అధ్యాయము 21
న్యాయ విచారణ: ప్రభుత్వ న్యాయవాది – న్యాయవాదులు
భౌతిక సాక్ష్యాలుగా సమర్పించబడిన వస్తువులను పరీక్షించడం పూర్తవ్వగానే, ఇప్పుడు సాక్ష్యాల పరిశీలన ముగిసిందని ప్రకటించాడు అధ్యక్షుడు. వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని పిలిచి కేసుని కొనసాగించమని ఆదేశించాడు. ప్రాసిక్యూటర్ కూడా మనిషే కాబట్టి, అతనికి ఏ పొగతాగడం మీదకో, భోజనం చేయడం మీదకో మనసులాగి, మిగతావాళ్ళ మీద కాస్తంత కనికరం చూపిస్తాడామో అని మనసులో ఆశపడ్డాడు అధ్యక్షుడు.
కాని ప్రాసిక్యూటర్ తనమీద గానీ, వాళ్ళమీద గానీ అస్సలు జాలి చూపించలేదు.
ప్రాసిక్యూటర్ సహజంగానే మూర్ఖుడు. కానీ అతనికి స్వతహాగా తెలివితేటలు లేనప్పటికీ విద్యారంగంలో సాధించిన విజయాలు అతణ్ణి అత్యంత అహంకారం గల వ్యక్తిగా, గర్విష్టిగా మార్చాయి. దీనితోపాటు కాలేజీలో గోల్డ్ మెడల్ సాధించిన దురదృష్టం కూడా అతనికి తోడైంది. యూనివర్శిటీలో రోమన్ న్యాయశాస్త్రం చదువుతున్నప్పుడు అతను ‘బానిసత్వం’ వంటి క్లిష్టమైన చట్టపరమైన అంశంపై రాసిన వ్యాసానికి బహుమతిని కూడా పొందాడు; స్త్రీల విషయంలో అతని విజయాలు కూడా దీనికి దోహదపడ్డాయి.
ఫలితంగా అతని మూర్ఖత్వం పతాక స్థాయికి చేరుకుంది.
అధ్యక్షుడు మాట్లాడమని అనుమతి ఇవ్వగానే ప్రాసిక్యూటర్ దర్పంగా లేచి నిలబడ్డాడు. కుట్లు అల్లికలతో అలంకరించబడిన యూనిఫార్మ్‌లో ఉన్న తన సుందరమైన దేహాకృతిని ఆడంబరంగా అందరికి పూర్తిగా కనబడేలా ప్రదర్శించాడు.
డెస్క్ మీద తన చేతిని ఆనించి, తలను కొంచెం కిందకు వంచి, గదంతా పరికించి చూసాడు. ఖైదీల కళ్లలోకి చూడకుండా, అంతకుముందు నివేదికలు చదివేటపుడు అతను సిద్ధం చేసుకున్న ప్రసంగాన్ని చదవడం ప్రారంభించాడు.
‘జ్యూరీ సభ్యులారా! ఇప్పుడు మీ ముందున్న ఈ కేసు, నా ఉద్దేశ్యంలో చాలా విలక్షణమైనది.’
అతని అభిప్రాయం ప్రకారం- ప్రతిష్టాత్మకమైన న్యాయవాదులు చేసిన ప్రసిద్ధ ప్రసంగాల మాదిరిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసంగం కూడా ఎల్లప్పుడూ సామాజిక ప్రాధాన్యతను కలిగి ఉండాలి.
నిజం చెప్పాలంటే అక్కడున్న ప్రేక్షకుల్లో ముగ్గురు మహిళా ప్రేక్షకులు- ఒక దర్జీ మహిళ, ఒక వంటమ్మాయి, సిమియోన్ సోదరి. వీళ్ళతోపాటు ఒక గుర్రబ్బగ్గీ డ్రైవరు మాత్రమే ఉన్నాడు; కానీ ఇది అతనికి ఏమాత్రం పట్టించుకోవాల్సిన సమస్యలా అనిపించలేదు. ఎందుకంటే గొప్పగొప్ప వాళ్ళందరూ ఇలాగే మొదలుపెట్టారు.
ఎప్పుడూ తన స్థాయికి తగ్గట్టుగా ఉన్నత స్థితిలో ఉండాలి- అంటే, నేరంలో ఉండే మానసిక ప్రాముఖ్యత లోతుల్లోకి చొచ్చుకుపోయి పరిశీలించి సమాజపు గాయాలను వెలికితీయడం అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటి.
‘గౌరవ జ్యూరీ సభ్యులారా! ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీ ముందున్నది ఈ శతాబ్దపు అంతాన్ని సూచించే ప్రత్యేక లక్షణాలున్న నేరం. ఇది నేటి మన సమాజంలోని ఒక అత్యంత బాధాకర సమస్య తాలూకు నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంది. అదే ‘భ్రష్టుపట్టడం’. ఈ భ్రష్టుపట్టడం అనే పెనుమంటల ప్రభావానికి గురౌతున్న ప్రత్యేకవ్యక్తుల సమూహంలో ఈ నేరం జరిగింది.’ అన్నాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుదీర్ఘంగా మాట్లాడాడు, తాను మనసులో అనుకున్న భావాలలో ఏ ఒక్కదాన్నీ మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నించాడు. ఎక్కడా తడబడలేదు. గంటా పదిహేను నిమిషాలపాటు విరామం లేకుండా ప్రసంగాన్ని కొనసాగించాడు.
ఒకే ఒకసారి మాత్రం ఆగాడు. నోటిలోని లాలాజలాన్ని మింగుతూ కాసేపు నిలబడ్డాడు. కాని వెంటనే తేరుకుని తనను తాను అదుపులో పెట్టుకున్నాడు. తర్వాత మరింత ధీటైన వాక్పటిమతో ఆ అంతరాయాన్ని పూరించేసాడు.
అతను ఒక్కోసారి అందర్నీ మెప్పించే స్వరంతో మృదువుగా పలుకుతూ, అడుగులో అడుగేసినట్టు నడుస్తూ జ్యూరీ వైపు చూస్తూ మాట్లాడాడు. కొన్నిసార్లు ప్రశాంతంగా, వృత్తిపరమైన స్వరం ధ్వనించేలా తన నోట్‌బుక్‌లోకి చూసి మాట్లాడాడు. ఆ తర్వాత ప్రేక్షకుల నుండి న్యాయవాదుల వైపు చూస్తూ నిందారోపణ చేసే స్వరంలో బిగ్గరగా అరుస్తూ మాట్లాడాడు. కాని తననే తదేకంగా చూస్తున్న ఆ ముగ్గురు ఖైదీల కళ్లలోకి మాత్రం చూడకుండా దాటవేసాడు.
ప్రాసిక్యూటర్ తన ప్రసంగంలో ఆ రోజుకి అతని వర్గంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రతీ కొత్త అంశాన్ని, ప్రతీ శాస్త్రీయజ్ఞాన అంశాన్ని ప్రస్తావించాడు. వంశపారంపర్య నేర ప్రవృత్తి, పరిణామక్రమం, మనుగడకోసం పోరాటం, ఇంద్రజాల వశీకరణ శక్తుల ప్రభావం వంటి అనేక విషయాలను ప్రస్తావించాడు
అతని నిర్వచనం ప్రకారం వ్యాపారి స్మెల్‌కాఫ్ నిజమైన రష్యన్ స్వభావానికి ప్రతీక. ఉదార బుద్ధి, మనుషుల పట్ల విశ్వాసం కలిగినవాడు. అందుకే అత్యంత దిగజారిపోయిన మనుషుల చేతుల్లో పడి దారుణంగా మరణించాడు. సిమియోన్ కార్టింకిన్ అనేవాడు బానిస వ్యవస్థ సృష్టించిన ఒక పునరావృత అవశేషం. అతనొక మూర్ఖుడు, అజ్ఞాని, నైతికత లేనివాడు. కనీసం మతం కూడా లేని వ్యక్తి. యూఫేమియా అతని ఉంపుడుగత్తె. ఆమె నేర వారసత్వపు బాధితురాలు. నైతిక పతనానికి సంబంధించిన అన్ని లక్షణాలు ఆమెలో స్పష్టంగా గమనించవచ్చు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి మస్లోవా నైతిక పతనాన్ని అత్యంత హీనమైన రూపంలో ప్రదర్శించింది.
‘ఈ మహిళ…’ మస్లోవా వైపు చూస్తూ అన్నాడు అతను;
‘ఈరోజు ఆమె యజమానురాలు కోర్టులో చెప్పినట్టు- చదువుకుంది. ఆమెకు చదవడం రాయడమే కాకుండా ఫ్రెంచ్ భాష కూడా తెలుసు. అక్రమసంతానం కాబట్టి బహుశా ఈమెలో నేరవారసత్వ బీజాలు ఉండవచ్చు. ఈమె ఓ గౌరవప్రదమైన ఉన్నత కుటుంబంతో ఉంటూ విద్యని అభ్యసించింది. ఈమెకు నిజాయితీగా పనిచేసుకుని బతికే అవకాశం ఉంది. కాని, తన శ్రేయోభిలాషులను విడిచిపెట్టి, అవమానకర జీవితంవైపు మొగ్గు చూపింది. అందులోనూ తనకున్న విద్య వల్ల ఈమె ఇతర నేరస్థులతో పోలిస్తే భిన్నంగా ఉన్నది. జ్యూరీ సభ్యుల్లారా! ముఖ్యంగా, ఇందాక యజమానురాలు చెప్పినట్లుగా, ఇటీవల విజ్ఞానశాస్త్రం తెలిపినట్లుగా, ప్రత్యేకించి ‘హిప్నోటిక్ ప్రభావం’ అనే పేరుతో చార్కోట్ పాఠశాల ద్వారా ఇటీవల పరిశోధించబడిన ఆ మర్మమైన సామర్థ్యం ద్వారా సందర్శకులపై ప్రభావం చూపే శక్తి కలిగి ఇతరుల కంటే భిన్నంగా ఉంది. ఇలాంటి మాయా పద్ధతుల ద్వారా ఆమె ఆ రష్యన్ వ్యక్తిని, పురాణ గాథలోని దయగల కథానాయకుడు ‘సడ్కో’ లాంటి ఆ ధనిక అతిథిని, తన వలలో వేసుకుంది. అతని నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని ముందు అతణ్ణి దోచుకుంది. ఆ తర్వాత అతణ్ని క్రూరంగా హత్య చేసింది.’ అన్నాడు ప్రాసిక్యూటర్.
‘ఊమ్… అతను మరీ అతిగా ఆరోపణ చేస్తున్నట్టున్నాడు కదా? అధ్యక్షుడు ఆ గంభీర సభ్యుడి వైపు వంగి చిరునవ్వుతో అడిగాడు.
‘ఇతను మరీ భయంకరమైన మూర్ఖుడు!’ అన్నాడు గంభీర సభ్యుడు.
ఈలోపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘జ్యూరీ సభ్యులారా’ అన్నాడు, తన శరీరాన్ని మెత్తగా ఊపుతూ.
‘ఇప్పుడు ఈ సమాజ భవిష్యత్తు కొంతవరకు మీ చేతుల్లోనే ఉంది. మీ తీర్పు దానిపై ప్రభావం చూపుతుంది. ఈ నేరానికి సంబంధించిన పూర్తి అర్థాన్ని గ్రహించండి; మస్లోవా లాంటి వారిని ‘రోగిష్టి వ్యక్తులు’ అని సంబోధించడానికి నాకు అనుమతి ఇవ్వండి. అలాంటి వ్యక్తుల నుండి సమాజానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించండి. ఆ వ్యాధి ఇతరులకు సంక్రమించకుండా కాపాడండి. సమాజంలో అమాయకులూ, మంచివాళ్ళు ఈ అంటువ్యాధితో కలుషితం కాకుండా, నాశనం కాకుండా రక్షించండి.’ అన్నాడు.
అంతటితో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాబోయే తీర్పు ఎంత ప్రాముఖ్యమైనదో తనకే బాగా తెలుసు అన్నట్టు, ఆ భావోద్వేగానికి తట్టుకోలేకపోతునట్లు నటిస్తూ కుర్చీలో వాలిపోయాడు. నిజానికి, తన ప్రసంగం పట్ల అతడు చాలా సంతోషంగా ఉన్నాడు.
అతని ప్రసంగంలోని వాక్చాతుర్యపు అలంకారాలను తొలగిస్తే, దాని అసలు అర్థం ఏంటంటే – మస్లోవా ముందు వ్యాపారి నమ్మకాన్ని గెలుచుకుని, అతన్ని హిప్నోటైజ్ చేసి, అతని తాళం చెవి తీసుకుని అతని నివాసానికి వెళ్ళి మొత్తం డబ్బు దోచుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆ సమయంలో సిమియోన్, యుఫేమియాలు పట్టుకోవడంతో, దొంగిలించిన సొమ్ముని వాళ్ళిద్దరితో పంచుకోవాల్సి వచ్చింది. తర్వాత, ఆ నేరానికి సంబంధించిన ఆనవాళ్లని కప్పిపుచ్చడానికి ఆమె వ్యాపారిని తిరిగి ఆ గదికి తీసుకెళ్ళి అక్కడ అతనికి విషం పెట్టింది.
ప్రాసిక్యూటర్ తన ప్రసంగం ముగించిన తర్వాత ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి న్యాయవాదుల బెంచ్ నుండి పైకి లేచాడు. వెనక తోకలా వేలాడుతున్న కోటు, దిగువకు కోసిన వేస్ట్ కోటు, దానికింద గంజి ఇస్త్రీ చేసిన తెల్ల చొక్కా ధరించాడు. అతను కార్టింకిన్, బోచ్‍కోవాలను సమర్థిస్తూ ప్రసంగించాడు. అతను వాళ్ళిద్దరూ 300 రూబిల్స్‌కు నియమించుకున్న న్యాయవాది. అతను వాళ్ళిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించి మొత్తం నేరాన్ని మస్లోవాపైనే నెట్టేసాడు.
డబ్బు తీసుకున్నప్పుడు బోచ్‍కోవా, కార్టింకిన్ లు తనతో ఉన్నారని మస్లోవా చెప్పిన వాదనను అతను ఖండించాడు, ఆమె ప్రస్తుతం విషప్రయోగం ఆరోపణ ఎదుర్కుంటుంది కాబట్టి ఆమె సాక్ష్యాన్ని అంగీకరించలేమని అతను బలంగా నొక్కి చెప్పాడు.
‘ఆ 2,500 రూబిళ్లు, ఇద్దరు నిజాయితీ గల వ్యక్తులు రోజుకు మూడు నుంచి ఐదు రూబిళ్లు అతిథుల నుంచి బక్షీసుల రూపంలో సులభంగా సంపాదించగలిగిన సొమ్ము. వ్యాపారి డబ్బు మస్లోవానే దొంగిలించింది, ఆ తరువాత ఎవరికో ఇచ్చి ఉండవచ్చు లేదా పోగొట్టుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె మామూలు స్థితిలో లేదు’ అన్నాడు న్యాయవాది.
విషప్రయోగం పూర్తిగా మస్లోవా ఒక్కతే చేసింది. అందువల్ల కార్టింకిన్, బోచ్‍కోవాలను డబ్బు దొంగతనం విషయంలో నిర్దోషులుగా ప్రకటించాలని అతను జ్యూరీని వేడుకున్నాడు; ఒకవేళ వారిని దొంగతనం విషయంలోనూ కాపాడలేకపోతే, కనీసం విషప్రయోగం కేసులోనైనా వారికెలాంటి భాగస్వామ్యం లేదని అంగీకరించాలని ప్రార్థించాడు.
తన ప్రసంగం ముగింపులో ఆ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని గుచ్చే ప్రయత్నం చేసాడు; ‘ఆ మహానుబావుడు వారసత్వంపై చేసిన అద్భుతమైన పరిశీలనలు, వారసత్వానికి సంబంధించిన శాస్త్రీయ వాస్తవాలను వివరిస్తున్నప్పటికీ, అవి ఈ కేసులో వర్తించవు, ఎందుకంటే బోచ్‍కోవా తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు’ అని వ్యాఖ్యానించాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోపంగా చూస్తూ కాగితంపై ఏదో రాసుకుని, అవమానకరమైన ఆశ్చర్యంతో భుజాలు ఎగరేసాడు.
తర్వాత మస్లోవా తరఫు న్యాయవాది లేచి నిలబడి, భయపడి, తడబడి, ఆమెకు మద్దతుగా తన ప్రసంగాన్ని ప్రారంభించాడు.
డబ్బు దొంగతనంలో ఆమె భాగస్వామ్యం ఉన్నదనే విషయాన్ని ఖండించకుండానే, ఆమెకు స్మెల్కాఫ్‌కి విషపెట్టే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని, అతన్ని నిద్రపోయేలా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆ పొడిని ఇచ్చిందని అతడు బలంగా నొక్కిచెప్పాడు.
మాస్లోవా ఒక వ్యక్తి కారణంగా ఎలా వ్యభిచార జీవితంలోకి నెట్టబడిందో వివరించడానికి అతను కొద్దిగా వాక్చాతుర్యం ప్రదర్శించాడు. ఆ వ్యక్తి శిక్ష పడకుండా మిగిలిపోగా, ఆమె మాత్రం తన పతనం యొక్క భారాన్ని మొత్తం మోయాల్సి వచ్చిందని చెప్పాడు; కాని, మానసికశాస్త్ర పరిధిలో అతను చేసిన ఈ ప్రయత్నం విఫలమై, అందరికీ అసౌకర్యాన్ని కలిగించింది.
అతను పురుషుల క్రూరత్వం, స్త్రీల నిస్సహాయత గురించి ఏదో మాట్లాడుతుండగా, కేసు వాస్తవికతకి దగ్గరగా ఉండమని చెబుతూ అధ్యక్షుడు అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు.
అతను ముగించగానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమాధానమివ్వడానికి లేచాడు.
బోచ్‍కోవా ఎవరికి జన్మించిందో తెలియకపోయినా, దాని వల్ల వారసత్వ సిద్ధాంతం నిజం కాదనడం ఏ రకంగా చూసినా నిరాధారమైనది. ఎందుకంటే వారసత్వ సూత్రాలు ఇప్పటి వరకూ విజ్ఞానశాస్త్రం ద్వారా నిరూపించబడి ఉన్నాయి. మనం కేవలం నేరాన్ని వారసత్వం నుండి నిర్ధారించడమే కాదు, వారసత్వాన్ని కూడా నేరం నుండి నిర్ధారించగలమని చెబుతూ మొదటి న్యాయవాదితో పోల్చి తన వాదనను సమర్థించాడు.
మస్లోవా తరఫున వాదిస్తున్న న్యాయవాది, ఆమె ఒక ఊహాజనితమైన (ఈ పదాన్ని అతను చాలా బలంగా, విమర్శనాత్మకంగా నొక్కి చెప్పాడు) వ్యక్తి మోసానికి బలైందనే వాదనను తాను అంగీకరించలేనని, తమ ముందున్న సాక్ష్యాలను బట్టి చూస్తే, ఆమెకే చాలా మందిని ఆకర్షించి తన వలలో పడేలా ప్రేరేపించే అవకాశం ఎక్కువగా ఉందని మాత్రమే చెప్పగలం అన్నాడు.
ఈ మాట చెప్పి అతను విజయోత్సాహంతో కూర్చున్నాడు.
తర్వాత ఖైదీలకు తమను తాము సమర్థించుకునేలా మాట్లాడడానికి అనుమతి ఇవ్వబడింది.
యూఫేమియా బోచ్‍కోవా తనకు దాని గురించి ఏమీ తెలియదని, ఏ నేరంతోనూ తనకు సంబంధం లేదని మరొకసారి మళ్ళీ చెప్పి, మొత్తం నిందను బలంగా మస్లోవాపైనే వేసింది.
సిమియన్ కార్టింకిన్ పదేపదే ఒకేమాట అన్నాడు; ‘ఇది మీరు చేసిన నేరం, నేను నిర్దోషిని; ఇది అన్యాయం.’
మస్లోవా మాత్రం తనను సమర్థించుకునేలా ఏమీ చెప్పలేదు.
అధ్యక్షుడు ఆమెను మాట్లాడమని చెప్పినప్పుడు, ఆమె అతని వైపు తలెత్తి చూసింది. వేటాడబడబోతున్న జంతువులా గది చుట్టూ ఓ చూపు విసిరి, తలను దించుకుని, బిగ్గరగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.
నెఖ్లుడోవ్ ఒక విచిత్రమైన శబ్దం చేయడం విని, ‘ఏమైంది?’ అని అడిగాడు వ్యాపారి.
అది అతను బలవంతంగా ఏడుపుని అణచిపెట్టుకున్న శబ్దం.
నెఖ్లుడోవ్ ఇంకా తన ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా గ్రహించలేదు. ఆపుకోలేని ఏడుపు, కళ్లలో నిండిన కన్నీళ్ళు తన నరాల బలహీనత వల్లనే అనుకున్నాడు.
కన్నీళ్లని దాచుకోవడానికి అతను తన పిన్స్‍నేజ్ పెట్టుకున్నాడు. తర్వాత జేబు రుమాలు బయటకి తీసి ముక్కు చీదడం మొదలుపెట్టాడు.
కోర్టులో ఉన్న వాళ్ళకి తన ప్రవర్తన గురించి నిజం తెలిస్తే, అవమానభారం తనమీద పడుతుందనే భయం అతని అంతరాత్మలోని నైతికతని తొక్కేసింది.
మొదటి దశలో, అతనిలో ఈ భయం మిగతా అన్ని భావాలకంటే బలంగా, శక్తివంతంగా ఉంది.
***
