భద్రుడి కవిత్వ డైరీ

Spread the love

“నది ప్రవహిస్తూనే ఉంది. తీరాలు పంకిలాలై కంపుకొడుతున్నాయి. దూకితే నదీ గర్భంలోకి దూకాలి. వెచ్చగానో.. చల్లగానో.. అద్భుతమో.. అనుభవమో..అది.. కాని ఈ నది వొడ్డున, ఈ దుమ్ములో.. దుర్గందంలో.. నది ఏమర్ధమవుతుంది? ప్రవాహం ఏం సందేశానిస్తుంది..?”
” అయినా.. hopeful గా చూస్తాను. ఇది నా విధి. బహుశా ఇది ఒక్కటే అన్ని విధుల్లోకి ఆనందకరమైన విధి అనుకుంటాను.”

ఇది వాడ్రేవు చినవీరభద్రుడు సరిగ్గా 360 రోజుల తక్కువగా 39 సంవత్సరాల క్రితం అంటే.. 31-12-1986 సంవత్సరంలో తన డైరీలో రాసుకున్న ఆ ఏడాది చివరి మాటలు. ఇన్ని దశాబ్దాలలో చినవీరభద్రుడికి ఆ hopefulness తన వెంటే ఉంది. శ్రీ శ్రీ అన్నాడు కదా.. “వస్తే రానీ.. కష్టాల్‌.. నష్టాల్‌… కోపాల్‌.. తాపాల్‌… శాపాల్‌..” అని. ఈ వీరభద్రుడు కూడా అలాగే అనుకుని ఉండి తీరాలి. డిసెంబర్‌లో చివరి రోజున రాసుకున్న డైరీకి రెండు నెలల ముందు అక్టోబర్‌ మూడో తేదిన రాసిన డైరీలో ఇలా అన్నాడు వీరభద్రుడు. “శ్రీశ్రీ కవి. అంతకన్నా గొప్ప మనిషి” ఇది యాదృచ్ఛికం కావచ్చు. కానీ, చినవీరభద్రుడ్ని కవిగానూ, మనిషిగానూ కూడా నిలబెట్టిన రోజులు అవి.

ఆ రోజులు అలా అలా రాజమండ్రి మీంచి పారుతూ శ్రీశైలం అడవుల్లోనూ, పార్వతీపురం కొండ కోనల్లోనూ, పాడేరు అమాయకపు గిరిజనుల్లోనూ, మహా నగరం హైదరాబాద్‌లోనూ, కొత్త రాజధాని అమరావతిలోనూ తేలియాడేలా చేసాయి అనిపించింది ఈ డైరీ చదివాక.

ఇతరుల డైరీ చదవకూడదని మా నాన్న నా చాలా చిన్నప్పుడు చెప్పారు. కానీ, చినవీరభద్రుడు రాజమండ్రి డైరీ 1986… అంటూ ప్రపంచం మీదకి వదిలాక ఎలా చదవకుండా ఉంటాం. పైగా ఈ రాజమండ్రీ డైరీకి ట్యాగ్‌ లైన్‌గా ‘ఆ ఊరు ఆ యేరు ఆ పద్యాలు’ అని స్పష్టంగా చెప్పిన తర్వాత చదవకుండా ఎలా ఉండగలం?

ఈ కొంగొత్త పొత్తం ఈ మధ్యనే అంటే మరీ మూడు రోజుల క్రితమే విడుదలైంది. ఈ పుస్తకం విడుదల సమయంలో నేను ఈ డైరీ గురించి మాట్లాడాల్సి ఉంది. కానీ… వ్యక్తిగత, దుఖభాజన కారణాల వల్ల నేను వెళ్లలేకపోయాను. హాజరు కాలేకపోవడం శారీరికం. ఆ డైరీలో అక్షరాలు మన చుట్టూనే పరిభ్రమించడం మానసికం.

వీరభద్రుడి ఈ డైరీ నిండా ఒకానొక సంక్షోభ, సందిగ్ధ, సంశయ, సంభ్రమాశ్చర్య, సమ్మోహిత వాక్యాలే నిండి ఉన్నాయి. ఇది చినవీరభద్రుడిలోని యవ్వన కాంతితో పాటు శారీరిక అలజడిని కూడా మనకి ఎరుక పరుస్తుంది. బహుశా ఏ వయసు వారైనా ఆ వయసులో రాసుకునే, రాసుకోవాల్సిన, తెలియాల్సిన, తెలియజెప్పాల్సిన ఘటనలే ఉన్నాయి. ఈ డైరీ రాసిన సమయం భధ్రుడికి తన జీవితం మొత్తంలోనే ఓ నిత్యానంద, క్షణికావేశ, కోపోద్రిక్త, ఆగ్రహ, అనుభవాల పుటలుగా నాకనిపించాయి.

ఈ డైరీతో పాటు కొన్ని అనుబంధాలను కూడా చేర్చిన వీరభద్రుడు ఈ రెంటికి మధ్య ఓ లింక్‌ కూడా ఉందని గ్రహింపునిచ్చాడు. “తూర్పు గోదావరి సాహిత్య చరిత్రలో సాహితీ వేదిక” వ్యాసంలో తన ప్రాణ మిత్రుడు కవులూరి గోపీచంద్ గురించి చెబుతూ “1987 లో రాయగడలో ఓ పేపరు మిల్లులో కెమిస్టుగా చేరాడు. అక్కడుండగానే కాఫ్కా సమగ్ర సాహిత్యాన్ని చదివాడు. తండ్రి ప్రభావం వల్ల నాసిక్తుడిగా పెరిగిన గోపీచంద్‌కు రాయగడ వెళ్లినప్పటి నుంచి ఆధ్యాత్మికానుభావాలు కలగడం మొదలైంది. మరి ఏ అనుభవాల ప్రభావమో తెలియదుగానీ, ఒక రోజు రైలు ప్రయాణంలో విజయవాడలో తన భార్యనీ, కుమారుడ్ని వదిలి వెళ్లిపోయిన వాడు, ఇప్పటి దాకా ఎక్కడున్నాడో తెలియదు” అని రాసారు.

వీరభద్రుడి డైరీలో తన మిత్రుల ప్రస్తావన వచ్చిన ప్రతీసారి కవులూరి గోపీచంద్‌ పేజీలో ఏదో ఒక మూల తారసపడతాడు. 1986 సంవత్సరం సెప్టెంబర్‌ 18 వ తేదిన రాసిన డైరీలో ఈ మాటలున్నాయి. “మనిషి స్వధర్మమే అతడ్ని తన వాళ్ల నుంచి isolate చేస్తుంది అన్నాడు గోపీచంద్‌. రాత్రి చాలాసేపు వెన్నెల్లో అతని ఇంటి దగ్గర కబుర్లు”. నిండు వెన్నెలలో ఇలా గోపీచంద్‌ చెప్పిన మాటలు కొన్ని నెలలకే అతను తన వాళ్లని వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడంటే అతడు ఎంత isolate అయ్యాడో తెలియజేస్తాయి. ఈ గోపీచంద్‌ గురించే చాలా కాలం క్రితం వీరభద్రుడు రాసిన గోపిచంద్ కి రెండు పద్యాలు అన్న కవితలో

“ఇద్దరం చూడాలనుకున్న రాజఘాట్
తను ఒక్కడే చూశాడు

అక్కడ ఒక వృద్ధుడు రాట్నంపైని ఒడికిన నూలుపోగుని
నాకు కాన్కగా తెచ్చాడు

అతనేం చేసినా ఇలాగే ఉంటుంది
అతడేమీ చేయకపోయినా ఇలాగే ఉంటుంది

ఈ పద్యానికి సమాధానం ఈ డైరీలోని ప్రతి పేజీలోనూ కనపడుతుంది. గోపీచంద్‌ మాత్రమే కాదు… వీరభద్రుడు కూడా…

“ఏం చేసినా ఇంత శ్రద్ధగానే ఉంటుంది
ఏం చేయకపోయినా ఇంత శ్రద్ధగానే ఉంటుంది”

ముక్కామల చక్రధర్‌, సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

ముక్కామల చక్రధర్‌

Spread the love

2 thoughts on “భద్రుడి కవిత్వ డైరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *