అధ్యాయం 19
విచారణ: పునః ప్రారంభం
ఇలాంటి మానసిక స్థితిలో నెఖ్లుడోవ్ కోర్ట్ నుండి బయటకు వచ్చి జ్యూరీలున్న గదిలోకి వెళ్ళాడు. అతను కిటికీ పక్కన కూర్చొని సిగరెట్ కాలుస్తూ, నిశ్శబ్దంగా వారి పిచ్చాపాటీ మాటలు వింటూ ఉన్నాడు.
చలాకీ వ్యాపారి మాత్రం స్మెల్‌కాఫ్ గడిపిన విలాసవంతమైన జీవితం గురించి తెగ పొగిడేస్తున్నాడు.
‘‘చూసావా, ముసలోడు గట్టోడు. అసలైన సైబీరియన్ మగాడి స్టైల్ అలా ఉంటుంది. ఏం చెయ్యాలో బాగా తెలిసినోడు. భయం అస్సలు లేదు! అలాంటి ఆడదే నాకూ నచ్చుతుంది…’ అంటూ పెద్దగా నవ్వాడు.
జ్యూరీ ఫోర్‌మన్ (నాయకుడు) మాత్రం ఖరాఖండీగా చెబుతున్నాడు, ప్రధానంగా నిపుణులు ఇచ్చిన అభిప్రాయమే ఈ కేసుని తేలుస్తుందని. పీటర్ గెరాసిమోవిచ్ ఒక యూదు క్లర్క్‌తో ఏదో జోక్ చేస్తూ పగలబడి నవ్వేస్తున్నాడు. నెఖ్లుడోవ్ తనంవి అడిగిన ప్రతి ప్రశ్నకు పొడిపొడిగా ఒకటి రెండు పదాల్లో సమాధానం ఇస్తున్నాడు. అతనికి ఏకాంతంగా ఉండాలి అనిపిస్తోంది.
వంకర నడకతో వచ్చిన కోర్ట్ గుమస్తా ‘జ్యూరీలందరూ మళ్ళీ కోర్టులో హాజరు కావాలి’ అని గట్టిగా ఆరిచాడు. నెఖ్లుడోవ్ గుండె ఒక్కసారిగా గుభేలుమంది. తాను తీర్పు చెప్పేవాడిగా కాకుండా, తీర్పు ఎదుర్కోబోతున్నవాడిలా ఫీలయ్యాడు. మనసు లోతుల్లో తాను చెడ్డవాడినని, నలుగురిలో తల ఎత్తుకునే తాహతులేని పరమ దుర్మార్గుడినని అనిపించింది. కానీ పైకి మాత్రం బింకంగా స్టేజ్ మీదకి వెళ్లి, , ఠీవీని ప్రదర్శిస్తూ కాలు మీద కాలు వేసుకుని, చేతిలో పిన్స్‌నేజ్ పట్టుకుని విలాసంగా ఊపుతూ కూర్చున్నాడు.
ఖైదీలు కూడా తిరిగి వచ్చి యధా స్థానంలో కూర్చున్నారు. ఈసారి కొన్ని కొత్త ముఖాలు కనిపించాయి. వాళ్ళు సాక్షులు. మస్లోవా తదేకంగా ఒక లావాటి మహిళను చూడడం నెక్లుడోవ్ గమనించాడు. ఆమె పట్టు, వెల్వెట్ బట్టలతో మెరుస్తూ, పెద్ద ‘బౌ’ ఉన్న టోపీ పెట్టుకుని, సొగసైన హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ముందరి వరుసలో కూర్చుంది. ఆమె మస్లోవా పనిచేసిన బ్రోతల్‌హౌస్ యజమానూరాలు అని తర్వాత తెలిసింది నెక్లూడోవ్‌కి.
సాక్షుల విచారణ మొదలైంది. వాళ్ల పేర్లు, మతం ఇతర వివరాలు అడిగారు. సాక్షులతో ప్రమాణం చేయించాలా వద్దా అని కొంతసేపు తర్జనభర్జన పడ్డారు. అంతలోనే కాళ్లు ఈడ్చుకుంటూ మత గురువు మళ్లీ లోపలికి వచ్చాడు. ఛాతీపై ఉన్న బంగారు సిలువను సరిచేసుకుంటూ, తనేదో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు సాక్షులు అందరి చేత ప్రమాణం చేయించాడు.
ప్రమాణాల తంతు పూర్తయ్యాక, బ్రోతల్‌హౌస్ యజమానురాలు ‘కిటాయేవా’ను తప్ప మిగిలిన సాక్షులు అందర్ని బయటికి పంపించారు. ఈ వ్యవహారంపై నీకు తెలిసినది చెప్పమని కోర్టు ఆమెని ఆజ్ఞాపించింది. తన తల మీదున్న పెద్ద టోపీ ఊగిపోయేలా, ఆమె ప్రతి మాటకు మందహాసం చేస్తూ మాట్లాడింది. చక్కటి జర్మన్ యాక్సెంట్‌లో స్పష్టంగా అంతా వివరించింది.
మొదట తనకు బాగా తెలిసిన హోటల్ సర్వెంట్ సిమోన్, ఒక ధనిక సైబీరియన్ వ్యాపారుడి తరఫున తన దగ్గరికి వచ్చాడని చెప్పింది. అప్పుడు ఆమె ల్యూబోవ్ అనే అమ్మాయిని అతనితో పంపిందట. కొంత సేపటికి ల్యూబోవ్ ఆ వ్యాపారితో తిరిగి వచ్చిందట. ‘అతను అప్పటికే బాగా తాగి మత్తులో ఉన్నాడు,’ అంటూ చిరునవ్వు నవ్వి, మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది. ‘తరువాత కూడా తాగుతూ, అమ్మాయిలతో జల్సా చేస్తూ ఉన్నాడు. డబ్బు అయిపోయింది. ల్యూబోవ్‌ను తన గదికి వెళ్ళి డబ్బు తెమ్మని పంపించాడు. ఆమె పైన అతనికి ప్రత్యేక ఆకర్షణ ఉంది.’ ఈ మాట చెప్పేటప్పుడు ఆమె మస్లోవా వైపు చూసింది.
నెఖ్లుడోవ్‌కి మస్లోవా ముసి ముసిగా నవ్వినట్టుగా అనిపించింది. ఆ నవ్వు అతనికి అసహ్యంగా అనిపించింది. ఒక అస్పష్టమైన వ్యాకులతతో కూడిన విరక్తి అతని అంతరంగంలో చెలరేగింది.
‘మస్లోవా గురించి నీ అభిప్రాయం ఏమిటి?’ అని కోర్టులో మస్లోవా తరపు యువ న్యాయవాది అడిగాడు.
‘చాలా మంచి అమ్మాయి.’ అంది కిటాయేవా, చక్కటి జర్మన్ యాసలో. ‘ఆ అమ్మాయి చదువుకున్నది, మాట మర్యాద తెలిసిన పిల్ల. గొప్ప కుటుంబంలో పెరిగింది, ఫ్రెంచ్ భాష బాగా మాట్లాడుతుంది. చదువుతుంది కూడా. అప్పుడప్పుడు ఒక పెగ్గు ఎక్కువ తాగుతుంది, కానీ ఎప్పుడు తనమీద తాను నియంత్రణ కోల్పోలేదు. చాలా మంచి అమ్మాయి.’
మస్లోవా ఆ మహిళ వైపు చూసింది. ఒక్కసారిగా కళ్ళు జ్యూరీ వైపు తిప్పి నేరుగా నెఖ్లుడోవ్ మీద చూపు నిలిపింది. హఠాత్తుగా ఆమె మొహం గంభీరంగా మారింది. ఒక కన్ను కాస్త మెల్ల. ఆ రెండు విభిన్నమైన చూపులు కొంత సేపు నెఖ్లుడోవ్ మీదే నిలిచాయి. అతనికి లోలోపల భయంగా అనిపిస్తున్నా, మెరిసే తేజోవంతమైన ఆమె కళ్ళ మీదనుండి తన చూపులు తిప్పుకోలేకపోయాడు.
అతనికి ఆనాటి భయంకరమైన రాత్రి గుర్తుకొచ్చింది. పొగమంచు కప్పుకున్న నది, కింద మంచు విరిగిపడే శబ్దం, తెల్లవారుజామున ఉదయించిన మసక చంద్రుడు, దాని కింద భయంకరమైన నల్లని నీడ… అన్నీ అతని స్మృతిపథంలో మెదిలాయి. ఇప్పుడు తనను గుచ్చి గుచ్చి చూస్తున్న ఈ రెండు నల్ల కళ్ళు అతనికి గతాన్ని గుర్తుతెచ్చాయి.
‘ఆమె నన్ను గుర్తుపట్టే ఉంటుంది,’ అనుకున్నాడు నెక్లుడోవ్. అతని గుండె దడ పెరిగింది.
కానీ మస్లోవా అతణ్ణి గుర్తుపట్టలేదు. చిన్న నిట్టూర్పు విడిచి మళ్లీ అధ్యక్షుడి వైపు చూసింది. నెఖ్లుడోవ్ కూడా నిట్టూర్చాడు.
‘అబ్బా.. ఈ వ్యవహారం త్వరగా ముగిసిపోతే బాగుండు’ అని మనసులో అనుకున్నాడు.
నెఖ్లుడోవ్ మనసంతా చిందరవందరగా ఉంది. తుపాకీ తీసుకుని వేటకు వెళ్ళినప్పుడు గాయపడిన పిట్టను చంపాల్సివస్తే ఎంత జాలి కలుగుతుందో ఇప్పుడు నెక్లుడేవ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓవైపు దానిని చంపివేయాలనిపించే అసహనం, మరోవైపు జాలి కలగలిసిన బాధ.
సాక్షుల విచారణ వింటున్న నెక్లుడోవ్ మనసంతా ఇలాంటి మిశ్రమ భావాలతో నిండిపోయింది.
+++
అధ్యాయం – 20
విచారణ: వైద్య నివేదిక
నెక్లుడోవ్ ఓపికను పరీక్షిస్తున్నట్టు, అతను అనుకున్న దానికి విరుద్ధంగా కేసు సుదీర్ఘ సమయం నడిచింది.
సాక్షులు ఒక్కొక్కర్ని వేరువేరుగా విచారించారు. చివరికి నిపుణుడిని పిలిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు ఇరుపక్షాల న్యాయవాదులు కూడా ముఖ్యమైన ప్రశ్నలుగా భ్రమిస్తున్న అనేక చెత్త ప్రశ్నలు అడిగారు. చివరికి సాక్షుల విచారణ ముగిసింది. సాక్ష్యాలుగా కోర్టుకు సమర్పించిన వస్తువులని పరిశీలించమని అధ్యక్షుడు జ్యూరీ సభ్యులని ఆహ్వానించాడు. అందులో చూపుడు వేలికి ధరించినట్లు కనబడుతున్న ఒక పెద్ద వజ్రపుటుంగరం, విషం పొడి, దాని పరీక్షకు ఉపయోగించిన గాజు గొట్టం ఉన్నాయి. వాటన్నిటికీ ముద్రలు వేసి, చీటీలు అంటించి పెట్టారు.
సరిగ్గా సాక్షులు వాటిని చూడబోతుండగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నిలబడ్డాడు.
‘సాక్ష్యాలు పరిశీలించడాని కంటే ముందు, డాక్టర్ ఇచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ చదవాలి’ అని డిమాండ్ చేసాడు.
అధ్యక్షుడు తన స్విస్ స్నేహితురాల్ని కలవాలనే ఆత్రంలో కేసు త్వరగా ముగించాలని చూస్తున్నాడు. ఆ రిపోర్ట్ చదవడం వల్ల ఒట్టి విసుగు కలగడం తప్ప పెద్ద ఒరిగేదేమీ ఉండదని అతనికి తెలుసు. ప్రాసిక్యూటర్‌కి అలా అడిగే హక్కు ఉంటుందని అతడికి తెలుసు కాబట్టి, అతనికి ఇష్టంలేకపోయినా అంగీకరించాడు.
సెక్రెటరీ ఆ రిపోర్ట్ బయటకి తీసాడు. అలసిపోయిన స్వరంతో, ‘ర’ ‘ల’ మధ్య తేడా లేకుండా, తడబడే ఉచ్చారణతో ఇక చదివడం మొదలుపెట్టాడు.
“బాహ్య పరీక్షలో బయటపడిన విషయాలు:
ఒకటి. థెరోపాంట్ స్మెల్‌కాఫ్ ఎత్తు ఆరు అడుగులు ఐదు అంగుళాలు.’ అన్నాడు.
నెక్లుడోవ్ పక్కనే ఉన్న వ్యాపారి అతని చెవిలో చిన్నగా నవ్వుతూ అన్నాడు, ‘పర్వాలేదు, మంచి ఎత్తే.’
‘రెండు. వయస్సు సుమారు నలభై ఏళ్ళు.’
‘మూడు. శరీరం ఉబ్బిపోయిన స్థితిలో ఉంది.
‘నాలుగు. చర్మం పచ్చగా మారి, కొన్ని చోట్ల నల్ల మచ్చలతో ఉంది.’
‘ఐదు. చర్మంపై రకరకాల పరిమాణాల్లో బొడిపెలు వచ్చాయి. కొన్ని చోట్ల అవి పెద్దపెద్ద ముక్కలుగా ఊడిపోయాయి.’’
‘ఆరు. జుట్టు దట్టంగా, రాగిరంగులో ఉంది. ముట్టుకుంటే చర్మం నుండి ఊడిపోతుంది.’
‘ఏడు. కనుగుడ్లు బయటికి తేలి ఉన్నాయి. కార్నియా మసకబారింది.’
‘ఎనిమిది. ముక్కు, చెవులు, నోటి నుండి ద్రావకాలు కారుతున్నాయి. నోరు సగం తెరుచుకుని ఉంది.’
‘తొమ్మిది. ముఖం, ఛాతీ రెండూ ఉబ్బిపోవడంతో మెడ దాదాపు కనిపించట్లేదు.’
సెక్రెటరీ చదువుతున్న నివేదిక ఇలా కొనసాగుతూ పోయింది.
శవ పరీక్షకు సంబంధించి, నాలుగు పేజీల్లో వివరంగా పొందుపరచబడిన ఇరవయ్యేడు పాయింట్లు మొత్తం, సంతోషంగా పండగ చేసుకుందామని వచ్చిన ఆ వ్యాపారి శరీరం ఎలా కృశించి, కుళ్లిపోయిందో తెలియజేశాయి.
నెక్లుడోవ్‌లో అప్పటికే అస్పష్టంగా ఉన్న విరక్తి, ఆ అసహ్యమైన వర్ణనలతో మరింత పెరిగింది.ఇటు శవం నుండి కారుతున్న ద్రావకం, బయటికి పొడుచుకొచ్చిన కనుగుడ్లు, అటు కటూషా జీవితం, తాను ఆమెతో ప్రవర్తించిన విధానం- ఇవన్నీ ఒకేరకపు దుర్మార్గపు విషయాలుగా అతనికి అనిపించాయి. ఆ అసహ్యమైన వాస్తవాల మధ్యన తాను పూర్తిగా ఇరుక్కుపోయి, వాటిలో కూరుకుపోయానునే భావన కలిగింది అతనికి.
బాహ్య పరిశీలన రిపోర్టు చదవడం అయిపోగానే అధ్యక్షుడు ఊపిరి పీల్చుకున్నాడు.
‘ఇక ఇప్పుడు అయిపోయినట్టేగా’ అన్నట్టు చేయి పైకెత్తాడు అధ్యక్షుడు.
కానీ సెక్రెటరీ వెంటనే అంతర్గత అవయవాల పరిశీలన రిపోర్టు చదవడం మొదలుపెట్టాడు. అధ్యక్షుడు మొహం చేతుల్లో పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. నెక్లుడోవ్ పక్కనున్న వ్యాపారికి నిద్ర ముంచుకొచ్చింది. తూగుతూ కూర్చున్నాడు. ఖైదీలు, గార్డులు నిశ్శబ్దంగా నిలబడ్డారు.
అంతర్గత పరిశీలనలో తేలిన విషయాలు:
‘ఒకటి. పుర్రె ఎముకల మీదున్న చర్మం సులభంగా ఊడిపోతుంది.
‘రెండు. ఎముకలు సాధారణ మందంతో, సాధారణ దృఢత్వం కలిగి ఉన్నాయి.’
‘మూడు. మెదడు పొరపై నాలుగు అంగులాల పొడవుతో, రెండు నలుపు మచ్చలు ఉన్నాయి. పొర కూడా తెల్లగా పాలిపోయి ఉంది.’
ఇలా ఇంకో పదమూడు పేరాగ్రాఫుల్లో ఉన్న పాయింట్లు వివరంగా చదివాడు. చివరగా పోస్టుమార్టం చేసిన అసిస్టెంట్ డాక్టర్ల పేర్లు, సంతకాలు ఉన్నాయి. ఆఖరున ముఖ్య వైద్యుడి అభిప్రాయం ఇలా రాసుంది: ‘కడుపులో వచ్చిన మార్పులు, అలాగే తక్కువ మోతాదులోనే అయినా పేగులూ కిడ్నీల్లో గమనించిన మార్పులు- విషం కారణంగా వచ్చి వుండవచ్చు. ఆ విషం మద్యంలో కలిసి వుండవచ్చు. ఎందుకంటే స్మెల్‌కాఫ్ కడుపులో ఎక్కువ మోతాదులో మద్యం కనబడింది.’
‘అతను తాగడంలో కూడా తక్కువోడేం కాదు’ అన్నాడు మళ్ళీ నెక్లుడోవ్ పక్కనున్న వ్యాపారి, అప్పుడే నిద్ర లేస్తూ.
ఈ రిపోర్టు చదవడానికి మరో గంట సమయం పట్టింది. అయినా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతృప్తి చెందలేదు.
అధ్యక్షుడు వెంటనే ‘ఇప్పుడు అంతర్గత అవయవాల పరిశీలన రిపోర్టు చదవడం అవసరమా?’ అని అడిగాడు.
ప్రాసిక్యూటర్ కాస్త పైకి లేచి కనీసం తల కూడా పైకెత్తకుండా కరుకు స్వరంతో ‘అది కూడా చదవమని నేను కోర్టు వారిని కోరుతున్నాను.’ అన్నాడు.
నాకు అలా అడిగే హక్కు ఉందనీ, ఆ హక్కు నేను తప్పకుండా వినియోగించుకుంటాననీ అతను తన ప్రవర్తనతో చెప్పాడు. మీరు దానికి అంగీకరించకపోతే అది నా అప్పీల్ కి కారణం అవుతుందని అతను స్పష్టంగా చూపించాడు.
కడుపు నొప్పితో బాధపడుతున్న పొడవాటి గడ్డపు న్యాయమూర్తి విసుగ్గా అధ్యక్షుడి వైపు తిరిగి, “ఇదంతా చదవడం వల్ల ఏం ప్రయోజనం లేదు? సమయం వృథా. కొత్త చీపుర్లు సరిగ్గా ఊడవనట్టు, ఈ కొత్త లాయర్లకి సరిగ్గా పనిచేయడం తెలీదు. చాలా టైమ్ తీసుకుంటారు’ అన్నాడు.
తన భార్య నుంచి, తన జీవితం నుంచి ఏమీ ఆశించని బంగారు కళ్లజోడు సభ్యుడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.
అక్కడున్న వారందరి నిద్రమత్తును తొలగించడానికి తన స్వరాన్ని పెంచుతూ, ఉత్సాహంగా చదివడం మొదలుపెట్టాడు సెక్రెటరీ.
అసిస్టెంట్ మెడికల్ ఇన్స్పెక్టర్ సమక్షంలో, వైద్యశాఖ తరఫున 188* ఫిబ్రవరి 15వ తేదీన సంతకం చేసిన నేను అంతర్గత అవయవాలను పరిశీలించాను.’
‘ఒకటి. కుడి ఊపిరితిత్తి, గుండె (6 పౌండ్ల గాజు సీసాలో)’
‘రెండు. కడుపులోని పదార్థాలు (6 పౌండ్ల గాజు సీసాలో)’
‘మూడు. కడుపు (6 పౌండ్ల గాజు సీసాలో)’
‘నాలుగు. కాలేయం, ప్లీహం, మూత్రపిండాలు (9 పౌండ్ల గాజు సీసాలో).
‘ఐదు. పేగులు (9 పౌండ్ల మట్టిపాత్రలో).’
అధ్యక్షుడు పక్కనున్న ఇద్దరు సభ్యుల్లో ఒకరితో గుసగుసలాడి, మరొకరి వైపు వంగి, వారి సమ్మతితో, ‘ కోర్టు ఈ రిపోర్టు చదవడం అనవసరమని భావిస్తుంది’ అన్నాడు. సెక్రెటరీ చదవడం ఆపేసి కాగితాన్ని మడిచాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం కోపంగా ఏదో రాయడం ప్రారంభించాడు.
‘ఇప్పుడు జ్యూరీ సభ్యులు భౌతిక సాక్షాధారాలను పరిశీలించవచ్చు’ అన్నాడు అధ్యక్షుడు.
ఫోర్‌మన్, మరికొంతమంది లేచి టేబుల్ దగ్గరికి వెళ్లి, ఏం చేయాలో తెలియక సీసా, టెస్ట్ ట్యూబ్, ఉంగరం వైపు చూశారు. వ్యాపారి ఉంగరాన్ని వేలికి పెట్టుక్కున్నాడు.
‘ఆహ్! అదొక పెద్ద వేలు. కీరదోస అంత పెద్దగా ఉంది!’ అని నవ్వుతూ అన్నాడు, వెనక్కి తిరిగివస్తూ. తన మనసులో ఊహించుకున్న ఆ వ్యాపారి రూపం అతనికి నవ్వు తెప్పించింది.
***
