“నాకు మాత్రం సమయం మించిపోలేదని అనిపిస్తోంది ఆనంద్. మనిద్దరి మధ్య ఇప్పుడున్నంత స్వేచ్ఛ, ప్రైవసీ ఉండవు. నా మనసు గందరగోళంగా ఉంది. ఎందుకు నువ్వేమీ మాట్లాడటం లేదు! చెప్పు!”
“ప్రియా, నేను ఎంత సంతోషంలో ఉన్నానో నీకెందుకు అర్థం కావడం లేదు. ఇలా చూడు! అలా దిగులుగా ఉండకు, నేనున్నా కదా? నిన్ను బాగా చూసుకుంటాను. మన మధ్య వచ్చేది ఎవరైనా సరే, వాళ్ళు మన ప్రేమకి ప్రతిరూపం అవుతారు కానీ అడ్డంకి కారు. సరేనా! నవ్వు ప్రియా, నా కన్న కదూ, నా బుజ్జి కదూ…”
**
కళ్ళు తెరవాలని చూస్తున్నాను. చుట్టూ చీకటిగా ఉన్నట్లుగా ఉంది. నీటిలో ఉన్నట్లు తేలుతూ అంతలోనే నన్ను ఒక సంచిలో ముడి వేసినట్లుగా ఉంది. నా చేతులు, కాళ్ళు కదిలిస్తూ ఉన్నాను. ఒక్కోసారి నా కళ్ళ మీద కాంతి పడినట్లు అనిపించేది. ఎటుచూసినా చీకటిగా ఉంటోంది. బయటినుండి ఎవరెవరివో మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ప్రియా, ఆనంద్ గొంతులే నాకు బాగా దగ్గరగా అనిపించేవి.
**
ఉలిక్కిపడ్డాను. నా చుట్టూ నాకు ఆశ్రయమిచ్చిన గోడలే నన్ను బయటికి తోస్తున్నట్లు, నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణంలో ఏదో మార్పు కనిపిస్తోంది. నన్ను కొన్ని చేతులు పట్టుకున్నాయి. ఒకసారిగా ఉన్నట్టుండి వెలుతురు నా కళ్ళపై పడింది. ఆ కాంతిని నా కళ్ళు చూడలేకపోతున్నాయి. ఏడుపు మొదలుపెట్టాను. నా చుట్టూ ఏవేవో జరుగుతున్నాయి. వాటిని చూసేందుకు నా శరీరం సహకరించడం లేదు. దేని మీదనో పడుకోబెట్టారు. కొన్ని వింత వింత శబ్దాలు నాకు వినిపించాయి. ఏడుస్తున్న నేను నెమ్మదిగా కళ్ళు తెరచి చుట్టూ చూడటానికి ప్రయత్నం చేశాను. అక్కడ యంత్రాలు ఉన్నాయి. తెల్లటి బట్టలు వేసుకున్న మనుషులే అటూ ఇటూ తిరుగుతున్నారు. నేను మళ్ళీ కళ్ళు మూసుకుని, మళ్ళీ తెరిచేంతలోపే నన్ను ఎవరో ఎత్తుకున్నారు. అక్కడి నుండి కొంతదూరం నడిచి, నన్ను వేరేవాళ్ళ చేతుల్లోకి ఇచ్చారు. అక్కడున్న వారివైపు నెమ్మదిగా ఏడుపు ఆపి చూస్తున్నాను. వాళ్ళు నన్ను వింత శబ్దాలతో లభించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో వస్తువు నాకు రెండడుగుల దూరంలో పెట్టి ఆనందపడుతున్నారు. ఒకరి వస్తువు నుండి తెల్లటి శక్తివంతమైన వెలుగు అకస్మాత్తుగా వచ్చింది. అది ఊహించని నేను నా కనులు మూసుకొని, మళ్ళీ వస్తుందేమో అనే అనుమానంగా తెరిచాను. నాకు అది నచ్చలేదు. అక్కడున్న వారందరూ ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎవరి పోలిక అంటూ చిన్నపాటి చర్చావేదిక పెట్టారు. నా ఒంటిరంగు, నా ముక్కు, నా జుట్టు ఇలాంటి వాటి గురించే ఆ మాటలన్నీ. నాకు మాత్రం అర్థం కాలేదు.
నాకు దాహంగా అనిపించింది. నోరు ఎండిపోతున్నట్లుగా, ఏదో అసౌకర్యంగా అనిపించింది. బిగ్గరగా ఏడుస్తున్నాను. మళ్ళీ నన్ను ఎత్తుకొని కొంతదూరం నడిచి ఒక రూములోకి తీసుకెళ్ళారు. అక్కడ మంచం మీద ఆమెకి నన్ను అందించారు. పాలివ్వు, అంటూ. తనేనా మా అమ్మ… ప్రియా. నా నోటికి తన స్తన్యం అందించింది. నా ఏడుపు మటుమాయమై, దాని స్థానాన నిద్ర వచ్చేసింది. నేను అందుకునే పాలు నా గొంతు నింపుతోంది. ఏదో తెలియని హాయిగా ఉంది. మధ్యమధ్యలో నన్ను కదుపుతూ ఉండటం, నన్ను వేరేచోట పడుకోబెట్టడం చేశారని తెలుస్తోంది. కానీ నేనున్న మగతనిద్రలో నాకు అవేవీ గుర్తుపెట్టుకోలేనంత నిద్ర పట్టేసింది.
**
పాలు తాగడం, స్నానం చేయడం, నిద్రపోవడం దాదాపుగా నా దినచర్యలో ఇవే భాగం. నన్ను అమ్మమ్మ స్నానం చేయించడం దగ్గరనుండీ, ఎత్తుకొని నాతో చిన్ని చిన్ని మాటలు చెప్పేది. అమ్మ చేతిలో ఎపుడూ ఫోన్ ఉండేది. నేను పాలు తాగుతున్నపుడు కూడా తను ఇంకో చేతితో ఫోన్ చూస్తూ ఉండేది. అప్పుడప్పుడు దానిని అందుకోవాలనే ఆలోచనతో నా వంతు ప్రయత్నం చేసేదానిని. కానీ అమ్మ అందించేది కాదు. ఎపుడైనా నా ముందు కానీ, నాకు అడుగు దూరంలో కానీ ఫోన్ పెట్టేది. అందులో ఎవరో కనిపించేవారు. నన్ను చూపించేందుకు అమ్మ నన్ను రకరకాల ఫోటోలు తీసేది. ఒకవేళ ఆ బట్టలు అసౌకర్యంగా అనిపిస్తే ఏడ్చేసేదాన్ని.
ఒకసారి అమ్మ ఫోన్ చూస్తూ ఏడుస్తోంది. బయటికి ఏడవట్లేదు కానీ, తన కళ్ళనీళ్ళు చూసి నాకు అర్థం అయింది. పాలు తాగుతున్న నేను తనవైపు నా చేతులని అందించేందుకు ఎంత ప్రయత్నించినా, అమ్మ లోలోపల కుమిలి ఏడుస్తోంది. బయట అమ్మమ్మ మాటలు ఇంకెవరితోనో వినిపిస్తున్నాయి. నాన్న వచ్చాడనుకుంటా. అమ్మ తన కన్నీళ్ళను గబగబా తుడుచుకొంది. కన్నీళ్ళైతే తుడవగలిగింది కానీ రెప్పలకు అంటుకున్న బరువును కాదేమో….
**
నేను నిద్రనుండి గట్టిగా మాటలు వినిపించడంతో లేచాను. చుట్టూ చూశాను. నేను మంచంలో ఉన్నాను. కానీ అమ్మ నా పక్కనే లేదు. కేవలం దుప్పటి కప్పి ఉంది. మంచానికి కొద్దిగా దూరంలో అమ్మ కిటికీ నుండి బయటికి చూస్తూ, తన రెండు చేతులు కట్టుకొని ఉంది. నాన్న తన వెనకాల ఏదో చెప్పడానికి ప్రయత్నించి విఫలమైనట్లు మొహం పెట్టుకొని నిలబడ్డాడు.
“నీకు చెప్పినా అర్థం కాదులే ఆనంద్. ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో నీకేం తెలుసు! కనీసం నేను తిన్నానో లేదో కూడా అడగవు. నేను ప్రతీరోజు ఇంట్లో ఉండి, పిచ్చి పట్టినట్లుగా అవుతోంది. సరిగ్గా నిద్ర ఉండదు. నీకే నేను ఎలా ఉంటే?” అంటూ కోపంతో నాన్నతో వాదిస్తూ ఉంది. నాన్న “ప్రియా, మొన్న అడిగాను ఏం లేదు అంటున్నావు, కారణం లేకుండా కోపం, చిరాకు పడుతున్నావు. నీకు నేనున్నా అని ప్రతీసారి చెప్తూనే ఉన్నా కూడా ఎందుకు అనవసర ఆలోచనలు భయాలు పెట్టుకుంటున్నావు” అని అమ్మను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు.
“కారణాలు లేక కాదు ఆనంద్, ఎవరైనా కారణం లేకుండా కోపం వస్తోంది, బాధ, ఏడుపు వస్తున్నాయి అంటే దానికి నిజంగా కారణాలు లేవని కాదు, అవి బయటికి చెప్పలేక అవి బయటికి చెప్పేస్తే ఎక్కడ తమను జడ్జ్ చేస్తారేమో అనే భయం. తమను మానసికంగా వేధించే విషయాలు అవతలి వారికి చాలా చిన్నవిగా, తేలికగా కొట్టిపారేసే విధంగా ఉండవచ్చు. కానీ అనుభవించే వారికే వాటి బరువు తెలుస్తుంది. ఇవన్నీ నీకు అర్థం కావులే ఆనంద్!” అంటూ అమ్మ గదిలోంచి నాన్న నుండి విసురుగా బయటికి వెళ్ళిపోయింది…
నిద్రలేచిన నాకు ఆకలి వేసి అక్కడున్న నాన్న కూడా నావైపు చూడకపోవడంతో ఏడుపు మొదలుపెట్టాను. వెళ్ళినంత వేగంగానే నా గొంతు విన్న అమ్మ వచ్చి, నాకు పాలు అదించింది. తర్వాత నాన్నెప్పుడు వెళ్ళాడో గుర్తులేదు.
**
రోజులు గడుస్తూ ఉన్నాయి. నేను బోర్లాపడటం, మెల్లగా కూర్చోవడం లాంటివి కూడా చేయగలుగుతున్నాను. అమ్మ ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉంటే, నేను మాత్రం నా చిన్ని ప్రపంచం వైపు ఒకసారి చూడమ్మా అని అరవాలని ఉండేది. కానీ అరవలేను కదా! అమ్మ చూసే ఫోన్ వైపు నేనూ చూసేదాన్ని. అందులో బొమ్మలు, పాటలు వచ్చేవి. నేను ఫోన్ చూసి దానిని అందుకోవాలనే ఆరాటం గమనించిన అమ్మ అందరికీ చెప్పేది మురిపెంగా.. నేను బొమ్మలతో ఆడుకునే సమయం అంతా అమ్మ తన పనిలోనో, లేక ఫోన్ చూస్తూనో గడిపేది. నేను రాను రాను బొమ్మలతో ఆడుకోవటం కన్నా అమ్మ చూసే ఫోన్ వైపు ఆకర్షితురాలినయ్యాను. అందులో వచ్చే బొమ్మలు, పాటలో ఎంతో బాగుంటున్నాయి. దానిని చూడాలని అనిపిస్తోంది. దానిని అందుకోవాలని ఉంటుంది.
నేను ఏడ్చినపుడో లేక తిననపుడో నాకు అమ్మ ఫోన్‌లో బొమ్మలు పెట్టించి ఇచ్చేది. నాకు ఒక విషయం అర్థం అయింది, నేను ఏడిస్తే నాకు ఫోన్‌లో బొమ్మలు పెట్టిస్తారు. అలానే అయితే నాకో ఆయుధం నా ఏడుపే. ఒకరోజు అమ్మ ఫోన్ చూస్తూ ఉంది. నా ముందేమో బొమ్మలు ఉన్నాయి. ఆకలిగా ఉంది. అమ్మ నువ్వు సైగలతో తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అని అడిగా. తను అన్నం కలుపుకొని వచ్చి తినిపిస్తోంది. నాకు ఫోన్ కావాలని నా చూపుడు వేలిని కింద నుండి పైకి నిలువు గీతను పదేపదే గాలిలో గీస్తూ అడిగా. కానీ అమ్మ ఇవ్వలేదు. ఏడుపు మొదలుపెట్టాను. ఇంకా గట్టిగా ఏడ్చాను. అప్పుడు అమ్మ ఫోన్‌లో బొమ్మలు పెట్టి నా ముందు పెట్టింది. నేను ఏడుపు అయితే వెంటనే ఆపేసాను.
అప్పటినుండే నాతో ఏదైనా తినిపించాలన్నా, నేను అమ్మ పనులకి అడ్డురాకూడదన్నా, తను ఏదైనా ముఖ్యమైన పనులు చూసుకున్నా నాకు ఫోనే నేస్తం అయిపోయింది. కానీ ఒక విషయం, నన్ను దగ్గరికి తీసుకుని, ఆడించి తినిపించే అమ్మలాంటి ఆప్యాయత ఈ ఫోన్‌లో నేనెక్కడని వెతకనమ్మా?
**
అమ్మా, నాన్నా ఇద్దరూ కూడా రోజులో ఎక్కువసేపు ఫోన్‌లో ఉంటున్నారు. నాతో ఆడుకోవడమో, నన్ను మాట్లాడించడమో చేయట్లేదు. చాలా బెంగగా ఉంటోంది. ఏదైనా వారు ఫోన్ చూస్తున్నప్పుడు ఆ ఫోన్ లాగడం, పక్కన పడేయడం లాంటివి చేస్తే గట్టిగా అరవడం, నన్ను చిన్న దెబ్బలు వేసేవారు. బాగా ఏడ్చేదాన్ని. మీ ఏకాంత సమయానికి నేను అడ్డు అయ్యానా, లేక ఫోన్‌లో మీ బిడ్డను చూసుకుంటున్నారా అమ్మా! అని గట్టిగా అరవాలని ఉండేది. ఎందుకంటే ఫోన్‌కి చుట్టూ కవర్, గ్లాస్ వేయించడం చేశారు, అది నా చేతిలో నుండి ఎప్పుడైనా పొరపాటున కిందపడితే ముందు ఫోన్‌ను చూసి, తర్వాత నన్ను అరిచేవారు. నా మనసు బాధతో విలవిలలాడేది.
**
రానురాను నా జీవితంలో కూడా ఫోన్ భాగమైపోయింది. తినేముందు ఫోన్ ఉండాల్సిందే. లేకుంటే మారం చేసేదాన్ని. అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళ పనులకి, వాళ్ళ ఫోన్ చూసే సమయంలో ఇంట్లో ఉన్న పాత ఫోన్ నా చేతికి ఇచ్చేవారు. నేను కూడా బొమ్మలు, పాటలు మాత్రమే కాకుండా వీడియో గేమ్‌లు కూడా నేర్చుకున్నాను. అంతేకాదు ఫోన్ ఇస్తేనే అన్నం తింటున్నాను, లేకుంటే లేదు. అందులోని విషయాలు, వీడియోలే నాకు ఆసక్తిగా ఉంటున్నాయి, చాలా నచ్చుతున్నాయి. ఎందుకంటే ఎటువంటి శారీరక, మానసిక శ్రమ నాకు కలిగించట్లేదు. నా కళ్ళు అప్పుడప్పుడూ మండుతూ ఉంటున్నాయి, కారణం తెలియలేదు.
**
నేను ఫోన్‌కు బాగా ఆడిక్ట్ అయ్యానని, అందువల్లే నాకు మాటలు రావడం లేదని నిర్ధారించిన అమ్మా, నాన్న ఒకరోజు డాక్టర్ దగ్గరకి తీసుకొని వెళ్ళారు. అదొక పెద్ద హాస్పిటల్. మేము వెళ్ళగానే అంతకు ముందురోజే తీసుకున్న అపాయింట్‌మెంట్ చూపిన తర్వాత అక్కడున్న నర్స్ మమ్మల్ని అదే ఫ్లోర్‌లో ని కుడివైపు వారగా ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్ళింది. అదో పెద్ద విశాల భవనంలా ఉంది. ఎందుకంటే అది గదిలా లేదు. గోడకి ఎన్నో రకాల బొమ్మల పెయింటింగ్‌లు, ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చే చిత్రం ఫ్రేమ్ కట్టబడి ఉంది. నేను ఇంకా చూస్తూ ఉండగానే అమ్మా, నాన్న కొద్దిగా దూరంలో ఉన్న డాక్టర్ టేబుల్ ముందు ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. గుమ్మం దగ్గరే ఆగిపోయిన నన్ను డాక్టర్ పేరుపెట్టి పిలిచాడు. నేను ఆయన వంక చూశాను. తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు. కానీ నేను అమ్మ కూర్చున్న కుర్చీని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాను.
నేను అమ్మ మీద కూర్చోడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తూ ఉన్నాను నాకు డాక్టర్ నా వైపే చూస్తూ ఉండడంతో సిగ్గుగా ఉంది. డాక్టర్ నన్ను పిలిచి రెండు బొమ్మలు తీసుకోమన్నట్లు అందించాడు. అవి ఒకటి కారు, ఇంకోటి బస్ బొమ్మలు. అవి మంచి రంగులో ఉండి, ఆకర్షణీయంగా ఉన్నాయి. నేను తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో అమ్మా, నాన్న వైపు చూస్తూ ఉన్నాను. నాన్న తీసుకో అన్నట్లు సైగ చేశాడు. నేను సంతోషంతో ఆయన చేతినుండి బొమ్మలు తీసుకొని, ఒక పక్కగా బెంచిలాంటి చోటుమీద వాటిని నడిపిస్తూ ఆడిస్తూ ఉన్నాను.
**
అమ్మా, నాన్నలను డాక్టర్ నా గురించి ఏవేవో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మధ్యమధ్యలో నావైపు చూస్తున్నాడు.
“తను ఎందుకు ఫోన్‌కి అలవాటు అయ్యాడో మీరేమైనా కారణం అనుకుంటూ ఉన్నారా…?”
“మేము ఇంట్లో పని చేసినపుడో, వంట చేస్తున్నప్పుడో అడ్డం వచ్చేసి, అల్లరి చేస్తాడని అప్పుడప్పుడు వీడియోలు, రైమ్స్ పెట్టించేదాన్ని డాక్టర్. కానీ ఇంత మొండిగా ఎలా మారాడో అర్థమే కావట్లేదు. వీడి వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలే ఎంత బాగా మాట్లాడుతున్నారో, అసలు వీడికి మాటలు రావు. మీరే ఏదో ఒక సొల్యూషన్ చూడండి డాక్టర్” అమ్మ గొంతులో ఆవేదనను వింటున్న నాకు మదిలో కొన్ని విషయాలు వెంటనే మెదిలాయి.
‘నాకు మీతో ఆడుకోవాలని ఉండేది, బొమ్మలతో, పిల్లలతో ప్రకృతిలో ఒదిగిపోయి, నా బాల్యం కూడా నన్ను చూసి మురిసిపోయేంతగా అల్లరి చేయాలని ఉండేది. కేరింతలు కొట్టాలని ఉండేది. నాకెందుకు ఫోన్ ఇచ్చి ఉన్న చిన్ని సంతోషాలన్నిటికీ తాళం వేశారు? నేను కదిలే బొమ్మలు కోరుకోలేదు. కళ్ళముందు ఉండే మీరు మాట్లాడితే చాలనుకున్నా… కానీ మీరేమో ఫోన్‌లో గడుపుతారు’
“వంటింట్లోకి వచ్చి ఏం చేస్తాడని వాడి చేతికి ఫోన్ ఇచ్చారు…?” డాక్టర్ ప్రశ్నతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది.
“సామాన్లు పడేయడం, ఏవైనా సర్దిన వస్తువులు చిందరవందరగా పడేయడం చేస్తాడు కద సర్?” అసలు ఎందుకా ప్రశ్న అన్నట్లు అమ్మ మొహం తన భావాలను ప్రతిబింబిస్తోంది.
“అంటే, అవి సర్దుకోవడానికి సమయం పడుతుంది. మళ్ళీ ఏ వస్తువులు ఆ స్థానంలో పెట్టడానికి కొంచెం శ్రమ అవసరమౌతుంది. అవునా? ఇప్పుడు ఆ చిన్న మెదడులో కొన్ని గజిబిజి భావాలు మొదలు అయ్యాయి అనుకుందాం. అవి వాటంతట అవే సర్దుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఆలోచించారా..?” అంటూనే
“మీరు ఏడుపు ఆపుతున్నాం అని అనుకుంటున్నారు, లేదా అన్నం తినిపించడానికో, తమను డిస్ట్రబ్ చేయకుండా ఉండటానికో, తమ పనులకు ఆటంకం కలిగించకూడదని ఫోన్ ఇస్తున్నారు. కానీ ఆ చిన్ని ప్రాణాలకి ఏం తెలుస్తుంది..? అవే లోకం అవుతాయి. మీ నుండి దొరకని సంతోషం ఏదైతే ఉంటుందో, వాళ్ళు వాటిలోనే వెతుక్కుంటారు. అదొక విష వలయం.
ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న కాలంలో ఒక పిల్లను పెంచి, పెద్దచేయడం చాలా సవాళ్ళతో కూడిన పని. ఎవరూ ఒప్పుకోలేని ఒక చేదు నిజం చెప్పనా ప్రియా… పిల్లల కంటే పెద్దవాళ్ళే ఎక్కువ ఫోన్‌కి బానిసలు అవుతున్నారు. తల్లి, తండ్రీ ఇద్దరూ సంపాదనాపరులయ్యాక, శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. ఒక ఉపశమనం అనేది ఫోన్‌లో వెతుక్కుంటున్నారు. ఓపిక తక్కువ అయిపోతోంది. పిల్లల్ని పెంచడం అనేదే ఎంతో ఓపికతో కూడుకున్నది. దానికి బదులు పిల్లల మీద మన కోపం, చిరాకు, అసహనం ప్రదర్శిస్తే పాపం వారి బుజ్జి మనసులు ఎంత కష్టం పెట్టుకున్నాయో ఎలా తెలుస్తుంది” అంటూ డాక్టర్ తన రెండు చేతుల్ని టేబుల్ మీద పెట్టి అమ్మానాన్న వైపే సూటిగా చూస్తున్నాడు.
అమ్మా, నాన్న దగ్గర్నుండి సమాధానం రాకపోవడంతో డాక్టర్ మళ్ళీ కొనసాగించాడు.
“పుట్టినప్పటినుండీ, వారు ఒక మట్టి ముద్దలు వారిని మనమే ఎలా మలిచి పోషిస్తామో అలాగే నేర్చుకుంటారు. వారి చూపు ఈ ఫోన్ వాడటం వల్ల ఎంత దెబ్బతింటుందో తెలుసా..? చదువులో ఆసక్తి చూపలేరు. వారిలో స్వతహాగా ఉండే సృజనాత్మకత తగ్గిపోతుంది. నలుగురిలో తిరగలేరు. వారు ఏడిస్తే ఏడుపు మాన్పించడం కోసం ప్రయత్నం చేయకూడదు. అసలు వారు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకోవడానికి చూడండి. వారు మీ నుండి ఫోన్‌లు, డబ్బులు, ఆస్తులు ఇలాంటివేమీ ఆశించరు. కేవలం మీరు వారితో సమయం గడపాలి అని కోరుకుంటారు. వారు చేసే అల్లరిని భరించాలని, వారిని అనుకరించి ఆడించాలని ఆశపడతారు.
వారిని మీకు అడ్డువచ్చే పిల్లల్లా కాక వారి ఊహల రెక్కల్ని ఎగిరించే విధానంలో చేయి అందించండి. ఇప్పుడున్న కాలంలో మా పిల్లలకి ఫోన్ వాడటం వచ్చు అనే విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. వారికి చేతకానిది, వారు చేయలేనిది, పిల్లల నెత్తిన రుద్దుతున్నారు. దేనికోసం ఇదంతా..? దేనికోసం పరుగులు?”
“డాక్టర్, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగపరంగా మేమూ ముందరుండాలి అనేది అందరిలోనూ ఉంటుంది. అలాగే ఉన్న కాసింత సమయంలో స్వేచ్ఛగా ఉండాలనుకోవడం తప్పా? మేమూ మనుషులమే కదా…? కుటుంబ పరిస్థితులు అందరికీ అనుకూలించవు కదా?”
“మీరన్నదానిలో నిజం లేకపోలేదు. ఒక విషయం ఆనంద్.. వినోదం అంటే డిజిటల్ స్క్రోలింగ్ కాదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం ఐదేళ్ళలోపు చిన్నారులు రోజులో గంటకి మించి గ్యాడ్జెట్స్‌ని వాడటం అంత మంచిది కాదట. అది వారికి తెలీదు, వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. వారితో కలిసి చిన్న చిన్న ఆటలు ఆడించడం, ఆరు బయటకో, పార్కుకో తీసుకెళ్ళడం కష్టమైన పనేమీ కాదు, మీకు కూడా మంచి వ్యాయామం.
ఇక సాధారణంగా రెండు, మూడేళ్ళ చిన్నారులు ఆటలు, పాటల ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుంటారు. ఇందుకోసం మనకి రోజూ కనిపించే, వినిపించే వాటినే సాధనాలుగా ఎంచుకుంటాం. కానీ పిల్లలు మొబైల్ ఇస్తేనే కానీ ఏ పనీ చేయనని మొండిపట్టు పట్టి కూర్చుంటే మాత్రం వారిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనదే.
వారిని ఎక్కువగా బొమ్మలతో ఆడుకునేలా చూడటం, అలా అని బొమ్మలు వారి ముందువేసి మనం ఫోన్‌లో ఉండమని కాదు. వారితో కలిసి వారు చేసే చిన్ని చిన్ని ఆటల్లో మనమూ కొంతభాగం అవ్వాలి. అపుడే వారిలో ఇంకా ఉత్సాహం పెరుగుతుంది.
కథలు చెప్పి వారిని మరిపించాలి. పరిసరాలను పరిచయం చేయాలి. అయితే ఇదేమంత తేలికయిన విషయం కాదు. మీరు ఓపికతో ఉండాలి”
“డాక్టర్, మరి మాటలు రావడం లేదు కదా?”
“వస్తాయి. కొంతమందిలో నిదానంగా రావచ్చు. మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు ఇతర పిల్లలతో మీ పిల్లవాడిని పోల్చడం ఆపండి. ఎందుకంటే అలా ప్రతిదానికీ పోల్చిచూడటం వల్ల మీ పిల్లల్లో ఉండే ధైర్యం తగ్గి, ఆత్మన్యూనతా భావానికి లోనుకావచ్చు. ఇప్పుడు మీవాడు ఫోన్ ఇవ్వకపోతే కేవలం మొండికేయడం, ఏడవటం లాంటివి మాత్రమే చేస్తున్నాడు అన్నారు. కానీ అవి శృతి మించితే చాలా ప్రమాదకరం. తలను గోడకేసి బాదుకోవడం, రచ్చచేయడం, అరచి గోలచేయడం, రాను రాను వయసుకి మించిన చేష్టలు చేయడం మొదలుపెడతారు.
మీ పనికి అడ్డం అనో, అల్లరి చేయకుండా ఉంటారనో పిల్లల చేతికి మొబైల్ ఇచ్చే అలవాటుని ముందు మీరు మానుకోండి” అంటూ డాక్టర్ ఇంకా చాలా విషయాలు అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఉన్నాడు.
అప్పటిదాకా ఆడుకుంటున్న నేను ఎందుకో మనసంతా వెలుతిగా అనిపించి ఆ బొమ్మలు రెండు పక్కన పడేసి వారి మాటలనే ఆలోచిస్తూ ఉన్నాను. అలా ఎంతసేపు కూర్చుండిపోయానో నాకే తెలీలేదు.
**
అమ్మా, నాన్నా….
ఆవిష్కరణని అంతా చేసేది మనుషులేగా…. ఆపదలూ అన్నీ తెలుస్తాయి కదా…
నేను చూసిన ఫోన్ పనిచేసేది ఒక వలయంతోనే అయినా అమ్మా…. ఇందులో చిక్కుకుంది కేవలం నా ప్రపంచమా…? లేక ఈ ప్రపంచమా….?
సమాప్తం……
