స్వర్గాదపి…

Spread the love

అది అతడి స్వగ్రామం. దానంత మంచి ఊరు మరొకటిలేదు. దానంత కుళ్ళుది ఇంకొకటి లేదు. అది అతడి ఆప్త మిత్రుడు. అదే అతడి గర్భశత్రువు. కలలో బాగుంటుంది. దాన్నతడు మెచ్చుకోలేడు, ఇలలో ఇంపుగా ఉండదు. ఇంకొకళ్ళు తిడితే సహించ లేడు,

ఆ ఇరుకులో, మురికిలో, అతడు ఇముడలేకపొయ్యాడు. పారిపొయ్యాడు. ఆ ఊరినతడు వదిలిపెట్టి పుష్కరం దాటింది. ఈ పన్నెండేళ్ళూ దాన్నతడు తలచుకొననిరోజంటూ లేదు. ఏ కొత్తఊరి కెళ్ళినా ఆ ఊరిని తన ఊరితో పోల్చుకొనక మానడు.

స్వగ్రామం కుగ్రామం కాదు. చిక్కి శల్యమైన వాడి లాల్చీలాగ వదులుగా ఉన్న ఊరు. అలాగని ఆ ఊరిజనాబా అంతంతమాత్రం కాదు. బెల్లంచుట్టూ ముసిరే ఈగల్లాగ ఒకటే మంద. ఆ ఊరు నెలల తరబడి రేవుచూడని లాల్చీ. కాదు, కాదు, సంవత్సరాల తరబడి ఉతకని పొత్తుపంచ.

అవును, ఆ ఊరు మడిబట్ట. అందులోకీ అపరిశుభ్ర మైనది. అసన్యమైనది. అసహ్యమైనది. ఆ ఊరివాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. అయినా ఆ ఊరినుంచి మహామేధావులు పైకొచ్చారు. ఆ ఊరు మోటుతనంలో రాటు తేరింది. అయినా ఆ ఊరివాళ్ళ హృదయాలు నాజూకైనవి. సరళమైనవి, లలితమైనవి. ఎండలో నేతిముద్దని పెడితే కరక్కపోవచ్చు- బాధపడుతున్న వాళ్ళని చూస్తే ఆ ఊరి హృదయాలు కరిగి అనవాళ్ళు కూడా దొరకవు. ఆ ఊరు అన్ని ఊళ్ళవంటిదే.

పుట్టి పెరిగిన ఊరిని కట్టుబట్టలతో విడిచిపెట్టిన ఇన్నాళ్ళకి, అతడు మళ్ళా అక్కడికి చేరుకున్నాడు. రైలు ఆ ఊరి పరిసరాలకి సమీపించగానే అతడి హృదయం ఉవ్వెత్తున ఎగిరింది. రైలు పెట్టెలో అతనొక్కడే ఉన్నాడు. కుడిచేతి పక్క కిటికీలోంచి చూస్తున్నాడు. చిన్నప్పడు వనభోజనాలకి వచ్చిన తోట కనబడింది. దాన్నిచూసి అతడు గుర్తుపట్ట లేకపొయ్యాడు. పిరుదులదాకా వేళ్ళాడే ఒత్తుగా ఉన్న జుత్తుని క త్తిరించి ‘బాబ్’ చేసుకొన్న రంగేళీ యువతిలాగ తోట పలచబడింది. శివార్లలో బంగళాలు లేచాయి. కుడి ప్రక్క దృశ్యాలు చూస్తూ ఉంటే ఎడంపక్క చూడవలసినవి చూట్టం లేదే అని బాధపడ్డాడు. ఎడం పక్కకి చూపు తిప్పాడు. ఎడం పక్కని దొరల గోరీలతోట ఉంది, గోరీల తోటే. ఏ ఊళ్లో అయినా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారదు.

గోరీల తోటని చూడగానే అతడికి చిన్నప్పటి స్మృతులు జ్ఞాపకానికొచ్చాయి. పదహారేళ్ళు నిండిన వేడివయస్సులో… దేముడిమీద నమ్మకం, దెయ్యాలంటే భయంపోతున్న రోజుల్లో తానూ స్నేహితులూ కలిసి గోరీలతోట గోడల్ని గెంతి చెయ్యెత్తు పెరిగిన పచ్చిగడ్డిలో కూర్చుని చదవకూడని పుస్తకాలు చదువుకొన్నారు. పిక్నిక్లు జరుపుకొన్నారు. అది వాళ్ళ అద్దె కట్లక్కర్లేని లాడ్జి.

గోరీల తోటలోని ఒకనాటి సంఘటనని తలచుకొంటే అతనికి ఇప్పుడు ఒళ్ళు గగుర్పొడిచింది. ఆనాడు మధ్యాహ్నం ఎర్రని ఎండ మండుతున్న సమయంలో అతడు గోడ గెంతి తోటలో దిగాడు. అప్పటికి స్నేహితులు రాలేదు. ఒక చెట్టు కింద బల్లపరుపుగా ఉన్న గోరీమీద కూర్చొని తను సిగరెట్టు ముట్టించాడు గోరీ పలక మీది అక్షరాలు చదివాడు. జోన్ పాల్సన్ అనే పదహారేళ్ళ వ్యక్తి సమాధి అది. అంటే తన వయస్సు వ్యక్తిదే. జోన్ అన్న పేరు ఆడ పేరో మగ పేరో తనకు తెలియదు. ఎండ వేపుతున్నాది. చెమటలు కారుతున్నాయి. అతడు లాల్చీనిప్పి చెట్టుకొమ్మకి తగిలించాడు. సమాధి మీద వెలకితలా పడుకొని సిగరెట్టుకాల్చి ఆఖరి పీల్పులు పీల్చి పారేశాడు. ఎప్పుడు నిద్రపట్టిందో తనకు తెలియదు.

కాల్చి పారవేసిన సిగరెట్ పీకవల్ల ఎండుటాకులు అంటుకొన్నాయి. ఆ సెగ చేత ఆకుల్లో దాగిన పురుగులు బయటకు వచ్చాయి. గోరీ చుట్టూ మంటలు. గోరీమీదకి పురుగులు చేరుతున్నాయి. ఇంతలో అతిడికి తెలివివచ్చింది. తోట తలుపులు తెరచుకొని దొరలు దొరసానులు లోపలికి వస్తున్నారు. తనకి గాభరా పుట్టింది. కాళ్ళ దగ్గర పురుగులు, చుట్టూ మంటలు, కోపగించుకున్న దొరలు, దొరసానులు -ఏంచెయ్యాలో తోచక, ఏదైనా తోచకముందే ఒక్క గెంతువేసి గోడ యెక్కి వీధిలోకి గెంతి పారిపొయ్యాడు, లాల్చీ మరచిపోయి, ఆ దొరలు, దొరసానులు ఏమనుకున్నారో!

లాల్చీలేకుండా వూళ్ళోకెళ్ళడం సిగ్గు. బనీను కూడా లేదు. లాల్చీకోసం చీకటిపడేదాకా వనభోజనాల తోటలో గడిపి రాత్రి బాగా పొద్దు పోయాక యింటికి చేరుకొన్నాడు. ఇంట్లో తాను అడుగుపెట్టేసరికి తన లాల్చీ కనబడింది. రుద్రుడిలాగ నాన్న తనకోసం కాచుకొని వున్నాడు. ఏం ప్రశ్నించకుండా తనని నాన్న చితకబాదాడు. ఒళ్ళు హూనం  చేశాడు. తినగలిగినన్ని దెబ్బలు తిని తనకి తెలియకుండానే నాన్న మీద తను తిరగబడ్డాడు. మాటకిమాట ఎదురు చెప్పాడు. ఎదిగిన కుర్రాణ్ని కొట్టకూడదని నాన్నకి అప్పుడే తట్టింది. తాను ఎదురుతిరగడం తనకీ, నాన్నకీ ఒక్కసారే ఆశ్చర్యం వేసింది. అదే ఆఖరిసారి, నాన్న తనని కొట్టడం. తను ఎదురుతిరగ్గానే నాన్న తనని ఇంట్లోంచి పంపించి వేశాడు. తాను వీధరుగుమీదే కూర్చున్నాడు. అర్ధరాత్రివేళ అమ్మ అన్నం తీసుకొచ్చి పెట్టింది. నాన్న చూసీచూడకుండా ఊరుకొన్నాడు. తెల్లారుఝామున పనిమనిషి వచ్చేవేళ, అమ్మ తలుపు తెరిస్తే తాను ఇంట్లోకి వెళ్ళి చలివేస్తున్నందుచేత కప్పుకొని పడుకొన్నాడు. తాను నిద్రలేచేలోగా నాన్న వీధిలోకి వెళ్ళిపొయ్యాడు. ఆరాత్రి నాన్న నిద్రపోయాక తాను యింటికి వచ్చాడు. మూడురోజులు ఇద్దరూ మాట్లాడుకో లేదు. నాలుగో రోజున స్కూలు జీతం కట్టాల్సివచ్చింది. అడిగేక నాన్న మారుమాట్లాడకుండా ఇచ్చాడు. అయిదో రోజున అడక్కుండానే నాన్న లాల్చీగుడ్డ కొనితెచ్చాడు.

రైలు ప్లాటుఫారంమోదికి వస్తున్నాది. అతడికి అది తమ ఊరి ప్లాటుఫారమేనా అన్న అనుమానం కలిగింది. తాను విడిచిపెట్టినప్పుడు అది బోడిగా మొండిగా బోసిగా వుండేది. ఇప్పుడో పైన రేకుల షెడ్డు, పుస్తకాల అంగడి, టీ దుకాణం, ఎన్నో మార్పులు, ఎంతో అభివృద్ధి.

రైలు దిగగానే ఒక్కడూ తన్ను గుర్తుపట్టలేదు. సామాన్లుమోసే కూలివాళ్ళు, టికెట్టు వసూలు చేసే ఉద్యోగి, ‘అబ్బాయిగారూ! బండీ!’ అని చుట్టుముట్టే బళ్ళవాళ్ళు- ఎవరూ తనని గుర్తుపట్టలేదు. అతడి మనస్సు చివుక్కు మంది. బళ్ళవాళ్ళలో తనని ఎవరూ గుర్తు పట్టకపోవడం అతడికి మరీ బాధ అనిపించింది. పదమూడేళ్ల కిందట ఆ ఊరి బళ్ళ వాళ్ళ యూనియన్ స్థాపించడానికి కారకులలో తానొకడు. ఆ యూనియన్ సోషలిస్టుల చేతుల్లోకి పోకుండా తానెంత కష్ట పడ్డాడని! విశ్వాస ఘాతుకులు. ఈ బళ్ళవాళ్ళు తనని గుర్తించ లేదు. వాళ్ళలో తనకు తెలిసిన మొఖం ఒకటీ లేదని తానుమరచి పొయ్యాడు.

బండీ కట్టించుకోలేదు. నడక సాగించాడు. ఎంత చిన్న సందులు; ఎంత మురికి వీధులు! రెండుపక్కల నుంచీ ఇళ్ళు దగ్గరగా జరిగి తన్ను నలిపేస్తాయేమో అన్నంత సన్నని సందులు. ఇంట్లోని చెత్తంతా ఇళ్ళముందు పోసే పరిశుభ్రమైన ఇల్లాళ్ళు. మేట వేసిన కుళ్ళు కాలవలు. రోడ్డుమీద కూర్చున్న దిసమొల కుర్రాళ్ళు. పెంటపోగులు. తడిగా విడిగా తిరుగుతున్న పందులు. గజ్జి కుక్కలు. అప్పటికే ధూళిలో కలసిన ముగ్గులు. అన్నీ తెలిసిన వీధులే; కంఠస్థం అయిన దారులే!

ఈ వీధిలోంచే బడికి వెళ్ళేవాడు. ఇక్కడే తాను కావాలని ఉత్త పుణ్యానికి పలక బద్దలు కొట్టేడు, ఇదుగో ఇక్కడ గోలీలు ఆడేవాడు. ఈ ఊరు దుమ్మునింకా తాను గుర్తు పట్టగలడే! తన్నెవరూ పోల్చుకోరేం! వీథరుగుమీద  కూర్చొని పళ్ళు తోముకొంటున్న నిద్రమొకాలు ఏ ఒక్కటీ తనని పలకరించదేం! తన రూపు రేఖలు అంత మారిపొయ్యాయా! తాను పరాయివాడయిపోయాడా!

మంగలి రామన్న పొదిపట్టుకొని వస్తున్నాడు. తమ యింట్లో వాడు వాడిక మంగలాడు. వీడితో తానెన్ని యుద్ధాలు చేశాడు? సెలూసు కెళ్ళి క్షవరం చేయించుకొనే వయస్సూ, ధైర్యం వచ్చేదాకా వీడిచేతుల్లోనే తన తల అప్పగించేవాడే – వీడుకూడా తనని గుర్తు పట్టలేదా?

‘రామన్నా! ఆగరా! ఆగు – గెడ్డంగీయి!’

అగడే -వినడే. ఊరెంత మారిపోయింది? ఊళ్ళో మనుష్యులెంత మారిపొయ్యారు?

లేదు-ఊరూ మారలేదు. మనుష్యులూ మారలేదు. అదే చెత్త, అదే చెదారం అదే సందులూ గొందులూ, అదుగో ఆ చెరువే ఇప్పటికీ ఉంది. ఆ రోజుల్లో విస్తారమైన నాచుతోనే ఇప్పటికీ! చెరువుగట్టుమీది మనుష్యులూ. వాళ్ళే పావంచాలమీద గావంచాలు ఉతుక్కొంటూ ఆ బోదకాళ్ళ వాళ్ళే. ఆ కావిళ్ల వాళ్ళే! అయ్యో! ఆడవాళ్ళు! చెరువులో స్నానంచేసి బట్టలు మార్చుకోడానికి మరుగు కావాలన్న ఇంగితజ్ఞానం ఈ నాటికీ వీళ్ళకి, ఈ పవిత్రులైన బుద్ధిహీనుల కెప్పటికి కలిగేను! కటకటా ఆచారం!!

చెరువు అవతలి గట్టున అదుగో అంజనేయస్వామి వారి కోవిల, అక్కడికి వెళ్ళడానికి తనకి మనస్కరించడం లేదు. చిన్నప్పుడు బడి ఎగేసి మూడు గంటలాట సినీమాకి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి వెళ్ళ వలసివచ్చినప్పుడు ఆంజనేయుల వారిని హరీబరీగా దర్శించి సింధూరం పెట్టుకొని ఇంటికెళ్ళి ‘ఏఁవిరా ఇంతాలస్యం’ అని అంటే ‘కోవెల కెళ్ళా’నని తప్పించుకొనేవాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అగత్యం లేదు.

మంగలి రామన్న మళ్ళా ఎదురయ్యాడు. పొద్దున్న పదిస్నరదాకా వాడంత పని ఉన్న మంగలి మరొకడు లేడు. వీడు వెయ్యిళ్ళపూజారి. తలమాసిన కుర్రాళ్ళకీ, తల చెడ్డ ముసలివాళ్ళకీ క్షవరం చెయ్యడంలో ఎక్స్పర్టు. పీర్ల బాజా వాయించడంలో ఘటికుడు. వీడి ఎడం చేతికి ఒక సత్తు వుంగరం ఉండేది. ఇదిగో ఇప్పటికీ ఉంది. క్షవరం చేస్తున్నప్పుడు కుర్రాళ్ళు అటూఇటూ కదిలితే ఆ వుంగరంతో ఎవరూ చూడకుండా ఒక మొట్టు మొట్టేవాడు. ‘ఒరే కొడుతున్నావురా?’ అంటే ‘మీరు కదిల్తే తగుల్తుంది, నన్నేం చెయ్య న్నారు! కదలకండి’ అనేవాడు. ఆరేళ్ళు దాటిన అబ్బాయిలకే క్షవరం చేస్తూవుండగా చూసుకొందికి అద్దం ఇస్తాడు. ఆ అద్దంలో ఇప్పుడు మళ్లా తనమొఖం చూసుకోవాలనిపిస్తున్నది. రామన్న ఆగడే; తనమాట వినడే, ఆ అద్దంలో చూసుకొంటే తన చిన్నప్పటి మొహం కనబడుతుందేమో! ఈనాడు ఈ ఊరివాళ్ళు, తన ఊరివాళ్ళు, తనని గుర్తుపట్టలేక పోవడానికి కారణం కనబడుతుందేమో!

ఎవరూ తనను పలకరించడంలేదని ఉక్రోషంవచ్చి అతడు ఎకాఎకిని గోరీల తోటవైపు నడక ప్రారంభించాడు. దారిలో పొట్టి మేష్టారు ఎదురొచ్చాడు. ఈయన తన ‘చిన్న ఇన్ఫెంటు’ క్లాసుమేష్టరు. తనచేత ఓనమాలు దిద్దించిన ఒజ్జ. పెద్దయ్యాక ఇతడు తనకు పెట్టిన తొడపాశాలు, శొంఠిపిక్కలు, వేయించిన గోడకుర్చీల మింజుమలె కక్ష తీర్చుకొందాం అనుకొన్నాడు. ఇప్పుడు కనిపించాడు. ఈయన్ని చూస్తే జాలేస్తున్నాది. నేడు ఇతనికన్నా తాను విద్యాధికుడు. ఈ మేష్టరికి రామన్ ఎఫెక్టు గురించి తెలియదు. థీరీ ఆఫ్ రెలిటివిటీ … అబ్బే ఈ మేష్టరు మరుగుజ్జు అయినా ఇవాళ ఇతనికి నమస్కరించాలనిపిస్తున్నది. బళ్ళో ఈయన అయిదు బళ్లూ నేర్పించకపోతే తాను ఇంత చదువుకొన్న వాడయ్యేవాడా! ఈయనకి మనస్ఫూర్తిగా దండంపెట్టాలి. చేతులు జోడించాడు. అరే, మేష్టరు అందుకోడే! ఈయనా తనని మరచిపోయాడా!

అతడు గోరీల తోటకి చేరుకొన్నాడు. గోడ ఎక్కాడు. ఎవరేనా చూస్తున్నారేమో అని కలయచూశాడు. ఎవరూ తనని పట్టించుకోలేదు. గోడ గెంతాడు. గడ్డిదుబ్బుగా పెరిగింది. అతడు తీరుబాటుగా ఆ గడ్డిలోంచి ఈదుకొంటూ నడిచాడు. చిన్నప్పుడు స్నేహితులతో గడపిన దినాలు నెమరువేసుకొన్నాడు. ఒకనాటి మిట్టమధ్యాహ్నం మండుటెండలో తాను ఒంటరిగా గడిపిన గోరీ దగ్గరికి వచ్చాడు. ఆ బల్లపరుపు సమాధి మీద కూర్చున్నాడు. సిగరెట్ వెలిగిద్దామనుకున్నాడు. సిగరెట్ లేదు. లాల్చీ విప్పి చెట్టుకు తగిలిద్దామను కొన్నాడు. అరె! తనకి లాల్చీలేదు.

ఆ సమాధిమీద అక్షరాలు చదివాడు. అవే అక్షరాలు. అదే పేరు. వాటిని తదేకంగా చూస్తున్నాడు. ‘హల్లో’ అన్న పలకరింపు వినబడింది.

‘ఎవరూ?’ అని అతడో పక్కకి తిరిగాడు.

ఒక పదహారేళ్ళ ఆంగ్లో ఇండియన్ అమ్మాయి కనబడింది. తెల్లని ఒళ్ళు, తెల్లని గౌను, తెల్లని పళ్ళు, తెల్లని నవ్వు, చల్లని చూపు.

‘ఎవరు మీరు?’ అని అతడు సవినయంగా అడిగాడు.

‘నేను జోస్‌పాల్సన్‌ని- జ్ఞాపకంలేదూ’ అని అడిగింది. తన చిన్నప్పటి సంగతులన్నీ జ్ఞాపకం చేసింది.

‘ఈ నరకంలో నన్నెవరూ గుర్తు పట్టలేదే- మీరెలా పోల్చుకున్నారు? అని అతడు అడిగాడు.

‘దొంగను పట్టుకోడానికి దొంగే కావాలి’ అంది ఆమె.

‘అంటే?’

‘చచ్చిపోయినవాళ్ళని చచ్చిపోయినవాళ్ళే గుర్తించుతారు’ అని ఆమె అతని పక్క కూర్చుంది.

గడ్డి గాలికి ఊగింది. పైన చెట్టు మీద ఒక కాకి వాలింది. రెండు పువ్వులు రాలాయి.

ఆరుద్ర

ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెన్నై నుంచి వెలువడే వారపత్రిక ' ఆనందవాణి 'కి సంపాదకుడిగా ఉన్నాడు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.
వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల- వేసవి, దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ, కాటమరాజు కథ వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ఠ. చదరంగం పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత. ఇలా పలు రచనా ప్రక్రియలలో చేపట్టి, కవిత్వం- పరిశోధనా రెంటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు హేతువాది ఆరుద్ర.
ఆరుద్ర, తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి, ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *