ఒకానొక అద్భుతఅనుభవం… ఆ తరువాత!

Spread the love

“సిధార్! నువ్వొక అద్భుతం!”  చిరపరచితమైన ఒక తియ్యటి స్వరం గాలి అలల్లో తేలి వచ్చింది ఎక్కడినుండో!

సిద్ధార్థ లో ఒక ఆశ్చర్యం ఎక్కడి నుండి వచ్చిందా స్వరం? ఆ శ్రవణ అనుభవాన్ని మననం చేసుకుంటూ కిటికీ తలుపు తెరిచాడు. వెన్నులో వొణుకు పుట్టించే డిసెంబర్ నెల చల్లటిగాలి  గదిలోకి దూసుకుని వచ్చింది. గాలితో పాటుగా ఒక మెత్తని, మృదువైన, స్పష్టమైన ఆంగ్ల ఉచ్చారణ తో కూడిన స్వరం “సిధార్! నువ్వొక అద్భుతం!”

సిద్దార్ధ కిటికీ తలుపు మూసివేసాడు. సుపరిచితమైన పెర్ఫ్యూమ్ ఉన్మత్త వాసన గది నిండా అలుముకుంది.  తనను ఒక అద్భుతలోకం లో ఓలలాడించిన గత మూడు వారాల కాలం జ్ఞాపకంగా మారి తనను ఆక్రమించుకుంది.

“ఈ పెర్ఫ్యూమ్ పేరేమిటి?” అడిగాడు సిద్దార్ధ్

ఒక రంజింపచేసే చిరునవ్వు సిల్వియా పెదవుల మీద మెరిసింది. “దీని పేరు డూన్! డూన్ అంటే ఏమిటో తెలుసా? ఒట్టి ఇసుక దిబ్బ అనుకుంటావేమో?  కాదు!  నిండు సహారాలో మానవ నేత్ర పరిథిని దాటి వ్యాపించే విస్తారమైన మెత్తటి, మందపాటి ఇసుకపొరలు గాలిలో తేలియాడుతూ నన్ను చుట్టుకుని తాము పరిమళభరితం అవుతూ నన్ను సుగంధ ధూపం లా మార్చడం. డూన్ అంటే ఒక పెర్ఫ్యూమ్ మాత్రమే కాదు అదొక భావన”

సిల్వియా వివరించిన తీరుకు సిద్దార్ధ ముగ్ధుడు అయ్యాడు.

డాక్టర్ చద్దా ఎంత బలవంత పెట్టాడు. “సిద్దూ! ఇది నువ్వు నాకు తప్పకుండా చేయాలి. సిల్వియా  తండ్రి నాకు మంచి మిత్రుడు. డ్రెస్ డెన్    యూనివర్సిటీ లో నేను పరిశోధన చేసేటప్పుడు నాకు చాలా సహాయం చేసాడు. ఆ రుణం ఇప్పుడు తీర్చుకునే సమయం వచ్చింది. కానీ ఏం చేయను? మా ఇంట్లో వీలవదు? అలా అని సిల్వియా తండ్రికి చెప్పలేను. సిల్వియా ఏవో ఓరియంటల్ లాంగ్వేజస్ మీద పరిశోధన చేయడానికి మూడువారాల పాటు ఢిల్లీకి వస్తోంది. ఆమెకు వసతి ఏర్పాటు చేసే బాధ్యత నా మీద పడింది. మా ఇంట్లో అదనంగా ఒక్క గది కూడా లేదు. నీకు తెలుసుగా షీలా పదవతరగతిలోకి వచ్చింది. మరొక అల్టెర్నేటివ్ చూడలేను. ఎందుకంటే డ్రెస్ డెన్ .లో వున్నప్పుడు ఎప్పుడూ వాళ్లింట్లోనే ఉండేవాడిని. నేనిప్పుడు తనను బయట ఉంచితే బావుండదు. సిల్వియా చాలా చిన్నపిల్ల . ఇరవై ఇరవైరెండు వుంటాయేమో!  నీది డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్. ప్రతిదానికీ ఎటాచ్ డ్  వాష్ రూమ్స్ కూడా వున్నాయి కదా! జస్ట్ మూడువారాలు. ప్లీజ్ నా మాట కాదనకు” 

“కానీ, మీకు తెలుసు కదా! నా భార్య కూడా ఇంట్లో లేదు. ఆవిడ ఉంటే నాకేమీ అభ్యంతరం ఉండేది కాదు. వయసులో వున్న ఆడపిల్లను ఎలా నా ఇంట్లో ఎలా వుంచుకోగలను? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?”

“అలా అనకు సిద్దార్దా! నిన్ను  తప్పితే  ఇంకొకరిని ఎవరినీ నేను అడగలేను. ఆ అమ్మాయి చాలా సున్నితంగా పెరిగిన అమ్మాయి. ఈ ఢిల్లీ వాతావరణం అదీ సెట్ అవ్వదేమో అని ఆమె తండ్రి భయపడుతున్నాడు. అందుకే ఆమె బాధ్యత నాకు అప్పగించాడు. అంతే కాదు సిల్వియా ఒక భారతీయ గృహ జీవన అనుభవాన్ని కూడా డాక్యుమెంట్ చేయాలి అనుకుంటోంది.” చద్దా తన పట్టు విడవలేదు

“గృహ జీవన అనుభవం అంటే మీ ఇల్లు అయితేనే సరిపోతుంది. మీ ఇంట్లో అందరూ వున్నారు కదా! మా ఇంట్లో ఉంటే ఏముంటుంది? హోటల్ లో రూమ్ కీ మా ఇంట్లో రూమ్ కీ పెద్ద తేడా ఏముంటుంది? గృహ జీవనం అంటే ఒక కుటుంబం లేకుండా ఎలా?”

“మీ వసంత్ కుంజ్ అపార్ట్మెంట్ కీ హోటల్ కీ తేడా ఉండదా? ప్లీజ్ సిద్దార్దా ! ఈ ఒక్క హెల్ప్ చేయి” చద్దా బాధ పడలేక అప్పటికప్పుడు భార్య మినాతి కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. అటు వైపు నుండి ఏ జవాబూ  రాలేదు కానీ ఈ అరేంజ్మెంట్ పట్ల ఆమె అంత సుముఖంగా లేదని మాత్రం అర్ధం అయింది. 

సిల్వియా ను తీసుకుని వచ్చిన లుఫ్తాన్సా విమానం సరిగ్గా సమయానికే వచ్చింది. సిల్వియా కు స్వాగతం చెప్పడానికి చద్దా, సిద్దార్థ ఇద్దరూ ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. కస్టమ్స్ చెకింగ్ అంతా ముగించుకుని సిల్వియా బయటకు వచ్చేసరికి రెండున్నర గంటలు పట్టింది  . ఒక ట్రాలీ సూట్ కేస్ నెట్టుకుంటూ భుజానికి ఒక పెద్ద సంచి తగిలించుకుని మెల్లగా వస్తున్న ఒక అమ్మాయిని సిల్వియా అని తేలికగానే గుర్తు పట్టగలిగాడు సిద్దార్ధ.  ఐదడుగు ఐదు అంగుళాల పొడవున్న సిల్వియా తన బంగారు రంగు జుట్టును పోనీ టైల్ వేసుకుంటే అది ఆమె భుజాల వరకు వచ్చి ఆమె నడకకి అనుగుణంగా అటూ ఇటూ ఊగిసలాడుతున్నది. సుదీర్ఘ ప్రయాణం చేసిన అలసట ఏదీ ఆ అమ్మాయి చలాకీ కళ్లల్లో కాస్తంత అయినా కనిపించడం లేదు. అప్పుడే అరవిరిసిన గులాబీల చాలా తాజాగా వున్నది ఆమె మొహం. ఆమెను ఒక్కసారి అలా చూసి మొహం పక్కకు తిప్పకున్నాడు సిద్దార్థ. అందమైన అమ్మాయి కనపడగానే కళ్ళు విప్పార్చుకుని ఆబగా, ఆకలిగా  చూసే మగాళ్లు అంటే సిద్దార్ధ కి అస్సలు పడదు.

సిల్వియా దగ్గరకు రాగానే “మై డియర్” అంటూ చద్దా ఆప్యాయంగా సిల్వియా ను దగ్గరకు తీసుకున్నాడు. “ప్రయాణం బాగా సాగిందా?” అని ప్రశ్నిస్తూనే “యువర్ హోస్ట్” అంటూ సిద్ధార్థను  పరిచయం చేసాడు.

“గ్లాడ్ టు మీట్ యూ!’ అని తన చేతిని ముందుకు చాస్తూ “సిల్వియా!” అన్నది. సిద్దార్థ ఆమె తో కరచాలనం చేసాడు. అయితే అది కరచాలనం కూడా కాదు. సిద్దార్ధ ముని వేళ్ళు ఆమె చేతిని సున్నితంగా స్పర్శించాయి అంతే! ఆమె స్పర్శ చాలా చల్లగా వుంది. ముగ్గురూ కలిసి సిద్దార్ధ అపార్ట్మెంట్ కి అతడి కారులోనే వచ్చారు. సిద్దార్థ ఫ్లాట్ లోకి వెళ్ళగానే

“ఇదుగో!ఇదే నీ రూమ్”అంటూ సిల్వియా కి రూమ్ చూపించి

 “దురదృష్ట వశాత్తు నీకు స్వాగతం పలకడానికి సిద్దార్ధ భార్యా పిల్లలు ఇక్కడ లేరు. సిద్దార్ధ భార్య తన నాలుగేళ్ల బాబును తీసుకోవడానికి పుట్టింటికి , ఒడిశా వెళ్ళింది. మరొక బాబునో, పాపనో సిద్దార్దకి కానుకగా ఇవ్వడానికి!” అని చద్దా చెప్పాడు.

“పుట్టింటికా? ఎందుకు? ఇక్కడ ఢిల్లీలో మంచి హాస్పిటల్స్ లేవా?” సిద్దార్ధ వంక నేరుగా చూస్తూ అడిగింది సిల్వియా. ఆమె కళ్ళ లో ఆశ్చర్యం ఆమె గొంతులో కూడా పలికింది. సిద్దార్ధ కొంచెం అసౌకర్యంగా కదిలాడు. రెండు గంటల క్రితం పరిచయం అయిన  సిల్వియా అలా ప్రశ్నించగలదని అతడు ఊహించలేదు.

“పుట్టింట్లో అయితే అమ్మా నాన్న లు వుంటారు కదా. మరింత కేర్ ఉంటుందని” అంటూ చద్దా వివరించబోయాడు కానీ సిల్వియా అదేమీ పట్టించులోలేదు. సిల్వియా కళ్ళలో కనిపించిన చిన్న సందేహాన్ని మాత్రం సిద్దార్ధ స్పష్టంగా చూడగలిగాడు.  “ప్రెగ్నెంట్ అయిన భార్యను భద్రంగా  చూసుకోలేక ఎక్కడో సుదూరంగా ఉన్న తల్లి తండ్రుల దగ్గరకు పంపించిన ఈ మనిషి కొన్ని గంటల క్రితం పరిచయం ఆయన తనను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు?” అన్న సందేహం కలిగిందేమో అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు  సిద్దార్ధ. వెంటనే టాపిక్ మార్చేస్తూ

“సర్ మాతో కలిసి డిన్నర్ చేయండి!” అని ఆహ్వానించాడు సిద్దార్ధ చద్దాని.

“థాంక్యూ సిద్దార్దా ! కానీ ఇప్పుడొక అత్యవసరమైన పని వుంది. వెళ్ళాలి మరొకసారి ఎప్పుడైనా చూద్దాం లే!” అని చద్దా వెళ్ళిపోయాడు. సిల్వియా తనకు ఆకలిగా లేదని “ఒక గ్లాస్ పాలు ఉంటే తాగుతాను అనడం తో సిద్దార్ధ పాలు  ఇస్తే ఆమె తాగి గుడ్ నైట్ చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయింది.

సిల్వియా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ లో భాగంగా వివిధ లైబ్రరీలకు  వెళుతూ ఉండేది. సిద్దార్ధ ఉదయం ఆమెను లైబ్రరీ దగ్గర దింపేసి సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఆమెను పికప్ చేసుకునేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక కాసేపు టి.వి చూసి . కాసేపు మాట్లాడుకుని డిన్నర్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. సిల్వియా తాను పుట్టి పెరిగిన అందమైన చిన్న టౌన్ డ్రెస్ డెన్  గురించి , తాను ఒక ఒపేరా హౌస్ దగ్గర   సాయంత్రం టిక్కెట్లు అమ్మే వుద్యోగం చేస్తూ, ఉదయం క్లాస్ లకు అటెండ్ అయ్యేదానిని అని చెప్పింది. ఒపేరా దగ్గరకు వచ్చే వివిధ రకాల మనుషులు, వాళ్ళ ఆహార్యం, వాళ్ళే మళ్ళీ ఎక్కడైనా బయట కలిస్తే కనిపించే వాళ్ళ ఆహార్యం, ఆ అనుభవాలు చెప్పేది. సిద్దార్ధ కూడా ఏవో కబుర్లు చెప్పేవాడు

సిల్వియా వచ్చిన ఆరో రోజు “ఇవాళ నాకు పనేమీ లేదు. ఖాళీ! షాపింగ్ ఏమైనా చేస్తావా? షాపింగ్ అంటే ఆసక్తి ఉన్నదా?” అని అడిగాడు సిద్దార్ధ.షాపింగ్ మాట వినగానే ఆమె మొహం వెలిగిపోయింది. ఇద్దరూ కలిసి పాలికా  బజార్ కి వెళ్లారు. సిద్దార్ధ కారు రోడ్ కి అటు వైపు పార్క్ చేసాడు.  ఇద్దరూ కలిసి  కారు దిగి షాపింగ్ కాంప్లెక్స్ లోకి  వెళ్ళడానికి రోడ్ దాటేసాగారు. ముందుకు వెళుతూ ఒక్క క్షణం పాటు ఎందుకో వెనక్కు తిరిగి చూసాడు సిద్దార్ధ. సిల్వియా రోడ్ మధ్యలో నిలబడి వుంది. కన్ఫ్యూజింగ్ గా చూస్తున్నది. ఆమెకు రెండు వైపుల నుండీ రెండు పెద్ద కార్లు ఆమె వైపు దూసుకుని వస్తున్నాయి. ఆమె అకస్మాత్తుగా రోడ్ పై కనిపించడం తో ఇద్దరు డ్రైవర్లూ కంగారుపడ్డారు. మరు క్షణం లో సిద్దార్ధ దూసుకుని వస్తున్న కార్లను స్టాప్  స్టాప్ అంటూ సిల్వియా నిలుచున్న వైపు పరుగెత్తాడు. మరో సెకండ్ లో దిక్కులూ చూస్తూ నిలబడిన ఆమెను తన చేతులతో ఎత్తుకుని పక్కకు పరుగులు తీసాడు ట్రాఫిక్ ను తప్పించుకుంటూ. రెండు నిమిషాల పాటు అతడి గుండె దడ  తగ్గలేదు.

“అంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు రోడ్ మీద!” భయం తో సహనాన్ని కోల్పోయి ఆమె మీద అరిచేసాడు. “నీ కేమైనా అర్ధమయిందా? ఏం జరిగి ఉండేదో” ఇంకా కోపంగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు కానీ మొహం అంతా ఎర్రగా అయిపొయింది.

“ఆ రెండు కార్లలో ఏ ఒక్కటి అయినా నీ మీదకు దూసుకుని వస్తే .. ఎంత ప్రమాదం తప్పింది” అతడు ఇంకా ఏదో మాట్లాడుతూనే వున్నాడు.

“ఏం జరిగేది? నేను ఇండియన్ సాయిల్ మీద అమరత్వం పొందేదానిని అంతే కదా! ” ఆమె మెల్లగా నవ్వుతూ అతడి కంగారును, ఆందోళనని ఉపశమింపజేసేలా అన్నది.

“ఏ ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరత్వం పొందేదానివి” అతడి తన్యత ఇంకా తగ్గలేదు 

“నా చేయి పట్టుకుని రోడ్డు దాటించాల్సింది. ఒంటరిగా వదిలేసే బదులు” తన కుడి చేతిని  పిడికిలి లా బిగించి అతడి వైపు చాస్తూ అన్నది సిల్వియా. సిద్దార్ధ మరొక ఆలోచన లేకుండా ఆ చేతిని రెండు చేతులతోనూ పట్టుకున్నాడు. ఆ తరువాత మళ్ళీ కారు ఎక్కేంతవరకూ అతడు ఆమె చేతిని విడిచి పెట్టలేదు.

ఆ సంఘటన వాళ్ళిద్దరిమధ్యా ఉన్న సన్నటి అపరిచిత రేఖ ను తుడిపేసింది. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అతడు రోజూలా బిడియం, అసౌకర్యం ఫీలవలేదు.  ఆ క్షణం అతడొక కొత్త నేస్తాన్ని కనుగొన్నాడు

ఢిల్లీ చుట్టూ పక్కల వున్న టూరిస్ట్ ప్రాంతాలను చూడటానికి ఆ తరువాత రెండు రోజులను ప్లాన్ చేసుకుంది సిల్వియా. ఒక టూరిస్ట్ బాస్ లో టికెట్స్ కూడా బూక చేసుకుంది. కానీ ఇప్పుడుసిద్దార్డ్ ఆ టిక్కెట్లని క్యాన్సిల్ చేయించి ఆమె కు గైడ్ గా వ్యవహరించడానికి తన షెడ్యూల్ మార్చుకున్నాడు. తన టైమ్ టేబుల్ మార్చుకుని, తన క్లాసులను ముందుకు జరిపించుకొని మధ్యాహ్నం నుండి ఫ్రీ అయ్యేట్టు చూసుకున్నాడు, లాల్ ఖిల్లా, కుతుబ్ మినార్, రాజ్ ఘాట్ ఇలా ఒక్కొక్కటీ చూపించాడు. ఆ అపురూప కట్టడాలను సిల్వియా చూస్తున్న తీరు, వాటి గురించి తెలుసుకుంటున్న  విధానం అతడిని అబ్బుర పరచింది. మామూలుగా ఇంటి వంట తప్పిస్తే బయట ఏమీ తినని ఆమెకు రెస్టారెంట్ వంటలను కూడా అతడు రుచి చూపించాడు. సిల్వియా కుల్ఫీ ని చాలా ఇష్టంగా తిన్నది.

ఆ తరువాత ఆమె వున్న అన్నీ  రోజులూ వాళ్లిద్దరూ చాలావరకు కలిసే గడిపారు. జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ వంపు, వంపు దారులలో కలసి నడిచారు. మండీ హౌస్ లోని ఓపెన్ ఎయిర్ థియేటర్ లో  కలసి చూసారు. ఇండియన్ కాఫీ హౌస్ లో డార్క్ కాఫీని కలసి తాగారు. సిద్దార్ధ ఆమెకు ఢిల్లీ చరిత్రను, హిందూ మతం గురించి, ఇస్లామ్ ఇండియాలో ప్రవేశించడం గురించీ, మొఘల్ రాజుల పరిపాలనా విధానాల గురించీ వివరంగా చెప్పాడు. తన సొంత రాష్ట్రం ఒడిషా, కోణార్క్ లోని సూర్యదేవాలయం, పూరీ బీచ్ ఇలా చాలా విషయాలు  చెపితే సిల్వియా తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీల రాజకీయాలు, కలసిపోవాలనుకున్న ప్రజల ఆకాంక్షలు, రెండు దేశాల మధ్యా వున్న సైద్ధాంతిక విబేధాలు, రెండవ ప్రపంచ యుద్ద కాలం లో నాశనం అయిపోయిన డ్రెస్ డెన్ లోని పురాతన చర్చులు, సాంస్కృతిక కట్టడాలు, వాటిని మళ్ళీ పునర్ నిర్మించడానికి జర్మనీ పడుతున్న కష్టమూ ఇలా చాలా చెప్పింది. తనతండ్రి గొప్ప స్కాలర్ అనీ, ఓరియంటల్ లాంగ్వేజస్ లో అతడికి వున్న ఆసక్తి, ఇష్టము , ఆ ఇష్టం తనకు ఎలా వారసత్వంగా వచ్చిందో చెప్పింది. జర్మన్లు తమ భాషను ఎక్కువగా ప్రేమిస్తారని, ఆంగ్లం నేర్చుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరని  చెపుతూ తానెలా ఇంగ్లిష్ నేర్చుకున్నది చెప్పింది.

” సిదార్ నేను తాజ్ మహల్ చూడాలి” అన్నది ఒకరోజు సిల్వియా. “నాన్న తప్పకుండా చూసి రమ్మని చెప్పారు. ఏది మిస్ అయినా తాజ్ మిస్ అవ్వద్దని చెప్పారు ” అన్నది. ఆమె గొంతు లో తప్పదన్న అభ్యర్ధన.

సిల్వియా సిద్దార్ధ పేరును ఎప్పుడూ స్పష్టంగా పలకదు. మొదట్లో సిద్దార్ధ్ అని  ఆ తరువాత సిద్దార్ దగ్గర ఫిక్స్ అయిపొయింది. సిల్వియా అభ్యర్ధన వినగానే “మీ నాన్న కరెక్ట్. ఇండియా వచ్చి తాజ్ చూడకపోతే ఎలా? నువ్వు మరో మూడు రోజులలో వెళ్ళిపోతావు కదా ! అందుకని  మనం రేపు ప్లాన్ చేద్దాం” అన్నాడు

మరునాడు ఆరుగంటలకల్లా ఆగ్రా బయలుదేరారు. వాళ్ళతో సంచి నిండుగా బ్రెడ్, జామ్, బాయిల్డ్ ఎగ్స్, కొన్ని వాటర్ బాటిల్స్. మొదటగా ఆగ్రా కోట దగ్గర ఆగారు. ఆగ్రా కోటను చూసి అబ్బురపడింది. “ఎంత అద్భుతమైననిర్మాణం?” తన్మయత్వం తో అన్నది. ఆగ్రా కోట అంతా కలయ తిరిగిన తరువాత ఆమెను యమునా తీరానికి తీసుకుని వెళ్ళాడు. ఢిల్లీ లో సిద్దార్ధ చూపిన యమున కీ, ఆగ్రా లో వున్న యమునకీ అస్సలు పోలికే లేదు. ఈ అద్భుతమైన ప్రవాహం తో పోలిస్తే అదొక చిన్న నీటి మడుగు మాత్రమే! అతి సన్నటి ఇసుక మేఘాలు వాళ్ళను తాకి వెళ్ళిపోయింది. పొగమంచుతో తడిసిన నందివర్ధనం పువ్వులా వున్న తాజ్ మహల్ వైపు చూపించాడు సిద్దార్థ.

ఆ అద్భుత నిర్మాణాన్ని కళ్ళు విప్పార్చుకుని అది నిజమో, అబద్దమో తేల్చుకోలేని సందిగ్ద స్థితిలో తాజ్ వైపు చూసింది సిల్వియా. ఆమె ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతిని ఇష్టంగా చూస్తున్నాడు సిద్దార్ధ.

 “మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ పైన ప్రేమ చిహ్నంగా ఈ తాజ్ మహల్ ను నిర్మించాడు” సిద్దార్ధ్ చెపుతుంటే నమ్మలేనట్టు చూసింది.

 “ఇంత పెద్ద అద్భుత నిర్మాణం ప్రేమ కానుక గా అంకితం చేశాడా? అంటే ఎంతలా ప్రేమించి ఉంటాడు?” భావోద్వేగానికి లోనవుతూ అన్నది సిల్వియా.

ఆ పొగమంచులోనూ చోటు వెతుక్కున్న సూర్య కాంతి నేరుగా సిల్వియా మొహం మీద పడటం తో ఆమె మొహం మెరిసిపోయింది నారింజ రంగు వర్ణం తో. అప్పుడే అర విరిసిన లేలేత పువ్వులాగా వున్నది ఆమె మొహం .  అతి కష్టం మీద ఆమె నుండి కళ్ళు తిప్పుకున్నాడు సిద్దార్ధ.

తిరిగి ఢిల్లీ వెళ్ళేటప్పడు ఇద్దరూ చాలా నిశ్శబ్దంగా వున్నారు. నిజానికి సిద్దార్ధ చాలా ఆబ్సెంట్ మైండెడ్ గా డ్రైవ్ చేసాడు. ఇదీ అని చెప్పలేని, వివరించలేని ఒక దగ్గరితనం వాళ్ళిద్దరి మధ్యా జన్మించింది. అది ఎప్పుడూ, ఎవరూ గుర్తించకుండా గాలిలో తేలియాడుతూ వచ్చే  అతి సున్నితమైన, మాధుర్యభరితమైన పరిమళం లాంటిది. ఆ అనుభూతిని వర్ణించడానికి వాళ్లద్దరిదగ్గరా భాష లేదు.

ఆ రాత్రి శీతాకాలపు నిశ్శబ్దం లో డైనింగ్ రూమ్ లోని కిటికీ దగ్గర నిలుచుని పరదాల లోనుండి దూరంగా వున్న చెరువు వైపు చూస్తూ నిలబడ్డాడు సిద్దార్ధ. చెరువు లోని నీళ్లు అతడికి పూర్తిగా కనపడటం లేదు. పొగమంచు ఆ చెరువు మీద దుప్పటిలాగా కప్పుకుంది. ఒక చిక్కటి శీతగాలి తరగ  కిటికీలోనుండి లోపలకు వచ్చి అతడిని  తాకింది. హఠాతుగా ఒక ఒంటరితనపు ఏకాకి  భావన వణికించింది లేశ మాత్రంగా. అతడి గొంతు తడారి పోయింది. ఎలా ఇంటికి వచ్చారో, ఏమి తిన్నారో ఏదీ అతడికి గుర్తు లేదు. మరొక ఆలోచనకు తావులేకుండా సిల్వియా అతడి హృదయాన్ని, మెదడును ఆక్రమించుకుంది. అతడికి ఆమె తనతో చాలా కాలంగా ఉంటున్నట్టు అనిపించింది. ఆమె వినా గతం కానీ , భవిష్యత్తు కానీ అతడికి ఉన్నట్టు అనిపించడం లేదు. ఒక రహస్య క్షణం లాంటి దగ్గరితనం ఒక శాశ్వతమైన వర్తమానాన్ని సృష్టించినట్టు అనిపించింది. ఆ వర్తమానం అలాగే ఘనీభవించి శాశ్వతంగా ఉండిపోతే బావుండును  అనిపించింది. కానీ అతడికి స్పష్టంగా తెలుసు అది వీడ్కోలు చెప్పవలసిన సమయమని. సిల్వియా తన జీవితంలోకి రాకముందు నిర్మించుకున్న అస్థిర ప్రపంచాన్ని నిస్సహాయంగా చూస్తుంటే  తన ఎదురుగా నిలచిన విషాద మాధుర్యపు నిజ క్షణం.  తనతో తాను  చేస్తున్న యుద్ధం లో ఓటమిని అంగీకరించడానికి ముందు చివరిసారి ఓపికను కూడదీసుకున్నట్టుగా మొహాన్ని కిటికీ రెక్కకు బలంగా అదుముకున్నాడు

” సిధార్! ” చీకటి లోనుండి సిల్వియా పిలుపు సిద్దార్ధ భుజాన్ని మెల్లగా తడుతూ.

“వద్దు, నన్ను ముట్టుకోవద్దు”  బలహీనమైన అరుపులా అతడి గొంతు

ఆమెవెంటనే తన చేతిని వెనక్కు తీసుకుంది. అతడి ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ.  అటు వైపు తిరిగి వున్నసిద్దార్ధ  సిల్వియా వైపు తిరిగాడు. అంత చీకట్లోనూ ఆమె కళ్ళ లోని గాయపడిన భావాన్ని అతడు స్పష్ష్టంగా చూడగలిగాడు.

“ప్లీజ్ ! నన్ను ముట్టుకోవద్దు” అతడు అభ్యర్ధించినట్టుగా అన్నాడు. అలా ముట్టుకోవద్దు అని చెప్పాలని అతడు స్పష్ష్టంగా లోలోపల భావించాడో లేదో కూడా సందేహమే!  సిల్వియా అతడి వైపు తల ఎత్తి  చూసేలోగానే,  అంతకుముందు అతడూ ఎప్పుడూ అనుభవం లోకి రాని  కాంక్షోన్మత్తతను  మించిన బలం తో ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సిల్వియా అతడి గుండెల్లో తల  దాచుకుంది.

ఆ మరునాడు అంతా వాళ్లిద్దరూ గది  వదిలి బయటకు రాలేదు. సిల్వియా స్వయంగా చికెన్ చేసింది. సిద్దార్ధ ఒక షాంపేన్ బాటిల్ తీసుకుని వచ్చాడు. చికెన్ తో నంచుకోవడానికి. డైనింగ్ టేబిల్ మీద ఒక కొవ్వొత్తి వెలిగించాడు. మ్యూజిక్ సిస్టం లో క్యాసెట్ ఉంచాడు. చౌరాసియా వేణువు  ప్రశాంతతను అలలు అలలు గా గాలిలో వ్యాపింపచేస్తున్నది. నిశ్శబ్దంగా ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ వాళ్లిద్దరూ. సమయం అలా గడచి పోతూనే వుంది. చౌరాసియా ప్రాణాలు తోడేస్తూనే వున్నాడు. గోడమీది గడియారం నిశ్శబ్దాన్ని భంగపరచింది. సిద్దార్ధ కళ్ళు గడియారం వైపు చూశాయి. తన జీవితంలోని అత్యద్భుతమైన సమయం క్షణం వెంట క్షణం గా జారిపోతున్నదని  అతడికి అర్ధం అవుతున్నది. వేణువు లోని ఒక విషాద గమకం అతడిలో ఒక సెన్స్ ఆఫ్ లాస్ ను నింపింది. ఆ భావాన్ని తనలోనుండి బయటకు పంపడానికి అతడు ఎంత ప్రయత్నం చేసినా అది అతడిని వీడడం లేదు.

“సిధార్! నువ్వొక అద్భుతం!”   సిల్వియా తన కుర్చీ లో నుండి లేచి సిద్దార్ధ వెనుకగా వచ్చి నిలిచింది. అతడి మెడ చుట్టూ చేతులు వేసి కొంచెం ముందుకు వంగి అతడి తల మీద తన గడ్డాన్ని ఆనించింది. కొన్ని ఆరాధనాపూర్వకమైన మాటలు, కొన్ని ఇష్టమైన మాటలు, కొన్నిపాణప్రదమైన మాటలు ఆమె నుండి అతడిలోకి ప్రవేశించి అతడు నమ్మలేని, అదొకటి ఉంటుంది అని ఊహించలేని ఒకానొక పురానవ  ప్రాకృతిక అనుభవాన్ని అతడికి ఇచ్చాయి

వీడ్కోలు చెప్పే రోజు, విడిపోయే రోజు ఉదయించనే ఉదయించింది.

సిద్దార్ధ  గదిలోకి వెళ్లే సరికి సిల్వియా ప్రయాణానికి సర్దుకుంటూ బిజీగా వుంది. బెడ్ నిండా గాడి నిండా వివిధ సందర్భాలలో అతడు ఆమెకు ఇచ్చిన బహుమతులు చెల్లా చెదురు గా పడి వున్నాయి. ఆమె ఒక్కొక్కటే తీసుకుంటూ బాగ్స్ లో సర్దుకుంటున్నది. అతడు లోపలకు వచ్చేసరికి చేస్తున్న పనికి కాస్త విరామం ఇచ్చి

“నువ్వు ఎప్పుడైనా డ్రెస్ డెన్ వస్తావా?” అని అడిగింది అతడిని చూస్తూ . సిద్దార్ధ బలహీనంగా తలూపాడు.

‘నువ్వు డ్రెస్ డెన్ వస్తే మనిద్దరం ఎల్బె నదీ తీరం లో విహరిద్దాము. మా నది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసా? అది నదా  లేక చిన్న సముద్ర శాఖా అని కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంటుంది. నదీ తీరం వెంట ఇసుకతిన్నెల మీద మనం నడుచుకుంటూ వెళదాము” మాట్లాడుతూ మాట్లాడుతూ తలెత్తి సిద్దార్ధ వంక చూసింది.

చిరకాలంగా తన దగ్గర వున్న అత్యంత విలువైన వస్తువును దేన్నో పోగట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అతడున్నాడు. అతడికేమి చెప్పాలో నిజంగా అర్ధం కాలేదు.

“ఏమంటావు? వస్తావా?” సిల్వియా మళ్ళీ రెట్టించింది. సిద్దార్ధ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  బహుశా తన గొంతు మీద తనకే నమ్మకం లేదేమో

“ఫ్లైట్ టైమ్ అవుతోంది! ఇంకా రెడీ కాలేదా?” అంటూ చద్దా వచ్చాడు.

సిల్వియా సెక్యూరిటీ చెక్ వైపు వెళుతుంటే రెప్ప వాల్చకుండా ఆమె వైపే చూడసాగాడు సిద్దార్ధ. తన జీవితంలోని అత్యద్భుతమైన కొన్ని క్షణాలు మానవ రూపం దాల్చి జీన్స్ టీ షర్ట్ లో వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. సెక్యూరిటీ చెక్ గేట్ దగ్గరకు వెళ్ళడానికి ఒక్క సెకను ముందు సిల్వియా వెను తిరిగి చేయి ఊపింది. ఆమె కళ్ళ నుండి కొన్ని నీటిచుక్కలు బుగ్గలమీదకు జారీ వుంటాయని అతడూహించాడు.

“వెనక్కు వచ్చేయి సిల్వియా! వెనక్కు వచ్చేయి” సిద్దార్ధ గొంతెత్తి అరచి చెప్పాలనుకున్నాడు కానీ మాట మధ్యలోనే ఆగిపోయింది. దృష్టిని దాటి సిల్వియా వెళ్ళిపోయింది

సున్నితమైన ఆమె పెర్ఫ్యూమ్ పరిమళం ఇంకా అతడి చుట్టూ తిరుగుతూనే వుంది. సిద్దార్ధ గట్టిగా ఊపిరి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. తనకిష్టమైన ఆమె సాహచర్యం “సిధార్ నువ్వొక అద్భుతం” అని  చెవిలో గుసగుసగా వినిపిస్తున్నట్టే వున్నది

ఫోన్ గట్టిగా మోగడం తో ఊహల్లోనుండి భూమి మీదకు వచ్చాడు సిద్దార్ధ

“హలో “

“ఇంట్లో లేవా? ఎంత సేపటినుండి ఫోన్ చేస్తున్నానో తెలుసా?” అటు వైపు నుండి మినాతి

“ఓహ్! నేను  సిల్వియా కి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను”

“ఎవరు?”

“నీకు చెప్పాను కదా! జర్మనీ అమ్మాయి. చద్దా మన ఇంట్లో ఏకామ డేషన్ ఇవ్వమంటున్నాడు అని చెప్పాను కదా!”

అటువైపు నుండి కొంత సేపు ఆలోచనాత్మక నిశ్శబ్దం. “అవును గుర్తుంది. కానీ నేను లేకుండా ఆ అమ్మాయి ఎలా మనింట్లో ఉంటుంది? చద్దా తన ఇంటికి ఎందుకు తీసుకుని వెళ్ళలేదు?” ఆమె గొంతులో ఒక నిందారోపణ

“నాకు అర్ధం అయింది” సిద్దార్ధ సాధ్యమైనంత సహజంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ” కానీ చద్దా నన్ను చాలా బలవంతం చేసాడు. అతడెలా బలవంత పెడతాడో నీకు తెలుసు కదా! నన్ను మాట్లాడనివ్వలేదు.” నచ్చచెప్పబోయాడు. మినాతి మాట్లాడలేదు

సిద్దార్ధ టాపిక్ డైవర్ట్ చేస్తూ

 ” బాబు ఎలా వున్నాడు? నువ్వెలా వున్నావు? అసలే వొట్టి మనిషివి కూడా కాదు.  ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి”  సిద్దార్ధ గొంతులో అపరాధ భావన దాచాలన్నా దాగలేదు

సిద్దార్ధ మాటలు పట్టించుకోకుండా “నేనిది తేలికగా వదలను. చద్దా తోనే మాట్లాడతాను” అటు వైపు నుండి బలంగా ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది

                        ****************

* మినాతి అంటే ఒడియా భాషలో ప్రార్ధన అని అర్ధం

పరమిత శతపథి
వంశీకృష్ణ

Spread the love

One thought on “ఒకానొక అద్భుతఅనుభవం… ఆ తరువాత!

  1. ఒకానొక అద్భుత అనుభవం… ఆ తరువాత… కథ చాలా బాగుంది.. అనుసృజన చేసిన వంశీకృష్ణ గారికి అభినందనలు 🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *