సావిత్రవ్వ

Spread the love

                    దోవలో దొంగాట ఆడితే రాగులు ఇసిరేది తప్పుతుందా అని… ఐదుగురు అమ్మలక్కలు ఉడ్డజేరి  ఒక ఆడదాని పైన లేనిపోనివన్నీ గుణపోసుకుంటూ ఉంటే ఆ గుంపులో కూర్చొని  వొగో పుల్ల ఎగేసే నాసావాసెగత్తె మల్లి చేయిపట్టి రామే పోదాము అని పైకి పెరికితి . ” గెడ్డి కంట వచ్చి ఏందే నీ అరువులు ? నీయట్లాఆడది ఇనను బోయి తినను కుసుంన్నెంట యాయాలకైన  నీపని నీ పాలిట వుంటుంది కద అంటి. ఆ మాటకు మల్లి ”అది కాదబ్బా! నిన్న రంగతాత దివసాలు కదా. రంగ తాత పెండ్లాము సావిత్రవ్వ రాత్రి దీపం సూన్ను ఊర్లో ఒకింటికి  కూడా పోలేదంట. అందరూ దాని గురించి మాట్లాడుకుంటే నేను ఇంటాఉంటి”  అనే !

                    ”ఇచిత్రానికి ఇద్దురు చస్తే ఈడ్సలేక  నలుగురు సచ్చిరంట  అయినా మగోడికి  పెండ్లాము చస్తే మొలతాడు తెంపి మల్ల పెండ్లి చేస్తారు. నాగవేణి ముగ్గురు బిడ్డలతల్లి . ఒళ్ళు బాగా లేక  సచ్చిపాయ దాని మొగుడు మల్లీ పెళ్లి చేసుకుని మల్ల ఒక బిడ్డను కనే.  అదే ఆడదానికి మొగుడు చస్తే గాజులు బొట్టు మెట్లు మంగళసూత్రం,పూలు అన్ని తీసేసి తెల్ల చీరకట్టి ఇంటింటికి తొడక్క పోయి వాల్లనట్టింట  దీపం పెట్టి ఉప్పుసట్టి పక్కన పెడతారు. ఇంటి ముందరకి పోతానే బీము ఎత్తుకొని గడపకు ఆ పక్క రొన్ని ఈ పక్క రొన్ని ఏస్తారు. ఆకుఒక్క లో వాళ్లకు తోచిన  దుడ్లు కొంగులో పెడతారు. అట్ల ఊర్లో ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని ఇండ్లు రేత్రిలో  తిరగల్ల.  మల్ల మూనెల్లదంకా ఇంట్లో చాట,పరక అంటుకోకుండ ఎవరన్నా చేసి ఆకులో  ఏసిందాకా ఎదురుచూడాల్సిందే . మల్ల మూనెల్ల సందున గుళ్లు,గోపురాలు తిరిగి గుండు కొట్టుకొని సగింతెరింగా దావకు ఎలబారి పోయే వాళ్ళ కంటపడకుండా  అనిగి అనిగి బతుక్కోవల్ల.  తెలివిగా ఆడదాని  గొంతు దాని చేతులతో అదే కోసుకునేటిగ  చేస్తారు . కాదు మే ఇవన్నీ మన బుద్ధిని మారేడుకాయ చేసే మాటలు కాకపోతే ఏంది ఇప్పుడు ఏమైంది. దీపం చూడకుంటే వాళ్ల ఇళ్లల్లోకి రానీరా?. ఒక చిన్నమాట. యోచన జెయ్యి. మొన్న ఊర్లో గంగ జాతర జరిగింది. అప్పుడు ఎంతమంది చుట్టాలు మన ఊరికి వచ్చినారు. దగ్గర బంధువులు ,దూరం బంధువులు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు,అందరూ వచ్చి మన ఇళ్లల్లో తిని పాయిరి. వాళ్లలో చానా మంది మొగుడు లేని ఆడోళ్ళు ఉండిరి. వాళ్లకు మనమేమన్నా దీపం చూపించి ఉంటిమా. పట్టుకుంటే అన్నీ . ఇడిస్తే ఏదీ లేదు. పోయే పో పోయి పని చూసుకో ”అంటి . అది గడ్డికి పాయ నేను ఇంటికి వస్తి !

                     ఆ  మర్నాడు అన్నం పొద్దు కాడ రాగులు మలుచుకుంటా ఉండ.  సావిత్రవ్వ  వాళ్ళ తోడికోడలు వచ్చే .”ఏంచేస్తా ఉండావు బిడ్డా”అనే . ”రాగులు మలుచుకుంటున్నా పెద్దమ్మ. రా కూర్చో అంటే వచ్చి కూర్చొని వక్కాకు తిత్తి  నడుములోది  పీకి ముందరేసుకుంది. ఆకుకు సున్నం రాసి వక్కతో సహా  దవడకు ఏసి  పర,పర నమిలి పిడికెడు దుగ్గు దవడకు పోసుకుంది . వక్కాకు దవడకు తోసుకొని  మూతి తుడుచుకుంటా ” కాదు పాపా! మా మామ సచ్చిపోతే మా సావిత్రక్క కంట్లో కన్నీరు రాలే సూడు ” అంటూ సావిత్రవ్వ మాట ఎత్తుకునే !

“తోడికోడలుకి తొడలో ఉండేదంట కసి”,

”తోడికోడలా  తోసేటి పరకా  పోయేసొస్తా పుట్టింటికి”

అని  మా అవ్వ పాటలు  పాడతా  ఉండేది   తోడికోడళ్ల గురించి .

అప్పటికి పదైదు దినాలయింది. ఇంకా ఊరంతా ఆయమ్మ మాటే. నలుగురు  ఆడోళ్ళు గుంపు చేరేది ఆ యమ్మ మాట మాట్లాడుకునేది. ఈ యమ్మ కూడా ఆ సదువే ఎత్తుకుంది. ”మా అక్కను మామామ ఈ నూరిండ్లపల్లి లో  పైడు బత్యం కావలని కానీ, పది రూపాయల దుడ్లుకావాలని గాని, చమురుగావాలని గాని,  ఉప్పు మిరపకాయ కావాలని గాని ఒక ఇంటికి  పోయినిచ్చినాడా . ఆ యమ్మను  దేనికే గాని నవసనీకుండా ఎన్ని మింద గువ్వే గతం సాకినాడు . అట్లాంటి మొగుడు సచ్చిపోతే కంట్లో కన్నీరు కార్చ లేదంటే  ఏమనల్ల ?ఎంత నిబ్బరస్తురాలు. ఒక బోటు ఆడదైతే తల్లడిల్లి పోయిండు” అనే! 

                     ఆ మాటకు నేనుండుకొని ”ఆయమ్మకు మటుకు బాద లేకుండా ఉంటుందా  వచ్చిన సుట్టమల్ల ఆయప్ప శవాన్ని చూసేది ఆ యమ్మ ఏడుస్తుందా  లేదా అని  ఆ యమ్మ కళ్ళు చూసేది. పక్క కొచ్చేది ఆయమ్మ ఏడసనే  లేదని చెప్పు కునేది. ముసిలిది అయిపొయింది కదా  ఆయప్ప  ఎనకాలే ఆయమ్మ అని అనుకోని ఉంటుంది. లేదంటే బీతి చుట్టుకుని నెమ్ములు ఇరిగిపోయి ఉంటాయి. ఆయమ్మ ఏడ్సలేదు అనే  బాద కూడా మగోళ్ళ కంటే ఆడోళ్ళకే  ఎక్కువై పోయిందే ” అన్నా ! మేము ఇద్దరం మాట్లాడతా ఉన్నట్లే కమలొచ్చే .

” ఏందకా  పెద్దమ్మ నువ్వు వాదించుకుంటా  ఉండారు అనే.  నేను ఆ మాటకు కాదు కమల, సావిత్రవ్వ  దీపాలు సూన్ను ఏ ఇంటికీ  పోను  అని మొండికేసిందంట ,మొగుడు చస్తే యాడ్సలేదంట . కమలా నువ్వు వయస్సులో ముండమోసుకొని ఉండావు ఆయమ్మ చేసింది తప్పా రైటా నువ్వు చెప్పుఅన్నా . పోకా నన్ను అట్లగదా  చేసి ఊరంతా తిప్పిరి. ఏంటికి ఈ ఆడ జీవితం.  వాని కన్నా ముందు నేను సచ్చిపో కూడదా అనిపించింది . గుట్టుచప్పుడు లేకుండా ఆయమ్మ ఇంట్లో ఆయమ్మ ఉంది ఏ రామాయణము లేదు. రెండు దినాలు పోతే ఇది కూడా మాసిపోతుంది” అనే !

                          మరుసటివారం సావిత్రవ్వని  పలకరిద్దామని పొయినా . ఇంటి ముందర కూర్చొని వక్కాకు నములు కుంటా  ఉండే !  ” ఏం నాయన ఇప్పటికి గ్యాపానికి  వస్తినా! కుసో” అనే . నేను కూర్చొని మంచి చెడ్డ మాట్లాడి ఎందుకవా  దీపం సూన్నుఇండ్లు తిరగంది” అని అడిగితి .”కాదు నాయనా నాకు పెళ్లయిన లగాదు నుండి పొరిగింటికి కూడా  పొయ్యి ఎరగను. ఇంకేమిటికి పోతా ? ఆ రెయ్యి లో కుక్కలు ఎంటబడి మొరగతా ఉంటే సలికి వణకతా ఇంటింటింటికి తిరగాలా ? ఏమి బాద, ఎవుడు సెప్పిన ఆచారం! అందుకే పోలా” అనే !

—–

అర్థాలు

సగింతెరింగా = శకునంచూసుకుని

నవసనీకుండ = నలక్కుండా

ఎండపల్లి భారతి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *