రూపంతరం

Spread the love

శ్రీపాదం రఘురాం గది ఒక చిన్న గ్రంథాలయం. పాడుపడున్న పుస్తకాల వాసనలో ఏదో అమరత్వం నిండి ఉన్నట్లనిపిస్తుంది. వెనక మూలన ఉన్న బీరువా అరల్లో కవితలు రాశులుగా పడి ఉన్నాయి.

ఆ రోజు అతను తన బీరువా లోపల పాత పత్రికలు తిరగేస్తుండగా, ఒక కవిత చేతికి తగిలింది –

“ఇప్పటికీ విడివడని మౌనం / పద్యమౌతుందేమో నాకోసం!”

అది అతను ముప్పై ఏళ్ళ క్రితం ఒక వేదికపై చదివిన కవిత. వేదిక మెట్లు దిగే ప్రతి అడుగూ అరుపులతో, చప్పట్లతో మార్మ్రోగింది. ఇప్పుడు ఆ పద్యం ఎవరూ చదువుతున్న దాఖలా లేదు. దుఃఖం అతని చూపుల్లో నిలిచింది.

అలాగే తల వంచి కూర్చున్న రఘురాంకి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది.

అతని సాహిత్యాభిమాని, దగ్గరకు వచ్చి నీలిమ నవ్వుతూ నిలబడింది –

“రఘురాం గారు! ఓ యువ కవి వచ్చాడు. మీతో మాట్లాడాలంట!”

“ఇంకా ఉన్నారా వాళ్ళు? నా కవితలు చదవడానికి వచ్చాడా, లేక సెల్ఫీ తీసుకోడానికా?” గొంతులో వెటకారం ధ్వనిస్తుండగా అన్నాడు.

“మీ కవితలే వేరేగా చెప్తాడు. మ్యూజిక్ పెట్టి, వీడియో తీసి – ఒకలా చెబుతాడు. కానీ… సెల్ఫీ కూడా తీసుకుంటాడు.”

అంతలోనే లోపలికి దూసుకొచ్చాడు అర్జున్. చేతిలో ఫోన్, మెడలో హెడ్‌ఫోన్లు.

“సార్! మీ ‘మౌనం పద్యమౌతుందేమో’ అన్న లైన్ నాకెంతో నచ్చింది. దాన్ని ఓ వీడియోగా చెయ్యొచ్చా?”

రఘురాం అతన్ని పరిశీలించాడు. ఆ చూపులో ఆశ్చర్యం, అపనమ్మకం, ఆరాటం – అన్నీ కలగలిపిన వేదన.

“వీడియోలాగానా? కవిత అంటే చదవడమే కాదు… వినడమే కాదు… ఇప్పుడు చూసే వ్యవహారమా?”

అర్జున్ నవ్వాడు. “చూస్తారు సార్! వినడం కన్నా చూడడమే ఎక్కువ ఇప్పుడు!”

ఒక నిశ్శబ్దం గదిని కమ్మింది. పాత భావం – కొత్త రూపం – సాహిత్యపు ఊపిరితిత్తుల్లో ఒక కొత్త గాలి ప్రవేశిస్తున్నట్టు.

2

రఘురాం ఆ యువకుడినీ, అతని ఉత్సాహాన్నీ గమనిస్తున్నాడు. ఫోన్లో ఏదో యాప్ తెరిచి, తన కవితను వీడియో మాదిరిగా మిక్స్ చేయొచ్చన్న ఆలోచనే అతనికి కొత్త. కాని పాతయం దభిమానం తన్నుకొచ్చి అతని ఆలోచనల్లో ఒక ప్రశ్నై నిలిచింది– “ఇది సాహిత్యమేనా? లేక వినోదమా?”

“అర్జున్!” అని పిలిచాడు కొద్దిగా నర్మంగా, 

“నువ్వు చెప్పింది ఓ కొత్త ఆలోచన. కానీ సాహిత్యం అనేది నిశ్శబ్దంలో పుట్టేది. ఫోన్‌లో మ్యూజిక్, ఎఫెక్ట్స్… వాటితో ఆ మౌనం ఎలా దొరుకుతుంది బాబూ?”

అర్జున్ సమాధానంగా తలదించుకునే చెప్పాడు, 

“మీరు నిజమే అంటున్నారు సార్. కానీ… నేను మీ పద్యాన్ని ఇలా వింటే, ఇంకా ఎక్కువ మందికి చేరుతుందని చెప్పగలను. మ్యూజిక్ కారణంగా, హత్తుకునే ఆ భావం వల్ల”, వొత్తి పలుకుతూ అన్నాడు.

రఘురాం కళ్ళలో మెరుపు మెరిపింది. “ఆ భావం వల్ల” – ఈ మాట అతను ఎప్పుడు విన్నా ఆనందించే మాట.

“అలాగైతే…” అని చెప్పి, బీరువా నుంచి ఒక పాత చిత్తరువు తీసి అర్జున్ చేతిలో పెట్టాడు.

“ఇదో అప్రచురిత పద్యం. నాలో మిగిలిన నిశ్శబ్దం ఇది. దీన్ని నువ్వు నీ మాదిరిగా… ఆ వీడియో మాదిరిగా మార్చి… నువ్వంటున్న ప్రాణం పోయగలవా?”

అర్జున్ చేతిలోకి దానిని తీసుకున్నాడు. అక్షరాలు కొద్దిగా వాడిపోయినట్టున్నా, అర్థం మాత్రం హత్తుకునేలా ఉంది:

“ఒకటి కాదు రెండు కాదు

కాగితాలు మారి పోతున్నాయి;

చివరికి మౌనం గుట్టు విప్పింది;

దానిని విని కళ్ళు తెరిచినవాడు 

అది నేనే!”

అది చదివాక అర్జున్ ఒక్కసారిగా మౌనం వహించాడు. తర్వాత ఫోను తీసి రికార్డింగ్ మొదలుపెట్టాడు – పచ్చటి మౌనం మధ్య రాలి పడే వానచినుకుల్లా వినిపించేలా పద్యాన్ని మృదువైన సంగీతంతో…పక్కనే రఘురాం కూర్చున్నట్టు కనిపించేలా ఆ కవిత్వం వీడియో- రఘురాం చూస్తూ విన్నాడు … వింటూ చూశాడు.

నీలిమ తలుపు వెనక నిలబడి చూస్తోంది. ఆమె చూపుల్లో తృప్తి – “ఇదే సాహిత్యపు మార్పు!

ఏ రూపంలో వచ్చినా – అది మన హృదయాన్ని తాకితే చాలు” అనుకొంది.

3

అర్జున్ చేసిన వీడియో అదే రోజున రాత్రికి రాత్రే పందొమ్మిది వేల వ్యూస్‌కి చేరింది.

వింటున్నవారికి కొత్త అనుభూతి. రఘురాం శబ్దాల మౌనానికి అర్జున్ కలిపిన గానగాంధర్వం. స్వరప్రపంచంలో విన్నప్పుడు, అది కవితగా కాక, అనుభవంగా మారిపోతోంది.

“ఇది పద్యం కాదు సుమీ! ఇదొక అంతరంగం!”

“ఒక వృద్ధ కవి, ఒక యువ కళాకారుడు కలిసి మేధస్సుని దాటి హృదయాల్ని తాకారు!”

“ఇంకా ఇలాంటి పద్యాలు కావాలి… Plz share more!”

అంటూ కామెంట్లు కురవసాగాయి.

ఒక జాతీయ స్థాయి డిజిటల్ సాహిత్య మాసపత్రిక ఈ వీడియోపై ప్రత్యేకంగా ఓ వ్యాసం రాయించింది– “పద్యానికి ప్రాణం – పిక్సెల్ పుణ్యం” అన్న శీర్షికతో.

ఆ వార్తలన్నీ నీలిమ ఉదయం కాఫీతో రఘురాం చేతిలో పెట్టింది.

“ఇప్పుడైనా అంగీకరించండి, ఇది మార్పే … సాహిత్యపు రూపాంతరం!”

రఘురాం పేపర్లో ఉన్న తన ఫొటో చూసి చమత్కారంగా నవ్వాడు.

“ఈ బొమ్మలో ఉన్నది నేనేనా?!”

తర్వాత, కాఫీ తాగుతూ కాస్త మౌనంగా నీలిమ వైపు చూశాడు.

“అవును, మార్పు … అదే జీవం.

నిన్నటి మాటలు నేటి మాధ్యమాల్లోకి వెళ్తున్నాయంటే, నిన్నటి మౌనం కూడా మారిపోవాలి కదా!”

అంతలో ఊహించని తలుపు మోత.

తలుపు దగ్గర నిలబడి ఉన్న యువతి, తన వెంట కెమెరామన్‌తో – “సర్, మేము, ‘కలమా? టచ్ స్క్రీనా?’ అనే డాక్యుమెంటరీ తీస్తున్నాం. మీరు మాతో మాట్లాడగలరా? మీ పద్యం వైరల్ అయింది. ఈ మార్పు గురించిన మీ దృష్టికోణం తెలుసుకోవాలనుంది”, ఆమె పేరు నమ్రత అయ్యుంటుంది.

రఘురాం అర్జున్ వైపు చూసాడు. అర్జున్ కన్నుల్లో తడిగా ఏదో వెలుగు.

“ఇది మా ఇద్దరిదీ కదా?”, రఘురాం అతనిని చూస్తూ నవ్వుతూ అన్నాడు.

“అవును… సాహిత్యం ఎవరిదీ కాదు. అది కాలానిది.”

కథ ముగుస్తుందా? మొదలవుతుందా?

ఒక పద్యం మౌనం దాటి, సంగీతమై, చిత్రమై ప్రపంచాన్ని తాకింది. ఇప్పుడది మళ్లీ శబ్దంలా మారిపోతోంది –

అంతే కాదు, కథలా కొనసాగుతోంది!

4

“సాహిత్యం -భవిష్య దశ దిశ”

రఘురాం, నీలిమ, అర్జున్ ముగ్గురూ ఒక చిన్న చర్చలో పాల్గొన్నారు.

విషయం: “సాహిత్యం: గతం నుండి భవిష్యత్తుకు”

రఘురాం మైక్రోఫోన్ తీసుకుని మాట్లాడాడు:

“సాహిత్యం అనేది ఒక జీవం. అది కాలం, సాంకేతికత, మానవ భావోద్వేగాల ఆధారంగా మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మౌఖికంగా చెప్పబడిన కథలు, తరువాత లిఖిత రూపంలో వచ్చాయి. ఇప్పుడు, డిజిటల్ ప్రపంచంలో, అవి వీడియోలుగా, ఆడియోలుగా, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌గా, ఫేస్ బుక్ కథనాలుగా మారుతున్నాయి.”

అర్జున్ జోరుగా జత పలికాడు:

“సార్ చెప్పినట్లే, ఇప్పుడు సాహిత్యం వినడమే కాదు, చూడడమూ, అనుభవించడమూ అవుతుంది. ఒక కవితను మ్యూజిక్‌తో కలిపి, విజువల్స్‌తో ప్రదర్శించగలిగితే, అది మరింత మంది హృదయాలను తాకుతుంది.”

నీలిమ నవ్వుతూ తన గొంతు కలిపింది –

“ఇది సాహిత్యపు రూపాంతరం. మౌనమొక కొత్త శబ్దంగా పలుకు మారిన పద్యం. పాత భావాలను కొత్త రూపాల్లో వ్యక్తీకరించడం. ఇది సాహిత్యాన్ని మరింత సమకాలీనంగా, అందరికీ చేరువ చేస్తుంది.”

చర్చ ముగుస్తుండగా, రఘురాం తన పాత కవితల పుస్తకాన్ని అర్జున్‌కు ఇచ్చాడు:

“ఇవి నా మౌనం. నువ్వు వీటికి స్వరం ఇవ్వగలవా?”

అర్జున్ ఆనందంతో: “సార్, మీ మౌనాన్ని మేము చూపించగలుగుతాం. అది కొత్త తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.” అన్నాడు.

ముగిస్తూ యాంకరమ్మ అందుకొంది, “చర్చ ముగిసింది. కానీ సాహిత్యపు ప్రయాణం కొనసాగుతుంది….ప్రతి కాలంలో, ప్రతి రూపంలో, సాహిత్యం మన హృదయాలను తాకుతూనే ఉంటుంది.

“సాహిత్యం ఎక్కడికీ పోదు. కవిత, కథ, నాటకమో, సినిమాయో… రానున్న డెకానానో కాలంలో అనుకున్నదే తడవు కనులముందు లేని “గాలితెర” మీద దర్శనమవ్వొచ్చు సాహిత్యం. కానైతే, ఎవరి భావాలు వారికే ప్రత్యేకమూ కావొచ్చు!

“ఆ ప్రత్యేకత మనిషి వ్యక్తిత్వాన్ని, ఆలోచనల తీరును, పెంపకాన్ని, చదువును, వృత్తి ప్రవృత్తులను ఆశ్రయించి మారుతూ ఉండొచ్చు. అందువల్ల ఒకే భావం, భావన ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ‘గాలితెర’ మీద దర్శనమవ్వొచ్చు. 

“ఎవడి కథవాడిదే! ఎవడి తెర వాడిదే! కాదని ఎవరు చెప్పగలరు?”

టీవీ స్క్రీనంత ప్రశ్నతో చర్చ ముగిసింది.

మాకినీడి సూర్యభాస్కర్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *