పుంసవనం

Spread the love

ఆదిశేషు నూనె మిల్లు నుండి యింటికి వచ్చాడు. రుక్మిణి అతనికి మంచినీళ్లిచ్చి, కాఫీ తీసుకురావటానికి వంటింట్లోకి వెళ్లింది. అతనికి కాఫీ గ్లాసు చేతికిచ్చి, తానూ ఎదురుగా కూర్చుంది. ఆమె ముఖం ఒక విధమైన కాంతితో వెలిగిపోతూంది.

“రుక్కూ, ఏమిటివాళ చాలా అందంగా కనబడుతున్నావు?” అనడిగాడు శేషు, భార్యవైపు మురిపెంగా చూస్తూ.

“మనం తల్లిదండ్రులం కాబోతున్నామండీ!” అన్నదామె సిగ్గుతో.

“మీరు తండ్రి కాబోతున్నారు” అని కదా అనాలి? ఇలా అందేమిటి? అనుకున్నాడా మగాడు. కానీ బయటపడలేదు. వచ్చి భార్య ప్రక్కన కూర్చుని, “ఎంత మంచివార్త చెప్పావు?” అన్నాడు ప్రేమగా.

       “ఈసారయినా సక్రమంగా జరుగుతుందో లేదోనండీ?” అన్నదామె.

       ఆమె గొంతులో ఆందోళన

       ఆమెకు ఇంతవరకు రెండు అబార్షన్లు అయ్యాయి. ముఫ్పై రెండేండ్లు ఆమెకు. శేషు ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని అన్నాడు.

       “ఈసారి ఏం కాదులే! కంగారుపడకు”

       “రాత్రికి వంట ఏం చేయమంటారయితే?”

       “ఈ శుభ సందర్భంలో బియ్యపు రవ్వతో ఉప్మా చేసి, అందులోకి పుట్నాల పొడి కొట్టు రుక్కూ!” అన్నాడు. వంటే కాదు, ఇంట్లో అన్నీ అతడు చెప్పినట్లే జరుగుతాయి. జరగాలి కూడ. రుక్మిణికి కూడ ఫెమినిజం లాంటివి బొత్తిగా తెలియవు. కాబట్టి పేచీ లేదు. అతని ‘పురుషాధిక్యత’తను అత్యంత సహజంగా స్వీకరించిందా యిల్లాలు. “స్త్రీకి స్వాతంత్య్రానికి అర్హత లేదని” మానవులకందరికీ పెద్దాయన చెప్పనే చెప్పాడు. పైగా ఆమెకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. రంగనాయకమ్మ, ఓల్గా లాంటి వారు ఆమెను ప్రభావితంచేసే అవకాశం లేదు! ఇంకాపైగా, తన పుట్టింట్లో అమ్మ, మెట్టినింట్లో ఈ మధ్యే చనిపోయిన ఆమె అత్తయ్య, “పతియే ప్రత్యక్షదైవము… దైవము… దైవమూ…” అన్న భజనకు ప్రతిరూపాలు.

       ఆదిశేషుకు ఇద్దరక్కలు, ఒక చెల్లెలు. కర్నూలుకు దగ్గరలో ఉన్న “గార్గేయపురం” వారిది. శ్రీశైలం వెళ్లే రూటులో ఉంటుంది. ఆ వూరికి మొదట “గాడిదమళ్ల” అనే పేరుండేదంటారు. అది మరీ ఎబ్బెట్టుగా ఉందని గ్రామ పెద్దలు, పండితులనడిగి “గార్గేయపురం’ గా మార్చారు. కర్నూలుకు నందికొట్కూరుకు మధ్యలో ఉంటుందా వూరు. ఆదిశేషు తండ్రి రామశేషు రైతు వారికి కొంత పొలం ఉంది. కొడుకు ఇద్దరాడపిల్లల తర్వాత పుట్టాడు. “ఒక్క కొడుకు కొడుక్కాదు” అన్న నానుడి ప్రకారం, ఇంకో కొడుకు కోసం ట్రై చేశారు. కానీ ఆడపిల్ల పుట్టింది.

       చిన్నప్పటినుంచీ ఆడపిల్లల మధ్య పెరగడం, తల్లీ తండ్రీ వారిని విసుక్కోవడం చూసి, శేషుకు ఆడవాళ్లంటే ఒక విధమైన ఏహ్యభావం పుట్టింది. తన తల్లి ఆడదే అనీ, ఆమె లేకపోతే తాను ఎక్కడనుంచి వచ్చేవాడనీ అతనెప్పుడూ అనుకోలేదు. అక్కలు, చెల్లి పెళ్ళిళ్లకి పొలం చాలావరకు అమ్ముకోవలసి వచ్చింది. వారి పురుళ్లు, పుణ్యాలు, ఒడిబియ్యాలు, ఇలా పెళ్లిళ్లయినా కూడ వారి ఖర్చులు రికరింగ్‌ గానే వస్తూ ఉండినాయి.

       శేషుకు, తల్లిదండ్రుల గారాబం వల్లనో ఏమో చదువంతగా అబ్బలేదు. కర్నూలు ‘సి’ క్యాంపులోని సెయింట్‌ మేరీస్‌’లో ఇంటర్మీడియట్‌ వరకు లాక్కొచ్చాడు. తండ్రి స్నేహితుడు వరాహ గుప్తకు పెద్దది ఆయిల్‌ మిల్లుంది. రామశేషు ఉండగానే, కొడుక్కు అందులో మేనేజరుగా ఉద్యోగం ఇప్పించాడు. కేవలం ఒక్క ఎకరా భూమి మిగిలింది. దాన్నుండి ధాన్యం గింజలు వస్తాయి. సంవత్సరంలో ఏడెనిమిది నెలలు సరిపోతాయి. రామశేషుకు కొంత ఆయుర్వేదం, హోమియోపతి, వైద్యంలో ప్రవేశం ఉంది. కొడుక్కు కూడ నేర్పాడు. దాని వల్ల కూడా ఆ కుటుంబం కొంత ఉపాధి పొందుతూ ఉంది. గార్గేయపురంలో పిత్రార్జితమైన సొంత (పాత) యిల్లుంది.

       నూనెమిల్లు ఆత్మకూరు రోడ్డులో నందికొట్కూరు దాటింతర్వాత వస్తుంది. చాలా పెద్దదది. దానిలో బుడ్డల (వేరుశనగ) నూనె, పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్‌) నూనె, నువ్వుల నూనె ఆడిస్తారు. శేషుకు పదివేల రూపాయల జీతమిస్తాడు వరాహగుప్త. స్నేహితుడి కొడుకని అభిమానం! అతనిమీద బాసిజమ్‌ చూపడు. శేషుకూడ నమ్మకంగా పనిచేస్తాడు. గుప్తను ‘మామా’ అని. ఆయన భార్యను “అత్తా” అని పిలుస్తాడు.

****

       రుక్మిణికి మూడో నెల వచ్చింది. కర్నూలు పెద్దాసుపత్రిలో చూపించుకుంది. డాక్టరు సువార్తమ్మ అంతా నార్మల్‌గానే ఉందని చెప్పింది.

       ఆడపిల్ల పుడుతుందేమోనని శేషుకు భయం అందుకే నందికొట్కూరులోని “విరూపాక్షయ్యస్వామి” గారి దగ్గరికి వెళ్లాడు. ఆయన ఆ ఊర్లోనేగాక, చుట్టు పక్కల గ్రామాలకు కూడ లీడింగ్‌ పురోహితుడు. ఆయనను ప్రజలు ఎంతో గౌరవిస్తారు. శేషు వెళ్లేసరికి ఆయన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నుదుట విభూతి రేఖలు, మధ్యలో గంధాక్షతలు, కుంకుమ, ధరించి సాక్షాత్తు శ్రీశైల మల్లికార్జునునిలా ఉన్న ఆయన ముందుగదిలోకి వచ్చి, ఒక్కొక్కరితో మాట్లాడి పంపసాగాడు. ముహూర్తాలు, శాంతులు, అభిషేకాలు, గ్రహజపాలు, వాస్తు సమస్యలు ఇలా ఎన్నో రకాలుగా ప్రజలు ఆయన దగ్గర పరిష్కారాలు పొందారు.

       శేషు వంతు వచ్చింది. వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించాడు ఆయన ఆశీర్వదించి,

       “ఏమిరా! నీవు రామశేషు కొడుకువు కదా? గార్గేయపురం కదా మీది? మీ ఊరికి పేరుమార్చినవాణ్ని నేనేరోయ్‌!” అని బిగ్గరగా నవ్వాడు ఆయన.

       “ఏం పనిమీద వచ్చావు నాయనా? వాడుండెనే, నీ అబ్బడు (తండ్రి) చాలా మంచోడురా పాపం! అమ్మ ఉందా?” అని కుశల ప్రశ్నలు వేశాడు. మొహమాటపడుతూనే ఇలా విన్నవించుకున్నాడు ఆదిశేషు.

       “స్వామీ నా భార్య కడుపుతో ఉంది. మగ పిల్లవాడు కావాలని మా కోరిక. ఎట్లాగైనా మగపిల్లవాడు పుట్టేటట్లు మీరు ఏదైనా పూజో, జపమో చేయాల”

       “బుద్ధి తక్కువ వెధవా!” అని తిట్టాడు విరుఊపాక్షయ్య స్వామి. “ నీకిదేం పొయ్యేకాలంరా, ఆడపిల్లయినా, మగపిల్లవాడయినా ఆపరాత్పరుని ప్రసాదంగా స్వీకరించాలిగాని,….” అని ఆగాడు కోపంగా.

       “అపుత్రస్య గతిర్నాస్తి” అని మీ అట్టాంటి పెద్దలే….”

       “నీ మొహం! అదేంలేదు! నన్నయ్య అంతటివాడు వందమంది కొడుకులకంటె ఒక్క సత్యవాక్యము గొప్పదన్నాడు. జీవితంలో నిజాయితీగా బ్రతకాలి అంతే”

       “సామీ, మీరు ఏదో ఒకటి చేయాల, తప్పదు! ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలతో మా సంసారం ఆగమయింది. తప్పకుండా మగపిల్లవాడు పుట్టడానికి ఏదో పూజ ఉండనే ఉంటుంది. తమరు దయతలిస్తే కానిదేముంది?” అంటూ ఆయన పాదాలు పట్టుకుని వదల్లేదు శేషు.

       “నీవేమన్నా దశరథ మహారాజువా, పుత్రకామేష్టియాగం చేయడానికి?” అన్నాడాయన. కానీ కొంచెం మెత్తబడ్డాడు. “ముందుకాళ్ళు వదులురా అవివేకి! ఆలోచిస్తానుండు” అన్నాడు.

       కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడాయన. “ఒరేయ్‌, “పుంసవన కర్మ” అని ఒకటుంది. మన సనాతన ధర్మంలోని షోడశ (16) కర్మలలో అది ఒకటి. దీనితో ఆయుర్వేదానికి సంబంధం ఉంది. ఇప్పుడు సైన్స్‌లో జెనెటిక్‌ యింజనీరింగ్‌ అంటారే… అదన్నమాట. 5000 సంవత్సరాలకు ముందే ‘శుశ్రుతుడు’ దీనిని కనిపెట్టాడు. దీనిలో గర్భ గ్రహణ, గర్భస్థాపన, అపత్య జనన అని మూడు దశలుంటాయి. చివరిది పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణను మనకు కావలసినట్లు చేస్తుంది. దీనికి హోమం చేయాలి. నాతోబాటు ఇద్దరు బ్రాహ్మలు కావాలి. గర్భస్థ శిశువు ఆడదైనా, మగగా మార్చగల శక్తి ఈ క్రతువుకుంది. ఇది మూడవనెలలోనే చేయాలి. నీ భార్యకు ఇప్పుడు ఎన్నో నెల?”

       “మూడు నడుస్తుంది స్వామి!”

       “మంచిది శిశువు రంగు, తేజస్సు, మానసిక ఆరోగ్యం ఇవన్నీ కూడ మెరుగుపడతాయి. దీనిని అధర్వణ వేదంలో ప్రస్తావించారు. పెరుగు, పాలు, నెయ్యిని హవనం చేయాలి. మర్రి ఆకు చివురును, భార్య కుడినాసికారంధ్రంలో వెయ్యాలి. కొన్ని జపాలు చేయాలి. మొత్తం రెండు రోజుల క్రతువు”

       “ఎంత ఖర్చు రావొచ్చు స్వామి?”

       “ఐదు నుంచి ఎనిమిది వేలు కావచ్చు”

       అయినా సరే చేయిద్దామనుకున్నాడు ఆదిశేషు. అదే ఆయనతో చెప్పాడు. ఆయన ఇట్లా అన్నాడు.

       “నాయనా, ఈ క్రతువులన్నీ మన మానసిక తృప్తి కోసమేరా. ఏదో మాలాంటివారి జీవనోపాధికి కూడా అనుకో. నీవంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్పాను. కావలసిన సరంజామా అంతా రాసిస్తాను. రేపురా. వచ్చేవారం త్రయోదశి, శుక్రవారం, శనివారం పెట్టుకుందాము. మీ ఊర్లో చెన్నకేశవుల దేవళం అయితే బాగుంటుంది. దాని ధర్మకర్త మద్దిలేటి రెడ్డి నా శిష్యుడే. నేను చెప్పినానని చెప్పి, ఆ రెండు రోజులు ఖాయం చేసుకో. మీ బంధువులను కొందరిని పిలిచి భోజనాలు పెట్టాలి రెండోరోజు. ఇక వెళ్లిరా…”

****

       యధా ప్రకారం, శాస్త్రోక్తంగా, శేషు, రుక్మిణిల చేత పుంసవనకర్మ చేయించాడు విరూపాక్షస్వామి. ఇద్దరు బ్రాహ్మలను కర్నూలు బుధవారపేట నుంచి పిలిపించాడు. పూర్ణాహుతితో క్రతువుముగిసింది. భార్యాభర్తలిద్దరినీ ఆశీర్వదించాడాయన. ఇలా చెప్పాడు.

       “అమ్మా, కాన్పు అయ్యేంతవరకు పరమాత్మ అయిన కృష్ణుని ధ్యానించు భాగవతంలోని స్వామి బాల్య క్రీడలను రోజూ రాత్రి చదువుకో. చిన్ని కృష్ణుడు నీయింట అవతరిస్తాడు.”

****

       డాక్టరు సువార్తమ్మ హస్తవాసి చాలా మంచిది. కాని ఇంత ఖర్చు పెట్టి శాస్త్రం ప్రకారం ‘పుంసవనం’ చేయించుకొని, కిరస్తానీ డాక్టరమ్మ దగ్గర కాన్పు చేయించుకోవడం ఇష్టం లేదు శేషుకు. రుక్మిణికి మాత్రం సువార్తమ్మ దగ్గరే పురుడు పోసుకోవాలని ఉండినా, “జవదాటి యెరుగదు లవలేశమునునైన, మగని మాటను పడతి, మహిత సుమతి” టైపు కదా ఆ ఇల్లాలు! సి. క్యాంపులో డాక్టరు ప్రభావతమ్మ అని గైనకాలజిస్టు క్లినిక్‌లో చూపించుకుంటున్నారు. పుట్టేది మగ బిడ్డేనా స్కాన్‌ చేసి చూడండని శేషు ఆమెను అడిగితే, అతన్ని చడామడా తిట్టింది డాక్టరు.

       “ఏమిటీ? అది చట్ట విరుద్ధం. నిన్నూ నన్నూ జైల్లో వేస్తారు. అయినా ఏ బిడ్డయితేనేం, తల్లీ పిల్లా ఆరోగ్యంగా కాన్పు సుఖంగా జరగాలని కోరుకోవాలిగాని” అన్నదా ధన్వంతరమ్మ.

       నెలలు నిండినాయి. ఒక డేట్‌ యిచ్చింది డాక్టరమ్మ. ముందురోజు వచ్చి చేరమంది. సాయానికి రెండో అక్క వస్తానంది. దానికి మాత్రం అక్క కావాలి!

       ఒకరోజు ఆలస్యంగా రుక్మిణికి నార్మల్‌ డెలివరీ అయింది. బయట వరండాలో ఆందోళనగా ఎదురు చూస్తున్న శేషు దగ్గరకి నర్సమ్మ వచ్చి చెప్పింది.

       “ఆడపిల్ల పుట్టింది! ఎంత బాగుందో! లక్ష్మీదేవి పుట్టిందయ్యా మీ ఇంట!” శేషు హతాశుడైనాడు! నెత్తిన చేతులు పెట్టుకొని బెంచీ మీద కూలబడ్డాడు! శేషు అక్కయ్య నందమ్మ తమ్ముడిని చూసి నవ్వింది! నీకు కావలసిందేలేరా, వెధవా!” అని ఆ నవ్వుకర్థం.

****

       పాపకు ‘నిర్మల’ అని పేరు పెట్టారు. బారసాల జరపలేదు. శేషు డీలా పడిపోయాడు. రుక్మిణీ ఏమాత్రం బాధపడలేదు. పాప మంచి రంగు, ఒత్తైన నల్లని జుత్తు, ఇంతింత కళ్లతో ముద్దులు మూటగట్టేలా ఉంది. నందమ్మ నెల రోజులుండి వెళ్లిపోయింది.

       క్రమంగా శేషు నెమ్మదించాడు. తండ్రిగా సహజమయిన ప్రేమ ఎక్కడకి పోతుంది? తన చిట్టి పొట్టి అడుగులతో మాటలతో నిర్మల తల్లిదండ్రులకు ఆనందాన్ని నింపసాగింది.

       రెండేళ్లు గడిచాయి. రుక్మిణి మళ్లీ గర్భవతి ఈసారి శేషు ఏ ప్రయత్నమూ చేయలేదు. కానీ, భగవంతుని ప్రణాళిక వేరేగా ఉంటుంది ఎప్పుడూ. నెలలునిండి, రుక్మిణి, పెద్దాసుపత్రిలో, సువార్తమ్మ డాక్టరు దగ్గరే మగపిల్లవాడిని కనింది! వాటె డెస్టినీ!

       పిల్లవాడికి “నాగశేషు” అని పేరు పెట్టారు నామకరణం, బంధుమిత్రులందరినీ పిలిచి, ఘనంగా జరిపారు. బనగానపల్లె దగ్గర “కొత్తూరు” అనే సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. ఆ స్వామిని “కొత్తూరు సుబ్బరాయుడు” అంటారు. చాలా మహిమగల దేవుడని పేరు వీరికి కులదైవం ఆయన.

       కొడుకు పుట్టిన తర్వాత ఆదిశేషు దృక్పథంలో బాగా మార్పు వచ్చింది. కూతురి పట్ల ఒక విధమైన నిర్లక్ష్యం ఏర్పడిరది. రుక్మిణి కూడా డిటో!” పున్నామ నరకాత్‌ త్రాయత ఇతి పుత్రః” అన్న ఆర్షవాక్యాన్ని మనసా వాచా కర్మణా నమ్మినవాడు ఆదిశేషు. దాని ఫలితం నాగశేషును అపురూపంగా, నిర్మలను ఉదాసీనంగా చూడసాగారు. ఒక “నెగ్లెక్టెడ్‌ ఛైల్డ్‌” అయిందాపిల్ల. “సెకండ్‌ ఛైల్డ్‌ సిండ్రోమ్‌” అనేది ఒకటి ఉండనే ఉంది. రెండో బిడ్డ పుట్టిన తర్వాత మొదటి బిడ్డ మీద ప్రేమకాకపోయినా, ఏకాగ్రత తగ్గడమనేది సహజం. కాని ఇక్కడ మాత్రం “జెండర్‌ బయాస్‌” పని చేస్తూంది.

       నిర్మలను గార్గేయపురంలోనే ఎలిమెంటరీ స్కూలులో చేర్పించారు. నాగశేషును మాత్రం కర్నూలులోని “లిటిల్‌ ఏంజెల్స్‌” కాన్వెంట్‌లో. ఆ వయసులో నిర్మలకు ఈ వివక్ష తెలిసేది కాదు.

       “తమ్ముడు ఏడూస్తుంటే వినిపించలేదేమే?”

       “వాడికి పెద్ద ముక్క ఇవ్వు చాక్‌లెట్‌ బార్‌లో!”

       కొనే డ్రస్‌లలో కూడ “జెండర్‌ బియాస్‌” కొట్టొచ్చినట్లు కనపడేది!

****

       గార్గేయపురంలో ఐదవతరగతి వరకే ఉంది. నిర్మల నందికొట్కూరు జిల్లా పరిషత్‌ స్కూలులో చేరింది. క్యారేజీ తీసుకొని, బస్‌పాస్‌తో, కర్నూలు`నందికొట్కూరు “పల్లెవెలుగు” ఆర్‌.టి.సి. బస్సులో స్కూలుకు వెళ్లి వచ్చేది. తనకంటె తమ్ముడిని ఎక్కువగా చూస్తారని ఆ అమ్మాయికి వాడిమీద అసూయగాని, కోపంగాని లేవు. అట్లే అమ్మాన్నాల పట్ల వైమనస్యం కూడా లేదు.

       ‘నాగ’ లిటిల్‌ ఏంజెల్స్‌ నుండి “మాంటిస్సోరి”లో చేరాడు. యూనిఫాం, బూట్లు, స్కూలు బస్సు, ఆ వైభోగం వేరుగా ఉండేది.

       కానీ నిర్మల చదువులో చాలా చురుకైనది. ‘నాగ’ అంత తెలివైనవాడు కాదు.

       ఆరోజు టెంత్‌ ఫలితాలు వచ్చాయి. నిర్మల నందికొట్కూరు మండలానికంతా “ఫస్ట్‌”’ గా వచ్చింది. 96 శాతం మార్కులతో. “నాగ’ ముఖం ముడుచుకున్నాడు. ఆదిశేషు కూతురిని అక్కున చేర్చుకుని అభినందించాడు. రుక్మిణి ఇలా అంది.

       “బంగారు తల్లి! దీన్ని బాగా చదివించాల”

       కానీ, రుక్మిణిని నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చేర్పించారు. ఎం.పిసి. గ్రూపు తీసుకునంటాననీ, ఇంజనీరింగ్‌ చేస్తాననీ తండ్రితో వాదించినా లాభం లేకపోయింది. సి.ఇ.సి. తెలుగు మీడియంతో సర్దుకుపోవలసి వచ్చింది.

       రెండేళ్ల తరువాత ‘నాగ’ అత్తెసరు మార్కులతో టెంత్‌ పాసయ్యాడు. అయినా వాడిని కర్నూలు “నారాయణ”లో ఐ.ఐ.టి ఓరియంటేషన్‌తో ఇంటర్‌లో చేర్పించారు. హాస్టల్లో ఉంచడం వారి ఆర్థిక స్థితికి భారం కాబట్టి డేస్కాలర్‌గానే  చేర్చారు.

       ****

       ఐదేళ్లు గడిచాయి. నిర్మల కర్నూలు కె.వి.ఆర్‌. ప్రభుత్వ మహిళా కళాశాలలో బి.కాం. (కంప్యూటర్స్‌) పూర్తి చేసింది. కాలేజీ టాపర్‌. ఆ కాలేజి రైల్వేస్టేషన్‌కు దగ్గర గార్గేయపురంనుంచి ఆర్‌టిసి బస్సులో వచ్చి రాజవిహార్‌ సెంటరులో దిగి కాలేజికి నడిచి పోయేది.

       నాగకు ఐ.ఐ.టి సీటు కాదు కదా, ఎమ్‌సెట్‌లో కూడ లక్షల్లో ర్యాంకు వచ్చింది. వాడి ర్యాంకుకు “కట్టమంచి ఇంజనీరింగ్‌ కాలేజీ”లో సీటు వచ్చింది. ఆ భాగ్యానికి వాడికొక బైకు కొనిచ్చాడు ఆదిశేషు. అది డోన్‌కు వెళ్లే రోడ్‌లో ఉంది.

       “నాన్నా, నేను బ్యాంకు కాంపిటీటివ్‌ పరీక్షలు రాద్దామనుకుంటున్నాను” అంది నిర్మల ఒకరోజు తండ్రితో.

       “తప్పకుండా రాయితల్లీ!” అన్నాడు ఆదిశేషు. ఆయనకు అరవై దాటలేదు.

       కానీ శరీరంలో శక్తి తగ్గుతూంది. నూనె మిల్లులో పని చేస్తూనే ఉన్నాడు. చేయక తప్పదు. వరాహ గుప్తాగారు చనిపోయారు. ఇప్పుడు పెత్తనం ఆయన కొడుకు శిఖామణి గుప్తాది. అతడు యువకుడు. ఆదిశేషును అంత గౌరవించేవాడు కాదు.

       నంద్యాలలో “రాఘవేంద్ర బ్యాంకింగ్‌ సర్వీస్‌ కోచింగ్‌ సెంటర్‌” అని ఉందటనాన్నా. ఆరునెలలు కోచింగ్‌ ఇస్తారంట. ఫీజు ఐదువేలట. చాలా మంది సెలెక్ట్‌ అవుతున్నారట. ఒకవేళ ఉద్యోగం వస్తే, తొలినెల జీతం, సంస్థకివ్వాలట. ఒకసారి ఫీజు కడితే చాలు. సెలెక్ట్‌య్యేంత వరకు మరేమీ ఇవ్వనవసరం లేదు. హాస్టలు కూడా ఉంది. కానీ పీజు నెలకు మూడువేలు.”

       ఆదిశేషు లెక్కలు వేశాడు. “ఐదువేలు, ఆరుమూళ్లు పజ్జెనిమిదివేలు, ఇరవై మూడు. ఇంకో రెండు కలుపుతే ఇరవైఐదు. అమ్మో! మనం భరించలేమమ్మా!” అన్నాడు.

       రుక్మిణమ్మ కల్పించుకుంది. “మీ చిన్న చెల్లెలు సునందవాండ్లుండేది నంద్యాలలోనే కదా! మన పిల్లను ఆరు నెల్లు పెట్టుకోలేరా యేంది?” అన్నది.

       అక్కచెల్లెళ్లకు ఏనాడూ ఒక రవికెముక్క పెట్టిన పాపాన పోలేదీ సహోదరుడు. ఏ మొహం పెట్టుకొని అడుగుతాడు? కానీ పద్దెనిమిది వేలు మిగులుతాయి. “అడుగుదాం.! ఆ మాత్రం మేనకోడలికి చెయ్యలేదా సునంద?” అనుకున్నాడు.

       తమ్ముడి ఇంజనీరింగ్‌కు, బైక్‌కు, ఇంత చర్చ జరగనేలేదని గుర్తొచ్చింది నిర్మలకు. నవ్వుకుంది.

       మొత్తానికి చిన్నత్త, మామ ఒప్పుకున్నారు. నిర్మలను తమయింట్లో పెట్టుకోడానికి. మామ పేరు తిరుపాలయ్య. ఆయనకు నంద్యాల శివారు నూనేపల్లెలో ఎరువులంగడి ఉంది. ఒకే కూతురు పెళ్లి చేశారు.

       బి.ఎస్‌.ఆర్‌.బి. వారి, క్లరికల్‌ ప్రొబేషనరీ ఆఫీసర్ల నోటిఫికేషన్లు వచ్చి ఉన్నాయి. పి.ఓస్‌ మాత్రం స్టేట్‌ బ్యాంకు గ్రూప్‌ది. వేలలో పోస్టులు పడ్డాయి. “కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి” అనుకొని పి.ఓస్‌ కోచింగ్‌లో చేరింది నిర్మల. కర్నూలు కె.వి.ఆర్‌. కాలేజీ ఇంగ్లీష్‌ లెక్చరర్‌ హసీనా బేగం. ఆమె తన విద్యార్ధినులకు, ఏ కెరీర్‌కైనా ఇంగ్లీష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ముఖ్యమని చెప్పేది. ధాంప్సన్‌ అండ్‌ మార్టినేట్‌ వారి ప్రాక్టికల్‌ ఇంగ్లీష్‌ గ్రామర్‌, హరిమోహన్‌ ప్రసాద్‌ “ఆబ్జెక్టివ్‌ ఇంగ్లీష్‌” లాంటి పుస్తకాలు వారితో కొనిపించిందామె. రోజూ “ది హిందూ” పేపర్‌ చదవమని దూరదర్శన్‌లో ఇంగ్లీషు వార్తలు జాగ్రత్తగా వింటూ, స్ట్రెస్‌ అండ్‌ ఇంటోనేషన్‌ ఫాలో అవమని చెప్పేదామె. ఆమె స్ఫూర్తితో ఇంగ్లీష్‌ మీద పట్టు సాధించింది నిర్మల.

       మేనత్తకు, మామకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా, ఆరు నెలలు ఒక తపస్సులా చదివింది నిర్మల.

       “బంగారమంటి పిల్ల! దీన్ని కాదని ఆ మొద్దు వెధవ నాగ్గానికోసం అంగలారుస్తాడు మా అన్న!” అంటుంది మేనత్త.

       పి.ఓస్‌. పరీక్షా కేంద్రం కర్నూలు సిల్వర్‌ జూబ్లీ గవర్నమెంట్‌ కాలేజీకి ఇచ్చారు. తల్లిదండ్రులకు నమస్కరించి, వెళ్లి ఎంతో కాన్ఫిడెన్స్‌తో పరీక్ష రాసి వచ్చింది నిర్మల. ఫలితాల కోసం ఎదురు చూడసాగింది.

****

       ‘నాగ’ ఇంజనీరింగ్‌ నాలుగేళ్లు పూర్తయ్యాయి. కాని ఇంకా ఎనిమిది సబ్జెక్టులు “బ్యాక్‌ల్యాగ్స్‌” ఉండిపోయాయి. ఇంటిలో కూర్చుని ఓ.టి.టిలో సినిమాలు చూడడం, బైక్‌మీద ఫ్రెండ్స్‌తో బలాదూరు తిరగటం, తప్ప వాడికేంపనిలేదు. కమ్యూనికేషన్‌, ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌లేని లక్షలమంది ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో వీడొకడు! బ్యాక్‌ల్యాగ్స్‌ క్లియర్‌ చేసుకుందామనే తపనగాని, ఇలా ఉండిపోయాననే గిల్టీ ఫీలింగ్‌ గాని వాడిలో కొంచమైనా లేదు.

       నిర్మల రిటన్‌ టెస్ట్‌లో క్వాలిఫై అయింది. ఇంటర్వ్యూకు పిలిచారు. ఇంటర్వ్యూ హైద్రాబాద్‌లో బ్యాంక్‌ స్ట్రీట్‌లోని ఎస్‌.బి.ఐ. ఎల్‌.హెచ్‌.ఓ (లోకల్‌ హెడ్‌ ఆఫీసులో) నంద్యాల రాఘవేంద్ర వాళ్లు, ఇంటర్వ్యూకు కూడ వారం రోజులు ప్రత్యేకంగా కోచింగ్‌ ఇచ్చారు.

       తండ్రితో బాటు హైదరాబాదు ఇంటర్యూకు వెళ్లి వచ్చింది నిర్మల. ఇంటర్వ్యూ వాళ్లడిగిన ప్రశ్నలకు కాన్ఫిడెంట్‌గా సమాధానమిచ్చింది. తెలియనివాటికి నిజాయితీగా తెలియదని చెప్పింది. ఆమెలో ఒక కమిట్‌మెంట్‌ను, ఒక గ్రేస్‌ను, గమనించారు అధికారులు.

       ఫలితాల కోసం ఉద్వేగంగా ఎదురు చూడసాగింది. పదిరోజుల తర్వాత ఆమెను ఎస్‌.బి.ఐ.లో పి.ఓ.గా అపాయింట్‌ చేస్తూ రిజిస్టర్డ్‌ లెటర్‌ వచ్చింది. ఫలితాలు వారి వెబ్‌సైట్‌లో కూడ పెట్టారు. తల్లిదండ్రులను ఆనందంగా వాటేసుకుంది నిర్మల! ఆదిశేషు ఆనందించాడు. కానీ కొడుకు ప్రయోజకుడు కానందుకు విచారించాడు. రుక్మిణమ్మ కూతురికి దిష్టి తీసింది.

       హైదరాబాదులో ఆరు వారాల ట్రెయినింగ్‌ అనంతరం నిర్మలను కడప జిల్లాలోని ‘ఖాజీపేట’ బ్రాంచికి పోస్టు చేశారు. వెళ్లి చేరింది.

       ఆదిశేషు ఉద్యోగం మానిపించాడు శిఖామణి గుప్త. “చిన్నాయనా, ఏమనుకోగాకు, రాన్రాను పని చెయ్యలేకపోతన్నావు. నీ కొడుక్కు కావాలంటే నీ స్థానంలో ఉద్యోగమిస్తా” అన్నాడు

       ఆ మాట చెబితే గయ్యిమని లేచాడు నాగ తండ్రి మీదికి. “ఇంజనీరింగ్‌ చేసిన (?) నేను నూనె మిల్లులో ఉద్యోగం చేయడమా? నో! నెవర్‌!” అన్నాడు. “నేను నందికొట్కూర్‌లోగాని, కర్నూల్లోగాని సెల్‌ఫోన్‌ షాపు పెట్టుకుందామనుకుంటున్నా. నాకు ఐదులక్షలియ్యి. ‘బిగ్‌ సి’ వాళ్ల ఫ్రాంచైసీ తీసుకుంటా. నా ఫ్రెండ్‌ పార్టనర్‌గా ఉంటాడు. మన పొలం అమ్మేయి” అన్నాడు.

       ఆ పొలానికి మంచి రేటే వచ్చింది. ఐదు లక్షలు కొడుక్కిచ్చాడు. ఇంకో పదిలక్షలుంది. దాన్ని నిర్మల పెళ్లికి తీసిపెట్టుకుందామంది రుక్మిణమ్మ. ఆదిశేషు ఏం పలకలేదు. దానిని పోస్టాఫీసులో డిపాజిట్‌ చేసుకున్నారు.

       మూడు నెలలు కూడా తిరక్కముందే, నాగా పార్టనర్‌ వాడిని నిలువునా ముంచాడు. ఐదు లక్షలు హంద్రీనది పాలు! నిర్మల ఒక వీకెండ్‌ వచ్చింది. ఖాజీపేటలోనే ఒక చిన్న యిల్లు తీసుకుని ఇద్దరు కొలీగ్స్‌తో ఉంటూ, వంట చేసుకుంటున్నారు. తండ్రితో ఇలా అంది.

       “నాన్నా, మీరు కూడా నాతో పాటు ఖాజీపేటకు రండి! పెద్ద యిల్లు తీసుకుందాము. ఈ యిల్లు బాడిగకిచ్చేద్దాం. నేనూ ఒంటరిగా లేకుండా బాగుంటుంది.”

       “మరి తమ్ముడూ?”

       “అయ్యో నాన్నా, వాడేమీ పరాయివాడా? అందరం ఒకచోటే!” అన్నదాపిచ్చి తల్లి.

****

       అందరూ ఖాజీపేటకు మారిపోయారు. అది మైదుకూరుకు కడపకు మధ్యలో ఉంటుంది. నందికొట్కూరు లాగే ఒక మోస్తరుటవును.

       నిర్మల జీతం, కటింగ్స్‌ పోను నలభైమూడు వేలు. జీతం ఆమె అకౌంటులో క్రెడిట్‌ అయ్యేది. ఇంటి ఖర్చులన్నీ ఆమె చూసేది. ‘నాగ’ తన బైక్‌ పాతదయిందనీ, కొత్తది కొనుక్కుంటాను, పల్సర్‌ బండి, లక్షరూపాయలిమ్మనీ, అక్కను వేధించసాగాడు. తల్లీ తండ్రీ తమ్మునివైపే. బ్యాంకులో లోన్‌ తీసి బైక్‌ కొనిచ్చింది. దానిమీద కడపకు వెళ్లి సినిమాలు, షికార్లు చేసి వచ్చేవాడు. ఇంజనీరింగ్‌ బ్యాక్‌ ల్యాగ్స్‌ అంతే సంగతులు.

       కూతురికి సంబంధాలు చూద్దామని భర్తను పోరసాగింది రుక్మిణమ్మ. ఒక సంబంధం వచ్చింది. పిల్లవాడు ఎ.పి. జెన్‌.కోలో జె.యి. అమ్మాయి బ్యాంక్‌ పి.ఓ. అని మొగ్గు చూపారు. వారి వైఖరి చూస్తే పిల్ల నచ్చినట్లే అనిపించింది. కానీ వారం తర్వాత ఆదిశేషు వాళ్ళు విరమించుకున్నట్లు తెలిపాడు.

       అలా ఐదారు సంబంధాలు వెనక్కు వెళ్లిపోయాయి. మూడేళ్ల తరువాత నిర్మలను అనంతపురం జిల్లా తాడిపత్రి బ్రాంచికిట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆ అమ్మాయికి ఇప్పుడు ఇరవై ఆరేళ్లు! తన పెళ్లి విషయం తల్లిదండ్రులు చూసుకుంటారులే అని నిశ్చింతగా ఉంది.

       ఈలోపు ఆదిశేషు చిన్నక్క కూతురిని నాగ కిస్తామని వచ్చారు. నందమ్మ కూతురు టెంత్‌ ఫెయిలయింది. ఒక్కతే కూతురు నాగ బిజినెస్‌ పెట్టుకోడానికి పదిలక్షలిస్తామన్నారు. ‘నాగ’కు అమ్మాయి కంటే అమౌంట్‌ నచ్చింది. వారికి పెళ్లి చేశారు. నాగ అనంతపురంలో ఒక నెట్‌ సెంటరు, జిరాక్స్‌, డి.టి.డి.సి కొరియర్‌ ఫ్రాంచైజీ తెరిచాడు. రోజూ తాడిపత్రి నుండి బైక్‌ మీద అనంతపురానికి వెళ్లి వ్యాపారం చూసుకొని వస్తూంటాడు.

       మరదలు పేరు దమయంతి. చదువురాకపోయినా షోకులెక్కువ. నిరంతరం సెల్ ఫోన్‌లో మునిగి తేలుతుంటుంది. ఇంట్లో ఏ పనీ చేయదు. ఇంటి బాధ్యత అంతా నిర్మలదే! నాగ ఏం సంపాదిస్తాడో ఏమోగాని, నెలలో రెండుసార్లయినా “అక్కా! ఒక ఫైవ్‌ ధౌజండ్‌ కావాలి!” అని అడుగుతుంటాడు.

       మరో రెండేళ్లు గడిచాయి. నాగకు కొడుకు పుట్టాడు. అయినా వాడికి బాధ్యత తెలియలేదు. ఈలోపు మరో నాలుగు సంబంధాలు వెనక్కి వెళ్లాయి. చివరగా వచ్చిన సంబంధం బ్యాంక్‌దే. పిల్లవాడు హిందూపురం కెనరా బ్యాంక్‌లో క్లర్క్‌ కమ్‌ క్యాషియర్‌. బాగున్నాడు నిర్మలకు కూడ నచ్చాడు.

       కానీ తండ్రి ఇలా చెప్పాడు.

       “మన నిర్మల ఆఫీసరని, వారి పిల్లవాడు క్లర్కు అనీ, పెళ్లయింతర్వాత వాండ్ల వాడిని లోకువగా చూస్తుందేమోననీ, కాబట్టి విరమించుకుంటున్నామనీ చెప్పారు. మనమైనా వరహీనం పిల్లవానికి చూచి చూసి పిల్లనెలా ఇస్తాం?”

       ఒక రోజు సాయంత్రం బ్రాంచికి ఆ పిల్లవాడు వచ్చాడు. అతని పేరు వెంకటేశ్వర్లు. వారిది చిత్తూరు జిల్లా నగరి. అతన్ని చూసి ఆశ్చర్యపోయింది నిర్మల.

       “మీకు ఇబ్బంది కలిగిస్తే సారీ! మీకు అభ్యంతరం లేకపోతే, కాసేపు బయటకు వెళదామా? మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి.” అన్నాడు.

       “అదేంలేదు పదండి!” అంది నిర్మల. మేనేజర్‌గారి పర్మిషన్‌ తీసుకొని వచ్చింది. ఇద్దరూ కొంచెం దూరంలో ఉన్న ఐస్‌ క్రీం పార్లర్‌కు వెళ్లి కూర్చున్నారు. రెండు ఐస్‌క్రీంస్‌కు ఆర్డరిచ్చాడు ఆ అబ్బాయి.

       “నేను క్యాడర్‌లో మీకంటే తక్కువ పొజిషన్‌లో ఉన్నానని, నన్ను వద్దన్నారట. క్యాడర్‌ను పక్కన బెడితే, నాకు మీ అణకువ, అందం, బాగా నచ్చాయి. మాకు చాలా ఆస్తి ఉంది. నేను కూడ మరో రెండేళ్లల్లో ఆఫీసర్‌ను అవుతాను. ప్రమోషన్‌ లిస్ట్‌లో ఉన్నాను. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోతే మా అమ్మే నన్ను పెంచి ఇంతవాడిని చేసింది. ఆమెకూడ “ఆ పాపలో ఏదో నెమ్మదితనం ఉందిరా వెంకూ! నిన్ను బాగా చూసుకుంటుంది. ఎందుకైనా మంచిది ఒక్కసారి ముఖాముఖి మాట్లాడిరా నాయనా! మన యింటి దీపం అవ్వాలిరా ఆ పిల్ల!” అన్నది తెలుసాండి. నాకు కూడా అదే భావం ఉంది. అందుకే ధైర్యం చేసి వచ్చాను. ఈ రోజు హాఫ్‌ డే లీవ్‌ పెట్టాను లెండి. క్లర్కులం కదా! మాకు లీవ్‌ అంత కష్టమేమీ కాదు. మీకులాగా!” అన్నాడు. అతడి కళ్ళు నవ్వుతున్నాయి. నిర్మల గుండె జల్లుమంది.

       “ఎవరీ యువకుడు? ఎందుకితని సమక్షంలో తన హృదయం ఇంత అందంగా స్పందిస్తూంది?” అనుకుంది. అదే క్షణంలో నాన్న తను అనని దానిని, వాళ్లు అన్నట్లుగా ఎందుకు చెప్పాడని ఆలోచించింది. ఒక నిజం స్ఫురించి, ఆమె మనసు వికలమైంది.

       వెంకటేశ్వర్లు ఆమెవైపే తదేకంగా చూస్తున్నాడు. అతని చూపుల్లో చూపు కలిపి, వెంటనే కళ్లు దించుకుంది. ఆమె కపోలాలలో తంగేడు పూలకాంతులు విరిశాయి. లజ్జతో ఆమె ముఖం ఎర్రబారింది.

       “చెప్పండి నిర్మలగారూ! మీ జీవిత భాగస్వామినయ్యే అదృష్టం నాకివ్వండి. మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను.”

       నిర్మల హాయిగా నవ్వింది. “మీరు అంత బ్రతిమాలనక్కరలేదు. మీరంటే నాకూ యిష్టమే. మా వాళ్లను కన్విన్స్‌ చేసి మీకు ఫోన్‌ చేయిస్తాను”

       “ధైర్యంగా ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని నొక్కాడు. “థాంక్స్‌” అన్నాడు. వెళ్లిపోయాడు.

       బ్యాంకుకు తిరిగొచ్చిన నిర్మల మనస్సు అన్యమనస్కంగా ఉంది. “తండ్రి అలా ఎందుకు చెప్పాడు. ఒకవేళ తనకంటె ఉద్యోగంలో స్థాయి తక్కువైన వాడితో పెళ్లి చేయడం ఆయనకి యిష్టం లేదేమో? ఎలాగైనా, అదేం పెద్ద విషయం కాదని, ప్రేమ, అవగాహన ఉంటే క్యాడర్‌ అడ్డురాదని ఆయనతో చెప్పి ఒప్పించాలి” అనుకుంది. మేనేజర్‌కు చెప్పి, పర్మిషన్‌ తీసుకొని ఇంటికి వెళ్లింది. రోజూ ఆమె యింటికి వచ్చేసరికి ఏడున్నర, ఎనిమిదవుతుంది. కానీ ఈరోజు ఆరుకే వచ్చేసింది.

       ముందు తలుపు దగ్గరకు వేసి ఉంది. తోయబోయి అమ్మానాన్నల మాటలు వినబడి, ఆగింది. తండ్రి అంటున్నాడు. “అది పెళ్ళి చేసుకుని వెళ్లిపోతే మన గతేమిటి రుక్కూ! వాడు చూస్తే ఎందుకూ పనికిమాలిన వాడు. మనకా రాను రాను శక్తి తగ్గుతూంది. మనిద్దిరి మందులకే నెలనెలా ఐదారువేలు కావాలి.”

       “అలాగని పెళ్లి కావలసిన పిల్లను ఎన్నాళ్లు ఇంట్లో ఉంచుకుంటాం?”

       “తప్పదుమరి. నాగ కూడా” అక్కకు పెళ్లి చేస్తే మనకు చాలా కష్టం నాన్న” అన్నాడు.

       “అయితే వస్తూన్న సంబంధాలన్నీ…” అన్నది రుక్మిణమ్మ బాధతో, ఆశ్చర్యంతో!

       “అనును. నేనే ఏదో ఒక కారణం చెప్పి, వాళ్లే కాదన్నట్లుగా, తిరగ్గొడుతున్నా. నాకు పాపం చుట్టుకున్నా సరే! వేరే మార్గంలేదు.!”

       “పుంసవన కర్మ” చేయించి కొడుకును కందామనుకుంటే ఇది పుట్టిందని బాధపడేవారు. కానీ అమ్మాయి అయినా, కొడుకులాగానే కుటుంబాన్ని ఆదుకుంది. కొడుకైనా వాడు నిరర్ధకుడైనాడు. ఆడపిల్ల ఉసురు మనకు తగులుతుందండీ!” అమ్మ ఏడుస్తున్న ధ్వని లీలగా!

       వింటున్న నిర్మల కాళ్లు వణుకుతున్నాయి. వీధి వాకిలి పక్కనే ఉన్న చిన్న అరుగుమీద కూలబడింది. జరుగుతున్న ఘోరాన్ని నమ్మలేకపోతూందా పిచ్చి తల్లి. చివరికి ఒక ధృడ నిశ్చయం తీసుకుని తలుపు తట్టింది. తల్లిదండ్రులు మామూలుగానే ఉండటం గమనించింది.

****

       వారం రోజులు గడిచాయి. ఆరోజు ఆదివారం. ఉదయాన్నే ఒక ఫ్రెండ్‌ను కలసివస్తానని వెళ్లింది నిర్మల. మధ్యాహ్నం రెండు గంటలు నిర్మలకు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. వీళ్లంతా భోజనాలు చేసి కూర్చున్నారు. తలుపు చప్పుడయితే తీశారు.

       బయట నిర్మల, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు వాళ్లమ్మ రాజ్యలక్ష్మమ్మ నిలబడి ఉన్నారు. ఇద్దరి మెడలో పూలదండలు. వారిని దిగబెట్టడానికి ఇరువైపుల కొంతమంది స్నేహితులు రెండుకార్లలో వచ్చి, వీళ్లను దింపి, వెళ్లిపోయారు.

       పూలదండలతో లోపలికి వచ్చిన నూతన దంపతులను చూసి నిశ్చేష్టులైనారు అమ్మ,నాన్న, తమ్ముడు, మరదలు. సరాసరి వచ్చి ఆదిశేషుకు, రుక్మిణమ్మకు పాదాభివందనం చేశారు వారు. కళ్లనిండా నీళ్లతో, స్థిరమైన గొంతుతో నిర్మల ఇలా చెప్పింది.

       ‘నాన్నా, మన మధ్య తరగతివారిలో నైతిక విలువలు ఎక్కువ, అనుబంధాలు బలంగా ఉంటాయని, మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబితే నిజమే అనుకున్నాను. మీ స్వార్థం కోసం నా జీవితాన్ని బలిపెట్టాలని చూశారు మీరు. పాపం అమ్మ నిస్సహాయురాలు. మిమ్ముల్ను కాదనే ధైర్యం ఆమెకు లేకుండా ఆమె మైండ్‌ను ట్యూన్‌  చేసుకుంటూ వచ్చారు మీరు.

       “కొడుకు కోసం వ్రతాలు యాగాలు చేశారు పాపం! కానీ నేను పుట్టాను. నన్ను మొదటినుంచి ఇన్‌ఫీరియర్‌గా, తమ్ముడిని సుపీరియర్‌గా పెంచారు. పరిస్థితి రివర్స్‌ ఐంది. ఏ వ్రతాలు చేయకుండానే పుట్టిన తమ్ముడు ఎందుకూ పనికిరాని వాడయ్యాడు.”

       “నేను పెళ్ళి చేసుకున్నంత మాత్రాన మిమ్ముల్ను చూసుకోనని ఎవరు చెప్పారు నాన్నా మీకు? మా వాళ్ళకెవరూ లేరు, నేను తప్ప నా శాలరీలో కొంత వాళ్లకిస్తానని నా భర్తను ఒప్పించి, మీకు ఆర్థికంగా అండగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడాపని చేయను”

       “నీ స్వార్థం నీవు చూసుకున్నావు కదా, అక్కా! మేము ఏమైపోతే మీకేమిలే” అన్నాడు తమ్ముడు.

       పకపక నవ్వింది అక్క.

       “ఒరేయ్‌. నేను పాత సినిమా “మరో చరిత్ర” లో సరితను కాదు. నీవు మాత్రం, ఆ సినిమా తమ్ముని  (లేదా అన్న(?)  పేరు మర్చిపోయాను. రజనీకాంత్‌వే! కార్ల్‌మార్క్స్‌” మానవ సంబంధాలన్నీ ఆర్థిక  సంబంధాలే” అన్నాడంటే మరీ అంత దారుణమా అనుకొనేదానిని.  నీవు నాన్న అది ప్రతి అక్షరం నిజమే అని నిరూపించారు. నేనున్నంత వరకు నీకు బాధ్యత తెలియదు. నాన్నను, అమ్మను, మరదలిని ఎలా పోషిస్తావో, నీ యిష్టం!” అన్నది వాడు తలవంచుకున్నాడు.

       “నాన్నా, బాధ్యతలను మోసీ మోసీ, అలసిపోయాను. దేవుని దయ వల్ల నాకు మంచి భర్త, అత్త దొరికారు. వెళ్లొస్తాము”

       మూర్తీభవించిన ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన నిర్మల భర్తతో, అత్తతో గడపదాటింది. తనదైన, తనకు మాత్రమే స్వంతమైన, అందమైన జీవితంలోకి!

పాండ్యం దత్తశర్మ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *