చివరి వాయిదా

Spread the love

చిన్నప్పుడు విన్న ఏదో జానపదగీతం ఒకటి గుర్తుకు వచ్చేసరికి రంజిత పెదవుల చిన్న చిరునవ్వు చిగురించింది. కట్ట మీద నుండి చెరువులోకి కట్టిన మెట్ల మీద కూర్చునివున్నది ఆమె. చెరువులోని స్వచ్ఛమైన నీళ్లలో ఆమె ప్రతిబింబం  స్పష్టంగా కనిపిస్తున్నది. ఆమె కొంచెం ముందుకు వంగి నీళ్ళలోకి గట్టిగా ఊదింది. చిన్న చిన్న నీటివలయాలు ఏర్పడి నీళ్లు అటూ ఇటూ చెల్లాచెదురు అయ్యాయి. అలా చెల్లాచెదురైన నీళ్లలో ఆ కొత్త పెళ్లికూతురు మొహం తన రూపాన్ని కోల్పోయింది. రంజిత చిన్నగా నవ్వుకుని ఆలోచనల్లోకి జారుకుంది.

ఆమె పెళ్ళై సరిగ్గా ఆరోజుకు ఎనిమిది.  పెళ్ళైన ఎనిమిదో రోజు పెళ్లికూతురు తల్లితండ్రుల ఇంటికి సంప్రదాయం.అందుకని రంజిత భర్త ఆమెను పుట్టింటికి తీసుకుని వచ్చాడు.

 “కేవలం రెండు రోజులే!” అన్నాడతను భార్యను పుట్టింట్లో వదిలి వెళుతూ. కానీ రంజిత మనసులో వేరే ఏవో ఆలోచనలు వున్నాయి. కనీసం పది రోజులైనా ఉండాలి అనుకుంటున్నది ఆమె. పదిరోజులు అని ఆమె చెపితే అతను అసలే ఒప్పుకోడు.

“అమ్మో!  పదిరోజులా అంటాడు. అంటే అననీ వియోగాన్ని అతడు మాత్రం అనుభవించవొద్దూ!” అనుకుంటూ భర్తను ఇష్టంగా గుర్తుకు తెచ్చుకుంది. మళ్ళీ అంతలోనే తానే “మరీ పది రోజులు అన్యాయం కదూ”  అని అనుకుని ఐదు రోజులు అయితే ఫరవాలేదు అనుకుంది. మళ్ళీ వెంటనే ఐదు రోజులు కాదు అన్నీ ఒక నాలుగు రోజులు అయితే సమంజసంగా ఉంటుంది అనుకుంది.

పెళ్లైన వెంటనే భర్తని విడిచిపెట్టి ఉండటం రంజితకు ఇష్టం లేదు. కానీ ఏమి చేయగలదు? సంప్రదాయం అంటూ ఒకటి వున్నది కదా!చెరువు గట్టు మీద నిలబడి ఉన్న  దేవదారు వృక్షం చెరువు నీటిలోకి వొంగింది. రంజిత చిన్నప్పటి నుండి ఆ చెట్టు అలాగే, అదే స్థితి లో నిలబడి వుంది. రంజిత దృష్టి ఆ చెట్టు పైకి పాకింది. గుబురుగా కొమ్మల్లో ఒకదానిమీద ఒరియల్ పక్షి (గిజిగాడు) కూర్చుని వుంది. ఓరియల్ పక్షి శుభాలను మోసుకుని వస్తుందని ఒక నానుడు వుంది.

  “నువ్వు నాకోసం ఏ శుభవార్త మోసుకుని వచ్చావు?” అని అడిగింది పక్షి వంక చూస్తూ. ఓరియల్ కొమ్మ మీద ఉన్నదన్న మాటే కానీ దాని దృష్టి ఎక్కడో వుంది. మెడ కొంచెం కిందకు వంచి ఆ పక్షి దేనినో చూస్తోంది. ఓరియల్ చూస్తున్నదేమిటో తెలుసుకోవాలని కనుకొలకుల చివర్ల నుండి రంజిత చూసింది కానీ ఆమెకు ఏమీ కనపడలేదు.

ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. కానీ రంజిత కు అప్పుడే ఇంటికి వెళ్లాలని లేదు. ఒంటరిగా కూర్చుని వారం  రోజులుగా తనకు ఎదురైన అనుభవాలు అన్నిటినీ తీరికగా గుర్తు తెచ్చుకోవాలి అని వుంది. ఆమెకు పెళ్ళై ఇవాళ్టికి  కేవలం ఎనిమిది రోజులే! కానీ ఎన్నో రోజులు అయినట్టుగా వుంది. ఆమె ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు మెల్లగా పొటమరించి, ఆనందం తో మొహం లోకి నెత్తురు తన్నుకుని వచ్చి ఎర్రబడింది ఆ వారం రోజులలో జరిగిన సంఘటన ఒకటి గుర్తుకు రాగానే!

రంజిత అయిష్టంగానే ఇంటికి వెళ్ళడానికి చెరువు మెట్ల మీదనుండి లేచింది. ఆమె స్నేహితులు ఈపాటికే ఇంటికి వచ్చివుంటారు. తన ఎనిమిది నెలల పిల్లాడిని ఎత్తుకుని పూర్ణిమ వచ్చి ఉంటుంది. శావి, నీమా కూడా వచ్చి తనకోసం ఎదురు చూస్తూ వుంటారు. తను చెరువుకు బయలు దేరినప్పుడు అమ్మ కొబ్బరి తురుము కలిపిన రైస్ కేక్ తయారుచేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నది

రంజిత ఇంటికి వెళ్లేసరికి శావి వచ్చి ఉంది. రంజితను చూస్తూనే ” రా రా!” అంటూ చేయిపట్టుకుని లాక్కెళ్ల సాగింది. రంజిత చేయి విడిపించుకుని “ఎక్కడికి?” అన్నది.

“పైకి టెర్రస్ మీదకు వెళదాం! టూనా  రైస్ కేక్ తీసుకుని పైకి వస్తుంది లే! మనం అక్కడే తిందాం.” అంటూ రంజితను ముందుకు నెట్టింది. ఇద్దరూ టెర్రస్ పైకి వెళ్లారు. తరువాత నీమావచ్చింది. తరువాత  పూర్ణిమ తన ఎనిమీ నెలల పిల్లాడిని భుజాన వేసుకుని, కుడి చేత్తో చీర కుచ్చిళ్ళు సరి చేసుకుంటూ వచ్చింది. నలుగురు స్నేహితులూ ఒక్క దగ్గర చేరారు.

“ఏం  జరిగిందో మొత్తం నాకు పూసగుచ్చినట్టు చెప్పాలి. ఏ చిన్న విషయం కూడా దాచొద్దు” శావి డిమాండ్ చేస్తున్నట్టు గట్టిగా అడిగింది. “మా ముందు నీకు సిగ్గేమిటి? ఏం జరిగిందో అంతా చేప్పేయి” అన్నది నీమా! మామూలుగా చాలా రిజర్వడ్ గా వుండే నీమా కి కూడా రంజిత మొదటి రాత్రి కబుర్లు వినాలని ఉత్సాహం పొంగుకొచ్చింది.

“మొదటి నుండి చెప్పు” శావి హఠం  వేసింది.

“కానీ నిజాయితీ గా చెప్పాలి. నాకంతా వివరంగా కావాలి” శావి అమాయకపు మొహం మీద ఆసక్తి అనే పూలగుత్తులు విరబూశాయి.

వాళ్ళ మాటలు విన్న రంజిత నీళ్లు నమల సాగింది.

“దాన్నెందుకే ఇబ్బంది పెడతారు?” రంజిత కు మద్దతుగా వచ్చి సావిని, నేమాని కేకలేసింది, రంజిత కంటే అనుభవజ్ఞురాలైన పూర్ణిమ.

“కాస్త ఆగండి. పెళ్లిళ్లు అయితే మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే దొరుకుతుంది.” అని శావి, నీమా లతో అని రంజిత వైపు తిరిగి

“నీ పెళ్ళికి రాలేకపోయానే,ఎంత అనుకున్నా కుదరలేదు. సరేలే!మీఅత్తగారి గురించి చెప్పు. ఎంతమంది బావలు, మరిదులు, ఆడపడుచులు ఎంతమంది? మీ అత్తగారు ఎలావుంటుంది నీతో? మీ మామ గారు ఎలా వుంటారు? నీకు అక్కడ ఎలా వుంది? వారం అయింది కదా అలవాటు పడ్డావా? కొత్త ప్రదేశానికి ” ప్రశ్నల వర్షం గుప్పించింది.

మెరుపు వేగం తో శరీరం లో నుండి ఒక విద్యుదాఘాతం ఏదో వెళ్ళిపోయినట్టుగా అనిపించింది రంజితకు. ఆమె స్నేహితులు అది కనిపెట్టారో లేదో తెలియదు కానీ ఆమెకు ఒక్కసారిగా  పంచేంద్రియాలు స్తంభించినట్టుగా అయింది. ఆమెకు తన అత్తగారి చూపు లోని కఠినత్వం గుర్తుకు వచ్చింది. ఎనిమిదవరోజు కోసం పుట్టింటి కి రావడానికి సూట్ కేస్ తీసుకుని గడప దాటుతున్నపుడు తల్లి తండ్రులకు ఏమి చెప్పాలో అత్తగారు మూడవ సారి గుర్తు చేస్తూ చూసిన చూపు రంజితకి జ్ణప్తికి  వచ్చింది

“పెళ్లంటే ఈ అమ్మాయిలకేం తెలుసు? పెళ్లంటే ఒక వేడుక అనుకుంటారు కానీ  ఒక నవ వధువు ఎన్ని కఠిన పరీక్షలు ఎదురుకోవాలో? వాళ్లకు పెళ్లయితే  కానీ తెలియదు” రంజిత ఒకింత నిర్లిప్తంగా అనుకుంది.

పూర్ణిమ రంజిత ను నిశితంగా పరిశీలించసాగింది. రంజిత మొహం లో వచ్చిన మార్పును పూర్ణిమ పసిగట్టగలిగింది. కొబ్బరి తురుము తో చేసిన రైస్ కేక్, తోడుగా తియ్యటి బార్బేరి ఊరగాయ తో టెర్రస్ మీదకు వచ్చింది. నలుగురు కేక్ తింటున్నప్పుడు శావి, నీమా ల ఆసక్తికి తనకు చేతనైన రీతిలో జవాబులు ఇవ్వసాగింది రంజిత. కానీ ఆమె మనసంతా అత్తగారి మాటలే ప్రతిధ్వనించసాగాయి

“మీ నాన్న మాకు లక్ష రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ యాభయ్ వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. ఇదేమైనా న్యాయంగా ఉన్నదా?మీ నాన్న ఎందుకు మాట నిలుపుకోలేదో నీకు తెలుసా?” అత్తగారి మాట సౌమ్యంగా వున్నా అంతర్లీనంగా ఉన్న పదును,రంజిత ను బలంగా తాకింది.

“నిజానికి మేము అప్పుడే మీరు చేసినదానికి పెళ్లి క్యాన్సిల్ చేసుకోవలసింది. మా స్థానం లో ఎవరు వున్నా మీ నాన్న చేసిన పనిని సహించేవారు కాదు.”  రంజిత అత్తగారు ఇదంతా శోభనం అయిన మరుసటి రోజు రంజిత ఒంటరిగా తన గదిలో కూర్చున్నప్పుడు అనటం మొదలుపెట్టింది. భర్త ఇంట్లోలేడు . మామగారు  కూడా అవతల ఎక్కడో వున్నారు.  బహుశా స్నానం చేస్తూ ఉండిఉండవచ్చు. పెద్ద ఆడపడుచు గదిలో అటూ ఇటూ తిరుగుతున్నది జరుగుతున్న దాని పట్ల పెద్ద గా ఆసక్తి లేనట్టు నటిస్తూ.

“చెప్పు దీనిగురించి నీకేం తెలుసు? మీ నాన్న అమ్మ డబ్బు పూర్తిగా ఇవ్వకపోవడం గురించి నీకేమీ చెప్పలేదా?’ అత్తగారు మళ్ళీ రెట్టించి అడిగారు.

 రంజిత తనకేమీ తెలియదన్నట్టు తలాడించి అత్తగారి వంక బేలగా చూసింది. అత్తగారు అడుఁగుతున్న మాటలు రంజితకి ఇబ్బంది కలిగించడం మొదలు పెట్టాయి.

ఆడపడుచు నోరు తెరిచి ” ఏదో ఒక రకంగా మిగిలిన యాభయ్ వేలూ వసూలు చేసుకోవాలి. పట్టుమని ఆర్నెల్లు కూడా లేదు మిటూ పెళ్లి. వాళ్ళు రెండు లక్షలు క్యాష్ రూపేణా అడుగుతున్నారు.” ఆమాట వింటూనే ఆడపడుచు వంక చూసింది రంజిత. ఆడపడుచు కళ్ళలో

కాఠిన్యం మెరుపులా మెరిసింది. ఆమె కళ్ళలో, తన చేతిలోనుండి కుందేలు పిల్ల జారిపోతుంటే సింహం కళ్ళలో కనిపించే కోపోద్రిక్తత బలంగా కనిపించింది. రంజిత కళ్ళు వాల్చేసుకుంది

ఆ రాత్రి భర్త “అమ్మ చెప్పింది విన్నావుగా. మీ నాన్న చేసింది భరించలేని మోసం. మేము కాబట్టి అవమానాన్ని కడుపులోనే దాచుకున్నాం. మీ నాన్న సాధ్యమైనంత త్వరలో మిగతా డబ్బుకూడా సర్దుబాటు చేస్తానని, పెళ్లి జరగనివ్వమని కాళ్ళా,వేళ్ళా  పడితే  సరేలే అని వొప్పుకున్నాము. మా అమ్మ ఈ విషయాన్ని అంత తేలికగా వొదిలిపెట్టాడు.అది మనసులో పెట్టుకో!’ అన్నాడు.

