I
కందయన్
డబ్భైయేళ్ళు నిండేందుకు మరో పదిహేడు రోజులే మిగిలున్న తరుణంలో తుదిశ్వాస విడిచిన కందయన్ తన చిన్నకొడుకు కూతురూ, తన మనవరాలు అయినటువంటి కోసలై కడుపున మళ్ళీ పిండంగా రూపుదాల్చాడు. భార్య చెల్లతాయి మాత్రం అతడు ఎక్కడో తప్పిపోయాడనే అనుకుంది. అప్పుడప్పుడు కందయన్ ఇలా కనిపించకుండా పోవడం, మళ్ళీ కొద్దిరోజులకు తిరిగిరావడం చెల్లతాయికి అలవాటే కనుక, ఆమె ఈ విషయాన్నీ అంతగా పట్టించుకోలేదు. పాత ప్రదేశాన్ని మర్చిపోలేక తోపువరకు వెళ్ళివస్తున్నాడనే ఆలోచన ఆమె బుర్రకు తట్టలేదు. రోజులు లెక్కపెడుతున్న చెల్లతాయికి ఒకరోజు తన అంతర్దృష్టికి ఏదో తీవ్రంగా అనిపించడంతో కలవరపాటుతో తన చుట్టాల్ని వెతుక్కుంటూ పరుగులు తీసింది. ఆమె బలవంతం చెయ్యడంతో మరుసటిరోజు పొద్దు పోయేవరకు ఆమె చుట్టాలు కందయన్‌ని వెతుకుతూ పొద్దుపుచ్చారు. అయితే, కందయన్ ఎవరి కంటాపడలేదు. ఆరోజు తామరతంపలా ఒక పెద్ద గుంపు ఆమె గుడిసె ఆవరణను చుట్టుముట్టి ఏడుపులు అంకించుకున్నారు. ఆపై, ఊరివాళ్ళ నాలుకల్లో అనేక కట్టుకథలు చక్కర్లు కొట్టసాగాయి.
ఒక రోజు తను మధురైకు రైలులో వెళుతుంటే, చెంగల్పట్టు రైలు ప్లాట్‌ఫాంపై కందయన్ పడుకుని ఉండటం చూసినట్లు, పొడవాటి గడ్డంతోనూ, అస్తవ్యస్తమైన బట్టల్లోనున్న ఆయన్ని మొదట తను గుర్తుపట్టలేకపోయానని, రైలు బయలుదేరాకే ముఖం గుర్తుకొచ్చిందన్నాడు వాళ్ళ పక్క వీధివాడు. అతడు చెప్పడమే తడవు, ఏడుపులు పెడబొబ్బలతో గుండెలు బాదుకుని పరుగున వచ్చినామె, చెంగల్పట్టు రైల్వేస్టేషన్‌కి ఆమె పెద్దకొడుకు భూతతానై నసపెట్టి (భార్య చెల్లతాయి తప్ప తక్కినవారంతా కందయన్ చనిపోయాడని నమ్మారు) సాగనంపింది. మొదట్లో, ఒకవేళ ఎక్కడైనా ఉండే ఉంటాడేమోనన్న అర్ధనమ్మకంతో వెదికి చూసి, దొరకలేదన్న విషయాన్ని చెల్లతాయికి చెప్పిన కొడుకులిద్దరూ, ఆపై వెతకకుండానే ఆమెకు సర్దు చెప్పేవారు. ఇలా ఎంతోమంది, ఎన్నో చోట్ల అతడిని చూసినట్లు చెప్పడం విని, తిరిగి తిరిగి వెతికి వేసారిపోయారు. ఒక్కోరోజు ఒక్కో ఊరికి వెళ్ళి చూసి రమ్మని చెల్లతాయి అనడం, ఇద్దరి కొడుకులకు పెద్ద రోదనగా మారింది.
రెండునెలల తర్వాత, ఎళుంబూర్ దగ్గర రైలు ఢీ కొందని చెల్లతాయికి సమాచారం తెలుపగా అక్కడకు వెళ్ళి చూసేందుకు ఆమె నిరాకరించింది. వయస్సును మించిన మూర్ఖత్వం ఆమెను ఎవ్వరూ దగ్గరకు రానీయకుండా తరిమింది. పూనకం వచ్చినదానిలా చాలా చురుకుగా వుండేది. నోటికి వచ్చినట్టు వాగేది. తన కొడుకుల్ని, చుట్టాల్ని, చుట్టుపక్కలవారిని నోటికి వచ్చినట్టు శపించేది. పోలీసులు వచ్చి బలవంతం పెట్టిన తర్వాతే ఆమెను అక్కడి నుండి కదపగలిగారు.
పోలీసు సిబ్బంది తీసుకువెళ్ళిన చోట్లో, గుర్తుపట్టలేని ఒక శరీరం చిధ్రమై పడుంది. ఫ్లాట్‌ఫాంలోని ఒక మూలకు ఆ మాంసపు పిండాన్ని తరలించారు. దూరం నుండి ఆ దృశ్యాన్ని చూడగానే చెల్లతాయి పెద్దయెత్తున ఏడ్వసాగింది. కొప్పును విప్పుకుని, కింద మోకాళ్ళపై కూర్చున్నది కాస్తా గుండెలు బాదుకుని రోదించింది. గుండెలపై చేతులతో బాదుకునే శబ్దం విని చుట్టూవున్నవాళ్ళు ఒకక్షణం అదిరిపడ్డారు. అలా బాదుకోవడాన్ని ఆపేందుకు ఆమె దగ్గరివాళ్ళు, తలా ఒక చెయ్యి పట్టుకుని ఈడ్చుకువెళ్ళే పరిస్థితి నెలకొంది. నేలకు కాళ్ళు బలంగా ఆనించి పంతం పట్టుకుని తనకు తాను నిలబడేందుకు ప్రయత్నించిన చెల్లతాయి ఆ మాంసపుముద్ద దగ్గరకు వెళ్ళేందుకు నిరాకరించి మొండికేసింది. ఆ మూర్ఖత్వానికి ఎదురెళ్ళే తెగింపు ఎవరికీ లేదు. ఏడ్చి ప్రలాపించేందుకు కావలసిన సత్తువ ఆమెలో ఇంకిపోయాకనే ఆమెను దగ్గరకు తీసుకువెళ్ళడం సాధ్యపడింది.
రైలుచక్రాల మధ్య చిక్కుకుని చిన్నాభిన్నమైన ఆ శరీరాన్ని ఒకటిగా దగ్గరకు చేర్చి కుప్పగా పోశారు. దానిని చూడగానే అది తన భర్త కాదని ధీర్ఘమైన గొంతుతో చెప్పేసి అక్కడి నుండి అమాంతం పక్కకు తప్పుకుంది. అయితే, ఆమె కొడుకులు మాత్రం అది తమ తండ్రేనని నిర్ధారించి ఆ శరీరాన్ని చెల్లతాయి గుడిసెకు తరలించారు.
అది కందయన్ కాదని, ఆ శవం తన గుడిసె ముందు ఉంచకూడదని తన ఇద్దరి కొడుకుల మీదా చెల్లతాయి దుమ్మెత్తిపోసింది. చనిపోయింది వాళ్ళ నాన్ననే అని నమ్మించేందుకు వాళ్ళిద్దరూ తీవ్రంగా ప్రయత్నించారు. వాళ్ళకి కూడా అది కందయన్‌నే అని ఖచ్చితంగా తెలియనప్పటీకి, అది కందయనే అని నమ్మేందుకు ఇష్టపడ్డారు. ఈ అబద్ధ నాటకాన్ని బంధువులు, ఊరూవాడా నోరుమెదపకుండా చోద్యం చూసింది. కడవరకు ఒప్పుకునేందుకు నిరాకరించిన చెల్లతాయిని ఇక లెక్క చెయ్యవలసిన అవసరం లేదని తీర్మానించుకున్నవారిగా కొడుకులిద్దరూ ఆ తెల్లగుడ్డ పీలికల్లో పొదివి పెట్టిన మాంసపుముద్దను కాటిలో తగలబెట్టి బోడిగుండ్లతో ఇంటిముఖం పట్టారు.
ఆపై, ఎవరూ తన ఇంటి గడప తొక్కకూడదని చెప్పిన చెల్లతాయి, తలుపు గడియ పెట్టి లోపలికి దూరింది. ఆ తలుపు ఎవరి కోసమూ తీసేది కాదు. ఆమె ఎప్పుడు బయటకు వస్తుంది, ఎప్పుడు తింటుంది, ఎప్పుడు నిద్రపోతుంది ఈ వివరాలేవి చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళకి కూడా రహస్యంగానే మిగిలిపోయాయి.. చుట్టాలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి గుడిసె ముందు నిలబడి కేకలేసి చెల్లతాయితో ఏదైనా మాట్లాడేవారు. చెల్లతాయి సన్నిహితులు ఎవరికైనా ఒంట్లో బాగోలేదని ఆమెను కదిపేందుకు ప్రయత్నించేవారు. ఆమె నుండి చిన్న హుంకరింపు శబ్దం కూడా వచ్చేదికాదు. ఆపై, కాలక్షేపం చూసే చుట్టుపక్కలవారితో ముచ్చట్లాడి అక్కడి నుండి బయలుదేరేవారు. ఒకసారి కోసలై నిండుగర్భిణి (పదేళ్ళ తర్వాత వచ్చిన గర్భం) కావడం చేత చెల్లతాయి వచ్చి మనవరాలి బాగోగులు చూసుకోవాలని అడిగినాసరే ఆ విషయం ఏమాత్రం చెవికెక్కించుకోలేదు. కోసలై తనకు తానుగా కడుపును ముందుకు నెట్టుకుంటూ వాకిట్లోకొచ్చి నిలబడ్డాకనే చెల్లతాయి మనసు కరిగింది.
***
చిన్నదురై పుట్టి సరిగ్గా తొంభైరోజులు అయినటువంటి ఆ శుక్రవారమే చెల్లతాయితో సహా ఎవరికీ తెలియని కందయన్ మొదటియేడు సంవత్సరీకం రోజు. ఆ రోజు ఉన్నట్టుండి ఏడ్వసాగిన చిన్నదురైకి ఏడుపును ఆపేందుకు మూడు గంటల సమయం పట్టింది. ఏడుపు శబ్దం వినగానే కళ్ళు కూడా విప్పకుండానే అప్రయత్నంగా తన రొమ్మును ముందుకు జరిపి ఎడమ చనుమొనను చిన్నదురైకి తాగేందుకు అందించింది కోసలై. ఎప్పుడూ చనుమొనను దగ్గరకు తీసుకురాగానే నోట కరిచేవాడు ఈ మధ్య ముట్టుకోవడం లేదు. జబ్బుపడ్డ కుక్కపిల్లలా బలహీనమైన అతడి ఏడుపు శబ్దం ఇప్పుడు అలవాటుకి పూర్తి భిన్నంగా ఉగ్రంగా మారింది. ఏదైనా తేలు కుట్టుంటుందేమోనని కంగారుపడి చెల్లతాయిని, భాగ్యనాథన్న్ని లేపి చూడమంది. వెలుతురును చూసి రెండు బల్లులు పరుగున వెళ్ళి దాక్కోవడం తప్ప అక్కడ మరేం కంటబడలేదు.
చిన్నదురైను చెల్లతాయి తన భుజాన వేసుకుని ఇంటికి బయటకు వెళ్ళి పచార్లు చేసేది. ఏడ్చి ఏడ్చి బడలికతో ఆ పసికందు అలసిపోయాడే తప్ప ఏడుపు మాత్రం ఆగలేదు. కడుపునొప్పి అయ్యుంటుందేమోనని ఓమం నీళ్ళను ఒక ఒగ్గు గిన్నెలో పోసింది. వేడినీళ్ళలో ఇంగువ కలిపి ఇచ్చింది. ఎండు మిరపకాయలు, ఉప్పుకళ్ళతో తడిమి పొయ్యలో పడేసింది. కర్పూరం చూపించి దిష్టి తీసింది. ఏదీ వాడి ఏడుపు ఆపిన పాపాన లేదు. ఈ కలవరపాటులో కోసలై కూడా ఏడ్వసాగింది. ఆపై, చేతులు చూసి జోస్యం చెప్పే పుష్పాన్ని తీసుకురమ్మని భాగ్యనాథన్‌ని పురమాయించారు.
చెల్లతాయి, చిన్నదురైను తన ఒడిలో కూర్చోబెట్టుకుని వుండగా, ఎదురుగా కూర్చున్న పుష్పం, చిన్న ఉసిరికాయి పిసరంత చింతపండును ఉండ చుట్టి చిన్నదురై పొట్టపై తడిమింది. అప్పుడు మంత్రంలా తనలో ఏదో గొణిగింది. క్షణానికి ఒకసారి పెద్దగా ఆవళింతలు పెట్టింది. దిష్టి తగలడం వలనే పిల్లాడు ఇలా ఏడుస్తున్నాడన్నట్టు ఒక్కో ఆవళింత చివరిలో చెప్పేది. ఉండ చుట్టిన చింతపండును చిన్నదురై నోటిలో కుక్కింది. హ్మ్… అయినా దేనికీ అతడు దారికొచ్చేట్టు కనబడలేదు. ఆపై చేతగానిదానిలా ఉదయం డాక్టరుకి చూపించమని చెప్పి అక్కడి నుండి బయలుదేరింది.
కాసేపటికల్లా వాడంతట వాడే ఏడుపును ఆపాడు.
ఈ ఏడుపు రోజువారీలో భాగమయ్యింది. ఎందుకు ఏడుస్తున్నాడు. ఎందుకు ఆపుతున్నాడన్నది ఎవ్వరికీ అంతుబట్టని పొడుపుకథలా మారింది. సరిగ్గా అప్పుడే పాలు తాగి పడుకునుండేవాడు. కాసేపట్లో ఏడుపు మొదలెట్టేవాడు. చెల్లతాయి ఏదైనా పీడకల కనుంటాడనేది. అది కూడా కారణం అయ్యుండవచ్చునేమోనని సర్దుకుపోయేవారు. ఇలా పీడకల రావడానికి ఏదైనా గాలిగుణం సోకివుంటుందేమోనని భూతవైద్యుడ్ని గాలిస్తూ తిరిగారు. చేతబడి ఏమైనా అయ్యుంటేదేమోనని పరిహారం కోసం గాలిస్తూ తిరిగారు, దేవుడి ఆగ్రహమేమోనని ఊరూరు, గుళ్ళూ గోపురం తిరిగారు. ఏదీ చెయ్యందించలేదు. ప్రతి ఒక్కరూ ముఖం మాడ్చుకుని మార్చి మార్చి తమలో తాము మండిపడుతూ ఒక్కో రాత్రీ పొద్దుపుచ్చేవారు. ఇల్లు చేతబడితో పీడించబడింది.
***
చిన్నదురైకి రెండేళ్ళ వరకు మాటలు రాలేదు. ఏడుపు తప్ప మరే శబ్దమూ అతని నుండి రావడం లేదు. నవ్వుతున్నప్పుడు కూడా అతడి నుండి మరే మాటలు వచ్చేవి కావు. నవ్వేటప్పుడు కూడా మౌనంగానే నవ్వుతాడు. ఆడుకునేటప్పుడు, ఆటపట్టించేటప్పుడు కూడా ముఖంలో ఎటువంటి ఉద్వేగం కనిపించనివ్వకుండా జడంలా ఉంటాడు. ప్రతిరోజు అతడిని మాట్లాడించేందుకు కోసలై తెగ ప్రయాసపడుతుంది. జాబిల్లిని చూపించి, కుక్కని చూపించి మాట్లాడిస్తుంది. “జాబిలమ్మ జాబిలమ్మ” అని అంటుంది. ‘కుక్కని చూడు, కుక్కని చూడు’ అని మొరిగి చూపిస్తుంది. ముందుగా అత్తయ్య పేరే పలకాలని ‘అత్త…అత్త’ అని చెప్పడం చెల్లుతాయికి అలవాటు. అతడి దగ్గర ఎటువంటి చలనం వుండేది కాదు. అతడిది మొద్దు బారిన, కాంతివంతమైన ముఖం.
ఒకసారి చిన్నదురై ఎప్పటిలానే గుక్కపెట్టి ఏడుస్తున్న ఒక రాత్రిలో అతడిని వాళ్ళ భుజాన వేసుకుని ఎప్పటిలానే చెల్లతాయి, కోసలై వీధులెమ్మట పచార్లు చేస్తున్నారు. అప్పుడు ఇంటి చుట్టూ ఒక గబ్బిలం చక్కర్లు కొట్టసాగింది. గుడ్లగూబ పరిమాణంలోని శరీరాకృతి కలిగిన బలిసిన గబ్బిలం. దానిని చూడగానే ఏడుపు ఆపిన చిన్నదురై అది ఎగిరి వెళ్ళే దిక్కుగా చేతిని చూపించి నవ్వుకున్నాడు. చెల్లతాయి, కోసలై అప్పుడు కందయన్‌ని తలుచుకున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇద్దరికీ కన్నీరు ముంచుకు వచ్చింది.
ఆపై, చిన్నదురై సహజస్థితికి వచ్చాడు. చుట్టూ చక్కర్లు కొట్టే ఒక గబ్బిలాన్ని అతడికి కాలక్షేపంగా చూపించడం వారికి రోజువారిలో భాగమయ్యింది. ఆపై చిన్నదురై ఎదగసాగి చెల్లతాయితో సన్నిహితంగా మెలిగేసరికి తను చూసే చిత్రాలను ఆమెకు వివరించసాగాడు. చీకటి పడగానే వీధిలో కూర్చుని చెల్లతాయి, చిన్నదురై కథలు కథలుగా మాట్లాడుకునేవారు. ఎన్నో ఏళ్ళ క్రితం మేట్టుకుప్పం నైసర్గిక స్వరూపాన్ని పొల్లు పోకుండా చిన్నదురై వివరించడం చూసి నోరెళ్ళబెట్టిన చెల్లతాయి ఇది ఎలా తెలుసని అడిగితే కలలో చూస్తున్నానని చెప్పాడు. పదేపదే ఒకే సన్నివేశాలు తన కలలో వస్తున్నట్లుగానూ, మసకబారిన కొన్ని సంఘటనలు తనను భయపెడుతున్నట్లుగాను చెప్పాడు.
చెల్లతాయికి లోలోపల ఒక రకమైన భయం అలుముకుంది. ఈ విషయాన్ని కోసలైకి, భాగ్యనాథన్‌కి ఎంతో పరిణతితో చెప్పింది. ఆపై ఒక జ్యోతిష్కుడు చెప్పినట్లుగాను చిన్నదురైకి ఆరేళ్ళు నిండగానే అతడిని రాజపాళయం చొక్కనాథన్ పుత్తూరిలోనున్న అతడి పిన్ని రంజితం ఇంట్లో వదిలేసి వెళ్ళారు. అతని బాల్యమంతా అక్కడే గడిచింది. బీడు భూమి. రుచి లేని నీళ్ళు, నల్లతుమ్మ చెట్లు తప్ప అక్కడ మరో చెట్లను చూడటం అరుదు. ఆ ఉక్క పోత నేల వలన అతడి కలలకు చుక్కెదురైంది. అయినప్పటికీ కందయన్ శరీరాకృతిని తన పిన్ని ద్వారా కథలుగా తెలుసుకున్నాడు. ఆమె వివరించే కథలతో, చిన్నదురై తన కలలో చూసిన చిత్రాలతో సరితూగడంతో మేట్టుకుప్పానికి వెళ్ళి చూడాలన్న వైరాగ్యం అతడి మనసు దిగంతాలలో నాటుకుపోయింది.
***
మేట్టుకుప్పం తోపులో పనికి పెట్టిన ఆ పెద్ద గుంపుకు ఒకసారి కూడా కంటపడని ఆ భూస్వామిని ‘యజమాని, యజమాని’ అని గుమ్మస్తా చెప్పడంతో పదే పదే విని అందరి నాలుకలపై యజమాని అనే మాట నాటుకుపోయింది. ఆ యజమానిపై వాళ్ళకు అమితమైన మర్యాదతో కూడిన భయముండేది. మొదటిసారి ఇక్కడకు ఇబ్బడిముబ్బడిగా వలస వచ్చినప్పుడు, మహాబలిపురం రోడ్డు పొడవునా సాగే కొబ్బరి తోపును చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సరుగుడుచెట్ల తోపుగానున్న చోటును కాస్తా అడపాదడపా కొబ్బరి మొక్కలను నాటి యజమాని దానిని పెద్ద కొబ్బరి తోటగా మార్చాడని గుమ్మస్తా చెప్పాడు. ఈ అతిపెద్ద తోపులను నాటి పెంచి పోషించిందెవరు? వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు, వారినందరిని తరిమేసే ఇప్పుడు మనల్ని ఇక్కడకు తీసుకువచ్చారా? అనే లెక్కలేనన్నీ ప్రశ్నలు వెంటాడుతున్నప్పటికీ వాళ్ళు ఎప్పుడూ గుమ్మస్తాని ఏదీ అడిగి తెలుసుకునేందుకు సాహసించలేదు. అతడు చెప్పేది అర్థమైనా, అర్థం కాకపోయినా శ్రద్ధగా ఆలకించేవాళ్ళు.
ఆ బ్రహ్మాండమైన తోటను, మరింత బ్రహ్మాండంగా రూపొందించింది కందయన్ సమూహమే. మనల్ని తరిమేసి తర్వాత వచ్చి వినోదం చూసే గుంపు కూడా మనలాగే ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నట్లు బాధాకరమైన చిత్రాన్ని అప్పుడప్పుడు కందయన్ తలుచుకుని బాధపడేవాడు. ఒకానొక కాలంలో పెద్ద బంజరభూమిగా పడున్న ఈ తోపుకు ఏ సమూహం ప్రాణం పోసిందని ఎలాగైనాసరే గుమ్మస్తాని అడిగి తెలుసుకోవాలనుకున్నాడు కందయన్. ఆ తోపులను కూడా దాటుకొని కాలినడకన నడిచెళ్ళి తిరిగి చూసేవాడు. అక్కడ వాళ్ళ గుడిసెలు తప్పించి మరే మనిషి జాడను చూడటం అపూర్వం. కనుచూపుమేరలో కొబ్బరిచెట్లు తప్ప ఇంకేమీ కనబడని ఆ తోపును రెండుగా చీల్చే ఒక ఎర్రమట్టి కాలిబాట ఉండేది. ఒలిచిన కొబ్బరికాయలను ఎక్కించుకునేందుకు వచ్చే బండి గుర్తులు, తిరువాన్మయూర్ నుండి తిరుపూర్ వెళ్ళేందుకు కాస్త ఐశ్వర్యవంతులు కూర్చొని వెళ్ళే గుర్రపుజట్కా బళ్ళ గుర్తులు, పులిహార కట్టుకొని తోపులలో సేదతీరి నడకను కొనసాగించేవారి కాలి గుర్తులు, మద్రాస్ మహానగరపు చెత్తలన్నిటిని పెరుంగుడి తీసుకువచ్చి చేర్చేందుకుగాను ప్రభుత్వం పంపించే చెత్తబళ్ళ గుర్తులు తప్పి ఆ ఎర్రమట్టి రోడ్డు మరేదీ చవిచూడలేదు.
అటువంటి ప్రదేశంలోనే తిరునల్వేలిలో ఉండే ఆడయకరుంగుళం నుండి గుమ్మస్తా ద్వారా రెండు వందల మందిని తీసుకువచ్చి యజమాని అందరికీ గుడిసె ఇళ్ళు కట్టించి ఇచ్చాడు. మొత్తం డెబ్భై కుటుంబాలు. ఒక ప్రభుత్వ ఉద్యోగిలా ప్రతినెలా ఒకటో తారీకుకి కూలి డబ్బులు చేతికొస్తాయి. తోపులను కావలి కాయడం, కొబ్బరి చెట్లకు నీళ్ళుపెట్టడం, కొబ్బరికాయలను కొలిచి బళ్ళలోకి ఎక్కించడం ప్రధానమైన పని.
కొత్తగా రూపుదిద్దుకున్న ఈ ఊరికి నాయకుడిగా కందయన్ బాధ్యత వహించాడు. అతడు శ్రీ మచ్చకార సుడలైమాడన్ ఆలయ పూజారి కూడాను. ఇక్కడకు మకాం మారాక పుట్టిన పిల్లల్లో అనేకమందికి మాటలు రాకుండా పోవడంతో, అలా మాటలురాని పిల్లల కోసమనే ప్రతినెలా అమావాస్య రోజున మధ్యాహ్నంవేళ శ్రీ మచ్చకార సుడలైమాడన్కి మిట్టమధ్యాహ్నపు పూజ చేసేది కూడా కందయనే. (పిల్లలు, అతడిని ‘గబ్బిలాల తాతయ్య’ అనేవారు.) బలివ్వడం కోసం గబ్బిలాల గుహకి కందయన్ ఒంటరిగా వెళ్ళి, ఒకే ఒక్క గబ్బిలాన్ని (అతడి బలిష్టమైన రెండు చేతుల్లో ఈమడనంత పడితే అది కూడా మొరటు గబ్బిలమే అయ్యుండేది.) పట్టుకుని వచ్చేవాడు. కొబ్బరి తోటల్లో తిరిగే పురుగులను పట్టుకొని మూట కట్టి ప్రతిరాత్రీ మేత వేసే కందయన్ ఆ గుహలోకి ప్రవేశించగానే అవి అతడితో ఆటలాడేవి. కీచ్… కీచ్… మని అరుస్తూ పురుగులను వేటాడేవి. కనుక, మిగిలిన వారిలా కాకుండా గబ్బిలాలను పట్టుకోవడమన్నది కందయన్‌కి చాలా సులభమైన పని. అమావాస్యనాడు ఇతడు పట్టుకువచ్చే గబ్బిలాలని సుడలైమాడన్ గుడి ముందర ఉండే చిన్న సూలానికి గుచ్చేవాడు. రెండు రెక్కలను చేతులతో చాపి బొటనవేలుతో నడుమును నొక్కి, వేలు ఊచకు (నోటికి గుచ్చుకునే సూలం) గబ్బిలాల గుండెను గుచ్చేటప్పుడు పిల్లలూ, స్త్రీలు, సున్నిత మనస్కులైన మగవాళ్ళు ముఖం మాడ్చుకుని, పక్కకు చూపు తిప్పుకునేవారు. ఆ గబ్బిలాల నుండి చిన్న మూలుగు శబ్దం కూడా రాదు. దాని శరీరం ఉన్నఫళంగా మెల్లగా కుచించుకుపోతుంది. ఆపై మాటలు రాని పిల్లలను తన ఒడిలో కూర్చోబెట్టుకొని, వేలుతో ఓం అనే ప్రణవ మంత్రాన్ని నాలుకపై రాసేవాడు. అలా నాలుకపై రాసేటప్పుడు గబ్బిలం తల నేలవైపుకు వాలి, పిల్లవాడి ముక్కుకి రాసుకునేది. ముదురు ఎరుపు రంగులోనే దాని రక్తం అడుగంటే వరకు (మిగిలిన పిల్లలకు, తర్వాతి ఆ నెల పూజలోనే పరిహారం.) నాలుకపై ప్రతీ పిల్లవాడికి మూడుసార్లు రాసేవాడు. ఆరు కార్తీక మాసాలు పూర్తయ్యేసరికి పిల్లలు మాట్లాడేవారు. ప్రతి పౌర్ణమికి సంతానలేమి, కుటుంబ సమస్యలు, డబ్బుల వ్యవహారాలకు సంబంధించిన తగాదాలు తీర్చేది కందయన్‌నే.
ప్రతీ అమావాస్య పూజ రోజున సుడలైమాడన్ చెవులు ఎదగడం వలన, సుడలైమాడన్‌కి కట్టిన చిన్న ప్రహరీని పగలగొట్టి ఒక ప్రాంగణం కట్టి దానిమీద బట్టబయలులో ప్రతిష్టించారు. సుడలైమాడన్‌కి కుంభాభిషేకం జరిపించి, బలి ఇవ్వకపోవడమే దీనికి కారణమని అన్నారు. కనుక, ఒక్కొక్క వేసవి చివరిలోనూ జాతర జరపవలసిందిగా తీర్మానించారు. గుడి కుంభాభిషేకం చివరిరోజున నిండుచూలుతోనున్న గబ్బిలాన్ని బలిచ్చేందుకు తీర్మానించారు. (సొంతూరిలో ఉన్నప్పుడు చూలు మేక కడుపును చీల్చి, లోపలుండే మేక పిల్లల్ని బయటకు తీసి బలిపీఠంపై పెట్టేవారు. కడుపు చీల్చేముందు మేకతలను నరికేవారు కాదు. అది ప్రాణాలతో ఉన్నప్పుడే చీల్చి రక్త బలి ఇచ్చేవారు. అలా చీల్చేటప్పుడు తల్లి మేక చచ్చిపోయేది. పిల్ల మేక కూడా దానితోపాటు చచ్చిపోయేది. చూలు మేకను బలిచ్చే ఈ సంప్రదాయం కాస్తా ఇక్కడ గబ్బిలాల బలిగా మారిపోయింది. ఇందుకు కారణం వాళ్ళ జీవనాధారమైన కొబ్బరి చెట్లుండే ప్రాంతాన్ని ఆనుకుని గబ్బిలాలు కూడా ఉండటమే. గబ్బిలాల గుహ నిండిపోయి, కొబ్బరి చెట్ల మీద సేద తీరేంతగా గబ్బిలాలు పెరిగిపోయాయి. పగటిపూట తమ రెక్కలను దుప్పటిలా కప్పుకున్నట్లు, తలకిందులుగా వేలాడుతుంటాయి. సూర్యాస్తమయ వేళకి ఆకాశంలో అటు ఇటు చక్కర్లు కొడుతుంటాయి. ఒక కొబ్బరిచెట్టు నుండి మరొక చెట్టుకి దూకుతుంటాయి. చీకటి పడగానే ఆహారవేటకు బయలుదేరుతాయి.
కందయన్ సమూహం, గబ్బిలాలను వేటాడి తినడం కూడా అలవర్చుకుంది. నిప్పుల్లో పడేసి కాల్చో, మాంసాన్ని ఒలిచి నాటుకోడి పులుసులా వండుకునో తినేవాళ్ళు. కందయన్ మాత్రమే గబ్బిలాలను తినేవాడు కాదు. బదులుగా, వాటికి అతడే మేతపెట్టేవాడు. గుహకు వెళ్ళలేకుండా ఒంట్లో నలతగా వుండి పడుకొని ఉంటే, ఇంట్లో ఉన్నపాటుగా పురుగుల మూటలను విప్పి వాటి రాక కోసం ఎదురుచూసేవాడు. ఆ ఊరి జనం, గబ్బిలాలను ఎప్పుడూ ఉపద్రవంగా చూడనప్పటికీ, ప్రతినెలా డబ్బులు తీసుకువచ్చే గుమ్మస్తా, కందయన్‌తో చంపేయమని చెప్పి వెళ్ళేవాడు. తోపు అంతా గబ్బిలాలతో కంపు కొడుతుందని బాధపడేవాడు. గుమ్మాస్తాతో, కందయన్ విభేదించే ఒక్కగానొక్క విషయమిదే. వాటిని కులదైవం అనేవాడు.
తోటపనులను, సుడలైమాడన్ పూజను, సంవత్సరం చివరలోని జాతరా, సందళ్ళతో తమ సంప్రదాయాన్ని ఈ కొత్త నేలపై కూడా పునరుద్దరించుకున్నారు. ఆ తర్వాతి తరాలు మారేకొద్దీ గుడిసెల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. ఆపై కూడా, తోటలో విస్తారంగా పెరిగిన భూభాగాన్ని పోల్చి చూస్తే, అందులో వీరి సంఖ్య తక్కువగానే కనబడింది. పరాయి భూభాగాన్ని తమ గుర్తింపుగా మార్చుకుని బ్రతకడం మొదలెట్టిన చాలారోజుల తర్వాత ఒకరోజు గుమ్మస్తా, కందయన్‌ని ఒంటరిగా తీసుకువెళ్ళి, తోపులను యజమాని అమ్మ బోతున్నాడని చెప్పేసి, ఇక్కడ నుంచి మరో చోటుకో లేదా పూర్వీకమైన సొంత ఊళ్ళకో వెళ్ళేందుకు సిద్దమవ్వాలని విన్నవించాడు. ఇన్ని రోజులూ చేసిన శ్రమకుగాను, పెద్ద మొత్తాన్ని ఇవ్వనున్నట్టు చెప్పి బయలుదేరాడు. ఏదో దుర్మరణం నెలకొన్నట్లు అందరూ కొద్దిరోజులు మౌనం వహించారు. ఆపై తలా ఒక దిక్కుకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. కొన్ని కుటుంబాలు పూర్వీకమైన సొంత ఊర్లకు బయలుదేరాయి. చాలా కుటుంబాలు యజమాని ఇచ్చిన ఇళ్ళ కోసమని వ్యాసర్‌పాడి, కాశిమేడు, తిరువట్రియూర్ అని ఉత్తరం దిక్కుగా వలస వెళ్ళసాగారు. సొంతూరి నుంచి మోసుకువచ్చినట్లు మాడన్‌ని తీసుకు వెళ్ళేందుకు ఇప్పుడు ఎవరు సుముఖంగా లేరు.
****
తిరువొట్రియూరుకు వెళ్ళాక కూడా కందయన్ అప్పుడప్పుడు అన్నం కట్టుకుని ఒంటరిగా తోపుకి వచ్చేవాడు. ఇప్పుడు ఎవరెవరి చేతుల్లోనో భూములున్నాయి. మాడన్‌ని మొక్కుకొని తోపుల్లో పురుగులను పట్టుకొని మూటతోటి గబ్బిలాల గుహకి నేరుగా వెళ్ళేవాడేకానీ, దారిలో కనిపించే వారెవరితోను కందయన్ మాటలు కలిపేవాడు కాదు. అప్పు ఇచ్చినవాడు చనిపోయాక కూడా అతని కుటుంబానికి క్రమం తప్పకుండా బాకీ చెల్లిస్తున్నట్లు కందయన్ గబ్బిలాలకి మేత వేసేవాడు.
కందయన్ మాటలు కొరవడ్డాయి. పోషకాలు తగ్గిపోయాయి. త్వరలోనే బరువు తగ్గిపోయాడు. మానసికంగా నెగ్గుకు రాలేక కాలం వెళ్ళబుచ్చేవాడు. ఒకరోజు గబ్బిలాలకి మేత వేస్తున్నప్పుడు, రానున్న శుక్రవారం రోజున గబ్బిలాల గుహను మందు పాతరతో దగ్ధం చేయనున్నట్లు ముగ్గురు యువకులు అతనితో చెప్పేసి వెళ్ళారు. తను బ్రతికిన మహోన్నతమైన జీవితానికి జీవనసాక్ష్యంగా నిలిచిన గుహ దగ్ధం కాబోతుందన్న ఆలోచన కందయన్‌ని కమ్ముకోసాగింది. ఇంటికి తిరిగి వెళ్ళినవాడు నాలుగురోజులు బయట ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ముడుచుకుపోయాడు.
ఐదవరోజు చీకట్లో, చెల్లతాయి పడుకున్నదని నిర్ధారించుకున్నాక అరుగు మీదున్న చేతికర్రను తీసుకొని ఒంటిమీద ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా కందయన్ బయటకు వెళ్ళాడు. గుండెగూడు పైకి పొడుచుకువచ్చి, డొక్కలు ఎండిపోయి, కాండ్రించి ఉమ్మి తోపువైపుకి నడవసాగాడు. చీకట్లో చీకటిని పొదివి పెట్టుకున్నట్లు గుహలోకి వెళ్ళి తను అలవాటుగా వెళ్ళే చోట్లో కూర్చున్నాడు. గబ్బిలాలు అరవసాగాయి. లేత గబ్బిలాలు అతనిపై వాలాయి. ఎడమభుజంపై వాలిన గబ్బిలాన్ని నిమిరాడు. కాసేపట్లో అతడికి చీకటి అలవడింది. గుహ గోడకు తల్లకిందులుగా వేలాడుతున్న గబ్బిలాలు చిన్నచిన్న చీకటి శకలాలుగా నిట్టురుస్తున్నాయి. నీళ్ళు నిలిచిపోయిన గుట్టలో ఫ్రౌఢ కప్పలను పట్టుకోవడం కోసం నాలుగైదు గబ్బిలాలు పైకీ కిందకి ఎగురుతున్నాయి. ఒక గబ్బిలం మాత్రం కాస్త లోతుగా నీటిపై కాలు అదిమేసరికి అది ఎగరలేక నీటిలో పడి కొట్టుమిట్టాడుతున్నది. కందయన్ దానికి సహాయపడేందుకు ప్రయత్నించక దానిని ఊరికినే అలా చూస్తుండిపోయాడు.
తీరం ఒదిగి ఎగరలేక పోతున్న గబ్బిలానికి దగ్గర్లో, ప్రసవ వేదనతో ఆపసోపాలు పడుతూ మరొక గబ్బిలం కంటపడింది. దానిని తన చేతుల్లోకి తీసుకొని దాని కడుపును పరీక్షగా చూశాడు. ఉబ్బిపోయిన కడుపు కిందకి మీదకి కొట్టుకుంటుంది. నొప్పితో ముఖం వాడిపోయి, కళ్ళు సోలిపోయాయి. తన ఎడమ తొడపై దానిని సానుకూలంగా పెట్టుకుని, యోనిని సాగదీసేందుకు ప్రయత్నించాడు. కంత మూసుకుపోయింది. అది గర్జన లాంటి శబ్దం రేకెత్తింది. బలహీనమైన తన వెనుక కాళ్ళతో అది అతడి చేతివేళ్ళను అడ్డుకుంది. కండపట్టును చిక్కించుకునేందుకు పుల్ల లాంటి దాని కాళ్ళను పక్కకు నెట్టి కాస్త బలంగా యోనిని సాగదీశాడు. కడుపులో నుంచి పిల్ల గబ్బిలం కాస్తంత తలయెత్తి చూసింది. తల్లి కళ్ళు మూతలు పడ్డాయి. ఎప్పుడూ గబ్బిలాలపై ప్రేమ ఒలకబోసి, ఏదైనా ఊసులాడే కందయన్ ఇప్పుడు చిన్న శబ్దం కూడా రేకెత్తించకుండా దానితో కుస్తీలు పడుతున్నాడు. ఊపిరి వదిలేందుకు శ్రమ పడుతున్న తల్లి గబ్బిలం యోని నుంచి చేతులు తీసేసి దాని తలను నిమిరాడు. పిల్ల గబ్బిలం తల చూచాయగా బయటకు వచ్చింది. నున్నని చిన్న తల తోటి. దానంతట అదే తన తలతో నెట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. కాసేపు దానిని వినోదంగా చూస్తుండిపోయాడు. ఆపై కందయన్ చేతివేళ్ళతో తల్లి కడుపును దువ్వి చటుక్కున పిల్ల తలను పట్టుకుని బయటకు లాగాడు. తల్లీ, బయటకు వచ్చిన పిల్లా ఒక్కసారిగా అరవసాగాయి. రెండూ ఒకదానినొకటి ప్రేమగా నాక్కున్నాయి. పిల్ల గబ్బిలాన్ని తల్లి గుండెలపై పడుకోపెట్టాడు. తల్లి ఒకట్రెండుసార్లు తలెత్తి చూసింది. ఊపిరి తీసుకోవడానికి అదీంకా శ్రమ పడుతుంది.
కందయన్ చుట్టూ కమ్ముకున్న గబ్బిలాలన్నీ, పిల్ల గబ్బిలం పుట్టిన క్షణం నుండి గుండ్రంగా చక్కర్లు కొడుతూ కీచుకీచుమనేవి. ఆ కీచుకీచుమనే శబ్దంతో గుహ నిండిపోయేది. తల్లి గబ్బిలాన్ని పక్కన పెట్టాడు. పుట్టిన పిల్లని రెండు చేతులతోనూ ఎత్తుకొని కంటి దగ్గరకి తీసుకొచ్చి, ఎత్తుకొని చూసినవాడు కాస్తా, అమాంతం దానిని గుట్టలోకి విసిరేశాడు. ఒక గుదిబండను ఎత్తిపడేసినట్లుంది, చెదిరిన నీటి శబ్దం. గబ్బిలాలు ఏం చేయాలో దిక్కుతోచక వికారంగా శబ్దం రేకెత్తించాయి. గుహ నుండి బయటకు రావడం, లోపలికి పోవడం తమ క్రూర దంతాలను చూపిస్తూ రెక్కలు మొలిచిన పసి తోడేళ్ళలా ఎగురుతున్నాయి. తలవాల్చి కూర్చునున్న కందయన్ ఆరోజు రాత్రి ఆ గుహలోనే ఉండిపోవాలని తీర్మానించుకున్నాడు.
***
II
చిన్నదురై
ఓల్డ్ మహాబలిపురం రోడ్డు పరిసరాలలో ఇప్పుడు యాభై ఐటీ కంపెనీలు, రెండు వందల ఆసుపత్రులు, వంద కాలేజీలు, ఏడు వందల హోటళ్ళు, అరవై బ్యాంకులు, ఒక గల్ఫ్ మైదానం వచ్చాయని, కేవలం చేతివేళ్ళతో లెక్కించదగిన పరిమాణంలోనే అక్కడ కొబ్బరిచెట్లు ఉన్నట్లు చెల్లతాయితో చిన్నదురై చెబితే, ఆమే తనకు అంతక్రితమే చెవులు కుట్టేశారు అంది. గతం గుర్తుగా ఆమె దగ్గర మిగిలింది రాతి అమాందస్తాలో తమలపాకును దంచుకుంటూ, బోసినోరును తెరిచి, కాస్త మందగించిన చూపే. అయితే, బుద్ధి మాత్రం ఇంకా మందగించలేదని అంది. ఆమె నమ్మలేదు. ఆమె మనసులో ఈరోజు వరకు అది అతిపెద్ద కొబ్బరితోట కిందే స్థిరపడిపోయింది.
చిన్నదురై తన ఊరి అమ్మాయి, కందయన్ తాతయ్య వలన మాటలు వచ్చేందుకు కారణమైన వ్యక్తి కూతురు అయినటువంటి అన్నభాగ్యాన్ని పెళ్ళిచేసుకున్నాక, ఓల్డ్ మహాబలిపురం రోడ్డునున్న మేట్టుకుప్పం భారతియార్ వీధిలో కాపురం పెట్టాలనుకున్నప్పుడు అందుకు అతడి ఇంటిలో వ్యతిరేకించారు. అతడికి తన బాల్యకాలపు కలను నిజం చేసుకోవాలని పరితపించే వాంఛ. మిగిలిన వాళ్ళకేమో ఎటువంటి ఆపదా తలెత్తకూడదన్న భయం. అది తనంతట తానే శూన్యానికి పచ్చ జెండా చూపించడం లాంటిదని చెల్లతాయి మొదలుకొని అందరి ఆలోచన కూడా అదే. ఆ క్షణం, తన కుటుంబంలోని ఒక్కగానొక్క ఇంటిపెద్ద, గూని వచ్చిన చెల్లతాయితో, ఆమె మోసుకు తిరుగుతున్న కందయన్ గురించిన కథలను విని తెలుసుకోవడం కోసమే అక్కడ నివాసముండేందుకు పంతం పడుతున్నానని చిన్నదురైకి చెప్పేయాలని ఆశగానే వుంది. ఒకవేళ అలా చెప్పితే గనుక ఖచ్చితంగా అందరూ అతడిని వద్దని వారిస్తారని అనుకున్నాడు. ఆఫీసు నిమిత్తంగా అక్కడ ఉండడమే తగినదని, వాళ్ళకు అర్థం కాని మాటలను చెప్పి ఒప్పించాడు. ఇల్లు చూసుకొని ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు పాలు కాచేందుకు కూడా చెల్లతాయి వచ్చేందుకు నిరాకరించింది. మెల్లమెల్లగా చెల్లతాయిని ఒప్పించి ఇక్కడకు తీసుకురాగలననే ధీమా చెల్లదురైకి ఉండేది.
కాపురానికి వచ్చాక అన్నభాగ్యానికి కూడా ఆ ఇల్లు నచ్చలేదు. చిన్నదురైకి మిగిలిన వాళ్ళందరిలా అది ఇంకొక ఇల్లు మాత్రమేనన్న ఆలోచన ఉండివుంటే కనుక ఇల్లు మార్చాలని అన్నభాగ్యం అన్నపుడే అతడు ఆ విషయం పరిశీలనలోకి తీసుకునే వీలుండేది. దురదృష్టవశాత్తు, అతడి అంతఃప్రేరణ ఆక్రమణకు కట్టుబడి ఉండడంతో ఇటువంటి మాటల సందర్భంలో అతడి సహజ ధోరణి చిద్రమై, మరొక మనిషిగా మారాల్సివస్తుంది. అతడే ఆ కాసేపట్లోనే, ఇంత కటువుగా నడుచుకోవాల్సిన అవసరం లేదని అనుకున్నప్పటికీ, తన ఇష్టాన్ని నిరూపించడానికి బలమైన కారణాలేవి అతడు చెప్పలేకపోయాడు. కనుక ఈ కటువుదనం అతడికి ఒక కవచంగా సహాయపడేది. శాంతంగా తిరిగే అతడి నుండి ఊహించలేనంత స్థాయి కోపం రేకెత్తడం ఎంతో దిగ్బ్రాంతితోను, ఆశ్చర్యంతోను నోరెళ్ళబెట్టి చూసేది అన్నభాగ్యం. ఈ ఒక్క విషయం గురించి మాత్రమే ఆమె అతనితో మాట్లాడలేకపోయేది. తనలో అతడు దాచుంచిన రహస్యాలను కాస్తయినా తెలుసుకోవడం ద్వారా ఏదో ఒకరకంగా అతడికి చేదోడువాదోడుగా ఉండలేమా అనే సదుద్దేశమే ఆమెకు ఉండేది. అయితే, ఎవరి కోసమో తెరుచుకోని రహస్యగదిలా తాళం వేయబడింది. మొండిదైన అన్నభాగ్యం మాత్రం ఈ విషయంలో తనని తానొక మౌనిగా మార్చుకునేందుకు వెనకాడలేదు.
ఈ మేట్టుకుప్పం భారతియార్ వీధి బహుశా ఒక చేతబడులు చేసేవాడిచేత నిర్మించబడుంటుందేమోనన్న అనుకునేది అన్నభాగ్యం. కంటికి కనిపించని ఒక మాయతెరలో వగర్చేంతగా ఇంటిని పొదివికున్నట్లు అన్నభాగ్యానికి తరచూ అనిపించేది. సాయంత్రం కాగానే కిటికీ తలుపులన్నిటిని తెరిచి ఉంచినప్పటికీ ఇంటిలో గాలి ఆడేది కాదు. అందువలన, ఎప్పుడూ రుసురుసలాడేది. తూర్పు దిక్కుగా కిటికీ లేనటువంటి ఆ గోడ ఆమెను మరింత చికాకు పెట్టేది. భయంకరమైన ఎండాకాలంలో కూడా సాయంత్రమవ్వగానే దోమలకు భయపడి తలుపులు మూసేయడంతో కళ్ళు మంటలు పుట్టే వేడి ఎప్పుడూ ఇంట్లో రగులుతుండేది. తలుపు తెరిచి బయటకు ఒక అడుగువేస్తే చాలు చల్లగాలి ముఖాన వీచేది. ఈ ఒక్క అడుగు జాగాలో శూన్యం అలముకున్నట్లు భావించేది. ఇలా సెగ ఏదో ఒక రకంగా తన సంతోషాన్ని నాశనం చేస్తుందని ఆమె అనుకునేది. ఎండ దహించే పగటి ఏకాంతవాసం ఆమెను మర్మమైన ఆలోచనల దిక్కుగా మాత్రమే మళ్ళించేది. అందువలన అన్నభాగ్యానికి ఈ ఇల్లు నచ్చదు. ఈ ఇంటి హోరెత్తే వేకువను అసహ్యించుకునేది. మహానగరంగా ఈ చోటు రూపుదిద్దుకున్నప్పటికీ గ్రామానికి ఉండే లక్షణమేదో కొంచెం అయినా మిగుల్చుకుంది. అయినప్పటికీ, ఒక రోజులో అనేక సార్లు అన్నభాగ్యం ఒంటరిగానే గడపాల్సి వచ్చేది. అందువలన ఆమె ముఖం తన సౌందర్యమంతటిని కోల్పోయి ఉండేది. ఆమె రోజువారీ నిత్యవసరాలైన పాలు, కాయగూరలు, చేపలు, మాంసం వీధిలోకి వచ్చేవి. గొంతు వినపడగానే ఒక తాడుకి పాత్రను కట్టి కిందకు వదిలేది. ఆమెకు సంబంధించినంతవరకు ఆ ఇల్లు గాలిలో మెదిలే విషయాల్లో ఒకటి. బయటకు రావలసిన అవసరం ఆమెకు ఏమాత్రం ఉండేది కాదు. అడుక్కోవడానికి కూడా ఎవరు కనీసం ఆ ఇంటి తలుపు తట్టేవారు కాదు.
అన్నభాగ్యం గర్భం ధరించాక ఆమెలో కనికరం కనుమరుగై దాని స్థానంలో హింసాత్మక గుణం బయటకొచ్చింది. ఆమె కోపానికి గురయ్యేది గాలికి టపటపమని కొట్టుకునే కిటికీ తలుపులు అయ్యుండవచ్చు. తమ హఠాత్తు రాకతో ఆమెను భయం గొలిపే బల్లుల కోసమైనా అయ్యుండవచ్చు. రాత్రిల్లో లేచి నీళ్ళు తాగేందుకు వెళ్ళేటప్పుడు అడ్డంగా పరుగులు తీసే ఒకట్రెండు బల్లులను చూసి, భయంలో కేకలువేసి, నిద్రలోంచి లేచి వచ్చే చిన్నదురై దీనిని ఎలా ప్రతిఘటించబోతున్నాడో అని తలుచుకుని, సంకోచంతో ఆచోట్లోనే నిలబడి ఎదురుచూసేది. కడుపుతో ఉన్నామే భయపడకూడదన్నది చిన్నదురై జారీ చేసిన మొదటి ఆజ్ఞ. ప్రతిసారి దానిని అతిక్రమించేటప్పుడు చిన్నదురై కోపగించుకోవడాన్ని, వాడిన ముఖంతో గప్చిప్‌గా మౌనంగా వింటూ నిలబడేది. అయితే, బల్లులను చంపమని ఆమె బలవంతం పెడితే అతడి కోపం మరో రూపం దాల్చేది. ఇటువంటి సమయాల్లో నోట్లో గొణుగుతూ అక్కడ నుంచి అమాంతం తప్పుకునేది.
ఆ గాలిలో మెదిలే ఇంట్లో వాళ్ళిద్దరూ కొట్టి చంపిన దోమలే బల్లులకు ప్రధాన ఆహారం. సాధారణంగా సాలీడు వలల పక్కనే బల్లులు కావలి కాస్తాయి. వలలో అరుదుగా చిక్కుకున్న పురుగులను పట్టుకునేందుకు వెళ్ళే తన కాళ్ళతో సాలెగూడును లాగుతూ అడ్డదిడ్డంగా తచ్చాడుతుంది. ప్రతిసారి వంటగదిలోకి వెళ్ళేటప్పుడు అడ్డంగా పరుగులు తీసి భయపెట్టే బల్లులను చూసి అన్నభాగ్యం అవాక్కయ్యేది. ప్రతిసారి ఆమె నిజంగానే భయపడిపోయేది. ఆ ఒక క్షణంలో ఆమె ఎదసడి వేగం పుంజుకునేది. మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు బల్లులు ఏవైనా గోడమీద కనబడితే వాటిని ఒక కంట కనిపెట్టేది. ఒక క్షణం చూపు మరల్చి తిరిగి చూసేసరికి తటాలున జరిగి కనబడకుండా పోయేది. (బల్లిని అన్నభాగ్యం చూస్తున్నట్లు, బల్లి కూడా ఆమెను చూసేది.)
చీకటి పడగానే బొద్దింకలు దండెత్తేవి. బొద్దింకలు ఫలానాచోట్లో, ఫలానా సమయానికి వస్తాయని ఆమెకు బాగానే తెలుసు. మెల్ల మెల్లగా బొద్దింకలను ఒక్కర్తే చంపి నాశనం చేసింది. బొద్దింకల గురించిన ఆలోచన ఆమె మనసు నుంచి చెరిగిపోయి, ఎన్నో ఏళ్ళు గడిచాక బలిసిన, వయసు మళ్ళిన బొద్దింక ఒకటి మళ్ళీ రాసాగింది. దానిని చంపాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె చూపు నుండి తప్పుకునే సామర్థ్యం దానికి ఉండేది. రోజూ చీకటి పడగానే స్నానాలగదిలో తిరగడం ఆ వయసు మళ్ళిన ఒక్కగానొక్క బొద్దింకకు రివాజు. దాని నడవడికలో రోజురోజుకి మూర్ఖత్వం పెరుగుతున్నట్లు ఆమెకు అనిపించింది. ఆరంభంలో దీపాన్ని వెలగనిచ్చి ఆమె లోపలికి రాగానే కాళ్ళను చుట్టి రాసాగింది. నీళ్ళు పట్టుకొని దాని మీద జల్లి దారి మార్చేది. అది ఊపిరి సలపక పరుగులు పెట్టేది. ఒకరోజు ఆమె కాళ్ళ మీదకు ఎక్కి మడమపై పాకింది. అప్రయత్నంగా ఆమె పొత్తికడుపును పట్టుకొని కాలును విదిలించడంతో బొద్దింక తొక్కివేయబడి బొక్క బోర్లా పడింది. మంకుపట్టు పట్టే పసిపిల్లాడిలా కాళ్ళాడించడం చూసింది. ఆమె కాస్త సహాయపడితే తప్పించుకొని పరుగులు తీసేదే. అయితే, ఆమె ఆలోచన మరొక దిశగా సాగింది. ఎక్కడివి అక్కడ వదిలేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళింది.
దాదాపు మూడుగంటల తర్వాత చిన్నదురై వచ్చాక, వాడిపోయిన ముఖంతోనూ, రెప్పవాల్చని చూపుతోనూ, కన్నీరు కారుస్తూ కూర్చునున్న అన్నభాగ్యాన్ని చూడగానే అతడు కంగారుపడ్డాడు. దూకడం వలన తన బిడ్డకు ఏమైనా అయ్యుంటుందేమోనన్న భయం ఆమెను తొలిచేసింది. ఒక హెచ్చరికలా, అదే సమయంలో వినమ్రత నిండిన గొంతుతో, ఆమెను అనునయిస్తున్నట్లు అనుకుని ఆమెను ఊరడించి స్నానాలగదికి వెళ్ళాడు. ఇది ఒక సాధారణ విషయమన్నట్లు అతడు మాట్లాడటం ఆమెను మరింత బాధించింది.
***
అన్నభాగ్యం కాన్పు కోసమని ఆమె పుట్టింటికి వెళ్ళడంతో చిన్నదురైకి ఏకాంతవాసం సాధ్యపడింది. పుట్టిన ఇన్నేళ్ళలో ఒంటరిగా ఉండడం ఇదే మొదటిసారి. వెంట ఉంటానని చెప్పిన కోసలైని పట్టుపట్టి వద్దని వారించే ఈ మొరటుతనాన్ని ఏది పట్టి ఆడిస్తుందని ఆలోచించసాగాడు. ఒక దీర్ఘ నిర్ణయానికి రాలేకపోయాడు. ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు అతడిని ఏటేటో తీసుకువెళ్ళి అలసిపోయేలా చేశాయి.
అది ఒక కనికరం లేని వేసవికాలం. అందువలన పని ముగించుకుని ఇంటికి రాగానే బాల్కనీలోగానీ, డాబా మీదగానీ నిలబడటం చిన్నదురైకి అలవడింది. అన్నభాగ్యం ఎప్పుడు మూసి వుంచే తలుపులకు ఇప్పుడు మంచిరోజులు వచ్చాయి. ఊరిని కాలక్షేపం కోసం చూడడం చిన్నదురైకి కొత్తగా అలవాటయింది. సెలవురోజుల్లో గాలివాటుగా తిరిగి, పాత మనుషులను విచారించేవాడు. వాళ్ళెవ్వరికీ కందయన్ గురించి తెలియలేదు. ఇక్కడ ఒక తోపు ఉన్నదన్నదే అక్కడ కొంతమందికే తెలుసు. దానిని చూచాయగా గుర్తు చేసేందుకు గల్ఫ్ మైదానం ఉంది. పెంకుల ఇల్లు, కొబ్బరాకు గుడిసెలు, మిద్దెఇల్లులు అని కొత్త కొత్తగా మొలకెత్తాయి. కట్టింది పోనూ మిగిలిన చోట్లో మిగిలిన వయ్యారమైన కొబ్బరి చెట్లను చాలావరకు ఎవరు ఏం చేయలేదు. అవి ఏదోకరకంగా తమకి ఉపయోగ పడుతున్నాయన్న స్వార్థం అందులో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో గతానికి సాక్ష్యంగా ఆ కొబ్బరిచెట్లు నిలిచాయి. ఇళ్ళకు మధ్యమధ్యలో కదలాడుతున్న కొబ్బరిచెట్లను చూస్తున్నప్పుడు ఒకానొకకాలంలో ఇక్కడే బ్రతికిన కందయన్ సమూహం, చిన్నదురై కంటిముందుకు వచ్చాయి. కొత్తగా లేచిన కట్టడాలను స్వాధీనం చేసుకుని, పాత భూభాగపు బ్రహ్మాండాన్ని మనోదృష్టితో ఊహించుకుని చూసేవాడు. ఎంతో ఊహాత్మకంగా అత్యంత పెద్ద తోపు అతడి మనోనేత్రంలో వికసించడం అతడిని పరవశానికి లోనుచేసేది. లోలోపల పేరుకుపోయిన హృదయాంతరంలోని ఆలోచనలు ఇప్పుడు మళ్ళీ జీవం పోసుకుని రెట్టింపు అయ్యాయి. ఏకాంతం కూడా కళ్ళ ముందు విరిసే బ్రహ్మాండమైన తోపు చిత్రాలు అతడిని గతంలోకి తీసుకువెళ్ళాయి.
అక్కడ ఒంటిగా నిలిచిన ఆ ఒక్కగానొక్క తాటి చెట్టుకిందే కందయన్ గుడిసె ఉండి ఉండవచ్చునని అనుకునేవాడు. కందయన్ ఈ దారి గుండానే కాలినడకన వెళ్ళుండవచ్చునని అనుకునేవాడు. అదిగో అక్కడ సుడలైమాడన్ గుడి వుంది. ఇదిగో ఇక్కడ కంచెలు ఉన్నాయి. ఇలా రెండు కాలాలలో ప్రయాణించేవాడు. ప్రతిరాత్రి పదే పదే ఒకే దృశ్యాలను పలురకాలుగా ఊహించుకునేవాడు. రోజురోజుకీ అతడు ఊహించుకొని చూసే ప్రదేశాలు స్థలమార్పిడి జరిగుండేది.
రోజురోజుకి ఊహల చివరిలో అలసి, బడలికతో పడుకునేటప్పుడు, కూలబడేటప్పుడు ఎంతో భారంగా అనుకునేవాడు. తనను వేదిస్తున్న ఈ ఆలోచనలను, కలలను, కల్పనలను, ఆపేయాలని కూడా అతడు కొన్నిసార్లు అనుకునేవాడు. ఈ కల్పనాత్మక ప్రయాణాలు కొన్నిసమయాలలో అతడిని నీరుగార్చేవి. అయితే ఉదయం లేచి, చొంగ కారుతున్న ముఖంతో తలుపు తెరిస్తే, అతని ఎదుట కదిలే కొబ్బరాకులు అతడి వాడిపోయిన కలలకు మళ్ళీ జీవం పోసేవి.
***
బాల్కనీలో నిలబడి చిన్నదురై వినోదం చూస్తున్న సాయంత్రం వేళలో చక్కెర్లు కొడుతూ అతని కుడివైపు నుండి ఎడమవైపుకు ఒక గబ్బిలం ఎగిరి వెళ్ళింది. అతడు దానిని తొంగిచూసినప్పుడు అది అతడి కంటపడలేదు. రెండు క్షణాలలో మళ్ళీ దాటుకుని వెళ్ళింది. మళ్ళీ మళ్ళీ అది అదే క్రమబద్ధమైన విరామాలలో అత్యంత వేగంగా శపించబడిన బట్టబయలులో చక్కర్లు కొడుతుంది. చిన్నదురై ఈ ఇంటికి వచ్చిన ఇన్ని నెలల్లో ఒక గబ్బిలాన్నీ చూడడం ఇదే మొదటిసారి. తూనీగలను, సీతాకోకచిలుకలను కూడా అతడు ఇక్కడ చూసెరుగడు. వర్షాకాలంలో కప్పల బెకబెకలు కూడా వినబడింది లేదు.
అతడి పిన్ని ఇంటికి దక్షిణాన ఒక చిన్న గుహ ఉండేది. వర్షాకాలంలో మాత్రం అక్కడ గబ్బిలాలు నివసించేవి. ఒకసారి నలుగురు అయిదుగురు చిన్న పిల్లలతో చేతిలో కాగడాతో ఆ గుహలోకి ప్రవేశించాడు. కాగడాతో లోపలికి వెళ్ళగానే, పెనుతుఫానులో కొట్టుకుపోయే ఎండుటాకుల్లా గబ్బిలాలు వాళ్ళను దాటుకుని బయటకు వెళ్ళాయి. అప్పుడు అవి రేకెత్తించిన కీచ్ కీచ్‌మనే శబ్దాలను ఇప్పుడు ఒకసారి అతడు మళ్ళీ తలుచుకుని చూశాడు. దానికి తోడు కందయన్ చిత్రం ఒక పెనుశోకంగా అతడిని ఆవహించింది.
అత్యంత చిన్నదైనా ఆ ఏకైక గబ్బిలాన్ని కాలక్షేపంగా చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు. ఎక్కడెక్కడో సంచరించి, తన గూటిని తెలుసుకోలేక నిర్ధాక్షిణ్యమైన శూన్యపు బట్టబయలులో అది పరితపిస్తున్నట్లు అతడికి అనిపించింది. కాసేపట్లో అతడివైపుకు ఎగురుకుంటూ వచ్చిన ఆ గబ్బిలం అతడి తలపైన వేలాడుతున్న బుడ్డి బల్బుపై వచ్చి వాలింది. ఆ బుడ్డి బల్బును ఆనుకొనున్న హోల్డర్ కాస్త పక్కకి జరిగుండడం వలన అక్కడ చిన్న కన్నం ఉంది. ఆ కన్నంలో తనను దూర్చుకునేందుకు ప్రయత్నించింది. బీకరంగా వినిపిస్తున్న కుక్కల అరుపులు వినిపించిన దిక్కుగా చూశాడు. చేతిలో చిన్న పొట్లంతో నడిచినవాడి కుడి ఎడమలవైపు మొరుగుతూ, అవి అతడిని వెంబడించాయి. తిరిగి గబ్బిలాన్ని తొంగి చూస్తే అది చీకట్లో చీకటిగా కలిసిపోయింది.
ముందొకరోజు ఇంటి మొదట్లోని తలుపుకు కాస్త పక్కగా పెద్దగుట్టగా గొద్దులు పేరుకుపోయి వున్నప్పుడు అన్నభాగ్యం పిలవడం గుర్తుకువచ్చింది. ప్రతిరోజూ ఉదయం పేరుకుపోయిన ఆ గుట్టను ఎత్తేటప్పుడు అన్నభాగ్యం చిరాకుపడేది. బుడ్డి బల్బు వెలుగుకి వచ్చే తక్కువ సంఖ్యలోని పురుగుల కోసం బల్లులు వాటిని ఆవరించుకుని ఉండడం చిన్నదురై, అన్నభాగ్యం గమనించడం వలన అవి బల్లుల గొద్దులు అనే అనుకునేవాళ్ళు. అవి ఏమిటని తెలియక శుభ్రంగా ఊడ్చి యెత్తేవాళ్ళు. అన్నభాగ్యం వెళ్ళాక ఇన్ని రోజులు వాటిని ఊడ్చి యెత్తింది చిన్నదురైనే. అయితే, అవి గబ్బిలం గొద్దులని అతనికి ఇన్ని రోజులుగా తెలియదు. ఆ కన్నంలోనే ఆ గబ్బిలం రాత్రి అవ్వగానే శరణు పొందేదని గుర్తుచేసిన గబ్బిలం అతడి మనసును ఆక్రమించుకోసాగింది. ఆరోజు నుండి ప్రతిరాత్రి బట్టబయలులో చక్కర్లు కొట్టే ఒకగానొక్క గబ్బిలాన్ని కాలక్షేపంగా చూడటం అలవర్చుకున్నాడు.
నిద్ర పట్టక బయటకు వచ్చి నిలబడ్డ ఒక అర్ధరాత్రివేళలో గబ్బిలాన్ని దగ్గరగా చూడాలన్న ఆశతో ఒక చెక్కకుర్చీని వేసుకుని టార్చ్‌లైట్ వెలుతురులో దానిని పరిశీలనగా చూశాడు. అది ఆ చిన్న రంధ్రంలోకి తనను కుచించుకుంది. వెలుతురు పడగానే బెదిరిపోయిన దాని చూపు అతడిని భయపెట్టింది. మరేదైనా గబ్బిలం దానితోపాటు ఉందేమోనని వెతికి చూశాడు. ఆపై చిన్న చీపురుపుల్లను తీసుకువచ్చి దానిమీద మెల్లగా గుచ్చేసరికి చటుక్కున కిందకు దిగి అతడిని రాసుకుని ఎగిరిపోయింది.
ఎగిరి వెళ్ళిపోయిన గబ్బిలం మళ్ళీ దాని గూటిని చేరుకోవడం కోసం ఎదురుచూశాడు. గబ్బిలాన్ని తరిమిన అపరాధభావం ఒకవైపు అతడిని వేదిస్తుంది. ఎంతోసేపు ఎదురుచూశాడు. అది తిరిగి వచ్చిన దాఖలా లేదు. ఆపై ఆ సుదీర్ఘమైన ఎదురుచూపుకి సెలవు చెప్పి నిద్రకు ఉపక్రమించాడు. పెందలాడనే లేచి తలుపు తెరిచి చూస్తే వాకిట్లో గొద్దులున్నాయి.
***
చిన్నదురైకి ఆడపిల్ల పుట్టింది. ఇంటికి తిరిగివచ్చిన అన్నభాగ్యం ఉక్కపోత ఉద్రిక్తమైన ఒక ముందురోజు రాత్రివేళలో తన కూతురికి పాలు తాపుతూ వుంది. ఆమే, పసిబిడ్డా ఒంటరిగానే ఉన్నారు. ఎడమ రొమ్మును చప్పరిస్తూనే లేతవేళ్ళు ఆమె చెంపలను నిమిరాయి. పసిబిడ్డ పెదవంచున చిందే పాలబొట్లను మధ్యమధ్యలో తుడుస్తుంది. బుగ్గలను నిమిరే లేతవేళ్ళలో ఆమె బొటనవేలును దూర్చింది. ఆ క్షణంలో అక్కడికక్కడే తన్మయత్వానికి లోనయ్యింది. అయితే, ఈ తన్మయత్వం ఆమెకు ఎక్కువసేపు నిలువలేదు. ట్యూబ్‌లైట్ వెలుతురుకి అడ్డుపడుతున్నట్టు ఒక నీడ ఆమెను దాటి వెళ్ళడం చూడగానే కేకలు పెట్టి, బిడ్డను ఎత్తుకొని బయటకు పరుగులు తీసింది.
ఇంట్లోకి గబ్బిలం చొరబడింది.
తెరుచుకునున్న రొమ్ముతో కూతురిని హత్తుకొని కిటికీలోనుంచి లోపలికి తొంగిచూసింది. గోడమూలలో, గోడతోపాటు గోడగా ఆ గబ్బిలం అంటుకుపోయింది. ఆమెను కంగారు ఆవహించింది. ఒకవైపు గబ్బిలాన్ని చూస్తూనే మరొకవైపు ఏడుస్తున్న పసిబిడ్డను జోకొడుతుంది. కంగారు తగ్గిన పాపాన లేదు. చుట్టుపక్కల అటు ఇటు ఎగాదిగా చూసి ఆమె ఇల్లు తప్ప మిగిలిన ఇళ్ళన్నీ మాయమయ్యి తనొక ఒంటరిదీవిలో నిలబడినటువంటి భ్రమ. గబ్బిలం ఎగిరేందుకు ప్రయత్నిస్తే ఫ్యానుకు తగులుకొని చిన్నాభిన్నమయ్యే అవకాశముందన్న ఆలోచన రాగానే, పసిబిడ్డను గుండెలకు హత్తుకుని లోపలికి వెళ్ళి ఫ్యానును ఆపేసి, చటుకున్న మళ్ళీ కిటికీ దగ్గరికు వచ్చి నిలబడింది. మూలన అంటుకొనున్న గబ్బిలం ఆ చోట్లో నుండి కదలలేదు. ఆమె కూడా నుంచున్న చోటు నుంచి కదిలేలా లేదు. చిన్నదురై తిరిగి వచ్చేవరకు ఎదురుచూసేందుకు తీర్మానించుకున్నదానిలా గబ్బిలం తన చూపు నుండి తప్పుకోనంతగా, దానిపై ఎత్తిన కళ్ళు దించకుండా చూస్తూవుంది.
***
చిన్నదురై గబ్బిలాన్ని తరిమేందుకు సిద్ధమయ్యాడు. ముఖాన్ని తుండు గుడ్డతో మూసుకున్నాడు. ప్లాస్టిక్ సంచిలోకి చేతిని దూర్చుకొని గబ్బిలాన్ని పట్టుకునేందుకు వెళ్ళాడు. దగ్గరకు రావడం గుర్తించిన గబ్బిలం అమాంతం ఎగిరివెళ్ళి ఎదురుగానున్న గోడపైకెళ్ళి అంటుకుపోయింది. తాళం వేసిన గదిలో నుంచే ఏడుస్తూనే అన్నభాగ్యం తీసే ఆరాలకి సమాధానం ఇవ్వకుండా గబ్బిలంతో కుస్తీ కట్టాడు చిన్నదురై. తెరిచి ఉంచిన తలుపు ద్వారా దానిని ఎగిరేలా చేసేందుకు అతడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఆ చిన్న ఒక్కగానొక్క గదిలో అటు ఇటు చోటు మారుస్తుంది. సహనం కోల్పోయినవాడిలా చీపురుపుల్లలను తీసుకువచ్చి దూరంగా నిలబడి దానిపై విసిరాడు. గురి తప్పలేదు. గబ్బిలం పట్టుతప్పి కిందపడింది. కాళ్ళూచేతులను మడిచి తన శరీరాన్ని అడ్డంగా కుచించుకుంది. నల్లదుప్పటిని కప్పుకొని తల మాత్రమే కనబడేలా వాల్చి, ఒక మనిషి కూర్చున్నట్లుగా వుంది. బాల్యంలో, రాత్రిళ్ళలో గబ్బిలాలను చూసి అతడు పరవశానికి లోనయ్యేటప్పుడు అది కందయనే అని చెల్లతాయి చెప్పినమాట ఇప్పుడు గుర్తుకువచ్చి హింసించింది. మనసు బరువెక్కింది. గబ్బిలం తన శరీరాన్ని వదులు చేసుకోవడం చూడగానే చీపురుకట్టను తీసుకువచ్చి గబ్బిలాన్ని పారిపోనివ్వకుండా దానిని నొక్కిపట్టుకుని వాకిట్లోకి నేలపై అటు నుంచి అటు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. గుమ్మానికి అవతల దానిని తోసెయ్యగానే తలుపు మూసుకున్నాడు.
ఫ్యానులేని, ఉక్క పోస్తున్న గదిలో జరిగిన పోరాటంలో అతడికి తీవ్రంగా చమటలు పోసాయి. గుండె కూడా బరువెక్కింది. లోపల గది తలుపు తెరిచి, అన్నభాగ్యాన్ని హత్తుకున్నాడు. ఆమె మళ్ళీ వెక్కివెక్కి ఏడవసాగింది. ఏడుపు మధ్యలో, కంతను మూసేయమని బలవంత పెట్టసాగింది. అతడు దానికి ఒప్పుకున్నాకే ఆమె ఏడుపు సద్దుమణిగింది.
పరిస్థితులు చక్కదిద్దుకున్నాక కాసేపటి తర్వాత అన్నభాగ్యాన్నీ, బిడ్డని పడుకోబెట్టి బయటకు వచ్చి కంతను చూశాడు. ఖాళీగా ఉంది. చెక్కకుర్చీని బయటికి తీసుకొచ్చి వేసి, కంతను మూసేందుకు తయారయ్యాడు. బుడ్డి బల్బు హోల్డర్‌ని, ఆ కంతను మూసేలా అడ్డంపెట్టి వచ్చి పడుకున్నాడు. చాలాసేపు అతనికి నిద్రపట్టలేదు. భార్యాబిడ్డలు కొట్టిపడేసినట్లు మగతగా పడుకొనున్నారు. ఉదయం లేవగానే చెల్లతాయిని శకునం అడగాలని అనుకున్నాడు. సెలవు తీసుకుని, దిష్టి తీయించుకుని రావాలని అతడిలో ఏవేవో ఆలోచనలు పరుగులు తీసాయి. దానికితోడు ఆ గబ్బిలం గురించిన ఆలోచన అతడిని వేధించింది.
లేచి వచ్చి శబ్దం రేకెత్తించకుండా తలుపు తెరిచి బయటకు వెళ్ళాడు. మెల్లగా తలుపు మూసేసి బట్టబయలులో చూపు నిలిపాడు. గాలికి కొబ్బరాకులు మెల్లగా కదులుతున్నాయి. వీధి దీపాల కింద కుక్కలు పడుకునున్నాయి. అతడు రెప్పవాల్చకుండా వాటినే చూస్తున్నాడు.
అప్పుడు అమాంతం ఆ గబ్బిలాల కీచుమనే శబ్దం వినిపించింది.
వణుకుతున్న శరీరంతో తొంగి చూశాడు. నల్లని ఆకారం, అతడికి అక్కడ గబ్బిలమున్న భ్రమ కలిగించగానే, వెనువెంటనే లోపలికి వెళ్ళి టార్చ్‌లైట్‌తో పరుగున వచ్చాడు. బుడ్డి బల్బుపై గబ్బిలం వేలాడుతుంది. గబ్బిలం ఆ బుడ్డిబల్బును గట్టిగా హత్తుకుంది. మళ్ళీ దాని కీచుమనే శబ్దం. ఆ శబ్ధం అతడిని హింసించింది. మళ్ళీ టార్చ్ వేసుకొని చూశాడు. అది భయంతో తల్లడిల్లుతున్నట్లు, గూడు కోల్పోయి పరితపిస్తున్నట్లు ఏదేదో తలుచుకొని తనని తాను హింసించుకున్నాడు. చీపురుకట్టను తీసి దానిమీద విసరడం, దానితో నొక్కి ఈడ్చుకు వెళ్ళి వాకిట్లోకి నెట్టడం అతడికి గుర్తుకురాగానే, దానికి ఏమైనా దెబ్బలు తగులుంటాయేమోనని ఎడమవైపుకు జరిగి పరీక్షగా చూశాడు; అత్యంత చిన్నదైన తోడేలు లాంటి ముఖం, దెబ్బతిన్న కుక్కలాంటి కళ్ళు, కండలు వడలిపోయిన తన అవ్వలాంటి శరీరం. మూసిన గొడుగులా చురుకైన రెక్కలు. దాని పొత్తికడుపు ఉబ్బెత్తుగా ఉంది.
***
