అస్తిత్వనదం ఆవలి తీరాన

Spread the love

“అసుర సంధ్య వేళ!
ఆంజనేయుడి గుడి వారన!!”

* * *

తను ఇల్లు విడిచిన నాటినుండి- ఇటువంటి అలంకారిక భాషలో- వింతవింత ప్రాస వాక్యాలు ఏదో ఒక మలుపులో వినబడుతూనే వున్నవి. తురీయావస్థలో వున్న మహాయోగులు ఓంకార నాదాన్ని నిరవధికంగా వింటూనే వుంటారట. కాని తనకు ఆధ్యాత్మిక చైతన్యావనికి అల్లంత దూరంలో గూడాలేని తనకు ఈ మధుర గీతాలెందుకు తడుతున్నవో విస్మయంగానే వున్నది. అవి నిజానికి తన అంతర్గత ప్రతిధ్వనులేనని ఎవరు చెబుతారు? ఇవి జ్వాలా రాగాల మధ్య తుషార గానాలని తనకెప్పుడూ తోచనూ లేదు.

అయినా ఆకలి వేస్తూనే వున్నది. గోడనానుకోకుండానే మట్టి అరుగు మీద పద్మాసనం వేసి, ఏ గురువు వద్దా నేర్వని- పూర్వక, కుంభక, రేచక ప్రాణాయామ ప్రక్రియకు పూనుకొన్నాడు. తాదాత్మ్యం కుదరదు. సమాధి స్థితిగా అనుభూతి కలగటం లేదు. కారణం- తన ఎదుట నిలిచిన బుంగమీసాల గద్దింపు.

“ఏందయ్యో బైరాగాయనా! గట్టిగా జల్లు బడితే ఆ సవిటి గోడ కూలి నీ తల పగులుద్ది. ఊరి బయట అంత పెద్ద సత్తరం వుంటే మా అరుగే, దొరికిందటయ్యా. ఏందా ఏసం? పిల్లలు దడుసుకుంటారు-పో-పో”.

పొమ్మనటం మీసాలవాళ్ళ హక్కు ఈ పల్లెటూళ్ళలో అనుకొన్నాడు తను.

            మారుమాటాడకుండా లేచి నిలుచున్నాడు. ధూళి దూసరమైన పైజమాను దులుపుకోనూ లేదు. రోజుకొక రంగు మారుతున్న కాషాయ బనియన్నూ సర్దుకోలేదు.

            నల్లగా, దట్టంగా వాలిన గడ్డాన్ని గాని, గుబురుగా భుజాల మీద వేళ్లాడుతున్న గిరిజాల జుట్టును గాని స్పృశించలేదు. సంచీని కుడిభుజానికి తగిలించుకొంటూ ఆకసంకేసి చూచాడు. చరమ సూర్యకాంతి ఒక స్వాంతన వచనం పలికినట్లయింది. అప్పటికి ఆకలి తెరలు అంతరించాయేమో, అడుగులు తడబడటం లేదు. ఇటువంటి అవమాన శరాఘాతాలను ఇన్ని నెలల నుండి నెట్టివేయటం లేదా? ఏ అవమానజ్వాల వద్దా తన ప్రస్థానం ఆగిపోలేదు గదా. తన మౌన, ఉనికీ, వేషం- బూచాడు గానో తస్కర చక్రవర్తిగానో- లోకానికి గోచరించటంలో వింతేమైనా వుందా? నిర్వైరి సర్వ భూతేషు- తనకు ఏ జీవితోనూ విరోధం లేదు. మీసాల ఆసామి తుష్కార భాషలో-బైరాగి- అన్నపదం ఒక బిరుదు! అప్రియంగా తోచలేదు.

            ఇన్నాళ్ళూ తనకొక నామధేయం లేదు. చిరునామాలేని చరిత్రహీనుడిగా నిర్లక్ష్య వీక్షణాల వీధుల్లో జనసమ్మర్థం వున్నా ఎండమావుల ఎడారిలాగా తోచిన పట్టణ రాజబాటల్లో, ప్రియమైన పిలుపులేక, అగమ్య వృత్తాల్లో సుళ్ళు తిరుగుతూ, కాలికి గుచ్చుకొన్న కంటకాల నేరుకొంటూ అలసిపోయిన సామాన్య బాటసారి. ఇల్లు వెడలినప్పుడు తనకు తాను- సాధు, సన్యాసి, శ్రమణుడు, దమనుడు, సంత్, శాంత్, పరివ్రాజకుడు, పరమహంస అనుకోలేదుకదా. ఇప్పుడు తనకొక వ్యక్తిత్వం. నీడ నుంచి బయటపడిన నిజరూపంగా, జానపదమైనా ఇదొక మార్మిక విలాసం- బైరాగి, వైరాగి, విరాగి- ఏ పదమైతేనేం. ఒక గుర్తింపు, ఒక పలకరింపు వేదింపు కాదు గదా. బాటపక్కన బురదలో శాపగ్రస్తమై పడివున్న ఒక శిల, ఒకరూప రహితపాషాణం ఒక రహస్యనాదంతో ఒక వేదసూక్త పంక్తితో తన చిరకాల వేదనను వదల్చుకొని ఒక ఆలయ శిల్పంగా రూపొందుకొన్న అమృత క్షణం ఇది. ఒక దీర్ఘనిశ్వాసం వెలువడింది. పాతాళలోకాల నుండి కాదు, ఊర్ధ్వలోకాల వెలుగులోయల నుండి. ఓ… ఓ… బైరాగీ- ఓ విరాగీ! ఎందుకో- కృతజ్ఞతతో మీసాల మనిషికై వెనుదిరిగి చూచాడు. ఈ కనబడ్డ వ్యక్తి వేరు. వీనికి మీసాలతో పాటు వదరుబోతుతనం గూడా ఆభరణంగా కన్పిస్తున్నది.

“కాలగ్గానంలో బెమ్మంగారు పాట పాడ్లేదా- కలీగంలో దొంగ సన్నాసులు పుట్టలు పుట్టలుగా లేస్తారంట. దొంగెవడో దొరవడో. కొత్తపేటలో సన్నాసాయనకు కాష్టం ముట్టిచ్చినా మడిసికి మంట తగలదంట ఈ బైరాగాళ్ల గొడవతో చెడ్డ సికాకు” అని తనను చూపుతూ ఇంకో బట్టతలాయనకు తనకొచ్చిన కష్టాన్ని వెల్లడించుకొంటున్నాడు. తను ఆగలేదు.

            గ్రామ పొలిమేర చేరుతుండగా పెద్ద చెరువు. ఒడ్డున ఒక గిలకల బావి. బావి వెనకనే బ్రహ్మాండమైన మర్రిచెట్టు. దాని వెనకనే మసక వెలుగులో- “చీదెళ్ల హనుమాండ్లు శ్రేష్ఠిగారి పెంపుడు జనని నాగరత్నమ్మ గారి ధర్మసత్రం”- అర్థ చంద్రాకారంగా పెద్ద ఫలకం.

            చెరువులో ముడుచుకుపోయిన తామరపూలు ఒత్తుగా వుండటం గుర్తించాడు. అప్పటిదాకా అదృశ్యంగా వున్న మేఘ మాలికలు సంధ్యాకాశాన్ని కమ్మివేస్తున్నవి. పైన ఒకటో రెండో నక్షత్రాలు. ఇదేదో అంతర్ముఖ విశ్రాంతలోకం. తనొక యోగ భూమిలో ప్రవేశిస్తున్నట్లుగా బైరాగికి తనువెల్లా కంపించింది.

2

బైరాగి మఠం- బ్రతుకొక హఠం”

* * *

అష్టదిక్కులా ఆవిష్కరించుకొన్న ఆ మహావటవృక్షం ఏదో ఒక నూతన రహస్య లోక ద్వారాన్ని పరిరక్షిస్తున్న మహాశక్తిగా ఆ చీకట్లో కన్పిస్తున్నది. భూమాత హృదయ కుంజరపు లోతులను సమీపించలేక, కృతజ్ఞతాభారంతో అధోముఖాలైన మర్రి ఊడలను తప్పించుకొంటూ, సామాన్య సాంప్రదాయ పదాలకు అర్థాలకు అతీతమైన పంచస్వరాలతో ప్రార్థనా గీతాల నాలాపిస్తున్న పక్షి సమూహపు కోలాహలం విస్మయంగా వింటూ, విశాలమైన ధర్మసత్రం వరండా మొదటి మెట్టు మీదనే గత స్మృతులన్నీ విస్మరించిన అపరిచిత పరిచితుడుగా, ఆ వినూత్న దృశ్యాన్ని పరికించి చూచాడు. ఎవరు నువ్వు అని ఎవరూ ప్రశ్నించలేదు. తన వెనకనే మరిద్దరు గోసాయిలు-జైనిరంజన్- అంటూ ప్రవేశిస్తున్నారు.

            అంత పొడవూ వెడల్పూ వున్న స్థలంలో ఒక వంద మంది జీవులు ఏ తొక్కిడి లేకుండా విశ్రమించగలరు. తను ఒక మూల వెతుక్కొని, సంచీదించుకొని సేద తీర్చుకొంటూ కూలబడ్డాడు. మర్రిచెట్టు కింద చితుకుల చిరుమంటలు కాగడాల్లాగా వెలుగునిస్తున్నవి. ఆ వెలుగు ఒక చిరంతన జ్ఞాన భాషనూ, కాలానికీ కల్లోలానికీ విలువనివ్వని ఆలోక అలీనస్థితిని తోపింపచేస్తున్నది.

            చెరువు రేవులో దిగి చల్లని నీళ్ళతో శరీర ప్రక్షాళనం చేసుకొన్నాడు. ఈ తటాక జలం పానయోగ్యంగా లేదు. కాని ఇంతలోనే అగ్ని పర్వత గర్భంలో వుడుకుతున్న లావాలాగా ఆకలి మళ్లీ తన్నుకొస్తున్నది. ఆ విచిత్ర భూమి అన్ని దిశల నుండీ తనను పలకరిస్తున్నది. పో-పో-మని కాదు. రా-రా అని పిలుస్తున్నది. ఇక్కడ ఏ విరోధాభాసం లేదు. ఇందాకటి దాకా తాను బైరాగి. ఇప్పుడీ ఉత్తరాది సాధువు తనను “మహరాజ్” అని సంబోధిస్తున్నాడు.

            “ఆవ్ మహరాజ్… రోటీ ఖాయెంగే” చెట్టుకింద రాలిన యాగ సమిధలు పోగుచేసి, మూడు రాళ్ళ పొయ్యి మీద రొట్టెలు కాలుస్తున్న ఈ వృద్ధ హిమాలయ సన్యాసి పిత్రువాక్యం అది. తను మెట్లు దిగాడు. వరండాలో ఒక కన్నడ సాధువు ఏకతార మీద శివతత్వం నేపథ్య గానంగా విన్పిస్తున్నది. రొట్టెలు తిన్నాడు ఉప్పూ కారం లేని పలచని పప్పు ఆధరువుగా. కమండలంలోని చల్లని నీరు త్రాగాడు. ఏమని కృతజ్ఞతలు చెప్పటం? నాగరిక జీవన వంధ్యత్వంలో అది సంప్రదాయం కావచ్చు. ఇక్కడి వసుధైక కుటుంబ సమూహంలో అదొక అల్పవాక్కవుతుంది. ఏ శోభాయాత్రలోనో పాల్గొని ఆనంద లక్ష్మి వడిలో విశ్రాంతి తీసుకొంటున్నట్లున్న ఈ అంతర్ వ్యోమయానుల మధ్య, తనూ దారితప్పివచ్చిన పాంధుడిగా కాక సహయాత్రికుడిగా కూర్చొని వున్నప్పుడు- వేదనలేని, నైరాశ్యంలేని, భావ వికారాలు లేని త్రికాల అలీనతలో ఐక్యమవుతున్న వేళలో ప్రయత్నించినా ఆ అల్పపదం వెలువడలేదు. కళ్ళు మాత్రమే ఆ కార్యం నిర్వర్తించినవి. కాని అంతర్గతంగా ఇంకేదో వాక్యం వినిపిస్తున్నది. ఈ’ అవధూతలు, అద్వైతులు, కమండలధారులు, కౌపీన మాత్రులు, అర్థనగ్నులు, విభూతిభస్మీకాంతులు, ఊర్ధ్వపుండ్ర భూషితులు భౌతికసుఖ విసర్జితులు, నిస్సంగులు, నిరాడంబరులు- ఈ నిరంతర పధికుల మధ్య తనకేమైనా అర్హత వున్నదా? వీరి నేచారిత్రక పవనాలూ అంటవు కాబోలు. ఏ విప్లవోద్యమాలు వీరి పధాన్ని అవరోధించవు కాబోలు. వీరి పరమగమ్యంలో ఏమలినమైన గత జీవిత పశ్చాత్తాపాల పంకిల వాయువు పవనాలు అడ్డురావు కాబోలు. ఏ సంవేదనల వూబి నీ ఈ జ్ఞానధనులు తొక్కరు కాబోలు.

            సంచీని తలగడ చేసుకుని, అర్ధనిమీలత నేత్రాలతో మేను వాల్చాడు. ఆముదపు వత్తిగా మెల్లగా నిశ్శబ్దంగా వెలిగే ఒక అపూర్వశాంతిధామంలో వున్నట్లుగా వుంది. అన్ని యుగాల సంవేదనలను, జీవన గ్లానినీ పారదోలిన ఈ లోకం పేరేమిటి? ప్రగాఢమైన సహజగాంభీర్యంతో తన చుట్టూ అలముకొన్న ఈ అమరశాంతి క్షణికమా? శాశ్వతమా? భీతిలేదు. ఖ్యాతిలేదు. ఉన్నదొక్కటే నిశ్శబ్ద పరిభాషలో ఒక శబ్దయత యోగ భాష.

            ఒక నడివయసు సంత్ శిష్యుడికి కాబోలు సంస్కృత భాషలో వివరిస్తున్నాడు “బొటనవేలు పరమాత్మ. చూపుడు వేలు జీవాత్మ. ఈ రెంటి సంయోగమే అఖండచైతన్యం. ఆది గురువు దక్షిణామూర్తి మునులకు బోధించిన రహస్య మౌన సంకేతం యిది” ఇంత తేలికగా జీవన పరమార్థం విదితమవుతుండగా- మరే పరమ అన్వేషణకై, ఈ సన్యాసులు కొందరు ఉత్తర దేశయాత్రలకు, మరికొందరు దక్షిణాత్య పుణ్యపధాలకు నిరవధిక పయనాలు చేస్తున్నారు? ఇంకా వారి ఆత్మలను ఏ అదృశ్య ఐహిక శృంఖలాలు బంధించి వేస్తున్నవో! అందుకేనా విస్మయ విశ్రాంతి మజిలీలు. అందువల్లనేనా ఈ ఉపవాస నిర్జలవ్రతాలు. ఇన్ని శబ్దరహిత శబ్దసహిత ప్రార్థనలు. ఈ ప్రస్థానమంతా ఒక దీర్ఘనిరీక్షణా? లేక ఇదొక జీవన విధానమా?

            కస్త్వం? కోహమ్? నీవెవరివి? నేనెవరిని? శరీరం తూలిపోతున్నది. కళ్ళు మూతలు పడుతున్నవి. ఈ ప్రశ్నలు విన్పించి గోడకు జారగిలబడి కూచున్నాడు. తనకు నాలుగడుగుల దూరంలో ఇంకో ఆగంతకుడు. సాధు వేషం కాదు. ఒక మురికి ప్యాంటు. అంతకన్నా మురికి కోటు. మద్యం వాసన. ‘బాబూ, ఒక బీడీ యిప్పిస్తావా? ప్రఖ్యాత నటుణ్ణి. తీసి పారేయకు”

            బైరాగి యింకో చోటికి మారిపోయాడు. ఈ పొరుగు సాధువు భోజనం చేసినట్లు తను చూడలేదు. శరీరానికి అభోజనం, మనస్సుకు నిశ్చింత, మాటకు మౌనం.

            జంటకు ఇద్దరు గోసాయిలు తత్వం ఆలపిస్తున్నారు “యోగివైతేనేమిరా? బైరాగివైతే నేమిరా? రాజయోగము కానలేని రాజు వైతేనేమిరా?” వెంటనే వంతపలుకులు:

            “రుద్రాక్షలుంటే నేమిరా భద్రాక్షలుంటే నేమిరా? చక్కగా షట్కమలము పైనెక్కి బ్రహ్మగొనని వారలూ” నిగూఢ యోగ రహస్యాలు పొరలు పొరలు విప్పుకొంటున్నవి. తనకు నిద్ర దూరంగా జరిగిపోతున్నది. మళ్ళీ వచనంలో కుండలినీశక్తిని వివరిస్తున్నాడు. మూలాధార చక్రంలో సర్పం ముడుచుకొని వుంది. దాన్ని మేల్కొలుపు. ఆరు చక్రాలను దాటుతుంది. డెబ్భై రెండు వేల నాడుల్ని అమృత స్నానం చేయిస్తుంది. చిచ్ఛక్తిగా కపాలాన్ని తాకుతుంది. పురా విస్మృత అమృతవాక్యాలు, చిర పరిచిత అమృతకావ్యాలు గూడా. కాశీ మజిలీ కథల్లాగా జానపదశైలిలో వినవస్తున్నవి. ఆసేతు హిమాచల జ్ఞాన భాండారం యిక్కడికి తరలివచ్చిందా! అని ఆశ్చర్యపోయాడు.

            “అన్నా ఆలకించు, పోతులూరి వీరబ్రహ్మం గారి పద్నాలుగు కాలగ్గేనాలు బనగాలిపల్లెలో గరిమిరెడ్డి, అచ్చమ్మతల్లి ధాన్యం ప్రాతర్లో యేసివారు. ఆడనే చింతచెట్టు వుద్ధరిస్తుంది. ఉత్పాతం పుట్టేముందు ఆ వృచ్చం రగతపు రంగులోకి మారుతాది. అదే సాచ్యం. అదే పెలయం”

            కబీర్ పంథ్‌కు చెందిన బైరాగి ఆగి ఆగి చరణాలు దోహాలుగా పాడుతున్నాడు. నిరాకార్ హమారా బాప్! సాబాకార్ హమారా మా.

            అతగాడికీ ఏకనాథ షిర్డీ సాయి బైరాగికి భేటీ నడుస్తున్నది. “గురుకృపాంజన పాయో మేరే భాయీ” గురువే సర్వస్వం. గురుపాద పద్మాలను అన్వేషిస్తూ పయనించు. తన ఏకాంత ధ్వాంత హృదయ గుహాంతరంలోని బండరాతిపైన హిమాలయ సానువుల నుండి, కన్యాకుమారి సముద్ర సంగమ’ మధ్యదేశంలోని ఆధ్యాత్మిక బీజాలు దొరిలి దొరిలి చిరు సవ్వడులు చేస్తున్నవి. తనకు దగ్గుతెర వచ్చింది. ఒక వారం రోజుల్నుండీ అప్పుడప్పుడు వేధిస్తూనే వున్నది. ఓ నక్షత్రమయ శోభారాత్రీ! నీకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నువ్వు ప్రభాతాన్ని వెతుకుతూ పోవద్దు. నామీద దయ చూపు. ఇట్లాగే నిలిచిపో!

3

మంత్రనగరి ద్వారం! మహాస్వప్న యోగం!!”

* * *

కాని తన ప్రార్థనను ఏ దేవతా వినలేదు కాబోలు. క్లేశరహిత శాంతిదేవత ఒడిలాంటి రాత్రి గతించింది. తెలతెలవారుతున్నది. ఒక దీర్ఘమనోరాజ్యపు సరిహద్దుల్ని తన నిద్ర దాటించివేసింది. కళ్లు నులుముకుంటూ చుట్టూ కలియజూశాడు. అయిదారుగురు సన్యాసులు మినహా సాధుసమాజం జాడలేదు.

            తను కాలకృత్యాలకై చెరువు దిశలో సంచరిస్తూ శిరస్నానాలు చేస్తున్న సాధువుల గుంపుల్ని దర్శించి నమస్కరించాడు. చన్నీళ్లలో ములకవేసినప్పుడు రాత్రి అనుభూతిలోకి వచ్చిన జ్వరం మాయమైపోయినట్లు భావించాడు. హమ్హర్ మహదేవ్! శంభో శంకరా, గురుదత్త మహరాజ్! జై జై నిరంజన్- సన్యాసుల పిలుపుల్తో చెరువులో విచ్చుకొంటున్న జలజాలు జలదరించిపోతున్నాయి. కాని గతరాత్రి నిష్కామ అనుభూతి, నిరీహ స్పృహ; నిస్సంకల్ప సిద్ధియోగం, ఆ నిరంజన సహృదీగీతం- యీ వాతావరణంలో లేవేమో. ఆ మూలనుండి ఈ మూలదాకా ఆకసమంతటా నిర్వచనకందని- ఏదో నూత్నపవన సంచలనం; ఒక ఉద్ఘాత ప్రథమ చరణం లాంటి అద్భుత గానం. ఒక మహానిరీక్షణ. ఒక సంభ్రమ వాతావరణం- ఆ గాలినిండా వీస్తున్నట్లుగా వుంది. సాధుబృందం సత్రం వైపు చూడకుండానే పోతున్నారు తూర్పు దిక్కుకు. ఎక్కడికీ పరుగు? ఏమున్నది ఆ దిశలో?

            “ఆవ్ ఆవ్ బాలక్ మహరాజ్…” అని ఆహ్వానిస్తున్నాడు చిలిందట్టిస్తున్న అర్థ దిగంబర సాధుపుంగవుడు, జ్ఞాన్ పత్రిని కళ్ళు మూసుకొనే ఆస్వాదిస్తున్నాడు.

            వటవృక్షం కింద పాలులేని కాఫీ కాచుకొంటున్న దక్షిణాది గోసాయి “వాప్ప తంబీ-కాపీ సాపడు…” అని చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నాడు. ఆ కాఫీ గుక్కల్తో చలీ దగ్గుతెరా మాటు మాయమై పోయాయ్.

            సత్రం మెట్ల అంచున పసికందును పక్కన వేసుకొని అర్థనగ్నంగా, ఏ ఆచ్ఛాదనా లేకుండా నిద్రిస్తున్న బిచ్చగత్తెమీద తన సంచీలో దుప్పటి తీసి కప్పాడు. దుప్పటి తీస్తూంటే కిందపడ్డ మూడు రూపాయి బిళ్ళలవంక కన్నెత్తి చూడలేదు- తమిళ గోసాయి “తంబీ, తంబీ పైస” అంటున్నా. అవి తన ధనసంచయంలో తుది మూల్యాలు. ఏక్ తార బైరాగి పగిలిన అద్దం ముక్కతో త్రిపుండ్రాలు దిద్దుకొంటున్నాడు. చిలుక జోస్యం జోషి పక్షికి కొత్త విద్యలు నేర్చుతున్నాడు- బట్లానీ గింజలతో, కొంచెం ఆయాసంగా వున్నట్లుంది. పరుగిడి తనూ సాధుబృందాన్ని చేరగలడా? ఈ ప్రయాణం ముందుకు సాగేనా. తరుతల వాసం. కరతల భిక్షం. అసంఖ్యాక ప్రశ్నల్తో ఈ గాలి గర్భిణీ స్త్రీ వలె వున్నది. ఎవరు నీవు పేరులేని బాటసారీ! భయగ్రస్తుడివా? భగ్నప్రేమికుడివా? గతజన్మల భద్రకుడివా? నీ స్వప్నం నీకు గురువు. నీ విషాదం నీకు గురువు. నడు నడు వాళ్లనందుకో!

4

“అంతరిక్షం దివ్యయోగ ప్రయోగశాల అవని కేవలం
అనాత్మకుల క్రీడాక్షేత్రం!”

* * *

బాటలో శివగానం చేస్తున్న సాధు సమూహం, వారి చుట్టూ వందలమంది గ్రామీణులు- అంతా ఆకసంకేసి చూపులు నిగిడ్చి ఏ సంకేతం కొరకో ఎదురు చూస్తున్నట్లుగా వుంది. గ్రామీణుల వేర్వేరు శబ్ద ప్రయోగాలతో సంభాషించు కొంటున్న సమాచారం ఒక్కటే. మొన్న సాయంసంధ్యలో బైరాగులందరూ దొంగలే అని తన్ను నిరసించిన ఆ మొరటు వదరుబోతు అన్నమాటలే. నాలుగు దినాల నుండి చితిమండుతున్నా యోగిదేహం ఆహుతి కావటం లేదట. కుండలతో నీరు కుమ్మరిస్తున్నా ఆ చితీ ఆరటం లేదు. ఏమిటీ మహాత్యం? ఎవరా యోగి?

            ఇంతలో ఉదయ సూర్యుడి కిరణ జాలాన్ని కప్పివేస్తూ అసంఖ్యాకమైన పక్షి సముదాయం. నాయకత్వం వహిస్తూ ఒక గరుత్మంతుడు దారిచూపుతున్నాడు. అవనినంతా కప్పివేస్తున్నట్లుగా అంచులు లేని నీడ, సూర్యగ్రహణం నాడు ఒక అద్భుత లీలగా కన్పించే నీడ- ఆకాశం నుండి జాలువారింది. ఒక వలయం తిరిగి గరుత్మంతుడు తూర్పు దిశగా మళ్ళాడు. గ్రామీణులు చప్పట్లు కొడుతున్నారు. సాధు సమూహం ఉచ్ఛైశ్వరంతో స్తుతిగానం చేస్తూ తూర్పు దిశగా అడుగులు వేశారు. ఒక క్రోసు దూరంలో పొగలు పైకెగుస్తున్నవి. అప్పటికే అక్కడ జనం చితిచుట్టూ మూగివున్నారు. ఆ మహాద్భుత దృశ్యం ముందు అచేతనుడై తను నిలిచిపోయాడు.

            చితిమీది యోగీశ్వరుడు ఆజానుబాహువుగా తోచాడు. కైలాసగిరి ధవళ సదృశమైన నిడుపాటి గడ్డం. భువనమోహనంగా కనపడీ కనబడని చిరునవ్వు, నిష్పందమైన శరీరం మీద కాషాయ వస్త్రాలు. మూతబడివున్నా స్థిమితంగా లోచనాలు. ఎవరీ చిదానందమూర్తి! ఒక మృణ్మయ శరీరం నుండి ఈ చిన్మయ శరీరం ఎట్లా రూపుదిద్దుకొన్నది? గ్రామప్రజలు చితిముందు కొబ్బరికాయలు కొడ్తున్నారు. గతరాత్రి గీర్వాణ భాషలో శ్లోకపఠనం చేసిన వృద్ధసాధువు వరుణస్తుతి వేదసూక్తాలు పఠించసాగాడు. ఆకసం వైపు హస్తద్వయాలు ఆరాధనా భావంతో లేస్తున్నవి. జనంలో ఒదిగి వున్న వేదపండితులు గొంతు కలుపుతున్నారు. “ఓ వరుణుడా! ఈ లోకాన్ని సస్యశ్యామలం చేసేది నీవే- మా పుణ్య నదీనదాల్ని జీవ వాహినులుగా వరదానం చేసేది నీవేగదా. మా ప్రార్థన మన్నించు ప్రాణదాతా!”- ఈ గానం ఈ శతాబ్దానిది గాదు. ఆ పాడుతున్న గళాలు పురాపురాణ కాలాలవి. తన్మయుడై వింటున్నాడు. ఒక ఘడియ గడిచిందేమో. సన్నని తుషారంతో మిళితమైన శీతల వాయువులు కొన్ని క్షణాలు. ఆ పిమ్మట పుష్పవర్షంలాంటి చినుకులు. చితి చల్లారింది.

            అప్పటికప్పుడే భూమి పూజ జరిగింది. యోగి పుంగవుడికై సమాధి తవ్వకం ప్రారంభమైంది. వర్షంలో తడిసిన మట్టి పెళ్లలు బరువుగానే తరలిపోతున్నాయి. విశాలమైన సమాధి ఏ నిర్మాణ పరికరాలు లేకుండానే క్షణాల్లో ఆవిర్భవించింది. తడిసి అలసి విశ్రాంతి కోరుతున్న దేహతాపత్రయాన్ని విస్మరించి తనూ శ్రమదానం చేశాడు. మహాయోగులు భస్మీపటలం కారు. వారికి జలసమాధి లేదా భూమాత వడిలోనే ఆముష్మిక విశ్రాంతి-అని పండితులు పల్లీయులికి విశదీకరిస్తున్నారు. సమాధిపైన తాటి కొబ్బరి మట్టల్తో గ్రామస్తులు పందిరి వేశారు. దర్శనార్థులకూ పందిళ్లు వేశారు. ఆ రాత్రంతా అఖండ భజనావళితో ఆ పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఒక నిర్జీవ భూభాగం తన కళ్లముందే ఆనందహాసంతో ఆనంద బ్రహ్మోత్సవం జరుపుకొన్నది. కాలప్రవాహ ఘోషలో నిన్నటిదాకా దాగివున్న ఆర్షవాణి దివ్య సమీర స్పర్శతో గత రాత్రి మేల్కొని విశ్వవేణుగానం విన్పించింది. ఇందుకేనా తన జన్మ? ఇందుకేనా ఈ అగమ్య ప్రయాణం– అనుకున్నాడు. అలసట. జ్వరం. దగ్గుతెర. కఫం.

            తెలతెలవారుతుండగానే రెండు పెద్ద వాహనాల్లో రాజస్థానీ వర్తకులు దిగారు. డేరాలు వేశారు. చిత్తడిగా వున్న నేలమీద విరివిగా ఎండుగడ్డి పరిచారు. సాధువులకందరికీ వస్త్రాలు సమర్పించారు. రకరకాల తినుబండారాలు పంచిపెట్టారు. గడ్డిమీద నీరసంగా పడివున్న తనమీద ఒక పుణ్యాత్ముడు దుప్పటి కప్పాడు. అప్పటికే తను వెచ్చని కాషాయ వస్త్రం ధరించి వున్నాడు. నిద్ర, అశోకం, అలౌకికమైన మంద్రస్థాయి గాత్రరేఖలు వినవస్తున్నాయి. కాలరేఖ ఏ ముల్లు మీద ఆగిందో- ఒక అపశబ్దకాలం.

            ఏమూల నుండి వాలాడో- పూర్వాశ్రమంలో తనొక ప్రఖ్యాత నటసామ్రాట్టునని పరిచయం చేసుకొన్న చిరుగుల కోటు ఆసామి. “సోదరా నన్ను నమ్ము. ఈ లోకం మాయా జూదగృహం. దీని వలలో చిక్కకు. నన్ను చూడు” అని మేల్కొలుపుతున్నాడు. ఒకప్పుడు మంచి రూపసి అయి వుండాలి. గంజాయి దమ్ముతో కళ్ళు జ్యోతుల్లాగా వెలుగుతున్నై. తడబడుతున్నా అతని గొంతు గంభీరంగా వాక్కులను విసురుతున్నది. జేబుల నిండా ఎవరెవరివో ప్రశంసాపత్రాలు తీసి ఒకటి రెండు వాక్యాలు వినిపిస్తున్నాడు. తను కుదువబెట్టిన బంగారు పతకాల రసీదులు- పట్టీకి కుట్టినవి ఏకరువు పెడ్తున్నాడు. “తమ్ముడూ, నామాట విను. షేక్‌స్పియర్ నాటకాలు ఆడాను. టు బి ఆర్ నాట్ టు బి యీజ్ ది క్వశ్చన్-ఫ్రెండ్స్ రోమన్స్ అండ్ కంట్రీమెన్!” సారంగధరలో మహాగాయని చిద్రూప లక్ష్మి నన్ను వదిలిపెట్టేది గాదు- విప్రనారాయణుడి వేషం చూసి జమీందారుగారి మరదలు వంద తులాల ఆభరణాలు నా మెళ్లో వేసింది. లే సోదరా, నీ తలగడ సంచీలో ఏ మూలనైనా రెండు రూపాయలు దొరకక పోవు. ఒక్క దమ్ము కొస్తే చాలు…”

            జ్వరతీవ్ర తన సంధి. అతని రక్తనాళాల్లో యింకిపోయిన మత్తుపదార్థాల ప్రేలాపన. ఒక అరగంట తర్వాత జ్వరం తగ్గి మెళకువ వచ్చింది. తన తలకింద సంచీలేదు. అందులో తన చివరి విలువైన వస్తువు ఫొటో కెమెరా వుంది. తనకీ ఐహిక సంపదతో రుణానుబంధం తీరిపోయిందా! మధ్యాహ్నం గూడా ఎవరోవచ్చి తన కింత ఆహారం యిచ్చిపోయారు. సత్తువ వచ్చింది. జ్వరం లేదు. జర లేదు. బయట సమాధి చుట్టూ గ్రామప్రజలు చిన్న చిన్న మొక్కలు నాటుతున్నారు. తను డేరా నుండి బయటపడ్డప్పుడు కొందరు బౌద్ధ భిక్కులు సమాధి చుట్టూ మూగి వున్నారు. గంటలు వాగ్వాదమో ఏమో తను వినలేదు.

5

“ఏ రాజుల వేగువి నీవు? ఏ వేకువ శకలానిని నీవు?”

* * *

మార్వాడీ వర్తకులు అంబులెన్స్లో తనను మోసుకుపోతున్నారా?

“ఎక్కడికి..?”

“ఆస్పత్రికి…!”

“ఎందుకు ..?”

“చికిత్సకు …”

“వద్దు.. వద్దు.. వి చికిత్స..”

“ఛుప్ ఛుప్ మహరాజ్!”

తనకింకేమీ వినిపించలేదు. సూదిమందు యిచ్చారా? సాయంకాలానికి డాక్టరు వచ్చి పరీక్షిస్తున్నాడు…

“ఎవరు నీవు… రఘువు కాదూ?” భాష డాక్టరు కళ్ళజోడు తీసి మళ్ళీ అడిగాడు.

“నేనా…? కాదు”

“నా వంక చూడు.. రఘూ… నేను సచ్చిదానందాన్ని…”

“సవ్…చిత్… ఆనందం. ఉండు- ప్రకాశించు- దుఃఖపడకు” తన కలవరింత.

“చూడు – రఘూ.. మన లావణ్యగూడా ఈ ఆస్పత్రిలోనే ఉంది. స్పెషల్ వార్డ్ డాక్టరు. అక్కడకు పంపిస్తాం నిన్ను”

“ఎక్కడికీ వద్దు…”

“వార్డ్ బాయ్… ఈ పేషంటుకు స్పెషల్ వార్డ్.. స్ట్రెచర్.. స్ట్రెచర్…” ట్రింగ్… ట్రింగ్…” లావణ్యా… డాక్టర్ లావణ్యా! మన రఘు కన్పించాడు… యిక్కడే… నీ వార్డు పంపుతున్నాం… లావణ్యా…”

స్పెషల్ వార్డుకు లిఫ్టులో వెళ్ళాలి. వార్డ్ బాయ్స్ అంటున్నారు. “చాలా తేలిగ్గా వున్నాడీ గడ్డపాయన”

డాక్టర్ లావణ్య వచ్చి దుప్పటి తొలగించింది. ఆ దుప్పటి కింద ఏ రోగీ లేడు. ఏ రఘూ లేడు.

* * *

మునిపల్లె రాజు

మునిపల్లె రాజు పేరుతో అనేక రచనలు చేసిన  మునిపల్లె బక్కరాజు గారుమార్చి 16, 1925 న గుంటూరు జిల్లా, గరికపాడు గ్రామంలో జన్మించారు.  1943 నుంచి 1983 దాకా భారత ప్రభుత్వం తరపున రక్షణ శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె  వీరి స్వగ్రామం. తండ్రి హనుమంతరావు తల్లి శారదమ్మ. మునిపల్లె, తెనాలి, పొన్నూరు, నిడుబ్రోలు ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది.

‘అస్తిత్వనదం ఆవలి తీరాన’, ‘దివోస్వప్నాలతో ముఖాముఖి’, ‘పుష్పాలు - ప్రేమికులు – పశువులు’, ‘మునిపల్లె రాజు కథలు’ మొదలైన కథా సంకలనాలు, ‘పూజారి  అనే నవల, ‘అలసిపోయినవాడి అరణ్యకాలు’, ‘వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు’ కవితా సంకలనాలు వెలువరించారు. 2004 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, 2006 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న మరణించారు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *