దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్
***
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
***
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
- గురజాడ అప్పారావు
“వదిన, నేను దినేష్ మాట్లాడుతున్నాను. అరుణ్ తో అర్జెంటుగా మాట్లాడాలి. తన ఫోను కలవట్లేదు. ‘నాట్ రీచబుల్’ వస్తోంది. ఇంట్లో ఉన్నాడా?”
“అయ్యో, లేదు దినేష్. పొద్దున్నే బయటకి వెళ్ళాడు. ఇంకా రాలేదు. తనది ఇంకొక నెంబరు ఉంది కదా! దానికి చేసి చూడు. ఇంతకీ అసలు ఏమయిందో చెప్పు. ఎందుకు అంత కంగారు పడుతున్నావు?”
“ఏం లేదు. నేను మళ్ళీ మాట్లాడుతాను. థాంక్యూ. ఉంటాను మరి.”
“ఏమయ్యుంటుంది అసలు? అంత నాకు చెప్పకూడని విషయమా? ఏమైనా కుటుంబానికి సంబంధించినదా? లేక స్నేహితుల విషయమా? కంగారుగా ఉంది. ఏదో సీరియస్ విషయం కాకపోతే దినేష్ ఎందుకు అంత హైరానా పడుతూ ఫోను చేస్తాడు? అరుణ్ కి ఫోను చేసి కనుక్కుంటే నయమా అనిపించింది. అరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఒక వాట్సప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో ఈ స్నేహితులు, వాళ్ళ కుటుంబాల కబుర్లు దొర్లుతూ ఉంటాయి. ఇవాళ ఫలానా వాళ్ళ పుట్టినరోజు. ఫలానా వాళ్ళ పెళ్ళిరోజు. ఎవరి ఇంట్లో ఎవరు కాలం చేసారు. ఇలాంటి విషయాలన్నీ ఆ గ్రూపులో మెసేజిలు పెడుతూ ఉంటారు. అరుణ్ పొద్దున్న లేస్తూనే కాసేపు వాట్సప్ చూస్తాడు. అది అతని అలవాటు. అందరికీ మెసేజ్ లు పెడతాడు. మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడతాడు. ఈ వాట్సప్ అరుణ్ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఒక పెద్ద ప్రపంచాన్ని తన ముందు ఉంచింది. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే అరుణ్ మనసులో ఎన్నో కొత్త కొత్త అలోచనలు పురుడుపోసుకుంటూ ఉంటాయి. ట్రిప్ కి ఎక్కడికెళ్ళాలి? ఎవరి పుట్టినరోజు ఎక్కడ సెలబ్రేట్ చెయ్యాలి? ఎవరి తల్లిదండ్రుల 75వ పుట్టినరోజు ఎక్కడ జరపాలి? అరుణ్ సంతోషంలో, ఉల్లాసంలోనే మిగిలినవాళ్ళ అందరి సంతోషాలూ కలగలిసి ఉండేవి. అయితే ఇప్పుడు దినేష్ నుండి వచ్చిన ఫోను ఎందుకో కలవరపెడుతోంది. ఏ వార్త అయినా వాట్సప్ లో వచ్చి తీరుతుంది అన్న నమ్మకం మరి. అలాంటిది వాట్సప్ లో రాలేదు అంటే …. తను ఆలోచనల్లో మునిగిపోయింది.
“దినేష్ ఫోనొచ్చింది. మాట్లాడారా?”
“ఆఁ ఆఁ మాట్లాడాను. ఒక పెద్ద సమస్య వచ్చి పడింది.” అరుణ్ గొంతులో బాధ, కంగారు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
“ఏం సమస్య? ఏమయింది అసలు?”
“నీకు అల్తాఫ్ గుర్తున్నాడు కదా! ఫర్జానా తమ్ముడు. వాడు తన అమ్మా నాన్నలని కొట్టి ఇంట్లోనుంచి బయటకి గెంటేసాడు.”
“అదేంటి? ఎందుకలా? అది కూడా తల్లిదండుల మీద చెయ్యిచేసుకున్నాడా?”
“ఎందుకు అంటే ఏం చెప్పాలి? ఏదో ఫ్యామిలీ గొడవలు. సరే మిగిలిన సంగతులన్నీ ఇంటికొచ్చాక చెబుతాను.”
“ఎంత ఫ్యామిలీ గొడవలయితే మాత్రం తల్లిదండ్రులని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడా? ఇప్పుడు వాళ్ళ గతి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ముందుముందు ఎక్కడుంటారు? ఎలా బతుకుతారు? పోలీసులకి కంప్లైంట్ చేసారా లేదా?”
“పాపం హమీదా అత్తకి అసలే ఒక కాలు పోలియో. అన్నిరకాలుగా దెబ్బతిని ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. దాచుకున్నదంతా రిసార్టు కట్టడానికి ఆ అల్తాఫ్ కే ఇచ్చారు.”
“ఇప్పుడు దినేష్ ఏమంటాడు? దినేష్ అక్కడే కదా ఉండేది.”
“ఆ ముసలివాళ్ళు ఇద్దరి కోసం ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. ఫర్జానా స్కూల్లో నా క్లాసేమేట్. నేనంటే చాలా అభిమానంగా ఉండేది. తను వెళ్ళిపోవడంతోటే కుటుంబం ముక్కలయిపోయింది.”
“అయితే, ఇక్కడ కూర్చుని మీరు ఏం చెయ్యగలరు?”
“అదే ఆలోచిస్తున్నాను.”
“అరుణ్, గ్రూపులో అందరికీ ఫోన్లు చేసాడు – ‘హమీదా అత్త వాళ్ళకి మనవంతు ఏమన్నా సాయం చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. నేను మళ్ళీ ఒక గంటలో ఫోను చేస్తాను.”
“ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు?”
“దినేష్ వాళ్ళ ఇంట్లో. కానీ ఎక్కువరోజులు అట్టేపెట్టుకోవడం దినేష్ కి కూడా ఇబ్బందే కదా; దినేష్ వాళ్ళ ఇంట్లో కూడా ఐదారుగురు ఉన్నారు. ఇల్లూ చిన్నదాయె.”
‘మరి…!”
“ప్రస్తుతానికి అయితే నేను ఇరవై వేలు పంపిస్తున్నాను.”
“ఇరవై వేలతో ఏమవుతుంది?”
“దేనికోదానికి పనికొస్తాయి కదా!”
“దినేష్, అక్కడ అద్దెలు ఎలా ఉన్నాయి?” అరుణ్ కనుక్కుంటున్నాడు.
“చూడాలి. తక్కువలో తక్కువ నెలకి నాలుగైదు వేలు. రెండు-మూడు నెలల అద్దె అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.”
“ప్రస్తుతానికి మనం ఒక ఏడాది అద్దె కట్టేద్దాం. నేను అందరికీ చెప్పేసాను. నీ అకౌంట్ నెంబరు షేర్ చెయ్యి.”
“సరే. పాపం ఆ ముసలివాళ్ళు ఇద్దరూ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వచ్చిన దగ్గరనుండి ఏడుస్తూనే ఉన్నారు.”
“హమీదా అత్తకి కానీ, గఫూర్ మామకి కానీ, మనం ఏదో వాళ్ళమీద సానుభూతి చూపిస్తున్నామని కానీ, సహాయం చేస్తున్నామని కానీ అస్సలు అనిపించకూడదు. అసలే వాళ్ళిద్దరికీ ఆత్మాభిమానం ఎక్కువ. గఫూర్ మామ కూడా ఏదో చిన్న-చితక పనిచేసుకుంటాడు.”
“కానీ ఇలా పోగేసిన ఈ కొంచెం డబ్బు మాత్రం ఎన్నాళ్ళుంటుంది? చూస్తూచూస్తూనే ఖర్చయిపోతుంది. ఇవాళంటే మీరు ఇస్తున్నారు సరే. ఎవరైనా జీవితాంతం చూసుకోలేరు కదా!” అంది నందిని.
“అయితే. ఇప్పుడు ఇవ్వొద్దంటావా? అలాగే ఆకలితో చావమని వాళ్ళమానానికి వాళ్ళని వదిలెయ్యమంటావా?”
“ఇవ్వు. ఇవ్వాల్సిందే కూడా. మీరు కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు? అయితే ఏదో ఒక పనిచేసుకోవాలి కదా వాళ్ళుకూడా బతుకుతెరువు కోసం. పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా కాస్త ఊరట.” అరుణ్ కి నచ్చెజెబుతున్నట్టు అంది నందిని.
అరుణ్ ఆలోచనలో పడ్డాడు. నందిని చెప్పేది కూడా సబబుగానే ఉంది. ఏదో నాలుగు డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. ఈ సమస్యకి ఏదైనా శాశ్వత పరిష్కారం చూడాలి.
“ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి చూడు. ఇదేదో నాలుగురోజుల ముచ్చట కాదు కదా! ముందుముందు ఇంకా బోల్డంత జీవితం ఉంది. రేపటి రోజు అల్తాఫ్ వచ్చి తన తప్పు ఒప్పుకుని వీళ్ళని తీసుకెళ్ళినా వీళ్ళకంటూ ఒక ఆసరా ఉండాలి. వీళ్ళ చేతిలో నాలుగు డబ్బులు ఉండాలి.”
“దినేష్, కాస్త గఫూర్ మామతో మాట్లాడిపించు.”
గఫూర్ మామ అరుణ్ గొంతు వింటూనే బావురుమన్నాడు – “ఏ జన్మలో ఏం పాపం చేసామో, అల్లా మాకు ఈ శిక్ష వేసాడు. అల్తాఫ్ ఇంతలా మారిపోతాడని మేము కలలో కూడా అనుకోలేదు. మా జీవితం నాశనం అయిపోయింది. ఏం చెయ్యాలో, ఎక్కడికి పోవాలో తోచట్లేదు. అల్లా వాణ్ణి ఎప్పటికీ క్షమించడు.”
“మామా! నువ్వేం దిగులు పడకు. మేమంతా ఉన్నాం కదా!”
“మీరు ఉన్నారన్న ధైర్యంతోనే ఇంకా ప్రాణాలతో ఉన్నాం నాయనా, నేను, మీ అత్త!”
“మామా! మీరు ఏమన్నా పని చెయ్యగలుగుతారా?
“ఈ వయసులో ఉరుకులు పరుగులు నావల్ల అవుతుందా?” అని సందేహం వెలిబుచ్చాడు గఫూర్ మామ.
“ఉరుకులు-పరుగులు ఏం ఉండదు. ఏదో నాలుగు డజన్ల కోడిగుడ్లు, బిస్కెట్లు, చాక్లెట్లుతో చిన్న బడ్డీ కొట్టు. ఎక్కువ హైరానా పడకుండా మీరు, అత్త కలిసి చేసుకోగలిగే పనే చేద్దాం. ఏదైన పనిచేసుకుంటే మీ మనసుకూ కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఎవరిమీదా ఆధారపడే అవసరం కూడా ఉండదు.”
గఫూర్ మామ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికిప్పుడు బడ్డీ కొట్టు అద్దెకి ఎక్కడ దొరుకుతుంది? దొరికినా అంత డబ్బు ఎక్కడినుంచి తెచ్చి కట్టగలం? తీరా పెట్టినదాకా ఉండి ఆ కొట్టు సరిగ్గా నడవకపోతే పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరయిపోతుంది.
అప్పటికి వీళ్ళందరూ చాలా చిన్నపిల్లలు. అరుణ్ ఇంచుమించు రోజూ హమీదా బానో ఇంటికి ఆడుకోవడానికి వస్తూ ఉండేవాడు. ఫర్జానా, తను ఒకటే క్లాసు. రంజాన్-బక్రీద్ అన్ని పండగలూ వీళ్ళవే అన్నట్టు ఉండేవాడు అరుణ్ కూడా. హమీదా బానో, అరుణ్ వాళ్ళ నాన్నకి రాఖీ కట్టేది. ఆయన కూడా హమీదాని సొంత చెల్లెలుగా చూసుకునేవాడు. అవి, పిల్లలు హైస్కూలు చదువులు పూర్తిచేసుకుని భవిష్యత్తు మీద గంపెడు ఆశలతో పట్నంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడుతున్న రోజులు. అరుణ్ ఆ కుంటుంబం నుండి కొన్ని వందల కిలోమీటర్ల దూరంగా అయితే వచ్చేసాడు కానీ జ్ఞాపకాల్లో మాత్రం ఆ కుటుంబానికి దూరం కాలేదు. తన మనసులో ఆ కుటుంబానికి ఇప్పటికీ అదే స్థానం ఉంది. ఫర్జానా పట్ల తనకున్న అనురాగం-ఆప్యాయతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
అరుణ్ భార్య నందిని టీ పెడుతోంది. టీవీలో వార్తలు వస్తున్నాయి. రెండు గ్రూపుల మధ్య భయంకరమైన గొడవలు. రాళ్ళు రువ్వుకోవడాలు …. వాతావరణం చాలా గంభీరంగా ఉంది. టీవీలో ఇళ్ళ పైకప్పుల మీద కుప్పలు కుప్పలుగా పడ్డ రాళ్ళు, పగిలిన సీసా పెంకులని మార్చి మార్చి చూపిస్తున్నారు. తరువాత వార్త మరీ జుగుప్సాకరంగా ఉంది. పదేళ్ళ చిన్నారిపై ఎవరో నలుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేసి చంపేసారు. అదే వార్తని తిప్పితిప్పి విజువల్స్ తో సహా చూపిస్తున్నారు. ఇరఫాన్, జుబైద్ అనే ఇద్దరు నిందితులని అరెస్టు కూడా చేసారు. పార్టీ నాయకులు, మానవ హక్కుల కమిషన్ వాళ్ళు బాధితురాలి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. దీని గురించి చర్చించడానికి ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటుచేసారు.
రాత్రి ఎనిమిది అయ్యింది. సాధారణంగా ఇది సీరియల్స్ టైము. అరుణ్ వాళ్ళ అమ్మ, నందిని ఇద్దరూ సీరియల్ చూస్తున్నారు. అరుణ్ మాత్రం రకరకాల నవ్వులు, జోకులు, కుట్రలు-కుతంత్రాల గురించి వాట్సప్ గ్రూపు సభ్యులతో మాట్లాడుతున్నాడు.
“దినేష్, తొందరగా ఏదైనా బడ్డీ కొట్టు లాంటిది అద్దెకి దొరుకుతుందేమో చూడు. మామ ఎక్కువ హైరానా పడకుండా కూర్చునే బ్రెడ్-ఆమ్లెట్, ఇంకా చిన్న-చిన్న నిత్యావసర వస్తువులు అమ్మగలడు.” దినేష్ ఇంకా దిగులుగానే ఉన్నాడు. హమీదా బానో, గఫూర్ మామని కన్నకొడుకే ఇలా ఇంట్లో నుంచి గెంటెయ్యడాన్ని దినేష్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇది తెలుసుకుని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
అందరూ కలిసి చిన్న బడ్డీ కొట్టు అద్దెకి మాట్లాడారు. అడ్వాన్స్ ఇచ్చేసారు. అగ్రిమెంటు కూడా చేయించారు.
నందిని టీవీ ఛానల్ మార్చింది. ఛానల్ లో వివిధ పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు గొంతు చించుకుని తమ-తమ వాదనలు వినిపిస్తున్నారు. ఏ ఏ మసీదుల లోపల దేవుడి విగ్రహాలు, గుర్తులు ఉన్నాయి … ప్రతీ ఛానల్ లో ఇదే చర్చ. మొత్తం చరిత్రని తిరగతోడుతున్నారు. వీళ్ళందరికీ తమ కుటుంబం, పిల్లలే కాకుండా దేశమంటే ఎంత బెంగో మరి! వీళ్ళందరూ దేశం మీద బెంగతో చిక్కి సగమయ్యిపోతున్నారు. మతకల్లోలాలు, హింస, లవ్-జిహాద్ ఇంకా హత్యలు, మానభంగాలని గ్లోరిఫై చేస్తున్నారు. రెండు పక్షాల వాళ్ళు ఇంతంత గొంతులేసుకుని తమ-తమ వాదనలు వినిపిస్తున్నారు. అరుణ్ కానీ, టీవీ కట్టెయ్యమని ఒక్క కేకపెట్టి ఉండకపోతే టీవీలో ఈ గోల ఇంక అలా ఎంత సేపు చూడాల్సి వచ్చేదో!
“ఈ ధర్మగురువులుకి, మౌల్వీలకి, పట్నంలో కూర్చొన్న రాజకీయ నాయకులకి అసలు పల్లెటూళ్ళో జనాలు ఎలా కలిసిమెలిసి ఉంటారో తెలియదు. వీళ్ళంతా టీవీలో నాటకాలాడుతారు. వీళ్ళ ఊసరవెల్లి ముఖాలు, మాటలు చూసి-విని నాకు విసుగొచ్చింది.”
“సరే సరే. ఈ టీవీ వాళ్ళకి టి.ఆర్.పి. రేటింగ్ పెంచుకోవాలి. అంతే. నువ్వు ముందు టీ తాగు. సరే. ఏంటి సంగతి?” టీవీ ఆఫ్ చేస్తూ అడిగింది నందిని.
“దినేష్ బడ్డీకొట్టుకి అడ్వాన్స్ ఇచ్చేసాడు. ఏడాదికి సరిపడా అద్దె కూడా జమయ్యింది.”
“మంచి మాట చెప్పావు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే వాళ్ళకీ కాస్త మనసు తేలికపడుతుంది.”
“ఇంకా ఎంత డబ్బు అవసరం కావొచ్చు?”
“ఇంచుమించు ఇంక ఒక లక్ష రూపాయలు.” దినేష్ ఫోనులోనే జమాఖర్చులు అన్నీ చెబుతున్నాడు.
“అల్తాఫ్ మాత్రం అక్కడకి రాకుండా చూసుకో. మనం ఉండగా దేనికీ ఇబ్బందిపడాల్సిన పని లేదని హమీదా అత్త కి చెప్పు.”
“ఇంట్లో కిరాణా సామాన్లు తెచ్చి పెట్టేసాను. మంచం, పరుపు, బట్టలూ కూడా తీసుకొచ్చాను. గ్యాసు నా దగ్గర ఉన్నది ఇచ్చాను. ఇంక వాళ్ళు ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నారు. అరుణ్, వీళ్ళకి సహాయం చెయ్యడానికి ఎంతమంది ముందుకు వచ్చారో చూడు! హమీదా అత్త, గఫూర్ మామ అంటే అందరికీ ఎంత అభిమానమో కదా! వీళ్ళిద్దరూ కలిసి అల్తాఫ్ ని తన్ని వదిలిపెడతారేమో అని నాకైతే ఎంత భయమేసిందో తెలుసా!”
“అవును. ఒకళ్ళిద్దరు తప్పించి అందరూ చాలా సహాయం చేసారు. జనాలు అల్తాఫ్ బాధ్యతలన్నీ వదిలించుకుని విలాసంగా బతుకుతున్నాడు. ముసలి తల్లిదండ్రుల గొడవ కూడా వదిలింది తనకి అంటున్నారు.”
“వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం మాట్లాడకు. ఫర్జానా ఉన్నన్ని రోజులూ గుంభనంగా ఉన్నాడు. ఫర్జానా ఈ లోకం వదిలి వెళ్ళిపోవడంతోటే వాడి అసలు రంగు బయటపడింది.” అరుణ్ మనసు ఇప్పుడు కాస్త తేలికపడింది. అరుణ్ కొన్ని వారాలబట్టి దీనిగురించే మాట్లాడి-మాట్లాడి, అందరికీ ఫోన్లు చేసి-చేసి అలసిపోయాడు. హమీదా అత్త, గఫూర్ మామ ముఖాలు కళ్ళముందే మెదులుతూ ఉన్నాయి.
మర్నాడు టీ తాగి మార్కెట్ కి బయలుదేరబోతూంటే ఫర్జానా కూతురు అర్షీ ఫోనొచ్చింది. తను భోపాలులో ఉంటూ నర్సింగ్ కోర్సు చేస్తోంది. ఏదో బస్తీలో చిన్న గదిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటోంది. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా ఫోను చేయ్యమని ఫర్జానాయే అరుణ్ నెంబరు ఇచ్చింది.
“అంకుల్…”
“చెప్పు అర్షీ. ఏంటి సంగతులు?”
“అంకుల్…” అంటూ వెక్కివెక్కి ఏడవటం మొదలుపెట్టింది. చాలాసేపటి వరకు ఆ అమ్మాయి వెక్కిళ్ళు ఆగలేదు.”
“అల్తాఫ్ మామ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అంకుల్. అసలు ఏమయింది మామకి?”
“అర్షీ నువ్వేం దిగులుపడకు. అమ్మమ్మ-తాతయ్య బాగానే ఉన్నారు. చూసుకోవడానికి మేమంతా ఉన్నాం. ముందు నువ్వు బాగా చదువుకో. ముందుముందు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే.”
“మీరే లేకపోతే వాళ్ళేమయిపోయేవారు అంకుల్.”
“పిచ్చిపిల్ల! మేము ఏమన్నా పరాయివాళ్ళమా? మీ అమ్మమ్మ-తాతయ్యలు మమ్మల్ని ఎంత ప్రేమించారో నీకేం తెలుసు? స్కూలు అవ్వగానే అక్కడే మా మకాం … ఆటలు-పాటలు. ఎన్ని మామిడిపళ్ళు, జామకాయలు, సీమచింతకాయలు,.. ఒకటా రెండా… ఎన్నని చెప్పాలి? మా బాల్యం అంతా అక్కడే గడిచింది.”
“రంజాన్ కి అమ్మమ్మ-తాతయ్యల దగ్గరకి వెళ్దామనుకుంటున్నాను. వాళ్ళు కూడా సంతోషిస్తారు.”
“అల్తాఫ్ సంగతి మీ అమ్మ ఎప్పుడూ నీకు చెప్పలేదా?”
“అందరూ కలిసి ఉంటారు కదా అని అమ్మ, తన దగ్గర ఉన్న డబ్బు-బంగారం అంతా మామ రిసార్ట్ కోసం ఇచ్చేసింది. ఇప్పుడు చూస్తే ఇది పరిస్థితి. ఇంతకుమించి నాకు ఇంక ఏమీ తెలియదు అంకుల్.”
“సరే. ఇప్పుడు అవన్నీ వదిలెయ్ కానీ, నువ్వు ఎప్పుడు వెళ్దామనుకుంటున్నావు?”
“రేపు రాత్రి అంకుల్.”
అరుణ్, అర్షీ కోసమని స్వీట్స్, డ్రైఫ్రూట్స్, కొన్ని బట్టలు కొన్నాడు.
“అంత రాత్రి నువ్వు ఒక్కర్తివి బస్ స్టాండుకి ఎలా వెళ్తావు? నేను, మీ ఆంటీ వచ్చి నిన్ను దిగబెట్టి వెళ్తాం.”
“అయ్యో, మీకెందుకు అంకుల్ శ్రమ. నాకు అలవాటే. నేను ఎప్పుడూ ఈ బస్సుకే వెళ్తాను. ఏం ఇబ్బంది లేదు” – మొహమాటంగా అంది అర్షీ.
“ఇబ్బంది ఏం లేదు అర్షీ. నువ్వు అడ్రెస్, లొకేషన్ పంపించు. మేం వచ్చేస్తాం.” అంది నందిని. మొత్తానికి ఎలాగో వెతుక్కుంటూ అర్షీ ఉండే సందులోకి చేరుకున్నారు అరుణ్-నందిని. చాలా ఇరుకు సందు. దాంట్లో మళ్ళీ రెండువైపులా రకరకాల దుకాణాలు… కటిక చీకటి …. విపరీతమైన కంపు.
“అర్షీ ఇలాంటి చోట ఉంటోందా?” – నందిని చుట్టూ చూస్తూ ఆశ్చర్యపోతూ అంది.
“అంకుల్, మీరు సందు మొదట్లోనే ఉండండి. ఇక్కడి వరకూ రాలేరు. పైగా మా ఇంటి ఓనరుకి ఇలా వేరేవాళ్ళు రావడం ఇష్టం ఉండదు. రకరకాల ప్రశ్నలతో వేధిస్తారు.”
“సరే అర్షీ. మేం ఇక్కడే పువ్వుల దుకాణం దగ్గర నిలబడ్డాం. నువ్వు నిదానంగా రా.”
సుమారు పదిహేను నిమిషాల తర్వాత ఒక బక్కపలచటి అమ్మాయి చేతిలో రెండు బ్యాగులతో కాళ్ళీడ్చుకుంటూ వస్తూ కనిపించింది.
“అంకుల్”
ఎదురుగా అర్షీ… ఆమె నీడ పొడవుగా పరుచుకుని రోడ్డుమీద పడుతోంది. అర్షీ కళ్ళకి కాటుక పెట్టుకుని, జుట్టు పోనీటెయిల్ వేసుకుని ఉంది. స్ట్రీట్ లైటు వెలుతురులో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. అర్షీ మరీ బక్కగా ఉంది… నందిని ఆమెనే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది.
“ఇంత బక్కగా ఉన్నావు… అసలు ఏమన్నా తింటావా లేదా గాలి తిని గాలి తాగుతావా?” అడిగింది నందిని.
“ఏదో దొరికింది తిని సరిపెట్టుకోవడమే ఆంటీ” నవ్వుతూ చెప్పింది అర్షీ.
నవ్వుతే ఆమె పళ్ళు దానిమ్మగింజల్లా తళుక్కుమన్నాయి. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. నిజంగా అర్షీ చాలా అందంగా ఉంది.
“అంకుల్.. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు?” అరుణ్ వాళ్ళు తీసుకొచ్చిన పళ్ళూ, స్వీట్స్ సర్దుకుంటూ అంది అర్షీ.
“మా తరఫున అమ్మమ్మ-తాతయ్య కి ఇవ్వు.” తలమీద చెయ్యి వేసి ఆశీర్వదిస్తూ అన్నాడు అరుణ్.
రాత్రి పదకొండవుతూంటే బస్సు వచ్చింది.
బస్సు చాలా రష్ గా ఉంది. రంజాన్ కి జనాలు ఇళ్ళకి బయలుదేరుతున్నట్టున్నారు. బస్సులో ఇద్దరు-ముగ్గురు ఆడవాళ్ళున్నారు. రాత్రంతా ప్రయాణం. ఇంత రాత్రివేళ ఆ చీకట్లో అడవుల మధ్యనుండి ప్రయాణం అంటేనే అరుణ్-నందినిలకు ఒళ్ళు గగుర్పొడిచింది. ఇద్దరూ కాస్త కంగారుపడ్డారు. వాళ్ళకి సొంత కూతురుని సాగనంపుతున్నంత దిగులేసింది.
‘ఆంటీ’ అని అర్షీ నందినిని కౌగిలించుకుని మెల్లగా చెవిలో ‘థాంక్యూ’ అని గొణిగింది.
“చేరగానే ఫోను చెయ్య్యి. అమ్మమ్మ-తాతయ్యలకి ధైర్యం చెప్పు. వీలు చూసుకుని మేం కూడా వచ్చి వాళ్ళని చూసి వెళ్తాం. ఈ గొడవలన్నీ మర్చిపోయి రంజాన్ సంతోషంగా జరుపుకో.”
‘సరే ఆంటీ’ అంటూ అర్షీ తన సీట్లో కూర్చొంది.
బస్సు బయలుదేరాక అరుణ్-నందిని ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. టైము అర్ధరాత్రి పన్నెండయ్యింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. చీకట్లో ముఖందాచుకున్న రోడ్లు భయంకరంగా ఉన్నాయి.
ఇంటికి చేరుకున్నాక అరుణ్ మనసు కాస్త స్థిమితపడింది.
“అర్షీని కలిసి మంచిపని చేసాం.”
“అసలు ఈ దేశానికేమయిందో అర్థం కావట్లేదు. జనాలకి ఏమయిపోయింది? ఇంత స్వార్థం ఎందుకు పేరుకుపోతోంది? అల్తాఫ్ ముఖం చూసిన వాడు ఎవడైనా అసలు వాడి కడుపులో ఇంత కుళ్ళు దాగుందని అనుకుంటాడా?” అరుణ్ కోపంలో ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు.
“ఇంక వదిలెయ్. ఇప్పుడు అంతా సర్దుకుంది కదా.”
“ఎలా వదిలెయ్యమంటావు నందినీ! వాడు….కన్న తల్లిదండ్రుల మీద చెయ్యిచేసుకున్నాడు. జీవితాంతం వాళ్ళు కష్టపడి కూడబెట్టినదంతా స్వాహా చేసాడు. ఇప్పుడు వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేసాడు.”
ఇంక ఆ విషయాన్ని పొడిగించడం ఇష్టం లేక – “మనం చెయ్యగలిగింది చేసాం. ఇంక ముందుముందు కూడా చేద్దాం.” అంది నందిని.
‘సరే, న్యూస్ పెట్టు.”
“ఏముంటుంది ఆ న్యూస్ లో. మళ్ళీ అవే చర్చలు, వేదిక, రచ్చబండ, బతుకు జట్కాబండి కార్యక్రమాలు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాలు. ఒకళ్ళమీద ఒకళ్ళు బురద జల్లుకోవడాలు…. అంతే కదా!”
“అవుననుకో. కానీ ఏం జరుగుతోందా తెలుసుకోవాలిగా.”
“నగరంలో ఎక్కడో ర్యాలీ, దిష్టిబొమ్మలు తగులబెట్టడం వంటి కార్యక్రమాలు. టీవీలో అదే చర్చ నడుస్తోంది. నగరం అంతా వేడెక్కిపోయి ఉంది. మొత్తం దుకాణాలన్నీ మూసేసారు. కర్ఫ్యూ. ఎందరో గాయపడ్డారు. ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అంకెలతో మాయాజాలం చేస్తున్నాయి.
“జనాలకి వేరే పనీ-పాట లేదా? ఏదైనా పని చేసుకోవచ్చు కదా!”
“ఏమైనా పని దొరికితే కదా చేసుకోవడానికి.” చిరాగ్గా అంది నందిని.
“ఏం? ఎందుకు దొరకదు? ఈ వయసులో గఫూర్ మామ చేసుకుంటున్నాడుగా. దున్నపోతుల్లా ఉన్నారు. వీళ్ళకేం మాయరోగం ఒళ్ళొంచి పనిచేసుకోవడానికి? దొరికిన పని చేసుకోవాలి. ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా చేరి ఇవే పనికిమాలిన చర్చలు.”
“మామ వాళ్ళకి మీరందరూ సహాయం చేసారు. మరి వీళ్ళకి ఎవరు సహాయం చేస్తారు చెప్పు? నందిని గొంతు పెంచి అడిగింది.” నందిని ఈ విషయం మీద ఆపకుండా రెండు గంటలు మాట్లాడగలదని అరుణ్ కి తెలుసు. అందుకే ఆ విషయం అక్కడితో ఆపేస్తూ – “సరే సరే. ఇదంతా వదిలెయ్యి. ముందు అర్షీ కి ఫోను చెయ్యి.” అన్నాడు.
“ఆంటీ, ఏమీ టెన్షన్ లేదు. నేను రేపు ఇంటికి చేరుకున్న తర్వాత ఫోను చేస్తాను. ఓకే ఆంటీ. గుడ్ నైట్. ఇంక మీరు నిద్రపోండి. టైము అర్ధరాత్రి రెండయ్యింది. ఇప్పటికే నావల్ల మీకు చాలా లేటయ్యింది. అయినా మీరు ఇప్పటివరకు ఎందుకు మెలుకువగా ఉన్నారు? నాకోసం!!? ఆంటీ, మీరందరూ ఉండగా నాకెందుకు భయం? అయినా బస్సులో ఇంకా జనాలు ఉన్నారు. ఏం భయంలేదు. సరే ఆంటీ గుడ్ నైట్. రేపు ఫోను చేస్తాను. ఖుదా హఫీజ్.”
కానీ, అరుణ్ కి కంటిమీద కునుకు లేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, అర్షీ ఇల్లు చేరగానే ఎప్పుడెప్పుడు అందరి క్షేమసమాచారాలు కనుక్కుందామా అని గడియారంకేసి కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు …..
***
