మా అమ్మకి అస్తమాటూ బదిలీలు అవుతూ ఉండేవి. మా నాన్న చనిపోయాక ఆయన తరపున మా అమ్మకి ఆ వుద్యోగం వచ్చింది. మా అమ్మ పెద్దగా చదువుకోక పోవడం వలన, అంతకు ముందు ఎప్పుడూ ఇల్లు దాటి బయటి ప్రపంచం చూడకపోవడం వలన ఆఫీస్ లో అందరిని ఆకట్టుకోలేక పోయేదట. అందుకనే ఆమెకి చీటికీ మాటికీ బదిలీలు అయ్యేవట. మా అమ్మే ఒకసారి ఆ విషయం చెప్పింది. మేము అట్లా మా అమ్మ బదిలీ పై ఆ వూరికి వచ్చాము. అది చిన్న మండలం. అక్కడ అన్నీ తెలుగు మీడియం
బడులే ఉండేవి. ఆ మండలం నుండి ఎనిమిది కిలోమీటర్లు వెళితే ఒకే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది. ఒక చిన్న వ్యాను ఆ ఆ చుట్టు పక్కల ఊళ్లలోని పిల్లల్ని ఆ స్కూల్ కి తీసుకెళ్లడానికి వచ్చేది. నన్ను ఆ స్కూల్ లో చేర్చింది మా అమ్మ.
స్కూల్ కి వెళ్ళడానికి మొదటి రోజు ఆ వ్యానులో ఎక్కి బిక్కు బిక్కు మని కూర్చుని వున్న నా దగ్గరికి వచ్చింది తను. రింగులు రింగులు జుట్టు ను అణిచి పెట్టి వేసిన రెండు జడలు. ఇంత పెద్ద నోరు. ముఖమంతా నోరే. ఆ నోటి నిండా నవ్వు. నా దగ్గరికి వచ్చి “కొద్దిగా జరుగబ్బా “ అని, నా పక్కన కూర్చుని, “ కొత్తగా వచ్చావా?, ఏ క్లాసు ? ఏం పేరు? నా పేరు “మదాలస మంజుల వాగ్విలాస దేవి”. నా పేరు చూసి భయపడకు అది మా తాత పెట్టాడులే నాకు. ఆయన పండితుడులే. తాత పెట్టిన పేరు కదబ్బా!
ఉంచుకోవాలి. తప్పదు. నేను సిక్స్త్ క్లాస్ ‘ ఏ ‘ సెక్షను. మా క్లాస్ లీడర్ ని నేనే కదా అందుకని కరెక్ట్ టైం కి నేను స్కూల్ కి వెళ్లి తీరాలి. అందుకనే ఈ బస్సు ఎక్కుతాను. బస్సు వాళ్ళు లేట్ చేసినా స్కూల్ వాళ్ళ బస్సే కదా, అందుకని వాళ్ళు ఏమీ అనరనమాట. అరే !నువ్వు నీ పేరు చెప్పనే లేదే, నేనే నిన్ను మాట్లాడనివ్వడం లేదు కదబ్బా. ? సరే నీ పేరు చెప్పు ? అంది. నేను బెరుకుగా “లావణ్య “ అన్నాను. తను నవ్వి “నీ పేరు బాగుందబ్బా. ఏ క్లాస్ నువ్వూ ?” అంది. నేనూ ఆరో క్లాసే, అదే విషయాన్ని తనకి చెప్పాను. తను ఆశ్చర్యపడి నన్ను ఎగాదిగా చూసింది. చివరికి, “అయితే నువ్వూ నా క్లాసే, కానీ చూసేందుకు అలా లేవులే, ముద్దుగా ఫోర్త్ క్లాస్ పిల్లలా వున్నావ్ “అంది. నేను కూడా తనని పరికించి చూసాను. తను చాలా ఒడ్డు, పొడవు . పదవ తరగతి అంటే ఎవరయినా నమ్ముతారు. నేను తనను పరికించి చూస్తుంటే తను నా మనసు చదివేసినట్లు “ఏం చేసేదబ్బా మా ఇంట్లో అందరూ నా లాగే పొడవు మనుష్యులు “ అంది. నన్నే కాదు, బస్సు స్కూల్ ముందు ఆగే సమయానికి ఆ అమ్మాయిని మాట్లాడించని వాళ్ళు, ఆ అమ్మాయితో మాట్లాడని వాళ్ళు ఆ బస్సులో మిగిలి లేరు.
మదాలస ప్రతి రోజూ, వాళ్ళ వూరిలో రోడ్డుకి ఆనుకుని వున్న ఒక వేపచెట్టు దగ్గర బస్సు ఎక్కేది. ఆ వేప చెట్టు మొదలు వద్ద, తల వరకు వున్నగ్రామ దేవత విగ్రహం ఉండేది. ఆ వేప చెట్టు కు పక్కన కొంత దూరంలో ఆ గ్రామ దేవతకి,
దేవాలయం ఉండేది. వేప చెట్టు చుట్టూ కట్టి వున్న అరుగు మీద తను కూర్చుని బస్సు కోసం ఎదురు చూసేది. తనని బస్సు ఎక్కించిన తరువాత తనని అక్కడ దింపడానికి వచ్చిన ఆమె తల్లి, బిడ్డకి ‘టాటా’ చెప్పి కారు నడుపుకుంటూ వెళ్లి పోయేది. వాళ్ళ కారు, ఆ కారును నడుపుకు వచ్చే ఆ అమ్మాయి అమ్మని చూస్తే “అంత ధనవంతులు ఆ వూర్లో ఎందుకు వున్నారో “ అని ఆశ్చర్యం వేసేది నాకు. అదే విషయాన్నీ ఇంటికి వచ్చి మా అమ్మకి కూడా చెప్పేదాన్ని. మా అమ్మ, బిడ్డ చెప్పిన విషయాన్ని తీక్షణంగా విని
ఆలోచించే స్వభావం కలిగింది కాదు. అంచేత నాకు ఆ అమ్మాయి గురించి ఇంట్లో కాకమ్మ కబుర్లు మాట్లాడే అవకాశం ఉండేది కాదు.
మదాలస, నేను ఎనిమిదవ తరగతి నుండి ఒకే సెక్షన్ లోకి వచ్చాము. తను చాలా బాగా చదివేది. పచ్చ స్కర్టు, తెల్ల షర్టు వేసుకుని పొడవాటి జడతో ప్రేయర్ టైములో క్లాస్ లీడర్ గా తను స్టేజ్ మీద నిలబడటం, శ్రావ్యంగా తను ప్రతిరోజూ మాతో పాడించిన జాతీయ గీతం, నా మనసులో ఇప్పటికీ నాణ్యంగా తిరిగి తిరిగి ఇవాళ పాడినంత పరిశుభ్రంగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి.
తొమ్మిదవ తరగతి చివరలో అనుకుంటా ఆ అమ్మాయి బస్సు కోసం వేచి వుండే అరుగు వద్ద ఉంటుంది కదా గ్రామ దేవత, ఆ దేవతకు తిరునాళ్ళు అని నన్ను రమ్మని పిలిచింది. వాళ్ళ అమ్మ చేత, మా అమ్మకి ఫోన్ చేయించి నేను రెండు రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉండేటట్లు అనుమతి తీసుకుంది. అదే మొదటిసారి నేను మదాలస వాళ్ళ ఇంటికి వెళ్లడం . వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. చిన్నపుడు మనకు పెద్దగా కనిపించినవి తరువాత కాలంలో అంత పెద్దగా కనిపించక పోవచ్చు. కానీ నేను పెద్దయిన తరువాత కూడా ఆ ఇంటి అరిచిటెక్చర్ ని ఆ ఇంటి భారీతనాన్ని చూసి ఆశర్యపడుతూనే వచ్చాను. ఆ పెద్ద ఇంట్లో నేను గడిపిన రెండు రోజులు
నాకు మాటలలో చెప్పలేని అనుభూతిని ఇచ్చాయి. మదాలస తాత గారు, ఆయన నాన్నగారు ఇద్దరూ సాహిత్యంలో మంచి అభినివేశమూ అభిరుచి కలిగిన వ్యక్తులు. మదాలస తాత గారు చుట్టు పక్కల రాష్ట్రాలలో ఆయన రాజకీయ కార్యకలాపాల వలన
పేరెన్నికగన్న వ్యక్తి. ఆయన పాత తరం కాంగ్రెసు నాయకుడు. కొంత కాలం
మంత్రిగా పని చేశాక తనంతట తాను రాజకీయాల నుండి తప్పుకున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగక పోయినా, స్వాతంత్రోద్యమ పోరాట
నిబద్ధత, విలువలను ఆయన ప్రతిక్షణం అనుసరించేవారు. ఆయన ఇల్లు మొత్తం ఆయన అభిరుచికి నిట్టనిలువు అద్దంలా ఉండేది. ఎటు చూసినా నిలువెత్తు
అలమారాలలో వరసలు వరసలు గా నిలుచుని వుండే పుస్తకాలు. గోడలపైన మంచి మంచి పెయింటింగులు. ముఖ్యంగా ఆయన చదుకునే గది మరీ కనువిందుగా ఉండేది. ఆ గదిలో ఒక నల్ల బోర్డు వుండేది. దాని పైన ఆయన అప్పుడు పూర్తి చేసిన పుస్తకం లోని కొటేషన్ ఉండేది. ఆయన మరో పుస్తకం పూర్తి చేసేదాకా ఆ బోర్డు మీద ఆ కొటేషన్ అలానే ఉండేది. చిన్న తనం నుండి ప్రతి దినం ఆ బోర్డు వంక ప్రతి రోజూ చూడాల్సి రావడం చేత అనుకుంటాను, మదాలసకు ఎన్నెన్నో కొటేషన్లు నోటికి వచ్చి ఉండేవి. సందర్భానుసారం తను ఆ కొటేషన్లను వాడగలిగేది. మదాలస తాత గారికి ఒకడే కొడుకు. ఆ కొడుకుకు మదాలస ఒకటే కూతురు.
“ఇద్దరు ముద్దు -ముగ్గురు వద్దు “ కాలంలో నే మదాలస తండ్రి అమ్మాయయినా, అబ్బాయయినా ఒక్కరే, భూమి మీద భారం నా వలన మరింత పెరగ కూడదు అని మాదాలసతో సరిపెట్టుకున్నారు. బంధుగణం “ఒక కన్ను కన్నూ కాదు – ఒక బిడ్డ బిడ్డా
కాదు “ అని ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆయన విన లేదు. మదాలస తల్లి భర్తకంటే నాలుగాకులు ఎక్కువే చదువుకున్నది. ఆయన లా లో డిగ్రీతో సరి పెడితే ఆవిడ కొలంబియా యూనివర్సిటీ నుండి “ లా “లో పీహెచ్దీ చేసింది.
మదాలస ఆ ఇంటి మొక్కకు పూసిన అందమైన పువ్వు.
సమ్మెట దెబ్బలు తిన్నాకే బంగారం ఆభరణం అవుతుందట. అలానే మదాలస వ్యక్తిత్వం ఆమెకు పెళ్లయిన తరువాత మరింత స్పష్టంగా బహిర్గతమయింది. తను మొదటి నుండి కలుపుగోలు పిల్ల, కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమై ఆదరవుగా నిలబడేది. ఆమె అంతరాంతరాల్లో దయ, ప్రేమ చెలిమలో నీళ్లు వూరినట్లు ఊరుతూ ఉండేవి. ఆ మనస్తత్వం ఆమెను జూనియర్ కాలేజ్ స్థాయి నుండి కాలేజ్ లీడర్ గా నిలబెట్టింది. అనర్గళంగా ఆకర్షణీయంగా ఆమె ఇచ్చే ఉపన్యాసాలకు చిరాకు పడుతూనే మా ప్రొఫెసర్లు కూడా అచ్చెరువొందేవారు. అన్ని కాలేజీల విద్యార్థులు ఆమె ఉపన్యాసాలకు నాగస్వరం వినేప్పుడు నాగుపాముల తల
ఊపుతాయే అలా ఊపి, ఆ పై ఆమె చెప్పిన అన్యాయాలకు వ్యతిరేకంగా బుసకొట్టే వారు. ఆమె అంతలా అందరినీ ప్రేరేపించగలిగేది. టీవీ ఛానల్ వాళ్ళు ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవారు. మదాలస కాలేజీకి వచ్చిన తరువాత తనని తాను షార్ట్ కట్ లో “మాతంగి” అని పరిచయం చేసుకునేది. ఆమె యూనివర్సిటీకి చేరుకునేటప్పటికి ఆమె పేరు రాష్ట్ర సరిహద్దులు దాటి దేశం మూల మూలలను చేరుకున్నది. నిలువెత్తు నల్లటి రూపం, ధీటైన వాక్పటిమ, ఏవిషయాన్నయినా
మాట్లాడగలిగే విజ్ఞాన పటిమ అన్నిటికి మించి రింగులు రింగులుగా నడుము దాటి పరుచుకుని వుండే ఆమె చిక్కటి వెంట్రుకలు ఎక్కడున్నా అదుగో మాతంగి అని గుర్తు పట్టేటట్లు ఉండేది.
ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా వుండే మాతంగి హృదయం లోకి చేరుకొన్నాడు రాజీవ్ . రాజీవ్ గొప్ప పాటగాడు. జానపద గాయకుడు. దేశీయ జానపద గేయాలను అంతర్జాతీయం చేయడానికి యూట్యూబ్ వేదికగా చేసుకుని తన పాటలను విడుదల
చేస్తూ ఉండేవాడు. రాజీవ్ కి లక్షలలో ఫాలోయర్స్ ఉండేవారు. అతను చాలా పాపులర్ యూట్యూబర్. మాతంగి, రాజీవ్ ల పరిచయం యాదృచ్చికంగా జరగలేదు కానీ తనకు ఏమాత్రం సంబంధం లేని మాతంగి ని అతను యాదృచ్చికంగా యూట్యూబ్ లోనే చూసాడు. తన వీడియో తరువాత ఆటోమాటిక్ గా ప్లే అయిన వీడియో లో మాతంగి భారత దేశంలోని ఒక మత దురహంకార పార్టీ మైనార్టీ మతస్థులపై చేస్త్తున్న దాడులను గురించి ఉచ్చిష్ట స్వరంతో సింహంలా గర్జిస్తూ మాట్లాడుతూ ఉండటమ్, అప్పుడు ఆమె వేసుకున్న నీలం రంగు కుర్తీ, ఆమె చెవికి వేలాడుతున్న పెద్ద బంజారా రింగులు, ఆమె ఎటు కదిలితే అటు లేచి లేచి పడుతున్న ఆమె పొడవాటి జడ అతని కళా హృదయాన్ని నిట్ట నిలువుగా కట్టి పడవేయడంతో, అతను మంత్రిపబడిన వాడిలా మతి పోగొట్టుకున్నాడు. నిద్ర లేచినా కళ్ళు మూసినా ఆమే గుర్తు రావడంతో అతను అశక్తుడై చివరికి ఆమె పేస్ బుక్ ప్రొఫైల్ ను కనిపెట్టి ఆమెకు మెసేజ్ పంపించాడు. మాతంగి కి ఎంత బిజీగా వున్నా తన్న ఫెస్ బుక్ మెసేజెస్ కి స్పందించే లక్షణం వుంది. చాలా సార్లు ఇతరేతర రాష్ట్రాల వాళ్ళు, చివరికి పక్క కాలేజ్ ల వాళ్ళు కూడా ఆమెను ఫేసుబుక్ ద్వారానే సంప్రదించేవాళ్ళు. రాజీవ్ మెసెంజర్ లో ఆమెకు మెసేజ్ లు పెట్టడమే కాదు ఆమె ప్రతి పోస్టు కు ఓపికగా లైకులు కొట్టి పెద్ద పెద్ద కామెంట్లు ఆమెను మెచ్చుకుంటూ పెట్టేవాడు. మాతంగి మొదట వాటికి స్పందించేది కాదు. కానీ అతను ఒక్కసారి కలవాలంటూ పెట్టిన మెసేజులు అయిదు వందలు దాటాక ఆమె అతనికి సరే కలుద్దాం అని బదులిచ్చింది.
కలవడానికి అంత సమయం తీసుకున్న మాతంగి అతనితో ప్రేమలో పడటానికి ఒక్క రోజు కూడా తీసుకోలేదు. అతను ఆమెను తన ఇంటిలోనే ఏర్పాటు చేసుకున్న చిన్న రికార్డింగ్ స్టూడియో కి ఆహ్వానించాడు. ఆ మీటింగ్ ని ఏకాంతంగా కాకుండా ఒక గొప్ప వ్యక్తిని తన స్నేహితులకు చూపిస్తానంటూ వారిని పోగు చేసి ఊరించి ఒక అందమయిన సాయంత్రాన్ని అగరువత్తుల పరిమళంతో, జానపద గీతాలతో, జాస్మిన్ టీ తో, నవ్వులతో నింపి మరీ ఆమెను తన స్నేహితులకు పరిచయం చేసాడు. ఆమె గురించి వారితో ఎంతో గౌరవంగా ప్రస్తావించాడు. ప్రస్తావిస్తున్నంత సేపు ఆమె వంక అపురూపంగా చూస్తూ వున్నాడు ఒక అరగంట గడిచాక అర్థాంతరంగా ఆ స్నేహితులందరినీ పంపివేసి హఠాత్తుగా ఒక ఏకాంతాన్ని తమ ఇద్దరి కోసం కల్పించుకున్నాడు. ఇద్దరూ ఆ రోజు ఆ స్టూడియో లో తమ మొదటి సాయంకాలాన్ని గడిపారు, అక్కడి నుండి లేచి వెన్నెల పడుతున్న బాల్కనీలో నేల మీద
కూర్చుని అర్థ రాత్రి చంద్రుడి ప్రయాణాన్ని చూస్తూ పాటలు పాడుకున్నారు తెల్లవారు జామున అతను ఆమెకు కొంత దగ్గరగా జరిగాడు, అతనితో మాట్లాడుతున్న ఆ సమయంలో ఆమె ఎన్నో సార్లు తన కాలి బొటన వేలితో తన చేతి చూపుడు వేలితో
గచ్చుపై ముగ్గులు వేసింది. పొద్దుపొడిచి తొలి లేత సూర్య కిరణాలు ఆకాశంలో ఎర్రగా అలుముకుంటున్న వేళ ఆమె ఇక వెళ్లి వస్తానని లేచింది. అతను దిగబెడతానని అనలేదు. అతను ఆజాను బాహువు. ఆమె వెళుతుంటే తన భుజాన్ని గడపకి ఆనించి ఒరిగి నిలబడి ఇంకో చేతిని చాచి గడపకు ఆనించి “పొయ్యేటి ఆడి దాన – పూతల రైక దాన /పోశమ్మ పండుగంట పోదాం రావే నీలా
/ఇరిగిన ఇప్ప కాడ – పల్గిన బండ కాడ /సక్కని పావురాల -లాక్కుని కూడుదాము నీల /నల్లా నల్లటి దాన -నడుము సన్నటి దాన /పొడుగూ పొడుగాటి దాన –పొడుగూ కురుల దాన / నా బంగారు నీల – ననిట్ట వదిలి యెల్లి పోమాకే “అని పాడాడు. మెట్లు దిగుతూ వెనక్కి తిరిగి చూస్తూ, చూస్తూ చివరి మెట్టుకి చేరింది మాతంగి, ఆమె చివరి మెట్టుకు చేరగానే అతను పాట ఆపి, రెండు చేతులూ చాచి “ప్లీస్. . . “ అని దీనంగా అన్నాడు. చివరి మెట్టు మీద నిలబడిన మాతంగి కళ్ళెత్తి అతనిని చూసింది. కొన్ని క్షణికాల పాటు అలా నిలుచుంది, వెంటనే మెట్లెక్కి అతనిని చేరుకుంది. వాళ్ళ వెనుక తలుపు మూసుకుంది.
మాతంగి రాజీవ్ తో ఎందుకు ప్రేమలో పడింది అనే దానికి ఇదమిద్దమయిన కారణాలు కనిపించవు. ఆమె ఇంతకు ముందు గాయకుల్ని చూడలేదని కాదు అందమైన మగవాళ్ళని చూడలేదని కాదు, తనని ఢీకొట్ట్టగల మేధావులని చూడలేదని కూడా కాదు. తన చిన్న జీవితంలో విస్తారంగా మనుష్యులను, తనకు ఈడు జోడయినా మగవాళ్ళను కలిసింది మాతంగి. వాళ్లలో ఎంతో మంది ఆమెను ఎంతో ఆరాధించే వారు, ఆ ఆరాధనను వ్యక్త పరిచేవారు కూడా. వాళ్ళందరి దగ్గర చూడని మహత్యం మాతంగి రాజీవ్ లో ఏం చూసిందో ఎవరికీ తెలీదు. ఆ మాటకు వస్తే ప్రపంచంలో ప్రతి నిత్యం ప్రేమలో పడుతున్న వారిలో ఒక్కరు కూడా దీనికి సైంటిఫిక్ సమాధానాన్ని ఇవ్వలేరేమో. పూతోట మీదుగా ఎగురుతున్న సీతాకోక చిలుక అందులో ఏదో ఒక పూవు మీద వాలడం ఎంత యాదృచ్చికమో, ఎంతో మందిలో ఎవరో ఫలానా వ్యక్తితో ప్రేమలో పడటం కూడా అంతే యాదృచ్చికం కావచ్చు.
రాజీవ్ ది సంపన్న కుటుంబం కాదు కానీ ఉన్నత విద్యావంతుల కుటుంబం. అతని కుటుంబ సభ్యులలో చాలా మంది విదేశాలలో స్థిరపడి వున్నారు. అతని గురించి మాతంగి ఇంట్లో ప్రస్తావించినప్పుడు ఆమె తల్లిదండ్రులు, తాత రాజీవ్ కుటుంబ విద్యా సంపదను చూసి చాలా సంతృప్తిపడి తమ బిడ్డకి అతనినిచ్చి నిండు మనస్సుతో సంతృప్తిగా పెళ్లి చేసారు. మాతంగి పెళ్లి ఆ పల్లెటూరిలో, ఆమె తాత గారి ఇంట్లో నిరాడంబరంగా సంప్రదాయాలను అనుసరించి జరిగింది. ఆమె పెళ్ళికి కురు వృద్ధులయిన రాజకీయ నాయకులే కాదు, అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ పెళ్లి సమయంలో ఆ ఇంటి డాబా పైన ఒక ప్రముఖ
రాజకీయ అధినేత హెలికాఫ్టర్ ఆగింది. ఆ హెలికేప్టర్ నుండి దిగిన అతని చిన్న కుటుంబం మొత్తం మాతంగిని అక్షింతలు చల్లి ఆశీర్వదించి రాజకీయ వర్గాలలో మాతంగి తాత గారి పలుకుబడిని గౌరవాన్ని మరికసారి పత్రికలలో పతాక
శీర్షికలకు ఎక్కించి వెళ్ళింది. ఆ పెళ్లి సమయంలోనే నాకు మాతంగి వాళ్ళ ఇంటి విరాట్ స్వరూపం మరొక్క సారి దర్శనమైంది.
మాతంగి పెళ్లయిన కొంత కాలానికి మాతంగి భావజాలానికి సరిపడే పార్టీ నుండి ఆమెకి ఎలక్షన్లలో పోటీ చేయాలని పిలుపు వచ్చింది. మాతంగి నిజానికి ఆ పిలుపుకి ఏ మాత్రం సిద్ధంగా లేదు. రాజ నీతిజ్ఞత కలిగిన తటస్థ మేధావిగా ఆమె ఎదుగుతూ వుంది. ఆమె మాటలకు, ఆమె రాసే రాతలకు ప్రజలలో ఒక అభిప్రాయం, గౌరవం ఏర్పడుతూ వుంది. ఇటు సంసారంలో అప్పుడే పుట్టిన పాపాయితో, గాయకుడిగా స్టేజ్ షోలు మొదలు పెట్టి విజయవంతంగా ముందుకు వెళుతున్న భర్తతో ఆమె సంతృప్తిగా వుంది. అందుకని పార్టీ పిలుపుకు ఆమె స్పందించలేదు. ఆమె స్పందించలేదని పార్టీ ఊరుకోలేదు. తమ పార్టీ లాంటి పార్టీ కి ఆమె లాటి యువ రక్తం ఎలా కలికి తురాయిగా మారగలదో అక్షరాలా అంచనా వేసింది పార్టీ. వదలకుండా వెంటబడింది. మాతంగి తల్లిదండ్రులు, తాత ఆమె నిర్ణయాన్ని ఏ రకంగానూ ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు. అప్పుడు పార్టీ మాతంగి భర్తని సంప్రదించింది. అతను ఎంత స్త్రీవాదో, ఎంత గొప్పవాడో రకరకాలుగా వర్ణించి కీర్తించింది. రాజీవ్ ఆ కీర్తనలకు పొంగిపోయాడు. యధాతధంగా తన భావోద్వేగాన్ని మాతంగి మీద కురిపించి, ఆమెని బుజ్జగించి ఒప్పించాడు.
రాజకీయం మాతంగికి కొత్త కావచ్చు కానీ ప్రజలకోసం పనిచేయడం, సమస్యలకు స్పందించడం ఆమెకు కొత్త కాదు. నెత్తురు రుచి మరిగిన పులిలా ఆమె అన్యాయం పై దాడి చేయడం మొదలు పెట్టింది. ఆమె వాగ్ధాటికి, పోరాట పటిమకు చాలా స్వల్ప సమయంలోనే చాలా పెద్ద పేరు వచ్చింది. పేరుతో పాటే ఆమె పని చేయాల్సిన పని ప్రదేశపు పరిధి పెరిగింది. ఇంట్లో గడిపేది తక్కువ బయట గడిపేది ఎక్కువగా మారింది. ఇంట్లో వున్నా కూడా ఆమె నిదుర లేచేసరికి ఆమె ఇంటి చుట్టూ జనాలు ముసురుకునే వారు. ఆమె దగ్గరకి పార్టీలకు అతీతంగా ప్రజలు సహాయర్థులై వచ్చేవారు. మాతంగి ప్రజలను పార్టీ కి అతీతంగా తన స్వంత బంధుజన పరివారంలా పరిగణించేది. ఆమె వంట గది నిరంతర అన్నదాన శాలలాగా నడుస్తూ ఉండేది. ఆమెకోసం వచ్చే వాళ్లలో రోడ్డు మీద కాగితాలు ఏరుకునే వాళ్ళ దగ్గరనుండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉండేవారు. ఆమె ఇంటిలో అందరికీ అదే కప్పులలో టీ కాఫీలు ఇవ్వడం జరిగేది. తమ పట్ల మాతంగి చూపే సమత్వాన్ని, గౌరవాన్ని చూసి బీదా బిక్కి వర్గాల వాళ్ళు ఆమెని గుండెల
నిండుగా ప్రేమించే వాళ్ళు. అలా ఆమె అభిమాన సంఘాలు, పార్టీలకు , కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగావ్యాపించాయి .
ఆమె పలుకుబడి విస్తరించేకొద్దీ రాజీవ్ కు మాతంగి పట్ల అసహనం మొదలయింది. ఆ అసహనం ఎందుకో మాతంగికి అర్థమయ్యేది కాదు. మాతంగి అతని కోసం సమయం కేటాయించలేక పోతుంది అనడానికి వీలు లేదు. ఎందుకంటే రాజీవ్
కూడా అతని పనిలో అతను తలమునకలుగా ఉండేవాడు. ఇద్దరూ కలవగలిగిన ప్రతి అవకాశాన్ని ఆరు నూరయినా వినియోగించుకునేది మాతంగి. అతని కోసం పడిగాపులు కాసేది. అతను ఇంటికి రావడానికి వీలు కాకుంటే అతని కోసం అతను వున్న చోటుకు వెళ్ళేది. అతనితో వుండే ప్రతి క్షణమూ తను గుండె నిండుగా నింపుకున్న ప్రేమతో అతనిని ముంచెత్తేది. మొదట లో అతను ఆ కలయికలతో శాంతించేవాడు. కానీ క్రమేణా అతనిలో ఇంకొక కోణం బయటకి రావడం మొదలు
పెట్టింది.
మాతంగి ఇప్పుడు ఆలోచించి కూడా ఆశ్చర్య పడుతుంది, అసలు రాజీవ్ తన గురించి అలా ఎలా ఆలోచించగలిగాడు అని. మాతంగికి శృంగారం మనసుతో చేసేది. శరీరానికి దానికి సంబంధం లేదు. రాజీవ్ ని చూడగానే ఆమె మనసు చలించినట్లు మరి ఏ మగవాడిని చూసినా కూడా చలించదు. మానవ దేహాలు స్త్రీ పురుష రూపాలలో ఉండవచ్చు, ఆ రూపాలలో ఏదో ఒక రూపంతో మనకు ప్రేమోద్దీపన కలుగుతుంది, ఆ ప్రేమోద్దీపన కామాన్ని ప్రేరేపిస్తుంది అనేది మాతంగి సిద్ధాంతం. జీవితంలో అనేక విషయాల పట్ల మాతంగికి స్థిరమైన అభిప్రాయాలు, సిద్ధాంతాలు వున్నాయి. వాటికి ఆమె కట్టుబడి ఉంటుంది. అటువంటి మాతంగిని
పట్టుకుని “నువ్వు వాడితో పడుకుంటున్నావ్, వీడితో పూసుకు తిరుగుతున్నావ్” అనడం మొదలు పెట్టాడు రాజీవ్. అతను అలా అంటుంటే మాతంగికి మతిపోయినట్లు అనిపించింది. మళ్ళీ చాలా ఆలోచించి అవంతా తన మీద ప్రేమతో కలిగిన భావనలేనని సర్దిపుచ్చుకున్నది. ప్రేమ వున్న చోట అసూయ ఉండటం సర్వసాధారణమని ఆ అమ్మ ఈ అమ్మ చెబితే విని తాను కూడా అవునని అనుకున్నది.
అన్నిటికంటే ముందు అమ్మలక్కలు -వయసులో వుండే మొగుడిని ఒంటరిగా వదిలిపెట్టి ఉండకూడదని సలహా ఇస్తే పాటించి, సాధ్యమైనంత వరకు పార్టీకి సంబంధించిన తన బాధ్యతలని తగ్గించుకున్నది.
మాతంగి ఎన్నో సవరింపులు చేసుకుని జీవితాన్ని రాజీవ్ కు అనుకూలంగా మలచుకోవాలని అనుకుంటూ వున్నపుడు రాజీవ్ ఒకానొకరోజు ఆ సవరింపులని “రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా “ అనే సామెతతో ఈసడించాడు. అది విని
మాతంగిని ఱుత్తురాలయింది. అతను వాడిన భాష, అందుకు అనుగుణమైన భావజాలాన్నిపలికించిన ఆ క్షణంలో అతని ముఖం, ఆమెకు అతని మీద వున్న ఇష్టాన్ని హఠాత్తుగా పలుచ పరిచాయి. అయినా గుండె దిటవు పరచుకుని మాతంగి తాను ఇంకో
ఎంపీతో కలిసి ఒకే గదిలో రెండు గంటలు ఎందుకు వుండ వలసి వచ్చిందో అతని గడ్డం పట్టుకుని కారణాన్ని వివరించబోయింది. ఆ వివరణను అతను వినలేదు, వివరణ ఇవ్వదలచుకున్న ఆమె ప్రేమను అతను చూడలేదు, కిందకు వంగి తన కాలికి వున్న హౌస్ స్లిప్పర్ ను తీసి “లంజ “ అని సంబోధిస్తూ ఆమె మీదకి దూకి ఆమెని కొట్టడం మొదలు పెట్టాడు. జీవితంలో మొదటి సారి పుట్టి
బుద్దెరిగాక మాతంగి వంటి మీద పడిన దెబ్బ అది. మాతంగి విస్తుపోయింది. ఆమె చెంపలు , వీపు చెప్పు దెబ్బలతో తట్లు తేలాయి. ఆమె మాట్లాడకుండాఅక్కడనుండి వెళ్లిపోయి పడకగదిలో పడుకుంది. ఏడవటానికి కూడా సూచనలు ఇవ్వలేనంతగా ఆమె మస్తిష్కం షాక్ కు గురయింది.
మొదటి సారి మాతంగి రాజీవ్ దగ్గర దెబ్బలు తినడానికి, చివరిసారి దెబ్బలు తినడానికి మధ్య మాతంగి కనీసం రాజీవ్ చేతిలో నూరు సార్లయినా దెబ్బలుతిని ఉంటుంది. కొట్టిన ప్రతిసారి, ఒక గంట తరువాత రాజీవ్ ఆమె దగ్గరికి
వచ్చేవాడు. ఆమె కాళ్ళ మీద పడే వాడు, కౌగిలించుకొనే వాడు. అదంతా ప్రేమతోనే జరిగిందని సర్ది చెప్పేవాడు. దెబ్బలు తిని కంది పోయి వున్న ఆమె శరీరంతో వుద్రేకపూరితమైన శృంగారాన్ని జరిపేవాడు. ఆ శృంగారంలో ఆమె ఏ మాత్రం అన్యమనస్కంగా వున్నా జాలి గొలిపే విధంగా తమ కుటుంబాల మధ్య వున్న ఆర్ధిక అంతరాలను గురించి మాట్లాడే వాడు. హై ఎండ్ మనుషులను చూస్తున్నావ్ కదా నా లాంటి వాడితో మూడ్ ఎలా వస్తుందిలే అనే వాడు. తనని తాను చిన్నబరచుకుని ఆమె కరుణని పొందడానికి తాపత్రయ పడేవాడు.
కాలక్రమంలో మాతంగికి తెలియ వచ్చిన మరో విషయం రాజీవ్ సరదా తిరుగుళ్ళు. మాతంగికి రాజీవ్ మొబైల్ లో వేసిన స్పై సాఫ్ట్వేర్ గురించి తెలుసు. తన కదలికలను అతను అనునిత్యం నియంత్రించడం తెలుసు. అతనలా తన కదలికల గురించి
తెలుసుకుంటూ ఉంటే నిజానికి మాతంగికి కోపం రావడానికి బదులు ఊరటగా ఉండేది. ఎలాగయినా అతను తన నిజాయితీని తెలుసుకుంటాడు కదా అనిపించేది. ఏ రోజూ కూడా అతని కదలికల గురించి ఆమె ఆలోచించ లేదు. ఒక రోజు దిన పత్రికలో ఎవరో గాయని ఇతని మీద ఆరోపణలు చేయడం, అవి ఎలాగో మరి కొద్ది రోజుల్లో నే సద్దుమణగడం ఆమె చూసింది. దాని గురించి అతను తనకేమయినా వివరణ ఇస్తాడేమోనని ఆమె ఎదురు చూసింది. అతను దాని గురించి మాట్లాడలేదు. కానీ ఆరోజుటి నుండి
మాతంగి అతని కదలికలను అప్పుడప్పుడూ గమనించడం మొదలు పెట్టింది. నెమ్మదిగా రాజీవ్ శృంగార లీలలు ఆమెకు తెలియ వచ్చాయి. ఆశ్చర్యంగా అప్పుడు కూడా మాతంగి అతని నుండి బయటకి రాలేదు. తన బిడ్డకు తండ్రిగా అతనిని
గౌరవించి అతనిని హెచ్చరించడానికి ప్రయత్నించింది. అవి విన్న అతను, నీ రంకు కప్పి పుచ్చుకోవడానికి నా మీద నేరాలు వేస్తున్నావు అంటే భరించింది. ఆడదానివి అణిగిమణిగి ఉండటం నేర్చుకో అని ఆ అల్ట్రా మోడరన్ వ్యక్తి పదే పదే అంటుంటే సహించి ఊరుకుంది. అంత సహించి ఊరుకున్న మాతంగి మాతంగి ఒకనాడు తన శాంత స్వరూపాన్ని చాలించింది. వివాహ బంధాన్ని తెంచుకుని బయటకి వచ్చింది .
ఒక రోజు మాతంగి తల్లిదండ్రులు ఆమె ఇంటికి వచ్చారు. మాతంగి వాళ్ళు ఉండగానే ఏదో కాన్ఫరెన్స్ కి విదేశానికి వెళ్లి రావలసి వచ్చింది. ఆ వెళ్లడం వేరే పార్టీకి చెందిన ఒక యువ నాయకుడితో కలిసి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఫోటోలంతా అన్ని దినపత్రికలు ప్రచురించాయి. విదేశీయుల మధ్య భారతీయ ఖ్యాతిని ఆమె ఎలా ద్విగుణీకృతం చేసిందో చెప్పుకొచ్చాయి. ఇంటికి
తిరిగి వస్తున్నపుడు ఆమెలో ఆ ఆనందం లేదు. ఇంట్లో వున్న తల్లిదండ్రుల ముందు భర్త తనతో ఎలా ప్రవర్తిస్తాడో అనే భయం ఆమెలో నరనరాన వ్యాపించుకుని పోయింది. ఇంటికి చేరిన ఆమె భయాన్ని రాజీవ్ నిజం చేసాడు. దిక్కు మొక్కు
లేని కుక్కని కొట్టినట్లు ఆమెని కొట్టాడు. తల పగిలి రక్తం కారుతున్న ఆమెని వడిలోకి తీసుకున్న తల్లి ఏడుస్తూ “తల్లీ !మదాలస నీకిది అవసరమా అమ్మా !” అన్నది. మదాలస కళ్ళు మూసుకుని ఆలోచించుకున్నది. చిన్నపుడు తనకు చిన్న దెబ్బ తగిలితే తల్లి, తండ్రి ఎలా తల్లడిల్లి పోయేవారో. తన శరీరం వాళ్ళు ప్రసాదించిన దివ్య వరం. తన శరీరం, మనస్సు వాళ్ళు ప్రేమించి, పోషించి, గౌరవించిన ప్రదేశం. ఆ శరీరాన్ని తాను ఇన్ని రోజులు అగౌరవ పరచింది. ప్రేమ అనే పేరుతో కళ్ళు మూసుకుని తన మనసును, మేధస్సును తాను అగౌరవ పరచింది. ఇక ఇది చాలు అనుకున్నది. తల్లి వడిలో నుండి లేచి “ఒక్క క్షణం అమ్మ “ అని లేచి, లోపలి వెళ్ళింది. లోపల కుర్చీలో రాజీవ్ కోపంతో ముడుచుకుపోయిన ముఖంతో కూర్చుని వున్నాడు. అతని దగ్గరకు వెళ్లి “నాకు మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ ఉందని నీకెప్పుడూ చెప్పలేదు కదా ?ఆ విషయాన్ని ప్రేమతో నేనే మరచిపోయాను . ఎంత మరచిపోయానంటే కనీసం చేతులు అడ్డం పెట్టుకోవచ్చు అనే విషయాన్నీ కూడా మరచిపోయాను. ప్రేమకి అంతరాలు ఉండవని నేను అనుకున్నాను. , ప్రేమలో కూడా అంతరాలుంటాయని, అందులో కూడా మగవాడు అధికుడు అని నువ్వు చెప్పావు. అయిందేదో అయింది, ఇంద తీసుకో నువ్వు ఇన్ని రోజులూ ఇచ్చినవి “ అని కొట్టడం మొదలు పెట్టింది. ఎంత కొట్టింది అంటే కొడుతూ ఉండగా ఆమెకి
మధ్యలో తమ టీమ్ గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్ లోకి కూడా ఎక్కిందనే విషయం హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఇక రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మళ్ళీ కొడుతూనే వుంది.
***
మాతంగి రాజీవ్ తో విడాకులు తీసుకున్న ఏడాది తరువాత అనుకుంటాను తనని నేను కలిసాను. తాను రెండవ సారి ఎలక్షన్లలో కూడా అఖండ మెజారిటీతో గెలిచింది. ఈ సారి మంచి పదవిని కూడా పొందింది. ఆమె ఇల్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రజలతో అలరారుతూ ఉంటుంది అన్ని సమయ సందర్భాలలో. నేను వెళ్ళినప్పుడు నన్ను కూర్చో పెట్టుకుని తన కధంతా చెప్పి “లావణ్య నువ్వు నా కధ రాయాలి, దానికి “గ్రామా దేవత “ అని పేరు పెట్టాలి “ అన్నది. గ్రామ దేవత అనే పేరు ఎందుకు అన్నాను నేను. తాను తమ ఊరిలోని గ్రామ దేవత గురించి చెప్పింది . గ్రామ దేవత అంటే గ్రామానికి అది దేవత అట. ఆ గ్రామ ప్రజల కష్టనష్టాలను అన్నిటినీ ఆమె కాచుకుంటుంది. తల్లిలా కాపాడుతుందట. అలా కాచుకుని ఉండటానికి గాను ఆమె అవివాహితగా ఉండిపోయిందిట. అందరు గ్రామ దేవతలు అవివాహితులేనని తాను అన్నది. నాకు కాదేమోనని అనుమానం వచ్చింది. ఇద్దరం మా ఊరి గ్రామ దేవత దేవాలయ పూజారిని ఫోన్లో కేకేసి అడిగాం. ఆయనేం చెప్పాడంటే దేవాలయ ఆగమ శాస్త్రం ప్రకారం గ్రామ దేవతలు అవివాహితులుగానే ఉంటారని, కొన్ని దేవాలయాల వాళ్ళు హిందూ శిష్ట సంప్రదాయాలను అనుసరించి ఈ గ్రామ దేవతలను కూడా తీసుకువచ్చి ప్రధాన స్రవంతి దేవతలతో కలిపేసి పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లిళ్లు చేసేస్తున్నారని చెప్పుకొచ్చాడు. అది విన్న తరువాత కూడా నాకు అనుమానం తీరక పోతే తాను చాట్ జీపీటీ ని కూడా అడిగింది, చాట్ జీపీటీ “ Devathas are often considered the guardians of the village or community, and their unmarried status is believed to signify their complete focus and dedication to their role as protectors. It is believed that their unmarried status allows them to be fully devoted to their duties and responsibilitie. . . . “ అంటూ చెప్పుకొచ్చింది. ఇక తను మొదలు పెట్టింది, తన కధకు గ్రామ దేవత అని పేరెందుకు పెట్టాలో. కధకు ఏ పేరు, ఎందుకు పెట్టాలో నిర్ణయించుకున్నాక మేమిద్దరం ఆలోచించడం మొదలు పెట్టాం. ప్రపంచంలో ఇందరేసి దేవుళ్ళు
వున్నారు, వాళ్లకి ఎన్నెనో పెద్ద పదవులు సృష్టి స్థితి లయ కారకులూ గట్రా అని, అంతంత పెద్ద బాధ్యతలున్న వాళ్లకి కూడా భార్యలు వున్నారు ఒక్కోసారి కొంత మందికి ఇద్దరేసి భార్యలు కూడా వున్నారు. మరి వాళ్ళ పదవులకు, బాధ్యతలకు వివాహాలు అడ్డం కాలేదా? గ్రామదేవతకు మాత్రం ఆమె పదవికి వివాహం ఎందుకు అడ్డంకి అయింది? గ్రామాన్ని కనిపెట్టుకుని కాసి వుండే గ్రామదేవతను, ప్రేమగా కాచుకుని భార్యలాగా ఆలనా పాలనా చూసే భర్త ఎందుకు లేడా అని ఆలోచించాం. శిష్ట సంప్రదాయమొ, దుష్ట సంప్రదాయమొ మా పంతులు చెప్పినట్లు గ్రామదేవతల్లాటి శక్తి స్వరూపిణులయిన అమ్మాయిలకు చల్లగా
వాళ్ళను ప్రేమించే భార్యల లాటి భర్తలు దొరికి అందరూ సుఖంగా పాలన చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాం.
ఇది మా మాతంగి కథ. మదాలస మంజుల వాగ్విలాసా దేవి కధ. ఆర్తులను చల్లగా కావాలి కాస్తున్న అభర్తుక అయిన ఒక అమ్మాయి కధ.

సామాన్య
చాలా అరుదుగా రాసినా బలంగా రాసే సామాన్య తెలుగు కథా పాఠకులకు సుపరిచితులు. "కొత్తగూడెం పోరగాడికొక లవ్ లెటర్", "మహిత" కథా సంకలనాలు తెచ్చారు. గతంలో ప్రాతినిధ్య వార్షిక కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.


Katha bhagundhi. Saamanya. Garu