ఆమెలను జయించే అస్త్రం తెలిసిన వాళ్లు ఎందరు

Spread the love

మనిషి – మనసు పోటీ పడుతూ ఉంటాయి. మంచి – చెడులను అంచనా వేయడం భంగపడటం ఏది ఏమైనా సరే అంటూ మనిషి ముందుకు పోవడం. ఇది మనిషి మనుగడలో నిత్యం జరిగే బ్రతుకు పోరాటం.

  మరి స్త్రీ జీవితంలో ఏముంటుంది.

స్త్రీ – పురుషులు ఇద్దరు సమానమే కదా!  ప్రకృతి ఇచ్చిన వరం స్త్రీ అంటారే అటువంటి స్త్రీ ఎందుకు హింసకు ప్రేరేపిత వస్తువు అవుతుందని   ఎప్పుడు ప్రశ్నించుకున్నా సమాధానం మాత్రం స్త్రీ శారీరకంగా బలహీనురాలు అదొక్కటేనా కారణం. ఏమో ఈ పితృస్వామ్య వ్యవస్థలో  పురుషస్వామ్యం కట్టుకున్న బలమైన సాంప్రదాయపు గోడల  మధ్య స్త్రీ స్వేచ్ఛ ఎప్పుడూ ప్రశ్నార్థకమే అవుతుందనిపిస్తుంది.

 మార్చి అనగానే మహిళా దినోత్సవం గుర్తొస్తుంటుంది అందరి నాల్కలపైన మహిళలకు శుభాకాంక్షల వెల్లువలతో సోషల్ మీడియా మొగిపోతుంటుంది.  అంతా మహిళల కోసమే ప్రపంచం ఉన్నదా అన్నట్లు పోస్టర్లు, వాట్సాప్ స్టేటస్లు ఊరంతా సభలు కొటేషన్లతో నిండిపోతాయి.   . ఇటువంటి సమయంలోనే నాకెందుకో అద్దంలో మగువ ఇంకో రూపం కనిపిస్తుంది. నలిగిపోయిన దేహం, పెదవి దాటని హింసను అనుభవిస్తున్నట్లు.  ఆ హింసకు కారణం కుటుంబవాతావరణం అవడం ఇక్కడ మనం మాట్లాడుకోవలసిన అంశం.  

ప్రపంచవ్యాప్తంగా రెండు నిమిషాలకి ఒకరేప్ జరుగుతుందని భారతదేశంలో 16 నిమిషాలకు ఒక రేప్ జరుగుతూ రేప్ క్యాపిటల్గా పరిగణించబడుతున్నదన్న వాస్తవాన్ని ఎందరు ఆలోచిస్తున్నారు.!

 ఇక్కడ హింస పడుతున్నది స్త్రీ శరీరమే అని ఎందరికీ ఆలోచన వస్తుంది?!

 ఎక్కడో ఎవరూ అనాలోచితంగా, కామ వాంచితంగా  స్త్రీల పై చేసే దౌర్జన్యాన్ని గురించి నేను మాట్లాడబోవడం లేదు.

  కుటుంబంలో పెళ్ళైన స్త్రీలు  83 శాతం  లైంగికహింసను తక్కువపాళ్ళలోనో ఎక్కువగానో  నిత్యం అనుభవిస్తున్నారన్నది చేదు నిజం.

కుటుంబ స్త్రీలపై జరుగుతున్న ఈ లైంగిక దాడులగురించి మాట్లాడుతున్నా.  పితృస్వామ్య వ్యవస్థలో మనుధర్మ శాసనాలని అనుసరించి భార్య ఒక వస్తువు. భర్త స్వేచ్ఛగా తనకి ఇష్టం వచ్చిన రీతిలో, భార్య అనుమతి లేకుండా ఆమె స్వేచ్ఛను కాలరాసి ఆమెను అనుభవించే హక్కు కల్పించిన సమాజ నిర్మాణమూలాల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంత ఉందో అనిపిస్తుంది.  నా చేతిలో పుస్తకం చదువుతుంటే   ఇక్కడ స్త్రీల మనోవేదనని, శారీరకంగా వాళ్లు పడ్డ హింసని చూస్తుంటే వెన్నులోనుండి వణుకు వస్తుంది.

 కేవలం స్త్రీ అయినందుకు రెండు కాళ్ల మధ్య యోని ఉన్నందుకు ఈ నరకం ఆమె అందుకుందా అనిపించక మానదు.

స్త్రీ శరీరం ఒక వస్తువు.

అవసరం అనుకున్నప్పుడు ఉపయోగించుకొని అవసరం తీరాక కాలదన్నే పితృస్వామ్య నిజ రూపం. 

ఎన్నో మూగ గొంతుల ఆర్తనాదం, సాంప్రదాయపు గోడలు మాత్రమే కాదు సమాజపు గోడల్ని విచ్చిన్నం చేయలేని అనేక గొంతులలోనుండి పెల్లుబికిన చిద్రమైన మనోవేదన.  

            మహిళలు ఇంత హింసకి గురవుతున్నారు కేవలం  సాంప్రదాయ గోడల్ని బద్దలు కొట్టలేకనేనా అని అనిపించక మానదు.  

        ఆమెల సంతోషం ఆమెల ఏకాంతంలోనే ఉంది అని చెప్పుకోవలసిన దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది.

         పెళ్లయ్యాక ప్రేమగా,దగ్గరగా,  వలపు సాన్నిహిత్యాన్ని పొందవలసిన చోట, బలవంతపు సంసారంలో  సెక్స్ కోసం జరిగే శారీరక హింస, ఈ హింస అనేక రూపాలుగా స్త్రీ పై దాడి చేస్తుంది.   ఆమెల పై ప్రతిరోజు జరిగే ఈ హింసకి చివరిగాయం రేప్. సెక్స్ కి నో అన్న భార్యని కొట్టి, బెదిరించి, బలాత్కరించి, లొంగ తీసుకుని గెలుపు జెండాని ఎగరేసాం అని చెప్పుకొని మీసం మెలేసే  మూర్ఖులే ఎక్కువ.    ప్రేమగా, లాలనగా ఆమెను చేరి ఆమెను జయించే అస్త్రం తెలిసినవాళ్లు అతి కొద్ది మంది మాత్రమే మన సమాజంలో ఉన్నారు.

 స్త్రీ పట్ల సెన్సిటైజేషన్ ఎంతమందికి ఉంటుంది. ఆ సెన్సిటైజేషన్ అవసరాన్ని గుర్తు చేస్తూ ఒక డాక్టర్ తన దగ్గరికి వచ్చిన పేషంట్ క్లినికల్ హిస్టరీని కథలుగా మలచి “విత్ యువర్ పర్మిషన్” అంటూ నవలని రచించారు డాక్టర్ భారతి గారు. అదేనండి మన గీతాంజలి గారు. ఇంతకుముందు నవలలు హస్బెండ్ స్ట్రీచ్ 1,2,&   స్టోమ వంటి స్త్రీల నిజ గాధలను మనకి పరిచయం చేసిన డాక్టర్ గీతాంజలి గారు.

       భార్యాభర్తల అయినా సరే, శారీరకంగా దగ్గరవడానికి ఇద్దరి అంగీకారం తప్పనిసరి. ఎన్నో కుటుంబాలలో భర్తల చేత రేప్ కి గురైన భార్యలు ఎందరో… ఆ భార్యల మనోవేదనే ఈ పుస్తకం. 

 పాతికేళ్లు కూడా నిండని మహిమ.. పెళ్లి చేసుకున్న భర్త మొదటి రాత్రి ప్రవర్తించిన తీరుకి బెదిరిపోయిన అమ్మాయి తో ఈ కథ మొదలవుతుంది. భార్య అనగానే సెక్స్ కోసం తనకో వస్తువు దొరికింది అన్నంతగా సంబరపడిపోయే అనేక మంది ( పురుషుల) లాగే ఈ భర్త చరణ్ మనోవికారపు గాధతో మొదలై  కోలుకోలేని మానసిక వేదనను అనుభవిస్తున్న మహిమ. తన కుటుంబంలో నానమ్మ లో సాంప్రదాయ కట్టుబాట్లు హింసలో సర్దుబాట్లు వినిపిస్తే అమ్మమ్మలో ఎదిరించి నిలబడే తెగింపు కనిపిస్తుంది.  ఒకానొక సందర్భంలో “స్ట్రాంగ్ ఉమెన్ ఫైట్స్ “ సంస్థలో భర్తలతో లైంగిక హింసలు అనుభవించిన స్త్రీలు వారి ఘర్షణ, బాధ, వేదన,  పోరాటం హింసాత్మక సంబంధాల్ని ధిక్కరించి విడిపోయి ఆత్మగౌరవంతో బతకడం ఇవన్నీ చూసి తనని తాను మార్చుకున్న మహిమ టాక్సిక్ లైఫ్ నుంచి ఎలా బయటపడింది అన్నది ఈ నవల రూపం. అయితే మహిమకు ఎదురైన స్త్రీలు అనుభవించిన శారీరక హింస ఒక సందర్భంలో “ప్రతి ఇంటి గదిలో ఓ అత్యాచారపు వాసన వేస్తుంది” అన్న వాక్యం  అనిపిస్తుంది.

 ఈ హింసను వ్యక్తీకరించడానికి  రచయిత ఒక సందర్భంలో  “ఆడదంటే ఒక వెజైన,  ఒక రంద్రం. మలమూత్రాలు ఎట్లా కమ్మోర్డ్ లో విసర్జిస్తారో అలాగే కామం కలిగినప్పుడు తమ భార్యల దేహంలో వీర్య విసర్జన చేస్తాడు భార్యలంటే ప్రేమ గౌరవం లేని ఈ భర్తలు”  అందరి హింస చదువుతున్నప్పుడు ఈ వాక్యం 100% నిజం అనిపిస్తుంది. 

 స్త్రీ ఇష్టంతో చేసేది కాపురం సంసారం ఆమె అంగీకారం లేకుండా చేసే ఎటువంటి స్పర్శ అయిన  వికృతమే. అటువంటి వికృత చేష్టని ఎదిరించడం ఎంత అవసరమో, త్రీ కి మానసిక బలమే కాదు ఆర్థిక ఆలంబన యొక్క అవసరాన్ని, క్లిష్ట పరిస్థితుల్లో ఆమె చుట్టూ ఉన్న మనుషుల మనోవికారాల్ని ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని ఈ పుస్తకంలోని ప్రతి స్త్రీ యొక్క గాధ మనకు చెప్తుంది.  ఈ పుస్తకంలో 17 భాగాలు ఉంటాయి . భాగానికొక స్త్రీ వేదనలోని సంవేదన  మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది గీతాంజలి గారు.   స్త్రీలపై కుటుంబ వ్యక్తులే ఆమె శారీరక హింసకు కారణం అన్న బలమైన పరిస్థితులు  అన్ని సహజంగా మన చుట్టూ జరిగేవి కానీ ఎన్నో దృష్టిదోషంతో మన కంటికి కనపడవు అటువంటి దృష్టి దోషాల్ని ఇక్కడ రచయిత మనందరితో చర్చిస్తున్నారు.

 ఈ పుస్తకం పెళ్లి కావలసిన ఆడపిల్లలు తప్పక చదవాలి. పెళ్లయిన వాళ్లు మరీ చదవాలి కారణం ఏది హింసో ఏది అనైతికమో.. సెక్స్ లైఫ్ కౌన్సిలర్ గా బాధిత స్త్రీల పక్షాన నిలబడి సమాజానికి అనేక మంది స్త్రీ ల దగ్ధ హృదయావేదనలు మనకి వినిపిస్తున్నారు.     ఈ పుస్తకం చదవడం వల్ల ఈ మూర్ఖపు సమాజంలోని లోతుల్ని తెలుసుకోవచ్చు. ఈ హింసల గురించి ఎవరికీ తెలియదని కాదు అందరికీ తెలిసిన ఎవ్వరు మాట్లాడని గొంతు విప్పని నిశ్శబ్ద వేదన.  ఈ హింసలన్నింటి నుండి బయటపడే మార్గం ఒక్కటే ప్రశ్నించడం. హింసను వ్యతిరేకించడం మనిషికి మనిషిగా నిలబడడం.

 గీతాంజలి గారు ఈ పుస్తకం చదువుతున్నంత సేపు  స్త్రీ స్వగతం ఎంత దుఃఖ భరితం..అనిపించింది. చాలా ఓపిగ్గా ఇందరి నిజ జీవితగాధలను  కథలుగా మలిచి మీ సోషల్ రెస్పాన్సిబిలిటీని చూపించారు.    ధన్యవాదాలు.

 గుడ్ బుక్ శ్వేత  గారు

 పుస్తకం పేరు: విత్ యువర్ పర్మిషన్

 రచయిత : గీతాంజలి

( డాక్టర్ భారతి )

 అజు పబ్లికేషన్స్.

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *