చిగురించిన వసంతం పార్ట్ – 5

Spread the love

అధ్యాయం 13

సైన్యంలో జీవితం

ఆ తర్వాత కటూషాని మూడేళ్ళకు పైగా చూడలేదు నెఖ్లుడోవ్. మళ్ళీ ఆమెను చూసే సమయానికి అతను ఆఫీసర్‍గా ప్రమోషన్ తీసుకుని తన రెజిమెంట్‌లో చేరేందుకు వెళ్తున్నాడు. అదే దోవలో ఉన్న మేనత్తల దగ్గర కొన్నిరోజులు గడపాలనుకుని అక్కడికి వచ్చాడు. మూడేళ్ళకిందటి వేసవిలో వాళ్ళతో గడిపిన కుర్రాడు కాదు ఇప్పుడతను. చాలా మారిపోయాడు. అప్పడు అతను ఏ మంచిపని కోసమైనా తనను తాను త్యాగం చేసుకోవడానికి కూడా సిద్ధపడే నిజాయితీగల నిస్వార్థ యువకుడు. కాని ఇప్పుడతను నైతికంగా పతనమైపోయి, స్వీయానందం గురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరుడు. అప్పట్లో అతనికి దేవుని సృష్టి ఒక అర్థంకాని రహస్యంలా తోచేది. ఆ రహస్యాన్ని ఛేదించాలని ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రయత్నించేవాడు. కాని ఇప్పుడతను జీవిస్తున్న పరిస్థితుల ప్రాబల్యం వల్ల ప్రతీదీ చాలా స్పష్టంగా, తేలికగా కనిపిస్తోంది.

అప్పుడు అతనికి ప్రకృతితో మమేకం కావడం, ముందుతరాల కవులు తత్వవేత్తలు జీవితాన్ని అనుభవించి ఆలోచించి అనుభూతిచెంది అందించిన విషయాల ప్రాముఖ్యతను గుర్తించడం, వాళ్ళతో సంబంధాలు కలిగుండటం అత్యంత అవసరమని భావించేవాడు. కాని ఇప్పుడతను మనిషి సృష్టించిన వ్యవస్థలతోనూ, తన స్నేహితులతోనూ మంచి సంబంధాలు ఉండటం మాత్రమే అత్యంత అవసరమని, చాలా ముఖ్యమని అనుకుంటున్నాడు. అప్పుడతనికి స్త్రీలు ఎంతో రహస్యంగా, ఆకర్షణీయంగా కనిపించేవారు. వాళ్ళని ఆవరించి ఉండే ఆ మార్మికతే ఎంతో మనోహరంగా అనిపించేది. ఇప్పుడు అతనికి స్త్రీల మీద ఒక నిర్దిష్టమైన అభిపాయం ఉంది. తన కుటుంబ స్త్రీలూ, తన స్నేహితుల భార్యలూ తప్ప మిగతా స్త్రీలందరూ తాను ఎన్నోసార్లు అనుభవించిన సుఖాన్ని మళ్ళీమళ్ళీ అందించడానికి ఉన్న  మంచి మార్గాలు. ఆ రోజుల్లో డబ్బు అతనికి ఒక అవసరం కాదు. తల్లి పంపించే డబ్బులో మూడోవంతు కూడా అవసరమయ్యేది కాదు. ఇప్పుడు నెలకు 1500 రూబిళ్ళ భత్యం కూడా చాలడం లేదు. దీని గురించి తల్లితో అతనికి ఇప్పటికే కొన్ని ఇబ్బందికరమైన చర్చలు కూడా జరిగాయి.

అప్పడు అతను తన ఆత్మనే ‘నేను’ అని భావించేవాడు. ఇప్పుడు తన ఆరోగ్యవంతమైన, బలమైన జంతువులాంటి శరీరమే ‘నేను’ అనుకుంటున్నాడు.

అతనిలో ఈ భయంకరమైన మార్పు తనను తాను నమ్మడం మానేసి ఇతరులను నమ్మడం వల్ల కలిగింది. మనిషి తనను తాను నమ్ముకుంటూ బతకడం చాలా కష్టం అనిపించి  అతనలా మారాడు. తనను తాను నమ్ముకుని జీవించేవాడు దాదాపు ప్రతి సందర్భంలోనూ తన ‘పశు సహజమైన’ కోరికలకు వ్యతిరేకమైన నిర్ణయాలే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి కోరికలెప్పుడూ సులువైన మార్గాల్లో వచ్చే సుఖాలను మాత్రమే కోరుకుంటాయి. ఇతరులను నమ్మినపుడు ఏది తనకు తాను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిదీ ముందే నిర్దేశించబడి ఉంటుంది. అది కూడా ఆ జంతుస్వభావపు ‘నేను’కు అనుకూలంగానూ, ఆధ్యాత్మిక ఆత్మకు వ్యతిరేకంగానూ నిర్దేశించబడి ఉంటుంది.  అంతే కాదు, తనను తాను నమ్ముకున్న వాడెప్పుడూ చుట్టూ ఉన్నవాళ్ళ విమర్శలకు గురౌతాడు. ఇతరులను అనుసరించినపుడు అతనికి వాళ్ళ మద్దతు ఉంటుంది. అందుకే, జీవితంలోని గంభీరవిషయాలైన దేవుడు, సత్యం, ధనం-దరిద్రం గురించి నెఖ్లుడోవ్ ఎప్పుడు మాట్లాడినా అతని చుట్టూ ఉన్నవాళ్ళంతా అది సందర్భోచితం కాదని, కొంచెం హాస్యాస్పదంగా కూడా ఉందని అనుకునేవాళ్ళు. తల్లి, మేనత్తలు కూడా అతణ్ణి చూసి జాలిపడి ‘నోత్రా షేర్ ఫిలోసోఫ్’ (మా ప్రియమైన తత్వవేత్త) అని వేళాకోళంగా పిలిచేవాళ్ళు. కాని అతను నవలలు చదివినప్పుడు, అశ్లీల కథలు చెప్పినప్పుడు, ఫ్రెంచ్ రంగస్థలంలో హాస్యనాటకాలు చూడటానికి వెళ్ళినప్పుడు, ఆ చతుర్లని తిరిగి సరదాగా వాళ్ళతో పంచుకున్నప్పుడు మాత్రం అందరూ వాటిని ఆస్వాదించి అభినందించి ప్రోత్సహించేవాళ్ళు. అతను తన అవసరాలను తగ్గించుకోవడం మంచిదనుకుని, ఒక పాతకోటు వేసుకుని, మందు తాగడం మానేసినప్పుడు అందరూ అతణ్ణి వింతగా చూసారు. అదంతా ఒక రకమైన గొప్పలు ప్రదర్శించుకునే ప్రయత్నంలా భావించారు. కాని అతను వేటకోసం, విలాసవంతమైన ప్రత్యేక ‘స్టడీ రూమ్’ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినప్పుడు మాత్రం అందరూ అతని అభిరుచిని మెచ్చుకున్నారు. పైగా ఆ అభిరుచిని ప్రోత్సహించడానికి ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చారు.

అతను పవిత్రంగా ఉంటూ, పెళ్ళి చేసుకునే వరకు అలాగే ఉండాలని అనుకున్నప్పుడు అతని మానసిక ఆరోగ్యం బాగుపడాలని స్నేహితులు దేవుణ్ణి ప్రార్థించారు. కాని అతను తన స్నేహితుడికి చెందిన ఒక ఫ్రెంచ్ మహిళను గెలుచుకున్నాడని తెలిసినపుడు అతని తల్లి కూడా బాధపడలేదు. పైగా, తన కొడుకు అసలైన మగాడయ్యాడని గర్వపడింది. (కాటూషా విషయంలో మాత్రం నెఖ్లుడోవ్ ఆమెను పెళ్ళి చేసుకుంటాడేమో అన్న ఆలోచనే ఆమెకు భయంకరంగా అనిపించేది.)

నెఖ్లుడోవ్ యువకుడయ్యాక, భూమి ప్రైవేట్ ఆస్తిగా ఉండటం తప్పని భావించి, తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించిన చిన్నఎస్టేట్‌ను రైతులకు పంచిపెట్టినపుడు ఆ చర్య తల్లిని, బంధువులని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. అతణ్ణి ఎగతాళి చేయడానికి బంధువులందరికి అదొక సాకుగా ఉపయోగపడింది. ఆ భూమిని తీసుకున్న రైతులు ధనవంతులు కాలేదని, దానికి విరుద్దంగా మూడు సారాయి దుకాణాలు తెరవడంతో వాళ్ళు తాగుబోతులై ఏ పని చేయకుండా మరింత పేదవాళ్ళయ్యారని అతనికి రోజూ నూరిపోసేవాళ్ళు. కాని నెఖ్లుడోవ్ సైన్యంలో గార్డ్‌గా చేరాక తన రాజవంశపు స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా ఖర్చుచేస్తూ జూదంలో డబ్బు పోగొడుతుంటే, తల్లి ఎలెనా ఇవానోవ్‍నా గత్యంతరం లేని స్థితిలో తన మూలధనంలోంచి డబ్బు తీయాల్సిన పరిస్థితి ఏర్పడినా కూడా ఆమె పెద్దగా బాధపడలేదు. పైగా తన కొడుకు ఇలా చిన్నవయసులోనే మంచి సాంగత్యంలో ఇలా దుబారా వేషాలు వేయడం మంచిదే అని, అది అత్యంత సహజమైన పనే అని భావించింది.

మొదట్లో నెఖ్లుడోవ్‍లో సంఘర్షణ చెలరేగేది. కాని తనపై తనకి నమ్మకం ఉన్నప్పుడు అతను మంచిదని భావించిందంతా అందరికి చెడుగా కనిపించింది. అతను చెడు అనుకున్నదంతా చుట్టూ బతుకుతున్నవాళ్ళచేత మంచిగా చూడబడుతోంది. ఆ సంఘర్షణ నెఖ్లుడోవ్‍కి చాలా కష్టతరంగా మారింది. చివరకు అతను లొంగిపోయాడు. తనను తాను నమ్మడం మానేసి ఇతరులను నమ్మడం మొదలుపెట్టాడు. ఇలా తనపై తాను నమ్మకం కోల్పోవడం మొదట్లో అతనికి అసహ్యంగా అనిపించింది. కానీ అది ఎక్కువకాలం నిలబడలేదు. అప్పుడే అతను ధూమపానం మధ్యపానం అలవాటు చేసుకున్నాడు. చాలా తొందరగానే అతను ఈ అసహ్యభావాన్ని అధిగమించి గొప్ప ఉపశమనం కూడా పొందాడు.

స్వభావరీత్యా తీవ్ర భావోద్వేగభరితుడైన నెఖ్లుడోవ్, తన చుట్టూ ఉండేవాళ్ళందరికీ ఆమోదయోగ్యమైన కొత్త జీవనశైలికి పూర్తిగా అంకితమయ్యాడు. దానికి విరుద్ధమైన జీవితాన్ని కోరుకునే తన అంతర్గత స్వరాన్ని పూర్తిగా అణచివేసాడు. ఈ మార్పు అతను సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్ళాక మొదలై, సైన్యంలో చేరడంతో పరాకాష్టకు చేరింది.

సైనికజీవితం సాధారణంగా మనుషులను భ్రష్టుపట్టిస్తుంది. అది వాళ్ళని పూర్తిగా సోమరిపోతులుగా మారడానికి అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ఉంచుతుంది. ఉపయోగకరమైన పనులేమి చేయడానికి ఉండదు. సాధారణ మనిషికుండే విధులనుండి విముక్తం చేస్తుంది. దానికి బదులుగా రెజిమెంట్ గౌరవం, యూనిఫార్మ్, జెండాకి చేయాల్సిన సాంప్రదాయబద్ధమైన విధులను మాత్రమే అప్పగిస్తుంది. ఒకవైపు సామాన్య ప్రజలపై సైనికులకి సంపూర్ణ అధికారాన్ని ఇస్తూనే, మరోవైపు తమకంటే పైస్థాయిలో ఉన్న అధికారులకు ‘బానిస విధేయత’ ప్రదర్శించాల్సిన స్థితిలోకి వాళ్ళని నెట్టేస్తుంది.

సైనికసేవలో ఉండే యూనిఫారాలు, గౌరవాలు, జెండాలు, అనుమతితో కూడిన హింస, హత్యలు లాంటి సాధారణ దిగజార్చే ప్రభావాలతో పాటు, అదనంగా- డబ్బుకి ఉండే భ్రష్టపరిచే ప్రభావం, రాజకుటుంబీకులకు సన్నిహితంగా దగ్గరగా మెలగడం, వాళ్ళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం వంటివి తోడైనప్పుడు, ప్రత్యేకించి ‘గార్డ్స్ రెజిమెంట్‌’లో ఉన్నట్లుగా అధికారులందరూ సంపన్నులు, ఉన్నత కుటుంబీకులు చుట్టూ ఉన్నప్పుడు- ఈ దిగజారుడు ప్రభావానికి వశమైపోయిన మగాళ్ళలో సంపూర్ణస్వార్థ మనోవ్యాధి పుడుతుంది.

నెఖ్లుడోవ్ ఆర్మీలో చేరి తన సహచరుల్లా జీవించటం ప్రారంభించిన మొదటిరోజునుంచే అతనికి ఈ అతిస్వార్థ మనోవ్యాధి సోకింది. అద్భుతంగా కుట్టిన యూనిఫారాన్ని ఎవరో ఉతికి ఇస్త్రీ చేసిస్తే ధరించటం, ఇంకెవరో తుడిచి సిద్ధం చేసిచ్చిన ఆయుధాలను పట్టుకోవడం, మరెవరో పెంచి శిక్షణ ఇచ్చి మేతేసిన మంచి గుఱ్ఱంమ్మీదెక్కి గస్తీకి వెళ్ళటం తప్ప అతనికి చేయడానికి పెద్ద పనేం ఉండేది కాదు. తనలాంటి వాళ్ళతో కలసి కత్తి తిప్పటం, తుపాకి పేల్చటం, అదే పని వేరేవాళ్ళకు నేర్పటం మాత్రమే అతని పని. తనపైన ఉండే యువ వృద్ధ ఉన్నతాధికారులు, చక్రవర్తి, చక్రవర్తి అనుచరులు అతని పనిని ఆమోదించటం మాత్రమే కాదు, ప్రశంసించి కృతజ్ఞతలు కూడా తెలియజేసేవారు.

