నిజమే
పచ్చిగా గాయాలై సలుపుతూ కొన్ని
వెచ్చగా చెంపల్ని తడుముతూ మరికొన్ని
పెదవులపై మౌన ముద్రల్ని గీస్తూ ఇంకొన్ని
బ్రతికే ఉన్నామనే స్పృహ కలిగిస్తుంటాయ్ ..
ఒక్కచోట పోగుపడ్డ జ్ఞాపకాలన్నీ
మనసు నిండా పరుచుకునే క్షణాల్లో...
బరువైన తలపుల్ని జారవిడిస్తేనే కదా
నడక తేలికయ్యేది?
ప్రస్థానం ఏదైనా
పయనం ఆవశ్యకమే కదా!
కానీ
ఊపిరి శ్వాసలే భారమవుతున్న వేళ,
నిశ్శబ్దం కూడా భరించరానిదయ్యే లిప్తల్లో
ఈ భారమైన జ్ఞాపకాలకెందుకు మళ్ళీ స్థానం ఇవ్వడం?
"జ్ఞాపకాన్ని ఇక జ్ఞాపకం చేసుకోను" అని
ప్రతి ఉదయం నాకు నేనిచ్చుకున్న మాటను
పదే పదే మర్చిపోతుంటాను!
అయినా
నిలకడగానే ఉన్నా,
నన్ను నేను నిర్మించుకుంటూనే ఉన్నా.
ఒక్కో ఆశను పేర్చుకుంటూ,
నిలువెత్తు విజయాన్నై నన్ను నేను నిలబెట్టుకుంటూనే ఉన్నా.
జ్ఞాపకం ఒక వ్యసనం వదలదు!
సాయంత్రం గూడునొదిలిన పక్షులైతే తప్ప
అందుకే
జిందగీ మే యాద్ న బిచ్డేంగే న కభీ

