CHAPTER – 1
అది-
మధ్యరాతి యుగమని పిలవబడే ‘మిడిల్ పేలియోలితిక్’ ఎరా.
మూడున్నర బిలియన్ సంవత్సరాల వయస్సున్న బార్బెర్టాన్ పర్వత శిఖరమ్మీద, అంతకంటే ఎక్కువ వయస్సున్న ఒక నవయువకుడు దిగాలుగా కూర్చుని కిందికి చూస్తున్నాడు.
ఆ పర్వతపాదాల దగ్గర పాతికమంది పురా మానవులు ఒక శవంచుట్టూ తిరుగుతున్నారు. డప్పులు కొడుతూ డాన్స్ చేస్తున్నారు. మగాళ్ళు గొయ్యి తవ్వుతున్నారు. ఆడాళ్ళు శవాన్ని అలంకరిస్తున్నారు. భాషలన్నిటికీ మూలమైన ‘ప్రోటోసేపియన్ లాంగ్వేజ్’ లో ఉన్నట్టుండి విచిత్రంగా అరుస్తున్నారు.
కోపాన్నిమించిన బాధా, బాధనుమించిన దుఖం, దుఖాన్నిదాటిన నిర్వేదంతో కింద జరుగుతున్న తంతునంతా శిఖరం పైనించి చూస్తున్నాడు ఆ నవయువకుడు.
అందరూ కలిసి శవాన్ని పాతిపెట్టిన తర్వాత ఛాతీమీద గుద్దుకుంటూ గొల్లుమని ఏడ్చారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వెనక్కితిరిగి చూడకుండా గబగబా వెళ్ళిపోయారు.
అప్పటివరకూ వాళ్ళు చేస్తున్నదంతా మౌనమునిలా చూస్తున్న ఆ యువకుడు పైకిలేచాడు. ఉద్వేగం ఉబుకుతున్న పెదవులతో తనలో తానే గొణుక్కుంటున్నాడు.
‘ఒరేయ్ మనిషీ! ఎంతపని చేసావురా. కాయ రాలినంత రహస్యంగా కాయం రాలిపోవాలి. దేహం ప్రకృతిలో కలిసిపోవాలి. ఇప్పుడు మీరు చావుని కూడా వేడుక చేయడం మొదలుపెట్టారు. ఇవ్వాళొకణ్ణి పూడ్చారు. రేపొకణ్ణి కాలుస్తారు. పూడ్చేవాళ్ళదొక మతం, కాల్చేవాళ్ళదొక మతం అవుతుంది. తీరొక్క మతమై వేరుబడిపోతారు కదరా.’
అతను విశ్వమంత నొప్పితో విలవిల్లాడాడు.
పసిపిల్లాడిలా వలవలా ఏడ్చాడు.
అతని కన్నీరు కాల్వలై పారి
నదులై ప్రవహించి
సముద్రాలై పరుచుకున్నాయి.
అతనా శిఖరం పైనించి ఒకేఒక్క అంగలో ఆకాశానికెగిరి
దిగంతంలోకి దూకి
కాంతిధూళై రాలిపోయాడు.
ఈ భూమి మీద మతానికి పునాది వేసిన ఆ క్రతువు మొదలైన మొదటి రోజే, మనిషిమీద రోత పుట్టి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు.
అతను- దేవుడు!
అతనే సృష్టికర్త!!
దురదృష్టవశాత్తూ దేవుడి మరణం ఎక్కడా రికార్డ్ కాలేదు.
******
CHAPTER – 2
అది-
జీహాద్లనీ క్రూసేడ్లనీ హోలీవార్లని, ధర్మయుద్దాలనీ కమ్మటి కమర్షియల్ టైటిల్స్ పెట్టుకుని చేసిన నూటా ఇరవయ్యొక్క మత యుద్దాలనంతర కాలం. ఇంటర్నెట్ ఏజ్ అని పిలవబడే నాగరిక కాలం. అక్కడెక్కడో మసీదు కూలగొట్టారని ఇక్కడెక్కడో ఉన్న హైద్రాబాద్ తగలబడిపోతున్న కాలం. హైద్రాబాదుకి అతిసమీపంలో ఉన్న ఆ ఊరు కూడా పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల కుతకుతా ఉడికిపోతోంది.
అది అర్థరాత్రి.
సెంటుమల్లెల పరిమళం అలుముకున్న శరద్రాత్రి.
ఊరి చివరున్న చెరువు, వెన్నెలవానలో తడిసిపోతోంది.
పక్కపక్కన వెల్లకిలా పడుకుని, అలిసిపోయిన ఒక జంట దేహాలు చెరువొడ్డున సేదదీరుతున్నాయి.
అతను ఒకపక్కకు ఒత్తిగిలి లేచి, ఆమె మీదకు వంగి, మునివేళ్ళతో ఆమె ముంగురులను జరిపి, నుదుటన పూసిన స్వేదపారిజాతాలను పెదవులతో ఏరుకుని, మళ్ళీ పక్కకు తిరిగి ప్రశాంతంగా పడుకున్నాడు.
ఆమె లావణ్యలత. బ్యూటీని రీ-డిఫైన్ చేయాల్సినంత అందగత్తె.
అతను నజీర్. అందగాడూ, ధనవంతుడూ, వీరుడూ, నాయకుడు- ఏమీ కాదు. అతను పక్కనుంటే మాత్రం వీళ్ళందరి కంటే అతనే ఎక్కువన్నట్టు ఫీలౌతుందామె.
ఇద్దరిదీ ఒకటే ఊరు. ఒకటే కాలేజీ. ఒకరంటే ఒకరికి ఖాయిషు. ఆమె మాస్టర్స్ తో ఆపింది. అతనిప్పుడు యూనివర్శిటీలో రీసెర్చ్ స్కాలర్. నెలకోసారి అతను ఊరికి వస్తాడు. ఇద్దరూ రహస్యంగా ఆ చెరువొడ్డున కలుసుకుంటారు. కొంచెం ప్రేమను వొంట్లో, కొంచెం వెన్నెలను కంట్లో నింపుకుని ఎవరికంటా పడకుండా విడిపోతారు.
ఒక అయిదు నిమిషాల విరామం తర్వాత ఆమె ఒకపక్కకు ఒత్తిగిలితూ లేచింది. కుడి మోచేతిని మడిచి తలకింద పెట్టుకుని, అతని మీదకు వొరిగి, ఎడమచేత్తో గడ్డాన్ని రింగులు చూడుతూ పిలిచింది.
‘ఓయ్ నజీర్…’
‘……..’
‘ప్రేమ్ నజీర్…’
‘ఏంటి బుజ్జమ్మా…’
‘ఒక పాట పాడు…’
‘……..’
‘ఏదోటి పాడు… నిన్ను వినాలనుంది.’
అతనింకా సఖీ పరిష్వంగ సుఖ పారవశ్యపు అలౌకికత్వంలోనే ఉండటం వల్ల ఆమెకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. అతను మళ్ళీ నెలరోజుల తర్వాత అతణ్ణి కలిసేవరకూ ఆమె నెమరేసుకోవడానికి వీలైనన్ని ఎక్కువ మాటలు, జ్ఞాపకాలు కావాలి ఆమెకి. ఇప్పుడు విడిపోవాల్సిన టైమ్ దగ్గరపడటం వల్ల అతని నిశ్శబ్దం ఆమెకు ఉక్రోషం కలిగించింది. సన్నని పొడుగాటివేళ్ళతో రింగులు చూడుతూన్న అతని గడ్డాన్నిఒక్క పీకు పీకింది.
‘ఆహ్… బుజ్జమ్మా… నొప్పి…’
కళ్ళు తెరిచి ఆమె వైపు ముఖం చిట్లించి చూసాడు.
ఆమె పగడపు పెదవుల్లో వణికే కోరిక, అతని కళ్ళల్లో ఎర్రజీరై మెరిసింది!
మల్లెపాదు పందిరి మీద పాకినట్టుగా, ఆల్మోస్ట్ అతని మీద వొరిగిపోయిందామె. చందమామ లాంటి ఆమె గుండ్రటి మొహం అతని మొహానికి ఊపిరి తగిలేంత దగ్గరగా ఉంది. వెన్నెలే చిన్నబోయేంత వెలుగులు రువ్వుతున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చూపు పక్కకు సారించి చెవితమ్మె మీదుగా ఆకాశంలోకి చూసాడు. నిబిడనక్షత్ర నీలాకాశపుటంచున నిండుజాబిల్లి ఆమె సిగలో తురిమిన మల్లెచెండులా కనిపించింది అతనికి.
‘ఎ నైట్ ఆఫ్ టూ మూన్స్.’ గొణుక్కుంటున్నట్టు ఆన్నాడు.
‘అరె, గావో మియా’.
ఏదైనా పట్టుకుంటే వదలదామె.
ఆమెని ఇంప్రెస్ చేయడానికి అతను కొన్ని పాటలు, కొన్ని కీర్తనలు బట్టీ పట్టాడు. ఆమెకిష్టమని అష్టపదులు కూడా నేర్చుకున్నాడు. అతనెప్పుడూ ప్రార్థనా మందిరాలకి వెళ్ళడు. కానీ రకరకాల మతగ్రంథాలు, పురాణాలు చదువుతాడు. సున్నిత శృంగార భావోద్వేగాలను కవితాత్మకంగా చెప్పిన బైబిల్ ‘సాంగ్ ఆఫ్ సోలొమాన్’ అతని ఆల్ టైమ్ ఫేవరెట్. ‘అయిగిరినందిని‘ లో ఫోనెటిక్ బ్యూటీ, సుప్రభాతంలో రొమాన్స్, అష్టపదుల్లోని లౌకిక అలౌకిక శృంగారం అతను వివరిస్తుంటే ఆమె అబ్బురంగా వింటూ ఉంటుంది. అన్ని మతాల్లోనూ దేవుడి పేరుమీద వచ్చిన సాహిత్యం చాలా గొప్పది అనీ, అదొక్కటే మనుషులకి దేవుడి పేరు మీద జరిగిన గొప్ప ఉపకారం అనీ వాదిస్తాడు అతను.
‘పాడవయ్యా మగడా!’
ఇక తప్పదని తెలిసి అతను గొంతు సవరించుకున్నాడు. గొప్ప గొంతు కాదు గాని అతని స్వరంలో ఒలికే హానెస్టీ రాగం ఆమెకు భలే ఇష్టం.
‘చందన చర్చిత నీల కళేబర.. పీత వసన వనమాలీ….’
‘మీనింగ్ చెప్పుకుంటూ పాడు.’
అతని పెదాలపై తన పెదాలద్దుతూ అంది.
‘కైసే… నువ్విట్ల నోరు మూసి ఎట్ల చెప్పనూ…’
ఆమె పైపెదవిని మునిపంటితో ఇంకొంచెం లోపలికి లాగి జుర్రుకుంటున్నాడు.
‘ఆహ్… బద్మాష్.! నేను జస్ట్ ఫెదర్ టచ్ లెక్క పెట్టిన, నువ్వు మోటుగా కొరికినవ్.’
‘ఠీక్ హై… అబ్ మై భీ ఫెదర్ టచ్…’
‘నకరాలాపు. మీనింగ్ జెప్పు…’
‘జయదేవుడు బోల్తా హై… శ్రీగంధం పూసిన నల్లటి శరీరమ్మీద పచ్చని వస్త్రమూ, పాదాలవరకు వేలాడే వనమాలను ధరించిన కృష్ణుడూ…’
‘ఆగాగు…’
అతని మెడవంపులో తలపెట్టి గట్టిగా వాసన పీల్చింది.
‘నీ అత్తరు వాసన శ్రీగంధంకు తక్కువేం లేదు. నీ జుబ్బా అచ్చం వనమాల తీర్నే పొడుగ్గా ఊగుతుంటది…’
‘సో..?’
‘పచ్చని వస్త్రం ఒక్కటుంటే నువ్వు కృష్ణుడిలెక్కనే కదా నాకు.’
తమకంతో అతని కళ్ళల్లోకి చూస్తూ, ఎడమకాలు పైకి లేపి, అతని నడుంకి అటువైపు ఆనించి, చటుక్కున పైకిలేచి నిటారుగా అతనిమీద కూర్చుందామె.
ఆమె రసోద్రేకాన్ని చూసి ఉద్వేగపడి జాబిల్లి కళ్ళు విప్పార్చి చూసినట్టుగా వెన్నెల వెలుగు రెట్టింపైంది. ఆ వెలుగుకి అతని మెడలోని పచ్చని తాయెత్తు ప్రకాశించింది.
‘ఏయ్… ఇగో, పచ్చని వస్త్రం! నువ్వు బరాబర్ కృష్ణుడివేరా…’
ఆమె ఆనందం అదుపుతప్పి ‘పృథువక్షోజ నితంబ భారయై’ యవ్వనధనస్సు లాగా అతనిమీద వొరిగిపోయింది. ఆమె పొడవాటి జుట్టు జలజలా జారి, నల్లటి పరదాలా వాళ్ళిద్దరి మొహాల చుట్టూ పరుచుకుని ప్రకృతి కంటపడకుండా దాచేసింది.
‘పీన పయోధర భార భరేణ హరిం పరిరభ్య సరాగం’
‘అంటే…? ప్చ్ ప్చ్ ప్చ్?’
‘కృష్ణున్ని జూడంగనే గోపికకి తమకం వచ్చి, స్తనాలు ఉప్పొంగి, బరువు తట్టుకోలేక ఆయన్ని అదిమి కౌగిలించుకుందట.’
బొక్కలిరిగేటట్టు అతన్ని బిగ్గిత అమురుకుని, జంట కుందేళ్ళను అటూఇటూ తిప్పుతూ, అతని ఛాతీవాకిలి మీద ముగ్గుల డిజైన్లేస్తూ అడిగింది.
‘ఇట్లనేనా… ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్’
అతను పాడటం ఆపేసాడు.
ఆమె అడగడం మానేసింది.
ప్రోటోసేపియన్ లాంగ్వేజ్ కంటే ముందుపుట్టిన ‘దేహభాష’ లో వాళ్ళిద్దరూ మరోసారి మాట్లాడుకుంటున్నారు.
ప్రకృతీపురుషుల్లాంటి వాళ్లిద్దర్నీ చూడటానికి చెరువులో వయసుకొచ్చిన చేపపిల్లలన్నీ చెంగుచెంగున ఎగురుతున్నాయి. క్రూరమృగాలు, సాధు జంతువులూ జాతిపగను మర్చిపోయి పక్కపక్కన చేరి పరికిస్తున్నాయి. వాళ్ళ రసస్ఫూర్తితో కొన్ని జంతువులు సరసాలాడుకుంటున్నాయి కూడా.
అప్పుడే అటువెళ్తున్న ఒక మనిషిజంతువు వాళ్ళని చూసింది.
పులకరించాల్సిన దాని రక్తం సలసలా మరిగింది.
***
అది-
కులకమల పుష్పవజ్రంబు నిత్యసౌరభమ్ములు వెదజల్లు ఇల్లు.
చెళ్ళుమని ఆమె దవడమీద ఒక్కటి పీకాడు తండ్రి.
దెబ్బకు లావణ్యలత దబ్బుమని నేలమీద కూలబడింది.
‘సదువుకోమని సిటీకి బంపుతె బరితెగించి తిరుగుతావే బట్టెబాజ్ దానా. గీ ముచ్చట ఊల్లెర్కయితె మనకు బర్కతుంటదా?’
కోపోద్రేకంతో ఊగిపోతున్నాడు తండ్రి.
పక్కనే నిలబడ్డ చిన్నతమ్ముడు పెద్దన్నల వైపు సాయం కోసం చూసింది. ఆల్రెడీ వాళ్ళిద్దరి కళ్ళల్లో కమ్మరి కొలిమిలు మండుతున్నాయి. నడిపోడు ఊర్లో లేడు కాబట్టి ఆ పంచాయితీ ఆమాత్రం ప్రశాంతంగా ఉంది.
‘నజీర్ శానా మంచోడు బాపూ. బాగా సదువుతడు. యూజీసీ ఫెలోషిప్ గూడ వచ్చింది. రేపోమాపో పెద్ద కొలువు గూడ అయితదే’
‘పెద్ద కొలువుంటే పెద్ద కులముంటదానే చినాల్ దానా. మతంబోతే కులంబోతది. కులంబోతే బలంబోతది.’
ఎప్పుడూ చెల్లిని పల్లెత్తుమాట కూడా అనని చిన్నన్నయ్య ఆమె జుట్టుబట్టుకుని డొక్కలో లాగిపెట్టి తన్నాడు.
‘అమ్మా…’ అని అరుస్తూ కడుపు చేత్తో పట్టుకుని తల్లి వైపు చూసింది లావణ్యలత.
తల్లి స్వరంలో భాస్వరం ప్రవహించింది.
‘నువ్వు గా సాయిబులోణ్ణి లగ్గం జేస్కుంటే మాకు ఇజ్జతుంటదా. వాడకట్టుల కులపోల్లందరు థూ అని నోట్లె ఊంచుతరే.’
‘నజీర్ లేకపోతే నాకు బతుకేబోతదమ్మా. సావనన్నసత్తగని మనుండగా మరొకన్ని జేస్కోను. మీరు గాదంటే ఇల్లన్నా ఇడుత్త పానమన్నా ఇడుత్త. ఇగ మీ ఇష్టం మల్ల’.
జీవితంలో ఇంత ధైర్యంగా ఆమె ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడలేదు.
ప్రేమని బలంతో గెలవలేమని వాళ్ళ నాన్నకి తెలుసు. వయసు ఇచ్చిన జ్ఞానం అది. భార్యని, కొడుకుల్నీ పక్కకి తీసుకెళ్ళి కాసేపు ఏదో మంతనాలాడాడు. మొత్తానికి ఏదో ఒక ఏకాభిప్రాయనికి వచ్చారని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి గ్రహించింది లావణ్యలత.
నలుగురూ ఆమె దగ్గరికి వచ్చారు.
‘ఇగో బిడ్డా, నువ్వా తుర్కోనితో లేశిపొయ్యి మా యిజ్జద్దీయకు. ముందుగాల్ల ఒకసారి పొలగానితో మాట్లాడి సూద్దాం. నచ్చితే లగ్గం సంగతి ఇశారిద్దాం! ఏమంటవ్? అన్నాడు తండ్రి.
కన్నీళ్లతో పాటు ఆశల ధార కురుస్తుండగా లావణ్యలత నవ్వింది.
*****
అది-
తక్కువ కులపోడికి అరమార్కైనా తక్కువేసి, తమ కులపోనికి గోల్డ్ మెడల్ వచ్చేలా చేయగలిగిన కులీనగురువులు బోధించే విశాల విశ్వవిద్యాలయం.
నజీర్ ఆడిటోరియంలో ‘అభిజ్ఞాన శాకుంతలం’ సంస్కృత శ్లోకాన్ని రాగయుక్తంగా పాడి అనర్ఘళంగా అనలైజ్ చేస్తున్నప్పుడు, పెద్దన్నయ్య, చిన్నన్నయ్యతో కలిసి నడిపోడు కూడా ఎంటరయ్యాడు. ఆ శరద్రాత్రి ప్రేమికుల శృంగారాన్ని చూసి ఉప్పందించిన మనిషి జంతువు ప్రకాషే వాళ్ళని ఇక్కడకి తీసుకొచ్చాడు. వాడు లావణ్యలత క్లాస్మేట్. అతనికి ఆ పిల్లమీద ఇంట్రస్టేం లేదు. వాళ్ళ కాస్ట్ పిల్ల వేరే కాస్ట్ అబ్బాయిలతో మాట్లాడితేనే వాడికి బ్లడ్డు బాయిలవ్వుద్ది. ఈ పిల్ల ఏకంగా సాయిబుల పోరనితో యవ్వారం వెలగబెడుతుంటే అతని రక్తం బాయిలింగ్ పాయింట్ దాటి ఆవిరయ్యే స్థాయిలో మరిగింది.
ఉరుములేని పిడుగులా వచ్చిన ఆ నలుగురిని చూసి నజీర్ బిత్తరపోయాడు. కాంపస్ వెనకాలున్న గుట్టలకు తీసుకుపోయారు నజీర్ ని. పెద్దన్న పెద్దరికంతో మొదలెట్టాడు.
‘సంస్కృత శ్లోకం గింత మంచిగ జెప్పినవంటే నువ్వు మామూలోనివి గాదబ్బా… మస్తు ఉషారున్నది నీకు.’
‘గొడ్డుమాంసం తినేటోనికి నాలిక గీతీర్న తిర్గది. జరూర్ మీ అమ్మ నిన్ను మావోల్లకే కనుండాలె.’
అంతిమ సత్యం ఆవిష్కరించి ఫెళ్ళుమని నవ్వాడు ప్రకాష్.
నజీర్ సన్నగా నవ్వుతూ అన్నాడు, ‘ఒప్పుకుంటా- కానీ మీవోల్లలో నాలెక్క జుబాన్ చెలాయించడం రానోళ్ళందరూ మావోళ్ళకి పుట్టిండ్లని మీరొప్పుకుంటే’
నలుగురికీ దవడకండరాలు బిగుసుకున్నాయి.
‘నువ్వు ప్రేమించడానికి మీ మతంల పోర్లు లేరారా బాడ్కోవ్’.
‘ప్రేమించాలంటే కులం మతం ప్రాంతం డబ్బు ఇన్ని జూసుకోవాల్నని తెల్వదు. సారీ. మేం జస్ట్ ప్రేమించుకున్నాం.’
నడిపోడు తెలివైనోడు. ఇండియన్ హిస్టరీ మీద చాలా గ్రిప్పున్నోడు.
‘రేయ్, ఇది మా దేశం. స్వచ్చమైన ఆర్య రక్తం. పన్నెండొందలేండ్ల కిందట మహ్మద్ బిన్ ఖాసిం, తర్వాత ఘోరీగాడు రాకముందు ఈ దేశంల మీ మతం ఎక్కడున్నదిరా? స్కాలర్ వి గదా, నువ్వే జెప్పు.?’
‘సహీ బాత్. మేం బైటోల్లమే అనుకుందాం. కానీ పన్నెండువందలేండ్ల లివిన్ రిలేషన్షిప్ మనది. ఒకల్నొకలు ప్రేమించుకున్నాం, నిఖాలు జేస్కున్నాం, ఇంకా చానా జేసుకున్నాం. ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని జాతులు కొన్ని వందలజనరేషన్స్ కలిసి బతికినంక యే మతంలనైనా ‘ప్యూర్ జెనెటిక్’ వారసులుండే ఛాన్స్ ఉంటదా. ఉంటే ఎట్లా తేలుస్తవ్ ?’
కొన్ని ఫండమెంటల్ కొచ్చన్లంతే. వేలయేండ్ల నమ్మకాల పునాదులు కదిలిపోతాయ్.
‘తేలుస్తంరా. అన్నీ తేలుస్తం. మందిరంతో మొదల్వెట్టినం. మీ తప్పులన్నీ ఒక్కొక్కటి సరిజేత్తం’
‘ఓకే. సబ్ ఠీక్ కరో. కానీ ఒక ఆర్డర్ల జేయుర్రి. నిన్నటికినిన్న మీ కండ్లముంగట చైనావాడు కబ్జా జేశిన భూభాగం, మొన్నటికిమొన్న బ్రిటీషోడు దొబ్బుకపోయిన సంపద వాపస్ పట్కరాండ్రి ముందు. ఏక్దమ్ వెయ్యేండ్లు ఎందుకు ఎన్కకి పోతానవ్.?’
నజీర్ మాట్లాడింది సగం అర్థంకాలేదు ఎవడికి. అర్థమైన మిగతా సగం నచ్చలేదు. అందుకే ఎవరూ ఏం మాట్లాడలేదు.
‘ఎందుకో నేను చెప్పనా, చరిత్రలోకి పోతే నీకు శత్రువు కనపడడు. అందుకే ఆడికి పోవుడు నీకు ఈజీ. ఇక్కడైతే బలమైన శత్రువు ఉన్నాడు. వాడు వంగబెట్టి వార్ డిక్లేర్ జేసి బొక్కలిరుస్తడు. అందుకే కండ్ల ముంగటి శత్రువుని వదిలేసి వేలయేండ్లు ఎన్కకిపోతానవ్.’
నచ్చని నిజం గుచ్చుకున్నప్పుడు మనలో కలిగే భావన్నే ఇంటాలరెన్స్ అంటారు.
నడిపోడు గబగబా నడుచుకుంటూ వెళ్ళి కారు డిక్కీలోంచి గునపం బయటకు గుంజి నజీర్ దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. పాతమసీదు మీద పోటు వేయడం కోసం కొత్తగునపం కొనుక్కుని, పోటెత్తిన కెరటంలా పదమూడొందల కిలోమీటర్లు ప్రయాణించాడు గానీ స్టేషన్లో దిగగానే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తన ప్రమేయం ఏమాత్రం లేకుండానే పవిత్రకార్యం జరిగిపోయిందని గిల్టీగా ఉన్నాడు.
ఆక్షణం- నజీర్ మొహం కూడా ఎందుకో ఆ పాతమసీదులా కనిపించింది.
‘మాదర్చోద్..’
జాతీయ జెండాను ఎగిరేసినంత గర్వంగా వాడు నజీర్ గుండెల్లో గునపం దిగేశాడు.
ఎగజిమ్మిన నజీర్ రక్తం కూడా ఎర్రగానే ఉంది- విచిత్రంగా.
రెడ్ బ్లడ్. బ్లడ్ రెడ్. బ్లడీ రెడ్ బ్లడ్.
రుధిరమా మతానికొక రంగులో ఎందుకు లేవు.
ఆశ్రువా కులానికొక రుచిలో ఎందుకు లేవు.
ఒరేయ్ సృష్టికర్తా…!
మిలియన్ల నక్షత్రమండలాలను డిఫరెంట్ గా సృష్టించిన వాడివి. జస్ట్- పాతిక మతాలకు సెపరేట్ రక్తం ఇవ్వలేకపోయావా. పరమతస్థులు పరిచమైనప్పుడు పొరపాటున కూడా ప్రేమించకుండా ఒక రిపల్సివ్ జీన్ కనిపెట్టలేకపోయావా.
సమస్త విశ్వాన్ని సమతుల్యంతో ప్రతిష్టించిన దరిద్రుడా, ఏమిరా నీ వల్ల మానవజాతికి ఉపయోగం.
బాధగా మూలిగి, నెమ్మదిగా నేలకొరిగి, నిశ్శబ్దంగ ఆకాశం వంక చూశాడు నజీర్.
పండువెన్నెల్లాంటి లావణ్యలత నిండురూపాన్ని ఆఖరుసారి కళ్ళల్లో నింపుకున్నాడు.
‘బుజ్జమ్మా, నాకసలు ఏ దేవునిమీదా నమ్మకం లేదు, ఒక్క నీ ప్రేమ మీద తప్ప. సచ్చినంకచ్చే జన్నత్ మీద బిల్కుల్ నమ్మకం లేదు. నీ పక్కన నాల్గుదినాలు బత్కుడే నాకు బిగ్గెస్ట్ జన్నత్’ అనేవాడు లావణ్యలతతో.
అతనిది చాలా ఇంటెన్స్ లవ్. అందుకే ఫ్రెండ్సంతా అతన్ని ‘ప్రేమ్ నజీర్’ అని పిలుచుకునేవాళ్ళు.
అతను లావణ్యలతని ప్రేమిస్తూనే మరణించాడు.
అతను లావణ్యలతని ప్రేమించినందుకే మరణించాడు.
సమ్ టైమ్స్ ప్రేమ ఈజిక్వల్ట్ టు మరణం ఇఫ్ యూ లవ్ అన్యమత జన్యువు ఇన్ ఇండియా.
ఆమెన్.
****
CHAPTER -3
అది-
పరమపరిశుద్ద జన్యువులన్నీ ముక్తహస్తాలతో మందిరం మళ్ళీ అక్కడే కట్టుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరా.
బాహ్యసౌందర్యం కృశించి, అంత:సౌందర్యం అంతరించి, బాధని కళ్ళమీద నఖాబ్ లా తొడుక్కుని బాచుపల్లి పంచాయితాఫీసు బెంచీమీద కూర్చుంది లావణ్యలత.
ఎలాగైనా ఇవ్వాళ సర్టిఫికేట్ తీసుకోవాలి. రేపే లాస్ట్ డేట్. రేపుమాపు అంటూ తిప్పుతూ గోస పోసుకుంటున్నారు.
అటెండర్ ఫ్లాస్క్ తీసుకుని బయటకు వెళ్ళడం చూసి రివ్వున పిట్టలా తాశీల్దార్ రూంలో దూరిపోయింది.
‘సార్. నమస్తే. ఇలా లోపలికొచ్చినందుకు సారీ. నా కూతురు PGT క్వాలిఫై అయ్యింది. రేపే ఇంటర్వ్యూ. నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ గావాలె. ఫాదర్ ఇన్కమ్ అడుగుతాన్లు’
చకచకా చెప్పుకుంటూపోతోంది.
కుర్చీలో ఉన్న ఆఫీసర్, మాట్లాడుతున్న ఫోన్ కట్చేసి, ఆమెనే ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
‘ఐ యామ్ ఎ విడో సర్. మావారు పోయేనాటికి అసలు ఆధార్ సిస్టమే లేదు. ఇప్పుడు తండ్రి ఆధార్ గావాలంటె ఎట్ల.. ’
‘లతా బాభీ…’
టక్కున ఆపిందామే. ఆ పేరుతో ఆమెను పిలిచేవాళ్ళు బహు తక్కువ.
‘ఆప్ లతా బాభీ హై నా…’
‘నువ్వూ… మీరూ… బాగా తెలిసినట్టు అనిపిస్తాంది.’
‘మై వజీర్ రహ్మాన్. నజీర్ కా భాయ్…’
గుండె గొంతులో కొట్లాడిందామెకు.
‘వజీర్… తుమ్…‘
పాతికేళ్ళ జ్ఞాపకం పాతాళగంగై పైకెగదన్ని కళ్ళల్లోంచి దూకింది.
ఆమె తూలి పడిపోబోతుంటే గబగబా లేచొచ్చి చెయ్యి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడతను.
అటెండర్ అప్పుడే తెచ్చిన ఫ్లాస్క్ లోంచి కప్పులోకి కాఫీ వొంపి ఆమెకిచ్చాడు.
ఆమె కాస్త తేరుకున్నాక ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకున్నాడు. ఒకఫోన్ చేశాడు. ఒకఫైల్ కదిలింది.
ముద్రగుద్దిన సర్టిఫికేట్ అటెండర్ అతని ముందుపెట్టాడు.
సంతకం పెట్టబోతూ పేరు చూశాడు.
‘నజ్రియా నారాయణ’
ఆఖరుసారి ఎప్పుడేడ్చాడో అతనికి నిజంగా గుర్తులేదు. నజీర్ చనిపోయినప్పుడు కూడా ఒకరకమైన నిర్వేదం ఆవరించి ఏడుపు రాలేదతనికి. దశాబ్దాల దుఖాన్ని కంటి చెలియలికట్టలో బంధించిన వజీర్ రెహ్మాన్-
ఆరోజు-
అక్కడ-
ఆ పేరు చూసి-
కన్నీటి ఉప్పదనంలోని గొప్పదనం కనుగొన్నాడు.
***
అది-
దిగువ మధ్యతరగతి జన్యువులు బతికే లోక్వాలిటీ లోకాలిటీలో రెండుగదుల అద్దె ఇల్లు.
లావణ్యలత భర్త నారాయణ ఇరవైయ్యేళ్ళ కిందట ఒక ఆక్సిడెంట్లో చనిపోయాక ఆమెకు కూతురే జీవితమైంది. ప్రైవేట్ స్కూల్లలో టీచర్ గా పనిచేస్తూ నజ్రియాను చదివించింది. ప్రేమకంటే మతమే గొప్పదనుకున్న ముగ్గురన్నలూ, ఆమె భర్త పోయినపుడు మాత్రం ఆస్తి గొప్పదనుకున్నారు. రేట్లు కోట్లుగా పెరిగిన భూముల్లో చెల్లి వాటాకి రాకుండా దూరం పెట్టారు. మతం కన్నా డబ్బు ఇంకా గొప్పది.
వజీర్రహ్మాన్ లత ఇంటికి రావడం అది తొమ్మిదోసారి. నజ్రియా నవ్వులో నజీర్ ని వెతుక్కోవడానికి వస్తాడతను. ఆమెను నజ్రియాగానో నారాయణగానో విడదీసి చూడలేకపోయేవాడు.
‘లతా భాబీ, రెండు ప్రపంచాలను కలిపిన ఫరిష్తా ఈ పిల్ల. అందుకే నాకు ఇష్టం’ అంటాడు లావణ్యలత తో.
అతను ఏది చెప్పినా ఆమె పెద్దగా మాట్లాడదు.
ఒకానొక కాఫీ సమయాన ఇరవైమూడేళ్ళ నజ్రియా వజీర్ ని అడిగింది.
‘అంకుల్, మావయ్యలు మీ బ్రదర్ని చంపిండ్రు గదా, మీకు మా అమ్మ మీద కోపం రాలేదా.?’
‘భయ్యాని చంపింది మీఅమ్మ కాదుగదా బేటా.’
‘ఫిర్ భీ, అమ్మని లవ్ చేయడమే కదా రీజన్?’
‘ప్రేమించడానికి రీజన్ అవసరంలేదు బేటా. ద్వేషించడానికే గావాలి. ఏ రీజనూ దొర్కకపోతే వేలయేండ్లు ఎన్కకుబోయైనా ఏదో రీజన్ ఎతుక్కుంటరు, అది మీ వాళ్ళైనా కావచ్చు, మా వాళ్ళైనా కావచ్చు. మతపిచ్చి ప్రపంచమంతటా ఒక్కటే తీరు, రూపాలు మాత్రమే వేరు.’
‘మీరెందుకసలు మేరేజ్ చేసుకోలేదు’. సడెన్గా అడిగిందా పిల్ల.
నజీర్ కంటే అరేండ్లు చిన్నోడు వజీర్. లావణ్య నజీర్ ల ప్రేమకు అతనే దూత.
‘ఆరోజు నజీర్ భాయ్ ని ఖననం జేయనీకి ఖబ్రస్తాన్ వోతున్నం. చౌరస్తాల మీ అమ్మ పెండ్లిబరాత్ ఎదుర్వడ్డది. గింతేనా జీవితం అనిపిచ్చింది. నాకు మనిషి మీదనే నమ్మకంబోయింది బేటా, ఇగ మ్యారేజ్ మీద ఉంటదా!’
ఒకరాత్రి వాల్లింట్ల డిన్నర్ చేయాల్సిందే అని వజీర్ని పట్టుబట్టి ఆపింది నజ్రియా.
భోజనం చేస్తుంటే తనకు వడ్డెపల్లి రూరల్ల పోస్టింగ్ వచ్చిందనీ, హన్మకొండ భధ్రకాళి హాస్టల్ల పీజీ అకామెడేషన్ అనీ చెప్పింది నజ్రియా. నెక్స్ట్ వీక్ అమ్మ, మీరు నన్ను వరంగల్ల డ్రాప్ చేస్తారా అని రిక్వెస్ట్ చేసింది. నజ్రియా పలుకే ఫత్వాతో సమానం అతనికి. ఇక ఆమె రిక్వెస్ట్ డైరెక్ట్ గా దైవాజ్ఞే.
పొద్దున్నే లేచి, కారు నీట్ గా కడిగించి, లావణ్యలతనీ, నజ్రియాని కారులో ఎక్కించుకుని వరంగల్ బయల్దేరాడు.
జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి, హాస్టల్ ఫార్మాలిటీలు అయ్యేసరికి చీకటి పడింది. నజ్రియాకు జాగ్రత్తలు జెప్పి ఇద్దరూ కారులో రిటర్న్ అవుతుండగా అడిగింది లావణ్యలత.
‘వజీర్, మనూరు పక్కనే ఉంది గదా. ఒకసారి వెళ్ళొద్దమా. మనసు గుంజుతాంది.’
***
CHAPTER –4
అది –
నెమళ్ళు పురి విప్పుకున్నని ఆడినట్లుగా చెట్లు చిగుర్లు విప్పుకుని నాట్యం చేస్తున్న వసంతకాలం.
అదే ఊరు. అదే చెరువు. అదే శరద్రాత్రి.
అదే వెన్నెలవాన బీడుబడిన ఆమె దేహభూమిని తడిపి, బాహ్యాంతర సౌందర్యాలు కలిపి కుడుతూ, కొత్తఅంటు కడుతోంది.
ఇద్దరూ చెరువొడ్డున పక్కపక్కన కూర్చున్నారు.
అతనేదో చెప్పాలని తండ్లాడుతున్నాడు.
‘లతా బాభీ.. నజ్రియా హాస్టల్ కెల్లిపోయింది. ఏదో ఒకరోజు నీ జిందగీ నుంచి టోటల్ గా ఎల్లిపోతది. ఒక్కదానివి ఉండగలవా…’
‘…..’
‘ఒక్కదానివే ఉండాలా…’
‘…..’
అరగంట ఎదురుచూసి ఆగలేక అన్నాడతను, ‘భాయ్ జాన్ పోయినంక ఒంటరిగనే బతికిన. లోపటంత ఏదో నారాజ్ నారాజ్ ఉంటుండె. అదేందో ఎర్కయ్యేటిది గాదు. నిన్నూ, నజ్రియాని జూశినంకనే అదేందో సమజైంది.’
చెప్పుకుంటూ పోతున్నాడు. ఆమె వింటుందో లేదో తెలియడం లేదు.
అలలమీద ఆడుతున్న చందమామని తదేకంగా చూస్తోంది.
‘ఎక్కువ ఆశవడ్తున్ననా?’
‘…..’
‘యు కెన్ సే నో. బట్ సే సంథింగ్ ప్లీజ్…’
అండర్లైన్ చేస్తున్నట్టుగా అర్థించాడు.
సన్నగాలి మోసుకొచ్చే పొన్నపూల పరిమళాన్ని గట్టిగా పీల్చుకుంటూ అతని వైపు చూసి పెదవి విప్పిందామె.
ఆమె చెప్పేది వినడంకోసం చెరువు అలలు చలించడం మానేసాయి. చందమామ కళ్ళు విప్పార్చి చూసినట్టు వెన్నెల వెలుగు రెట్టింపయ్యింది. ఆమె ఏం చెప్తుందో వినడం కోసం చెరువులో చేపలు ఎగిరెగిరి దూకుతున్నాయి. ఆమె నిర్ణయం ఏంటని సాధుజంతువులు క్రూరజంతువులు జాతివైరం మర్చిపోయి ఒకేచోట చేరి ఎదురు చూస్తున్నాయి.
ఆమె పెదవి విప్పి ఏదో చెప్పబోతుండగా గుడిలో ఎవరో మైకు ఆన్ చేసారు.
యేటి తరగలమీంచి పాక్కుంటూ శీతగాలి పాతపాటనొకటి మోసుకొచ్చింది.
‘చందన చర్చిత నీల కళేబర పీత వాసన వనమాలి…’
నీలగోరింటలాంటి తన అరచేతిని లేపి, అతని చేతిమీద సుతారంగా మోపి, భుజమ్మీద తలవాల్చిందామె.
నిశ్శబ్దంగా పాటని ఇంకించుకుంటోంది.
ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
మౌనం మాట్లాడగల్గినపుడు ప్రేమిస్తున్నానని చెప్పడం కూడా శబ్ద కాలుష్యమే.
అతను ఆమె కళ్ళల్లోకి చూసాడు.
వెన్నెలని తాగి వెలిగిపోతున్న ఆ కళ్ళల్లో దేవుడి రహస్య రూపమొకటి కనిపించింది. అది భూగోళం మొత్తమ్మీద ఏ మతంలోనూ లేని అపురూప రూపం.
పోతూ పోతూ దేవుడు భూమ్మీద ‘ప్రేమ’ని వదిలేసి వెళ్ళిన సంగతి కొంతమందికి మాత్రమే తెలిసిన గొప్పరహస్యం.
***

