స్వేచ్ఛ
స్వేచ్ఛకే స్వేచ్ఛలేని
ఈ సమాజం నుంచి
నిష్క్రమించావా తల్లీ
నువ్వేమిటో నీ కష్టాలేమిటో
తెలియని పట్టించుకోని లోకానికి
నలుగురిలో ముచ్చటైతివా
కొందరి పెదాలపై ప్రశ్నవైతివా
నిన్ను తలుచుకుంటే
స్వేచ్ఛగా రెక్కలూపుకుంటూ ఆకాశంలో ఎగిరే పక్షే
కళ్ళల్లో మెదులుతోంది.
నిండు పున్నమివంటి
నీ నవ్వు లోకానికేదో
చెబుతున్నట్టే వుంది
రోజూ ఇంట్లో నడయాడే పిల్ల
ఒక్కసారిగా మాయమైనట్లుంది
సూటిగా తిరుగులేనట్టుండే
నీ మాటలు ఇక వినలేమా
పదునైన నీ పలుకు చూపులని
ఏ బలహీన క్షణాలు ఓడించాయో ఆకాశమంత విశాలమైన ఆ
నవ్వుని
మాయం చేసిందెవరో ….
- వసంత నేల్లుట్ల

ఓ
ముగ్ద మనోహరి
నిద్దురపో
ప్రశాంతంగా..
ఊరి చివరి
మర్రిచెట్టు నీడలో
నిద్దురపో ఈ రాతిరి
మనసారా..
హంసలా
ఉండే నీ దేహం
అస్థిపంజరంగా
మారిందే ఈవేళ..
ఎన్ని గాయాలు
తాగిలాయో నీ గుండెకు
అందుకే ఈ రాతిరి నిద్దురపో
హాయిగా..
బరువు, బాధ్యతలంటూ
పిల్ల, జల్లలంటూ..
ఉక్కిరిబిక్కిరి చేసే
మనసులేని
మనుష్యులకు
దూరంగా నిద్దురపో
ఈ రాతిరి ఒంటరిగా..
మానం, మర్యాద
పరువు, ప్రతిష్టలంటూ
నిత్యం చచ్చిబతుకుతున్న
పిచ్చిజనాలకు
మాటలు వినకుండా
చెవిలో దూదిపెట్టుకొని
నిద్దురపో ఈరాతిరి ప్రశాంతంగా..
వెనకో మాట.. ముందో మాట
మాట్లాడే మనుష్యులకు
ఫుల్ స్టాఫ్ పెట్టి
నిద్దురపో
ఈ రాతిరి హాయిగా..
ఊహా ప్రపంచంలో నువ్వొక
అతిధివి మాత్రమే
పుట్టిల్లు, మెట్టిల్లు
ఉట్టిమాటలే చినదాన..
అచంచలమైన
మనసుతో నువ్వేం
చేస్తాం
మట్టి పరిమళలాల మధ్య
నిద్దురపో హాయిగా..
కడలిలో ఒంపులను పట్టిన
చినదాన
నువ్వు
ఇలా హాయిగా
పడుకుంటే
మేమేం అయిపోవాలే..
ఏ బరువు, బాధ్యతలేని
నీ నిద్దుర
ఎంతమందిని
ఉక్కిరిబిక్కిరికి
గురిచేస్తున్నదో తెెలుసా..
బిడ్డగా, తల్లిగా
భార్యగా, ప్రియురాలిగా
నువ్వు ఎప్పుడొ
ఓడిపోయావు..
నువ్వు
తల్లి కడుపులో
ఒక అతిథివి మాత్రమే
ఈ ఏకాంతవేళ
ఊరి చివర
మర్రిచెట్టు నీడలో
నిద్దురపో హాయిగా..
నీ జననం
మరణం
మాకెప్పటికీ ప్రశ్నార్థకమే?
-రూప

మోసపోదాం!!
ప్రేమించే మనసులని నమ్మి
నిలువెల్లా ముళ్ళకంచెను కప్పుకుందాం.
వొక్కసారి వణికినా చీల్చుకుపోయే
శూలాల ముందు నగ్నంగా నిలబడదాం.
పాతగాయాలపై కొత్తగాయాల
మందు పూసుకుందాం.
మాయమాటలు, మోసాలే అయినా,
వొంటరితనానికి వాటినే తోడు చేసుకొందాం.
రక్తార్పణ చేస్తూనే
చివరి శ్వాస వరకూ ప్రేమిద్దాం !
మూసుకున్న కళ్లమీద
ఎప్పుడో వాడిచ్చిన
ముద్దుని,
ముద్దులోని చెమ్మను
వెతుక్కుంటూ…
జీవితాన్ని ధారపోసి
నిలువునా చీలిపోదాం.
పుట్టమట్టిలో కలిసిపోదాం.
- ఝాన్సీ పాపుదేశి

|| ‘స్వేచ్ఛ’గా కొన్ని కన్నీళ్లు ||
నన్ను క్షమించమంటున్నాను
నీ గుమ్మానికి ఒక భరోసా
తోరణమైనా కట్టనందుకు
నీ వెలుగు పరదా లోపలి
చీకటి తలుపు నమ్మకాన్నై తట్టనందుకు
ఈ భూమండలంలోని సమస్త అపరాధాలకూ ఏకైక దోషిగా
నన్ను మన్నించమంటున్నాను
నడిచి వెళ్ళిపోవడానికి
రెండు పాదాలు తప్ప
నీ శరీరంలో ఇంకేమీ మిగల్చలేదు
గుచ్చుకున్న గాజు పెంకులు తప్ప
నీ ఆత్మకు మరో స్పర్శ ఉంచ లేదు
నీ కళ్ళను తప్ప కన్నీళ్లు చూడలేదు
నీ అక్షర దరహాసాల వెనక దాచిన
ఆ సముద్రాలనూ పోల్చలేదు
నీ మీద ఇప్పుడు ఈ తప్పొప్పుల
నిప్పుల వాన ఎందుకోరా..
కలలున్నందుకా.. అలవైనందుకా..
పక్షివై పాటవై స్వేచ్ఛగా ఎగిరినందుకా!
నీ పెదాల పలకరింపులు తప్ప
నీ నెత్తి మీది ఈ లోకశోకాల
బరువు దింపుకోవడానికి
ఒక దోసీలినైనా పట్టలేదు
కనీసం వాకిలినైనా సిద్ధం చేయలేదు
ఏ మథనం.. ఏ ఘర్షణ..
ఏ యుద్ధం.. ఏ భూకంపం
ఒక్క క్షణంలో నువ్వు పొందిన
అనాది మానవ దుఃఖ బీభత్స అనుభవమెంతో..
నీ శూన్యంలో ఒక శిలువ చిత్రించి
నీ అదృశ్య దృశ్యానికి మేకులు కొట్టి
చప్పట్లు కొట్టి తీర్పులు చెప్పిన
సకల మానవ హస్తాల సాక్షిగా
నన్ను క్షమించరా నాన్నా
నా తల్లీ చెల్లీ మల్లీ బిడ్డా..!
నీ అంత అందమైన స్వప్న లోకాన్ని
నీకు ఇవ్వలేకపోయిన నేరానికి
ఈ ప్రపంచాన్ని బోనులో నిలబెట్టి ఎప్పటికైనా కాలం
తన తీర్పు చెపుతుందిలే
అప్పటిదాకా ఈ సనాతన తీర్పరుల మీద ఈ అధునాతన నేర్పరుల మీద
నాలుగు పరిహాస దగ్ధాశ్రువులు రాల్చరా.. రాల్చి కాల్చారా
నా అమ్మా..
…………………..
ప్రసాదమూర్తి

మగరెక్కల పక్షి
ఈ దుఃఖ మహాజలధిని ఈదలేను
మన్ను తిన్న పాములా.... మనసు
కళ్ళు లేని కబోదులు
కాళ్ళు లేని కుంటివాళ్ళు
బతుకు గీతాలై సాగిపోతుంటే
ఇలా అర్ధాంతరంగా చివరి చరణమేమిటి
అధికారపార్టీ నాయకివి కావు
సంతాపదినాలు ప్రకటించడానికి
కూడబెట్టిన ఆస్తులు తరతరాల నిధులు లేవుగదా
తెల్లారేసరికి కూటిడబ్బాలతో కొలువుకిపోక తప్పదు
చివరిశ్వాస బిగబట్టాక
నీ కన్నవాళ్ళు నీ కన్నకూతురు గుర్తు రాలేదా అని
ఎన్నో వ్యాఖ్యానాలు
అరేబియా హిందూ బంగాళాఖాతం
మూడు సాగరాలు ఏకమైన కన్నీటి సంద్రాన్ని ఈదలేని చేపపిల్లవు
ప్రతిరాత్రీ కలల కలువలు రాలిన కాళరాత్రి
నీ కన్నీరే నీవు తాగిన అనంత దుఃఖ విభావరులు
ఎవరికి వారే యమునాతీరాల ఏకాంత జీవితాలు
ఎవరి ఆనందాలు వారిని
ఎవరి ప్రపంచాలు వారివి
ఎలా ఉన్నావని ఏం తిన్నావని
ఓ పలకరింపు మేఘం స్పర్శించని ఎడారిలో
ఎన్ని దిగులు గుబుళ్ల ఇసుక తుఫాన్లు
రెక్కల గుర్రంలా రంగుల సీతాకోకలా
ఉమర్ ఖయామ్ పద్యంలా గాలిబ్ గజల్లా
ఉత్సాహం ఉత్పలమాలలా పరిమళించాలని
ఎన్ని అనుకున్నావు
అనుకున్నవన్నీ జరగని కథలే
అనుకోనివే ఆకస్మిక విద్యుద్ఘాతంలా
ప్రేమ రుతువు నిత్యము సత్యమని
ఇష్టం భ్రమరం కలకాలం నీగీతాలే పాడుతుందని
అమాయకం వర్ణ మాల దగ్గరే ఆగిపోయావు
వాస్తవం చెంపదెబ్బలకు కళ్ళు చీకట్లు కమ్మి
ఏ ఆశా తారక వెలగక బేలగా
ఉద్యోగంలో వృత్తిలో
సాహస గీతమై ఆదర్శ పాఠమై
ఎగిరే పతాకమై దిక్కుల్ని జయించిన నీవు
పిరికి అక్షరమై జీవితం పలక మీద....
గాంధర్వ వివాహంలో ఎప్పుడూ
శకుంతలనే నిందించే 'మహా'భారతం
ఏ సందర్భంలోనైనా స్త్రీలవైపే వేలెత్తిచూపే
మహోన్నత పితృస్వామ్య సమాజం
కాలం పక్షి ఎగిరిపోతూనేవుంటుంది మగరెక్కలతో...
మందరపు హైమవతి

ఎగురుతున్న కలల్లోంచి..!
స్వేచ్ఛ వటోర్కర్.. నాకు ఓ ఆరేళ్ళ నుండి పరిచయం.’డైనమిక్ ఉమెన్’కి ఆమె ఓ పర్యాయపదం.పలు టీవీ ఛానెళ్లలో ‘న్యూస్ రీడర్’గా,రాజకీయ,సామాజిక అంశాల చర్చలపై విశ్లేషణకర్తగా,ప్రముఖులతో ముఖాముఖి వ్యాఖ్యాతగా.. ఇలా బహుకోణాల్లో దిట్ట.మొహంపై చెరగని సున్నిత చిర్నవ్వు ఆమె చిరునామా.
పలు సందర్భాల్లో,అనేక అంశాలపై మాట్లాడుకునేవాళ్ళం.కానీ.. చాలా తక్కువగా మాట్లాడేది.’సాహిత్య అకాడెమీ యువపురస్కారం’ అంశంపై మొదలైన పరిచయం.. ‘మట్టిపూల గాలి’ కవితాసంకలనం దాకా చిరుసంభాషణలు కొనసాగేవి.అందులో భాగంగానే ఈ ‘కవితాసంపుటి’ నాకు పంపింది.సమీక్ష రాద్దామనుకుంటూనే రాయలేకపోయాను.కానీ ఓ రెండుపత్రికలకి రాసిన వ్యాసాల్లో ‘స్వేచ్ఛ’ కవితల్ని కోడ్ చేసి ఆమెకి పంపాను.సరదాగా ఓ సారి షాకిద్దామని ‘ముఖపుస్తకం’లోని ఆమె పెట్టిన పిక్స్, క్లిప్స్ ఆధారంగా ఓ కవిత రాసి వాట్సప్ కి పంపాను.అంత మాత్రానికే తెగ మురిసిపోయింది.ఆ కవితను తన ‘ఫేస్ బుక్’లో ఓ చోట టాగ్ చెయ్యమని రిక్వస్టు చేస్తూ,థేoక్స్ చెబుతూ.. ఓ మెసేజ్ పెట్టింది.అలానే చేశాను.ఆ కవితనే ఇక్కడ మళ్లీ ‘పేస్ట్’ చేసి ఉంచాను.
ఇలా పరిచయమైన స్వేచ్ఛ.. వ్యక్తిగత జీవితం గురించి కానీ,వృత్తి గురించి కానీ.. నేనెప్పుడూ ఆమెను ఆడగలేదు. ఎందుకంటే.. అప్పటికే అమె జర్నలిజంలో లబ్దప్రతిష్ఠురాలు కనుక.. మిత్రుల ద్వారా ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కుంటోందని మాత్రం పరోక్షంగా నాకు తెలుసు.కానీ.. అంతలోనే ఇలా.. ఆత్మహత్య రూపంలో.. పెద్ద షాకిస్తుందని.. కనీసం కలలోనైనా ఊహించలేదు. టీవీ ఛానెల్స్ లో తప్ప,బయట పెద్దగా మాట్లాడేది కాదని,మితభాషి అని తెలుసుకోవడానికి నాకు.. ఎంతోసేపు పట్టలేదు.
ఆమె కవిత్వం విషయానికొస్తే.. చాలా సరళ పదాల్లో.. సున్నితభావాలను భావుకత,వైయక్తికమైన అంశాలను సుతారంగా తడిమి చెప్పిందని.. చెప్పగలను.వీటిలో జీవన సంఘర్షణ కొట్టొచ్చినట్టు కనిపించేది.
చివరికి ఎలా ఐతేనేం.. స్వేచ్ఛ ఊహించని రీతిలో.. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అందరితోపాటు.. నా మనసు కూడా ఆర్ద్రతతో నిండిపోయి కన్నీటి పర్యంతమైంది.
కానీ.. కోల్పోయిన జీవితమేదీ మళ్లీ తిరిగి రాదు కదా!
అందరిలాగే.. మౌనం పాటిస్తూ.. నివాళి అర్పిస్తున్నాను..
ఉయ్ రియల్లీ మిస్ యూ స్వేచ్ఛా..
* * *
ఎగురుతున్న కలల్లోంచి..!
ఈ అమ్మాయి
ఎప్పుడూ అంతే.!
వానలో తడుస్తూనో
వాగులో జలకాలాడుతూనో
పచ్చిక మైదానంలోని శూన్యంలో ఎగురుతూనో
ముఖపుస్తకంలో దర్శనమిస్తుంటుంది
ఈ నేల
ఈమె ఒక్కతి సొత్తే కాదు-
ప్రకృతి ఒడిలో మౌనంగా సేదతీరుతూ
దృశ్యాల్ని ఆస్వాదించడానికి!
స్వేచ్ఛ ఎవరికి ఉండదు?
ఈ స్వేచ్ఛకే కాదు
సజీవ ఆశలతో రెక్కల్ని ఎగరేసే
మనసున్న ప్రతి మనిషికీ ఉంటుంది
జీవితం ఒక్కోసారి అంతే!
చిరుఊహల్లో రంగు రంగుల కలల్ని తొడుక్కుంటూనో
చిరుప్రాయంలో డప్పుపై
చిట్టిచేతుల్తో దరువేస్తూనో
వీక్షకుల కళ్ళకి
బుల్లితెరపై వార్తలు చదువుతూనో
ఏదో ఒకలాగ
మట్టిపూల గాలి పరమళమై
మా పసిమనసుల అంచుల మీద
దృశ్యంగా
వాలి తేలి ఎగురుతూ ఉంటుంది
బహుశా
కాలం అడ్డు చెప్పకపోవచ్చు
అపరిమితమైన స్వేచ్ఛ
మనసుకి అవరోధం కాదని!
విచ్చుకున్న కంటి రెప్పల్లోనూ
విహరిస్తున్న హృదయానుభూతుల్లోనూ
చిగురిస్తున్న ఒకే ఒక్క కల
స్వే.. చ్ఛ..!
సమయమూ సందర్భమూ తెలిసిన కవయిత్రి
కాలాన్ని విల్లులా వొంచి
అక్షరాల్ని దృశ్యాల్లా ఎగరేస్తుందీమే!
అక్షరాలా పసిపాపలాంటి అమ్మాయే!
తీరిక సమయాల్లో జీవితాన్ని గాలిపటం చేసి
వీక్షకుల చూపులపై ఎగరేస్తుంది
ఎగరెయ్యడం బాల్యానికి కొత్తకాదు
పసిప్రాయంలోని తూనీగలా సీతాకోకచిలుకలా
ఎక్కడెక్కడో తిరుగాడుతూ
చివరికి కాలం అంచుమీద వాలుతుంది
బాల్యానికి
నిజమైన చిరునామా ఇదొక్కటే!
ఊహల్లోంచి ఊహల్లోకి ఎగురుతూ
గతాన్ని వర్తమానంలోంచి
భవిష్యత్తులోకి
స్వేచ్ఛానువాదం చేస్తుంటుంది
– మానాపురం రాజా చంద్రశేఖర్

స్వేచ్ఛ తెలియని వేళ
ఒకింత దైర్యమే...!!
అయినా వెంట వెంట వచ్చేటి 'అలసట'... అడుగుతీసి అడుగు వేయలేనంత అలసట. వెలివేతల అనుబంధాల వెంట
పరిగెత్తలేని అలసట..
ఏ బంధం నీది కాలేదు,
ఏ బరువు నిన్ను మోయలేదు,
కాలం కఠిన శిల కింద
కరిగిపోయిన స్వేచ్ఛ ఏదో
నీవిప్పుడు అందుకోలేనిది,
నీకెప్పటికీ దొరకని స్వేచ్ఛ
వెలివెతల తలపోతల్లో
ఒంటరి గెలుపు కోట పై
ప్రకటించిన యుద్ధంలో
ఊపిరి వీడిన "స్వేచ్ఛ".
అనంత దిగంతాలను జయించిన అలసటలో కోరుకున్న 'స్వేచ్ఛ' ఏమిటో మీ ఎవ్వరికీ పరిచయం లేనిది,
ఎప్పటికి మిమ్మల్ని చేరువవ్వనిది. విశ్వమంతా విధిల్చివేసినా
గెలుపు పతాకమై
ఆమెను హత్తుకున్నదీ ఈ "స్వేచ్చే"
-రూపరుక్మిణి. కె

నిరాధార…..
నిరాధార.....
నువ్వు నమ్మాలని చూసే చోట
నువ్వెప్పుడూ అబద్ధానివే
నిన్ను నమ్మాలని చూసే కళ్ళకు
నువ్వెన్నటికీ మాయవే
రెండెప్పుడూ ఒకటి కాదని
ఒకటే రెండుగా మూడుగా
ఎక్కువగా తక్కువగా
మారిపోగలదని
తెలుసుకునే సరికి
స్వేచ్ఛ నరికివేయబడుతుంది
ఎవరికి వాళ్ళ కారణాలు
ఎవరికి వాళ్ళ వాళ్ళ బాధలు
ప్రమేయాలు పడిగాపులు
అన్నీ అప్రస్తుతాలు
ఉండటం పోవటం
అంతా చేతుల్లో లేని సంగతి
నీకోసం అనుకున్న
ఓ చిన్న చోటు
అసలుకే లేనిదై పోతుంది
నువ్వు నువ్వుగా వున్నావనుకున్న
ఆ చిన్ని హృదయం
ఎప్పుడో స్వార్థాన్ని దాచి పెట్టుకుని వుంటుంది
ఇవన్నీ
అడగకూడదు
పోనీ....
ఎవరితోనూ మనసు విప్పకూడదు
అలుసు కదా....
అవునూ
ఆధారపడటం అంటేనే
నిర్లక్ష్యానికి గురి కావడం కదా.....
సుధా మురళి

ఒక్కక్షణం
గుండె గుండెకో గది
గది గదికో తడి
ఆ తడిలో తడుముకున్న
నీతో గడిపిన ఒక్కో జ్ఞాపకాల మడీ
"స్వేచ్ఛ"
స్వేచ్ఛ నిర్స్వేచ్ఛ జీవం విడిచి
గగనంలోనో...గాలిలోనో...ధూళిలోనో
రూపం కోరుకోని స్వేచ్ఛా విహారంలో
ఆ స్వేచ్ఛను స్వచ్ఛందంగా
బంధించుకున్న బంధాలు
మనసున ఒదిగిన బంధనాలను తెంచుకోలేక
తడిని మరింత తడుపుకునే స్నేహాలకై
ఒక్కక్షణం...
నిలవడమో నిలపడమో
దరికిరాని పనికిరాని లోకంలో
ఒక్కక్షణం...
నీ కోసం నీవు
నీ వాళ్ళ కోసం నీవు
ఇంకొక్క క్షణం
తలపడి ఉంటే...కలబడి ఉంటే
మెడను తాకే చీర చెరగు
ఉయ్యాలై జోలపాడు కదా!!
ధైర్యం ఒడి అద్దరినే ఉంది కదా!!
రాధకృష్ణ కర్రి

స్వేచ్ఛ ఒక స్వప్నం
స్వేచ్ఛ పంజరాన్ని వీడి ఎగరాలనుకుంది
నింగి అంత ఉన్నతంగా ఎదగాలనుకుంది
విజయమే అంతిమ లక్ష్యంగా స్వప్నించింది
ఇంతలోనే..
ఏ కాలసర్పం కాటేసిందో
ఏ నమ్మకద్రోహం ఆవేదనలో ముంచిందో
ఏ దుఃఖం ఓపలేనిదైందో
ఏ నిరాశ గుండెను చీల్చిందో
ఏ నిస్పృహ మనసును నిస్తేజపరచిందో
ఏ అపజయం ఉరినెక్కి ఉసురుతీసుకోమందో
ఏ ఓటమి కాటికి పొమ్మందో ఏమో
మరణ కాంక్ష వెనుక ఏ నిఘాడ విషాదం దాగుందో
స్వేచ్ఛను నిర్వచించను మీరెవరసలు?
స్వేచ్ఛ ఇప్పుడు పంజరంలో లేదు
ఆత్మను పదేపదే క్షోభ పెట్టకండి
మీ మేడిపండు సానుభూతిని చూపకండి
మీ మేకవన్నె నాల్కలతో ప్రవచాలు చెప్పకండి
దేహపు గూటినుంచి ఎగిరిపోయిన స్వేచ్ఛను
మీ చెత్త రాతల చట్రాలలో మళ్ళీ బంధీని చేయకండి
పంజరం చుట్టూ మూగి కాట్లకుక్కలా అరవకండి
మరలిరాని స్వేచ్ఛను మాటల కత్తులతో
మళ్ళీ మళ్ళీ పొడవకండి..
మిగిలిన జ్ఞాపకాన్ని ప్రశ్నల నిప్పులతో పుటం పెట్టకండి
స్వేచ్ఛ నీడన మొలకెత్తిన చిన్నారి మొక్కను
పచ్చగా ఎదగనీయండి
స్వేచ్ఛను స్వప్నించనీయండి ..
రోహిణి వంజారి

స్వేచ్ఛ మాట
ఇది నా ఒక్క దాని వేదన కాదు!
నేనున్నప్పుడు..
క్షణ క్షణం అంతరిస్తున్న
జీవితాలెన్నో చూసాను..!!
ఇప్పుడు నేను బయట పడ్డాను గానీ..
ఇంకా బయటపడని జీవితాలెన్నో!
ఇది పరిష్కారం కాదని నాకు తెలియదా?
ఇదే పరిష్కారం కాదనీ నాకు తెలియదా?
కానీ, అందరికీ తెలియాల్సింది..
సమస్య ఏంటని!
అలసిన నా రెక్కలు
ఏదో ఒక చెట్టు నీడన సేద తీరుదామనుకుంటే
ఆ చెట్టే నా పై కూలి,
నా రెక్కలు ఉరి తీసుకునేట్టు చేసింది!
మీ పక్కన కూడా ఇలాంటి 'వేధితులు' ఎవరన్నా ఉన్నారేమో!
లేక అది మీరేనా!?
మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి!!
నా పట్ల మీ సానుభూతికి సెల్యూట్!
అది శృతి మించి నన్నే తిట్టి,
నన్ను
బాధ్యతారహితురాలిగాను,
చేతగాని దానిలా చిత్రించి,
నేను నా అనుకునే వాళ్ళను,
నన్ను నా అనుకునే వాళ్ళందరినీ..
బాధపెట్టకండి!
మీరు నా తరపున న్యాయవాది కాకపోయినా పర్లేదు..
కానీ జడ్జిగా మారకండి!! ప్లీజ్!
మీ తీర్పులతో,
మీ మీ ఆలోచనా కోణాలతో
ఇప్పుడు లేని నా ప్రాణాలపై
బాణాల గాయాలు చేయకండి.
రేపు ఇంకెవరూ..
ఆత్మ 'హ*త్య' చేసుకునే
వాతావరణం లేని
సమాజంగా తయారు కండి!
చాలు!!
- గిరిధర్

తీగ తెగిన వీణ
శీర్షిక : తీగ తెగిన వీణ
ఎవరికి నచ్చినట్టు
వాళ్లను ఉండనీయండి
పద్ధతుల కంచెలు
నియమాల గోడలతో
వాళ్లను చుట్టేస్తే
ఆ చుట్టుకొలతల్లో
తిరగలేని వాళ్లు
కనబడని గాయాల రక్తంలో
నెమ్మదిగా అలమటిస్తారు!
ఒక రోజు సూర్యుడు రాకపోతే
చందమామ చుక్కలతో ముచ్చట్లు చెప్పకపోయినా
సృష్టి ఉంటుందా?
అలాగే
ఒక పలుకూ, ఒక చిరునవ్వూ
హఠాత్తుగా కనుమరుగైతే
ఆ వెలితి మాటల్లో చెప్పలేం
హృదయం పగిలిపోతుంది
ఖాళీ గదిలా బోసిపోతుంది!
ఇలా ఎప్పటికి ఉండిపోతే
ఎంత బాగుంటుందో...
కానీ దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని
ఒకరోజు తీసుకుపోతాడు!
ఏదీ శాశ్వతం కాదు అని తెలిసినా
మనసు బంధాలను ముడి వేసుకుంటుంది !
అనుబంధాల హరివిల్లులో
తారగా నిలిచిపోవాలనుకుంటుంది!
వెళ్ళిపోతున్న వాళ్లు
చిరునవ్వుతో వీడ్కోలు చెబుతారు
మనం వాళ్ల జ్ఞాపకాలతో బతుకుతూ
తీగ తెగిపోయిన వీణలాగే
జీవచ్ఛవాలుగా మిగులుతాం!
కాబట్టే –
ఎవరినీ బంధించకుండా
ఎవరిని బాధపెట్టకుండా
వాళ్ల స్వేచ్ఛకీ మన ప్రేమకీ
ఒకే స్థలంలో చోటిచ్చే
సహనమే అసలైన బంధం!
- జ్యోతి మువ్వల

ఆమె వీడ్కోలు చెప్పింది.
ఆమె వీడ్కోలు చెప్పింది.
ఆమె వేడికోలు వినే
ఒక్క పరిచిన హృదయమూ లేక
ఆమె వీడ్కోలు చెప్పింది.
బహుశా ఒక అనునయ చేయి సాంగత్యం
ఒక మార్దవమైన మాట మురిపెం
లోన రగిలే మాట పంచుకునే మనిషి
లేరు..లేరని
ఆమె వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది.
మనిషి మనసులోని పగులు
చెప్పుకోలేని చీకటి దిగులు
వద్దు..వద్దు..
ఈ మానవ లోకం తన చుట్టూ
ఒక కన్నీటిమాట ఉబికి రాకుండా
గోడలగోరీలు కట్టింది.
ఉసూరుమనే హృదయాలలో ఒకటీ
అసహాయ ఘడియలో గుర్తు రాలేదు.
ఆమె వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది.
ఆమెతో
ఆమెకు దిటవునీయని
మన సావాస ఛాయలు కూడా..
-పి.శ్రీనివాస్ గౌడ్

స్వేచ్ఛ పదిహేనేళ్లనుంచి తెలుసు..ఎక్కడకలిసినా హలో అంటే హలో అన్నంతవరకే అయినా కార్టున్ బాగుంటే ఖచ్చితంగా బాగుందని వాట్సప్ చేస్తుంది. 2014 లో తన పోర్ట్రైట్ గీయమని అడిగింది..మర్చిపోవడమో, బద్ధకమో 2019 లో గీసిచ్చిన స్కెచ్ ఇది. ఈమధ్యే పిడికిలి ఎమోజితో గద్దర్ బొమ్మలు కావలని మెసేజ్ చేసింది..
ఆమె గళం బలంగా, ఆమె కలం నిర్మలంగా నిలిచింది. ఒక్కోసారి ఆమె ప్రసారం చేసిన వార్తకన్నా, ఆమె రాసిన కవితే గొప్ప ఉద్యమ ప్రసంగం అయ్యింది.
మొన్ననే అరుణాచలం వెళ్ళినట్టు తెలిసింది..
మనలో ” నేను ” వుండకూడదంటే ఆత్మ విచారణ చేయమని ఆత్మహత్య చేసుకొమ్మనికాదు..
చావు శరీరానికి కాదు, ‘ నేను ‘ అన్న భావనకు , అదే అసలైన స్వేచ్ఛ..
మనిషి కాదు మనసు ఆత్మహత్య చేసుకుంటే అద్భుతం జరుగుతుందని రమణమహర్షే చెప్పాడు.
అరుణాచలం ఎందుకెళ్ళావ్? నువ్వు చేసిందేంది?
-Mrityunjay
Cartoonist