భర్త ఇచ్చిన వార్ణింగ్ చాలా స్పష్టంగా, గట్టిగా వుంది. రంజిత భర్త చెప్పిన మాటలు మనసులో పెట్టుకోవడం టాప్ మరేమి చేయగలదు కనుక మౌనంగా వుంది

అత్తగారు మళ్ళొకసారి  అదే విషయం ఆ మరునాడు, రంజిత భర్త, మామగారు, ఆడపడుచు ముందు  లేవనెత్తింది.”నువ్వేం చేస్తావో తెలియదు మళ్ళీ నువ్వొచ్చేటప్పుడు ఆ యాభయ్ వేల రూపాయలు తీసుకుని రావాలి. సందు ఇచ్చారు కదా అని చంకనెక్కి కూర్చుంటాను అంటే కుదరదు” ఆమె గొంతులో ఈ మాట ఫైనల్ అన్న హెచ్చరిక దాగున్నది.

రంజిత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పుట్టింటికి తీసుకుని వచ్చి, వదిలి వెళుతూ “రెండు రోజుల్లో వచ్చేయ్. అమ్మ చెప్పింది మర్చిపోకు” అని చెప్పి భర్త వెళ్ళిపోయాడు. అంత ముఖ్యమైన విషయాన్ని తానెలా మరచిపోతుంది? రంజిత కి తన మీద తనకే కోపం వచ్చింది. తల్లి ప్రేమ తో కొబ్బరి తురుము వేసి చేసిన రైస్ కేక్, మంచి రుచికరమైన పచ్చడి, చెరువు దగ్గర చేసిన ఊహలు, చిన్నప్పటి స్నేహితులు శోభనం గురించి తీసిన  ఆరాలు అన్నీ చేదు నిజానికి ఆ క్షణంలో పంచదార పూతను పూశాయి

సాయంత్రం అయింది

టెర్రస్ మీద రంజిత ఒక్కతే ఒంటరిగా కూర్చుని వుంది. ఆమె మనసు  సందిగ్ధత అనే భయంకరమైన సుడిగుండం లో చిక్కుకుని వుంది. కొద్దీ సేపటి క్రితమే ఆకాశం లోకి చంద్రుడు వెండి వెన్నెలను జగమంతా వెదజల్లుతున్నాడు. పక్కనే వున్న కొబ్బరి చెట్టు మీద నుండి పెచ్చులు పెచ్చులుగా వెన్నెలను డాబామీదకు ఒంపుతున్నాడు. నిశ్చలంగా కూర్చున్న ఆమె మొహాన్ని పాక్షికంగా చంద్రుడు వెలిగిస్తున్నాడు. ఇంతకుముందు అయితే అలాంటి వెన్నెల రాత్రులలో  కాలాన్ని మరచిపోయి వెన్నెలను ఆస్వాదిస్తూ గడిపేది. కానీ ఇవాళ బరువుగా ఒకదాని వెనుక మరొక అడుగును ఈడ్చుకుంటూ మెట్లు దిగింది.

రాత్రి భోజనం లోకి కూరగాయలు తరుగుతూ తల్లి కనిపించింది వంట గదిలో. తల్లి పక్కనే కూర్చుని “ఏదీ! చాకు ఇలా ఇవ్వు నేను తరుగుతా” అన్నది రంజిత

“వొద్దొద్దు నువ్వుండేదే రెండు రోజులు. ఇవన్నీ నీకెందుకు? నేను చేస్తాలే”తల్లి వారించింది. గదంతా కలయ చూస్తూ

“అమ్మా! నాన్న ఎక్కడికి వెళ్ళాడు? చాలాసేపయింది కదా రాత్రి అయి. అంత పెద్ద పెద్ద పనులేమీ వున్నాయి ఇప్పుడు?” అన్నది తల్లివంకే కన్నార్పకుండా చూస్తూ

“ఆ శరత్ సాహూ దగ్గరకే వెళ్లి వుంటారు. వాడొక పెద్ద మోసగాడు. బంగారం పండే పొలాన్ని చాలా చౌకగా కొట్టేసాడు. మార్కెట్ లో ఎంత లేదన్నా లక్షా యాభయ్ వేల రూపాయలు పలుకుతుంది ఎకరం. లక్ష కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. ఆ పొలం లో పండే పంట మనకు సంవత్సరం అంతా సరిపోయేది కాదూ.  పోనీ ఆ లక్షయినా మొత్తం ఒకేసారి ఇచ్చాడా అంటే అదీ లేదు. డబ్బయితే పూర్తిగా ఇవ్వలేదు కానీ పొలం మాత్రం రిజిస్టర్ చేయించేసుకున్నాడు. నీ పెళ్లప్పుడు  యాభయ్ వేలు ఇచ్చి మిగతా యాభయ్ వేలకు పదిరోజులలో ఇస్తాను అని చెప్పి ఇదుగో, అదుగో అంటూ మీ నాన్న ను తెగ తిప్పుతున్నాడు.ఈ మనిషి రోజూ పొద్దున్నే ఆ సాహు ఇంటికి వెళ్లడం సాయంత్రానికి మొహం వేలాడేసుకుని రావడం” గుక్క తిప్పుకోకుండా చెప్పిన తల్లి శ్వాస తీసుకోవడానికి ఒక్క క్షణం పాటు ఆగింది

రంజిత లోలోపలికి కుంచించుకునిపోయింది. తన వల్లనే కదా ఇదంతా! బంగారం పండే భూమి తండ్రికి లేకుండా పోయింది. పొయ్యిమీదకు బియ్యం కూడా బజారులో కొనుక్కోవలసిందే కదా!  రంజిత తనలో  తాను అనుకున్నట్టు పైకే అన్నది

“అదేమంత పెద్ద ఇది కాదులే!  ఎంతమంది బయట కొనుక్కోవడం లేదు. అయినా నువ్వు ఇవన్నీ తలకు ఎక్కించుకోకు. వెళ్లి మినపపప్పు కడుగు. నేను స్టవ్ మీద కూర చేసేస్తాను” అన్నది తల్లి సంభాషణ ని పక్కకు తప్పిస్తూ.  రంజితకు  గుండెలో   ఏదో  సన్నగా గుచ్చుకున్నట్టు  అనిపించింది

రంజిత వదిన ఉదయం నుండి మొహం ముడుచుకునే వున్నది. రంజిత తో కానీ అత్త తో కానీ సరిగా మాట్లాడనేలేదు. “ఇక్కడ కూతుళ్ళ కే  సింహభాగం. కొడుకులను పట్టించుకోవడానికి ఎవరున్నారిక్కడ?” కోపాన్ని అసహ్యాన్ని  గొంతులోకి తెచ్చుకుని గొణుగుతూనే వుంది. రంజిత పెళ్ళికి ఇచ్చిన కట్నం డబ్బు యాభయ్ వేల  రూపాయలు లంచం ఇచ్చినట్లయితే అన్నకి వుద్యోగం వచ్చేది. కొడుకు ఉద్యోగమా? కూతురు పెళ్లా? అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు తండ్రి కూతురు పెళ్ళికే ఓటేశాడు. అదీ రంజిత వదిన కోపానికి కారణం. అన్నయ్యకి అత్యవసరంగా వుద్యోగం  కావాలి. పెళ్లి అయింది కనుక పిల్లాడు పుట్టుకుని వచ్చాడు. కొడుకు సంసారాన్ని మోసే భారం కూడా రంజిత తండ్రి మీదే పడింది.ఆయనకు మరో రెండేళ్లలో పెళ్లి చేయాల్సిన అమ్మాయి, హై స్కూల్ లో చదివే మరో చిన్న పిల్లాడు వున్నారు. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. తండ్రి రిటైర్ అయితే తరువాత ఏం జరగనున్నది?  వరండాలో కూర్చుని ఆలోచనలతో మునిగిపోయిన రంజిత ఎవరో స్విచ్ వేసేసరికి వెలుగు మొహం మీద  పడి ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది.

“రంజితా ! నువ్వేనా? ఇలా చీకట్లో కూర్చున్నావేంటమ్మా?” తండ్రి గొంతు లాలనగా పలికింది

” ఏమీ లేదు నాన్నా! వూరికే అలా కూర్చున్నా. నీకేమిటి ఇంత ఆలస్యం అయింది” గొంతులోకి సాధ్యమైనంత మార్దవాన్ని తెచ్చుకుని అడిగింది రంజిత. తండ్రి మాట్లాడకుండా దీర్ఘంగా నిశ్వసించి ఇంటిముందున్న బావి దగ్గరకు వెళ్ళాడు కాళ్ళు కడుగుకోవడానికి.

సాయంత్రం నుండీ ఇంట్లో కరెంట్ లేదు. హరికేన్ లాంతరు గుడ్డివెలుగులో కూడా రంజిత తండ్రి మొహం మీద తారాడిన నిరాశా మేఘాలను స్పష్టంగా చూడగలిగింది తండ్రితోనూ, అన్నతోనూ కలిసి కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు. భోజనంచేస్తున్న వాళ్లకు చెమట పట్టకుండా తల్లి విసనకర్రతో వీస్తోంది. భోజనం వడ్డిస్తున్న వదిన మొహం మేఘాలు ముసిరిన ఆకాశంలాగా వుంది. అన్న కంచం లో న్నాం కెలుకుతూ. మారు అన్నం అడిగినప్పుడు వదిన గొంతు నూతిలోనుండి వచ్చినట్టుగా వుంది.

“చేపలు వండలేదా?” హఠాత్తుగా గుర్తొచ్చినట్టుగా తండ్రి అడిగాడు.

“ఇవాళ గురువారం కదా!” తల్లి గుర్తు చేసింది

“అవును. నేను మర్చేపోయాను”  తండ్రి  నవ్వుతూ వాతావరణాన్ని తేలిక చేయబోయాడు.

“ఇంతకూ శరత్ సాహు ఎన్నడూ? మిగిలాం యాభయ్ వేలూ ఇచ్చాడా?” ఇవ్వలేదని తెలిసీ అన్న ఎదురుచూస్తున్న ప్రశ్న వేయనేవేసాడు. తండ్రి వైపు చూడకుండా కంచం లోని అన్నం వైపు చూస్తూ. అన్న సరిగా తినకపోవడాన్ని రంజిత గ్రహించింది.

“లేదు. ఎప్పుడూ చెప్పే మాటే చెప్పాడు. ఇప్పుడు తన దగ్గర డబ్బు లేదని, రెండు రోజులలో సర్దుబాటు చేస్తానని” తండ్రి ఏ భావమూ లేకుండా జవాబిచ్చాడు. తండ్రి గొంతులో ధ్వనించిన నిరాశను రంజిత నమ్మలేకపోయింది. తండ్రి ఎప్పుడూ చాలా ఆశావహ దృక్పధం తో ఉంటాడు. ఎలాంటి నిరాశనూ దగ్గరకి రానివ్వడు.

“నేనా వెధవను చంపేస్తాను! వాడి రెండు రోజులకోసం  నా వుద్యోగం అక్కడ ఆగుతుందా?” అన్న గట్టిగా పెద్దగా అరిచాడు. అన్న  మొహం లో కండరాలు బిగుసుకోవడం ఆ గుద్ది వెలుతుఋ లో కూడా చాలా స్పష్టంగా కనిపించింది.

“కాస్త ఓపిక పట్టారా!” తల్లి సముదాయించడానికి ప్రయత్నం చేసింది, తింటున్న అన్నం మీదనుండి లేచి వెళ్లిపోతున్నా కొడుకును. “ఇన్నాళ్లు ఆగాము. ఇంకో రెండురోజులు ఆగలేమా?” ఆమె గొంతులో సముదాయింపు కంటే ఎక్కువగా ఆశాభంగమే కనిపించింది.

తమ కుటుంబం ఒక కబంధ హస్తం చేతిలో చిక్కినట్టు రంజితకు అర్ధం అయింది. ఏదీ ఇప్పుడు తమ నియంత్రణ లో లేదు. తన పెళ్లి చుట్టూ చోటు చేసుకున్న సంఘటనలు, అన్న వుద్యోగం, ఏం జరుగుతున్నదో తెలియక తికమక పడుతున్న చిన్నతమ్ముడు, చెల్లెలు మొహాలు ఆ రాత్రి చాలాసేపటివరకు రంజిత కళ్ళమీదకు  కునుకును రానివ్వలేదు.

***

రంజిత అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె భర్త ఇంట్లోలేడు. మామగారు కూడా బయటకు ఎక్కడికో వెళ్లారు. అత్తగారు గబగబా బయటకు వచ్చి రంజిత కళ్ళలోకి ఒక్క క్షణం చూసింది. అత్తగారిని చూడగానే భయం తో కూడిన  వణుకు ఆమె శరీరమంతా పాకింది. ఒక్క మాటకూడా మాట్లాడకుండా అత్తగారు పక్కగదిలోకి  వెళ్లిపోయారు. కూడా వచ్చిన అన్న సూట్ కేసు పక్కనపెట్టి క్షణం కూడా ఆగకుండా తిరిగి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు.

“ఉండరా! ఒక్కక్షణం ఆగు. టీ  తాగివెళుదువు కానీ…” అన్నది రంజిత

 “వద్దులేవే ! ఆల్సయం అవుతుంది. నేను వెళతాను. ఒక్క గ్లాస్ మంచినీళ్ళివ్వు” అన్నాడు అన్న

రంజిత తెచ్చిన మంచినీళ్ళగ్లాసు అందుకుని ఒక్కగుక్కలో నీళ్లన్నీ గొంతులో పోసేసుకుని అన్న వెళ్ళిపోయాడు. అన్న వెళ్లిన వెంటనే  గదిలోనుండి బయటకు వచ్చిన అత్తగారు

“ఏమయింది?” అన్నది గట్టిగా

 చెప్పే జవాబేమీ లేక రంజిత మాట్లాడకుండా అత్తగారి కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది.

“నిన్నే! అడిగేది? ఏమయింది డాబు తెచ్చావా?”

“మా  పొలం కొన్న అతను ఇవ్వాల్సిన డబ్బు అంతా ఇవ్వలేదు.రేపు మాపు అని ఆలస్యం  చేస్తున్నాడు.అతను డబ్బు ఇచ్చినవెంటనే నాన్న తీసుకుని వస్తాను అన్నాడు” అబద్దం చెప్పడం ఆమె స్వభావం కాకపోయినా గొంతు లో నుండి బయటకు వచ్చిన మాటలు ఆమె అబద్దం చెపుతున్నదేమో  అన్నంత సందేహాస్పదంగా, సంశయాత్మకంగా వచ్చాయి.

“నాకు తెలుసు” అత్తగారి గొంతు చాలా తీక్షణంగా వుంది. “ఆ ముసలాడు ఇలాంటి కుంతీ సాకులు వంద చెపుతాడు, ఒక్కసారి పనైపోతే అని. తండ్రీ కొడుకులకు ముందే చెప్పాను, మూడుముళ్లు వేయడానికి ముందే డబ్బు అంతా తీసుకోమని. ఒక్కడు కూడా నా మాట వినలేదు. ఆ క్షణం లో ఆ ముసలాడేం మెడను పెట్టాడో వాళ్ళిద్దరికీ! రానీ , ఇవాళ వాడిని రానీ” అత్తగారు చాలా పెద్దపెద్దగా అరుస్తున్నది ఎవరినీ ఉదేశించకుండానే! ఆమె కళ్ళలో కాఠిన్యం, మాటల్లో తీక్షణత కి రంజిత వొంట్లో రక్తం చల్లబడిపోయింది.

అత్తగారు ఏమి చెప్పిందో కానీ ఆ సాయంత్రం అంతా భర్త ఆమెతో ముభావంగా వున్నాడు. రాత్రి వివరంగా అంతా స్పష్టంగా మెల్లగా భర్తకి చెప్పాలని రంజిత అనుకున్నది. కానీ భర్త ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా అటువైపు తిరిగి పడుకున్నాడు. పెళ్ళై పట్టుమని పదిహేను రోజులు కూడా కాలేదు భర్త చూపిన నిరాదరణ కి ఆమె మనసు గాయపడింది. ఆమె కళ్ళ  నుండి కన్నీళ్లు జలజలా రాలి దిండును తడిపేసాయి.

మరునాడు పొద్దున్న అయినా భర్త కోపం తగ్గి మామూలుగా అవుతాడు అనుకుంటే రంజిత కి నిరాశే ఎదురయింది. ఆఫిసు కు వెళుతూ రంజిత మీద అంతెత్తున లేచాడు భర్త.”నిన్న మధ్యాహ్నం అనగా వచ్చావు. ఏంచేస్తున్నావు నువ్వు? గుద్ది గుర్రానికి పళ్ళుతోముతున్నావా? ఒక్క చొక్కా కూడా లేదు ఇస్త్రీ చేసి?”

“క్షమించండి. నేను చూసుకోలేదు. మధ్యాహ్నం చేస్తాను” అన్నది సంజాయిషీగా

“మధ్యాహ్నమా? మరిప్పుడేం వేసుకోను?” అంటూ  కోపంగా, బలంగా ఆమె మొహం మీద ఒక దెబ్బవేసాడు. అనుకోని అతని కోపానికి అసలే ఆశ్చర్యం తో వెడల్పు అయి ఉన్న  ఆమె కళ్ళు, భర్త కొట్టిన ఆ దెబ్బకి మరింత వెడల్పై కిందకు వాలిపోయాయి అవమాన భారం తో

భర్త టిఫిన్ తినకుండానే కోపం తో ఆఫీస్ కు వెళ్ళిపోయాడు. చిన్న ఆడపడుచు కాలేజీకి అంతకుముందే వెళ్ళింది. . ఒక పెళ్లి కోసం వచ్చిన పెద్ద ఆడపడుచు తన ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయింది. బావి దగ్గర సిమెంట్ చప్టాపై గుట్టలు పడ్డ బట్టలు, పక్కనే ఉన్న  అంట్లను సైగలతోనే  రంజిత కి చూపించి మాట్లాడకుండా అత్తగారు వంటగదిలోకి నడిచింది.

ఆ సాయంత్రం అందరూ ఇంట్లో వున్నప్పుడు “రంజితా ! మీ నాన్నకి ఫోన్ చేసి రమ్మను” అని పెద్దగా ఆర్డర్ వేసింది

“మా ఇంట్లో ఫోన్ లేదు ” అన్నది మెల్లగా రంజిత

“నాకు తెలుసా సంగతి. మీ పక్కఇంటి వాళ్ళకి ఫోన్ చేసి మీ నాన్నను  రమ్మని చెప్పి, రేపుదయం కల్లా  ఆరు నూరైనా, నూరు ఆరైనా డబ్బు తీసుకుని రమ్మని చెప్పు” అన్నది .

రంజిత కి ఆమె ఆజ్ఞ పట్టించకతప్పలేదు. పక్కింటికి ఫోన్ చేసిన ఐదు నిమిషాలకు ఆమె అన్న లైను లోకి వచ్చాడు. అతడు చెప్పిన విషయం విన్నాక ఒకేసారి రంజిత కి సంతోషమూ, దుఃఖమూ కలిగాయి. ఎట్టకేలకు అన్నకి వుద్యోగం  ఖరారు అయింది. అందుకు సంతోషం. శరత్ సాహు ఇచ్చిన యాభయ్ వేలు అన్న ఉద్యోగానికి లంచంగా ఇవ్వడం వలన రంజిత అత్తగారికి ఇవ్వవలసిన యాభయ్ వేలు ఇప్పటికిప్పుడు ఇవ్వలేరు. కానీ సాధ్యమైనంత త్వరగా తన జీతం లోకి ఇచ్చేస్తాను అని అన్న చెప్పాడు. అది దుఃఖాన్ని కలిగించే విషయం 

“ఏమన్నాడు? మీ నాన్న” అని ప్రశ్నిస్తున్న అత్తగారి కళ్ళు రంజిత వైపు తిరిగాయి

“అన్నయ్య ఉద్యోగానికి  వెంటనే యాభయ్ వేల రూపాయలు కట్టవలసి వచ్చిందట.కానీ అన్నయ్య ఆర్నెలల్లో డబ్బంతా ఇచ్చేస్తన్నాడు. అప్పటిదాకా ఆగకుండానే రెండు మూడు నెలల్లోనే నాన్న  సర్దుతాము అని చెప్పారు” రంజిత సాధ్యమైనంత  వినయంగా చెప్పింది.

“ఓహో! అలాగా!ఒరేయ్ విన్నావా ఆరునెలలట ”  అంటూ రంజిత భర్త వైపు తిరిగింది అత్తగారు. “వాళ్లకు మిగతా యాభయ్ వేల  రూపాయలు ఇచ్చే ఉద్దేశ్యం లేదు. ఇలాగే వాయిదాల మీద వాయిదాలు వేస్తారు. వాళ్లకు ఒక పాఠం నేర్పాల్సిందే! అత్తగారి మాటలలో భూమి మీద ఒక బాంబు ఏదో పేల్చినంత  భయంకరమైన ధ్వని. ఒక్క క్షణం పాటు అక్కడ పూర్తి నిశ్శబ్దం తాండవించింది. ఎవ్వరూ మాట్లాడటానికి సాహసం చేయలేదు. రంజిత కళ్ళు తూలి, తల  తిరుగుతున్నట్టుగా అనిపించడం తో వంటగదిలోకి పారిపోయింది 

 *********  

“మీరేమీ ఆందోళన పడవద్దు. మా అన్నయ్య ఆరు నెలల్లో డబ్బు ఇచ్చేస్తాను అన్నాడు.” అన్నది రంజిత ఒక భరోసాను ఇస్తున్నట్టుగా, మంచం మీద పడుకుని గది   సీలింగ్  వైపు చూస్తూ సిగరెట్ పొగ గుప్పుమని ఊదుతున్న భర్త తో. సిగరెట్ పొగే  కాదు మందు వాసన కూడా ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసింది

 “మీరు తాగుతారా?”  అన్నది నమ్మలేని ఆశ్చర్యం తో ఆమె కళ్ళు విప్పారినయి.

“తాగుతాను. అయితే  ఏమిటి? నేనేమైనా మీ నాన్న డబ్బు తో తాగుతున్నానా?దాన్నలా వుంచు. నాడబ్బు  నాఇష్టం . మీ నాన్న కి ఒప్పుకున్న యాభయ్ వేల రూపాయలు ఇవ్వడానికి ఇంకా ఆరునెలలు కావాలి. అంతేగా? కూతురు ముసలాడికంటే రెండాకులు ఎక్కువే చదివిందే ” అన్నాడు ఆమె భర్త.

భర్త  సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు  అన్న విషయాన్ని  జీరించుకోలేపోతున్న రంజిత ఆ షాక్ నుండి ఇంకా బయటకే రాలేదు. ఆమె కళ్ళలో ఇంకా నమ్మలేని తనమే వున్నది. గదిలో లైట్ మసకమసక గా వెలుగుతున్నది. భర్త మంచం మీద పడుకుని వున్నాడు. ఆయన చేతిలో వెలుగుతున్న సిగరెట్, ఆయన అన్న  ముసలాడి కంటే రెండాకులు అన్న మాటలోని ధ్వనికి రంజిత నోట మాట రాక ఉండిపోయింది.

ఆమె ఆ దిగ్భ్రాంతిలో ఉండగానే ” ఊ   ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి. లెఫ్ట్ రైట్ అంటూ గదిలో అటూ ఇటూ తిరుగు” సిగరెట్ పొగ గుప్పుగుప్పుమని ఊదుతూ అన్నాడు.

అతడు అన్నదేమిటో, తాను సరిగ్గా విన్నానో లేదో అర్ధం కాక రంజిత మౌనంగా నిల్చుంది.

“నువ్వు లెఫ్ట్ రైట్ అంటూ మార్చ్ చేస్తావా? నన్ను లేవమంటావా?” అతడి గొంతులో కాఠిన్యం, అధికారం, ఉక్రోషం అన్నీ కలగలిసినయి

అతడి మాట వినకపోతే ఊహించనిది ఏదో  చేసేస్తాడు అన్న భయానికి ఆమె అటూ ఇటూ రెండుసార్లు నడిచింది గదిలో

అలా కాదు సరిగ్గా చెయ్యి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ! తొందరగా చేయ్యి ” పెద్దగా అరిచాడు. అతడి గొంతు మందు ప్రభావం తో ముద్దగా వస్తోంది.

రంజిత నిశ్చలంగా నిలబడింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. కన్నీళ్లు తుడుచుకోవడానికో, లేక మొహం దాచుకోవడానికో ఆమె చేయి పైకి ఎత్తింది.

“ఇలా అయితే లాభం లేదు.” అతడు మంచం మీద నుండి కిందకు దూకి ఆమె ఎదురుగా నిల్చున్నాడు. మరుక్షణం లో ఆమె ఎడమ మోచేతి పైన  చురుక్కుమన్నది. మంట కి ఆమె గొంతు నుండి కేక కీచుగా బయటకు వచ్చింది

“నోర్మూసుకో! అరవకు” ఆమె భర్త మరొకసారి పాములాగా బుసకొట్టి కాలుతున్న సిగరెట్ చివరి భాగాన్ని ఆమె ఎడమ మోచేతి కింద బలంగాఅణచి ఆమె కాల్చాడు. గదిలో లైట్ ఆర్పేసి రెండుచేతులతో  ఆమెను లేపి ఒక చెత్తమూట ను కుడిలోకి విసిరేసినట్టుగా మంచం మీదకు విసిరేసాడు. ఆ తరువాత అనుభవం  ఆమె సర్వేంద్రియాలను నిర్వీర్యం చేశాయి. వేటకుక్కలు వేటాడినట్టు అతడు ఆమె శరీరం మీద వేట కొనసాగించాడు. ఆమె చైతన్యం లో స్ప్రహ లో కొన్ని అద్భుతమైన పొరల మాటున భద్రంగా, జాగ్రత్తగా, అపురూపంగా, దాచుకున్న ఒక సున్నితమైన, మృదువైన ఒక అనుభవ పరవశ, పరిమళంపు వస్త్రాన్ని కరకు కోరలతో, గోళ్ళతో, దంతాలతో దారుణంగా చీల్చేసాడు. ఆమె అస్తిత్వాన్ని ఒక క్రూర, దోపిడీ శక్తి చిన్నాభిన్నం చేసింది

ఆ తరువాత అత్తగారింట్లో రంజిత జీవితానికో నమూనా  ఏర్పడింది. ఆమె కి ప్రతిరోజూ ఒక టార్చర్ తో మొదలయి, నొప్పి తో ముగిసేది. ప్రతిరోజూ ఏదో ఒక సమయం లో భర్తో, అత్తగారో, ఆడపడుచో ఎవరోఒకరు లేదా ముగ్గురూ ఆమెను ఎదో రకమైన హింసకు గురి చేసేవారు. ఒకళ్ళు ఆమె తల పట్టుకుని  గోడకో,స్తంభానికో విసరికొడితే, మరొకరు ఆమె జుట్టు పట్టుకుని మెలిపెట్టేవాళ్ళు. దెబ్బలు, ముష్టిఘాతాలు ఆమెకు నిత్యం పలకరించే చుట్టాలు. ఆమె ఎలాగోలా ఈ టార్చర్ ను భరించడం నేర్చుకుంది, ఏదో  రకంగా ఆరునెలలు గడిస్తే చాలు అన్న యాభయ్ వేల  అప్పు తీర్చేస్తాడని, తనకు మంచి రోజులు వస్తాయి అనే ఆశతో!

నెలకోసారో, రెండు సార్లో యాభయ్ వేల  రూపాయలగురించి తండ్రికి గుర్తు చేయమని అత్తగారు ఆజ్ఞాపించేది అదీ ఫోన్ లోనే! తండ్రికో, తల్లికో వుత్తరం ముక్క రాయడం పూర్తిగా నిషేధం. అత్తగారు చెప్పిన ఆజ్ఞలు పాటించటం తప్ప మరొక దారిలేని రంజిత ఆమె చెప్పినట్టల్లా చేసేది. ఆమె తండ్రి రెండు మూడు సార్లు వచ్చినా రెండు క్షణాలు కంటే ఎక్కవ సేపు ఉండేవాడు కాడు. అత్తగారింట్లో ఏమి జరుగుతున్నదో తేలికగానే వూహించగలిగిన ఆయనకు కూతురు ఇచ్చే కప్పు కాఫీని కూడా గుటక వేయడం అత్యంత కష్టంగా ఉండేది. తన కూతురు నోరు విప్పి చెప్పకపోయినా ఆమె కళ్ళ లోనుండి ఒక వేదనా ప్రవాహం అతడిలోకి ప్రవహించేది. అన్నీ తలచుకుంటూ అతడు భయపడిపోయాడు. లోలోపలి రక్తం అంతా ఇగిరిపోయినట్టు పేలవంగా, జబ్బు పడిన మనిషిలా అయిపోయాడు.

కాలం భారంగా అయినా నడుస్తోంది.

కానీ ఎవరూ ఊహించని ఒకానొక సంఘటన జరిగింది. రంజిత రెండుమూడు సార్లు వికారానికి గురిఅయి వాంతులు చేసుకుంది. నీరసంగా బద్దకంగా ఉండటం మొదలుపెట్టింది. పక్కింటి మను  లక్షణాలు అన్నీ చూసి రంజిత గర్భవతి అని తేల్చేసింది. ఆ మాట ఒక షాక్ లాగా తాకింది రంజిత కు. తాను గర్భవతి. ఇదెలా సాధ్యం? మానవ రూపాన్ని ధరించే అతి సున్నితమైన పిండం, ఆ క్రూర, ఘోర, రాక్షస రతిలో రూపు దాల్చడం ఎలా సాధ్యం? ఈ గర్భం తనది, తన భర్తది. ఆ మాట ఆమెకు వేపాకు తిన్నంత చేదుగా అనిపించింది. ద్వేషం, భయ,, రాక్షసత్వం లో నుండి తన గర్భం లోకి ఒక పాప దారి వెతుక్కుంది. భర్త నుండి, అత్తా, ఆడపడుచుల నుండి నిత్యం ఎదుర్కునే హింస, దెబ్బలు, మాతృత్వం అనే ఒక సున్నితమైన కలను  తన లోలోపల పెంచి పోషించుకునే సమయాన్ని రంజితకు ఇవ్వలేదు. అయినా ఒక పాప తన గర్భం లో ఊపిరి పీల్చుకుంటున్నది

చివరకు ఆరు నెలల గడువు ముగిసింది

ఆరునెలల తరువాత ఒక తప్పనిసరి ఫోన్ పిలుపు రంజిత తండ్రిని వియ్యపురాలు ఇంటికి వచ్చేలాచేసింది. తండ్రి మరో ముప్పై ఏళ్ళు పైబడిన వాడిలా కనిపిస్తున్నాడు. అతడేమీ మాట్లాడకుండా తల  వంచుకుని కూర్చున్నాడు.  వియ్యపురాలు, వియ్యంకుడు చేస్తున్న అవమానాన్ని, వెలువరిస్తున్న దూషణలని మౌనంగా తనలోకి ఒంపుకుంటున్నాడు. చివరకు రంజిత అత్తగారు తన నిర్ణయం ఏమిటో ప్రకటించేసింది. రంజితను తండ్రి తన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. రంజిత, రంజితకు పుట్టబోయే బిడ్డ బాధ్యత అంతా అతడిదే. ఇకనుండి రంజిత కు భర్త ఇంటితో ఏ సంబంధమూ వుండకూడదు.

రంజిత తండ్రి వియ్యంకుడి చేతులు పట్ట్టుకుని “దయచేసి నా కూతురు బతుకు నాశనం చేయకండి. మా అబ్బాయి ఇంటర్వ్యూ రద్దు అయింది. అది వచ్చే రెండు మూడు నెలలో జరుగుతుంది. మా అబ్బాయికి తప్పకుండా వుద్యోగం వస్తుంది. వచ్చిన వెంటనే మీ డబ్బు అంతా ఇచ్చేస్తాడు. నన్ను కనికరించండి. నా బిడ్డ బతుకు నాశనం చేయొద్దు. ఉత్త పిల్ల కూడా కాదు. ఇప్పడు పదివేలు ఇస్తాను. ఎలాగోలా మిగతాది కూడా సర్దుబాటు చేస్తాను. దాని బతుకు బజారు పాలు చేయవద్దు.” తండి వియ్యంకుడి కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు. రంజిత  అత్తమామలను పదే  పదే  ప్రార్ధించింది ఒప్పుకోమని. చివరకు అత్తామామలు ఇద్దరూ పదివేలు తీసుకుని ఒప్పుకున్నారు.

కానీ మరుసటి రోజు సాయంత్రం కల్లా పరిస్థితులు మారిపోయాయి. రంజిత భర్త చెల్లెలు కాబోయే అత్తామామలు ఇప్పటికిప్పుడే లక్షరూపాయలు ముందస్తుగా ఇవ్వమని అడిగారని, అలా ఇవ్వకపోతే సంబంధం రద్దు చేసుకుంటాము అన్నారన్న వార్త తీసుకుని రాగానే! లక్ష రూపాయలు అనే పెద్ద మొత్తం ఇప్పటికిప్పుడు సర్దుబాటు చేయడం జరిగే పని కాదు. కనుక మిటూ నిశ్చితార్ధం రద్దు కాక తప్పదు. అదే జరిగితే ఆ పరిస్థితిని తట్టుకోవడం సాధ్యం కాదు. కుటుంబ సభ్యులు అంతా దాదాపు పిచ్చిపట్టినట్టు అయిపోయారు. భర్తనుండీ, అత్తామామ ల నుండీ అంత టార్చర్, హింస ఎదుర్కున్న రంజిత హృదయం కూడా తన కుటుంబానికి వచ్చిన కష్టానికి చలించిపోయింది. కానీ  రంజిత ఏ రకంగానూ వాళ్లకు సహాయపడలేదు. ఎందుకంటే ఆమె తండ్రి పెట్టిన బంగారం అంతా అత్తగారు అప్పటికే తీసేసుకున్నారు. ఇక ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదు.

ఆ రోజంతా భర్తా, అత్తగారూ విడతలు విడతలుగా ఒంటరిగా మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరూ ఏమి మాట్లాడనుకున్నారో రంజిత కి అసలేమీ తెలియదు. ఆమె వరండాలో కూర్చుని తండ్రి ద్వారా వదిన పంపిన పసుపుపచ్చ ఊలు తో పుట్టబోయే బిడ్డకోసం చిన్న ఫ్రాక్ కుట్టసాగింది.

“ఒక్కసారి వంటగదిలోకి రా!” భర్త అత్తగారి గదిలోనుండి బయటకు వచ్చి రంజితను పిలిచాడు. రంజిత అతడి కళ్ళలోకి ఎప్పుడూ లేనంత ధైర్యంగా చూసింది. అతడిలో ఒక వింత అశాంతి తో పాటు ఒకింత క్రూర స్థిర నిశ్చయం కూడా ఆమెకు ఆ క్షణం కనిపించింది.

“లే. ” రంజిత కి అసలు అతడికేమి కావాలో అర్ధం కాలేదు.

“లే.. ! నేను చెపుతున్నాను కదా.” అతడు ఆమె చేయి పట్టుకుని బలంగా లాగాడు. ఇంకా కుట్టటం పూర్తి కాని చిన్న ఫ్రాక్ ఆమె ఒళ్ళోంచి కిందకు పడింది. సగం కూడా పూర్తి కాని పసుపు పచ్చని ఊలు దండ కిందపడి దొర్లుకుంటూ వెళ్లి  వరండా దాటి ఇంటి వాకిట్లోకి పడింది.

ఆమె కళ్లు అలా వెళుతున్న ఊలు దండ  వంకే చూస్తున్నాయి

“పద వంటగదిలోకి” రంజిత భర్త ఉరిమినట్టుగా అన్నాడు. రంజిత కు ఏం జరగబోతున్నదో అర్ధం కావడం లేదు. తానెందుకు ఇప్పుడు వంట గదిలోకి. ఆమె ఆలోచనల్లో ఉండగానే “మిటూ, నువ్వు తలుపు గడియ వేసి ఎవరూ రాకుండా ఇక్కడే చూస్తూ వుండు” అని  చెల్లెలికి చెప్పి రంజిత ను లోపలికి బరబరా లాక్కుని వెళ్ళాడు. ఆ సమయం లో రంజిత మామ గారు ఇంట్లో లేరు. అత్తగారు వంటగది ముందు నిలబడి వుంది. రంజిత భర్త  రంజితను లాక్కుని రాగానే అత్తగారు ఆమెని వంటగదిలోకి రంజితను నెట్టేసింది. రంజిత వెనక్కు ఇంటిముందుకు జారిపోయిన ఊలు దండవంకఁ చూడాలని ప్రయత్నం చేసింది. బహుశా సగం కుట్టిన చిన్న చిన్న ఫ్రాక్ లు కూడా ఇంటిముందే పడి ఉంటాయి. ఏమి జరుగుతున్నదో రంజిత కు అర్ధం కావడం లేదు కానీ ఆమె మనసంతా ఆ సగం కుట్టిన ఫ్రాక్ ల మీదే వుంది.

రంజిత కు ఒక్కసారిగా ఆ ఊలు దండవైపు వెళ్లి ఆ సగం కుట్టిన ఫ్రాక్ లను తీసుకోవాలని బలంగా అనిపించింది.

ఆమె భర్తను విసిరికొట్టింది. కానీ అత్తగారు రాక్షసిలా వంటగదిముందు నిలబడి వుంది. భర్త కళ్ళలో అతడి క్రూరమైన హృదయపు ముక్క ఒకటి వేళ్ళాడుతూ కనిపించింది. భర్త ఒక్కసారిగా అతడు రంజితను ముందుకు తోసాడు. ఆమె సమతూగు కోల్పోయి స్టవ్ మీద పడింది. వెంటనే అత్తగారు రంజిత భర్త కి ఒక సీసా అందించింది. భర్త సీసా తీసి అందులోని ద్రవం ఆమె మీద పోసి ఆమెను పూర్తిగా తడిపేసాడు. ఒక షర్ట్ ను నీళ్లతో తడుపుతున్నంత శ్రద్దగా ఆమె ను ఆ ద్రవం తో తడిపేసాడు.తన మీద పడిన ద్రవం కిరోసిన్ వాసన వేయడం రంజిత సరిగ్గానే గుర్తించగలిగింది.  ఇక రంజిత ఏ మాత్రం ప్రతిఘటించలేదు. వాళ్ళను ప్రతిఘంటించే శక్తి తనకు లేదని ఆమెకు అర్ధం అయింది. కనీస ఆ సగం కుట్టిన ఫ్రాక్ లను కూడా తానూ తీసుకోలేను అన్న విషయం ఆమెకు అర్ధం అయింది.

రంజిత భర్త కొన్ని అగ్గిపుల్లలు తీసుకుని బలంగా తీసుకుని పెట్టెమీద గీసి మండుతున్న ఆ పుల్లలను స్టవ్  మీదకు విసిరాడు. మంటలు అంటుకోగానే, రంజిత భర్తా, అత్తగారు రంజితను, మండుతున్న స్టవ్ ను వంటగదిలో వదిలేసి పక్కకు వెళ్లిపోయారు. అప్పటిదాకా మౌనంగా వున్న రంజిత పిచ్చిగా అరవడం మొదలు పెట్టింది. ఆ అరుపు ఇంతకాలం ఆమె అనుభవించిన హింస వల్లో, టార్చర్ వల్లో కాదు.   ఏమాత్రం రక్షణ లేని ఆమె శరీరాన్ని ఆక్రమించుకుంటున్నది నిజమైన అగ్ని. ఎరుపు, పసుపు రంగు మంటలు రంజిత శరీరాన్ని భగ భగ  మండిస్తూవుండగా  ఆమె అత్తగారు, భర్తా, ఆడపడుచు సహాయం కోసం బిగ్గరగా అరవసాగారు. నాట్యం చేస్తున్న అగ్ని కీలలు, విశ్వం దద్దరిల్లేలా పెడుతున్న అరుపులు ఆ వంటగదిని పేలుతున్న అగ్ని గుండం లాగా మార్చింది. ఈ గందరగోళం మధ్య ఎవరో ముందు గదికి పెట్టిన బోల్ట్ ని జార్చి తలుపు తెరిచారు. రంజిత భర్తా, అత్తగారు, ఆడపడుచు సహాయం కోసం అరుస్తున్న అరుపులు ఇప్పుడు ఇల్లు దాటి బయటకు వచ్చాయి. సహాయకులతో పాటు ప్రేక్షకులు, సాక్షులు ఇక లోపలకు వస్తారు.

ఆమె తండ్రి సహాయం లేకుండానే చివరి వాయిదా తీర్చేసింది

********************

పరమిత శతపథి
వంశీకృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *