హఠాత్తుగా నువ్వు
బ్రతుకులో జొరబడగానే
యవ్వనోత్సాహాలు
ఉప్పొంగే ఉద్రేకాలు
చప్పున చల్లారిపోయాయి
వచ్చీరాగానే
నా దినచర్యను శాసిస్తూ అతలాకుతలం చేసావు
క్షణక్షణాన్నీ దొరకబుచ్చుకుని
స్వప్నాల నేతకే
వినియోగించుకునే సమయాన్ని
నీ గుప్పెట్లో బంధించావు
నా ప్రతి పలుకును
నీ త్రాసులో తక్కువగా తూస్తూ
హేళన చేసావు
ఎన్ని రంగులను పోగేసుకున్నా
నలుపునే గమనిస్తూ
చులకన చూపులు విసిరావు
దీనికి తోడు
నీ ఉచిత సేవలో
తరించడమే
నా పుట్టుకకు అర్థమంటూ
లోకం పదేపదే కోడై కూస్తుంది
గాయాలు బాధిస్తున్నా
చప్పుడు చెయ్యకుండా
సర్దుకుపొమ్మంటుంది
ఇప్పుడు నా చేతులు బండబారిపోయాయి
పాదాలు పగుళ్ళు తేరాయి
దేహమైతే మాట వినకుండా
మొరాయిస్తోంది
నేటికీ తూగుటుయ్యాలపై
తీరికగా సేదతీరుతూ నువ్వు
ముచ్చెమటలతో
వణుకుతున్న అవయవాలను
చీరచెంగుతో తుడుచుకుంటూ నేను

