చిగురించిన వసంతం పార్ట్ – 9

Spread the love

అధ్యాయం 22

న్యాయ విచారణ – ముగింపు

ఖైదీల ఆఖరి మాటలు విన్న తర్వాత జ్యూరీని ఎలాంటి ప్రశ్నలు అడగాలో ఒక జాబితా తయారు చేసారు. దీని కసరత్తుకి కూడా కొంత సమయం పట్టింది. చివరికి ప్రశ్నలన్నీ రూపొందించాక, అధ్యక్షుడు తన ముగింపు ప్రసంగాన్ని ప్రారంభించాడు.

కేసును జ్యూరీ ముందు పెట్టబోయేముందు, అధ్యక్షుడు వాళ్ళతో కొంతసేపు కుటుంబ సభ్యుడిలా ఆహ్లాదంగా మాట్లాడాడు.

‘దొంగతనం దొంగతనమే, దోపిడీ దోపిడీయే. తాళం వేసిన చోటు నుండి దొంగిలించడమంటే తాళం వేసిన చోటు నుండి దొంగిలించడమేనని అర్థం’ అని వివరించాడు.

ఇదంతా వివరిస్తున్నప్పుడు, ఇంత ముఖ్యమైన నిజాలను నెఖ్లుడోవ్‌కి నొక్కి చెప్పడానికన్నట్లుగా అతని వైపు చాలాసార్లు చూసాడు అధ్యక్షుడు. నెఖ్లుడోవ్‌ అర్థం చేసుకుంటే తర్వాత ఇతర జ్యూరీ సభ్యులకు కూడా వాటిని అర్థమయ్యేలా చెబుతాడని అతను ఆశించాడు.

ఈ నిజాలన్నీ జ్యూరీ గ్రహించిందని అధ్యక్షుడికి నమ్మకం కుదరగానే, అతను వాళ్ళకు మరొక వాస్తవాన్ని చెప్పడం ప్రారంభించాడు. అదేంటంటే- హత్య అంటే మనిషి మరణంతో ముగిసే చర్య కాబట్టి విషప్రయోగాన్ని కూడా హత్యగానే పరిగణించవచ్చు. ఈ సత్యాన్ని కూడా జ్యూరీ అర్థం చేసుకుందని అధ్యక్షుడు భావించాడు.

దాన్ని మరింత వివరిస్తూ, ‘దొంగతనం. హత్య రెండూ ఒకేసారి జరిగితే, ఆ నేరాల కలయికను ‘హత్యతో కూడిన దొంగతనం’ అని చెప్పవచ్చు’ అన్నాడు అధ్యక్షుడు.

అధ్యక్షుడు కేసుని తొందరగా ముగించాలని ఎంత ఆత్రుతపడుతున్నప్పటికీ, తన స్విస్ స్నేహితురాలు తన కోసం ఎదురుచూస్తోందని తెలిసినప్పటికీ, తన హోదాలో భాగంగా ఎక్కువ మాట్లాడం అలవాటు కావడంతో అతను మాట్లాడడం మొదలుపెట్టగానే తనను తాను ఆపుకోలేకపోయాడు. అందుకే ఈ విషయాలన్నీ జ్యూరీకి మరింత క్షుణ్ణంగా చెప్పి వాళ్ళని ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు.

‘ఖైదీలు దోషులు అనిపిస్తే వాళ్ళని దోషులు అని తీర్పు ఇచ్చే హక్కు జ్యూరీకి ఉంది. వాళ్ళు నిర్దోషులు అనిపిస్తే నిర్దోషులనే తీర్పు ఇవ్వొచ్చు. ఒకవేళ మొదటి నేరంలో దోషులు, రెండో నేరంలో నిర్దోషులని భావిస్తే- ఒకదాంట్లో దోషులని, మరోదాంట్లో నిర్దోషులని తీర్పు ఇవ్వచ్చు’ అని చెప్పాడు.

అలా తీర్పు ఇచ్చే హక్కు వాళ్ళకు ఇవ్వబడిందనీ, అయితే వాళ్ళు దానిని విచక్షణతో ఉపయోగించాలని వివరించాడు అధ్యక్షుడు.

వీటితో పాటు అతను మరో విషయం కూడా చెప్పాలనుకున్నాడు. అదేంటంటే- ఏ ప్రశ్నకైనా జ్యూరీ అనుకూలంగా సమాధానం ఇస్తే, ఆ ప్రశ్నలో చేర్చబడిన ప్రతి అంశాన్ని వాళ్ళు అంగీకరించినట్టే అవుతుంది; కాబట్టి ప్రశ్న మొత్తాన్ని ధృవీకరించడానికి వాళ్ళు ఇష్టపడని పక్షంలో, ప్రశ్నలో ఏ భాగాన్నైతే మినహాయించాలనుకుంటున్నారో ప్రత్యేకంగా ముందే చెప్పాలి. అయితే అధ్యక్షుడు గడియారం వైపు ఒకసారి చూసి, మూడు అవడానికి ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే ఉందని గమనించి, ఈ మాత్రం అర్థం చేసుకునే తెలివితేటలు జ్యూరీకి ఉంటాయిలే అనుకుని, దాని గురించి ఏం మాట్లాడలేదు.

‘ఈ కేసు తాలూకు నిజానిజాలు కింది విధంగా ఉన్నాయి’ అంటూ మొదలుపెట్టాడు అధ్యక్షుడు.

అప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్, లాయర్లు, సాక్షులు అనేకసార్లు చెప్పిన విషయాలన్నిటినీ అతను మళ్ళీ వల్లె వేసాడు.

అధ్యక్షుడు మళ్ళీ తన ప్రసంగం మొదలుపెట్టాడు. అతనికి ఇరువైపులా కూర్చున్న సభ్యులు చాలా శ్రద్ధగా వింటున్నారు. అప్పుడప్పుడు గడియారం వైపు చూస్తున్నారు. అధ్యక్షుడి ప్రసంగం వాళ్ళకి సుదీర్ఘంగా ఉన్నట్టనిపించింది. కానీ అది చాలా బావున్నట్టుందని కూడా అనిపించింది; అంటే- అది ఉండాల్సినట్టుగానే ఉందనిపించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, లాయర్లే కాదు, నిజానికి కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ అదే అభిప్రాయం కలిగింది.

అధ్యక్షుడు ప్రసంగాన్ని ముగించాడు. తరువాత జ్యూరీ సభ్యులకి తెలిసిన విషయాలని, చదివి తెలుసుకోగలిగే విషయాలని కూడా తాను చెప్పడం అవసరమని భావించాడు. అంటే- కేసును ఎలా పరిగణించాలి, ఓట్లను ఎలా లెక్కించాలి, సమాన ఓట్ల పరిస్థితి ఎదురైనప్పుడు ఖైదీలను ఎలా నిర్దోషులుగా ప్రకటించాలి ఇలాంటివన్నమాట.

తాను చెప్పాల్సిన విషయాలు మొత్తం చెప్పినట్లే అనిపించింది అధ్యక్షుడికి. అయినా సరే, తనకున్న మాట్లాడే హక్కును ఇంకా వదులుకోలేకపోయాడు.

తన గొంతులో ధ్వనించే ప్రభావవంతమైన స్వరాన్ని వినడం అతనికి ఎంతో ఆనందంగా అనిపించింది. అందువల్ల అతను జ్యూరీకి ఇచ్చిన హక్కుల ప్రాముఖ్యత గురించి, ఆ హక్కులను వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి, వాటిని ఎలా దుర్వినియోగం చేయకూడదు, చేసిన ప్రమాణానికి ఎలా కట్టుబడి ఉండాలి, వాళ్ళు సమాజం యొక్క మనస్సాక్షి అని, విచారణ గదిలో జరిగే చర్చారహస్యాన్ని పవిత్రంగా పరిగణించాలని, ఇంకా అనేక ఇతర విషయాల గురించి వాళ్ళకు కొన్ని మాటలు చెప్పడం అవసరం అనుకున్నాడు.

అధ్యక్షుడు ప్రసంగం ప్రారంభించిన క్షణం నుండే ఒక్కమాట కూడా విడిచిపెట్టకూడదన్నంత దీక్షగా, కనీసం రెప్ప కూడా వేయకుండా అతడినే చూస్తూ ఉండిపోయింది మస్లోవా. అందుకే నెఖ్లుడోవ్‌ కూడా మస్లోవా తనని గమనిస్తుందనే భయం లేకుండా, ఆమెనే చూస్తూండిపోయాడు.

అప్పుడు నెఖ్లుడోవ్‌ మనస్సు ఆమె రూపం తాలూకు అనేక దశల గుండా ప్రయాణించింది. మనం చాలా ఏళ్ళుగా చూడని ముఖం ఎదురైనప్పుడు, మొదట ఆ ముఖంలో కాలానుగుణంగా వచ్చిన బాహ్య మార్పులే ఆకర్షిస్తాయి; ఆ తర్వాత ఆ ముఖం క్రమంగా తన పాత రూపంలోకి మారిపోతుంది. కాలం సృష్టించిన మార్పులన్నీ క్రమంగా అదృశ్యమైపోతాయి. అప్పుడు మన చూపుకి కేవలం ఆ వ్యక్తికి మాత్రమే సొంతమైన అపురూపమైన, విశిష్టమైన, అసలైన ముఖ కవళికలు ప్రత్యక్షమవుతాయి

అవును. ఆమే! ముతక జైలు దుస్తుల్లో ఉన్నప్పటికీ, ఎదిగిన దేహం వల్ల వక్షస్థలం, కిందిభాగం నిండుగా మారినప్పటికీ, నుదుటి మీదా కనుబొమ్మల చివరనా ముడతలు పడిన కళ్ళు ఉబ్బినట్లున్నప్పటికీ, ఈ అమ్మాయి ఖచ్చితంగా ఆ పాత కటూషానే. ఆనాడు, ఆ ఈస్టర్ పండుగ రాత్రి, జీవం ఉరకలెత్తే కళ్ళని పైకెత్తి, అమాయకమైన చూపులతో తాను ప్రాణంగా ప్రేమించిన అతడిని చూస్తూ నిండుగా నవ్విన అదే కటూషా.

‘పదేళ్ళ తరువాత, అంతకాలం ఆమెను ఒక్కసారి కూడా చూడకపోయినా, సరిగ్గా నేను జ్యూరీలో ఉన్న ఈ రోజున, ఈ కేసు విచారణకు రావడం, ఖైదీల బోనులో నేను ఆమెను మళ్ళీ చూడటం ఎంత వింత యాదృచ్చికం! దీని ముగింపు ఎలా ఉండబోతుంది? అయ్యో దేవుడా, వీళ్ళు కొంచెం త్వరగా ముగిస్తే బాగుండు’ అనుకున్నాడు నెఖ్లుడోవ్‌.

అయినా సరే, తనలో పెల్లుబికే పశ్చాత్తాప భావాలకు లొంగిపోలేదు అతను. ఇవన్నీ తన జీవన విధానానికి ఎటువంటి భంగం కలిగించకుండా సాగిపోయే యాదృచ్ఛిక సంఘటనలుగానే పరిగణించాలని అతను ప్రయత్నించాడు.

ఇల్లంతా చిందరవందర చేసిన కుక్కపిల్లను, అక్కడే నిలబెట్టి, యజమాని దాని మెడ వెనుక పట్టుకుని చెవి మెలిపెట్టినపుడు అది ఎలాంటి స్థితిలో ఉంటుందో, ఇప్పుడు తాను కూడా అదే స్థితిలో ఉన్నట్టు అతనికి అనిపించింది. కుక్కపిల్ల మూలుగుతూ, గెంతుతూ, తను చేసిన తప్పునుండి తప్పించుకుని వీలైనంత దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆ దయలేని యజమాని వదలడు.

అలాగే, నెఖ్లుడోవ్ కి కూడా తను చేసిన పనిలో ఎంత అసహ్యకరమైన స్వభావం దాగుందో అనుభవంలోకి వస్తోంది. యజమాని శక్తివంతమైన చేతిస్పర్శని కూడా అతను అనుభూతి చెందుతున్నాడు. అయినా అతనింకా తను చేసిన పని ఎంత తీవ్రమైనదో అతను పూర్తిగా గ్రహించలేదు. అలాగే యజమాని చేతిని గుర్తించడానికి కూడా అతను ఇష్టపడలేదు. తన ముందున్నది చేసిన పాపం తాలూకు కర్మఫలితమేనని ఒప్పుకోవడానికి అతని మనసు ఇష్టపడటం లేదు. కానీ నిర్దయుడైన ఆ యజమాని చేయి తనను గట్టిగా పట్టుకుందని, తానిక తప్పించుకోలేనని మాత్రం అతనికి అనిపించింది.

అయినా సరే అతను మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, యథావిధిగా కాలు మీద కాలేసుకుని, నిర్లక్ష్యంగా పిన్స్-నేజ్‌తో ఆడుకుంటూ ముందు వరుసలోని కుర్చీలో కూర్చున్నాడు.

కానీ కేసు జరుగుతున్నంతసేపూ అతని ఆత్మ లోతుల్లో మాత్రం ఈ ఒక్క పనికే కాకుండా, తన మొత్తం విచ్చలవిడితనంలో, క్రూరత్వంలో, సోమరితనంతో నిండిన జీవితంలోని నీచత్వం, పిరికితనం అనుభవంలోకి వస్తున్నాయి.

తను చేసిన ఈ పాపాన్ని, తదనంతర జీవితాన్ని, మొత్తంగా కప్పెట్టిన ఏదో గుర్తు తెలియని భయంకరమైన ముసుగు కదలడం ప్రారంభించింది. దాని వెనుక దాగి ఉన్న భయంకరమైన వాస్తవాలు అతనికి ఇప్పుడిప్పుడే అస్పష్టంగా కనిపిస్తున్నాయి.

***

అధ్యాయం 23

విచారణ: తీర్పు

ఎట్టకేలకి అధ్యక్షుడు తన ప్రసంగాన్ని ముగించాడు. ఎంతో హుందాగా తన చేతిని చాపి, ప్రశ్నల జాబితాను జ్యూరీ నాయకుడికి అందించాడు. దాన్ని తీసుకోవడానికి నాయకుడు ముందుకు వచ్చాడు. చర్చాగదికి వెళ్లే అవకాశం దొరికిందన్న సంతోషంలో జ్యూరీ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు లేచి, ఆ గదిలోంచి బయటకు వెళ్ళారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేసినట్లు కొంచెం సిగ్గుపడుతూ, చేతులు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నట్టు కనిపించారు.

అందరూ గదిలోంచి వెళ్ళగానే జడ్జీలు లేచి వెళ్ళిపోయారు. ఖైదీలను కూడా బయటకు తీసుకెళ్ళారు. వెంటనే తలుపు మూసివేయబడింది. ఒక సెక్యూరిటీ గార్డు అక్కడికొచ్చి, ఒరలోంచి కత్తిని బయటకి లాగి భుజానికి ఆనించుకుని తలుపు వెనుక కాపలాగా నిలబడ్డాడు.

జ్యూరీ సభ్యులు చర్చాగదిలోకి అడుగుపెట్టిన వెంటనే చేసిన మొదటి పని, మునుపటిలాగే సిగరెట్లు వెలిగించి పొగతాగడం. కోర్టుగదిలో కూర్చున్నంతసేపు వాళ్ళ మనసుల్లో ఉన్న ఒక రకమైన అసహజత్వం, ఏదో అబద్ధపు పాత్రలు పోషిస్తున్నామనే భావన… ఈ గదిలోకి వచ్చి స్మోకింగు మొదలుపెట్టగానే మాయమైపోయాయి. ఇప్పుడు అందరూ ఒక విధమైన ఉపశమన భావంతో, తేలికపడిన మనసులతో ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టారు.

‘ఇందులో ఆ అమ్మాయి తప్పేం లేదు. ఏదో తెలియక ఈ గొడవలో ఇరుక్కుపోయింది. ఆమె మీద కొంచెం జాలి చూపించాలని మనం సిఫార్సు చేయాలి’ అన్నాడు దయగల వ్యాపారి.

‘మనం ఇప్పుడు పరిశీలించబోయేది కూడా అదే. కానీ మనం మన వ్యక్తిగత అభిప్రాయాలకు తలొగ్గకూడదు’ అన్నాడు జ్యూరీ నాయకుడు.

‘అధ్యక్షుడి ముగింపు ప్రసంగం బావుంది కదా.’ మెచ్చుకున్నాడు ఒక కల్నల్.

‘బావుందా? ఆయన ప్రసంగం వింటూంటే నాకైతే నిద్రొచ్చేసింది!’ ఎవరో చమత్కరించారు.

‘ముఖ్యమైన పాయింటేంటంటే- ఒకవేళ మస్లోవా ఆ నౌకర్లతో ఒప్పందం చేసుకోకపోతే, అసలు అక్కడ డబ్బు ఉందన్న విషయం వాళ్ళకి తెలిసే అవకాశం లేదు కదా?’ అని ప్రశ్నించాడు యూదు సంతతికి చెందిన ఒక క్లర్క్.

‘అంటే, ఆ అమ్మాయే డబ్బు దొంగిలించిందని మీరు అనుకుంటున్నారా?’ ఒక జ్యూరీ సభ్యుడు అడిగాడు.

‘నేను అది ఎప్పటికీ నమ్మను, అది ఆ ఎర్రకళ్ళ గయ్యాళి ముసలిదాని పనే.’ గట్టిగా అరిచాడు దయగల వ్యాపారి.

‘వాళ్ళంతా ఒకటే గుంపు. అందరూ దొంగలే.’ నిట్టూరుస్తూ అన్నాడు కల్నల్.

‘కానీ ఆమె అస్సలు ఆ గదిలోకే వెళ్ళలేదని అంటోంది కదా!’ అన్నాడొకడు.

‘ఓ…! అయితే ఆమె చెప్పినవన్నీ అలాగే నమ్మేయండి మరి.’ వెటకారంగా అన్నాడు ఇంకొకడు.

‘ఆ దౌర్భాగ్యురాలిని నేను ఈ జన్మలో నమ్మను.’ కోపంగా అన్నాడు మరొకడు.

‘మీరామెను నమ్మినా నమ్మకపోయినా అది సమస్యను పరిష్కరించదు కదా?’ గుర్తుచేసాడు క్లర్క్.

‘కానీ, ఆ గది తాళంచెవి ఆ అమ్మాయి దగ్గరే ఉంది’ అన్నాడు కల్నల్.

‘ఉంటే ఏమైంది?’ వ్యాపారి ఎదురుదాడి చేసాడు.

‘మరి ఆమె దగ్గర దొరికిన ఆ ఉంగరం సంగతేంటి?’ తిప్పికొట్టాడు కల్నల్.

‘కానీ ఆ అమ్మాయి జరిగిందంతా స్పష్టంగా చెప్పింది కదా!’ మళ్ళీ గట్టిగా అన్నాడు వ్యాపారి. ‘ఆ చనిపోయినాడికి కొంచెం కోపం ఎక్కువ. పైగా ఆ సమయంలో బాగా తాగున్నాడు. ఆ అమ్మాయిని కొట్టాడు; అంతకంటే ఏం జరుగుతుంది? ఆ తర్వాత పశ్చాత్తాపం కలగడం సహజమే కదా. సరేలే, బాధపడకు… ఇదిగో ఇది తీసుకో అని ఆ ఉంగరం ఇచ్చి ఉంటాడు. అతను ఆరడుగుల ఐదంగుళాల ఎత్తుంటాడని విన్నాను; నా అంచనా ప్రకారం ఇరవై బండరాళ్ళంత బరువు ఉండుంటాడు.’

‘అసలు విషయం అది కాదు. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి, దాన్ని ప్రోత్సాహించిన వ్యక్తి ఆ అమ్మాయా లేక ఆ నౌకర్లా అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న’ అన్నాడు పీటర్ గెరాసిమోవిచ్.

‘ఇదంతా నౌకర్లు ఒంటరిగా చేయడం సాధ్యం కాదు. తాళంచెవి ఆ అమ్మాయి దగ్గరే ఉంది.’ ఎవరో గుర్తు చేసారు.

అందరూ ఇలాంటి అర్థంలేని మాటలు చాలా సేపు మాట్లాడుకున్నారు. చివరికి జ్యూరీ నాయకుడు ఇలా అన్నాడు;

‘క్షమించండి జెంటిల్మెన్, మనం టేబుల్ దగ్గర కూర్చొని విషయాన్ని పద్ధతిగా చర్చిస్తే బాగుంటుంది కదా? దయచేసి రండి’ అంటూ అతను తన కుర్చీలో కూర్చున్నాడు.

అందరూ కూర్చున్నాక నాయకుడు మొదటి ప్రశ్నను చదివాడు.

‘జెంటిల్మెన్, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగాడు.

ఈ ప్రశ్నకు సమాధానం వెంటనే వచ్చింది.

కార్టింకిన్ విషం ఇవ్వడంలోనూ, దొంగతనంలోనూ పాలుపంచుకున్నాడని అందరూ నమ్మారు. అందుకే అందరూ ఏకగ్రీవంగా అతను ‘నేరస్థుడు’ అని తేల్చేసారు. కానీ కార్మిక సంఘం సభ్యుడైన ఒక ముసలి పనివాడు మాత్రం ఇందుకు భిన్నంగా అతన్ని నిర్దోషిగా వదిలేయాలని గట్టిగా వాదించాడు.

ఆ ముసలివాడికి విషయం సరిగా అర్థం కాలేదేమోనని జ్యూరీ నాయకుడు, సాక్ష్యాధారాలన్నీ కార్టింకిన్‌ని దోషిగానే సూచిస్తున్నాయని వివరించటం మొదలుపెట్టాడు. దానికి ఆ వృద్ధుడు, తనకు విషయం అర్థమైందని, అయినా అతనిపై జాలి చూపించడమే మంచిదనుకుంటున్నానని చెప్పాడు.

‘మనమేమీ సాధువులం కాదు కదా’ అన్నాడు తన అభిప్రాయానికే కట్టుబడుతూ.

ఇక రెండో ప్రశ్న బోచ్‌కోవా గురించి.

అనేక వాదోపవాదాలు, ఆగ్రహభరితమైన అరుపులు కేకల తర్వాత చివరికి బోచ్‌కోవా ‘నిర్దోషి’ అనే తీర్పు వచ్చింది. మస్లోవాను ఎలాగైనా కాపాడాలని ఆత్రుతపడుతున్న దయగల వ్యాపారి మాత్రం, అసలు ఈ వ్యవహారమంతటికీ సూత్రధారి బోచ్‌కోవానే అని వాదించాడు. చాలా మంది జ్యూరీ సభ్యులు అదే నిజమని నమ్మారు కూడా. కానీ జ్యూరీ నాయకుడు మాత్రం చట్టానికి విరుద్ధంగా వెళ్ళకూడదని, విషప్రయోగంలో ఆమెను సహ-నేరస్తురాలిగా పరిగణించడానికి ఆధారాలు లేవని నొక్కి చెప్పాడు. చాలాసేపు వాదోపవాదాలు జరిగాక చివరికి నాయకుడి మాటే నెగ్గింది.

బోచ్‌కోవాను నిర్దోషిగా ప్రకటించారు.

బోచ్‌కోవాకు సంబంధించిన నాలుగో ప్రశ్నకు ‘నేరస్తురాలు’ అని సమాధానం వచ్చింది. కానీ ఆ ముసలి పనివాడు పట్టుబట్టడంతో, ఆమె పైన కొంచెం దయ చూపించి శిక్ష తగ్గించాలని సిఫార్సు చేసారు.

ఇక మస్లోవాకు సంబంధించిన మూడవ ప్రశ్న తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది.

విషప్రయోగం, దొంగతనం రెండింటిలోనూ ఆమె నేరస్తురాలే అని నాయకుడు పట్టుబట్టాడు. దీనికి వ్యాపారి ఒప్పుకోలేదు. కల్నలు, క్లర్కు, ముసలి పనివాడు కూడా వ్యాపారి వైపే నిలబడ్డారు. కానీ మిగిలిన వాళ్ళు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఊగిసలాడారు. క్రమంగా నాయకుడి అభిప్రాయానికి బలం పెరిగింది. అందుకు ప్రధాన కారణం- జ్యూరీ సభ్యులందరూ బాగా అలసిపోయి ఉండటమే. ఎవరి వాదనని సమర్థిస్తే అందరూ త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి తొందరగా అక్కణ్ణుంచి బయటపడచ్చో, దానికే మొగ్గు చూపారు.

జరిగిన సంఘటనని బట్టి, అలాగే మస్లోవాను గురించి తనకు ముందే తెలిసిన దాన్ని బట్టి, నెఖ్లుడోవ్‌కు ఒక విషయం స్పష్టంగా తెలుసు: అది దొంగతనంలోనూ, విషప్రయోగంలోనూ ఆమె ఖచ్చితంగా నిర్దోషి. చివరకు అందరూ ఇదే నిర్ణయానికి వస్తారని కూడా అతడు నమ్మాడు.

కానీ ఆ వ్యాపారి చేస్తున్న బలహీనమైన వాదన- ఆమె పట్ల అతడికి ఉన్న శారీరక ఆకర్షణ మీదే ఆధారపడి ఉందని, దాన్ని దాచేందుకు కూడా అతడు ప్రయత్నించకపోవడం, నాయకుడి గట్టి పట్టుదల, ముఖ్యంగా సభ్యులందరిలోనూ పెరుగుతున్న అలసట… ఇవన్నీ కలిసి ఆమెకు శిక్ష పడేలా చేస్తున్నాయని అతను గమనించాడు. తన అభ్యంతరాన్ని చెప్పాలని అతనికి బలంగా అనిపించింది.

కానీ, అలా చెబితే మస్లోవాతో తనకున్న పాత సంబంధం బయటపడుతుందేమో అన్న భయంతో అతను ధైర్యం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. ఇక తన అభ్యంతరం చెప్పకుండా చర్చను ఇంకా ఇలాగే కొనసాగనివ్వలేను అనే భావన అతడికి కలిగింది. ముఖం ఎర్రబడి, మళ్ళీ భయంతో పాలిపోతున్నా సరే లేచి మాట్లాడ్డానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో

‘నన్ను ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి’ అంటూ ముందుకొచ్చాడు పీటర్ గెరాసిమోవిచ్;

నాయకుడు అధికారం చెలాయించే తీరుతో చిర్రెత్తిపోయిన పీటర్ గెరాసిమోవిచ్ తన అభ్యంతరాలు చెప్పడం మొదలుపెట్టాడు. నెఖ్లుడోవ్ ఏవైతే చెప్పాలనుకున్నాడో సరిగ్గా అవే పాయింట్లను అతను అభ్యంతరాలుగా లేవనెత్తాడు.

‘తాళం చెవి ఆమె దగ్గర ఉండటమే ఆమె దొంగతనం చేసిందనడానికి రుజువని మీరు భావిస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ ఆమె వెళ్ళిపోయాక నకిలీ తాళంచెవితో నౌకర్లు ఆ పెట్టెను తెరవడం ఎంతసేపు?’

‘అవును, నిజమే కదా!’ అని వ్యాపారి మద్దతు పలికాడు.

‘అసలు ఆమె ఆ డబ్బును దొంగిలించే అవకాశం లేదు; ఎందుకంటే అప్పుడు ఆమె ఉన్న స్థితిలో అంత డబ్బును ఏం చేసుకోవాలో కూడా ఆమెకు తెలిసుండకపోవచ్చు.’

‘నేను కూడా అదే చెబుతున్నాను.’ వ్యాపారి మళ్ళీ అన్నాడు.

‘కానీ ఆమె అక్కడికి రావడం ఆ నౌకర్ల బుర్రలోకి ఆ ఆలోచన వచ్చేలా ప్రేరేపించి ఉండవచ్చు. వాళ్ళు ఆ అవకాశాన్ని వాడుకుని, ఆ నిందని మొత్తం ఆమె మీదకు నెట్టేసి ఉండవచ్చు.’

పీటర్ గెరాసిమోవిచ్ అంత చిరాకుగా మాట్లాడటంతో నాయకుడికి కోపం వచ్చింది. దాంతో అతను మొండిగా తన పాత వాదననే సమర్థించుకోసాగాడు; కానీ పీటర్ మాటలు నమ్మశక్యంగా ఉండటంతో జ్యూరీ సభ్యుల్లో ఎక్కువమంది అతనితో ఏకీభవించారు. చివరకు మస్లోవా ఆ డబ్బుని దొంగిలించలేదని, ఆ ఉంగరం ఆమెకు బహుమతిగా ఇచ్చిందేనని జ్యూరీ నిర్ణయించింది.

విషప్రయోగంలో ఆమె పాలుపంచుకున్నదా లేదా అనే ప్రశ్న మీద చర్చ మొదలవ్వగానే, ఆమెను బలంగా సమర్థిస్తున్న వ్యాపారి, ‘ఆమెను నిర్దోషిగా వదిలేయాలి, ఎందుకంటే విషం పెట్టాల్సిన అవసరమేమీ ఆమెకు లేదు’ అని ప్రకటించాడు.

‘ఆమెను నిర్దోషిగా వదిలేయడం అసాధ్యం; ఎందుకంటే తానే ఆ విషపు పొడిని ఇచ్చినట్లు ఆమె స్వయంగా ఒప్పుకుంది కదా’ అని గుర్తు చేసాడు నాయకుడు.

‘అవును. కానీ అది నల్లమందు అనుకుని ఇచ్చింది కదా’ అన్నాడు వ్యాపారి.

‘నల్లమందు కూడా ప్రాణాలు తీయగలదు’ అన్నాడు, విషయాన్ని పక్కదారి పట్టించే అలవాటున్న కల్నల్.

ఒకసారి తన బావమరిది భార్య, నల్లమందు మోతాదు ఎక్కువై ఎలా చావబోయిందో, సరిగ్గా డాక్టర్ అందుబాటులో ఉండటంతో ఎలా బతికిపోయిందో చెప్పడం మొదలుపెట్టాడు. కల్నల్ ఆ కథను ఎంత గంభీరంగా, హుందాగా చెబుతున్నాడంటే… అతన్ని మధ్యలో ఆపే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. అది చూసి క్లర్కు కూడా తనకో కథ తెలుసని మధ్యలో దూరడానికి ప్రయత్నించాడు:

‘నల్లమందు అలవాటైతే కొంతమందికి నలభై చుక్కలు తీసుకున్నా ఏమీ కాదు. మా బంధువు ఒకరు…’ అని మొదలుపెట్టాడు క్లర్కు.

కానీ కల్నల్ అతన్ని మాట్లాడనివ్వకుండా, తన బావమరిది భార్యపై ఆ మందు ప్రభావం ఎలా ఉందో చెప్పుకుంటూ పోయాడు.

‘కానీ జెంటిల్మెన్, ఇప్పుడు టైము సాయంత్రం ఐదు కావస్తోంది తెలుసా?’ ఒక జ్యూరీ సభ్యుడు గుర్తు చేసాడు.

‘సరే, మరి మనం ఏం చెబుదాం?’ అని అడిగాడు జ్యూరీ నాయకుడు; ‘ఆమె నేరస్తురాలే, కానీ దోచుకోవాలనే ఉద్దేశం ఆమెకు లేదని చెబుదామా? అలాగే, ఆమె ఎలాంటి సొమ్ముని దొంగిలించలేదని కూడా రాద్దామా? అలా చేస్తే సరిపోతుందా?’

‘కానీ ఆమె మీద జాలి చూపించాలని కూడా మనం సిఫార్సు చేయాలి.’ మరోసారి గుర్తుచేసాడు వ్యాపారి.

అందుకు అందరూ ఒప్పుకున్నారు. ఆ ముసలి పనివాడు మాత్రం అసలామెను నిర్దోషిగా ప్రకటించాలని పట్టుబట్టాడు.

‘మనం చెబుతున్నది కూడా అదే కదా. దొంగతనం చేసే ఉద్దేశ్యం లేదు, ఏమీ దొంగిలించలేదు అంటే దాని అర్థం ఆమె నిర్దోషి అనే కదా. అది స్పష్టంగానే ఉందిగా’ అని నాయకుడు అతనికి వివరించాడు.

‘సరే; అదే సరిపోతుంది. అలాగే మనం ఆమెకు క్షమాభిక్ష పెట్టాలని కూడా సిఫారసు చేస్తున్నాం.’ వ్యాపారి ఉల్లాసంగా అన్నాడు.

వాళ్ళు బాగా అలసిపోయారు. చర్చలతో గందరగోళానికి గురయ్యారు. అందుకే ఆమె ఆ విషపు పొడిని ఇచ్చిన మాట వాస్తవమే అయినా, ‘చంపాలనే ఉద్దేశ్యం ఆమెకు లేదు’ అనే మాటను జ్యూరీ నివేదికలో చేర్చాలనే విషయం ఎవరికీ గుర్తు రాలేదు. నెఖ్లుడోవ్ కూడా ఎంత ఉత్తేజానికి లోనయ్యాడంటే, అంత ముఖ్యమైన పాయింటు వదిలేసారన్న సంగతి అతను కూడా గమనించలేదు.

అలా అందరూ అంగీకరించినట్టుగానే సమాధానాలను రాసి కోర్టుకు పంపారు.

ఫ్రాంకోయిస్ రాబేలే (Rabelais) అనే రచయిత న్యాయ వ్యవస్థలోని అపహాస్యాన్ని వ్యంగ్యంగా చెబుతూ ఏమంటాడంటే- ఒక కేసును వాదిస్తున్న లాయరు, రకరకాల చట్టాలన్నింటినీ ఉటంకించి, అర్థంపర్థం లేని లాటిన్ పదాలను వాడి, ఇరవై పేజీల న్యాయ పత్రాలను చదివి వినిపించాడు. ఆ తర్వాత జడ్జీల దగ్గరకు వెళ్లి… ‘మనం ఒకసారి పాచికలు వేద్దాం; ఒకవేళ బేసి సంఖ్య వస్తే నిందితుడు నిర్దోషి అని, లేదంటే ఫిర్యాదుదారుడు చెప్పిందే నిజమని తీర్పు ఇద్దాం’ అని ప్రతిపాదించాడట!

దాదాపు ఈ కేసులో కూడా జరిగింది ఇదే. ఆ నిర్ణయం అందరూ మనస్ఫూర్తిగా అంగీకరించి తీసుకున్నది కాదు. అధ్యక్షుడు సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎప్పుడూ చెప్పే ఒక ముఖ్యమైన మాటను ఈసారి తన సుదీర్ఘ ప్రసంగంలో చెప్పడం మర్చిపోయారు. అవును, ఆమె నేరస్తురాలే కావచ్చు, కానీ ప్రాణాలు తీయాలనే ఉద్దేశ్యం ఆమెకు లేదు అని జ్యూరీ తీర్పు ఇవ్వవచ్చు అనే విషయాన్ని అతను ప్రస్తావించలేదు. అలాగే, ఆ కల్నల్ తన బావమరిది భార్య కథను చాలాసేపు సాగదీసినందువల్ల సమయం విపరీతంగా వృధా అయింది. నెఖ్లుడోవ్ కూడా తీవ్రమైన ఆందోళనలో ఉండటంతో, ‘ప్రాణం తీయాలనే ఉద్దేశ్యం ఆమెకు లేదు’ అనే కీలకమైన వాక్యం ఆ నివేదికలో లేదన్న విషయాన్ని గమనించలేదు. కేవలం ‘ఉద్దేశ్యం లేదు’ అనే మాటలు ఉంటే సరిపోతుందని అతను పొరబడ్డాడు. ఇక ప్రశ్నలు, సమాధానాలు చదువుతున్న ఆ కీలక సమయంలో పీటర్ గెరాసిమోవిచ్ గదిలో లేడు. వీటన్నిటికంటే ముఖ్యంగా, జ్యూరీ సభ్యులందరూ అలసిపోయారు. వీలైనంత త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలనే ఆత్రుతతో, ఏ నిర్ణయం తీసుకుంటే ఈ వ్యవహారం త్వరగా ముగుస్తుందో దానికి అందరూ తలూపడం వల్ల ఈ తీర్మానం తీసుకోబడింది.

జ్యూరీ సభ్యులు గంటకొట్టారు. తలుపు బయట కత్తి పట్టుకుని కాపలాగా ఉన్న గార్డు కత్తిని తిరిగి ఒరలో పెట్టుకుని పక్కకు తప్పుకున్నాడు. జడ్జీలు తమ ఆసనాల్లో కూర్చున్నారు. జ్యూరీ సభ్యులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు.

జ్యూరీ నాయకుడు గంభీరమైన ముఖంతో తీర్మాన పత్రాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడికి అందించాడు. అధ్యక్షుడు దాన్ని చూసి, ఆశ్చర్యంతో చేతులు చాచి, తోటి జడ్జీలతో చర్చించడం మొదలుపెట్టాడు. జ్యూరీ సభ్యులు ‘దొంగతనం చేసే ఉద్దేశ్యం లేదు’ అని ఒక నిబంధనను చేర్చి, ‘ప్రాణం తీయాలనే ఉద్దేశ్యం లేదు’ అనే రెండో ముఖ్యమైన నిబంధనను ఎందుకు చేర్చలేదా అని అతను ఆశ్చర్యపోయాడు. జ్యూరీ తీసుకున్న ఆ నిర్ణయం ప్రకారం- మస్లోవా దొంగతనం చేయలేదు, ఎవరినీ దోచుకోలేదు, కానీ ఎటువంటి కారణం లేకుండా ఒక వ్యక్తికి విషం పెట్టి చంపేసిందనే అర్థం వస్తోంది.

‘చూడండి, వాళ్ళు ఎంత తెలివితక్కువ నిర్ణయానికి వచ్చారో’ అని ఆయన తన ఎడమపక్కనున్న జడ్జీ చెవిలో నెమ్మదిగా అన్నాడు; ‘దీని ప్రకారం ఆమె సైబీరియాలో కఠిన కారాగార శిక్ష అనుభవించాలి. నిజానికి ఆమె నిర్దోషి.’

‘అదేంటి, మీరు నిజంగానే ఆమె నిర్దోషి అంటున్నారా?’ అని అడిగాడు జడ్జీ గంభీరంగా.

‘అవును, ఆమె కచ్చితంగా నిర్దోషి. నా ఉద్దేశం ప్రకారం, ఇది ఆర్టికల్ 817ను అమలు చేయాల్సిన సందర్భం’ అన్నాడు అధ్యక్షుడు.

ఆర్టికల్ 817 ప్రకారం, జ్యూరీ ఇచ్చిన నిర్ణయం అన్యాయంగా ఉందని కోర్టు భావిస్తే, దానిని పక్కన పెట్టవచ్చు.

‘మీరేమంటారు?’ అధ్యక్షుడు రెండో సభ్యుడి వైపు తిరిగి అడిగాడు.

ఆ దయగల న్యాయమూర్తి వెంటనే సమాధానం చెప్పలేదు. తన ముందున్న కాగితంలోని సంఖ్యలను చూసి వాటిని కూడటం ప్రారంభించాడు; ఆ మొత్తం మూడుతో భాగించబడలేదు. ఆ సంఖ్య మూడుతో భాగించబడితే అధ్యక్షుడి ప్రతిపాదనకు అంగీకరించాలని అతను మనసులో అనుకున్నాడు. అయితే, ఆ సంఖ్య భాగించబడకపోయినప్పటికీ, అతనిలోని దయాగుణం వల్ల అధ్యక్షుడి మాటతో ఏకీభవించాడు.

‘నేను కూడా జ్యూరీ తీర్పును పక్కన పెడదాం అనుకుంటున్నాను’ అన్నాడు అతను.

‘మరి మీరు?’ అధ్యక్షుడు ఆ గంభీరమైన మూడో సభ్యుడి వైపు తిరిగి అడిగాడు.

‘ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు!’ అతను దృఢంగా సమాధానమిచ్చి, ఇలా వివరించాడు; ‘ఇప్పటికే పత్రికలు జ్యూరీ సభ్యులను విమర్శిస్తున్నాయి. నేరస్తులను నిర్దోషులుగా వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కోర్టు కూడా అదే పని చేస్తే జనం ఏమనుకుంటారు? నేను దీనికి అస్సలు ఒప్పుకోను’ అన్నాడు.

అధ్యక్షుడు తన గడియారం వైపు చూసుకున్నాడు.

‘చాలా విచారకరం, కానీ మనం మాత్రం ఏం చేయగలం?’ నిట్టూరుస్తూ చెప్పాడు అధ్యక్షుడు.

ఆ పత్రాన్ని జ్యూరీ నాయకుడికి అందించి చదివి వినిపించమని అడిగాడు. కోర్టులో అందరూ లేచి నిలబడ్డారు. నాయకుడు ఒక కాలు నుంచి ఇంకో కాలు మీదికి బరువుని మార్చుకుంటూ, అటూఇటూ కదులుతూ  గొంతు సవరించుకున్నాడు. తీర్మాన పత్రంలోని ప్రశ్నలను, వాటికి జ్యూరీ ఇచ్చిన సమాధానాలను చదివాడు. అవి విన్న కోర్టు సిబ్బంది, సెక్రటరీ, లాయర్లు, చివరికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఆశ్చర్యపోయారు. నిందితులు మాత్రం ఎటువంటి చలనం లేకుండా అలాగే కూర్చొన్నారు. బహుశా ఆ తీర్పులోని అసలు ప్రమాదం వాళ్ళకి ఇంకా అర్థమైనట్లు లేదు. మళ్ళీ అందరూ కూర్చున్నాక, నిందితులకు ఎటువంటి శిక్షలు విధించాలో చెప్పమని అధ్యక్షుడు ప్రాసిక్యూటర్‌ని అడిగాడు.

మస్లోవాను దోషిగా నిరూపించి శిక్షపడేలా చేయడంలో అనుకోని విజయం సాధించడంతో ప్రాసిక్యూటర్ ఎంతో సంతోషించాడు. ఇదంతా తన వాక్చాతుర్యం వల్లే జరిగిందని గర్వపడుతూ, అవసరమైన సమాచారాన్ని చూసుకుని లేచి ఇలా అన్నాడు;

సిమియన్ కార్టింకిన్‌కు చట్టం 1,452 లోని 93వ పేరా ప్రకారం శిక్ష విధించాలి. అలాగే యుఫేమియా బోచ్‌కోవాకు, కాటెరినా మస్లోవాకు కూడా ఫలానా చట్టాల ప్రకారం శిక్షలు పడాలి’ అని వివరించాడు.

ఆ ముగ్గురికీ పడబోయే శిక్షలు చట్టంలో ఉన్నవాటిలోనే అత్యంత కఠినమైనవి.

‘శిక్ష ఖాయం చేసే ముందు ఆలోచించడానికి కోర్టు కాసేపు విరామం తీసుకుంటుంది’ అంటూ లేచాడు అధ్యక్షుడు. ఆయన వెనకాలే అందరూ లేచి నిలబడ్డారు. తమ పని విజయవంతంగా పూర్తయిందన్న సంతృప్తితో అందరూ ఆ గది బయటకు వెళ్ళడమో, అటూఇటూ తిరగడమో మొదలుపెట్టారు.

అప్పుడు పీటర్ గెరాసిమోవిచ్, జ్యూరీ నాయకుడితో ఏదో మాట్లాడుతున్న నెఖ్లుడోవ్ దగ్గరకు వచ్చాడు.

‘సార్, మీకు తెలుసా? మనందరం కలిసి ఒక దారుణమైన తప్పు చేసాం. మనం ఆ అమ్మాయిని సైబీరియాకు పంపించేసాం!’ అని అన్నాడు.

నెఖ్లుడోవ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు;

‘ఏమంటున్నారు మీరు?’ అని గట్టిగా అరిచాడు.

ఈసారి అతను పీటర్ తనతో అంత చనువుగా మాట్లాడటాన్ని కూడా గమనించే స్థితిలో లేడు.

‘మనం సమాధానం పత్రంలో నేరస్తురాలే కానీ, చంపాలనే ఉద్దేశ్యం లేదు అనే మాటను చేర్చడం మర్చిపోయాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమెకు పదిహేనేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించమని కోరుతున్నాడని సెక్రటరీ ఇప్పుడే నాతో చెప్పాడు’ అన్నాడు పీటర్.

‘కానీ అది అందరం కలిసి తీసుకున్న నిర్ణయమే కదా’ అని సర్దిచెప్పబోయాడు జ్యూరీ నాయకుడు.

దీని మీద పీటర్ గెరాసిమోవిచ్ వాదన ప్రారంభించాడు.

‘ఆమె అసలు డబ్బే తీసుకోనప్పుడు, ఆమెకు హత్య చేయాల్సిన అవసరం ఏముంటుంది? అది ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు కదా’ అన్నాడు.

‘కానీ నేను బయటకు వెళ్లేముందే ఆ సమాధానాన్ని చదివి వినిపించాను. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు కదా!’ అన్నాడు నాయకుడు తనను తాను సమర్థించుకుంటూ.

‘సరిగ్గా ఆ సమయంలోనే నేను గదిలో లేను’ అంటూ పీటర్ గెరాసిమోవిచ్, నెఖ్లుడోవ్ వైపు తిరిగి; ‘మరి మీరేం చేస్తున్నారు? అంత ముఖ్యమైన విషయాన్ని అలా జారిపోనిచ్చావంటే, మీ ఆలోచనలు ఎక్కడో తిరుగుతున్నట్టున్నాయి’ అని నిలదీసాడు.

‘ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు’ అని బదులిచ్చాడు నెఖ్లుడోవ్.

‘ఓహో… ఊహించలేదా?’

‘పర్వాలేదు, ఇప్పుడైనా మనం దీన్ని సరిచేద్దాం’ అన్నాడు నెఖ్లుడోవ్.

‘అయ్యో, అస్సలు కుదరదు; అంతా అయిపోయింది.’

నెఖ్లుడోవ్ ఖైదీల వైపు చూసాడు. ఎవరి విధి అయితే అక్కడ నిర్ణయించబడుతోందో, వాళ్ళు ఇంకా సైనికుల ముందున్న ఆ ఇనుపకంచె వెనుక నిశ్చలంగా కూర్చునే ఉన్నారు. మస్లోవా చిరునవ్వు చిందిస్తోంది. ఆ క్షణంలో నెఖ్లుడోవ్ మనసులో ఒక వింత భావం కదిలింది.

ఇంతవరకు ఆమె నిర్దోషిగా విడుదలవుతుందనీ, ఆమె ఈ పట్టణంలోనే ఉంటుందనీ అతను అనుకున్నాడు. ఆమె పట్ల ఎలా ప్రవర్తించాలో, ఆమెతో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో అతనికి స్పష్టత లేదు. ఆమెతో ఏ విధమైన సంబంధమైనా అతనికి క్లిష్టంగానే ఉండేది. కానీ ఇప్పుడామెకు పడబోయే సైబీరియా శిక్షా, కఠిన కారాగారం- ఇవన్నీ ఆమెతో ఎటువంటి సంబంధం పెట్టుకునే అవకాశం లేకుండా ఒక్కసారిగా తలుపులు మూసేసాయి. వేటగాడి సంచిలోని గాయపడిన పక్షి తన ఉనికిని చాటుకోవడానికి ఇక తన్నుకోవడం మానేస్తుంది. ఇక తన ఉనికిని కూడా అతనికి గుర్తు చేయదు.

***

టాల్ స్టాయ్
రమేష్ సామల

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *