాసితిండి’ లాంటి మాటలు ఉత్త హాస్యాన్ని పుట్టించడానికే రావు. పాత్రల సామాజిక స్థితినీ, పరస్పర సంబంధాలనీ, మానసిక స్వభావాలనీ ఆ మాటలు బహిర్గతం చేస్తాయి. ప్రత్యేకంగా సుక్రకు తెలుగు అర్థం కాకపోవడం, దండాసికి సుక్ర భాష అర్థం కావడం మంచి నిర్మాణాత్మక అంశం. భాషావిభజన కథలో మానవ సంబంధాలను ప్రభావితం చేయడమే కాక, అధికార సంబంధాలను కూడా నిర్మిస్తుంది. అంటే, భాషని ఇక్కడ ఒక్క ‘కమ్యూనికేషన్ ప్రాబ్లమ్’గానే కాక, ‘ఎవరు ఎవరితో మాట్లాడగలరు? ఎవరు ఎవరిని అర్థం చేసుకోగలరు? ఎవరి మాట ఎవరికి చేరుతుంది? అంతిమంగా ఎవరు నిర్ణయం తీసుకుంటారు?’ అన్న అంతర్లీన ప్రశ్నలతో అధికారనిర్మాణంగా నిలబెడతాయి.
కథలో ఆదివాసీ జీవితం కేవలం నేపథ్యమా, లేక కథకు కేంద్ర అనుభవమా? దోపిడీ వ్యవస్థ సుక్రను “కార్మికుడు”గా కుదిస్తే, కథనం అతన్ని “ఆదివాసీ బాధితుడి ప్రతీక”గా కుదించిందా? నిజానికి కథలో ఆదివాసీ సంస్కృతికి సంబంధించిన అనేక సంకేతాలు ఉన్నాయి. కానీ, ఆదివాసీ జీవితం మాత్రం ప్రధానంగా ఒక ‘వేరొక ప్రపంచం’గానే కనిపిస్తుంది. ఇది కథలో లేకపోవడం లోపం కాదు; ప్రతి కథ తనకు అవసరమైన జీవితాన్నే ఎంచుకుంటుంది. అయినప్పటికీ, సుక్రను ఆదివాసీ కార్మికుడిగా మాత్రమే కాకుండా, ఒక నిర్దిష్ట సామాజిక–సాంస్కృతిక అనుభవం నుంచి వచ్చిన వ్యక్తిగా మరింత లోతుగా నిర్మించే అవకాశం కథకు ఉంది. బురుబొంగా, సుకున్ బురు, పూర్వీకుల ఆత్మలు కథలో నిజమైన సాంస్కృతిక అనుభవంగా ఎంత లోతుగా రూపుదిద్దుకున్నాయో, లేక కేవలం వాతావరణాన్ని నిర్మించే ప్రతీకలుగానే మిగిలాయో అన్న ప్రశ్న మాత్రం మిగులుతుంది.
‘లేబర్‌కి సారాపాకెట్లు తెప్పించు, మాంచి ఘాటుగా వంజిరం పులుసు పెట్టు, దెబ్బకి క్వార్టర్స్‌లో దెయ్యాలు పారిపోవాల’ అని సంతోష్ చెప్పడం కథని ఒక విచిత్రమైన వలయంలోకి లాక్కెళ్తుంది. బురుబొంగా, పూర్వీకుల ఆత్మలతో మొదలైన కథ, చివరికి క్వార్టర్స్‌లోని దెయ్యాలను తరిమేందుకు సారా, పులుసుల అవసరంతో ముగుస్తుంది. అయితే, ఇంకోపక్క దండాసి మాత్రం ‘నన్ను చమించు’ అంటూ చెట్టుకిందే మిగిలిపోవడం కథ ముగింపుకి ఇంకో తలుపుని తెరుస్తుంది. అక్కడ కథ మళ్లీ తన అసలు నైతిక ప్రశ్నని చేరుకుంటుంది. కథలో చివరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు; కానీ దండాసికే ఊపిరాడలేదు.
కథలో నిజమైన విలన్ ఎవరు? ప్రఫుల్లనా? కుశరాజా? పోలీసులా? రిపోర్టరా? దండాసినా? ఇక్కడ ఎవరో ఒక్కరే కాదు; వ్యవస్థ వ్యక్తుల ద్వారా పనిచేసే విధానమే కథలోని అసలు భయానకత. అది ఒక బాహ్య విలన్ కాదు; వ్యక్తుల ఆలోచనల్లోకి, భయాల్లోకి, లాభనష్టాల లెక్కల్లోకి, చివరికి వారి నైతికతల్లోకి చొరబడిన సంబంధాల నిర్మాణం. మనిషి ప్రాణాన్ని ముందు పనిదినంగా, తర్వాత ప్రమాదంగా, ఆ తర్వాత కేసుగా, చివరికి పరిహారంగా మార్చే వ్యవస్థే ఇటువంటి వ్యక్తుల ద్వారా పనిచేస్తుంది. ఇటువంటి వ్యవస్థలో సుక్ర మరణం ఒక సంఘటన మాత్రమే; రేపు ఆ స్థానంలో ఇంకో సుక్ర ఉండొచ్చు.
మరణించిన సుక్రకు పరిహారం దొరికింది; జీవించి ఉన్న దండాసికి మాత్రం క్షమాపణ దొరకలేదు. అందుకే న్యాయం కేవలం చావుకు లభించే నష్టపరిహారంలో కాదు; ఆ చావుకు దారితీసిన వ్యవస్థను ప్రశ్నించడంలోనే ఉంది. ఆ ప్రశ్న చివరి దాకా ప్రశ్నగానే మిగిలుతుంది.
చివరగా, ‘కథలో తిరుగుబాటు ఎందుకు లేదు?’ అని కాదు; తిరుగుబాటు లేని పరిస్థితిని కథ ఎట్లా నిర్మించింది? ఆ పరిస్థితి వెనుక ఏ మానసిక, ఆర్థిక, సామాజిక సంబంధాలు ఉన్నాయి? అన్నదే కథ చూపుతుంది.
– బాలాజీ పోతుల
(కె.ఎన్. మల్లీశ్వరి ‘సుక్ర బల్ముచు’ కథ 9 ఆగస్టు 2026న ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురితమైంది)

