నేనెవరినో మీకెవరికీ తెలియదు
ఆర్తి సెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పుపువ్వును
నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన
జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు
~ రేవతీ దేవి (‘శిలాలోలిత‘ లోంచి)
పైన పేర్కొన్న ‘అనురాగ దగ్ధ సమాధి’ కవితలోని పురుషస్త్రీత్వపు స్త్రీపురుషత్వపు తొలిక్షత మౌనం చండీదాస్ సాహిత్యం. పద్నాలుగు పదిహేను సంవత్సరాల మౌనాన్ని తుది పదంగా వదిలి దశాబ్దం క్రితమే విశ్వమౌనంలోకి జారిపోయాడు వడ్డెర చండీదాస్. ఈ ఆధునికాదిమ రచయితను గుర్తు తెచ్చుకోడానికి ఏ సాహిత్య సంస్థా, సాహిత్య పీఠాధిపతులూ, మఠాధిపతులూ, విశ్వవిద్యాలయాలూ, కుల ప్రాంత మత జాతీయ భక్తి సంస్థలూ ముందుకు రావు. అతను అన్నింటికీ దూరం. అతనికి అన్నింటితో వైరం. మనలోని desire and liberations నడుమ విరామమెరుగని తండ్లాట… అంతర్గత పోరు అతని రచనల పాఠం. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ‘హిమజ్వాల’, ‘అనుక్షణికం’ వంటి నవలలు రావడం వొక అద్భుతమైన event. తెలుగు పాఠకుడి పాఠకశక్తినీ, స్థాయినీ పెంచిన నవలలు చండీదాస్‌వి. మన స్పృహల్లోని తాత్త్విక పొరల్లో సుడులీనుతూ, ఉనికిని రగిలిస్తూ, శాంతి లాంటి అశాంతినీ, అశాంతి లాంటి అపశాంతినీ కలిగించే సామాజిక అసామాజిక అంశాలు చండీదాస్ సృజన పనిముట్లు.
తను 70వ దశకంలో రాసిన ‘అనుక్షణికం’ నవలను ఈ డిజిటల్ లిటరరీ అంధయుగం లోంచి చూడటానికి సాహసించడం ఎవరికీ ఇష్టం కలుగకపోవడం అటుంచి, తప్పకుండా కష్టాన్ని మాత్రం కలగజేస్తుంది. ఎందుకంటే మన రచనలకు వొక రాజకీయ ఎజెండా తప్పకుండా వుండాలి, రాజకీయ ఎజెండాకు సాహిత్య మాఫియా ముఠాల సానుకూల అనుమతి పత్రం వుండాలి. అదే కాకుండా ‘అనుక్షణికం’ నవల మన అనేక ఎజెండాల అనేక దృష్టి కోణాలను తెరకెక్కిస్తుందిగాని ఏ జెండా వైపూ తలమొగ్గదూ, వొగ్గదు. ‘అనుక్షణికం’లో అనేక భాషల డైలాగ్ ఉంటుంది. ప్రాంతీయ భిన్నత్వాల multiple identities తలపడతాయి. Plurality లోని innocence వుంటుంది. యూనివర్సిటీ రాజకీయాల అరాజకీయముంటుంది. విప్లవంతో తలపడే స్వచిప్లవముంటుంది. వందకుపైగా పాత్రలు మన ముందు, మనల్ని సాక్షులుగా నిలబెట్టి ప్రవర్తిస్తుంటాయి. తెలంగాణా, రాయలసీమ భాషల సజల నుడికారం పాఠకులకు నూతనానుభవం కలిగిస్తుంది. చాలా పాత్రల సోషల్, పొలిటికల్ రియాలిటీస్ ని ఏ కొమ్మూ కాయకుండా రచయిత మన మనోగతంలోకి transport చేస్తుంటాడు. ఈ నవలను కుల పాత్రలతో ముందుకు తోస్తుంటాడు. “ప్రాపంచిక తపసులోంచి వెలువడిన అతీతవాద తాత్త్విక నవల” అని ప్రకటించుకున్నప్పటికీ అదంతా ఆంతరిక భౌతికవాదమే. ఈ నవలలో ఉండేదంతా లోతమస్సులోని ప్రాపంచిక వాదమే అని తెలిసివస్తుంది.
చండీదాస్ నవలలోని పాత్రలకు ఒక pre-thinking ఉండదు. అవి వాటికవే వాటి మానసిక వైయక్తిక సామాజిక వేళ్ళకు అనుగుణంగానే కొనసాగుతూంటాయి. చాలాసార్లు రచయిత- తన పాత్రలు తన అధీనంలో వుండవనీ, స్వతంత్రంగానే ముగిసిపోతాయనీ, వాటి story progress అవే నిర్దారించుకుంటాయనీ అంటాడు. ‘అనుక్షణికం’లోని స్వప్నరాగలీన వంటి సాతల్ర ధ్వని, అపధ్వని, సంగీతం, గాఢత, లోతునీ నిష్క్రమణని పఠిస్తే చాలు అర్ధమవుతుంది. పాత్రల వాద ప్రతివాదాలు అంతరించినపుడు వాటి వ్యక్తిత్వపొరలు కూలిపోయి మౌనంగా పక్కకు తప్పుకుంటాయి. ఆయా పాత్రలు గుప్పించే ప్రశ్నల్ని మనం అర్థం చేసుకునే vibesని re-align చేసుకోవాలి. లేదా తిరిగి స్వర పరుచుకోవాలి. అందుకే పాఠకత్వాన్నీ దాని శక్తినీ పెంచిన రచనలు అని చెప్పాల్సి వస్తుంది. ‘అనుక్షణికం’ లోని అనేక నేనుల అనేకతత్వం, వొక దృష్టితో విడిపోతూనే కలిసే దార్శనిక ఉపరితలాల్లో కనబడే సౌందర్య తృష్ణ, వాటి లోతుల్లోని విచ్చిన్న కాంక్షలూ, స్వేచ్ఛ కోసం సంకెళ్ళను తెంపుకునే నిర్లక్ష్యమూ కనిపిస్తాయి. రాజకీయ, సామాజిక వేదనలు అంతరంగంలోకి దూకి అస్తిత్వపు వేదనగా రూపొందుతాయి. అలాగని చండీదాస్ రచనలు అస్తిత్వవాద రచనలు అనుకోవడానికీ లేదు. చైతన్య స్రవంతి నవలలూ కావు. తన రచనలను ఆధునిక తెలుగు సాహిత్యంలో వొక భిన్నమయిన literary genre గా చూడాలి. ఎందుకంటే… అతను ఎంచుకున్న భాష పూర్తిగా సాహిత్య భాష కూడా కాదు. తన భాషలో భిన్న కళారూపాల డిక్షన్ వచనమై ప్రవహిస్తుంది. తత్త్వశాస్త్ర అధ్యాపకుడు కావడం వల్లనో, వొక ప్రత్యేక దృష్టి ధోరణి కలిగిన వ్యక్తిత్వం వల్లనో సాంప్రదాయ సాహిత్య సంపర్కం వల్లనో, తను ఎంచుకున్న సృజన మార్గం వల్లనో, యూరోపియన్ భాషల సహజీవనం వల్లనో… చండీదాస్ భాష ప్రత్యేకమైన భాషగా రూపొందింది. అతనికంటూ పూర్తిగా evolve అయిన భాష తనది. అందుకే ‘హిమజ్వాల’తో మొదలుకుని, ‘చీకట్లోంచి చీకట్లోకి’ నుంచీ, ‘అనుక్షణికం’ నుంచీ, ‘హిమోహ రాగిణీ’ దాకా వొక సౌందర్యవంతమయిన వచనాన్ని బహూకరించగలిగాడు. కథలలోకాని, నవలల్లో కాని అంతకుముందు పాఠకులకి అలవాటులేని పద్ధతిలో వచనానుభవాన్ని కళ్ళముందుకి తీసుకొచ్చాడు. అతని పాత్రలు కొత్త పదబంధాలతో, మెటఫర్స్‌తో మాట్లాడతాయి. మధ్యతరగతి వచనాన్ని, inverse గా వుందనిపించిన భాగాలను reverse గానూ free-verseగానూ రూపొందించుకున్న భాష, బుచ్చిబాబునీ, చలాన్నీ, శ్రీశ్రీనీ కలిపి ముద్దచేసి కొత్త వచన శిల్పాన్ని రూపొందించుకున్నాడనిపిస్తుంది. తన వచనం మన రక్తంలో ఇంకి అంతకుముందు సందడించిన ఆకడెమిక్ వచనం ఆవిరైపోతుంది. చండీదాస్ భాష వొక classical frameలో వున్నట్టనిపిస్తూనే, ఆధునిక అనంతర వచన జలపాతం కింద పాఠకులను కూర్చోపెట్టిన బాష. కవిగా, సంగీతంలోకీ… రెండింటి కలయికతో కలగనే వొక ధ్యానప్రాప్తి సమీపానికీ transcend చేయగలిగే భాష. వొక కొన్నే కొన్ని వాక్యాలు: “అగ్ని పర్వతం వెనుక నల్లని మేఘం బద్దకంగా వొళ్ళు విరుచుకున్నట్టు… భుజాల వెనుక విడిన జుట్టు”, “అజ్ఞాత సంధ్య వాలినట్టు, ఎవరూ మోగించని సంగీతం వినిపించినట్టు- కనురెప్పలు విరిశాయి”. “పల్చగా నిశ్శబ్దంగా నవ్వింది”, వుస్మానియా విశ్వవిద్యాలయ భవనం గురించి ‘అనుక్షణికం’ నవల ప్రారంభంలోనే- “రూబెన్స్ చిత్రించిన నగ్నసుందరి మెత్తని నిండైన అవయవాల్లోకి శిలాకాఠిన్యతను నింపితే; కాలం, యవ్వనం, వృద్ధాప్యం అంటూ లేకుండా పుట్టడమే నడివయసు స్త్రీలాగా వుద్భవించి ఆ పట్టున అలా వుండిపోవటానికి వీలుగానీ వుంటే; సరిగ్గా యీ వుస్మానియా విశ్వవిద్యాలయ భవనంలా వుంటుంది” అంటూ ప్రజెంట్ చేసిన అభివ్యక్తి ఇప్పటికీ వుర్రూతలూగిస్తుంది. పదుల నుంచి వందల దాకా… కవిత్వ సరిహద్దులను దాటించి మోసుకొచ్చిన పదబంధాల వచనం. అందుకే పాఠకులకు వొక event.
‘హిమజ్వాల’, ‘అనుక్షణికం’ నవలల్లో వినిపించే ప్రశ్నలు అనేకం. ప్రశ్నల్ని పక్కదారి పట్టనీయకుండా వొడిసి పట్టుకోవాల్సింది పాఠకుడే. చండీదాస్ రచయితగా పాత్రలతో అబ్జెక్టివ్‌గా వుంటూనే వాటి ప్రశ్నల్ని తన అస్తిత్వానికి గురిపెట్టుకుని వ్యధకు గురయ్యాడనిపిస్తుంది. జీవించడంలో వున్న ఆనందానికీ, తెగించి దారితప్పటంలో వున్న ప్రమాదభరిత సౌఖ్యానికీ, సిద్ధాంతాల deliriumsలో వూగే ఉద్రేకాలకూ, సాంప్రదాయ ఉన్మాదాలకూ, మధ్య దిగువ బలహీన తరగతుల చుట్టూ కంచెలేసుకొని కూర్చుని వున్న రాజకీయ కుట్రలకూ, వాటి నుంచి కంపుకొడుతూ పుట్టుకువచ్చే చాలా ప్రశ్నలకూ తన రచనల్లో space కల్పించాడు. ప్రేమా, సెక్సూ రాజకీయాల కుటిలత్వం, అంతరంగాల భేషజాలు, ముసుగులు, ప్రకృతీ, సౌందర్య తీక్షతా, పరిధులు దాటే లాలసత్వమూ, జీవితాల కొసలను పట్టుకుని ఆటాడించే desire తాలూకు ఇనుప సంకెళ్ళ రక్తపు మరకల్ని రూపుకట్టించాడు (‘చీకట్లోంచి చీకట్లోకి). వొకే పాత్రతో పలు రకాల వేషాలు వేయించి, వొకే conflict తో అనివార్యంగా తెరవాల్చే సందర్భాలను, ఉద్విగ్న దుఃఖ నిరసనలతో ముగిస్తాడు. చలంగారి వచనమే ఆయన ఉద్విగ్నత, ఆయన నిరసన, ఆయన కోపం అంతా. ఆ విధంగానే చండీదాస్ వచనానికీ వొక ప్రత్యేకమయిన దుఃఖం, దిగులు, కోపం వున్నాయనిపిస్తుంది. ఆ విధంగానే ఆ వచనానికంతా వొక తాత్త్విక సారం అంతా చర్మాన్ని ధరించి మన ముందుకు వస్తుంది. జీవితాన్ని అసమగ్రంగానో, సంపూర్ణంగానో ముగించడానికి మార్గం పూర్తిగా స్వేచ్ఛను పొందగలగడమే అనే సమాధానం మాత్రం సూటిగా వస్తుంది. ‘తెలుగు వెలుగు చలం’ పుస్తకంలో ఇస్మాయిల్ గారు చలం గురించి అన్న మాటలు: “ఏ ప్రాచీన విశ్వాసాలకీ, అధికారాలకీ, భయాలకీ లొంగని స్వతంత్ర ఆలోచనా, జ్ఞానాన్వేషణా చలానికి మొదటి నుంచీ ఊపిరిలా అంటిపెట్టుకుని వున్నాయి. చలం జీవితమంతా ఒక అన్వేషణ” అన్న మాటలు మననం చేస్తే, చండీదాస్ జీవితం వొక అన్వేషణ అని తెలిసి వస్తుంది. అయితే చండీదాస్ అన్వేషణ రెండు polatiries…, “desire and liberation” మధ్య కొనసాగిన అన్వేషణ అనిపిస్తుంది. అదే రచయితగా తనని బుచ్చిబాబుకి కొంచెం దగ్గరగా, చలం నుంచి కొంచెం దూరంగా తీసుకుపోతుంది.
రచయితల రచనలను మనం అర్థం చేసుకోవడానికి వారి ఆత్మకథలూ, డైరీలూ, private scribbles మనకు ఉపయోగపడతాయి. చలంగారి ఆంతరిక బహిరంగమంతా మనకు ఆయన ఆత్మకథలోంచో, ప్రసంగాల్లోంచో తెలిసొచ్చింది. కానీ చండీదాస్ విషయంలో ఆ అవకాశం లేకపోవడం సాహిత్య విషాదం. చండీదాస్ ఆత్మకథ అసలు వెలుగులోకి వస్తుందో రాదో ఆయన సన్నిహిత సహచరులే చెబితే బాగుండనిపిస్తుంది. కారణాలు ఏమైనా ఉండనియ్యండి. రచయితల texts అర్ధం కావాలంటే రచయితలు చనిపోవాల్సిందే, తప్పదు. కానీ చనిపోయిన రచయిత వెనక చనిపోకుండా నిరంతరం మసిలే/కనలిపోయే జీవితముంటుంది. అదే రచనను/textను విస్తృతపరుస్తుంది. చండీదాస్ జీవితం స్త్రీపురుషత్వపు జీవితంగా రచనల్లో కనబడుతుంది. ఆధునిక/ ఆధునిక అనంతర/ అంతర్జాల డిజిటల్ హైబ్రిడ్ లిటరరీ స్త్రీ పురుష ట్రాన్స్‌జెండర్ వాదులంతా వడ్డెర చండీదాస్‌ని పునర్దర్శనం చేసుకోవాల్సిన అవసరం వుందనిపిస్తోంది. చండీదాస్ సాహిత్యమౌనానికి జీవితంలోని మౌనానికి సంబంధం ఉందనిపిస్తోంది. సంగీతానికీ చండీదాస్‌కి మధ్య గొప్ప అనుభవోద్రేక చర్చ కూడా జరిగింది. అతను చైతన్య స్రవంతీ, అస్తిత్వవాద రచయిత కాదు. తన తాత్త్వికతను ఎరుకు పరచడానికి రచనను మాధ్యమంగా ఎంచుకున్నాడు. అతనొక స్త్రీవాద పురుషస్త్రీ. Desire/ సెక్స్/ సౌందర్య/ Liberation రసానుభవాల్లోంచే అతను తనదైన తాత్త్వికతలోంచి మానవ సమాజాన్ని దర్శించాడు. తెలుగు పాఠకులకు రసోత్పత్తి, భావప్రాప్తి కలిగించిన రచనలు చండీదాస్‌వి.
చండీదాస్ రచనల్లో అనేక కళా రూపాల సంలీనత మనలోని ఉత్తమ పాఠకుడ్ని మేల్కొలుపుతూనే ఉంటుంది.
“In all cultures, first place in the sphere of values belongs to life. It is life that counts the most: it is the supreme value. The other values, such as peace, justice, honesty, beauty, wisdom, law etc., are subordinate to life.” – Battista Mondin
~ సిద్ధార్థ
7330621563

కవి సిద్ధార్థ
కవి సిద్ధార్థ తెలంగాణ అగ్రశ్రేణి కవులలో ఒకరు.
గతంలో దీపశిల, బొమ్మలబాయి కవితా సంపుటాలు తెచ్చారు. సినిమారంగంలో పని చేస్తున్నారు.
స్వగ్రామం నల్గొండజిల్లా పోచంపల్లి దగ్గర చినరావులపల్లి. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

I read this article long back in some telugu journal. so when if you publishing an article which was published earlier, you must mention the early publication details. otherwise this type of actions will misleading the readers, i think. you must know that.
am i wrong?