నువ్విక్కడ ఉన్నప్పుడు
వానలు కురుస్తాయి
భూమి చల్లబడినట్లు ఉంటుంది
ఎప్పుడో హృదయం ఉప్పొంగుతుంది
ప్రియులు ప్రేయసులు ఇంకా వేరుగా నువ్వు
మరి ఇక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు
చిక్కటి అడవిలో దారి కలిసిపోతుంది
తప్పి పోవడమెలాగో మర్చిపోతావు
భుజాలపై జీవితం మోయాల్సివస్తుంది
ఇక అంతా వదులుకొని కొంతదూరం వచ్చాక
ఇక కథ మొదలై నీ వెనుకే వస్తుంది
నువ్వందులో రెండుపదాలే అని
పెదవి విరిచి వదిలేస్తావు
నిస్సిగ్గుగా నువ్వు వెలివేసిన
ద్వేషాల్లో మోసాల్లో నిండుగా మునిగి
తెరిపినపడ్డ హృదయపు నిట్టూర్పులు
చివరి క్షణాల్లో పలవరించిన మాటలు
వేడుకొని వెంబడించి వేటాడిన
కొన్ని క్షమార్హతలేని సమయాలు

Srisudha Modugu
పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన శ్రీసుధ మోదుగు 'రెక్కల పిల్ల, 'డిస్టోపియ' వంటి కథా సంకలనాలతోపాటు 'అమోహం', 'విహారి', 'గొంగళి పురుగుల సామ్రాజ్యం' మొదలైన కవితా సంకలనాలు తెచ్చారు.. వీరి 'అమోహం' కవితా సంకలనానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డ్, (2017), 'అంతర్హిత' నవలకి శ్రీ జొన్నలగడ్డ రాంభొట్ల సరోజినమ్మ స్మారక పురస్కారం వచ్చాయి.



