చంద్రశిలలు తాకి
చివ్వున చిందిన పరాయి కిరణాల పరావర్తనని
పరాకుగా వెన్నెలనుకుంటారు గానీ
నేను మాత్రం
'నూర్-ఎ-కమర్! నీకు పుట్టినరోజు జేజేలు'
అంటాను, నా ఒట్టిచేతుల ఓటి చప్పట్లతో.
కీళ్లు సడలిన చీలలు ఊడిన
నా ఏక్టివా బండెక్కి 'పద'మంటావు,
ఎదురుకట్నపు నఖ్రాలతో.
ఆ ఇషారాల షాయిరీలు
నీ తుషారాల మేలిముసుగు
అంతా ఇక మూగ ముషాయిరాల మేజువాణి!
ఏడుగుర్రాలు పూన్చిన రథానికి
తొడలు తెగిన సారథిని,
చురచురల నీ స్పర్శ అసిధారమధులేహనం.
ధూళి దూసర రేణువులల్లిన
దుశ్శాలువతో నాకు తలచని సన్మానం
మందరం నడుముకి తామరతూళ్లు!
మథనం ఇప్పుడొక మంతనం
పిందె చుబుకం గుచ్చుళ్లు
'గుసగుసలే గున్నామామిళ్ళు'1
నీ నిట్టూర్పుసెగతో
నిట్రాతి వెన్నుకి నిజ ధనుర్భంగం
వెన్న చన్నుల ఉలిమొన చెక్కిన
స్ఖలిత రాతిశిలల
శిల్ప స్ఖాలిత్యం నేనిప్పుడు.
రక్తమాంసాల వెలుగునీడల వెచ్చనిమంచు దేహపు
అనేకానేక అభాస కాదు నువ్వు,
నా భుజాన జీరాడే జూకామల్లి
నా జన్మని చుట్టిన మల్లెల మైత్రిగంధం!
**
తారు కాళ్లకి బుద్ధిచెప్పి ఊరంతా
పరుగుల పలాయనమౌతున్నప్పుడే
దిగంతాల దిశగా తీసే దౌడుకి
కళ్లాలేస్తావు:
"ఆపు! మా ఆయన ఎదురుచూస్తొందిక్కడే"
- అభిశప్తుడు
ఓ బెనజీర్ కోసం
1వేటూరి సినిమాపాట.

నవంబర్ 1 2025 – సంచికలో నా కవితని ప్రచురించినందుకు ‘ఉదయిని’ సంపాదకులకి Thanks
https://www.facebook.com/abhisapthudu.philogynist/posts/pfbid02Lex44baEVxqcpWrNWQjX2adTKJ7auGn4qeRnuSDVWhwxm4KwTBFYSrUzLN4PVTh6l