అడవి మల్లి

Spread the love

అడవి భగ భగ మని మండిపోతున్నది.

 మే  మాసం రెండవ వారం. ఉష్ణోగ్రత నలభయ్ ఐదు నుండి యాభయి మధ్య ఊగిసలాడుతున్నది.ఆకాశం కరిగించిన వేడి ని ధారాపాతంగా వున్నది. దాహం తో పిచ్చెక్కిపోయిన సూర్యుడు సృష్టి లోని ప్రతి జీవి నుండీ జీవం లాగేసుకుంటున్నట్టుంది. పశువులు, పక్షులు, మనుషులు ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు ఆ ఆగ్రహోదగ్ర ఆగ్రహ భార్గవుడికి దాసోహం కావడం తప్ప

కొత్తగా వేసిన రహదారి కొండ చుట్టూ పాములా మెలికలు తిరిగింది. ఇంకా కొన్ని చోట్ల రహదారి పని జరుగుతూనే వున్నది.  చిన్న చిన్న గ్రామాలు కొన్ని రహదారి పొడవునా వ్యాపించి వున్నాయి. చిన్న చిన్న గుడిసెలు అడవిలోకి దారితీస్తూ వరుసగా. ఎండిపోయిన కొమ్మలకు బంక మన్ను పూసి చేసిన తడికల్లాంటి గోడలు, వాలుగా వేసిన గడ్డికప్పులు. మలుపు తిరుగుతున్న రహదారికి కొంచెం దూరం లో ఆస్బెస్టాస్ రేకులతో నాలుగైదు గదులతో నిర్మించిన ఇల్లొకటి. అదే ప్రాథమిక పాఠశాల, అదే అంగన్వాడీ కేంద్రం, అదే వయోజన విద్యా కేంద్రం కూడా!

ప్రాధమిక పాఠశాల కి వేసవి సెలవులు కావడం చేత పిల్లలు ఎవరూ రావడం లేదు. కానీ అంగన్వాడీ కి రావలసిన పిల్లలు కూడా ఏమైనారో  తెలియదు కానీ ఒక్కరూ రావడం లేదు.

” మధ్యాహ్నం బోజనానికైనా రావలసిన పిల్లలు. ఎందుకు రావడం లేదు ? బహుశా ఈ ఎండ కి భయపడి తల్లితండ్రులు పంపించడం లేదేమో!” అనుకున్నది రైనా.వంట గ్యాస్ అయిపోయి నాలుగు రోజులయింది. కరెంట్ పూర్తిగా గ్రామం అంతా పోయింది. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. ఈ ఎండ లో   కట్టెల పొయ్యి మీద వంట చేయడం అంటే భగభగ మండే పొయ్యిలో వేగిపోవడమే. ఇంటిముందే కాదు ఇల్లు కూడా నిప్పుల కొలిమి లాగే వుంది. ఆస్బెస్టాస్ రేకులను చీల్చుకుని మరీ ఎండ ప్రతాపం చూపించడం తో. ఇంటి లోపల, ఇంటి ముందు కురుస్తున్న వేడికి ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేదు. మొహం మీద నిమిషానికోసారి నీళ్లు చిలకరించుకుంటూ రైనా ఇంట్లోకి, బయటకు గమ్యం లేనట్టు తిరుగుతున్నది.

 బయట ఏదో మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. “ఈ వేళప్పుడు ఎవరై వుంటారు?” రైనా లో ఆశ్చర్యం  తో కూడిన ప్రశ్న తలెత్తింది. బహుశా టుకు అయి ఉంటాడా? టుకు ఆమె తమ్ముడు. పొద్దున్న అనగా ఏదో  మీటింగ్ వున్నదని, అడవిలోకి చాలా దూరం వెళ్ళాలి అని వెళ్ళాడు. అది చాలా ముఖ్యమైన సమావేశం అనీ, వస్తే రాత్రికి కానీ, లేకపోతే మరునాడు పొద్దున్న కానీ వస్తాను అని చెప్పి వెళ్ళాడు. “ఇప్పుడెవరు వచ్చి వుంటారు?” రైనా ముందు గది  తలుపు తీసి వచ్చింది ఎవరో తెలుసుకోవడానికి వాకిట్లోకి నడిచింది. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ఒకటి బయట ఆగివుంది. తెరచిన తలుపును దాటి   ఆ ఇద్దరి నాలుగు కళ్ళు లోపలకు చూస్తున్నాయి ఇంట్లోచి ఎవరైనా బయటకు వచ్చి “ఏమి కావాలి?” అని అడుగుతారేమో అని. బహుశా వాళ్లిద్దరూ ఈ వూరికి కొత్త కావచ్చు. వూరు పేరేమిటి? అని అడగడానికో, ఈ రహదారి ఎక్కడకు వెళుతుంది అని అడగడానికో, లేదా రహదారి పనులను గురించి వివరణ అడగటానికో కావచ్చు. ఇలా ఎవరో ఒకరు వచ్చి ఎంక్వైరీ చేయడం మామూలే. కానీ వాళ్లిద్దరూ ఆగిన సమయం రైనా ను అసహనానికి గురిచేసింది. మిట్ట మధ్యాహ్నం పూట,ఎవరూ లేనప్పుడు వాళ్లిద్దరూ రావడం మాత్రం మామూలు విషయం కాదు. సరిగ్గా రబీ జానీ కూడా ఇంటి దగ్గరలేకుండా పోయాడు. ఆలోచనల్లో అలాగే స్థిరంగా నిలబడి వాళ్ళు వెళ్ళిపోతారేమోనని ఎదురుచూస్తున్నది రైనా. కానీ వాళ్లిద్దరూ వెళ్లనూ లేదు. మోటార్ సైకిల్ నుండి కిందకు దిగనూలేదు. దగ్గరలో ఒక్క మనిషి కూడా లేడు అవసరం అయితే పిలవడానికి. రైనా కి కొంచెం భయం కలిగింది. తలుపు మూసేసి లోపలకు వెళ్లి గట్టిగా బిగించుకుంటే సరి. ఇలా ఆమె ఆలోచనల్లో ఉండగానే

“కాసిని మంచినీళ్లు ఇస్తారా?”

లోపలకు వెళ్లి తలుపు మూసుకుందాము అనుకున్నదల్లా ఆ ఇద్దరిలో ఒకరి మాట విని వెనక్కుతిరిగి చూసింది రైనా. ఇద్దరిలో ఒకరు, టీ.షర్ట్ వేసుకున్న అతను రైనా వంక ఆశగా చూస్తున్నాడు. ఇద్దరూ టోపీలు పెట్టుకుని ఉన్నారు. బహుశా రహదారి మీద జరుగుతున్న  పనుల దగ్గరకు వెళుతున్నారేమో, దాహానికి ఆగి వుంటారు అనుకుంది రైనా. మోటార్ సైకిల్ దిగి, స్టాండ్ వేసి ఆమె వైపు నాలుగడుగులు ముందుకు వేశారు ఇద్దరూ. ఆమెకు ఒక్క క్షణం పాటు భయం కలిగింది. లోపలకు వెళ్లి వాళ్ళ మొహాల మీదే తలుపు వేసుకుందాము అనుకుంది, కానీ వెంటనే ఆమెలో వివేకం మేల్కొంది. దాహం తో వాళ్ళ గొంతు నిజంగానే పిడచకట్టుకుని పోయి ఉండవచ్చు. ఆమె ఇలా అనుకుంటూ ఉండగానే

“ఇక్కడ బాగా వేడిగా వున్నది. మా గొంతులు ఎండిపోతున్నాయి. కాసేపు ఆగుదాము అనుకుంటే కనీసం ఒక చెట్టుకాదు కదా చిన్న షెల్టర్ కూడా లేదు.” మోటార్ సైకిల్ నడుపుతూ వచ్చిన అతను అని వరండా లో కూర్చున్నాడు ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండానే. రెండవ అతను వాకిట్లోనే నిలబడి ఎటో చూస్తున్నాడు. ఆమె వెంటనే లోపలకు వెళ్లి రెండు గ్లాసులతో నీళ్లు తీసుకుని వచ్చింది. వాళ్లిద్దరూ ఆ రెండు గ్లాసులను దాదాపు లాక్కున్నంత పనిచేసి గబగబా గుటకలు వేస్తూ తాగేశారు.

“ఇంకాసిని”

మోటారు సైకిల్ నడిపే వ్యక్తి ఆమె వంక చూడకుండానే మళ్ళీ అడిగాడు. ఆ గొంతులోని దాహాన్ని కనిపెట్టిన ఆమె మళ్ళీ లోపలకు వెళ్లి రెండు గ్లాసుల నిండా నీళ్లు తీసుకుని వచ్చింది. నీళ్లు తాగాక, మోటారు సైకిల్ నడిపే వ్యక్తి ఒక ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఆమెకు ఇచ్చి

“కాస్త దీన్నిండా కూడా నీళ్లు పట్టి ఇస్తారా?” అని చాలా వినయంగా అడిగాడు.

రైనా మారుమాట్లాడకుండా ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంది కానీ లోపల ఇంకా ఆందోళన తొలగి పోలేదు. ఎవరు వాళ్ళు? తను ఒంటరిగా వున్నదని తెలుసుకునే వచ్చారా? లోపలకు నెట్టుకుని వచ్చేస్తే ఎలా? ఇలా భయ పడుతూనే ప్లాస్టిక్ బాటిల్ నిండా నీళ్లు నింపుకుని వచ్చి వాళ్లకు ఇచ్చింది. ఆమె భయపడినట్లు ఏమీ జరగలేదు.

“మెనీ థాంక్స్!” మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి బండి స్టార్ట్ చేస్తూ ఆమె వంక చూసి చిరునవ్వుతో చెప్పాడు. ఆమె లోపలకు వెళ్ళిపోయి తలుపు మూసుకుని దానికి ఆనుకుని నిలబడింది కాసేపు. అప్రయత్నంగా ఆమె నోటి నుండి “మెనీ థాంక్స్!” అన్న మాట వెలువడి ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు విరిసింది.

అంగన్ వాడీ కోసం రెండు కుండల నిండా నీరు తీసుకుని రావడము, ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే వంట చెరకు తీసుకురావడము, వాకిట్లో ఉన్న గాబు నిండా నీళ్లు నింపి, వంట పాత్రలు కడగడము రబీ జానీ చేయవలసిన పనులు. పాఠశాల తెరచి, అంగన్ వాడీ పూర్తిగా నడుస్తూ పిల్లల తో కళ కళ లాడుతూ ఉంటే నీళ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది కనుక మరో నాలుగు ప్లాస్టిక్ బకెట్ల నిండా నీళ్లు నింపడం కూడా రబీ జానీ చేయాలి. ఈ పనులన్నీ రైనా రబీజానీ ని ఉబ్బించి,పొగిడి, వెంటపడి మరీ చేయించుకుంటుంది. ఎందుకంటే రబీ జానీ కి మధ్యాహ్నం భోజనం పెట్టడం తప్పిస్తే వేరే జీత భత్యాలు ఏవీ లేవు. ఆ రోజు ఎందుకనో రబీ జానీ కూడా రాలేదు. రైనా ను ఒక్కదానినీ మండుటెండలో వదిలేసి 

***************

మధ్యాహ్నం దాటి సాయం కాలం లోకి పొద్దు జారుతున్నది. రబీ జానీ ని అంగన్ వాడీ కి కాపలాగా ఉంచి సైకిల్ వేసుకుని మార్కెట్ కి బయలుదేరింది రైనా. కొన్ని పచారీ సరుకులు తెచ్చుకోవాలి. టుకు జాడ లేదు. సాయంత్రం వస్తాను, మరీ ఆలస్యం అయితే రాత్రికి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ రైనా మొబైల్ కూడా తీసుకుని వెళ్ళాడు. నిజానికి మొబైల్ ఎక్కడున్నా ఒకటే. రోజుల తరబడి సిగ్నల్స్ అందవు ఆ ఏరియాలో. రైనా బాధ మొబైల్ గురించి కాదు. టుకు గురించి. రాత్రి రాలేదు. అర్ధరాత్రి దాకా ఆమె ఎదురు చూస్తూ కూర్చున్నది. రాత్రి ఉదయం గా మారిపోయింది. అయినా టుకు రాలేదు. ఆమెలో చిన్నగా ఆందోళన మొదలు అయింది. గత రెండు మూడు నెలలుగా టుకు సరిగా ఇంటికి రావడం లేదు. మార్కెట్ డౌన్ లో పెట్టుకున్న STD బూత్ ను కూడా తెరవడం లేదు.  తీవ్రమైన ఆలోచనల్లో మునిగి పోయి అసంకల్పితంగా సైకిల్ తొక్కుతున్నది రైనా. హఠాతుగా తన పక్కనే “బీప్” అన్న మోటార్ సైకిల్ హారన్ మోగేసరికి ఇహం  లోకి వచ్చింది గబుక్కున   సైకిల్ ఎడమ వైపుకు తిప్పింది.  ఆమె పక్కనే మోటార్ సైకిల్ ఆగింది. చూస్తే, ఎదురుగా నిన్న అంగన్ వాడీ లో మంచి నీళ్లు అడిగిన ఇద్దరిలో ఒక యువకుడు.

“నిన్న మీరిచ్చిన రెండు గ్లాసుల నీళ్లు నా ప్రాణాలు నిలిపాయి. మళ్ళీ థాంక్స్ చెప్పే అవకాశం వస్తే బావుండును ” అన్నాడు అతను. రైనా సైకిల్ దిగి అతడి వంక చిరునవ్వుతో చూసింది. 

“ఇక్కడ ఎప్పుడూ ఇలాగే ఇంత వేడిగా ఉంటుందా?” అతడు తనలో తాను అనుకుంటున్నట్లుగా ఆమెనే ప్రశ్నించాడు. రైనా ఏమీ మాట్లాడలేదు.

“మీది ఈ ఊరేనా?” మళ్ళీ అడిగాడు రైనా ని.

రైనా కాదన్నట్టు అడ్డంగా తల ఊపి ” నేను అంగన్ వాడీ లో పని చేస్తాను. అందుకని అక్కడ ఉంటున్నాను. మాది కేసింగా దగ్గర ఒక పల్లెటూరు.” చాలా మామూలు గా చెప్పింది రైనా 

“నేను ఇక్కడకు రావడం ఇదే మొదటి సారి. వారంరోజులుగా ఈ ఎండలో ఇక్కడే రోడ్డు నిర్మాణ పనులను సూపర్ వైజ్  చేస్తున్నాను” అన్నాడతను.

రైనా మాట్లాడలేదు.

“నా పేరు రతన్ సింగ్. మాది చండీ ఖోల్. నీకు తెలుసా ఆ వూరు?”

రైనా అడ్డంగా తల ఊపింది

“మీరెక్కడికైనా వెళుతున్నారా? లేక ఊరికే అలా సరదాగా  వచ్చారా?”

“మార్కెట్ కి వెళుతున్నాను”

“నేను కూడా మార్కెట్ కె వెళుతున్నాను” అతడి గొంతులో ఒక వుత్స్సహ భరితమైన ఆతురత ధ్వనించింది.

రైనా మాట్లాడకుండా సైకిల్ ఎక్కింది.

“రేపు ఎప్పుడైనా మీ అంగన్ వాడీ కి వస్తే మంచి నీళ్లు ఇస్తారా?” ఉద్దేశ్య పూర్వకంగా రైనా వంక కళ్ళు విప్పార్చుకుని చూస్తూ అడిగాడు అతడు.  రైనా జవాబు చెప్పలేదు కానీ వున్న చిన్న చిరునవ్వు రేఖ ఆమె మొహం మీద విరిసింది

“మళ్ళొకసారి మీకు థాంక్స్!” అంటూ అతడు మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు 

రైనా మార్కెట్లో సరుకులు తీసుకుని వెళ్లేసరికి చీకటి పడింది. దూరం నుండే వరండాలో కూర్చుని వున్న టుకు ను గమనించింది.

“ఎక్కడకు వెళ్లావురా? చిన్న కబురు కూడా లేదు” ఆందోళన ఆమె స్వరం లో

“అక్కా! నీకు అన్ని విషయాలు చెపుతాను కానీ ముందు ఏదైనా ఉంటే తింటానికి పెట్టు. పఖాల ఏమైనా ఉన్నదా?”

రైనా సైకిల్ గోడకు ఆనించి పెట్టి సరుకులు తీసుకుని లోపలకు వెళ్ళింది. ఒక గిన్నె నిండా పఖాల తీసుకుని,మరొక ప్లేట్ లో వేయించిన బంగాళా దుంప ముక్కలు తీసుకుని వచ్చి టుకు కి ఇచ్చింది. టుకు పక్కనే కూర్చుని ఉల్లిపాయ తొక్క తీస్తూ కూర్చుంది.

“వీళ్ళేం అనుకుంటున్నారు అసలు? వాళ్ళ కాళ్ళ క్రింద మమ్మల్ని నలిపివేయగలం అనుకుంటున్నారా? మన రక్తాన్ని పీల్చి పిప్పి చేసి మన నేల మీద ఫ్యాక్టరీలు కట్టగలం అనుకుంటున్నారా?” టుకు చీకట్లోకి చూస్తూ తనలో తానే గొణుక్కున్నాడు పైకి ఆలోచిస్తున్నటుగా. పక్కన అక్క కూర్చున్నది అన్న మాటే మరిచాడు. ఆలోచనలో పడి గిన్నెలోనుండి పఖాల చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకోవడం కూడా మరచిపోయాడు. మనసు ఎక్కడో ఒక దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయి అక్కడ నుండి వెనుకకు రానని అంటున్నది.

“వట్టి వాగుడు కట్టిపెట్టు. రెండు రోజుల నుండి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. సరిగ్గా తినను కూడా లేదు. ముందు ఆ సోది ఆపి పఖాల తిను” అన్నది రైనా నిశ్శబ్దాన్ని చీలుస్తూ

“మనం పోరాటం చేయాలి అక్కా! అంత తేలికగా మనం దీనిని వదిలిపెట్టకూడదు. మన చివరి రక్తపు బొట్టు నేల రాలేంతవరకు మనం పోరాటం చేస్తూనే ఉండాలి. ఆ తరువాత అక్కా నువ్వూ మన గిరిజన మహిళలు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి” ఇంకా చీకట్లోకి చూస్తూనే, జోస్యం చెపుతున్నటుగా అన్నాడు టుకు.

రైనా మాట్లాడలేదు. వాళ్లిద్దరూ అలా కాసేపు నిశబ్దం గా కూర్చున్నారు. గిన్నె లో పఖాల ఖాళీ కావడం తో మరికొంత తీసుకునిరావడానికి లోపలకు వెళ్ళింది రైనా. గిన్నె టుకు కిఅందిస్తూ

“ఈ పిల్లలు అంతా ఏం  చేస్తున్నారు అసలు?” అని తనలో తానే  అర్ధం కానట్టుగా అనుకుంది. టుకు ఏదీ స్పష్టంగా చెప్పడు. ఒకటి, రెండు మాటలు ముక్కలు ముక్కలుగా చెప్తాడు. దట్టమైన అడవిలో ఏవో గ్రామాలలో వాళ్ళు మీటింగ్ లు పెడుతున్నారు. అంతవరకే టుకు చెప్పింది. ఆ మీటింగ్ లు ఏమిటో? ఎందుకు పెడుతున్నారో? ఎవరెవరు వస్తున్నారో తెలుసుకోవాలని ఆమె ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. నిన్నటికి నిన్న అడవిలోకి వెళ్లి రెండురోజులపాటు ఇంటికే రాలేదు. అంటే టుకూ…? భయం తో కూడిన వణుకు ఆమె వెన్నులో జర జరా పాకింది. ఆమె ఒక దీర్ఘ నిశ్వాస తీసుకుని లోపలకు వెళ్ళింది    

***************

 మరో రెండు రోజులలో ఎండ  తీవ్రత కాస్త తగ్గుతుంది అనుకుంటే అది మరింత పెరిగింది. పొద్దున్నే లేచి టుకు ఎక్కడికో వెళ్ళాడు. అతడికోసం రైనా నానబెట్టిన చూడా గుజ్జు తయారు చేసింది. కానీ అతడేమీ తినకుండానే వెళ్ళిపోయాడు. అంగన్ వాడీ పిల్లలు వస్తున్న జాడే లేదు.

బయట మోటారు సైకిల్ శబ్దం వినిపించింది. ఆ శబ్దం కోసమే ఎదురు చూస్తున్నదా అన్నట్టు వేగంగా ఇంట్లోనుండి బయటకు వచ్చింది రైనా. ఆ యువకుడే రతన్ సింగ్. ఈ సారి ఒంటరిగా.

“నా కివాళ చాలా దప్పికగా వుంది. ఒకటి సరిపోదు. రెండు గ్లాసుల నీళ్లు కావాలి” అన్నాడు మోటార్ సైకిల్ నుండి కిందకు దిగి ఇంటి లోపలకి నడుస్తూ. రైనా పెదవుల మీద కనపడీ కనపడని చిన్న నవ్వుతో ఇంట్లోకి వెళ్లి, రెండు చేతులతో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని వచ్చింది.

వరండా లో కూలబడుతూ “మీ ఇంట్లో కరెంట్ ఉన్నదా?” అని అడిగాడు రతన్ సింగ్.

“వున్నది కానీ రెండు మూడు రోజులుగా కరెంట్ లేదు. ఇంట్లో టేబిల్ ఫ్యాన్ వున్నది కానీ కరెంట్ లేకపోతే అది మాత్రం ఎందుకు పనికి వస్తుంది?”

“పెద్ద గాలివాన కానీ, తుఫాన్ కానీ ఏదీ లేదు కదా! కరెంట్ సప్లైయి ఎందుకు లేదు?” అన్నాడు రైనా వంక చూస్తూ

“ఎవరికీ తెలుసు? బహుశా ఎండ వేడికి తీగలు కరిగి పోయి ఉంటాయి. అయినా ఇదేమీ కొత్త కాదు ఇక్కడ. నెలకు పది, పదిహేను రోజులు కరెంట్ లేకపోవడం మాకు మామూలే!”

“ఇక్కడ మ్నాట్లాడటానికి ఎవరూ లేరు. కింద మార్కెట్ లో కూడా! మీ తల్లి తండ్రులు కూడా ఇక్కడే వుంటారా? స్కూల్ కూడా వున్నది కదా!”

“మాఅమ్మా నాన్నా ఇక్కడ వుండరు. నేను మా చిన్న తమ్ముడు ఇక్కడ ఉంటాము. స్కూల్ వుంది కానీ వేసవి సెలవులు కదా మూత పడింది”

“అంగన్ వాడీ కి పిల్లలు రోజూ వస్తారా? టీచర్ ఉన్నదా “

“లేదు స్కూల్ ఉండి. మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు ఎక్కువగా వస్తారు. టీచర్ వున్నారు కానీ అతడు కూడా పిల్లల్లాగే ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు ” 

“మీ తమ్ముడు సంగతి ఏమిటి? చదువుకున్నాడా? ఏం పని చేస్తాడు?”

“పెద్దగా చదువుకోలేదు. మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. ఆ పైన చదివించడానికి ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక చదివించలేదు. మార్కెట్ లో తనకు ఒక STD బూత్ వున్నది. అక్కడే కిరాణా సరుకులు అవీ పెట్టాలనుకుంటున్నాడు” ఆమె నిర్లక్ష్యంగా మాట్లాడటానికి ప్రయత్నం చేసింది కానీ ఆ గొంతు లోని దిగులు ఆ ప్రయత్నాన్ని విఫలం చేసింది.

“సరే! నేనిక వెళతాను. థాంక్యూ సో మచ్ ” అని రతన్ సింగ్ మోటార్ సైకిల్ దగ్గరకు వెళ్లి స్టార్ట్ చేస్తూ “మళ్ళీ రేపు వస్తాను” అన్నాడు. రైనా కి అర్ధం కాలేదు అది వాగ్దానమో  ప్రతిపాదనో. ఆమె మొహం స్వల్పంగా ఎర్రబడింది

మరునాడు మధ్యాహ్నం రైనా కాస్త అసహనం గా వుంది. లోపలకు, బయటకు అటూ ఇటూ చాలా సార్లు తిరిగింది రతన్ సింగ్ వస్తాడేమో అని. అతడి కోసం ఆమె ఎందుకు ఎదురు చూస్తున్నది? అతడు రావాలని ఎందుకు కోరుకుంటున్నది. “అతడు రావాలి అని తానెందుకు కోరుకుంటున్నది? వస్తే ఏమి చెప్పాలి అని అనుకుంటున్నది?”  అని తనను తానే  ప్రశ్నించుకున్నది. ఇదీ అని చెప్పలేని అశాంతి ఆమెను తన గుప్పిటిలోకి తీసుకున్నది. కానీ రతన్ సింగ్ రాలేదు. మధ్యాహ్నం గడిచి పోయింది. ఎండ కాస్త తగ్గింది. రైనా మొహం కడుక్కుని వరండాలో చాప వేసుకుని పడుకుంది. హఠాత్తుగా మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. ఆమె ఒక్కుదుటున లేచి బయటకు పరుగెత్తింది.

“ఇవాళ నాకు దప్పికగా మాత్రమే కాదు. ఆకలి గా కూడా వున్నది. కొంచెం టీ కూడా కావాలి” రతన్ సింగ్ నవ్వుతూ రైనా కి చెప్పాడు. రైనా పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసి ఆమె మొహాన్ని వెలిగించింది.

“మీ తమ్ముడు లేడా? కాస్త ఆలస్యంగా వస్తే అతడు కలుస్తాడేమో అనుకున్నానే”

“లేడు. తను STD బూత్ లో ఉండి ఉంటాడు”

“సరే! టీ కోసం నేనిక్కడ కూర్చుంటాను” అని వరండా లో కూర్చున్నాడు రతన్ సింగ్.

“ఇంట్లో పాలు లేవు” అన్నది రైనా ఇబ్బందిగా

“ఓహ్! అయితే టీ ఆకులు, పంచదార ఉండి ఉంటాయిగా. బ్లాక్ టీ అయినా ఫరవాలేదు” ఆమె వైపు ఒక చిరువవ్వు విదిలించాడు. రైనా క్షణం లో లోపలకి మాయమయింది. ఇంట్లో గ్యాస్ కూడా లేదు. ఏమి చేయాలి? కట్టెల పొయ్యి వెలిగించి చేయాల్సిందే? అసహన పడుతూనే టీ  తయారు చేసి ఒక కప్పులో పోసుకుని,ఒక ప్లాస్టిక్ ప్లేట్ లో నాలుగు బిస్కట్స్ పెట్టుకుని రతన్ సింగ్ దగ్గరకు తెచ్చింది.

“చాలా సేపు పట్టిందే!” అన్నాడు రతన్ సింగ్

 “ఇంట్లో గ్యాస్ లేదు” ఇబ్బందిగా చెప్పి మంచి నీళ్లు తీసుకురావడానికి లోపలకు వెళ్లి తీసుకుని వచ్చింది.

“రా! ఇక్కడ కూర్చో” అన్నాడు రతన్ సింగ్

రైనా మంచినీళ్ల గ్లాసు అతడి పక్కన పెట్టి  కూర్చోకుండా నిలబడింది.

“ఈ గ్రామం ఎంతోకాలం ఇలా ఉండదు. ఇక్కడ కూడా జీవితం మారుతుంది. చాలా తేలికగా వంట గ్యాస్ దొరుకుతుంది. రోజుల తరబడి పవర్ ఫెయిల్యూర్స్ వుండవు. మంచి స్కూల్స్ బహుశా కాలేజీ కూడా రావచ్చు. ఇంకా పెద్ద మార్కెట్ వస్తుంది. ఈ ప్రాంతం పూర్తిగా మారిపోతుంది” రతన్ సింగ్ తన ఎదురుగా నిలబడి ఉన్న   రైనా వైపు సూటిగా చూడకుండానే చెప్పాడు.

రైనా మాట్లాడకుండా అతడు చెప్పేది వింటున్నది.

“మేమిక్కడ ఏం చేస్తున్నామో తెలుసా? ఈ కొండ దగ్గరనుండి అటు చాలా దూరం లో ఉన్న ప్రధాన రహదారి వరకు కనెక్టింగ్ రోడ్ వేస్తున్నాము. ఈ చిన్న రోడ్డు కాదు. ఒక దాని పక్కన ఒకటి ఒకేసారి రెండు పెద్ద వాహనాలు నడిచేలా!” అతడి గొంతులోని భరోసా ఏమాత్రం చెదరలేదు. 

“కొండను బాంబులతో పేల్చి ఖనిజాలు తవ్వుకోవడానికేగా?” రైనా గట్టిగా ఆరోపించింది.

“కచ్చితంగా చెప్పాలంటే అవును. కాదు. కానీ ఏది జరిగినా ఇక్కడి ప్రజల మంచి కోసమే!ప్రాజెక్ట్ వస్తే ఈ గ్రామాల ప్రజల జీవితం మారుతుంది కదా!”

“వాళ్లకు ఏ విధంగా మంచి జరుగుతుంది”

“వాళ్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి. అది మాత్రమే కాదు. వాళ్ళ చేతిలో డబ్బు నిలబడుతుంది. మంచి దుస్తులు లభిస్తాయి వేసుకోవడానికి. వాళ్ళు కూడా నిజమైన  మనుషుల లాగే నాగరికంగా తయారవుతారు” రతన్ సింగ్ చెప్పుకుంటూ పోతున్నాడు

“నిజమైన మనుషులు అంటే ఏమిటి?”రైనా కోపంగా అడిగింది

” మీరు చెపుతున్న నాగరికత తెలిసిన మనుషులు ఇక్కడ చాలా మంది వున్నారు. మిగతా వాళ్ళ లాగే వీళ్లూ ఆనందాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎండాకాలం, శీతాకాలం ఇద్దరి మీదా ఒకేలా తమ ప్రభావాన్ని చూపిస్తుంది. తేడా అల్లా ఒక్కటే. ఇక్కడి వాళ్లకు డబ్బు లేదు. పేదలు. వీళ్ళెప్పుడైనా మీ దయా ధర్మం భిక్ష అడిగారా?” రైనా ఓ రకమైన భావోద్వేగం తో  గట్టిగా మాట్లాడింది

“కానీ నువ్వొకటి ఒప్పుకోవాలి. ఫ్రభుత్వ కార్యకలాపాలతో వాళ్లకు లాభం జరుగుతుంది. మంచి పాఠశాలలు వస్తాయి. మంచి హాస్పిటల్స్  వస్తాయి రక్షిత నీటి సౌకర్యం కోసం బోర్ వెల్స్ వస్తాయి. రావా?”  రతన్ సింగ్ అడిగాడు స్వర స్థాయిని తగ్గించుకుని బుజ్జగిస్తున్నట్టుగా

“కొన్ని మార్పులు వస్తాయి. ఒప్పుకుంటాను కానీ అదంతా కంటి తుడుపు మాత్రమే! ప్రభుత్వ పాఠశాలల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ విలేజ్ డిస్పెన్సరీ లో డాక్టరు ఉండడు. మందులు ఉండవు” చేదు నిజం రైనా గొంతులోనుండి బయటకు వెలువడింది.

ఈలోగా రబీ జాన్ భుజం మీద కావడి పెట్టుకుని రెండు కుండల నిండా నీళ్లు తీసుకుని వచ్చాడు. తలుపు దగ్గర ఒక్క క్షణం ఆగి ముందు రతన్ సింగ్ వైపు, తరువాత రైనా వైపు తేరిపారా చూసాడు. తరువాత లోపలకు వెళ్లి కుండలను వాటి వాటి స్థానం లో ఉంచి  ముసురుకుంటున్న చీకట్లలో బయటకు వెళ్ళిపోయాడు. 

“మనం కాసేపు అలా బయట తిరిగొద్దామా? మీ ఊరు చుట్టూ పక్కల నాక్కాస్త చూసినట్టు ఉంటుంది” అన్నాడు రతన్ సింగ్ చాలా మృదువైన స్వరం తో మెత్తగా. అప్పటి దాకా నడచిన వాడి,వేడి సంవాదాన్ని పక్కన పెడుతూ

రైనా ఒక్క క్షణం లో తలుపు మూసి బయట నుండి గొళ్ళెం పెట్టి తాళం బిగించింది. రెండు అడుగులు రోడ్ మీద నడిచాక అంగన్ వాడీ కి ఎడమ పక్క రోడ్డు లోకి దారి తీసింది. కొండ ప్రాంత గ్రామాలలో వుండే చిన్న చిన్న ఇళ్ళు సైతం ఒకదాని వెనుక ఒకటిగా  కొంచెం దూరం లో ఉంటాయి. ఒక్కొక్క గ్రామానికి నడుమ దూరం పది నుండి పన్నెండు కిలోమీటర్లు పైనే ఉంటుంది. వాళ్లిద్దరూ పక్కపక్కనే నడవసాగారు.

“నువ్వేమైనా చెప్పు. ఇక్కడి ప్రజల జీవితం దుర్భరం. వాళ్ళు కాస్తయినా ఆధునిక  సౌకర్యాల కి నోచుకోకూడదా?” రతన్ సింగ్ మెల్లగా అన్నాడు.

“ఈ ఆధునిక సౌకర్యాల కోసం వాళ్ళెందుకు తమ సాంప్రదాయ పద్దతులను మార్చుకోవాలి. మీ నాగరీకులు తమ పద్ధతులు మార్చుకోవడానికి అంగీకరిస్తారా?” చాలా కాలం నుండి లోలోపల అణచి పెట్టుకున్న మాటలు ఒక్క సారిగా స్వేచ్ఛగా బయటకు వచ్చినట్టు రైనా మాటలు తూటాల్లా బయటకు వచ్చాయి.

“మీరు జీవించే జీవితం అత్యున్నతమైనది “ది బెస్ట్” అని మీరు చెప్పగలరా?”  రైనా మళ్ళీ తానే అన్నది. ” ఈ అమాయకమైన ప్రజలు తమ బతుకు ఏదో  తాము బతికేస్తారు. ఎవ్వరినీ గాయపరచరు. పరాయి సొమ్మును సొంతం చేసుకోవాలని ప్రయత్నించరు. ఏ రకంగా వాళ్ళు మీరు చెప్పే ఆధునికుల కంటే తక్కువ స్థాయి వాళ్ళు”

“నువ్వు చాలా సీరియస్ అవుతున్నావు. నా ఉద్దేశ్యం అది కాదు. ప్రభుత్వం ఏది చేసినా వాళ్ళ మంచి కోసమే. వాళ్లకు ఇవాళ అది అర్ధం కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు వాళ్ళు దాన్ని అర్ధం చేసుకుంటారు. వాళ్ళదైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. ఒప్పుకుంటా! నన్ను నమ్ము వాళ్లకు ఎవరూ హాని చెయ్యాలని అనుకోవడం లేదు” రతన్ సింగ్ అభ్యర్ధిస్తున్నట్టు చెప్పాడు.

వాళ్ళిద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం  చోటు వెతుక్కుంది. “బహుశా అది మంచి ఆలోచనే అయి ఉండవచ్చు. వాళ్ళను శుభ్రపరచి, మంచి దుస్తులు ఇచ్చి అలంకరించి, పంజరం లో పెట్టి లేదా జంతు ప్రదర్శన శాల లో జంతువుల్లా నిలబెట్టి , పట్టణాల నుండి వచ్చే ఆగర్భ శ్రీమంతులైన వారు కళ్ళు విప్పార్చుకుని చూడటం కోసం తయారు చేయటం” రైనా వ్యంగ్యంగా అన్నది.

“వాళ్లంటే నీకు చాలా ప్రేమ ఉన్నట్టుంది” రతన్ గొంతు ప్రశాంతం గా వుంది.

” నేను మూడేళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నాను బాబూ! నన్ను నమ్మండి. ఇక్కడ ఉన్నత ప్రశాంతత మీకు ఎక్కడా దొరకదు” రైనా కూడా అంతే ప్రశాంతంగా చెప్పింది.

“నన్ను బాబూ అనకు. నా పేరు రతన్ సింగ్”

నిశ్శబ్దంగా నడుస్తున్నారు ఇద్దరూ. సూర్యుడు అస్తమించాడు. చీకటి వస్త్రం ఆకాశమంతటా పరచుకుంటున్నది. మెత్తని, మృదువైన గాలి చెట్ల మధ్య నుండి వీస్తూ ఎండ కలిగించిన వేడిని సాంత్వన పరుస్తున్నది.

“ఎంత తియ్యటి వాసన. ఎక్కడినుండి వస్తున్నది?” రతన్ సింగ్ నడుస్తూ నడుస్తూ ఆగిపోయాడు ఆ పరిమళం మూలం ఎక్కడో తెలుసుకోవాలని.

“అటు వైపు మీకు ఎడమ వైపు చూడండి. అదొక అంజూర చెట్టు. అడవి అంజూర. మీరంటున్న ఆ వాసన పండిన ఆ పళ్ళ నుండి వస్తున్నదే! ” అని నడుస్తున్నదల్లా హఠాత్తుగా రైనా కూడా ఆగిపోయింది

“ఈ వాసన మీరు గుర్తుపట్టారా?” అని రతన్ సింగ్ ను అడిగి “ఇది అడవి మల్లెల వాసన. అని పక్కనే ఉన్న పొద నుండి గుప్పెడు తెల్ల పువ్వులను కోసి రతన్ సింగ్ చేతిలో ఉంచింది రైనా

“అడవి మల్లెలు” అందుకుంటున్నప్పుడు రతన్ సింగ్ చేయి రైనా చేతిని తాకింది. అడవి ఆ క్షణం అసాధారణంగా ప్రశాంతంగా వుంది. కొమ్మ నుండి రాలే ఆకుల శబ్దం సైతం స్పష్టంగా వినగలిగేంత నిశ్శబ్దంగా వుంది.రైనా తల కిందకు దించుకుంది. “ఈ తెల్లటి పువ్వులు రాత్రి పూటే ఎందుకు విచ్చుకోవాలి?” అని లోపల అస్పష్టంగా గొణుక్కుంది.

“అన్నీ తెల్లటి పువ్వులే!” అంటూ రతన్ సింగ్ తన రెండు చేతులతో ఆమె మొహాన్ని పైకి లేపి తన దగ్గరకు తెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరి పెదవులు కలుసుకున్నాయి

“రేపు ఇదే సమయానికి నేను మళ్ళీ వస్తాను. మార్కెట్ కి దాటాక రెండు కిలోమీటర్ల  నాకోసం రెండు గదుల చిన్న ఇల్లొకటి కడుతున్నాను. 

ఇప్పుడు నేను అద్దెకు ఉంటున్న ఇల్లు నా వర్క్ ప్లేస్ కి చాలా దూరం. ఇల్లు కట్టటం పూర్తి అయ్యాక నిన్ను అక్కడకు తీసుకుని వెళతాను.”

వాళ్లిద్దరూ చేతిలో చేయి వేసుకుని వెనక్కు తిరిగారు

***************

అంత పొద్దున్నే ఇంటి ముందు రతన్ సింగ్ ను చూసేసరికి రైనా కి ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా వాళ్ళు సాయంత్రం పూత కలుసుకుంటారు. నిన్న సాయంత్రమే రతన్ సింగ్ కొత్తగా కట్టిన ఇంట్లో కొద్దీ సేపు కలిసి గడిపారు. ఇంత  పొద్దున్నే పరుగెత్తుకుంటూ రావలసిన అవసరం ఏమొచ్చింది?

అదృష్టవశాత్తు టుకు ఇంట్లో లేడు. నిన్న సాయంత్రమే బయటకు వెళ్ళాడు. ఇంతవరకు ఇంటికి రాలేదు. రైనా గబగబా రతన్ సింగ్ దగ్గరకు పరుగెత్తింది. మోటార్ సైకిల్ మీద పక్కకు కూర్చున్నాడు రతన్ సింగ్. మొహం లో చెప్పలేనంత కంగారు. జుట్టు చెదిరిపోయి వుంది. కళ్ళు ఉబ్బి ఎర్రగా వున్నాయి. ఒక తెలియని భయం ఏదో రైనా ను చుట్టుముట్టేసింది. ఏం జరిగివుంటుంది?

“టుకు ఎక్కడున్నాడు? ఇంట్లో వున్నాడా?” ఇబ్బందిగా అడిగాడు రతన్ సింగ్

“లేదు. బహుశా తన STD బూత్ లో వుంది ఉంటాడు.”

“ఎప్పుడు వెళ్ళాడు?”

“పొద్దున్నే!ఎందుకు?ఏమైంది?” రైనా గొంతు కొంచెం వొణికింది

“ప్రదీప్ ను ఎవరో హత్య చేశారు. పొట్టలో పొడిచి పొడిచి చంపారు.  ఇవాళ పొద్దున్నేమార్కెట్లో ప్రదీప్ బాడీ దొరికింది. పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఎవరో కానీ తప్పించుకోలేరు”

రైనా మాట పెగలక మౌనంగా అలా నిలబడిపోయింది. మొదటిసారి ప్రదీప్ ను ఆమె మిట్టమధ్యాహ్నం మోటార్ సైకిల్ ఆపి మంచినీళ్లు అడిగినప్పుడు చూసింది. ఆ తరువాత రెండు మూడు సార్లు రతన్ సింగ్ కొత్త ఇంట్లో చూసింది. ఎవరు చంపి  వుంటారు?

“సరే! నేనిక వెళతాను. తరువాత మాట్లాడుకుందాం” అని రతన్ సింగ్ వెళ్ళిపోయాడు. రైనా అలాగే వరండాలో గోడను ఆనుకుని కూలబడిపోయింది. ఆమె మనసంతా గందరగోళంగా వుంది. ప్రదీప్ ను ఎవరు చంపి వుంటారు? పొద్దున్నే వెళ్ళాడు అని తను  రతన్ సింగ్ కి అబద్దం చెప్పింది కానీ నిన్న మధ్యాహ్నం నుండి టుకు ఎక్కడకు వెళ్లి ఉంటాడు? టుకు కి ఏమైనా సంబంధం ఉండి  ఉంటుందా? లేదు…. లేదు టుకు అలాంటివాడు కాడు. హత్య చేసేంత ధైర్యం కానీ, క్రూరత్వం కానీ టుకుకు లేవు. వాడెంత సున్నిత హృదయుడో తనకు తెలియదా? పోయినేడు స్కూళ్ల ఇనస్పెక్టర్ కుందేళ్ళను వేటాడటానికి రమ్మంటేనే వాడు వెళ్ళలేదు. “కుందేళ్ళను వేటాడటం నాకు నచ్చదు” అని ఇనస్పెక్టర్ నే వారించాడు.  నచ్చని విషయాలపట్ల వాడేంత మొండిగా, గట్టిగా  ఉంటాడో తనకు తెలియదా?

“నువ్వా కాంట్రాక్టర్ ని ఎందుకు తరచూ కలుస్తున్నావు?” అని అడిగాడు టుకు కొన్నాళ్ల క్రితం

“ఊరికే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. అందులో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు” అన్నది రైనా కంగారును కప్పిపుచ్చుకుంటూ

“కానీ అక్కా! జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు. వాళ్ళు సిటీ నుండి ఇక్కడకు వచ్చింది మన కొండలను బ్లాస్ట్ చేసి ఖనిజాలను దోచుకోవడానికి, మన ఇళ్ళనుండి మనలని దూరం చేయడానికి. వాళ్ళతో మనకేం పని లేదు ?”  అన్నాడు టుకు బాధగా

 రైనా ఏమీ మాట్లాడలేదు. తమ్ముడితో ఏమి మాట్లాడగలుగుతుంది. టుకు చాలా తరచుగా బయటే గడుపుతున్నాడు. రతన్ సింగ్ తో తాను ప్రేమలో వున్నాను అని తన తమ్ముడికి చెప్పలేదు. యిప్పుడు పెళ్లి చేసుకుందాము అని తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఎలా చెప్పగలదు  తాను. రతన్ సింగ్ గురించి ఆలోచిస్తే  టుకు అనుకున్నట్టుగా అతడు చెడ్డవాడు కాదు అనే అనిపిస్తోంది.రతన్ సింగ్ చాలా జాలి గుండె కలవాడు. గిరిజనులు అంటే సానుభూతి వున్నా వాడూనూ.. ఏదో ఒక రోజు తమ్ముడితో ఇదంతా చెప్పి అతడిని ఒప్పించాలి అనుకున్నది. కానీ హఠాత్తుగా ఇప్పుడు రతన్ సింగ్ స్నేహితుడు ప్రదీప్ హత్య కు గురికావడం. ఆమె ప్రణాళికలు అన్నీ వ్యర్థం అయినాయి.

సాయంత్రం అయింది. ఇంకా టుకు రాలేదు.అతడికోసం ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నది. రాత్రి గడచింది. మరొక రోజు. అలా మరొకరోజు, మరొకరోజు నాలుగు రోజులు గడిచాయి. ఐదో రోజు రాత్రి తలుపులు బిగించి పడుకుంది రైనా. తలుపు మీద మెల్లగా తట్టిన చప్పుడు అయింది. ఆమె వొంట్లోకి భయం వెల్లువలా పాకింది

“అక్కా! నేను తలుపు తీయి” అటు వైపు నుండి టుకు గొంతు వినిపించింది. రైనా తలుపు తీసింది. టుకు తో పాటు మరో నలుగురైదుగురు యువకులు బయట నిలబడి వున్నారు.

“తినడానికి ఏమైనా ఉన్నదా?” అడిగాడు టుకు

ఆ రాత్రి రైనా వంట చేయలేదు. అసలామె ఏదీ ఆలోచించే స్థితి లో లేదు. గబగబా వంట గదిలోకి  వెళ్లి  నీళ్లలో కొన్ని అటుకులు నానబెట్టి నీళ్లు ఒంపేసి, కొంచెం పంచదార వేసి ఒక గిన్నె లో తీసుకుని వచ్చి టుకు కి అతడి స్నేహితులకు ఇచ్చి అలసిపోయినట్టుగా నేల మీద కూలబడింది.

“అక్కా! పోలీసులు మా వెంట పడుతున్నారు. నిజానికి అతడిని మేము చంపలేదు. ఎవరో చంపారు. కానీ పోలీసులు మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు.” అని శ్వాస తీసుకోవడానికి ఒక్క క్షణం ఆగాడు. టుకు స్నేహితుల దగ్గర ఉన్న రివాల్వర్, కత్తుల వైపు రైనా చూపు మళ్లింది. వాటిని చూడగానే ఆమె పామును చూసినట్టు ఉలిక్కిపడింది. అక్క ఉలికిపాటు చూసి

 “ఆ ఆయుధాలు అన్నీ మా ఆత్మ రక్షణ కోసమే! పోలీసుల నుండి తప్పించుకోవడానికి మేము అక్కడక్కడ తల దాచుకుంటున్నాము.నీ దగ్గర కొంచెం డబ్బు ఏమైనా ఉన్నదా?”  టుకు అసహనం నిండిన స్వరం తో అడిగాడు

రైనా తన చిన్నపెట్టె తెరచి లోపల ఉన్న డబ్బంతా గుమ్మరించింది. చిల్లర నాణేలు కూడా కలిపితే మొత్తం ఐదు వందల యాభయ్ ఆరు రూపాయలైనాయి. ఆ మొత్తం తమ్ముడికి ఇచ్చింది.వాళ్ళా డబ్బు తీసుకుని వెనుక ద్వారం నుండి వెళ్లి చీకట్లో కలిసిపోయారు

కాళ్లలో సత్తువ అంతా ఎవరో తీసివేసినట్టు నిలబడిన చోటే కూలబడిపోయింది రైనా. ఆ తరువాత రాత్రంతా ఆమె నిద్ర పోలేదు. ఒక రకమైన భయాందోళనల మధ్య ఆమె ఊగిసలాడుతూ ఉండిపోయింది. తెల్లవారి బాగా పొద్దెక్కాక గానీ లేవలేదు. లేచి ఒకటి రెండు పనులు చేసుకునేసరికి కొంతమంది అంగన్ వాడీ పిల్లలు వచ్చారు. వాళ్లకు ఒక పాట నేర్పి ప్రాక్టీస్ చేయమన్నది. వాళ్ళ కోసం అన్నం వండాలి కానీ ఓపిక లేక, వంట చేసే మనసు లేక, ఆలోచన విరమించుకుని వాళ్లకు తలా నాలుగు బిస్కెట్స్ ఇచ్చి పంపించింది. మధ్యాహ్నానికి రబీ జానీ వచ్చాడు “నీళ్లు తేమంటారా?” అంటూ

ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా “నువ్వు రతన్ సింగ్ ను చూసావా?” అని అడిగింది. రబీ జానీ లేదు అని తలాడించాడు.

రబీ జానీ వెళ్ళిపోగానే, తలుపు తాళం వేసి రతన్ సింగ్ ఇంటి వైపు నడిచింది. మోటార్ సైకిల్ మీద అతడు ఏ క్షణమైనా ఎదురు పడతాడు అని ఊహిస్తూ. కానీ రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది. మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న  రతన్ సింగ్ ఇంటికి చేరేసరికి ఆమె అలసిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఆమెను నిరాశపరుస్తూ రతన్ సింగ్ ఇంటి తలుపులు మూసివేసి వున్నాయి. బయట నుండి వేసిన తాళం కనిపిస్తోంది. గస పోస్తూ అలాగే వరండాలో కూర్చుంది నడిచి నడిచి అలసిన కాళ్లకు కాస్త విశ్రాంతి నిద్దామని.

దాహం తో పిడచ కట్టుకుపోయిన ఆమె గొంతు ను తడపడానికి మనిషి కాదు కదా చిన్న పురుగు కూడా లేదు ఆ సమయం లో అక్కడ. ఆమె లేచి పరుగెడుతూ,నడుస్తూ అంగన్ వాడీ  చేరుకుంది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. తెల్లవారాక ఎలాగైనా ఆ రోజు రతన్ సింగ్ జాడ కనుక్కోవాలి అని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. ఇంట్లో లేకపోతే మార్కెట్ లో అతడు వుండే తావులు అన్నీ వెతకాలని అనుకున్నది.

ఎలాగైనా రతన్ సింగ్ ను కలుసుకుని అతడినీ టుకును ఒకచోట చేర్చాలి. టుకు మనసులో ఉన్న అనుమానాలు, రతన్ సింగ్ మనసులో వున్నా సందేహాలు నివృత్తి చేయాలి అని నిర్ణయించుకుంది. అవే  మాటలు ఒక ప్రార్ధన చదువుకున్నట్టుగా పదే, పదే  మననం చేసుకుంది. సాయంత్రం అయ్యేంతవరకు కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటకు తిరిగింది.సూర్యాస్తమయం అయ్యేంతవరకు కూడా ఆగకుండా ఇంటికి తాళం వేసి సైకిల్ ఎక్కి బయలుదేరింది. రతన్ సింగ్ ఇంటికి కొంత దూరం లో పొదల మాటున తన సైకిల్ ఎవరికీ కనపడకుండా దాచిపెట్టి

ఇంటికి వెనుక వైపు తనను ఎవరూ చూడకుండా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. వెనుక తలుపు తెరచే వుంది. ఇంటి పక్కన ఒక పెద్ద కార్ పార్క్ చేసి వుంది.

లోపలకు వెళ్లాలా వద్దా అని ఒక్క క్షణం పాటు సందేహం లో పడింది. లోపల రతన్ సింగ్ ఎవరైనా స్నేహితులతో కలసి ఉంటే వెళ్లడం బావోదు. అతడినే బయటకు రమ్మంటే సరి. ఏదీ తేల్చుకోకుండానే అడుగులో అడుగు వేసుకుంటూ వెనుక తలుపు నుండి లోపలకు వెళ్ళడానికి బదులు ఎడమ పక్కకి తిరిగి కిటికీ కిందకు చేరుకుంది.కాళీ బొటన వేళ్ళ మీద నిలబడి లోపలకు దృష్టి సారించింది. గాడి లోపల నుండి నవ్వులు పెద్దగా వినిపిస్తున్నాయి. మాటలు కూడా

“ఈ గిరిజనులు ఉన్నారే,వీళ్ళు వొట్టి  అమాయకులు. అందరినీ భలే నమ్మేస్తారు. తమ కాళ్ళను కిందనుండి కోసేస్తున్నా సరే సందేహపడరు” ఎవరో అనడం రైనా కి వినిపించింది. అది ఎవరో కాదు. రతన్ సింగ్ గొంతే! ఆమె తేలికగానే గుర్తు పట్టగలిగింది.

“అమ్మాయిలు సరే! ఆ యువకులు చాలా   స్మార్ట్. ప్రదీప్ ను చంపింది వాళ్ళే!”మరొకరు ఎవరో అన్నారు.

“మీరేం భయపడకండి, వాళ్ళను త్వరలోనే మనం పట్టుకుంటాము. ఎందుకంటే వాళ్ళ లీడర్ అక్క మన ట్రాప్ లోనే వున్నది ఆమె ద్వారా వాళ్లకు ఎక్కడ ఉన్నదీ మనం తేలికగా కనుక్కోవచ్చు.” రతన్ సింగ్ హామీ ఇస్తున్నాడు.

రైనా తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఇలా మాట్లాడుతున్నది రతన్ సింగేనా?

“నువ్వు అమ్మాయిలను పడెయ్యడం లో మాస్టర్ వి” ఇంకొకరు రతన్ సింగ్ తో ఆరాధనాపూర్వకంగా అన్నారు. “లేకపోతే ఈ అడవిలో జీవితం బోర్ కొట్టిపోయేది. అవునూ ఆ అమ్మాయి ఎలా వుంది?”

“అబ్బ! ఏం చేప్పమంటావు? నెంబర్ వన్ మసాలా కూర. అయినా కాస్తాగు నువ్వు కూడా రుచి చూస్తావుగా ఎలాగూ?” మరికొన్ని బూతు మాటలతో ఆ గది లో నవ్వులు ప్రతిధ్వ నించినాయి.

రైనా బండ లా అలాగే నిలబడిపోయింది. ఆమె తల  తిరుగుతున్నది. ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోవడమా? తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లడమా? అన్నది ఆమె తేల్చుకోలేక పోతున్నది.

“కానీ ఎయిడ్స్ వస్తుందేమో జాగ్రత్తగా ఉండాలి ఒరేయ్! “

“ఇంకా రెండు నెలల్లో రోడ్డు పని అవుతుంది, మనందరం ఎవరి ఇళ్లకు వాళ్ళం వెళ్ళిపోతాము. ఈ నాలుగు రోజులు ఎంజాయ్ చేస్తే సరి. ఎందుకు బాధపడటం?”

“కానీ ప్రదీప్. మనం బాకీ తీర్చుకోవాలి”

రైనా వెనక్కు తిరగకుండా ఒక్కొక్క అడుగూ మెల్లగా వేసుకుంటూ అక్కడనుండి జారుకుంది. పొదల మాటున దాచిన సైకిల్ తీసుకోవడానికి కూడా సమయం లేకపోయింది. ఆకు రాలితే వినపడేంత నిశ్శబ్దంగా వుంది అడవి అంతా! ఆమె శక్తి నంతా కాళ్ళలోకి తీసుకుని గుడ్డిగా అడవి లోకి పరుగెత్తింది. ఆ గదిలో వున్న వాళ్ళు వెంటపడి వస్తున్నట్టు, ప్రాణం నిలుపుకోవడానికి పరుగెడుతున్నట్టు గుడ్డిగా పరుగు తీసింది.ఎదురురాళ్లు కొట్టుకుంటున్న, ముళ్ల తీగలు గుచ్చుకుంటున్నా పట్టించుకోకుండా పరుగు తీసింది.

అంగన్ వాడీ దగ్గర ఆమెకు ఊహించని ఆశర్యం ఎదురు అయింది. ఇంటి ముందు తలుపు తీసివుంది. టుకు స్నేహితులతో ఒకరు ఇంటిముందు కాపలాగా వున్నారు. పరుగెడుతూ వస్తున్న ఆమెను చూడగానే అతడు ఆగిపోయాడు. ఆమె అతడిని పట్టించుకోకుండా ఇంటిలోపలకు పరుగెత్తింది.   వరండా కి ఒక మూల ఉన్న  టుకును  అతడి మిగతా స్నేహితులను కూడా ఆమె పట్టించుకోలేదు. గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. నలభయ్ వోల్టుల బల్బు గదిలో గుడ్డి  వెలుతురు పంచుతున్నది. గదిలో గోడకు తగిలించిన చిన్న అద్దం లో ఆమ్ తన రూపం చూసుకుని భయపడిపోయింది

“అక్కా! తెలిసిందా? ప్రదీప్ ను హత్య చేసిన వాడిని మధ్యాహ్నం పట్టుకున్నారు. వాళ్ళ రైవల్ గ్రూప్ వాళ్లే  అతడిని హత్య చేశారట.” గుమ్మం ముందు నిలబడి టుకు చెపుతున్నాడు. అతడి కంఠం లో కొంత ఉత్సుకత, మరికొంత ఊరట. అతడి మాటలు వింటూనే రైనా టుకు వైపు తిరిగింది

అక్క ఆకారం చూసి మాట్లాడుతున్నవాడల్లా ఆగిపోయాడు. ఆ గుడ్డి వెలుతురు లో కూడా అక్క మొహం మీద వున్న పగుళ్ల లాంటి గీతాలను పోల్చుకోగలిగాడు. బుగ్గ మీద చారిక కట్టిన నెత్తురు. ఎడమ భుజం దగ్గర చినిగి వేలాడుతున్న కమీజు. శిల లాగా వుండిపోయాడు టుకు  ఒక్క క్షణం పాటు

“అక్కా! ఏం  జరిగింది? ఎవరు చేశారు ఇలా?” టుకు గొంతు భయం గొలిపేట్టు వున్నది.

 రైనా తల దించుకుని కొయ్య లాగా నిలబడింది. ఆమె కళ్ళలో నీళ్లు ఊరి ముందుకు దూకుతున్నాయి.

“అక్కా! ఏం జరిగిందో చెప్పు అడుగుతున్నాను కదా!” టుకు గొంతు పెద్దగా ఖణేల్ మని మోగింది. ఆ మాటకి వరండాలో లోకూర్చున్న అతడి స్నేహితులు లేచి వచ్చి అతడి వెనుక నిలబడి గదిలోకి తొంగి చూడసాగారు.

“ఇదంతా ఆ కాంట్రాక్టర్ బాబు అతడి స్నేహితుల వలన ” రైనా చూపులు టుకు మీద. ఆ మాట చెపుతూ ఒక్కసారి కూడా రెప వాల్చుకుండా కళ్ళ నీళ్లతో చెప్పింది.

“ఎక్కడున్నారు వాళ్ళు?”

“ఇంట్లో”

 ఒక్క మాట కూడా మాట్లాడకుండా టుకు గదిలోనుండి బయటకు వెళ్ళిపోయాడు. స్నేహితులు అతడిని అనుసరించారు. తుఫాను కన్నా వేగం తో వాళ్ళు వెళుతున్నప్పుడు వాళ్ళ చేతులలో ఉన్న కత్తులు, ఇతర ఆయుధాలు ఆ గుడ్డి వెలుతురు లో కూడా ధగ ధగ మని మెరిశాయి. టుకు అతడి ఆరుగురు స్నేహితులు అడవి జంతువుల్లా ఒక్కఉదుటున చీకటి లోకి దూకి మాయమయ్యారు ఒక్క క్షణం లో.

రైనా ఇంటి వాకిలి ద్వార బంధాన్ని రెండు చేతులతోనూ పట్టుకుని చీకట్లోకి చూస్తూ నిలబడిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా.

Chooda: Flattered and dried rice, commonly used in Odisha

Pakhala: A mix of water and rice, slightly fermented, a delicacy and everyday meal of common people in Odisha     

పరమిత శతపథి
వంశీకృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *