అమ్మమ్మ – ట్రంకు పెట్టె

Spread the love

మనసు ఊటలో
వికసించే భావాల పూదోట మాట
విలువైనవన్నీ అమ్మమ్మ ట్రంకు పెట్టెలో భద్రంగా దాచుకున్నట్లు
మాటలు దాచేయమని హెచ్చరించే మెదడు
సంజ్ఞలన్నీ కొట్టిపారేయమని గోల చేసే నాలుక

ఏదైతేనేమి

దశాబ్దాల ప్రకంపన
అవతలి వారికి కానరాని సరికొత్త రూపం
ఏళ్ళుగా మేటలుగా పేరుకుపోయిన మాటలు
నిశ్శబ్దానికి నిద్రాభంగం చేసిన ప్రవాహాలు
ఆది ఏదో అంతమేదో
తుది ఏదో మొదలు ఏదో
గూడు వదిలిన పక్షుల్లా
రెక్కలల్లాడిస్తూ ఎగిరిపోయిన
మాటల తూటాలు

ఎక్కడివీ తూణీరాలు

పెదవికి పెదవి ఆనకుండా
అలసటే ఎరుగకుండా
మెలికల గిరిక అలుపెరుగని యోధలా తిరుగుతూనే ఉంది
అమ్మమ్మ కాలం ట్రంకు పెట్టె
అమ్మ అయినా తెరవ లేదేమి
తెరుచుకోలేని కవాటాలో
తెరవనీయని ఝంజాటాలో
వెనక్కు లాగి ఉంటాయి

ఇదుగో
అలా
తరతరాలుగా పేరుకుందీ బరువు
భుజాలకు వేళ్ళాడుతూ అడుగు ముందుకు వేయనీయని పరువుల బరువు
పాపం
వారసత్వ బరువు
మోయలేక చతికిలపడిందేమో ధైర్యంకన్నా ముందు పుట్టిన అమ్మ

నాకిక
కాలంతోపాటు కలలుగా
బండరాయి కన్నా పదింతలుగా
నా దాకా నడిచొచ్చిందా మర్యాదల బరువు
బిడ్డల దాకా దాచి భరించలేని బరువైన పెట్టెను
నేనే తెరిచానిక

తెరవగానే
ఏళ్ళుగా గంధపు చెక్కలై దాగి ఉన్న మాటలు
అత్తరు గుబాళింపులై పరివ్యాప్తమయ్యాయి
పొరలు పొరలుగా భాషల ముడతలు
దులిపేస్తున్నా కొద్దీ
రంగు రంగుల సీతాకోక చిలుకలు
ఏడు రంగుల స్వప్నాలై
ఎగిరిపోతుంటే
హృదయాంతరాలలో ఊపిరాడుతున్న అనుభూతి
సరికొత్త ఆలోచనలకు తావిస్తూ
తేటపడుతున్న మెదడు

నమ్మలేని నిజాన్ని విభ్రమిస్తూ
వేణువు రాగాలకు గాత్రధారియై ఆశీర్వదిస్తూ అమ్మమ్మ
కడలి అగాథాలకు మాట మాత్రమైనా ఆలవాలమయ్యే నవ్యతలో అమ్మ
తరాల అంతరాలకు దూరం ఈ తరం
మాటను మంత్రం చేసే సరికొత్త తరం ఈ తరం
'Give to Gain'
మనమే మనకు కావాల్సింది నేర్పి పొందాలట
యుఎన్ చెప్పిందో పాఠం
మనకు పురాకాలంగా పాతదైన సరికొత్త పాఠం
చెప్పేద్దాం
నవ తరానికి వెన్నుతట్టే
మేలైన అవకాశం
ముందు తరానికి వారధులను సిద్ధం చేద్దాం రండి మరి
నస్రీన్ ఖాన్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *