సాధారణ కవులు అనుకరిస్తారు. గొప్ప కవులు మహాకవుల్నుంచి తస్కరిస్తారు. పసునూరు శ్రీధర్‌బాబు సాధారణ కవి కాదు, మహాకవి అసలే కాదు. ఆయనో అసాధారణ కవి. కాబట్టే, ఎవడి బొమ్మలో వేయకుండా తానే వేల ఖండాలై తన వునికికి మొలిచిన ముళ్ళ పువ్వు ఐ సవాల్ చేస్తాడు. అందుకేనేమో తీరంలో నడిచే వాడు అద్దంలా వుండాలని ఆశిస్తాడు. పూలను తాకేవాడి చేతి వేళ్లకు పరిమళాన్ని గ్రహించే కనుపాపలు వుండాలి అని శాసిస్తాడు.
ఈ ‘ఏకాంతం ఒక అతిథి’ సంకలనంలోని కొన్ని కవితలు ‘సచ్చిదానందా’నికి అన్వయార్థం అనిపిస్తుంది. అసంబద్ధ దృశ్య శ్రవణ మిశ్రమాన్నిఅసాధారణ కవిత్వంగా మార్చిన కవి శ్రీధర్. అందుకే, అతడు ఒక్క చూపుతో సమస్త ప్రపంచాన్ని తనలోపలికి వంపుకోగల దార్శనికుడు అనిపిస్తుంది అతడి వాక్యం చదివినపుడు. కవిత్వ ఆత్మ తెలిసిన వాడికే ఆయన కవిత్వం అనుభవం లోకి వస్తుంది. తానున్న స్థితి కి మనల్ని తీసుకెళ్లి తన కవిత్వాన్ని మన చేతుల్లో పెట్టాడు ఈ సంకలనంలోని పలు కవితలతో. ఏకకాలంలో బౌద్ధికమైన ఆలోచనని హార్దికమైన అనుభూతిని కళ్లకి కట్టినట్లు చిత్రించగలిగితే పదాల కూర్పు అతడి టెక్నిక్ అనిపిస్తుంది నాకు. ఆధునిక కవిత్వాన్ని ఉన్నతీకరించి, ఆధునికోత్తర కవిత్వానికి సరికొత్త భూమికని ఇచ్చిన గొప్ప ప్రయత్నం ఈ ‘ఏకాంతం ఒక అతిథి’ కవితా సంకలనం.
శ్రీధర్‌బాబులో కవిత్వం దగ్గరకి వెళ్ళాలి అన్న వినయం కనపడదు. ‘కవిత్వం నా దగ్గరకి రావాలి’ అనే పొగరు కనిపిస్తుంది. ఇదే ఈయన కవితలలో ముచ్చట గొలిపే అంశం. శిల్ప సంయమనం గల కవిత్వం రాశాడు కాబట్టే శ్రీధర్ అధివాస్తవిక కవిత్వం కూడా అర్థమౌతుంది. ఇందులో కొన్ని కవితలు చదువుతుంటే ఆనాడెప్పుడో శ్రీశ్రీ అన్నట్టు ఇతడిలో ‘పో’ బీభత్సం, ‘నీషే’ ఒంటరితనం, ‘షెల్లీ’ రసోల్బణం, ‘దాస్తోవ్‌స్కీ’ వేదనా ఉన్నాయి. నరకపు ఎరుపుతనం, స్వర్గపునీలిమా – శిశువుల చిరునవ్వూ, పిశాచాల పేలుడూ, ఉన్నాయి అనిపిస్తుంది. అన్నిటికీ పైన అనిర్వచనీయమైన, ప్రత్యేకమైన, ఇతనికి మాత్రమే సంబంధించిన గుణం కూడా ఏదో ఉన్నది అనిపిస్తుంది ఈ సంకలనంలో కొన్ని కవితలు చదివి నపుడు. తీవ్రమైన భావోద్వేగాలను, తెలివైన బౌద్ధిక ఆలోచనలను కవితగా చిత్రించడంలో నిపుణుడు శ్రీధర్. ఈ సంకలనంలో కొన్ని కవితలు చదివినపుడు అరిపాదాల కింద ఇసక ఎడారి విరిగి, కళ్ళల్లోకి కడలిని తరలిస్తుంది. ఒక పోరాట జావళి మట్టిలో రాలిన చప్పుడు వినిపిస్తుంది. ప్రపంచీకరణ కారణంగా మనిషి యాంత్రికమవ్వటమే కాదు వ్యాపారమయ్యాడు. అందుకే అతడు వొంటరి అయ్యాడు. పైగా సమూహంలో కూడా వొంటరయ్యాడు. కాబట్టే వస్తువును ఎంతో గాఢతతో హృదిలోకి బట్వాడా చేసి, అందుకు తగ్గ భావనను మేధలోకి వొంపి, తాను మాయమయ్యే మాంత్రికత ఏదో అతడి శైలిలో మనని వివశుడిని చేస్తుంది.
కవిత్వం ఒక ఖేచర విద్య! రెక్కలు అల్లార్చి, నేలను తన్నేస్తే ఎగిరేయొచ్చు! మాటలు విసిరి, మరిన్ని ప్రపంచాలను ప్రతిసృష్టి చేయవచ్చు. అదికూడా ఈ కవి అద్భుతంగా రుజువు చేశాడు కొన్ని కవితలలో. నిరాడంబరమైన అక్షరాల మధ్య నుంచి సన్నటి మానవీయ అంతర్వాహినిని ప్రసరింపజేయడానికి అతడు ఎంత సాధన చేశాడో అనిపించింది. మనసును జలదరింపజేసే క్షణాలన్నీ కవిత్వానివే కానక్కరలేదు, అతడి వ్యక్తిత్వానివి కూడా అనిపిస్తుంది ఈ సంకలనంలోని కొన్ని పంక్తులు చూస్తే. అతడి వరకు కవిత్వం ఒక మౌలిక పదార్థమే తప్ప, వంకరటింకర పంక్తులలో మాత్రమే పరచుకునే వాక్య విన్యాసం కాదు. కవిత్వం ఒక ప్రక్రియ కాదు, ఒక రూపమూ కాదు. అది సారం! అదే ఈ సంకలనం లో ప్రతి కవితా రుజువు చేసింది. పాత గోడల మీద మరకలనూ, ఆకాశంలోని మబ్బులనూ తదేక దీక్షతో చూడడం ఇతనికిష్టం. మేఘాలలోంచి తన యిష్టం వచ్చిన బొమ్మను ఏరుకోగల స్వాప్నికుడు కూడా శ్రీధర్ లో వున్నాడు. కనుకే ఇంత అందమిన వాక్యాలు రాయగలిగాడు.
ఈ కవిలో ఎంత తత్వం వుందో అంత తర్కం వుంది. తన దోసిళ్ళ నుంచి గుప్పెడు మాటలు పోగేసి మన కళ్లను సెలయేళ్లుగా మార్చే మంత్రం తెలిసిన యోగి ఇతడు. చెంపలమీద మీద వాలే సీతాకోకచిలుకల సాక్షిగా, అద్దంలాటి తన హృదయంలో ఒక సరస్సును తపస్సుగా మార్చిన ఇంద్ర జాలికుడు శ్రీధర్. ఈ కవి తపనకు వాక్యాలు దాసోహమై మద్యంలా మత్తెక్కిస్తాయి. ఆలోచనను ఒక పదార్ధంలా మాత్రమే చూడగలిగే బ్రూస్లీ లాటి మారణ విద్యా రహస్యం ఏదో తెలిసిన మాంత్రికుడు కనుకే వొక్కో కవితా ఒక్కో పంచ్‌లా పాఠకుల హృదయ తీరాలను తాకి కాలం లెక్క చెరిపేస్తాయి.
కవి సిద్ధార్థ ఈ సంకలనానికి రాసిన ముందుమాటలో అన్నట్టు, ఈ కవిత్వంలో ఆస్పస్టత అర్ధ నైరూప్యత రెండు కళ్ళు గా మారి చదువరులకు సత్య దర్శనం చేయిస్తాయి. కాలాన్ని కాళ్ళ కింద తొక్కిపట్టి, యుగాలని క్షణాలుగా మార్చగల సత్తా వున్న ఈ కవి, జ్ఞాపకానికి తెలిసిన ఏకైక భాషను కవిత్వంలోకి అనువదించి చూపించిన భాషావేధ. తనకు నలుపు రంగు ఎప్పుడూ స్పష్టంగా కనిపిస్తుంది కనుకే మనకు నిద్రలో సైతం ఆయన కవితలు వెలుగు చూపిస్తాయి. అక్షరాలను పేర్చి కవితా మంత్రోపాసన చేయగల ఋషి కాబట్టే ఈ సంకలనంలో ప్రతి కవితా ఒక నిశ్శబ్ద సముద్రాన్ని సునామీగా మార్చి పాఠకుల హృ దయ తీరాలపై వాస్తవాల పాదముద్రలను బలంగా వేస్తుంది. వయొలిన్ తీగలపై తూనీగలు మీటే జీవన రాగాలతో పాట కట్టగల ప్రేమ ఋతువు ఈ రచయిత. ఈయన కవితలు చదువుతుంటే తట్టే ప్రతీకలు ఇవే. పాల పిట్ట రెక్కలతో చెక్కిలి తుడిపించుకోవాలనే స్వాప్నికుడు శ్రీధర్.
‘వాక్యాల మొదళ్లు చివళ్ళు గుచ్చుకోకుండా’ రాయగల నేర్పరి కనుకే సర్కారు వారి పాట లోని ఈత ముళ్లని కనిపెట్టాడు. విరామ చిహ్నాలు లేని కన్నీటి వాక్యాలు ఈ సంకలనం నిండా ఎన్నెన్నో. వ్యాకరణాన్ని ధిక్కరించి కట్టిపడేసే ఆత్మిక వాక్య సంకలనం ఈ ‘ఏకాంతం ఒక అతిథి’. ఒకటా రెండా ఎన్నన్ని చెప్పను. నా జీవితాన్ని మరింత విశాలం చేసిన రచన శ్రీధర్ కవిత. నిన్నటి గాయం, రేపటి వ్యుహమ్ లేకుండా ఎన్నాళ్లకో నేను రాసిన సమీక్షణం ఇది. ఒక్కో అక్షరం మట్టి పెళ్ళలా నామీద పడుతున్న చప్పుడు సాక్షిగా వాక్యాలను చిమ్ముకుంటూ ఏకాంతం లోని అతిథితో ఆత్మతో కలిసి చేసిన ప్రయాణం ఇది.
తెలంగాణా పోరాటం తెలుగు సాహిత్యంలో నవ్య కవిత్వానికి వికాసదశను కలుగజేసింది. వివిధ వస్తుగత విషయాల్ని ప్రకటించటం కోసం కవిత్వ పరిభాషలో సరికొత్త ట్రెండ్ కదం తొక్కింది. ఆ వేగం, ఉద్వేగం ‘ఏకాంతం ఒక అతిథి’ కవితా సంకలనంలో అనువణువునా కనిపించింది. పసునూరు శ్రీధర్ బాబు ఈ సంకలనంతో సరికొత్త శకానికి తెర తీశారు. పై పై పార్శ్వాలలో తేలిపోయే చవక బారు ఈత కాదు ఈ కవిత్వం. చదువరి ఆత్మ లోతుల్లోకి ఊర్ధ్వంగా గుచ్చుకుపోయే ఏకాంత అన్వేషణ ఇది.
ఈ కవితా సంకలనంలోని ప్రతి కవిత మహోన్నత యోగ రచితం. ఇవన్నీ ఒకెత్తు ఐతే కవి సిద్దార్ద రాసిన ముందు మాట ప్రతీకల కన్నీటిలో వాస్తవాల యాసిడ్ కలిపి చదువరుల ఆత్మపై వంపిన వాస్తవాల పరిమళం. మొత్తానికి ఈ ‘ఏకాంతం ఒక అతిథి’ కచ్చితంగా ఈ దశాబ్దపు కవితా క్షిపణి.
(వల్లూరి రాఘవరావు ఆంధ్రప్రభ వీక్లీ పూర్వ సంపాదకుడు. ABN ఆంధ్రజ్యోతి సీనియర్ ఎడిటర్. ఫోన్: 9965468777)
ఏకాంతం ఒక అతిథి
పసునూరు శ్రీధర్‌బాబు కవిత్వం
పేజీలు: 152, వెల: రూ. 300
ప్రతులకు: #502, క్రాంతి ఆస్టర్, 2-B
ఈశ్వరిపురి కాలనీ, సైనిక్‌పురి,
హైదరాబాద్ – 500094
email: aksharmedios@gmail.com

వల్లూరి రాఘవరావు
ఈనాడు బడిలో అక్షరాభ్యాసం చేసి ఆంధ్ర జ్యోతి వడిలో సాహితీ గమకాలు సానబట్టి అటుపై సూపర్ హిట్ వంటి సీని పత్రికలలో రాటుదేలి 3 ఏళ్లకే ఆంధ్ర ప్రభ వారపత్రిక కు ఎడిటర్ గా పనిచేసిన నేపధ్యం వీరిది. అనంతరం TV9, NTV వంటి ఛానాళ్లలో విజువల్ మీడియా లో కేరిర్ ఆరంభించి ప్రస్తుతం ABN ఆంధ్రజ్యోతి ఛానల్ లో పదేళ్లకు పైగా సీనియర్ కాపీ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. విభిన్న రంగాలకు సంభందించి ఎన్నో పుస్తకాలు రాసిన అనుభవం వుంది.
