ఎప్పుడు వెళ్ళే దారే
ఐనా
సహజంగానే నడుస్తుంటావ్
ఎగురుతూ వెళుతున్న పక్షొకటి
రెక్కలు విదిలిస్తూ వెళ్ళిపోతుంది
పాదాల కింద బొడిగరాయొకటి
నిశ్శబ్దంగా గుచ్చుకుంటుంది
ఉన్నపళంగా
ఆకాశం మారి పోయి
నల్లమబ్బై పరుగెత్తుతుంది
పరధ్యానంలో
చల్లని గాలితెమ్మెరను కలగంటూ
పసి ఊహల్లోకి ఉద్వేగపు మాటల్లోకీ నీలోనీవే వేరే ప్రపంచంతో పరామర్శించే పనిలో
పడతావ్
ఆవిరి పట్టిన వాతావరణం
ఉక్కపోతౌతుంది
కాస్త కాస్త చినుకుల పలకరింతలో!
ఊహ లేని వాన
గొడుగూ నీడా లేని నడక
దులిపేయాలనుకుని చెట్టునాశ్రయిస్తావ్ గానీ
ఆకా ఆకూ అలుముకున్న సందుల నుండి
తడిపేసే వాన
ఈదురు గాలికి విరిగి పడే కొమ్మల శబ్దం
చెల్లాచెదురయ్యే మనసు పిట్టలు చేసే కీచులాట
అనూహ్యంగా రాళ్ళ వాన!
తిరిగి చూసుకునే సమయమీయని కాలం
వరదకు కొట్టుకు పోతున్న గూడై
వణకుతూ ప్రవహించే నీటి తరంగం
ఏదీ నీది కాదు
నీ ఊహా లేదు