ఇదంతా అయ్యాక తిండి తినడం అతి ముఖ్యమని పనిగా పరిగణించబడేది. ఆఫీసర్ల క్లబ్బుల్లోనూ, మంచి రెస్టారెంట్లలోని ప్రత్యేక గదుల్లోనూ బాగా తిని తాగడం, ఎక్కణ్ణించి వస్తుందో తెలియని డబ్బును విపరీతంగా ఖర్చు చేయడం, ఆ తర్వాత నాటకాలు, నృత్యసంగీతాలు, స్త్రీలు. మళ్ళీ గుర్రపు స్వారీ, కత్తులు తిప్పడం, తుపాకులు కాల్చడం. మళ్ళీ అదే డబ్బువృథా, అదే మద్యం, అదే పేకాట, అదే స్త్రీలు, అదే జీవనశైలి. ఇలాంటి జీవితం ఇతరులకన్నా సైనికుల మీదే ఎక్కువ చెడుప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఒక్క సైనికుడు తప్ప మరెవడైనా ఇలాంటి జీవితం గడిపితే ఖచ్చితంగా మనసు అంతరాంతరాల్లో సిగ్గుపడతాడు. కాని ఒక్క సైనికుడు మాత్రమే దీనికి విరుద్ధంగా- ముఖ్యంగా యుద్ధసమయంలో- ఇలాంటి జీవితం గడిపినందుకు గర్వపడతాడు. టర్కులతో యుద్ధం ప్రకటించిన వెంటనే నెఖ్లుడోవ్ సైన్యంలో చేరాడు. ‘యుద్ధాల్లో మా ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆనందంగా, నిర్లజ్జగా జీవితం గడపటం మాకు క్షమార్హం మాత్రమే కాదు, ఖచ్చితమైన అవసరం కూడా. అందుకే మేం అలా జీవిస్తున్నాం’ అనేది వాళ్ళ నమ్మకం.

నెఖ్లుడోవ్ ఆలోచనలు ఆ సమయంలో అలా అయోమయంగా ఉండేవి. ఇంతకుముందు తాను విధించుకున్న నైతిక అడ్డంకుల నుండి విముక్తి పొందిన ఆనందాన్ని అతను పూర్తిగా అనుభవించాడు. అప్పుడు అతను జీవించిన స్థితి ఒక ప్రమాదకర అతిస్వార్థ ఉన్మాద వ్యాధిలాంటిది. మూడు సంవత్సరాల తర్వాత తన మేనత్తలను చూడటానికి మళ్ళీ వచ్చినప్పుడు అతనింకా అదే స్థితిలో ఉన్నాడు.

14వ అధ్యాయం.

మాస్లోవాతో రెండవ సమావేశం

నెఖ్లుడోవ్ రెజిమెంట్‌లో చేరడానికి ప్రయాణించాల్సిన దారి పక్కనే అతని అత్తల ఎస్టేట్ ఉంది. ఎస్టేట్ దాటే రెజిమెంట్‌‍కు వెళ్ళాలి. అందుకే అతను మేనత్తలను చూడటానికి వెళ్ళాడు. అత్తలు చాలా ఆప్యాయంగా అతన్ని రమ్మని పిలిచారు. ముఖ్యంగా అతను కటూషాను చూడాలనుకున్నాడు.

బహుశా అతని హృదయంలో కటూషా పట్ల ఇప్పుడున్న అతని అదుపులేని జంతు సహజమైన ప్రవృత్తి సూచించిన దుష్ట ఆలోచనలు అప్పటికే ఏర్పడి ఉండవచ్చు. కాని  అక్కడికి రావడంలో తన ఉద్దేశ్యం అదే అని అతను అంగీకరించలేడు. ఒకప్పుడు తాను ఎంతో సంతోషంగా గడిపిన ఆ ప్రదేశానికి తిరిగి వెళ్ళాలని మాత్రమే అతను కోరుకున్నాడు.  తెలీకుండానే తన చుట్టూ ప్రేమాభిమానాల వాతావరణాన్ని నింపి, తనతో ఎప్పుడూ సరదాగా ఇష్టంగా ఉండే దయార్ద్రహృదయులైన ముసలి మేనత్తలను చూడాలనుకున్నాడు. తనకెంతో ఆహ్లాదకర జ్ఞాపకంలా మిగిలిన ఆ మధుర కటూషాని మళ్ళీ కలవాలని మాత్రమే ఆశించాడు.

మంచు కరగడం మొదలైన తర్వాత మార్చి చివరిలో గుడ్ ఫ్రైడే రోజున అతనక్కడికి చేరుకున్నాడు. కుండపోతగా వర్షం కురుస్తోంది. అతని వొంటిమీద ఒక్క పొడి దారపుపోగు కూడా లేదు. బాగా చలిగా అనిపించినా ఎప్పుడూ ఉండే ఉత్సాహంతో ఉల్లాసంగానే  ఉన్నాడు. చిరపరిచితమైన ఆ పాతకాలపు ప్రాంగణంలోనికి అతని మంచుబండి (చక్రాలు కాకుండా, కిందిభాగం పలకలుగా ఉండే Sledge అనే ఒకరకమైన గుర్రబ్బండి) ప్రవేశిస్తుండగా ‘ఆమె ఇంకా ఇక్కడే ఉండి ఉంటుందా?’ అనుకున్నాడతను. ఇంటి చుట్టూరా తక్కువ ఎత్తున్న ఇటుక ప్రహారిగోడ మొత్తం ఇంటి పైకప్పుల నుంచి కరిగిపడిన మంచుతో కప్పబడి ఉంది.

మంచుబండి గంటల శబ్దం విన్న వెంటనే కటూషా బయటికి వస్తుందని అనుకున్నాడు. కాని  ఆమె రాలేదు. కాళ్ళకు చెప్పుల్లేని ఇద్దరు స్త్రీలు అప్పుడే గచ్చు తుడిచి వస్తున్నట్టు స్పష్టంగా అర్థమయ్యేలా మడిచిన లంగాలతో, బకెట్లు చేతబట్టుకుని పక్కతలుపు నుండి బయటకు వచ్చారు. ముందరి గుమ్మంలో కూడా కటూషా కనబడలేదు. ఏప్రాన్ ధరించిన పనివాడు ‘టిఖోన్’ వరండాలోకి వచ్చాడు. అతను కూడా ఇల్లు శుభ్రం చేయడంలో తలమునకలుగా ఉన్నట్టు చూడగానే అర్థమౌతోంది. లోపలి గదిలో కూడా అతనికెదురైన  ఒకేఒక్క వ్యక్తి పెద్దత్త సోఫియా ఇవానోవ్‍నా. ఆమె ఖరీదైన పట్టుగౌను ధరించి, తలమీద  టోపీ పెట్టుకుని ఉంది. మేనత్తలు ఇద్దరు పొద్దున్నే చర్చికెళ్ళి పవిత్రప్రసాదం స్వీకరించి వచ్చారు.

‘నీ రాక చాలా సంతోషంగా ఉంది’

అంటూ సోఫియా ఇవనోవ్‍నా అతన్ని ముద్దు పెట్టుకుంటూ అంది.

‘మేరీకి ఆరోగ్యం బాగాలేదు, చర్చిలో చాలాసేపు నిల్చుండటం వల్ల అలసిపోయింది, మేము పవిత్ర ప్రసాదం తీసుకున్నాం’ అంది సోఫియా.

రష్యాలో పవిత్రప్రసాదం స్వీకరించిన వారిని అభినందించడం ఒక సంప్రదాయం.

‘మీకు నా అభినందనలు సోఫియా అత్తా’ అన్నాడు నెఖ్లుడోవ్ సోఫియా ఇవనోవ్‍‍‍నా చేతిని ముద్దు పెట్టుకుంటూ.

‘ఓహ్, క్షమించండి అత్తా, మీ చేతిని తడిపేసాను’ అన్నాడు.

‘సరే, నీ గదిలోకి వెళ్ళు. అయ్యో! ఎందుకు ఇలా తడిసిపోయావు. బాబోయ్… నీకు మీసాలు కూడా వచ్చాయే!… కటూషా! కటూషా! ఇతనికి కాఫీ తీసుకురా త్వరగా.’ అందామె.

‘ఆ, వస్తున్నా’ అని కారిడార్ నుండి ఒక సుపరిచిత మధుర స్వరం వినిపించింది.

‘ఆమె ఇక్కడే ఉంది!’ అంటూ కేకలేసింది నెఖ్లుడోవ్ హృదయం. ఆ క్షణం మబ్బుల చాటు నుండి సూర్యుడు బయటకు వచ్చినట్లుగా అనిపించిందతనికి.

టిఖోన్ తన వెనుక నడుస్తుండగా, నెఖ్లుడోవ్ ఉత్సాహంగా తన పాతగదికి వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు.

‘కటూషా ఎలా ఉంది, ఏం చేస్తోంది, ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు’ అని టిఖోన్‍ని అడగాలన్న కోరిక బలంగా కలిగిందతనికి. కాని టిఖోన్ అతణ్ణి చాలా గౌరవిస్తాడు. పైగా టిఖోన్ అప్పుడు కొంచెం గంభీరంగా ఉన్నట్టు కూడా కనిపించాడు. జగ్గులోంచి నీళ్ళు తన చేత్తోనే పోయాలని గట్టిగా పట్టుబట్టాడు కూడా. అందుకే ఆ సమయంలో అతణ్ణి కటూషా గురించి అడగడానికి నెఖ్లుడోవ్‌కు మనసు రాలేదు. దానికి బదులుగా టిఖోన్ మునిమనవళ్ళ బాగోగుల గురించి, పాత ‘అన్నయ్య గుర్రం’ గురించి, ‘పోల్కాన్’ అనే కుక్క గురించి మాత్రమే అడిగాడు. అందరూ బాగానే ఉన్నారు కాని పోల్కాన్ గత వేసవిలో పిచ్చిపట్టి చచ్చిపోయిందని చెప్పాడు టిఖోన్.

నెఖ్లుడోవ్ తడిబట్టలన్నీ విప్పేసి పొడిబట్టలు వేసుకుంటుండగా ఒక చురుకైన, పరిచితమైన  అడుగుల సవ్వడి వినిపించింది. ఆపైన తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఆ పాదాలు ఎవరివో, ఆ తలుపు తట్టిన తీరు ఎవరిదో కూడా అతనికి బాగా తెలుసు. ఆమె తప్ప ఇంకెవ్వరూ అలా నడవరు, అలా తలుపు తట్టరు. తడిగా ఉన్న కోటునే మళ్ళీ భుజాల మీద వేసుకుని, తలుపు తెరిచి ‘లోపలికి రా’ అన్నాడు నెఖ్లుడోవ్.

అదే కటూషా!

అప్పట్లాగే ఉంది. అప్పటికంటే మరింత మధురంగా ఉంది. కొంచం ‘మెల్ల’ ఉన్న అవే  అమాయకమైన నల్లని కళ్ళు, అదే పాతపద్ధతిలో పైకి చూసాయి. అప్పట్లానే ఇప్పుడు కూడా తెల్లటి ఏప్రాన్ వేసుకునుంది. అప్పుడే కాగితం విప్పిన సువాసనల సబ్బుతో పాటు, అతని మేనత్తలు పంపిన రెండు తువ్వాళ్ళు తీసుకొచ్చింది. ఒకటి రష్యన్ ఎంబ్రాయిడరీ ఉన్న పొడవైన తువ్వాలు, ఇంకోటి స్నానపు తువ్వాలు. చక్కటి ముద్రతో, ఇంకా ఉపయోగించని ఆ కొత్త సబ్బు, ఆ కొత్త తువ్వాళ్ళు, నిత్యనూతనమైన ఆమె మూర్తిమత్వం… అన్నీ ఒకే  శుభ్రతతో తాజాగా, స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయి. అతన్ని చూడగానే అణచుకోలేని ఆనందంతో ఉప్పొంగిన ఆమె చిరునవ్వు- ధృఢమైన తీయటి పెదవులను మునుపటిలా ముడుచుకునేలా చేసింది.

‘ఎలా ఉన్నావ్, దిమిత్రి ఇవనోవిచ్?’. సిగ్గుతో చెక్కిళ్ళు లేతగులాబీ రంగును అద్దుకుంటుండగా అతికష్టమ్మీద అడిగిందామె.

‘గు…డ్ మా…ర్నింగ్, ఎలా ఉన్నావు? బాగున్నావా?’ అతను కూడా సిగ్గుపడుతూనే అడిగాడు.

‘దేవుడిదయ వల్ల బాగానే ఉన్నాను. ఇదిగో, మీకు ఇష్టమైన గులాబీరంగు సబ్బూ, తువ్వాళ్ళు. మీ అత్తలు పంపారు’ అంటూ సబ్బును బల్లమీద పెట్టి, తువ్వాళ్ళను కుర్చీ వెనుక వేసింది.

అతిథి స్వేచ్ఛగా ఏదైనా వాడుకోవచ్చన్నట్టుగా టిఖోన్ ‘అన్నీ ఇక్కడే ఉన్నాయి’ అంటూ బ్రష్‌లు, అత్తర్లు ఫిక్సేటివ్‍లు (సువాసనని ఎక్కువసేపు నిలిపేవి), వెండిమూతల సీసాలు, అన్నిరకాల స్నానపు సామగ్రితో నిండి వున్న డ్రెస్సింగ్ కేస్‍ని తెరిచి నెఖ్లుడోవ్‍కి చూపించాడు.

‘ఓహ్! ఇక్కడుండటం నాకెంత సంతోషంగా ఉందో. మా అత్తలకు నా కృతజ్ఞతలు చెప్పండి.’  అన్నాడు నెఖ్లుడోవ్. అతని హృదయం మునుపటిలాగే కాంతితో, మృధుత్వంతో నిండిపోయింది. అతని మాటకు బదులు చెప్పకుండా చిరునవ్వుతోనే స్పందించి బయటకెళ్ళిపోయింది ఆమె.

నెఖ్లుడోవ్‍ను ఎప్పుడూ ప్రేమించే అత్తలు, ఈసారి మునుపెన్నడూ లేనంత ఆప్యాయంగా అతణ్ణి ఆహ్వానించారు. ‘దిమిత్రి యుద్ధానికి వెళ్తున్నాడు. అక్కడ అతను గాయపడొచ్చు, చనిపోవచ్చు’ అనే ఆలోచన ఆ ముసలి అత్తలను కలచివేసింది. నెఖ్లుడోవ్ కేవలం ఒక రాత్రి, ఒక పగలు మాత్రమే మేనత్తలతో గడపాలని అనుకున్నాడు. కాని కటూషాని చూసిన తర్వాత ఈస్టర్ వరకు వాళ్ళతో ఉండటానికి ఒప్పుకున్నాడు. ఒడెస్సాలో తాను కలవాల్సిన మిత్రుడు ‘షోన్‌బాక్‌’కు టెలిగ్రాఫ్ పంపి, తన బదులు అతణ్ణే అత్తల ఇంటికి రమ్మని చెప్పాడు.

కటూషాని చూడగానే నెఖ్లుడోవ్‍లో ఆమె పట్ల ఉన్న పాతభావాలు మళ్ళీ మేల్కొన్నాయి. అప్పట్లాగే ఇప్పుడు కూడా ఆమె వేసుకున్న తెల్లటి ఏప్రాన్‌ను చూడగానే ఉద్రేకపడకుండా ఉండలేకపోతున్నాడు. ఆమె అడుగుల సడి, ఆమె స్వరం, ఆమె నవ్వు విని ఆనందంతో ఉద్వేగపడకుండా ఉండలేకపోతున్నాడు. నల్లని స్ట్రాబెర్రీల్లాంటి ఆమె కళ్ళని చూసి సున్నితభావాలేవో ఉప్పొంగకుండా ఉండలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆమె నవ్వినప్పుడు, మరీ ముఖ్యంగా ఆమెను కలిసినప్పుడు, సిగ్గుతో ఎర్రబడిపోయే ఆమె తీరుని చూసి కలవరపడకుండా ఉండలేకపోతున్నాడు.

తాను ప్రేమలో ఉన్నానని అతను భావించాడు. కాని ఇంతకు ముందులా కాదు. అప్పట్లో ఈ ప్రేమ అతనికొక రహస్యంలా అనిపించేది. తాను ప్రేమిస్తున్నానని తనకి తాను కూడా ఒప్పుకునేవాడు కాదు. ఒకమనిషి ఒకసారి మాత్రమే ప్రేమించగలడని అతను బలంగా నమ్మాడు. ఇప్పుడు తాను ప్రేమలో ఉన్నానని, దానికి సంతోషపడుతున్నానని కూడా అతనికి స్పష్టంగా తెలుసు. అంతే కాదు, ఇప్పటి ఈ ప్రేమలో ఏం ఉంటుందో, అది దేనికి దారితీస్తుందో కూడా అతనికి చూచాయగా తెలుసు. కాని దాన్ని తననుంచి కూడా దాచడానికి అతను ప్రయత్నించాడు.

మనుషులందర్లో ఉన్నట్టే నెఖ్లుడోవ్‍లో కూడా ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకరు ఆధ్యాత్మికమైన మనిషి. అతను స్వీయానందాన్ని కోరుకున్నా అది అందరి ఆనందానికి దారితీస్తుంది. ఇంకొకడు జంతు సహజమైన మనిషి. అతను వ్యక్తిగత ఆనందాన్ని కోరుకోవడమే గాకుండా దానికోసం ప్రపంచంలో మిగిలినవాళ్ళ ఆనందాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతాడు. పీటర్స్‌బర్గ్‌లోనూ, సైన్యంలోనూ గడిపిన జీవితం వల్ల పెరిగిన స్వార్థపూరితమైన పిచ్చి అతనిలోని జంతు సహజమైన మనిషిని పెంచి పోషించి, ఆధ్యాత్మిక మనిషిని సమూలంగా అణిచేసింది.

కాని అతను మళ్ళీ కటూషాని చూసినప్పుడు, మూడేళ్ళక్రితం తనకు కలిగిన అనుభూతులనే మళ్ళీ అనుభవించినప్పుడు అతనిలోని ఆధ్యాత్మిక స్వరూపం మళ్ళీ తల పైకెత్తి తన హక్కులను బలంగా అడగడం ప్రారంభించింది. ఈస్టర్‌ వచ్చేవరకు, రెండు పూర్తిరోజులు అతనిలో అచేతనంగా ఒక అంతర్గత పోరు నిర్విరామంగా సాగుతూనే ఉంది.

తాను అక్కణ్ణించి వెళ్ళిపోవాల్సిందేననీ, అత్తల దగ్గర ఉండటానికి అసలైన కారణమేదీ లేదనీ, అక్కడే ఉండిపోవడం వల్ల జరగే మంచి కూడా ఏం లేదని హృదయపు లోలోతుల్లో అతనికి స్పష్టంగా తెలుసు. అయినా నిజాయితీగా ఆ నిజాన్ని అంగీకరించకుండా, అక్కడుండటంలో ఉన్న ఆ ఆహ్లాదం, ఆ ఆనందం గ్రహించి అక్కడే ఉండిపోయాడు.

.

ఈస్టర్ పండుగరోజు సాయంత్రం ప్రార్థనాసేవ కోసం ఇంటికి వచ్చిన ఫాదర్, డీకన్ (దైవ సేవకుడు) చెప్పినదాని ప్రకారం చర్చికీ, ఆ వృద్ధమహిళల ఇంటికీ మధ్య బురద గుంటలు, గతుకుల నేలతో కూడిన మూడు మైళ్ళ దూరాన్ని మంచుబండిలో దాటడానికి వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. నెఖ్లుడోవ్ తన మేనత్తలు, పనివాళ్ళతో కలిసి ప్రార్థనాసేవలో పాల్గొన్నాడు. తలుపు దగ్గర నిలబడి పూజారులడిగే  ధూపదీప పాత్రలు తెస్తున్న కటూషాని పదేపదే చూస్తూనే ఉన్నాడు. పూజారులకు అత్తలకు ఈస్టర్ ముద్దు ఇచ్చాక- అప్పటికింకా అర్ధరాత్రి దాటలేదని, ఈస్టర్ ఇంకా రాలేదని తెలిసినప్పటికీ ఇక నిద్రపోదామని వెళ్తుండగా, పాత పనిమనిషి మట్రోనా పావ్లోవ్‍నా అర్ధరాత్రి ప్రార్థనల తరువాత ఇచ్చే కౌలిచ్, పాస్కీ అనే ప్రత్యేక ఈస్టర్ కేకుల కోసం, పాస్టర్ల ఆశీర్వచనాల కోసం చర్చికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న శబ్దం అతనికి వినిపించింది. ‘నేను కూడా వెళ్ళాలి’ అని అనుకున్నాడు.

చర్చికి వెళ్లే దారి మంచుబండిలో గాని, చక్రాలబండిలో గాని ప్రయాణించడానికి వీలుకాని విధంగా ఉంది. అందుకే, అత్తల ఇంట్లో కూడా సొంతింట్లో ఉన్నట్టు నడుచుకునే నెఖ్లుడోవ్ ‘అన్నయ్య గుర్రం’ అని పిలవబడే పాతగుర్రం మీద జీను వేయమని ఆదేశించాడు. రంగురంగుల పండుగ చొక్కా, బిగుతైన స్వారీ ప్యాంటు, పొడవాటి చలికోటు ధరించి, పడుకోవాల్సిన సమయంలో మంచం ఎక్కడానికి బదులుగా బాగా మేతమేసి బలిష్టంగా ఉన్న ముసలిగుర్రం ఎక్కి చర్చికి బయలుదేరాడు. చీకట్లో బురదతో, మంచుతో కప్పబడిన  దారిలో వెళ్తుంటే ఆ గుర్రం ఆపకుండా సకిలిస్తూనే ఉంది.

15వ అధ్యాయం

వేకువ ప్రార్థన

ఆ వేకువజాము ప్రార్థన నెఖ్లుడోవ్ జీవితంలో గొప్ప తేజోవంతమైన సజీవజ్ఞాపకాల్లో ఒకటిగా శాశ్వతంగా నిలిచిపోయింది.

అక్కడక్కడా తెల్లటి మంచుముక్కలు మాత్రమే కనిపిస్తున్న చిక్కటి చీకట్లోంచి, చుట్టూ దీపాల వెలుగులో మెరిసిపోతున్న ఆ చర్చి ఆవరణలోకి అతను గుర్రంపై వచ్చేసరికే లోపల ప్రార్థనాసేవ మొదలైపోయింది.

మేరీ ఇవనోవ్‍నా మేనల్లుడిని గుర్తుపట్టారు గ్రామరైతులు. లైట్లు చూడగానే చెవులు రిక్కించి నిలిచిపోయిన గుర్రాన్ని పట్టుకుని, అనువైన పొడి ప్రదేశానికి నడిపించి, అతను కిందికి దిగడానికి సహాయం చేసి, ఆ గుర్రాన్ని కట్టేసి, జనాలతో కిక్కిరిసిన చర్చిలోకి దారి చూపిస్తూ లోనికి తీసుకెళ్ళారు.

చర్చి లోపల రైతులు కుడి వైపున నిలబడున్నారు. ముసలివాళ్ళందరూ ఇంట్లోనే  కుట్టుకున్న ముతక నేతగుడ్డ కోట్లు ధరించారు. కాళ్ళకు సాక్సుల బదులుగా శుభ్రమైన తెల్లటి నారగుడ్డ చుట్టుకుని ఉన్నారు. యువకులు కొత్తగుడ్డలతో కుట్టిన కోట్లు వేసుకుని, నడుముకు రంగురంగుల బెల్టులు పెట్టుకుని, మోకాళ్ళ వరకూ ఉండే మెత్తటి బూట్లు తొడుక్కున్నారు.

స్త్రీలందరూ ఎడమవైపు నిలబడి ఉన్నారు. నెత్తి మీద ఎర్రటి పట్టురుమాల్లు, చేతుల్లేని నల్లటి వెల్వెట్ రవికలు, పొడవు చేతులన్న మెరిసే ఎర్రటి చొక్కాలు, ఆకుపచ్చ నీలం ఎరుపు రంగుల్లోని లంగాలు, మందపాటి తోలుబూట్లు ధరించారు. వాళ్ళ వెనుక నిలబడిన ముసలి స్త్రీలు నిరాడంబరమైన తెల్లటి రుమాల్లు, నేత కోట్లు, ముదురురంగు చేనేత గుడ్డలతో కుట్టిన పాతకాలపు లంగాలు ధరించి, కాళ్ళకు చెప్పులు వేసుకున్నారు. చక్కగా అలంకరించబడిన పిల్లలు బాగా నూనె పెట్టిన జుట్టుతో, రంగురంగుల బట్టలేసుకుని పెద్దవాళ్ళ మధ్యలో ఉల్లాసంగా అటూ ఇటూ తిరుగుతున్నారు.

మగవాళ్ళు చేతులతో సిలువ సంజ్ఞలు చేసుకుంటూ, శిరస్సులు వంచి మళ్ళీ పైకెత్తి జుట్టును వెనక్కి తోసుకుంటున్నారు. స్త్రీలు, ముఖ్యంగా ముసలివాళ్ళు, మిఠాయిలతో చుట్టబడిన ఒక దేవతాప్రతిమ మీద చూపు నిలిపి చేతులతో సిలువ గుర్తులు వేస్తున్నారు. చేతివేళ్ళను ముడుచుకుని వాటి మునుకులతో రుమాలున్న నుదుటిని, భుజాలని, పొట్టలని నొక్కుకుంటూ ఏదో మంత్రాలు గొణుగుతూ వొంగుతూ మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు. పెద్దవాళ్ళను అనుకరిస్తున్న పిల్లలు, తమని గమనించినపుడు మాత్రం శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నారు. విగ్రహం వున్న బంగారుపూత పూసిన పెట్టె, బంగారుతీగలతో చుట్టబడిన పొడవైన కొవ్వొత్తుల వెలుగుల్లో నలువైపులా ప్రకాశిస్తూ మెరిసిపోతోంది. కొవ్వొత్తుల స్టాండ్ మొత్తం చిన్నచిన్న కొవ్వొత్తులతో నిండిపోయి వుంది. యువగాయక బృందంలోంచి మంచి ఉల్లాసాన్నిచ్చే పాటలు వినిపిస్తున్నాయి. వాటిలో బొంగురు స్వరంతో పాడే మగగొంతుకలతో పాటు, పీలగా వినిపించే పిల్ల గొంతుకలు కూడా ఉన్నాయి.

నెఖ్లుడోవ్ ముందు వరుసలోకి వెళ్ళాడు. చర్చి మధ్యభాగంలో ఆ ఊరి ఉన్నతవర్గానికి చెందిన ఒక భూస్వామి, అతని భార్య, నావికుల సూట్‌ వేసుకున్న కొడుకుతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్, టెలిగ్రాఫ్ క్లర్క్, బూట్లు తొడుక్కున్న వ్యాపారి, ఛాతీ మీద పతకం పెట్టుకున్న గ్రామపెద్ద నిలబడి ఉన్నారు. భూస్వామి భార్య వెనకాల, వేదికకు కుడివైపున మట్రోనా పావ్లోవ్‍నా లేత ఊదారంగు దుస్తుల్లో, అంచులున్న షాల్ వేసుకుని నిలబడి వుంది. కటూషా కుచ్చులు పోసిన తెల్లటి లంగా మీద పొట్టి రవిక ధరించి, నీలం రంగు నడుంపట్టి కట్టుకుని, నల్లటి జుట్టుకి ఎర్రటి రిబ్బన్‌ పెట్టుకుని నిలబడుంది.

అక్కడ ప్రతిదీ పండుగలా ఉత్సాహంగా, ప్రకాశవంతంగా, అందంగా, ఘనంగా కనిపిస్తోంది. పూజారి బంగారుశిలువ గుర్తులున్న వెండివస్త్రాలు ధరించాడు. దైవసహాయకుడు, గుమస్తా, గాయకుడు (చాంటర్) వెండి లేదా బంగారు రంగుల మతవస్త్రాలు ధరించారు. ఔత్సాహిక గాయకులు చక్కగా జుట్టుకి నూనె రాసుకుని, ఉన్నంతలో మంచి బట్టలు వేసుకున్నారు. నృత్యసంగీతాన్ని తలపించే పండుగ కీర్తనల ఉల్లాస రాగాలు వినిపిస్తుండగా, పూలతో అలంకరించబడిన కొవ్వొత్తులు పట్టుకున్న పూజారులు, భక్తులను ఆశీర్వదిస్తూ ‘క్రీస్తు లేచాడు!’ ‘క్రీస్తు లేచాడు!’ అని పదేపదే నినదిస్తున్నారు.

అక్కడ అన్నీ అందంగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా- తెల్లటి బట్టల్లో, నీలం నడుం పట్టీతో, నల్లని కురుల మీద ఎర్రని రిబ్బన్‌తో, ఆనందంతో వెలిగిపోతున్న కళ్ళతో అందంగా కనిపిస్తోంది కటూషా.

ఆమె తనకేసి చూడకుండానే తన ఉనికిని గ్రహించిందని నెఖ్లుడోవ్‍కి ఖచ్చితంగా తెలుసు. తన పక్కనుంచి ఆమె బలిపీఠం (ఆల్టర్‌) వైపు వెళ్తున్నప్పుడు అది గమనించాడు. మాట్లాడాల్సిందేం లేకపోయినా ఏదోటి మాట్లాడాలన్న తపనతో అప్పటికప్పుడు ఒక సాకు దొరకబట్టుకుని ఆమె పక్కనుండి వెళ్తూ ‘ఆఖరి ప్రార్థన తర్వాత అత్తమ్మ ఉపవాసం విరమిస్తానని చెప్పింది’ అని గుసగుసలాడాడు. ఎప్పట్లానే అతన్ని చూడగానే కటూషా కమ్మని మోములో రక్తం ఉరుకులాడింది. ఆనందంతో నిండిన ఆ అమాయకమైన నల్లకళ్ళని పైకిత్తి నెఖ్లుడోవ్ మీద చూపు నిలిపి ‘నాకు తెలుసు’ అంది నవ్వుతూ.

ఈ సమయంలో గుమాస్తా తన చేతిలో పవిత్రజలం ఉన్న రాగి కాఫీపాట్‍తో (రష్యాలో పవిత్రజలం కోసం తరచుగా కాఫీపాట్‍లను ఉపయోగిస్తారు) బయటికి వెళ్తూ కటూషాని  గమనించకుండా తన పైవస్త్రంతో ఆమెను తాకాడు. నెఖ్లుడోవ్‍ని గౌరవపూర్వకంగా దూరం నుంచి దాటాలన్న ఉద్దేశ్యంతోనే గుమాస్తా కటూషాకి తగిలాడని స్పష్టంగా అర్థమైంది. అయినా నెఖ్లుడోవ్ ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ప్రతిదీ, అవును- ఈ ప్రపంచంలో ప్రతీదీ, కేవలం కటూషా కోసమే ఉన్నాయనీ, దేన్నైనా గమనించకపోవచ్చేమో గాని ఆమెని మాత్రం కాదని, ఎందుకంటే అక్కడ అన్నింటికీ కేంద్రబిందువు ఆమేనని ఈ గుమస్తా ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు అనుకున్నాడు. ఆమె కోసమే విగ్రహాల చుట్టూ ఆ బంగారం మెరిసేది. ఆమె కోసమే కదా క్యాండిల్ స్టాండుల్లో, క్యాండిల్‌ కర్రల్లో ఆ కొవ్వొత్తులన్నీ వెలిగేది. ఆమె కోసమే కదా ‘ప్రభువు పస్కా పండుగ చూడండి’, ‘ప్రజలారా సంతోషించండి!’ లాంటి ఆ ఆనందగీతాలు పాడేది. ప్రపంచంలోని మంచివన్నీ– మొత్తం ఆమె కోసమే ఉన్నాయి.  కుచ్చులు పోసిన ఆమె తెల్లని దుస్తులని, మనోహరమైన ఆమె ఆకృతిని, ఆనందం పొంగుతున్న ఆమె మొహాన్ని చూసినపుడు ఇదంతా ఆమెకోసమే ఉందన్న సంగతి ఆమెకు కూడా తెలుసేమో అనిపించింది నెఖ్లుడోవ్‍కి. ఆ చూపులో తన హృదయంలో గానం చేయబడుతున్న పాటేదో సరిగ్గా ఆమె హృదయంలో కూడా పాడబడుతోందని గ్రహించాడు.

మొదటి ప్రార్థనకి చివరి ప్రార్థనకి నడుమ విరామ సమయంలో నెఖ్లుడోవ్ చర్చిలోంచి బయటకొచ్చాడు. అతనికి దారి ఇవ్వడం కోసం ప్రజలు పక్కకు తప్పుకుని నమస్కరించి నిలబడ్డారు. కొందరు అతన్ని గుర్తుపట్టారు. ఇంకొందరు ఎవరతను అని అడిగారు. అతను మెట్లపైన ఆగాడు. అక్కడున్న బిచ్చగాళ్ళు అతని చుట్టూ మూగి కేకలేయడం మొదలెట్టారు.  తన పర్సులోని చిల్లర మొత్తం వాళ్ళకిచ్చేసి కిందికి దిగాడు. తెల్లారుతోంది కాని సూర్యుడింకా  ఉదయించలేదు. కొంతమంది చర్చి ఆవరణలోని సమాధుల చుట్టూ గుమిగూడారు. కటూషా లోపలే ఉండిపోయింది. నెఖ్లుడోవ్ ఆమె కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు.

ఇంతలో రాతి మెట్లమీద మేకులు కొడుతున్నట్టు బూట్లతో చప్పుడు చేసుకుంటూ జనం లోపల్నించి బయటికొస్తూ చర్చి ప్రాంగణంలో తలోదిక్కు పోతున్నారు. మేనత్తల ముసలి వంటవాడొకాడు వణుకుతున్న తలతో వచ్చి, ఈస్టర్ ముద్దు ఇవ్వడం కోసం నెఖ్లుడోవ్‍ని ఆపాడు. అతని ముసలిభార్య తన జేబురుమాల్లోంచి పసుపురంగు గుడ్డును బయటకి తీసి నెఖ్లుడోవ్‍కు ఇచ్చింది. కొత్తకోటు, ఆకుపచ్చ బెల్టు ధరించి చిరునవ్వు చిందిస్తున్న ఒక యువరైతు కూడా అతని దగ్గరికి వచ్చాడు.

‘క్రీస్తు మళ్ళీ లేచాడు’ అని నవ్వుతున్న కళ్ళతో అన్నాడా యువకుడు. తన ప్రత్యేకమైన –   కాని ఆహ్లాదకరమైన- ‘రైతు వాసన’తో నెఖ్లుడోవ్ దగ్గరికి వచ్చి అతన్ని చుట్టేసాడు. తన ఉంగరాల గడ్డంతో గిలిగింతలు పెడుతూ, దృఢమైన తాజా పెదవులతో నేరుగా నెఖ్లుడోవ్ నోటిపై మూడుసార్లు ముద్దుపెట్టుకున్నాడు.

ఆ యువరైతు నెఖ్లుడోవ్‍ని ముద్దుపెట్టుకుని ముదురు గోధుమరంగు గుడ్డును ఇస్తుండగా, మట్రోనా పావ్లోవ్‍నా ఊదారంగు దుస్తులతో పాటు, ఎర్రటి రిబ్బన్‌తో అలంకరించబడిన తన ప్రియమైన నల్లటి తల అతనికి కనిపించాయి.

తన ముందున్న తలలు మీదుగా కటూషా అతణ్ణి చూసింది. ఆమె మొహం ఎలా ప్రకాశవంతంగా మారిందో అతను గమనించాడు.  

మట్రోనా పావ్లోవ్‍నాతో కలిసి వచ్చిన కటూషా వసారాలో ఆగి, బిచ్చగాళ్ళకు దానధర్మాలు చేస్తోంది. ముక్కు ఉండాల్సిన చోట ఎర్రటి పుండు ఉన్న ఒక బిచ్చగాడు కటూషా దగ్గరికి వచ్చాడు. ఆమె అతనికేదో ఇచ్చి ఇంకా దగ్గరగా వెళ్ళి, ఆనందంతో మరింత మెరుస్తున్న కళ్ళతో అణుమాత్రం అసహ్యం ప్రదర్శించకుండా మూడుసార్లు అతన్ని ముద్దు పెట్టుకుంది. అలా చేస్తున్నప్పుడే ఆమె కళ్ళు నెఖ్లుడోవ్ కళ్ళతో కలిసాయి. ‘నేను చేస్తున్నది సరైనదేనా?’ అని అడుగుతున్నట్లుగా చూసాయి.

‘అవును ప్రియతమా, అవును! అది సరైందే. అంతా సరైందే. అంతా సౌందర్యమే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను!’

వరండా మెట్లు దిగి కిందికి వచ్చారు వాళ్ళిద్దరూ. నెఖ్లుడోవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి ఈస్టర్ ముద్దు ఇవ్వాలని అతను అనుకోలేదు. కేవలం ఆమెకు దగ్గరగా ఉండాలని మాత్రమే అనుకున్నాడు.

మట్రోనా పావ్లోవ్‍నా నవ్వుతూ తన తల వంచి, ‘క్రీస్తు మళ్ళీ లేచాడు!’ అంది. ఆమె స్వరం ‘ఈ రోజు మనమందరం సమానమే’ అన్నట్లుగా ఉంది. ఆమె తన రుమాలును ఉండగా చుట్టి, తన మూతి తుడుచుకుని, పెదాలు అతని వైపు చాచింది.

‘అవును, నిజంగానే లేచాడు!’ అంటూ నెఖ్లుడోవ్ మట్రోనా పావ్లోవ్‍నాని  ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత అతను కటూషా వైపు చూసాడు. సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. అతనికి మరింత దగ్గరగా వచ్చింది.

‘క్రీస్తు మళ్ళీ లేచాడు, దిమిత్రి ఇవానోవిచ్’ అందామె నిగూఢమైన స్వరంతో.


‘అవును, నిజంగానే లేచాడు.’ నెఖ్లుడోవ్ బదులిచ్చాడు.

ఇద్దరూ రెండుసార్లు ముద్దుపెట్టుకున్నారు. ఒక్కక్షణం ఆగి, మూడో ముద్దు అవసరమా అని ఆలోచిస్తున్నట్టుగా ఒకర్నొకరు చూసుకున్నారు. చివరికి అది అవసరమే అని నిర్ణయించుకుని, మూడోసారి ముద్దుపెట్టుకుని చిరునవ్వులు చిందించారు.

‘మీరు పూజారుల దగ్గరకు వెళ్తున్నారా?’

‘లేదు. ఇక్కడే కొద్దిసేపు కూర్చుంటాం, దిమిత్రి ఇవనోవిచ్’ అంది కటూషా కొంచం కష్టంగా.

ఒక సంతోషకరమైన పనేదో పూర్తి చేసినట్లు, గాఢనిట్టూర్పుతో ఆమె ఛాతీ మొత్తం ఉప్పొంగుతుండగా కన్యత్వపు స్వచ్ఛతతో, ప్రేమతో కూడిన చూపులతో, కొద్దిగా ‘మెల్ల’ ఉన్న కళ్ళతో నేరుగా అతని ముఖంలోకి చూసింది.

పురుషుడికి, స్త్రీకి మధ్య ఉండే ప్రేమలో, ఆ ప్రేమ పరాకాష్టకు చేరుకునే ఒకానొక క్షణం ఎప్పుడూ వస్తుంది. ఆక్షణంలో ఆ ప్రేమకు ఎలాంటి అవగాహన ఉండదు. కారణం ఉండదు.  శారీరక కామవాంఛ కూడా ఉండదు. అలాంటి ఒక అలౌకిక క్షణం ఆ ఈస్టర్ ముందురోజు రాత్రి నెఖ్లుడోవ్ జీవితంలో అనుభవంలోకి వచ్చింది.

ఇప్పుడు అతను కటూషాను మళ్ళీ గుర్తుచేసుకోగానే ఆ క్షణం సమస్తాన్ని కమ్మేసింది.

నిగనిగలాడే ఆమె నున్నటి నల్లటి తల, అతి సుందరమైన ఆమె కన్యత్వాకృతిని హత్తుకున్న తెల్లటి కుచ్చుల దుస్తులు, ఇంకా పూర్తిగా ఎదగని ఆమె వక్షోజాలు, సిగ్గుతో ఎర్రబడిన ఆమె బుగ్గలు, నిద్రలేని రాత్రివల్ల మరింత స్పష్టంగా మెరుస్తున్న స్వల్ప మెల్ల ఉన్న ఆమె నల్లని లేత కన్నులు- అన్నీ కలగలిసి ఆమె మధురమనోహర రూపాన్ని తలపించేవి.

ఆమె అస్తిత్వమంతా పవిత్రత, స్వచ్ఛమైన ప్రేమ అనే రెండు స్పష్టమైన లక్షణాలతో నిక్షిప్తమై ఉంది. ఆ ప్రేమ అతనొక్కని మీద మాత్రమే కాదు (అతనికి అది తెలుసు), ప్రతి ఒక్కరి మీద, ప్రతి వస్తువు మీద. కేవలం మంచివాటి మీద మాత్రమే కాదు. సమస్త ప్రపంచంలో ఉన్న ప్రతిదాని మీద. ఆమె ముద్దుపెట్టుకున్న ఆ బిచ్చగాడి మీద కూడా ఆమెకు ప్రేమ ఉంది.

అలాంటి గొప్ప ప్రేమ ఆమెలో ఉందని అతనికి తెలుసు. ఎందుకంటే ఆ రాత్రీ ఆ ఉదయం తనలోనూ అదే ప్రేమను అతను గాఢంగా అనుభవించాడు. ఆ ప్రేమలో ఆమెతో తాను ఏకమైపోయినట్టు గ్రహించాడు. ఆహా! అంతా అక్కడే ఆగిపోయుంటే ఎంత బాగుండేది. ఆ రాత్రి ఆ ప్రేమ చేరుకున్న ఆ శిఖర స్థాయిలోనే నిలిచిపోయుంటే ఎంత బాగుండేది!

‘అవును, ఆ భయానక ఘటన ఆ ఈస్టర్ పండుగ ముందురోజు రాత్రి ఇంకా జరగలేదు!’

జ్యూరీ సభ్యుల గదిలో కిటికీ పక్కన కూర్చొని ఆలోచిస్తూ అనుకున్నాడు నెఖ్లుడోవ్.

***

టాల్ స్టాయ్
రమేష్ సామల

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *