ఒక గాయం తరువాత
కోలుకున్నాననే అనుకుంటావు గానీ,
లోతుల్లో నుంచి చేద వేసి తోడే మాటలు
కదిలిస్తే, రాలి పడిపోయేలా అతికించిన నవ్వు
ఎక్కడా నిలబడని చూపు
నిన్నూ, నీ పాత గాయాన్నీ పట్టించేస్తాయి!
ఒక ప్రమాదం తరువాత
ఎలాగో దారి చేసుకొని సమూహంలోకి వస్తావు కానీ
ఇక్కడి మర్యాదలన్నీ మర్చిపోయి ఉంటావు
ఇప్పుడు మనుషులంటే భయపడే నిన్ను
ఒక వాక్యం కూర్చలేని నిన్ను
అత్యవసరానికి కూడా గొంతు పెగలని నిన్ను
లోకం, ప్రమాదంలో పగిలిన పూవుగానే గుర్తుపడుతుంది!
ఒక ఎడబాటు తరువాత
అందరూ మాట్లాడే ఆ తీపి జ్ఞాపకపు కథలో
నువ్వూ ఉంటావు కానీ
ఎంత తవ్వినా
బ్రతికిన రోజుల పటాలేవీ గుర్తురావు!
నీ జీవితంలో నుంచి
కొంత కాలం కత్తిరించబడి ఉంటుంది
విరిగిన మనసు అతుకు కోసం, కోసి తీసినట్టు!
ఇప్పుడు
సగం ప్రాణంతో
సగం పాటని నెమరువేసుకుంటూ
గాలికి కదిలే గడ్డిపూవులా
ఊరికే ఉంటావు గానీ
కోలుకున్నాననే అనుకుంటావు గానీ
కోల్పోయినవి ఏమిటో
నీ దగ్గర కూడా సరైన లెక్క ఏదీ ఉండదు!
“కోలుకున్నాననే అనుకుంటావు గానీ
కోల్పోయినవి ఏమిటో
నీ దగ్గర కూడా సరైన లెక్క ఏదీ ఉండదు!” 👏🏻👏🏻.. ప్రతి పదం, వాక్యం 😍