మేలుకున్నావా!
వద్దు నిద్ర పో
నిద్రేనా ఎప్పుడూ!
కాస్త మెలకువగా ఉండు
మెలకువతో మెలగకు తల దించు
తలతో పనేం లేదు చేతులు కాళ్ళు మిగిలినవన్నీ చాలు
చాలన్నామని చేతులు చాచకు
కాళ్ళు చేసే పనేంటో తెలుసుకోకు
తెలుసుకుని నడక మొదలెట్టావో
మరుక్షణం నుంచే మరణం పరిచయం
అనుక్షణపు ఆదేశాల మధ్య
ఆంక్షల పద్మవ్యూహంలో
నీ ముందున్న దారేంటో
కనుగొనాలని చూడకు
నువ్వెలా ఉండాలో
ఎప్పుడో కండీషన్ అయింది
వాళ్ళు నిర్ణయించేప్పటికి
బహుశా
నువ్వింకా నువ్వులా పుట్టి ఉండవు
పుట్టి బుద్ధెరిగాక
నీకూ..
కళ్ళున్నాయని చూడగలవనీ
చెవులున్నాయని వినగలవనీ
నోరుందనీ మాట్లాడగలవనీ
చేతులూ కాళ్ళూ ఉన్నాయని
పనిచేయగలవూ పరుగెత్తగలవనీ
మెదడూ ఉందని ఆలోచించగలవనీ
నీకే వైకల్యమూ లేదనీ
తెలిసిపోతుంది
వైకల్యమేమీ లేని నిన్ను
బొమ్మగా చూస్తుంటే
నీలో ప్రాణం లేదేమోని సందేహమేస్తుంది
గాలాడుతున్న చప్పుడుకు తెలివొస్తుంది
నువ్వు
ఆడదానివి మాత్రమే కాదు
అందరిలాంటి మనిషివే అని
అప్పుడు..
అప్పుడు
తీర్పరుల కొలువుకు పని
ఆరంభం

