అదృశ్యమైపోయిన నదుల ఏకాంతం

Spread the love

There is a solitary banyan tree

in the field

I love it very much

The beloved sits in its cool shade

a single tree, yet a forest in itself

  • Qazi Qadan -Sindhi Sufi Poet

(1463-1551)

శివలెంక రాజేశ్వరీదేవి కవిత్వం వూరకనే మన అస్తిత్వపు మైదానాల మీద సుందర సువాసనల పావురంగా ఎగిరొచ్చి… పరిచితమవ్వకుండానే ఎగిరి వెళ్లిపోయింది. తన కవిత్వం చదువుతూంటే ‘ఇస్మాయిల్’ గారు అనువాదం చేసిన ‘శంఖఘోష్’ కవిత ‘పింతల్లి’ అదేపనిగా నా కళ్ళ ముందు తచ్చాడుతూనే వుంది. ప్రకృతి తనకోసం వెదజల్లిన రహస్య అజ్ఞాత వాయువుల అక్షరాల గింజల్ని ఏరుకుంటూ… తింటూ.. ఏదో పిలుపందుకుని ఎగిరి వెళ్లిపోయింది. తన లాంటి కవులు వెళ్లిపోయినా వున్నట్టుగానే అనిపిస్తూ ఉండిపోతారు. ఎప్పటికీ ఎక్కడికీ పోరు. ఎక్కడికీ ఎప్పటికీ వెళ్ళిపోని కవిత్వం రాసిందామే. ఎందుకంటే రేవతీదేవికి కొనసాగింపు కవిత్వం తనది. భక్త మీరానూ, కబీర్‌నూ, అక్కమహాదేవినీ, సిల్వియా ప్లాత్‌ను, వజీర్ రహ్మాన్‌నూ అంటుకొని రగిలిన విహ్వల కవిత్వం తనది. ఈ కవితల్లో.. సమాగమాన్నీ, ఎడబాటునీ వొకే విధంగా దర్శించిన ఔన్నత్య దర్శనం ఉంది. ఆనందం రాకడకీ… విషాదం పోకడకీ నడుమ సాగే సన్నటి కాంతిరేఖను కలిగించిన కవిత్వం తనది. జీవించడంలోని ప్రతిక్షణాన్ని దివ్యాగమనంలాగా, పండగలాగా, కొత్తగా రెక్కలు తొడుక్కున్న లేసీతాకోకచిలుకల విస్మయంగా గడిపిన కవిత్వం తనది. రాజేశ్వరి.. లోకం పైన, తన సంబంధాల పైన వున్న ధిక్కారాన్ని, కోపాన్ని.. ప్రేమించడంలోనే వ్యక్తం చేసింది.

నాకూ.. ఆమెకూ మధ్య వ్యక్తిగత పరిచయాలు లేవు. తను రాసిన చాలా కవితలకు మాత్రం జిజ్ఞాసగల పాఠకుడిని. పాఠకుడి  అంతరంగాన్ని వూయలూపుతూ, వొదారుస్తూ, ధీమానిస్తూ, క్షమను నేర్పుతూ జీవదృష్టిని సాంద్రపరుస్తూ అతడి లోదృష్టిని వెలుగుతో నింపుకుంది. తక్కువగా రాసింది. ఎక్కువగా మేల్కొలిపింది. ఆమె కవితలు చదువుతుంటే.. కుటుంబ సంబంధాలనూ బాధ్యతలనూ స్వేచ్ఛగా భావించి జీవితాన్ని నిర్వహించినట్టు అనిపించింది. కొత్త బంధాలు పాత ఆరోపణలు కాళ్లకు అడ్డం పడినప్పుడే.. తన స్త్రీత్వం మెండుగా తనని కమ్ముకుందనిపించింది. వెళ్ళిపోవడం కాదు వుండిపోవడం గురించి చెబ్తుంది. పుట్టని బిడ్డ కోసం కన్నతల్లిగా వుండిపోవడమే తన Liberation అనుకుంటుంది. తండ్రులు ఇల్లూ వాకిలి వదిలేసి వెళ్లిపోయినా అమ్మలు మనల్ని గూళ్ళ దగ్గరే కనిపెట్టుకొని మిగిలిపోతారు స్త్రీత్వంలో.. ఏది ప్రేమంటే..?

పగిలిన అద్దంలో, ద్వైతం రాగ రాగిణికి, రాస్తా.. లాంటి కవితల్లో ఆక్వామెరీన్ కాంతితో, చందనపు కాంతితో జ్వలించే పూవులు.. వాటి శ్వాసలు. కవితాత్మకత చీకటి కోణం వంటి కవితల్లో తను లేని తను కానీ తనను విముక్తం చేసుకున్న తనులోకి విప్పారిన పువ్వులుగా విరజిమ్ముతున్న ఎగజిమ్ముతున్న కాంతి తుంపరలోకి విప్పారుతుంటాయి. కవిగా తనకీ వస్తువులకీ వ్యక్తులకీ మధ్య వున్నటువంటి spartial relationship కళాత్మకంగా మలుచుకుంటూ వుంటుంది కవిత్వం మొత్తంలో. మనలోని Suffocating interiorsని శుభ్రం చేసే ప్రయత్నమే కనబడుతుంది. స్త్రీవాద/ స్త్రీత్వ కవిత్వానికి రేవతీదేవి లాగానే focus shift చేసిన కవిత్వం శివలెంక రాజేశ్వరీదేవిది. అద్భుతంగా జ్వలించి ఆ కవిత్వం పాదాలను తిరిగి తిరిగి మననం చేసుకుంటూ వుండాలనిపిస్తుంది.

అవునా చిన్నారీ  

……….

……….

పునర్జన్మ ఒక మృత్యువు తర్వాత కాదు

 మరో నూత్న శిశువు పెనవేసుకున్నప్పుడు” (స్పర్శ)

“నేనంటే నేను మాత్రమే కాదురా నాన్నా

నేను నేనుగా ఇమడలేక

మరో పాత్రగా రూపం చెందిన

 ప్రతిబింబాన్ని”  (పగిలిన అద్దంలో)

“కవిత యుద్ధభూమిలో ఒరిగిన ప్రియతమ శిశువు” (వాక్యం తెగదు)

పొద్దెక్కి లేచాక

ఇంకా దేవతలు నన్ను వొదలకముందే

దయ్యంలా పట్టుకుంటుంది ఏదో రూపంలో నిజం” (అనగనగా ఒకరోజు)

“అప్పుడే పుట్టి పెరిగిన నేను

అనాది అనురాగాన్ని నింపుకున్న

అగాధాలకేసి తొంగి చూస్తాను”

“గుక్కెడు సంతోషాన్ని తాగుతున్నప్పుడే తెలుసు

గుండెడు విషాదాన్ని మోయాలని” (అనగనగా ఒకరోజు)

“నీ మిణుగురుల మీంచి సైతం

వెలుగు చూస్తానంటే నవ్విపోతారమ్మా

…………….

 ఆ ముదిరిపోయి గిడసబారిన ఇంటలిజెన్స్

మనకు వద్దులే తల్లీ

ఏదో మన మానాన మనం

రాత్రి వర్షాన రాలిన పొన్నాగ పూలని

చేతుల్లోకి తీసుకుంటూ” ( స్థితప్రజ్ఞులు)

ఈమె కవిత్వంలో Questioning Style బాగుంటుంది. సున్నితమైన మందలింపులో వొక నిశ్చయ నిశ్చల స్థిరత్వం, కన్నీళ్లను దాచుకున్న నవ్వులుంటాయి.  సమాధాన పడని సుదీర్ఘయాతన వుంటుంది. రాత్రికి తనను సంపూర్ణంగా సమర్పించుకున్న అస్తిత్వం తనది. లోకమంతా నిద్రలోకి జారుకున్నప్పుడు మేల్కొనే కవి తాను. రాత్రిని ఈమె ప్రేమించింది. రాత్రితో కలిసి బతికింది. లోకంతో చెప్పాలనుకున్న సమస్త నివేదనా రాత్రి తోడుగానే ఆమె స్వరపరచుకుంది. వొకే వొక్క పాత్రగా, Autobiographic గా.. simple most narrative గా తన కవిత్వం.

మాటల్ని, దృశ్యాల్ని వస్తువుల్ని మన మీద పరుచుకున్న స్థలాల లోతుల్ని ఇంకా అనేకానేక వుత్త భౌతిక బహిర్భాగాలను కూడా తన ఆత్మరంగంలో సుతిమెత్తగా సాంద్రశీతలంగా కదిలే భావనా ప్రపంచంలోని అన్ని మూడ్స్‌నీ ద్రవింపచేసుకుంటూ మధ్యతరగతి మానవీయ భాషలో పలికించగలిగింది. హార్మోన్స్ నుంచి మెనోపాజ్ గోల నుంచీ అసంధర్భ రొమాన్స్‌ల చీదరల నుంచి విముక్తి చెందాలనుకుని కవిత్వం రాసింది. శరీరంతో పాటు మనసూ, ఆత్మ, ఆలోచనలు, ప్రేమ, అలవికాని ప్రేమ, సహజ సిద్ధమైన అమ్మతనం.. సెక్సువల్ alarmity ఉన్న కవిత్వం. ఇప్పటితరం, స్త్రీవాద తరమూ, ఆ తరువాత తరమూ తమను తాము చూసుకొని రూపుదిద్దుకోవడానికి అవసరమైనటువంటి అస్తిత్వ ముడి మూలాలన్నీ ఈమె కవిత్వంలో నాకు కనిపించాయి.

            Majority of poems లో Spiritual romance వుంది. భావుకత్వం ఉంది. స్త్రీగా తనని తాను చెప్పుకొని ఆకృతి పరుచుకున్న నీటిదనం ఉంటుంది. ఎప్పుడూ నిబ్బరంగా చెమ్మగిల్లె ఆత్మరంగం ద్యోతకమవుతుంది. తనను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే సందిగ్ధతకంటే తన గురించి తాను ఏమనుకుంటుందో అనే ఎరుక కనిపిస్తుంది. ఇది ఎంతో అవసరం… తన గురించి తాను పట్టించుకుంటూ.. తాను ఇతరులకు ఎంత ఇవ్వగలనా అనే ఆదుర్దా వుంటుంది. ఎప్పుడూ తనలోని మృణ్మయ మృత్తికను స్పృశిస్తూ ఉండటం.. ఇతరుల అనుభవాల్లోకి దినచర్యలోకి చొరపడకుండా ఏకాంతంలో మిన్నకుండడం.. ఎంత పొందదగిన స్థితి. పురుషుడు జీవితంలోనూ మృత్యువులో కూడా ఇతరుల జీవితాల్లోకి చొరబడి దురాక్రమణ చేసి చరిత్రలో చెదపురుగై వైరస్‌లు లేపుతున్న కాలం ఇది. సిగ్గూశరమూ లేని మానవ సంబంధాల కాలం. ఇటువంటి కాలంపై వెన్నెల్లో ఎగిరే సీతాకోక చిలుకల వంటి కవితల సందూక ఇది. ఎగిరే సింగిడి సందూక ఈ కవిత్వ సంకలనం.

            చివరగా తన కవిత్వ ప్రస్థానానికి చిరునామా లాంటి కవితను గురించి మాట్లాడాలనిపిస్తుంది

నా రాత్రి సుదీర్ఘమైనది

ఇలా నా వెంటరా నీకు తెలియని రాత్రిలోకి తీసుకువెళ్తాను

…………….

…………….

నా రాత్రి సుదీర్ఘమైనది

నా హృదయం ఆ సమయంలోనె మేలుకువతో ఉంటుంది

…..

నా రాత్రి సుదీర్ఘమైనది

అంతర గంగా ప్రవాహాల్లో మునకలేస్తున్న రాత్రి

నన్ను అపనిందలపాలు చేసే రాత్రి

ఒక రొటీన్ అనేది లేకుండా చేసిన రాత్రి”

………………..

………………..

నా సుదీర్ఘ రాత్రి వల్ల నేను పగలు మెలకువగా ఉండలేను.

అనాధ స్త్రీల అవమానాలన్నీ

చరిత్రహీనుల బాధావమానాలన్నిటినీ ..సమస్త మానవాళి జీవనవిషాదాన్నంతా

మోస్తున్నానని రాత్రి ప్రకటన చేస్తుందీమె.

సత్యాసత్యాల మాయాదర్పణంలో నుంచి తను తప్పుకోవాలనుకుంటుంది. సత్యం తనను గాయపరిచింది. సత్యం తనను ముక్కలు చేస్తుంది. సత్యం తనను ప్రతిరోజు చితిమీదికి చేర్చి దహనం చేస్తుంటుంది. అందుకే ఆమె స్వప్నం వైపు అడుగులు సాచింది. ప్రపంచం మీద ప్రేమ పుట్టించే ఆకలిని నిమీరే, దుఃఖ దాహాన్ని తీర్చే స్వప్నాన్నే తను వరించింది. కళాత్మపుటాకలినీ, మనోదేవ రహస్యాల్నీ స్వప్నం లోకి తీసుకువెళ్ళగలిగే నిర్భాయాన్ని ప్రవచించింది.

            ఇప్పుడు మనం అన్ని వాదాల, ఇజాల అస్తిత్వ బాజాల కవిత్వాన్ని పక్కనపెట్టి ఇటువంటి కవితమే చదవాలి. ఏక్‌తారానో దోతారానో మీటుకుంటూ పోయే సంచార వచన కారుల గుంపులో నడుస్తూ పోతున్నట్టు కల కలుగుతుంది. Cross religions, cross cultural, cross gender ల అంతరంగ సౌందర్యాన్వేషణ ముప్పిరిగొంటుంది. మూలాధారంలో రసానందానికి లోను చేసే వివశానుభవముంటుంది. ఎవర్నీ కాదనలేని, అందర్నీ కాలదన్నిన ‘అమ్మ’ తెలిసివస్తుంది. నేనిక్కడ రాసిందంతా వ్యాఖ్యానం కాదు. ఈ కవితలను చదివిన తర్వాత కలిగిన సమ్మోహనానుభవమే అనుకుంటున్నాను. తను మళ్ళీ పుడితే కవిగా పుట్టాలనీ.. కవిత్వమే ఈ జడ ప్రపంచానికి కాన్కగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను సాహసి కనుక.

“తనకి తనే

             ప్రశ్న

                   ప్రోద్భలమై

తనకి తనే

                శిక్ష

                      శిలనై

గుండె కాల్చే

                ఏకాకితనం

                                  అనామక పరిత్యాగం

అదీ సాహసం”

~ వజీర్ రహ్మాన్

కవి సిద్ధార్థ

కవి సిద్ధార్థ తెలంగాణ అగ్రశ్రేణి కవులలో ఒకరు.
గతంలో దీపశిల, బొమ్మలబాయి కవితా సంపుటాలు తెచ్చారు. సినిమారంగంలో పని చేస్తున్నారు.
స్వగ్రామం నల్గొండజిల్లా పోచంపల్లి దగ్గర చినరావులపల్లి. ప్రస్తుత నివాసం హైదరాబాద్.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *