భారతీయ ఆంగ్ల రచయితల్లో ఖ్వాజా అహమ్మద్ అబ్బాస్ ప్రగతి శీల పథంలో ప్రజల కోసం పుంఖాను పుంఖాలుగా నవల, కథ, నాటకం,వ్యాసం, సినీ విమర్శ ఇలా పలు రూపాల్లో సృజనాత్మక ప్రసూన పరిమళం వెదజల్లారు. ఆయన ఒక సామాజిక వాస్తవవాది. సాహిత్యం సమాజాన్ని ఉద్ధరిస్తుందని నమ్మారు.
అబ్బాస్ తన ఆత్మ కథ ‘నేను కాదు ఒక ద్వీపం’ ( I’m Not an Island) లో తన అభ్యుదయ దృక్పధాన్ని సరళమైన, కదిలించే కవితాత్మ క భాషలో, హిందుస్తానీ పద మిళితమైన వచనంలో వెలిబుచ్చారు.ఆయన దృష్టిలో “ వస్తువు ప్రగతి శీలంగా, హేతుబద్ధంగా ఉండాలి. సమాజంలో ప్రజా మనస్సులలో కాలం చెల్లిన వాటిని, nమూఢాచారాలు, పిడి వాదాలను విమర్శించాలి. మానవతా వాది అయిన అబ్బాస్ ఈ జీవన నాటకంలో మనిషే ప్రధాన పాత్రగా తలచి మలిచారు.
కొందరు ప్రముఖ విమర్శకులు ఆయన గొప్ప నవల ఇంకిలాబ్ ని రాజకీయాలు, జర్నలిజంగా తిట్టినా దయాళ్ అనే సహృదయ విమర్శకుడు అబ్బాస్ ను బాధా సర్పదష్టుల పక్షపాతి గా కీర్తిస్తూ ఆయనని కిషన్ చందర్, ముల్క్ రాజ్ ఆనంద్ ల సరసన స్థాన మిచ్చారు. పాశ్చాత్య రచయితలు ఆయన బాల్జాక్, డికెన్స్, ఆర్వెల్, నార్మ మెయిలర్, ట్రూమన్ కపోటీ లాంటి వారే కాక కుష్వంత్ సింగ్, నయనతార సెహగల్, మనోహర్ ముల్గాంకార్, గీతా హరిహరన్ లాంటి భారతీయ ఆంగ్ల రచయితలు సైతం పాత్రికేయ నవలా రచన చేసినవారే.
1943 లో ముంబాయి లో జరిగిన అభ్యుదయ రచయితల నాల్గవ సమావేశం సినీ పరిశ్రమను ప్రగతి శీల పథంలో ప్రభావితం చేయమని తీర్మానించింది. ఈ నేపథ్యంలో తెలుగు అభ్యుదయ రచయితలయిన శ్రీ శ్రీ, కృష్ణ శాస్త్రి, ఆరుద్ర తదితరుల సినీ రంగ ప్రవేశం జరిగింది. అబ్బాస్ తన వ్యాసం “ రచయిత బాధ్యత” ( ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, 15 అక్టోబర్, 1961) లో భారతీయ కొత్త సినిమా ఉన్నత స్థాయిని చేరేందుకు సాహితీ విలువసృజనాత్మక కళా అవసరాలు మేళవించగల రచయిత రావాలి” అని రాయడమే కాక తాను సినీ కథా రచయిత, విమర్శకుడు, దర్శకుడు, నిర్మాతగా మారి రెండు రంగాల్లో తన బహుముఖీన ప్రజ్ఞ చూపించారు.
స్వాతంత్య్ర ఉద్యమం ఉవ్వెత్తుగా లేచిన కాలంలో భారతీయ ఆంగ్ల రచయితలు వెంకట రమణి , ముల్క్ రాజ్ ఆనంద్, భవానీ భట్టాచార్య, కుష్వంత్ సింగ్, మనోహర్ ముల్గాంకార్ ల వలె అబ్బాస్ తన రచనలు చేశారు. వీటిలో ఇంకిలాబ్ (1947)ప్రపంచమే నా గ్రామం (1984) అనే చారిత్రక నవలల్లో మత సామరస్య సాధన గురించి నొక్కి చెప్పారు. చీలిన హృదయం (1968) నవలలో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జాతీయ, అంతర్జాతీయ సంబంధం చిత్రించారు
ఇంకిలాబ్ నవల్లో నాయకుడు అన్వర్ నిజమైన ముస్లిం అంటే అన్యాయంతో రాజీ పడకపోవడం, సత్యం, సత్ప్రవర్తన అని సహాయ నిరాకరణ ఉద్యమం అత్యున్నత దశలో ఉండగా తన తండ్రి జుమా మసీదులో ఇచ్చిన ఉపన్యాసం ద్వారా గ్రహిస్తాడు. అతడు, తన
తండ్రి తో కలిసి అమృతసర్ పోతుండగా రైల్వే స్టేషన్లో ఒకే పంపు నుండి పట్టిన నీరును ’హిందూ నీరు’ , ముస్లిం నీరు గా అమ్మటం చూసి మత విభజన విష బీజాలు ఎలా నాటబడుతున్నాయి అనేది చూస్తాడు. అక్బర్ ఆలీ , రామేశ్వర్ దయాళ్ అనే భిన్న మతాల స్నేహితుల మధ్య వ్యాపార సంబంధాలు దెబ్బ తినడం జరుగుతుంది. ఖిలాఫత్ ఉద్యమం ఆగిపోవటం, రాజకీయ పరిణామాల మార్పు వల్ల 1920 లలో మతాల మధ్య విముఖత పెరిగింది.
అన్వర్ తండ్రి అక్బర్ ఆలీ జైలు నుంచి తిరిగి వచ్చి హిందువులు అంతకు ముందు చేపట్టిన ‘శుద్ధి’ ( తిరిగి మతమార్పిడి) , ‘సంగతం’( మత సమీకరణ) లకు ప్రతి క్రియగా“తబ్లిగ్” (బోధన), ‘తంజీమ్’ (సంస్థ)కార్యక్రమాలు చేపడతాడు. హిందూ- ముస్లింల మధ్య దూరం పెరగడానికి లీగ్ తో పాటు కాంగ్రెసు బాధ్యత కూడా ఉందని అన్వర్ భావిస్తాడు. గాంధీ హిందూ మతం , నీతి, పురాణాలు ప్రస్తావించడం సామాన్య ముస్లిం ప్రజ దూరమవటానికి దారితీసిందేమోనని అన్వర్ భావిస్తాడు. ఒక మత ఘర్షణ ఘటనలో అన్వర్, అతని స్నేహితుడు గోపాల్ లను ఒక వ్యక్తి కాపాడుతాడు.అన్వర్ కు సోదరుల మధ్య ఘర్షణ, తాను వెళ్ళి కాకా రామేశ్వర్ ను పొడవడమో లేక గోపాల్ వచ్చి తన్ను పొడవడం అసంబద్ధంగా తోచుతుంది.
అబ్బాస్ ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని లేదా ముఠా వాదం అనేది మతానికి, జాతీయ వాదానికి వ్యతిరేకంగా భావిస్తారు. ఈ భావం సమైక్యతా సమ్మేళనంలో మౌలానా మహమ్మదాలీ ఉపన్యాసం, జైలుకు వెళుతూ గాంధీ చేసిన ఉపదేశాలు ప్రకటిస్తాయి. “హిందువులు ఎవరినీ అంటరాని వారిగా చూడరాదు.హిందువులు, ముస్లింలు, పార్సీ లు, క్రిస్టియన్లు, అందరూ ఒకరినొకరు కౌగిలించుకోవాలి” అని గాంధీ అంటారు.
నవల్లో అన్వర్ ‘ముస్లింలు ముస్లింల దగ్గరే కొనాలి’ అనే ఉద్యమం ద్వారా ఒమర్, అక్బరాలీ లాంటి వ్యాపారులు ఎలా లాభపడతారో గమనిస్తాడు. మత కలహాలు పుకార్లు మరియు హేతుబద్ధత లేకపోవడం వల్ల సైతం జరిగినట్లు అబ్బాస్ చూపిస్తారు. 1928 లోని ముంబాయి మత కలహాలు పఠాన్ లు పిల్లలను ఎత్తుకు పోతున్నారనే పుకార్ల వల్ల జరిగాయని అబ్బాస్ రాస్తే , అవి కార్మిక సమ్మెకు వ్యతిరేకంగా పఠాన్లు వాడబడటం వల్ల జరిగాయని చరిత్రకారుడు సుమిత్ సర్కార్ తెలిపారు.
ఒక సారి అన్వర్ తన తండ్రి అక్బర్ ఆలీ తో కలిసి ఒక మీటింగ్ కు వెళ్లినపుడు తన తండ్రి సోదరుడు , మంత్రి అయిన అంజాద్ ఆలీ ముస్లిం వేర్పాటు వాదం గురించి ప్రసంగించడం చూస్తాడు. అన్ని మతాల వారు, కులాల వారు తాము ప్రత్యేక ప్రజల మని అరుస్తుండటం భారత్ శరీరంలో బాకులు దించడమని అనుకుంటాడు.
అయితే మత వేర్పాటు వాదం అబ్బాస్ వ్యతిరేకించినా హిందూ మహా సభ, కాంగ్రెసుల పాత్రను ఇంకా స్పష్టంగా చిత్రించలేక పోయారు. వేర్పాటు వాదం సామాజిక తన్యతల వికార రూపమని, మరింత గట్టి నేతృత్వం దాన్ని సామ్రాజ్య వాద వ్యతిరేక ఉద్యమంగా మలిచేదని బెంగాల్ , పంజాబుల్లో కాంగ్రెసు విప్లవాత్మక వ్యవసాయ కార్యక్రమాలు తీసుకోక పోవటం,
బలోపేతం చేయనందున వేర్పాటు వాదం పెరిగిందని చరిత్రకారుడైన సుమిత్ సర్కార్ పేర్కొన్నారు.
మత అస్తిత్వ సమస్య పట్ల గాంధేయ జాతీయ వాదం బలహీనంగా స్పందించింది. వలస వాదం రుద్దిన మత అస్తిత్వ సహజత్వం అనే భావం ఒప్పుకుంది.
అన్వర్ జలియన్ వాలా బాగ్ లో పారిన రక్తం భారతీయులను ఏకం చేసిందని భావించినా కొన్ని సార్లు ఆత్మ సంఘర్షణకు, తాను పక్కా ముస్లిమ్ కాదేమోననే ఆత్మ నిందకు లోనవుతాడు.
అన్వర్ పాత్ర రెండో భాగమైన ప్రపంచమే నా గ్రామం (The World is My Village) లో కొనసాగుతుంది.అతడు ప్రపంచ యువజనుల సమావేశంలో ఉన్నపుడు ఒక యువతి అతడి మతం ఏదని అడిగితే తాను ‘ఓ పార్టీయేతర సోషలిస్టు / కమ్యూనిస్టు’ అని చెబుతాడు. ఆ జవాబు ఆమెకు నచ్చదు. “నేను రెండూను లేదా ఏదీ కాదు! హిందూ లేదా ముస్లిం ఏదీ కాదు” అంటాడు అన్వర్. వాస్తవానికి అతడు ఓ హిందూ జంట అక్రమ సంతానంగా జనించి ముస్లిం చేతుల్లో పెరుగుతాడు. మనిషి వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర పుట్టుకదా లేక పరిసరాలదా అనే మానసిక సంఘర్షణ అతడిది.అతడి మతం గురించి ఎందరో- జిలియాకజ్ ( జెనీవా లో నెహ్రూ ను, అతడ్ని ఆదరించిన గృహస్తు), పౌర సత్యాగ్రహం లో తాను కాపాడిన ఆశా , సినీ నటుడు మోతీలాల్, నోబెల్ గ్రహీత కూతుర్ ఈవ్ క్యూరీలతో పాటు మత ఘర్షణ సమయంలో మతోన్మాదులు ఇదే ప్రశ్న , “నీవు హిందువా లేక ముస్లిమా?” అని అడుగుతారు.
ఈ నవలలో చారిత్రక పాత్ర నెహ్రూ కూడా ఉన్నారు. ఒక సారి అన్వర్ , నెహ్రూలు కలిసి పర్యటిస్తూ యునైటెడ్ ప్రావిన్స్ ( నేటి ఉత్తర ప్రదేశ్) లో ఒక గ్రామానికి వెళతారు. అక్కడ మతతత్వ కాంగ్రెసు నేత ఆతిధ్యాన్ని కాదని ఒక రచ్చ బండపై విశ్రమిస్తారు. అపుడు అన్వర్ తన మానసిక వేదన చెప్పినపుడు “ నీవు ముస్లింవే.ఎందుకంటే నీవు పెరిగిన సంస్కృతి అదే…అయితే నీవు హిందువు సహజ సంతానం కాబట్టి…రెండు మతాల దృక్పధాన్ని అర్థం చేసుకోగల పరిస్థితిలో ఉన్నావు” అంటాడు. అన్వర్ ను ఆదర్శాలు, ఆచరణ హేతువాది , జాతీయవాది అయినా మత అస్తిత్వం వదలటం లేదు.
అన్వర్ తనను రెండు మతాల ఐక్యతకు ప్రతీకగా చూస్తాడు. వేశ్య అయిన తన తల్లి జ్ఞాపకం తనను అణచివేతకు గురైన వారిలో ఐక్యం చేస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు మతోన్మాదుల ప్రశ్నకు అతడి స్పందన అదే.
అబ్బాస్ పాత అస్తిత్వాలను అంగీకరించలేదు. కుల, మత, జాతికి అతీతం అయిన ఐక్యత కోరాడు. మతపర జాతీయవాదాన్ని వ్యతిరేకించారు.”హిందువులు, ముస్లింలు ఒకే జాతీయ భారతీయులు- కానీ వారిలో ఉన్మాదులు మాత్రమే తాము వేరని, వేర్వేరు జాతుల వారమని భావిస్తారు” అని నమ్మాడు.
అబ్బాస్ తన రచనలో శ్రామిక వర్గ చైతన్యం పెరుగుదల, పోరాటం, సమర శీలతలను
చిత్రీకరించారు. అయితే గాంధీ, నెహ్రూ ల పట్ల నమ్మకం ఎక్కువ అవటం వల్ల సమస్య.కొన్ని సార్లు గాంధీని సైతం” విదేశీ ప్రభుత్వంతో పాటు ప్రజల్ని అణిచివేస్తున్న భూస్వాములు, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా తిరగబడమని చెప్పనందుకు విమర్శించారు. తన ఇంకిలాబ్ నవలలో బార్డోలి సత్యాగ్రహం, ముంబాయి మిల్లు కార్మికుల సమ్మె, మీరట్ కుట్ర కేసు, చిట్టగాంగ్ తిరుగుబాటులను ప్రస్తావించారు. ఎవరి ఇంకిలాబ్ నినాదం దేశమంతా పాకిందో ఆ భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబు విసిరిన సంఘటనను వివరంగా వర్ణించారు.
అన్వర్ దోస్తు రతన్ తాను రాసిన లేఖలో కార్మిక శక్తి మేలుకుంటోంది అని, అది గాంధీ సాధు వచనాలకు ఎలా లోబడి ఉండదు అని ప్రస్తావిస్తాడు. ముస్లిం లీగ్ వాది వ్యాపారి అయిన ఒమర్, అన్వర్ బాబాయి అంజాద్ అలీలు శ్రామిక వర్గ చైతన్యాన్ని ఈసడించుకుంటారు.
రాష్ట్రాల్లో1937-39ల మధ్య కాంగ్రెసు పేలవమైన పాలనకు రాజ్యాంగ పరమైన, ఆర్థిక పరమైన కారణాలున్నాయి అని నెహ్రూ పాత్ర ద్వారా అబ్బాస్ చెప్పిస్తారు.యునైటెడ్ ప్రావిన్స్ లో తాను ఉండటం వల్ల ప్రగతి శీల చట్టాలు వచ్చాయని, బీహార్ లో కాంగ్రెసు మాటలు, చేతల్లో తేడా వల్ల కిసాన్ సభ, సోషలిస్టు, కమ్యూనిస్టు ఉద్యమాలు వచ్చాయని నెహ్రూ అంటారు.కానీ కాంగ్రెసు లోని అగ్ర నాయకులు, భూస్వాముల మైత్రి గురించి నెహ్రూ పాత్ర ఏమీ చెప్పదు.రాష్ట్రాల్లో అస్కోటి, రాజ్కోట లలో రైతాంగం పాత్ర గురించి అబ్బాస్ రాశారు. నవల్లో గాంధీ ఉపవాస దీక్ష, రాజకీయాల్లో దేవుని ప్రస్తావనలను అన్వర్ అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది.
ప్రపంచం నా గ్రామం నవలలో ఈ వీ రామస్వామి నాయకర్ సామాజిక సంస్కరణ ఉద్యమాన్నీ ప్రస్తావిస్తూ ఆత్మ గౌరవ ఉద్యమం బ్రాహ్మణ బ్రిటీష్ దోపిడిలకు వ్యతిరేకమంటాడు.
జాతీయ ఉద్యమం తర్వాత దశ గురించిన మరో నవల చీలిన హృదయం ( Divided Heart) లోనూ అబ్బాస్ వర్గ వైరుధ్యాలను చిత్రించారు. దీనిలో కథా నాయిక పార్వతి కాన్పూర్లో పేదల దరిద్రం, మురికి తనానికి, ధనికుల సోమరి జీవితాల మధ్య వైరుధ్యం చూస్తుంది. లాభార్జన వ్యవస్థ ఎలా నైతిక, కళా విలువలను మృగ్యం చేస్తుంది అనేది రచయిత చూపిస్తారు. రూపమతి, కళావంతుల కుటుంబ వనిత తన ముఖ్య స్థానం పార్వతి కి పోయిందని అసూయ పడుతుంది. కాని పురుషాధిక్య సమాజంలో రూపమతి కష్టాలు చూసిన పార్వతిలో ఆధిక్యతా భావం పోతుంది. డాక్టర్ శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుని అతని ఊరికి వెళ్ళి గ్రామీణ పేదరికం, ‘ఆత్మరహిత’ దోపిడీలు చూస్తుంది. ఒక భూస్వామి కుటుంబీకుడిగా శ్రీకాంత్ కు దోపిడీలో పాత్ర ఉందని పార్వతి చెప్పినపుడు తాను దయామూర్తినని,తప్పంతా వ్యవస్థదేనని శ్రీకాంత్ ఉదారవాద వాదన చేస్తాడు. ఈ నవలలో గ్రామీణ దోపిడీలో మతం, కులం, వర్గం ఎలా కుమ్మక్కవుతాయి అనేది అబ్బాస్ చూపిస్తారు.
మతం కులాన్ని అలాగే ఉంచి కులీన వర్గాధిక్యత ను కాస్తుంది. దానిని వాడుకుని కులీన వర్గాలు తమ భౌతిక సంపదను వాడి మత వ్యవస్థను బలోపేతం చేస్తాయి. పూజారి, జమీందారు, వడ్డీ వ్యాపారి కలిసి దోపిడీ సాగిస్తారు.
విభిన్న కులాలు కలిసి సహ పంక్తి భోజనం, సహ వాసం చేస్తే కులాలు నశిస్తాయని అబ్బాస్ అభిప్రాయం.
పార్వతి తన అత్తగారు తనను కోడలుగా అంగీకరించకపోవడంతో బాధ పడి దళిత కాలనీకి వెళ్ళి వారి ఆట పాటల్లో కలిసిపోతుంది. వారు జాతీయ ఉద్యమంలోనే కాక రష్యాలో పీడితుల్లాగ తిరగబడాలని ఆశిస్తుంది. మర్నాడు కూడా కాలనీలో సలోమి ఇంటికి వెళ్ళి ఆమెకు ఆర్థిక ఇబ్బంది అవుతుందని ఆమె ఇచ్చిన తీపి పదార్థాలు తినదు. దీనికి సలోమి నొచ్చుకుని “ మా చేతుల్లో మీరెలా తింటారు? అలా ఆలోచించడం కూడా నా తెలివితక్కువ” అనగానే సవాలుగా తీసుకుని పార్వతి ఆమె నడిగి గ్లాసులో మంచినీరు తీసుకుని తాగుతుంది.
అబ్బాస్ తన నవల ప్రపంచం నా గ్రామం నవలలో కూడా మతం, కులం, వర్గాల మధ్య సంబంధాన్ని పరిశీలించారు.అన్వర్ , మిల్స్ ఇద్దరూ పెషావర్ వెళుతూ రైలులో ఖైదీగా ఉన్న ఓ బందిపోటు ను చూస్తారు. హిందూ షావుకార్లను దోచి పేదలకు పంచే తుండా ఢాకూ తన ఊరెళితే తల్లి మొహం చూడాల్సి వస్తుందని రైలు నుంచి దూకి ఆత్మ హత్య చేసుకుంటాడు. అన్వర్ పంజాబ్ లో కూడా హిందూ వడ్డీ వ్యాపారులకు, ముస్లిం రైతాంగానికి మధ్య వైరుధ్యానికి మతం రంగు అద్దటం గమనిస్తాడు. బొంబాయిలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె గురించి అన్వర్ తన తండ్రితో చెప్పినపుడు అక్బరాలీ “ మన మురికిని శుభ్రం చేసేవారిని ఆ మురికి సృష్టించే వారు తక్కువగా చూడటంలో అర్థం లేదు” అంటాడు.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఫాసిజం, ప్రజాస్వామ్యాల మధ్య పోరాట నేపథ్యంలో మారిన వర్గ సమస్యను అర్థం చేసుకోవాలి. ప్రపంచ యువజన కాంగ్రెసులో అన్వర్ ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఒక కులీన స్త్రీ నీ ప్రేమించి జాతీయోద్యమంలో కూడా భూస్వాముల పిల్లలు చేరారని అంటాడు.దానికి బదులుగా మిల్స్ “ జాతీయోద్యమం అన్ని వర్గాలకు అనువైన వేదిక అని, జాతిలో వర్గ కలహాలు తీవ్రమైందాకా వేచి చూస్తే అసలు విషయం తెలుస్తుంది” అంటాడు. ఇంకిలాబ్ నవల్లో కూడా అన్వర్ మిత్రుడు కమ్యూనిస్టు సుభనివస్కి మాట్లాడుతూ “ జాతీయ వాదం అనేది పెట్టుబడిదారులు అధికారాన్ని సొంతం చేసుకునే సాధనం” అంటాడు.
నల్ల జాతీయులు ఇచ్చిన పార్టీలో పాల్గొన్న అన్వర్ అక్కడ తెల్ల, నల్లవారి మధ్య కసిని చూసి ఎవరు మిత్రులో, ఎవరు శత్రువు లో విడమరిచి చెబుతాడు.” ఫాసిజం , సామ్రాజ్య వాదాల చేతుల్లో బాధితులైన తెల్ల వారు అంతా మీ సహజ మిత్రులయితే, ఫాసిస్టులు మీ శత్రువులు. ఒక మనిషిని అతడి చర్మం రంగు బట్టి కాక అతడి దృక్పథం బట్టి తీర్పు చెప్పాలి.”
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో దేశ నిర్దిష్టమైన పరిస్థితికి దూరమైన వర్గ విశ్లేషణ చేయడం కమ్యూనిస్టులకు ఇబ్బంది అవుతుందని అయింది. అబ్బాస్ నవల చీలిన హృదయం లో కమ్యూనిస్టు అజయ్ బోస్ , అతడి అనుచరుడు ఫాసిస్టు వ్యతిరేక పోరు చేస్తారు.అజయ్ పార్వతిని తన కళను ప్రజా యుద్ధంలో విజయానికి వాడమని ఒప్పిస్తాడు.పార్వతి కమ్యూనిస్టుల నిబద్ధత, మెజారిటీ ప్రజల క్రియాశూన్యతలను గుర్తిస్తుంది. అజయ్ తన ఉపన్యాసంలో ప్రజలను తమ పోరాటాలు , సమ్మెలు ద్వారా బ్రిటీషు యుద్ధ యత్నాలను , తద్వారా సోవియట్ యూనియన్ ఉనికిని దెబ్బ తీయవద్దని చెబుతుండగా జనం గుంపులోంచి ఒక రాయి వచ్చి తగులుతుంది. పొరుగున చైనాలో లాగా విముక్తి కాకుండా ఇక్కడ డా.జాతీయ, అంతర్జాతీయ కర్తవ్యాల సమన్వయ లోపం వల్ల భారత కమ్యూనిస్టులు అపనిందల పాలు అయ్యారు. జాతీయ ఉద్యమ సంకిష్టత అర్థం చేసుకోవడం లో లోపాల వల్ల ఇక్కడ పెట్టుబడిదారీ వర్గం అణచివేతకు గురయ్యే వర్గాలు, కులాలు, జాతులపై ఆధిపత్యం చేసే పాలన 1947 ఆగస్టు 15 నాటికి ఏర్పాటు అయింది.
దేశ స్వాతంత్య్ర తరుణంలో వెల్లువెత్తిన చైతన్య భావనలో అబ్బాస్ తన నవలల ద్వారా జాతీయ ఉద్యమ చరిత్రను సృజనాత్మకంగా చిత్రించడం మొదలెట్టి తరువాత కూడా కొనసాగించారు. తన వ్యక్తిగత అనుభవాలను , చారిత్రక వాస్తవాలను కళాత్మకంగా జోడించారు. మనిషి-సమాజం మధ్య సంబంధాన్ని అన్వేషించే రచయితగా ఏ విధంగా బృహత్తర శక్తులు వ్యక్తిని తీర్చి దిద్దుతాయో తెలిపారు.కొన్ని ఊహా జనిత, కఠిన ఆదర్శాలున్నా తన బహుముఖీన రచనా వ్యాసంగం ద్వారా సామ్రాజ్య వాదం, మత తత్వ జాతీయ వాదం, మేధావుల, శ్రామిక వర్గ చైతన్య శక్తుల అణచివేతలకు వ్యతిరేకంగా తనదైన శైలిలో పోరాడారు. ఒక వైపు మత తత్వ జాతీయ వాదం, మరో వైపు రాజ్యాంగ మౌలిక విలువల రక్షణ మోహరించిన నేడు అబ్బాస్ రచనలకు ఎంతో ప్రాసంగికత ఉంది.


డా.జె. రవీంద్రనాథ్
జె. రవీంద్రనాథ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో డాక్టరేట్ డిగ్రీ పొంది తరువాత విశాఖపట్నంలో గాయత్రి ఇంజినీరింగ్ కాలేజీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా చేసి 2022 లో రిటైర్ అయ్యారు. వివిధ జర్నల్స్, పుస్తకాలలో 35 వ్యాసాలు ప్రచురించారు. ఇండియన్ సోషల్ సైన్స్ అకాడమీ నుంచి బసంత్ సర్కార్ మెమోరియల్ గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్నారు.ఎనిమిది సృజనాత్మక రచనలు Sow the Spring, Dove and the Mother Earth , Suburban Sparrows , Empathy as Life , రష్యన్ గీతాలు, ఎద లోతుల్లో, నల్ల కలువ , ఏకాంత యానం ప్రచురించారు.

అబ్బాస్ గారి సాహిత్యం గురించి మంచి పరిచయం
Thank you Sir
Thank you Sir