తీగ తెగి..

Spread the love

నేనిక్కడ చినుకులలో తడుస్తున్నాను.
నువ్వు తడుస్తున్నావా ?

నేనిక్కడ చందమామను చూస్తున్నాను.
నువ్వు చూస్తున్నావా?

నేనిక్కడ చిరుగాలిలో తేలుతున్నాను.
నువ్వు తేలుతున్నావా?

నేనిక్కడ కాలువలో
ఒక కాగితం పడవ పంపుతున్నాను.
నీ ఒడితీరానికి చేరిందా?

నేనిక్కడ నా గుండెలో
ఒక దీపం వెలిగించాను.
ఆ కాంతిఛాయ నిను సోకిందా ?

నేనిక్కడ ఒక పూవుకి పాదు చేసాను.
నువ్వు పరిమళాన్ని కోసుకున్నావా?

నేనిక్కడ ఒక ఊహకి జన్మనిచ్చాను.
నువ్వు పెంచి పెద్ద చేస్తావా?

నేనిక్కడ ఒక చెట్టునై ఎదురుచూస్తున్నాను.
నువ్వు వసంతమై విరబూస్తావా?

నేనిక్కడ హృదయం బద్దలై వున్నాను.
నువ్వు రక్తమోడుతున్నావా?

ఏ గుండెగానం నిను తాకకుండా తాళం వేసావు.
నేనిక్కడ తీగతెగిన శృతినై తిరుగుతున్నాను.
P. Srinivas Goud

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి. రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

సెల్ : 9949429449 మెయిల్ : srinivasgoudpoet@gmail.com


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *