అద్దం చూసిన ఆత్మ

Spread the love

నడక మొదలుపెట్టినపుడల్లా
నన్ను నేను వెంబడిస్తున్నానని
తెలియదు

లోకం చూపు పెద్దదే
కానీ
మనసు గోడలే
అంతకంతకూ కుదించుకుపోతున్నాయి

అరచేతిలో
పట్టుకున్న కాంతిరేఖ
ఎప్పుడో
వేలి చివర్లోంచి జారిపోయింది

మాటలు పెరిగిపోయాయి
అర్థాలు మారిపోయాయి
చూపులు కలిశాయి
మనసులు దూరమయ్యాయి

గెలవాలనే ఆరాటంలో
మనిషి
తనని తానే ఓడించుకుంటున్నాడు

ప్రతీ ఉదయం
ఓ కొత్తఆశతో
పొద్దు తలుపు తెరిచినా
సాయంత్రానికల్లా
తిరిగి అదే ప్రశ్నతో అస్తమయాన్ని చూస్తున్నాం

నిశ్శబ్దం కూడా
ఒక సంభాషణే కదా...
వినగలిగే హృదయముంటే
మౌనం ఆంతర్యం బోధపడుతుంది

పైకి గాయాలు
కనిపించవు కానీ
రక్తస్రావం మాత్రం ఆగదు లోలోపట!

అద్దం ముందు నిలబడినపుడు
ముఖం కనిపిస్తుంది
ఆత్మ మాత్రం
ప్రశ్నార్థకంగా నిలుస్తుంది

అయినా
ఒక చిన్ని ప్రపంచాన్ని
గుండె గర్భంలో మోస్తూనే ఉంటుంది
ఎన్. లహరి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *