రక్తం…!
ధారగా కారిపోతోంది!
రెండు కాళ్ల మధ్యనుంచీ పడుతున్న రక్తపుధార పాదాల దగ్గర మడుగు కట్టింది!
ఇంచుమించు తన శరీరంలోని రక్తమంతా బైటికొచ్చేసినట్టుంది…కాళ్లూ చేతులూ వేలాడిపోతున్నాయి!
అంత రక్తాన్ని చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మి, ముచ్చెమటలూ పోస్తున్నాయి. ఇంక తను బతకదని నిశ్చయించేసుకుంది అనన్య.
అమ్మ…అమ్మ ఏదీ?! అమ్మని పిలిస్తే గబుక్కున డాక్టరు దగ్గరకి తీసికెళుతుంది…డాక్టర్ రక్తం ఎక్కించి తనని బతికిస్తారేమో….
‘‘అమ్మా…అమ్మా’’ శరీరంలో శక్తంతా కూడదీసుకుంటూ ఎలుగెత్తి పిలిచింది.
అమ్మ ఎక్కడుందో…పలకడం లేదు. అనన్యకి ఏడుపొచ్చేస్తోంది. ఇంక తను చచ్చిపోవలసిందే కాబోలు…అమ్మనీ నాన్ననీ…పప్పీనీ…సునయనా టీచర్నీ..తన ఫ్రెండ్స్ నీ అందర్నీ వదిలేసి చచ్చిపోవాలి….
‘‘అమ్మా…’’ గట్టిగా ఏడుస్తోంది అనన్య
మంచి నిద్రలో ఉన్న శైలజ ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించి ఉలికిపాటుగా లేచింది. తీరా చూస్తే ఏడుస్తున్నది తన కూతురే. తనకీ చందూకీ మధ్యలో పడుకుని ఉన్న పిల్ల ‘అమ్మా…అమ్మా’ అని నిద్దట్లోనే గట్టిగా ఏడుస్తోంది.
ఒక్క ఉదుటున లేచి కూర్చుని అనన్యని తట్టి లేపుతూ ఒళ్లోకి లాక్కుంది శైలజ. ఆ పాటికి చందూ కూడా లేచాడు. తల్లి గబగబా తట్టి లేపేసరికి పూర్తిగా మెలకువ వచ్చింది అనన్యకి. వెంటనే తల్లి నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటూ, ‘‘అమ్మా…రక్తం. రక్తమమ్మా. ధారగా కారిపోతోంది’’ అంది ఏడుస్తూ
శైలజకి అర్ధమైంది. పిల్లకి ఏదో కలొచ్చిందన్నమాట. విపరీతంగా బ్లీడింగ్ అవుతున్నట్టు కల..!
తనను చుట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న పదేళ్ళ కూతురి మానసిక స్థితి ఆ తల్లికే కాదు తండ్రికి కూడా తెలుసు.
‘‘నీకు కలొచ్చిందిరా. అంతే. నిజంగా ఎక్కడా రక్తం లేదు. కావాలంటే చూడు” భార్య ఒడిలో ఇమిడిపోయిన పసిదాని తల నిమురుతూ మృదువుగా చెప్పాడు చందు.
“డాడీ చెబుతున్నది నిజం చిట్టీ. నీకు కలొచ్చింది. అంతే. నిజంగా బ్లీడింగ్ అవలేదు. నీ బట్టలు ఎంత డ్రైగా ఉన్నాయో చూసుకో కావాలంటే…’’ శైలజ కూడా కూతురి బుగ్గలు నిమురుతూ బుజ్జగింపుగా చెప్పింది.
ఆ మాటలతో పూర్తిగా తెప్పరిల్లిన అనన్య, తనని తాను ఒక్కసారి చెక్ చేసి చూసుకుని, తల్లీ తండ్రీ చెప్పింది నిజమేనని గ్రహించి తేటపడింది. కాని ఆ పదేళ్ల పిల్లలో కల సృష్టించిన భయం పూర్తిగా పోలేదు. తల్లిని ఆనుకుని డల్‌గా కూర్చుంది.
ఈ లోపున చందూ వంటింట్లోకి వెళ్లి వేడిగా హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి కూతురికిస్తూ, ‘‘ఇంద..వేడిగా ఇది తాగావంటే యు విల్ పుల్ అప్..’’ అన్నాడు
అనన్య వద్దనలేదు. కప్పు తీసుకుని నెమ్మదిగా సిప్ చేస్తూ హార్లిక్స్ తాగి, ఖాళీ కప్పు తండ్రికిచ్చేస్తూ, ‘‘యా…ఐయామ్ ఫైన్ నౌ. ధాంక్యూ పప్పా’’ అంది
‘‘వెల్‌కమ్ డియర్…కాకపోతే మా చిట్టి రాణి ఇలా చిన్న చిన్న విషయాలకి బెంబేలెత్తిపోవడం బాగాలేదు…’’ నవ్వుతూ అన్నాడు చందూ
ఆ మాట వింటూనే అనన్యకి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ‘‘చిన్న విషయమా…వాడ్డూయూ మీన్ డాడీ… యూ హేవిట్ వన్స్…దెన్ యు విల్ నో’’ అంది తీవ్రంగా
చందూ మరింక ఏమీ మాట్లాడలేదు. దశాబ్దాలు కూడా కాదు…బహుశా శతాబ్దాల నుంచి ప్రతి ఆడదీ అంటున్న మాటేనేమో ఇది….‘‘ఒక్కసారి నువ్వు అనుభవించి చూడు….అప్పుడు తెలుస్తుంది నీకు!!”
నిజమే. భగవంతుడు ఆ పని చెయ్యాల్సింది. ప్రతి మగవాడికీ కనీసం ఒకటి రెండుసార్లైనా ఆ అనుభవాన్ని పెట్టాల్సింది. అప్పుడు ఆడవారి పట్ల పురుషులకు ఇంత కాఠిన్యత ఉండకపోయేదేమో….కానీ, స్కూల్ డ్రాపవుట్ అరుణాచలానికి ఏ అనుభవం ఉండి తన భార్య పడుతున్న బాధను, ఆమె కష్టాన్ని అంత చక్కగా అర్థం చేసుకున్నాడు? భార్య శాంతి అనుభవాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోగలిగాడు కాబట్టే, ఆమె ద్వారా సమస్త స్త్రీజనం తాలూకు బాధనూ అంది పుచ్చుకోగలిగాడు. ఖరీదైన శానిటరీ ప్యాడ్స్ కొనుక్కోలేక, చేతికందిన మురికి గుడ్డలతో అనారోగ్యం పాలవుతున్న నిరుపేద యువతుల కోసం అతి తక్కువ ఖర్చుతో శానిటరీ ప్యాడ్స్ తయారుచేసి, ప్యాడ్‌మాన్‌గా అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్నాడు. స్వయంగా అక్షయ్‌కుమార్‌లాంటి బాలీవుడ్ హీరో అతని బయోపిక్ లో అరుణాచలం పాత్రను ధరించే స్థాయికి ఎదిగాడు.
‘‘చందూ..’’ శైలజ గట్టిగా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాడు చందూ. అప్పటికే అనన్య దుప్పటి కప్పుకుని పడుకుని ఉంది. ఒక్కసారి నిట్టూర్చి తనూ పడుకున్నాడు చందూ.
శైలజ కూడా పడుకుంది గాని నిద్రపట్టలేదు. తన దగ్గరగా జరిగి పడుకుని ఉన్న కూతుర్ని చూస్తూంటే అసలు ఏమనుకోవాలో అర్ధం కావడం లేదు. అందరు ఆడపిల్లలూ పడుతున్న బాధే అనన్యా పడుతోంది. తన చిన్నతనంలో తను కూడా ఇదే పరిస్థితి అనుభవించినా, శారీరకంగా, మానసికంగా తను అనన్యకంటే కొన్ని వేల రెట్లు హాయిగా ఉండేది. ఎలాంటి భయాలు గాని నెగటివ్ ఆలోచనలు గాని ఉండేవి కావు. కాని అనన్య పరిస్థితి వేరుగా ఉంది.
అనన్యకిప్పుడు పది నిండి పదకొండో సంవత్సరం నడుస్తోంది. చాలా తెలివైన, చురుకైన పిల్ల. పిరికిది కూడా కాదు. పాపకి పదేళ్లు నిండబోతున్న వేళ, తన ప్యాంటీలు కాస్త కాస్త మరకలవడం గమనించింది తను. దాంతో అనన్య త్వరలోనే రజస్వల కాబోతోందని గ్రహించి, నెమ్మదిగా పాపకి చిన్న చిన్న సూచనలు ఇచ్చింది. హఠాత్తుగా ప్యాంటీ మీద రక్తం కనబడితే గాభరా పడొద్దనీ, టీచర్‌కి చెప్పి వెంటనే తనకి బ్యాంకు కి ఫోన్ చేయించమనీ చెప్పింది. స్వయంగా అనన్య క్లాస్ టీచర్‌ని కూడా కలుసుకుని ఆ విషయం చెప్పింది. అవన్నీ చెయ్యగలిగింది గాని, ‘‘నాకు దెబ్బలేమీ తగలకుండా బ్లీడింగ్ ఎందుకవుతుందమ్మా….ఎనీథింగ్ రాంగ్ విత్ మీ?!’’ అంటూ కూతురు గుప్పిస్తున్న ప్రశ్నలకి మాత్రం సరైన సమాధానాలు చెప్పలేకపోయింది. అసలు ఈ ప్రశ్నలన్నీ ఒకప్పుడు తనకి ఎందుకు తట్టలేదా అని కూడా ఆశ్చర్యపోయింది.
ఆడదాని శరీరంలో భగవంతుడు అమర్చిన అండాశయాలూ, గర్భసంచీ…ప్రతి నెలా అండం విడుదలయ్యే క్రమం…ఈ రకమైన మెడికల్ సైన్సు అంతా తెలిసినా పాపకి అర్థమయ్యేట్టూ చెప్పలేక, ‘‘నీకు ఏ అనారోగ్యమూ లేదురా. శుభ్రంగా ఉన్నావు. ఈ బ్లీడింగ్ నీకే కాదు, యాభై ఏళ్ళ వయసొచ్చేదాకా ప్రతి ఆడదానికీ అవుతుంది. నాక్కూడా అవుతుంది. అదంతా నువ్వు మరికాస్త పెద్దయ్యాక వివరంగా తెలుస్తుంది. ఫర్ నౌ, యు డోంట్ వర్రీ ఎబౌట్ దట్. అంతే!’’ అంది.
అనన్య తల్లి మాటలు విని ఊరుకుంది. అయితే మర్నాడే గెంతుకుంటూ వచ్చి, ‘‘అమ్మా, బ్లీడింగ్ ఈజ్ క్వైట్ నేచురల్ ఫర్ అజ్…ఏమీ భయపడకు’’ అని చెప్పింది కావ్యక్క’’ అంది ఆనందంగా. కావ్య అనన్యతో బాటే ఆటోలో స్కూల్‌కి వచ్చే అమ్మాయి. టెన్త్ క్లాస్ చదువుతోంది. తను చెప్పినదానికంటే కావ్య చెప్పిన మాటల పట్ల కూతురికి ఎక్కువ నమ్మకం ఉండటం చూసి నవ్వుకుంది శైలజ. పిల్లలు అంతే…తల్లి తమని మభ్యపెట్టాలని చూస్తోందేమో అని అనుమానపడతారు. సాటి పిల్లలు చెబితే నమ్ముతారు. ఏదైతేనేం కూతురు రిలాక్స్ అయిందని హమ్మయ్య అనుకుంది శైలజ. కాని ఆ ఆనందం ఎన్నాళ్లో నిలవలేదు.
అనుకున్నట్టే మరో ఆర్నెల్లలో అనన్య మెచ్యూర్ అయింది. గాభరా పడవద్దంటూ అన్నిసార్లు చెప్పినా తెల్లని ప్యాడ్ మీద ఎర్రగా రక్తాన్ని చూడగానే అనన్య గాభరా పడిపోయింది. ఇది ఎప్పుడు తగ్గుతుంది…తగ్గడానికి మందులు వేసుకోవాలా..ఇలా బ్లీడింగ్ అవుతూ ఉంటే నీరసం రాదా…ఎనీమిక్ అయిపోమా ..ఇలా కూతురు కురిపిస్తున్న ప్రశ్నల వర్షాన్ని తట్టుకోవడం శైలజకి పెద్ద తలనొప్పే అయింది. అయితే అదృష్టమో దురదృష్టమో గాని అనన్యకి మెచ్యూర్ అయిన మర్నాడే బ్లీడింగ్ తగ్గిపోయింది. అప్పుడే అనుకుంది శైలజ ఇది మళ్లీ ఏ పదిహేను రోజులకో మొదలవుతుంది అని. అలాగే పది రోజులకల్లా స్కూల్లో ఉండగా బ్లీడింగ్ అయి ఏడుస్తూ ఇంటికొచ్చేసింది అనన్య.
‘‘నువ్వు నెలకోసారి అని చెప్పావు. జస్ట్ టెన్ డేస్ అయిందంతే…ఎగైన్ ఇట్ స్టార్టెడ్. సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ…లెటజ్ గో టు ది డాక్టర్‌్’’ అని ఏడుస్తూ తిండి కూడా తినకుండా పడుకుంది. ఎలాగో నచ్చజెప్పి, ప్రారంభంలో హార్మోన్ల తేడా వల్ల ఇలా అవుతూ ఉంటుందని, అది కూడా అందరికీ సహజమేనని కావాలంటే కావ్యని అడగమని చెప్పి ఊరుకోబెట్టింది గాని ఉన్నట్టుండి బ్లీడింగ్ అవుతూ ఉంటుందని, దానికో పద్ధతీ పాడూ లేవన్న ఆలోచన మాత్రం అనన్య బుర్రలోంచి పోలేదు. పగలంతా హాయిగా తిరిగేసినా, రాత్రి నిద్దట్లో ఉన్నట్టుండి ‘‘అమ్మా…రక్తం’’ అంటూ లేచి కూచుంటోంది. మొన్న మొన్నటివరకూ వేరే మంచం మీద హాయిగా నిద్రపోయిన పిల్ల, పదిహేను రోజుల నుంచీ ‘‘భయం’’ ‘‘భయం’’ అంటూ తామిద్దరి మధ్యా పడుకుంటోంది. కూతురి ప్రవర్తనలో ఎటువంటి అసహజమూ లేదని శైలజకి తెలుసు. రోగాలతో నిండిన వర్తమానం మనిషిలో భయాల్నీ బెంగల్నీ పెంచి పోషిస్తోంది. అనన్య లాంటి చురుకైన పిల్లలు ఎంత పాజిటివ్ ఆలోచనలతో ఉన్నా ఒక్కోసారి నైరాశ్యం వాళ్ళని ఆవరిస్తోంది. అనన్యతో బాటు ఆటోలో వెళ్ళే ఆరేళ్ళ పాప బ్లడ్ కేన్సర్ తో చచ్చిపోయింది. అలాంటి సంఘటనలు పిల్లల మీద బలమైన ముద్ర వేస్తున్నాయి.
‘‘ఇంక లాభం లేదు. అనూని ఎవరైనా మంచి గైనకాలజిస్టు దగ్గరకి తీసుకువెళ్లి హార్మోన్ల గురించి వివరంగా చెప్పించాలి. అప్పుడు గాని ఆ భయం పోదు!’’ అనుకుంటూ కూతుర్ని దగ్గరగా తీసుకుని కళ్లు మూసుకుంది శైలజ.
******
రావడమే చిరాకు పడిపోతూ వచ్చింది సుష్మ. ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండే స్నేహితురాలు చిరచిరలాడుతూ ఉండేసరికి ఆశ్చర్యంగా, ‘‘ఏంటి సుష్మా…ఏమైంది?!’’ అంటూ అడిగింది శైలజ
సుష్మ శైలజ దగ్గరగా వంగి రహస్యం చెబుతున్నట్టు, ‘‘మొగాళ్లని కాదే….ప్రపంచంలో ఉన్న ఆడాళ్లందరినీ వరస పెట్టి కాల్చి పారెయ్యాలని ఉంది నాకు. ఆడదానికి ఆడదే శత్రువని ఎవరన్నారో నాకు తెలీదు గాని ఆ మహానుభావుడికి వెయ్యి దండాలు!’’ అంది
శైలజ నవ్వుతూ, ‘‘మీ అత్తగారొచ్చారా ఊర్నించి?!’’ అని ప్రశ్నించింది
‘‘ఆ సౌభాగ్యం కూడా తొందర్లోనే ఉందిలే…ఇప్పుడు మాత్రం అది కాదు. ఉండు, అసలే లేటయింది..కాస్త తీరుబాటయ్యాక చెప్తా!’’
మధ్యాహ్నం లంచ్ టైం దాకా ఇద్దరికీ కుదరలేదు. నెల మొదటివారం కావడం వల్ల బ్యాంక్‌లో రద్దీ ఎక్కువగా ఉంది.
లంచ్‌కి కూర్చున్నాక, ‘‘ఆడవాళ్లు రుతుక్రమంలో పడే బాధల గురించీ, వారి శారీరక, మానసిక ఆరోగ్యాల గురించీ ప్రస్తుతం అంతర్జాతీయంగా డిబేట్లు నడుస్తున్నాయి కదా. ప్రభుత్వసంస్థల్లో పనిచేసే ఆడవారికి నెలసరి సమయంలో జీతనష్టం లేకుండా సెలవు ఇవ్వాలంటూ పార్లమెంట్‌లో ఎవరో బిల్లు పెట్టారట. ఆ సందర్భంగా ఎవరో మంత్రిణిగారు నెలసరి రావడం రోగమేమీ కాదు జీతం ఇచ్చి ఇంట్లో కూచోబెట్టడానికి. నొప్పులేమైనా ఉంటే మందేసుకుంటే సరిపోతుంది అన్నారట. మా యముడు చాలా ఆనందపడిపోయాడు. తనే నాకు చెప్పాడీ మాట. ఎంత వెటకారంగా చెప్పాడంటే…అది విన్న దగ్గర్నించీ నాకు ఆడజాతి అంటేనే ఒళ్లు మండిపోతోంది! మనం పడే బాధల్ని సాటి ఆడవాళ్లే అర్థం చేసుకోకపోతే ఇంక మగవాళ్లని మనం అనుకోవడం ఎందుకూ…’’ ఆవేశంగా అంది సుష్మ
శైలజ వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. సుష్మ చెప్పిన సంగతి అప్పటికే శైలజ వింది. బాధపడిరది కూడా. ఇన్ని కోట్ల స్త్రీ జనాభాలో ఎవరి ఆరోగ్యం ఎలా ఉందో ఎవరికి తెలుసు…ఉదాహరణకి సుష్మనే తీసుకుంటే, తన వయసుదే సుష్మ కూడా. పెళ్లయి ఐదేళ్లయింది. ఇంకా పిల్లలు లేరు. ప్రతి నెలా మూడు రోజులూ చాలా బాధపడుతుంది. విపరీతమైన కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు పీకులతో బాటు స్వల్పంగా జ్వరం కూడా వస్తుంది సుష్మకి. చాలా చిరాకుగా ఎవరైనా తన జోలికొస్తే చంపేస్తానన్నట్టు ఉంటుంది. ఆ దిక్కుమాలిన నెలసరి ఎప్పుడొస్తుందో ఎవరు చెప్పగలరు…పండగ రోజుల్లోనో వీకెండ్స్ కో వస్తే ఇంక అంతే సంగతులు. పండగ సంబరం లేదనీ, వీకెండ్స్ ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాననీ భార్యని సాథించి సాధించి వదిలిపెడతాడు సుష్మ భర్త. అయ్యో పాపం బాధపడుతోంది కాస్త సహాయం చేద్దామన్న సద్బుద్ధి లేకపోగా, ‘‘మా అమ్మ గాని చెల్లెళ్లు గాని ఎప్పుడూ ఇలా లేరు. మా ఆఫీస్‌లో ఆడవాళ్లు కూడా నెలంతా నవ్వుతూ ఉంటారు! నువ్వొక్కర్తివే ఇలా ఏడుస్తూ ఉంటావు. నా ఖర్మ ’’ అంటూ సుష్మని తిడతాడు.
‘‘బ్యాంకుకెడితే నేనూ నవ్వుతూనే ఉంటాను. నువ్వు మొగుడివి కాబట్టి నీ దగ్గర ఏడుస్తాను. మీ ఆఫీస్‌లో వాళ్లు కూడా వాళ్ల మొగుళ్ల దగ్గర ఏడుస్తారు గానీ నీ దగ్గరెందుకు ఏడుస్తారు?!’’ అంటూ కోపంగా మొగుణ్ణి తిట్టి, తిండి మానేసి ఏడుస్తూ పడుకుంటుంది సుష్మ. గత ఐదేళ్ల నుంచీ సాగుతున్న బాగోతమే ఇది.
‘‘నెలసరి వస్తోందంటేనే భయం వేస్తోంది శైలూ. ఒక పక్క ఒంట్లో బాధలు, మరో పక్క ఆ యముడితో గొడవలు. ఇలా అయితే డిప్రెషన్ లోకి పోతావంటుంది మా డాక్టరమ్మ. డైవోర్స్ తీసేసుకుని హాయిగా ఒక్కర్తినీ బతికితే బావుండుననిపిస్తోంది. నా నెలసరి బాధల వల్లే పిల్లలు పుట్టడం లేదని మా అత్తగారు కొత్తపాట ఒకటి మొదలెట్టింది!’’
భగవంతుడు రోగం కాని రోగంగా…స్త్రీ జాతి పాలిట శాపంగా సృష్టించిన ఈ నెలసరి మీద ప్రస్తుతం అంతర్జాతీయంగా డిబేట్లు నడుస్తున్నాయన్నది నిజమే. తప్పనిసరిగా నెలకోసారి ఆడవాళ్లు అనుభవిస్తున్న ఆ బాధల పట్ల పురుషజాతి సానుభూతి చూపించాలనీ, సహాయకారిగా ఉండాలన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. రుతుక్రమాన్ని సిగ్గు పడుతూ దాచుకోవాల్సిన విషయంగా భావించవద్దనీ, బహిరంగంగా చెప్పి సహాయాన్ని కోరమనీ అంతర్జాతీయ మహిళా సంఘాలు సైతం ఘోషిస్తున్నాయి. నెలసరిలో ఆడవారికి జీతంతో సెలవు పట్ల నెమ్మదిగా చాలా దేశాలు మొగ్గు చూపిస్తున్నాయి. విచిత్రమేమిటంటే, భారతదేశంలో వెనుకబడ్డ రాష్ట్రంగా పేరుబడ్డ బీహార్, పాతికేళ్ల కిందటే తమ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఆడవారికి నెలసరి సెలవును చట్టబద్ధం చేసింది. జపాన్ దేశం ఆ పుణ్యం కట్టుకుని ఏకంగా డెబ్భై ఐదు సంవత్సరాలైంది. అక్కడ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నిటా ఆడవారికి నెలసరి సెలవు ఇస్తారు. అయితే కేవలం నలభై శాతం సంస్థలు మాత్రమే జీతం ఇస్తాయి. మిగతా సంస్థలు ఇవ్వవు.
‘‘మనకి జీతనష్టం మీద సెలవు ఇచ్చారనుకో, మా యముడు నన్ను ఆ సెలవు కూడా తీసుకోనివ్వడు. జీతం పోతుందని బ్యాంకులోనే ఛావమంటాడు!’’ శైలజ చెప్పిన మాటలన్నీ విని కసిగా అంది సుష్మ
నిజమే. ఈ విషయంలో ఒక్క సుష్మ భర్తే కాదు, నూటికి కనీసం ఎనభై మంది మగవాళ్లు యముళ్లే! క్రితం రాత్రి అనన్య చెప్పినట్టు జీవితంలో కనీసం ఒక్కసారైనా అనుభవిస్తే తప్ప పురుషులకి ఆ బాధ తెలిసిరాదు! మనసులోనే నిట్టూర్చింది శైలజ.
జలుబు చేసినా..జ్వరం వచ్చినా తోసుకు తిరిగేసే ఆడవాళ్లు సైతం నెలసరి వచ్చిందంటే చతికిలబడిపోతారు. అమ్మా…ఉష్షూ…నాయనా అనుకుంటూ మూలుగుతారు. ఎవరైనా కూచోబెట్టి తిండి పెడితే బావుండుననుకుంటారు. పూర్వకాలంలో అంటకూడదంటూ విడిగా దూరంగా కూర్చోబెట్టిన పద్ధతే బావుందనిపించింది శైలజకి. పాపం అనే కొరడా దెబ్బకి తప్ప ఎవరూ లొంగిరారన్న నిజం తెలుసు కాబట్టే పెద్దవాళ్లు బహిష్టు సమయంలో ఎవర్నీ తాకకుండా విడిగా కూర్చోవాలన్న నియమం పెట్టారు. ఇప్పుడా నియమాన్ని ఉల్లంఘించి అవస్థల పాలవుతున్నది తామే.
స్నేహితురాలి మాటలు వింటున్న శైలజకి కొన్నాళ్ల కిందట సుష్మే చెప్పిన మరో మాట గుర్తొచ్చింది.
‘‘ఆడదానిగా పుట్టేకంటే అడవిలో మానై పుట్టడం మంచిదని మా అమ్మ అంటూండేది. ఆ మాట నిజమనిపిస్తోంది శైలూ…’’ ఇంచుమించు కళ్లనీళ్లతో అంది సుష్మ ఆ రోజు.
‘‘ఏం తల్లీ…ఏమైంది?!’’ సమస్యని తేలిక చేద్దామని హాస్యంగా అడిగింది తను.
సుష్మ ఎంత వివరంగా చెప్పుకొచ్చిందంటే శైలజకి ఆ సీనంతా కళ్లముందు కనబడి, తనకి కూడా కళ్లనీళ్లు వచ్చాయి.
పెళ్లయి ఐదేళ్లవుతున్నా ఇంకా పిల్లలు పుట్టలేదని డాక్టర్ దగ్గరకి వెళ్లిందిట సుష్మ. ఆ డాక్టర్ అన్ని టెస్టులూ చేసి, నెలసరి వచ్చిన రెండోరోజు రమ్మందట. సుష్మ అలాగే వెళ్లింది.
డాక్టర్ ఆమెకి స్కానింగ్ చేసి, ఎక్కడా ఏ లోపమూ లేదనీ, అంతా బావుందనీ, పిల్లలు పుట్టే అవకాశం నూటికి నూరుపాళ్లూ ఉందనీ చెప్పిందట.
ఆ మాట వినగానే సుష్మకి వెర్రి ఆనందం కలిగింది. అప్పటికప్పుడే తను ప్రెగ్నెంట్ అయిపోయినట్టూ తనకి బుజ్జి పాపాయి పుట్టినట్టూ కలలుగంటూ మొగుడికిష్టమైన స్వీట్ కూడా కొనుక్కుని ఇంటికొచ్చింది. శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్‌గా తయారై, వేడి వేడిగా పుల్కాలూ పాలక్ పనీర్ చేసింది.
భర్త ఇంటికి రాగానే విషయం చెప్పి ఆనందంగా స్వీట్ ఇచ్చింది. అతను హేపీగా స్వీట్ తిన్నాడు. శుభ్రంగా నాలుగు పుల్కాలూ కూరా లాగించాడు. ఇద్దరూ పడకలకి చేరారు.
‘‘వచ్చే ఏడాది ఈ పాటికల్లా పాపో బాబో పుట్టేస్తార్లే అంది డాక్టరమ్మ. ఆవిడ మాట చల్లగా అలా అయితే ఎంత బావుంటుందో కదా…’’ సుష్మ మైమరపుగా మాట్లాడుతూ, భర్త దగ్గరగా జరిగి, అతని మీద చెయ్యి వేసింది.
అంతే… భర్త ఆమెని ఒక్క తోపు తోసేశాడు. ఆ విసురుకి సుష్మ కింద పడిపోబోయి ఎలాగో ఆపుకుంది. ఊహించని ఆ ప్రతిస్పందనకి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ఎందుకలా తోసేశావని సుష్మ అడిగేలోపునే మొగుడు చీదరింపుగా మొహం పెట్టి, ‘‘మైలలో ఉండి మీద పడతావేంటీ…దూరంగా పడుకో!’’ అన్నాడట.
కన్నీటి పర్యంతమవుతూ మొత్తం చెప్పిన సుష్మ, ‘‘అసలా మాట ఎంత చీదరించుకుంటూ అన్నాడంటే, ఆ క్షణం వాడికి పిల్లల్ని కనాలంటే చాలా అసహ్యమనిపించింది శైలూ..!’’ అంటూ ఏడ్చింది.
శైలజకి తెలుసు! కొట్టడూ తిట్టడూ మామంచివాడు అనిపించుకునే మొగుళ్లు ఎంతమందో ఇలాంటి మాటల ముళ్లు మనసుకి గుచ్చుతూ ఉంటారు. అలాంటివాణ్ణి వదిలెయ్యలేకా కలిసి కాపురం చెయ్యలేకా పెళ్లాలు పడే అవస్థ వాళ్లకీ ఆ దేవుడికే తెలుస్తుంది!
******
ఆదివారం..
తీరిగ్గా టిఫిన్ తిని కాస్సేపు టీవీ చూద్దామని కూచుంది శైలజ. అంతలో తండ్రి దగ్గర్నించి ఫోను…
‘‘బావున్నారా నాన్నా…’’ టీవీ వాల్యూం తగ్గిస్తూ అడిగింది.
‘‘నేను బాగానే ఉన్నాను..’’ తండ్రి అర్థోక్తిలో ఆపేశాడు.
‘‘అదేంటి..అంటే అమ్మకేమైనా బాలేదా?!’’ ఆశ్చర్యంగా అడిగింది.
‘‘ఆవిడగారికి బావుందో బాగాలేదో దానికే తెలియాలి తల్లీ. మీ అమ్మ ఆరోగ్యం సంగతి నాకు తెలీదు గాని, దాని ప్రవర్తన మాత్రం ఈ మధ్య అస్సలు బాగుండటం లేదు! అసలు నీకు చెప్పకూడదనే అనుకున్నాను గాని మాకు నువ్వు తప్ప మరెవరున్నారు చెప్పు?! అందుకే నా మనసులో బాధ నీకు చెబుతున్నాను! ఆదివారం అయితే కాస్త తీరుబాటుగా ఉంటావు గదా నువ్వని ఇవాళ చేశాను ఫోను!’’ కోపమూ బాధా కలగలిసిన స్వరంతో చెప్పాడు తండ్రి.
శైలజకి చాలా ఆశ్చర్యమనిపించింది. తల్లి చాలా నెమ్మదస్తురాలు. పెద్దగా చదువుకోలేదు. ఒకప్పుడు అత్తా ఆడబిడ్డలతో కలిసి ఉండి, వంచిన నడుం ఎత్తకుండా, నోట్లోంచి ఒక్క మాట రానివ్వకుండా చాకిరీ చేసిన మనిషి. భగవంతుని దయ వల్ల ఆమె ఆరోగ్యం కూడా మంచిదే. ఎప్పుడూ కనీసం జ్వరపడి ఎరగదు. తను పెళ్లి చేసుకుని వచ్చేశాక, కాలక్షేపం అవడం లేదంటూ ఆ వీథిలోనే ఉన్న మహిళామండలిలో చేరింది. ఇన్నాళ్లూ కూపస్థమండూకంలా బతికి ఒక్కసారి పదిమందిలోకి వెళ్లేసరికి ఆమెకి కొత్త హుషారు పుట్టుకొచ్చింది. అయినప్పటికీ సంసారాన్ని గాని భర్తని గాని ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యలేదు సరికదా తన స్నేహితురాళ్ల దగ్గర నేర్చుకున్న కొత్త కొత్త రకాల వంటలన్నీ చేసి భర్తకి పెట్టేది. అలాంటి మనిషి ప్రవర్తన బాగాలేదంటూ ఒక్కసారిగా తండ్రి ఫిర్యాదు చేసేసరికి శైలజకి ఏమనాలో అర్థం కాలేదు.
‘‘ఏమైంది నాన్నా’’ ఎలాగో తేరుకుని అడిగింది.
‘‘ఆ మహిళామండలిలో ఏ తిరుగుబాటు సూత్రాలు నేర్పుతున్నారో గాని ఏనాడూ లేనిది మీ అమ్మ నా మీద చిర్రుబుర్రులాడుతోంది. మరోసారి కాఫీ ఇవ్వమంటే కూడా పెద్ద పెద్ద అరుపులు అరుస్తోంది. మొన్నటిదాకా రాత్రిపూట వేడివేడిగా పుల్కాలూ కూరా చేసి పెట్టేది. ఇప్పుడు చేసిననాడు చేస్తుంది లేనినాడు లేదు. ఏ స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టమంటోంది. ఏమైనా అంటే ‘‘ఒక్క నాలుగురోజులు నా చాకిరీ అంతా మీరు చేసి చూడండి తెలుస్తుంది’’ అంటూ పోట్లాటకి దిగుతోంది. దాదాపు మూడు నెలలనుంచి ఇదే వైఖరి. ఇంట్లో ప్రశాంతత అనేది లేదంటే నమ్ము!’’
తండ్రి చెప్పినదంతా విన్న శైలజకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తల్లిలో అంత మార్పు ఎలా వచ్చిందో ఆమెకి అర్థం కాలేదు.
‘‘నేను అమ్మతో మాట్లాడతాన్లెండి నాన్నా’’ అంది చివరికి.
‘‘మాట్లాడటం గాదు, వీలు చేసుకుని ఒక్కపూట వచ్చి వెళ్లు. ముఖాముఖీ మాట్లాడితే గాని ఇలాంటివి తెమలవు!’’ అన్నాడాయన.
‘‘ముందు ఫోన్‌లో మాట్లాడతాను. తర్వాత వీలు చూసుకుని వస్తాను. సరేనా’’ అంది శైలజ
ఆయన సరేనని ఫోన్ పెట్టేశాడు.
వంటపని వాయిదా వేసి వెంటనే తల్లికి ఫోన్ చేసింది శైలజ. విషయం వింటూనే ఆవిడ, ‘‘అనుకుంటూనే ఉన్నాను ఆయన నీకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తారని. నిజంగా మగవాళ్లు ఇంత అథ్వాన్నంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలుస్తోంది శైలూ!’’ అంది బాధగా.
తల్లి నోటినుంచి ఏనాడూ ఎరగని మాట వినేసరికి శైలజకి ఆశ్చర్యం రెట్టింపు అయింది.
‘‘ఏమైందమ్మా అసలు? నాన్న ఏం చేశారు?!’’ అంటూ అడిగింది.
‘‘ముప్ఫై ఐదేళ్ల నుంచీ కలిసి కాపురం చేస్తున్న పెళ్లాన్ని కించిత్తూ అర్థం చేసుకోకపోవడం నేరమే అయితే మీ నాన్న ఆ నేరం చేస్తున్నారు శైలూ. నేను వివరంగా చెబుతాను విను. నలుగురితో కలిసి కాలక్షేపం చెయ్యడం వల్ల నాకు కొమ్ములేమీ రాలేదు గాని, నా మనసులో భావాల్ని సూటిగా చెప్పడం చేతనైంది. పెళ్లయిన కొత్తల్లో మగాడికి ఆడది ఒక శృంగారదేవత. మంచిదే…సంతోషమే. ఎందుకంటే అప్పట్లో ఆడది మంచి బిగిమీద ఉంటుంది కాబట్టి. ఆ తర్వాతే మొదలవుతుంది అసలు కథ. ఒక ఆడదీ మగాడూ కలిసి ఓ యాభై ఏళ్లు కాపురం చేస్తే ఆ యాభై ఏళ్లలో పురుషుడిలో పెద్ద మార్పులేమీ రావు. కాని ఆడది మాత్రం శారీరకంగా, మానసికంగా చాలా రకాల అవస్థలకే గురవుతుంది. గర్భవతి అయినప్పుడు, బిడ్డని సాకుతున్నప్పుడు ఆడదాని శరీరం లోనే కాదు మనసులోనూ ఆలోచనల్లోనూ కూడా రకరకాల మార్పులు వస్తాయి. అవన్నీ అనుభవించాక, నడివయసు దాటుతున్న సమయంలో దాపురించే అవస్థ అన్నిటిలోకీ ఇబ్బందికరమైనది. అదే మెనోపాజ్. ఈ ఇంగ్లీషు పదం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోకు. మా మహిళామండలికి నెలకోసారి ఒక డాక్టరమ్మ వస్తారు. ఆవిడ మమ్మల్నందరినీ ఎలా ఉన్నారని అడిగి, ఏవైనా సమస్యలుంటే చూస్తారు. నాకు మూడు నెలల నుంచీ రకరకాలుగా ఉంటోంది. ఓ రోజు నీరసం, ఓ రోజు విపరీతమైన చిరాకు, బద్ధకం, మరోరోజు డల్‌గా ఉత్తికుత్తినే దుఃఖం వచ్చేస్తున్నట్టు…ఇలా! రాత్రి నిద్దట్లో ఉన్నట్టుండి మెలకువ వచ్చేసి చెమట పోసేస్తోంది. గుండెల్లో దడ…గాభరా! ఎంత ప్రయత్నించినా మామూలుగా ఉండలేకపోతున్నాను. నెల్లాళ్ల కిందట డాక్టరమ్మ వచ్చినప్పుడు నేను ఆవిడకి ఇదంతా చెప్పాను. ఆవిడ నన్ను నెలసరి ఎలా ఉందని అడిగారు. నేను కాస్త సిగ్గు పడి, ‘‘బహిష్టులు పోయే సమయం కదండీ, మూణ్ణెల్లకీ నాలుగు నెలలకీ ఓసారి వస్తోంది! ఇప్పుడైతే ఇంచుమించు ఆర్నెల్లవుతోంది రాలేదు!’’ అని చెప్పాను. అప్పుడావిడ నాకు చాలా వివరంగా అంతా చెప్పారు…ఆడవారిలో ఈ దశను మెనోపాజ్ అంటారట. పునరుత్పత్తికి సహకరించే హార్మోన్ల ఉత్పత్తి ఈ దశలో దాదాపుగా ఆగిపోతుందట. అందువల్ల ఆడదానికి శారీరకంగా, మానసికంగా చాలా రకాల సమస్యలు వస్తాయట. అవేవీ ఆరోగ్య సమస్యలు కావు. నేను చెప్పినట్టు నీరసం చిరాకు బద్ధకం వగైరాలు. కాకపోతే అవి హెచ్చు మోతాదులో ఉంటాయి. ఈ మెనోపాజ్ బాధలకి మందులేమీ ఇవ్వరు. బలమైన ఆహారం, విశ్రాంతి తీసుకుంటూ, యోగా, వాకింగ్ వగైరాలు చెయ్యటమే పరిష్కారం. మా డాక్టరమ్మ ఇవన్నీ నాకు చెప్పాక, నేను మీ నాన్నకి మొత్తం అంతా పూస గుచ్చినట్టు వివరించాను. అంతా వినేసి ఆయన, ‘‘ఇన్నాళ్లూ బహిష్టులతో బాధపడేదానివి. ఇప్పుడు అవి పోతున్నాయంటే ఆనందించాలి గాని బాధ దేనికి?!’’ అన్నారు.
ఆయన మాటకి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. హార్మోన్ల తేడా వల్ల ఇలా ఉంటుందని చెబితే, ‘‘ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే హార్మోన్లన్నీ సవ్యంగా ఉంటాయి. ఇలా చిరాకుపడిపోతూ ఉంటేనే హార్మోన్ల తేడాలొస్తాయి!’’ అన్నారు.
మొత్తం మీద, మీ నాన్నకి నేను పడుతున్న బాధ కించిత్తూ అర్థం కాలేదు. తనకి తెలియకపోతే కనీసం డాక్టరు చెప్పింది నమ్మనైనా నమ్మాలి. అదీ లేదు ఇదీ లేదు. నేనేదో మహిళామండలిలో ఆధునికత వంటబట్టించుకుని మొగుణ్ణి లక్ష్యపెట్టకుండా పోతున్నానని తీర్మానించుకుని బాధపడిపోతున్నారు. నేనిప్పుడు చెప్పబోయేది అదే శైలూ…ఆడదంటే శృంగారానికి పనికొచ్చే ప్రాణి అని మాత్రమే కాదు, ఇంటెడు చాకిరీ చేసి బిడ్డల్ని కని పెంచే యంత్రం కాదు. ప్రకృతిసిద్ధంగా రకరకాల శారీరక, మానసికావస్థలకు గురయ్యే అభాగ్యజీవి అన్న విషయం కూడా మగవాడు మనసుకెక్కించుకోవాలి. ఆడది మగవాడికి కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభా ఎలా అవుతుందో, మగవాడు కూడా ఆడది పడుతున్న అవస్థలకి అనుగుణంగా స్నేహితుడూ, తండ్రీ, నౌకరూ అయినప్పుడే ఆడది పరిపూర్ణంగా సుఖపడుతుంది. లేకపోతే ఇలాగే ఉంటుంది కథ!’’
ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి తల్లి చెబుతున్న మాటలు వింటూ ఉండిపోయిన శైలజ, ‘‘అమ్మా, నువ్వు చాలా ఎదిగిపోయావమ్మా’’ అంది అప్రయత్నంగా.
‘‘అనుభవాలు ఆడదాన్ని ఎదిగేలా చేస్తాయి తల్లీ! ఇరవై ఏళ్ల మగాడు పదేళ్ల ఆడపిల్ల ముందు ఎందుకూ పనికిరాడు!’’
‘‘నా దగ్గరకి రండమ్మా. ఇక్కడ కొన్నాళ్లు విశ్రాంతిగా ఉందువుగాని. నా కూతురు కూడా ఇలాంటి అవస్థలోనే ఉంది…’’ అంటూ అనన్య గురించి చెప్పింది శైలజ.
‘‘అయ్యో, పసిపిల్ల ఎంత బాధపడుతోందో ఏమిటో, డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లి అంతా వివరంగా చెప్పించు శైలూ. అప్పుడు దానికే తెలుస్తాయన్నీ.’’
‘‘అదే అనుకుంటున్నానమ్మా. అనూలాంటివాళ్ల కోసం ఇప్పుడు బొమ్మల పుస్తకాలు కూడా వస్తున్నాయి. అవి కూడా కొంటాను! నువ్వు కూడా రామ్మా నా దగ్గరకి!’’ ఆర్తిగా పిలిచింది శైలజ.
‘‘వస్తాను తల్లీ. అనూ కోసమైనా తప్పకుండా వస్తాను. మీ నాన్నకి చెప్తాను టిక్కెట్లు తియ్యమని!’’ అంది తల్లి.
తల్లితో మరికాస్సేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిందే గాని శైలజ మనసులో అగ్నిగుండం రాజుకుంది. ఆ క్షణం ఆమె కట్టెదుట అనన్య, సుష్మ, తన తల్లి ముగ్గురూ ముక్కోణంగా నిలిచారు. పదేళ్ల అనన్య దగ్గర్నించీ యాభై రెండేళ్ల తన తల్లి వరకూ అందరిదీ ఒకటే సమస్య…అవస్థలే వేరు. పునరుత్పత్తి బాధ్యతను ఆడదానికి అంటగట్టిన ప్రకృతి, స్త్రీని ఉన్నతస్థానంలో నిలబెడుతున్నాననుకుందో ఏమో గాని, వాస్తవానికి ఆ బాధ్యత ఆడవారిని కష్టాలపాలు చేసింది. పది పన్నెండేళ్ల వయసులో రజస్వల అయిన దగ్గర్నించీ, యాభై రెండు..యాభై మూడేళ్లకు మెనోపాజ్ వచ్చేదాకా ప్రతి నెలా బాధలే. అర్థం చేసుకుని ఆదరించే వారు పురుషుల్లోనే కాదు, మహిళల్లో కూడా లేరు. గర్భవతి అయితే అప్పుడు మరో రకం యాతన. ‘ఆడదానికి ప్రసవం పునర్జన్మే’ ‘ప్రసూతి వైరాగ్యం…శ్మశాన వైరాగ్యం ఒక్కలాగే ఉంటాయి’ లాంటి మాటలు కోటలు దాటతాయి గాని అంతటి బాధలు అనుభవించే ఆడవాళ్లకు వాస్తవంగా దక్కుతున్న సహాయం, సానుభూతి చాలా తక్కువ. బిడ్డను కన్నతల్లికి ఓ రకం బాధలూ…బిడ్డల్ని కనలేని ఆడదానికి గొడ్రాలన్న బిరుదులూ, సాటి వనితాలోకం నుంచే హేళనలూ!! ఈ గండాలన్నీ గట్టెక్కి నడివయసు తీరానికి చేరితే అప్పుడక్కడ వైకుంఠపాళీలో అరుకాక్షుడిలా చుట్టబెట్టేది మెనోపాజ్. ఈ దశలో వచ్చే హార్మోన్ల తేడాకి తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినవాళ్లు కూడా ఉన్నారంటూ డాక్టర్లు చెప్పే మాటలు వింటూంటే, ఆడదానిగా పుట్టేకంటే అడవిలో మానై పుట్టడమే మంచిదని అనిపించక మానదు.
ఇన్ని రకాల సమస్యల తిమింగలాల మధ్య జీవితాన్ని ఈదుకుంటూ వచ్చే ఆడదానికి, ప్రకృతి జీవనసహచరుడిగా ప్రసాదించిన మగవాడి నుంచి దక్కే ప్రేమ, గౌరవం, సానుభూతి, సహాయం అన్నీ చాలా చాలా తక్కువ! ఆడదాన్ని గౌరవించమనే మాట శతాబ్దాలుగా పుస్తకాలకే పరిమితమైపోతోంది! స్వాభిమానం దెబ్బతిన్న మరుక్షణం పంచాగ్నుల మధ్య ఆత్మాహుతి చేసుకుంది సతీదేవి. వేదనాజ్వాలల్ని గుండెల్లో దాచుకుని లోలోపల దహించుకుపోతూనే అభిమానరహితంగా ఆత్మీయులందరికీ అమృతాన్ని పంచిపెడుతోంది నేటి మహిళ!
తన అదృష్టం బావుండి తనకి ఉత్తముడైన భర్త దొరికాడు. తను కాస్త బద్ధకంగా పడుకున్నా కూడా ‘‘నువ్వు పడుకో…నేను చేసేస్తాను ఈ పూట వంట!’’ అంటూ చక్కగా వంట చేసి, అన్నం, పప్పు, కూర ప్లేట్లో పెట్టి తనకందించే బెస్ట్ ఫ్రెండ్ చందూ. పదేళ్ల కూతురి మానసికపరిస్థితిని అర్థం చేసుకుని ఆ పసిదానికి స్వస్థత చేకూర్చాలని తపన పడే మంచి తండ్రి!
తను బాగానే ఉంది సరే…మరి మిగతావాళ్ల సంగతేమిటి? వేలాది అనన్యలు, లక్షలాది సుష్మలు, కోట్లాది నడివయసు స్త్రీలు ఇలా బాధపడుతున్నారే…వాళ్ల గుండెల్లో మంటలు చల్లారేదెప్పుడు?! ముప్ఫై మూడు సంవత్సరాల కిందట వచ్చిన ఒకానొక హిందీ సినిమాలో, వరకట్న పిశాచికి బలైపోయిన తన కూతురి కోసం న్యాయస్థానంలో పోరాడుతూ, ‘‘ఈ జ్వాల ఆరేదెప్పుడు…యే ఆగ్ కబ్ భుజేగీ…’’ అంటూ ఎలుగెత్తి ఘోషించిన సునీల్‌దత్ పాత్ర గుర్తొచ్చింది శైలజకి.
ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో ఆమె కూడా అనుకుంది…‘‘యే ఆగ్ కబ్ భుజేగీ…యే ఆగ్ కబ్ భుజేగీ…??!!’’
*********
