చరిత్రలో సువర్ణాక్షరాల….

Spread the love


పొద్దు పొద్దున్నే సూర్యుని
పని చేతుల గలగలలతో నిద్ర లేపే బాధ్యతవు!

ఆకలి తీర్చేందుకు అన్నంకుండ కింద
అగ్గి మంటవై రగిలే సాహసివి!

కాలంతో పందెం వేసి
కలనైనా గెలవనీయక దూసుకు పోయే రాకెట్ వు

నక్షత్రాలనే ముగ్గుగా మలిచి
వేకువనే వాకిలికి వెన్నెల అందాల్ని అద్దిన కళాకారిణివి!

పుట్టింట్లో
అనురాగ పరిమళాలు
వెదజల్లిన అపురూప సుమమా!

మెట్టింట్లో
ప్రేమగా నడయాడే నీ పాద మంజీరాలు
ఆత్మీయాభిమానాల హృదయ సవ్వడులు!

నీ పెదవులపై విరిసే చిరునవ్వులు
అనుబంధాలతో గుబాళించే అందాల పారిజాతాలు!

అబల అన్నారని అలక బూనకు
సబల కాలేవన్నందుకు కలత చెందకు
సమస్త ప్రకృతి నీవే సకల ప్రపంచమూ నీవే!
సృష్టివి నీవే! దృష్టివి నీవే!

ఆధిపత్యాన్ని ఎదిరించేందుకు
అపర కాళికను ఆవహించుకో!

అవమానాలను నిరసించేందుకు
ఆత్మాభిమాన పిడికిలి బిగించు

అన్యాయాన్ని ప్రశ్నించేందుకు
అగ్నిశిఖవై జ్వలించు

ధీరవు అవుతావు!
సమరోత్సాహ వీరవు అవుతావు!

కన్నీళ్ళు వెల వెల పోయి
చరిత్రలో సువర్ణాక్షరాల పేజీవి అవుతావు!

వురిమళ్ల సునంద

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *