ఆశల రవ్వలు

Spread the love

మీ సాసర్లపై
ఇంకా కొంచెం తేనె మిగిలే ఉంది
పరాన్న ఈగలను పారదోలితేనే
ఆ కాస్త తేనెను కాపాడగలరు

కాపాలాగాసే రైతులారా!
మీ ద్రాక్ష తీగలకు
ఇంకా లేత గుత్తులున్నాయి
తోటలో నక్కిన గుంట నక్కలను వెళ్ళగొడితేనే ఆ ద్రాక్షలు ఆరోగ్యంగా పెరుగుతాయి

ఇంకా
మీ ఇండ్లలో చాపలూ, తలుపులూ ఉన్నాయి!
గాలి చొరడకుండా దారిని మూసేయండి
ఈ విషపు శీతగాలి ఎముకల్ని కొరుకుతున్నది!
మీ పిల్లలు భద్రంగా నిద్ర పోవాలంటే
మీరు తలుపు మూయాలి!

ఇంకా వాళ్ళ గుండెల్లో ఉరికే నెత్తురుంది
దాన్ని వృధా కానీయకండి
భవిష్యత్తు కోసం భద్రపరచండి

ఇంకా పుట్టని ఓ కొత్త శిశువు
వేకువ పొత్తిళ్ళ కోసం ఎదురుచూస్తోంది!

మీ పొయ్యిల పక్కన
ఇంకా కొన్ని పుల్లలున్నాయి
ఇంకా కొంత కలల కాఫీ పొడి ఉంది
ఇంకా చల్లారని మంటలున్నాయి!

మూలం: (Hope )
-మహమూద్ దర్వీష్
స్వేచ్ఛానువాదం :రహీమొద్దీన్

మహమూద్ దర్విష్

పాలస్తీనా జాతీయ కవి‌గా గౌరవించబడే మహమూద్ దర్విష్ మార్చి 13, 1941 లో జన్మించారు. ప్రస్తుత ఇజ్రాయెల్‌కు ఏర్పాటు కోసం జియోనిస్ట్ మిలీషియాలచే తమ మాతృభూమిని కోల్పోయిన పాలస్తీనియన్లలో అతని కుటుంబం కూడా ఉంది .ఆ తర్వాత అతని కుటుంబం లెబనాన్‌కు పారిపోయింది. జీవితంలోని ఎక్కువ భాగం ప్రవాసంలో మగ్గిపోయిన అతనికి పాలస్తీనా తల్లి, పాలస్తీనా ఒక ప్రేయసి, నెరవేరని స్వేచ్ఛా వాంఛ.దాదాపు శతాబ్ద కాలంగా ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న శరణార్థులుగా జీవిస్తున్న పాలస్తీనియన్ల బాధలకు ఆయన కవిత్వం గొంతు నిచ్చింది .దర్విష్ 2008 ఆగస్టు 9న హ్యూస్టన్‌లో గుండె శస్త్ర చికిత్సకు సంబంధించిన సమస్యలతో మరణించారు. దర్విష్ దాదాపు ముప్పై కవితా సంపుటాలను ప్రచురించాడు, ఇవి ఇరవై రెండు కంటే ఎక్కువ భాషలలోకి అనువదించబడ్డాయి.అందులోంచి కొన్ని తెలుగులో స్వేచ్ఛానువాదంగా ఉదయిని పాఠకుల కోసం...

రహీమొద్దీన్

కవి రహీమొద్దీన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహబూబాబాద్‌ నివాసి. డిగ్రీ నాటి నుండి కవిత్వం రాస్తున్నారు. 2018 నుంచి రైటింగ్ ని సీరియస్ గా తీసుకున్నారు. 2023 లో 'కలల రంగు' కవిత్వ సంపుటి వెలువరించారు. పలు కవిత్వ సమీక్షలూ చేశారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *