కొందరి స్వచ్ఛత చూస్తే సిగ్గుతో భూమి చీలి లోపలికి కుంచించుకు పోవాలనిపిస్తుంది
కొందరి ఆదర్శాలు చూస్తే ఇంతవరకు వేసుకున్న ముసుగులు విప్పి పారిపోవాలనిపిస్తుంది
కొందరి సమాజం పట్ల నిబద్ధత చూస్తే నేనెందుకు ఇలా లేనే అనే దుఃఖం పొర్లుకొస్తుంది
కొందరి నిష్కల్మషమైన నవ్వు చూసి ప్రపంచంలో బాధలన్నీ శాపవిమోచనం చెందుతాయి
కొందరి జీవనశైలి చూస్తే ఇంతకన్నా గొప్ప జీవితం ఏమైనా ఉంటుందా అనిపిస్తుంది
పైన చెప్పినవన్నీ మీరు ఒకసారి రోహిణి గారిని కలిస్తే, తలిస్తే తప్పక స్పురణకొస్తాయి. అభ్యుదయాన్ని ఆచరణలో చూపించే అపురూప వ్యక్తిత్వం ఆమెది.
ఇంగ్లీషు భాషలో ప్రోగ్రెసివ్ అనే పదాన్ని అనువదిస్తే అభ్యుదయ, ప్రగతిశీల, పురోగామి ముందుకు నడిపించే అనే అనేక అర్ధాలు లేక నిర్వచనాలు మనకు డిక్షనరీలో కనిపిస్తాయి. ఇకపై డిక్షనరీ తిరగరాసేవారు ఆ పదాలన్నిటిని నిరభ్యంతరంగా నిరాటంకంగా తొలగించి ఒక్క రోహిణి అని ఉంచితే ఆ పదానికి సార్ధకత చేకూరుతుంది. ప్రస్తుత ప్రపంచ వినిమయ విపణి వీధిలో మానవ ఆదర్శాలన్నీ రూపు మార్చుకొని నిస్సిగ్గుగా నడివీధిలో నర్తనం చేసే సందిగ్ధంలో సందర్భంలో పైన చెప్పిన అర్ధాలన్నీ కాల దోషం పట్టాయి. రోడ్డుమీద వచ్చి నిలుచుంటే వందల కోట్ల ఆస్తులను పోగేసుకున్న కమ్యూనిస్టు ఆసామి సరికొత్త బెంజ్ కారులో పోతూ దర్శనమిస్తాడు. గాడ్సేల వారసులు రొమ్ము విరుచుకుని రంకెలేస్తూ రోడ్డునంతా ఆక్రమించి గందరగోళం చేస్తారు. గాంధీజీయుల వారసులు బిక్కుబిక్కుమంటూ ఇంటి గోడల మధ్య బంధీలయ్యే పరిస్థితి లో నెట్టబడతారు. వాట్సప్ యూనివర్సిటీలో పెంచబడిన విషపూరిత పుట్టగొడుగుల కథనాలు రంగు రూపు మార్చుకొని అందంగా ముస్తాబై ప్రజలకు వేడివేడి మంచూరియాలా సెల్ ఫోన్ ప్లేట్ లో అందజేయబడతాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం కొట్టుమిట్లాడుతుంది. ఈ పరిస్థితులలో ఆవిష్కరింపబడిన దిగులు వర్ణం పుస్తకం సమాజపు వేసుకున్న రంగు తొలగించి అసలైన రూపు చూపిస్తుంది.
దాతృత్వం అనేది ఇంటి వద్ద మొదలవ్వాలంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆదర్శం ఇంటి వద్ద బయలుదేరాలి. అది ఆ వీధి ఈ వీధి చుట్టి ప్రపంచాన్ని దాసోహం చేసుకోవాలి. ఎందుకంటే దాతృత్వం అనేది ఆదర్శం లో ఒక చిన్న భాగం కాబట్టి. సక్రమంగాను అక్రమంగాను విపరీతంగా డబ్బులు సంపాదించిన ధనికులు దానాలు చేయడం ఈ మధ్యకాలంలో గమనిస్తుంటాం. ఆదర్శంలో అది ఒక చిన్న పార్శ్వం మాత్రమే. ఆదర్శంలో కేవలం దానాలు చేయటమే కాదు డబ్బు పంచడమే కాదు తమ సమయాన్ని, సంతోషాలను, మేధో సామర్ధ్యాలను, తమ సరదాలను, తమ సమస్తాన్ని, తమ జీవితాన్ని సమాజానికి సమర్పించే ఔన్నత్యం కలిగి ఉండటం. తనకి ఉన్నదంతా ఇచ్చేసి ఖాళీగా రోడ్డుపై నవ్వుతూ నిలబడటం. అలాంటి వ్యక్తిత్వం మనకు ఈ పుస్తకం రాసిన రచయితలో ప్రత్యక్షమవుతుంది.
కవులు రచయితలు రాసిన పుస్తకాలలో సహజంగా మేలు తాలూ కలయిక ఉండటం మూలాన మేలిమి వాటిలో కొన్నిటిని ఏరుకొని విశ్లేషించటం కొంచెం సుఖమైన విధానం. కానీ సంపుటి నిండా మానవత్వ తత్వం ఉన్న, ఉన్నతమైన, ఉత్తమమైన కవితలు నిండితే సమీక్ష రాయాలంటే సమీక్షకునికి దిగులు దిక్కుల్ని దాటుతుంది. కొన్నిటిని వదిలేసి కొన్నిటిని సమీక్షకు తీసుకోవటం చాలా క్లిష్టమైన పరిస్థితి. అయితే ఒక సానుకూలత కూడా ఇందులో ఉంది. ఒక అంధుడు కింబర్లీ వజ్రాల గనిలో అడుగుపెడితే ఏది పట్టినా అమూల్యమైన వజ్రం దొరికినట్లు ఈ పుస్తకంలో పట్టిందల్లా బంగారమే. నిజం చెప్పాలంటే దిగులు వర్ణం అనే ఈ పుస్తకం చదివిన తర్వాత నాకున్న అనేక రకాల దిగుళ్ళు ఆశ్చర్యంగా మాయమైపోయాయి. ఎందుకంటే సాహిత్యంలో సంవత్సరానికి ఇటువంటి పుస్తకాలు ఒకటి రెండు వచ్చినా సమాజానికి అంటుకున్న కుల మత ప్రాంత లాంటి అనేక రుగ్మతలలో కొన్నిటినైనా తొలగిస్తాయి అనే బలమైన నమ్మకం ఏర్పడింది.
పుస్తక రచయిత్రి సహజంగా సున్నిత సుకుమార భావనా తపస్వి. భూమాత పైన, భూమిపై పెరిగే పక్షుల పట్ల, పెంపుడు జంతువుల పట్ల వల్లమాలిన ప్రేమ కలిగిన యశస్వి, పరవశించే ప్రకృతి ఆరాధకురాలు ఈ సంపుటిలో తొలి కవిత నేలతల్లి భూమి వెదజల్లే ప్రత్యేక పరిమళాన్ని దాన్ని తాదాత్మ్యతతో అనుభూతి చెందిన కవయిత్రి పొందిన పరవశాన్ని మన కళ్ళ ముందు అక్షరాలతో మాయాజాలం చేస్తుంది. కవిత లోకి వెళ్తే…
నాగలి కర్రుతో నువ్వు నా గుండెను చీల్చుతూ ఉంటే
పసిబిడ్డడు పాలు తాగుతూ లేత పాదాలతో నా గుండెల మీద
తన్నినట్లు పరవశించిపోయాను
చెంగోవాలు కట్టి చాడపెడితే
అద్దంలో ఉన్న నాలో పొద్దపు ప్రతిబింబం
మెరిసిపోతుంటే మురిసిపోతూ అన్నం
విత్తనాలు వేసే నీ చేతి స్పర్శ కోసం
స్వాగత తోరణాలతో ఎదురుచూసా
ఆకు పచ్చ చీర కట్టుకున్న పడుచు పిల్ల పరుగు తీస్తుంటే
పైట చెంగు రెపరెపలాడినట్లు పైరగాలి వీచినప్పుడల్లా నాట్యం ఆడుతూ
గాలివెంటే ఊయల లాగే పచ్చటి కంకులను
మట్టిలో చెరిగిపోకుండా కాపాడే పునాదినయ్యాను
అని అంటూ చివరగా…
కానీ ఈ రోజు నీ పంట మీద నీకు హక్కు లేదంటూ నిన్ను నిలువునా నిలవరిస్తుంటే
ఏమి చేయలేని సహాయ తల్లిలా తల్లడిల్లుతన్నా….
అని అంటూ భూమాత తన బాగోగులు చూస్తూ, తనపై అత్యంత ప్రేమ కలిగిన కుమారుడైన రైతు పడుతున్న కష్టాన్ని చూస్తూ దుఃఖిస్తూ రాసిన లేఖలా ఈ కవిత కనిపిస్తుంది. ధరణి పడే వేదనను రోహిణి అని పిలువబడే తరుణిమణి మనకు వినిపిస్తుంది.
మకరందం అనే మరో కవితలో మనిషి దేహమంతా దుర్గంధాల వ్యర్ధాల కూడిక అని, కేవలం మాట్లాడే మాట మాత్రమే మనిషికి సాంత్వన చేకూరుస్తుందని, ఆ మాట పదునుగా గాయపరుస్తూ తూటాలా ఉండకుండా పువ్వులా మెత్తగా ఉండాలని కవయత్రి సందేశం ఇస్తారు. మీరే చదవండి కవితను ఎంత మనోరంజితంగా రాశారో ..
మాట హృదయ వీణను మీటాలి
కరువు నేలను వాన నీటి చుక్క తడిపినట్లు
మాట గుండె బరువును దింపేయాలి
మాట వెన్నెల్లో జాబిలి అవ్వాలి
జాజిపూల పరిమళంలా మనసును కట్టుటేయాలి
మాట మంచి గంధపు పూతలా సేద తీర్చాలి
పెదవి దాటిన మాట ఊరు దాటుతుంది
అన్యాయమైన చోట మాటని ఆయుధంలా వాడాలి
అవసరమైన చోట మాట సాయం అందించాలి
అని అంటూ చివరగా
మాటకి విలువ లేని చోట
మౌనమే నీవు విసరాల్చిన తూటా
అంటూ పరుషంగా మాట్లాడే వారికి, అన్యాయాలపై మాట్లాడాల్సి కూడా మాట్లాడలేని వారికి తూటా దెబ్బ తినిపిస్తారు.
ఈ కవితా సంపుటికే ఒక మరకతమణి లాంటి అవును నేను చెడ్డదాన్నే అనే కవితలో కవయిత్రి తనలో దాగిన అసలైన మనిషి విశ్వరూపం చూపిస్తారు, అన్యాయాలపై అకృత్యాలపై తన నిరసన బడబాగ్నితో విస్పోటనం చెందుతారు. మనిషిగా చేయాల్సిన పనులు చేస్తున్నప్పుడు చెడ్డవారిగా ముద్ర వేసినా నాకేం బాధ లేదు, నేను చలించను అంటూ ధైర్యంగా తన వాదనను ఈ కవిత ద్వారా ముందుకు తెచ్చారు.
పరువంటూ కన్నబిడ్డ బొట్టు తుడిచేసే
కర్కోటపు నాన్నల వినాశనాన్ని కోరే నేను చెడ్డదాన్నే
ప్రేమించిందని కన్న కూతురి కుత్తుక కోసిన
కసాయి తండ్రిని తిట్టిన నేను చెడ్డదాన్ని
ప్రేమించలేదని అమ్మాయి ముఖాన్ని యాసిడ్తో
వికృతం చేసిన అగంతుకుడిని శపించిన నేను చెడ్డదాన్నే
కట్నం తేలేదని కట్టుకున్న ఆలిని కాటికి పంపిన భర్త కళేబరాన్ని
కాకులు పొడబాలనుకున్న నేను చెడ్డదాన్నే
ఆలి గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలిసి అమ్మతనాన్ని చిదిమేసే
కర్కోటకుడి చేతులకు బేడీలు వేసియాలనుకునే నేను చెడ్డదాన్నే
ఒంటరి ఆడపిల్లలపై దుర్మార్గపు జంతువుల దాడి చేసి
ఆపై సజీవ దహనం చేసిన మృగాలను చంపాలనుకున్న నేను చెడ్డదాన్నే
అని అంటూ నిత్యకృత్యంగా మహిళలపై జరిగే అకృత్యాలను తీవ్రంగా నిరసిస్తూ, అన్యాయాలను ఖండిస్తూ సాగిన ఈ కవనం దుర్మార్గుల గుండెల్లో సూటిగా దిగిన గునపం.
ప్రస్తుతం దేశంలో రాజ్యం కనుసన్నలలో జరుగుతున్న విపరీత పరిణామాలను, అమాయకులపై అఘాయిత్యాలను చూస్తూ ఊరుకోలేని కవయిత్రి పదునైన అక్షర బాణాలతో, వ్యంగ్యాస్త్రాలతో సంధించిన కవిత డెజావు . సున్నితమైన పదాలతో సుతిమెత్తని భావాలతో రాసే కవయత్రి కడుపులో రగులుతున్న ఆగ్రహం కట్టలు దాటితే ఎలా ఉంటుందో ఈ కవితలో రుచి చూపించారు. మీరే చూడండి..
మానభంగం జరిగిందా..
అబ్బే మీ అనుమానం అంతే..
జరిగినట్లయితే ఒక ఆనవాలు కూడా కనబడలేదుగా
మేము మానం మీద మసిబూసి మారేడు కాయ చేసేస్తాముగా
నాలుక తెగ కోశారా
ఊరుకోండి చాలుగాని… అంతా మీ భ్రమ
మేము తమ్మినైనా బొమ్మిని చేసేస్తాంగా…
మీకు డబ్బు అధికారం ఉందా చెప్పండి
ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు మేము తాను మారు చేసేస్తాం గా
సాక్షాలా.. నీ పిచ్చి గాని
బూడిద కూడా ఆనవాలు
దొరకకుండా చేయటం మాకు
వెన్నతో పెట్టిన విద్య
అని అంటూ ప్రజలకు కూడా చురకలు ఈ విధంగా పెడతారు
ప్రజలా …పిచ్చి మొహాలు
రకరకాల భ్రమల్లో పరిభ్రమిస్తుంటారు
మరో కేసు వచ్చే వరకే ఈ భ్రమ
నీ పని మీరు కాని చేయండి
అంటూ నిర్లిప్తతతో నిద్రాణ స్థితిలో ఉన్న సమాజాన్ని భ్రమలలో పరిభ్రమించే వ్యవస్థగా అభివర్ణిస్తారు. ఎంతో ఆవేదనతో రాసిన కవిత ఇది. ఒకవైపు దుర్మార్గాలు జరుగుతూ పోతూ ఉంటే దాన్ని ప్రశ్నించలేని నిశ్శబ్ద సమాజ మౌనాన్ని కూడా కవయిత్రి ప్రశ్నిస్తారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంపుటిలో ప్రతి కవిత ఒక మేలిమి ముత్యం లాంటిది. దాని సౌందర్యం వర్ణించటం సమీక్షకునికి సాధ్యం కాని పని. చివరగా కవచ కుండలాలు అనే కవితను స్పర్శించి ఈ సమీక్షను ముగిస్తాను. ఈ కవితలో కవయిత్రి గారి ఆలోచనా సరళి, జీవిత ఆదర్శాలు, తను పాటించే విలువలను సాంద్రమైన భావాలతో, చక్కని పదాలతో నిజజీవిత ఉదాహరణలతో నిజాయితీ కలిగిన హృదయంతో వర్ణిస్తారు. ఒకసారి కవితలోకి వెళ్దాం..
మరణం అంటే మట్టిలో కలవటమేగా
స్థూలం నుండి సూక్ష్మలోకి మారడమేగా
మనం లేని నాడు బాధ్యత
కొడుకు చేతిలో కొరివి అవుతుంది
ప్రేమ కూతురి కంటిలో నీరవుతోంది
మన సగం తోడు జీవితం
ఒంటెద్దు బండి ప్రయాణం అవుతుంది మనం లేని నాడు
సూర్యుడు పడమట ఉదయించడు సునామీలు ఉప్పొంగవు
మనకట్టే కాలే వరకే నలుగురు చెంత
మరో రోజు నుంచి అంతా మామూలే…
ఈ కవిత చదివిన తర్వాత మరణం గురించి కవయిత్రి ఇచ్చిన నిర్వచనం అత్యున్నత స్థాయిలో మనకు కనిపిస్తుంది. మరణం తర్వాత ఆ మరుక్షణం జరగబోయే పరిణామాలను నిక్కచ్చిగా కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తుంది. మరి ఇటువంటి క్షణభంగురమైన జీవితాన్ని శాంతంగా, సాఫీగా, ద్వేషరహితంగా సాగించాలని సందేశం కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది. అదేంటో చూద్దాం…
కులమత ద్వేషాలను రూపుమాపి
మానవత్వం పల్లకి బోయీలమై
మంచిని మనిషి మనిషికి పంచిపెడదాం
పరువు హత్యలు పగలు అంటూ
కన్న బిడ్డలను కాటేసే విషనాగులం కాకుండా
కడుపులో దాచుకుని కాపాడే కవచకుండలాలవుదాం
కామపు మృగాల వలే కాక
మనసున్న మనుషులుగా మారుదాం…
జీవితానికి పరిపూర్ణమైన అర్ధాన్ని, సార్ధకతను తెలియజేసే ఈ కవితలో ఉన్న ప్రతి అక్షరాన్ని అక్షరాలా పాటించే నిఖార్సైన రచయిత్రి రోహిణి గారు. ఈ కవిత అనే కాదు, కవితా సంపుటి నిండా తను పాటించే ఆదర్శాలను, విలువలను మాత్రమే తెలియజెప్పారు. ఏమాత్రం హిపోక్రసీకి తావు లేకుండా జీవితాన్ని కవిత్వాన్ని సద్భావనతో సామరస్యంతో నడిపించే ఆచరణశీలి మన కవయిత్రి రోహిణి గారు.
సమాజానికి దిశా నిర్దేశం చూపించే ఇటువంటి కవితా సంపుటాలు మరిన్ని వెలువరించాలని, నిజజీవితంలో ఆచరించే సందేశాన్ని కవిత్వ రూపంలో కథల రూపంలో సమాజానికి అందించాలని రోహిణి గారిని కోరుకుంటూ ఈ సమీక్ష ముగిస్తున్నాను.
డాక్టర్ జెల్ది విద్యాధర్
అధ్యక్షులు
విమల సాహితీ సమితి
హైదరాబాద్

డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు
డాక్టర్ జెల్ది విద్యాధర్ రావు IRS
విమల సాహితీ సమితి అధ్యక్షులు
