నేను అక్కడకి చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. అలాంటి ప్రదేశం ఒకటి వున్నది అని ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ నాకా ప్రదేశం మాత్రం తొలి చూపులోనే చాలా పరిచితంగా అనిపించింది. ఎంత పరిచితంగా అంటే గత కాలపు అనుభవాన్ని దేన్నో మళ్ళీ తాజాగా అనుభవిస్తున్నంత పరిచితంగా అనిపించింది.
కానీ కాస్త, కాస్త తరచి చూసినకొద్దీ ప్రదేశం చాలా అసాధారణంగా వుంది అనిపించింది. ఎంతసేపు ఆలోచించినా అదేమిటో అర్ధం కాలేదు. నేను కనిపెట్టలేకపోయిన ఆ అసాధారణం ఏమై ఉంటుంది? పైకి చూస్తే అంతా చాలా మామూలుగా వుంది. కానీ నడుస్తున్న కొద్దీ ఒక నిర్జన భావన నన్ను చుట్టుముట్టింది. అక్కడున్న వాళ్లంతా తమ తమ పనిలో మునిగిపోయారు. ఎంతలా మునిగిపోయారు అంటే ఈ క్షణం లో, ఈ సమయం లో ఈ పని పూర్తి చేయకపోతే, మరెప్పటికీ ఈ పనిని పూర్తిచేయలేము కనుక ఇప్పుడే సమస్త శక్తులు ఉపయోగించి, చివరకు ప్రాణాలు పణంగా పెట్టి అయినా సరే, పని పూర్తిచేయాలన్నంత దీక్షగా పనిలో మునిగిపోయారు. అయితే అలా పనిలో మునిగిపోవడం లో ఎలాంటి ఉద్వేగ మైత్రీ (Emotional bond or involvement) నాకు కనిపించలేదు. ఏదో లోపించిన భావన.
ఆ లోపించిన భావనను మాటలలో చెప్పడం అంత తేలిక కాదు. పసిపాప కి స్తన్యం ఇస్తున్న మాతృమూర్తి ఆ పసిపాపను గుండెకు హత్తుకోకుండా యథాలాపముగా పాలిస్తున్నట్టు, సందేశం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సహం, జిజ్ఞ్ఞాస లేకుండానే విద్యార్థి పుస్తకాన్ని చదువుతున్నట్టు, వంట చేస్తున్న సహచరి చేస్తున్న కూరలో అన్నీ సమపాళ్ల లో పడినాయో లేదో తెలుసుకోవడానికి కూరను రవ్వంత రసనాగ్రాన నిలుపుకొని రుచి చూడకుండా ఎలా ఉంటే ఏమిలే అని వండుతున్నట్టు, తోటలో పువ్వులు పూచాయో లేదో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేకుండా తోటమాలి తోటకు నీళ్లు పెడుతున్నట్టు, నిర్వికారంగా, నిస్తేజంగా, నిర్మోహంగా
ఆ వాతావరణం నన్ను నిరాశ పరచింది. ఆ ప్రదేశం నివాసానికి అనువైనది కాదని నా కనిపించి వెళ్లిపోవడానికి వెను తిరిగాను.
“ఎందుకలా వెళ్ళిపోతున్నావు?” ఏదో ఒక స్వరం నన్ను ప్రశ్నించింది. ఈ ప్రదేశానికి నేను పూర్తిగా కొత్త. ఇక్కడ నన్ను పలకరించేది ఎవరు? తల తిప్పి చూశాను.
“బహుశా! నీకీ ప్రదేశం నచ్చినట్టు లేదు. మొదటి సారి రావడం కదా! ముందు,ముందు అలవాటు అవుతుందిలే!” నాతో మాట్లాడిన వ్యక్తి వృద్ధుడు.ఒక సాధువు లాగా వున్నాడు. తెల్లటి దుస్తులు ధరించి, ఒక నీటి కుండను చేతితో పట్టుకుని వున్నాడు.
“ఇక్కడ అందరూ ఇలా వున్నారు ఎందుకు?” ఆ వృద్ధుడిని ప్రశ్నిస్తున్నప్పుడు నా గొంతు ఉద్వేగం తో వొణికింది.
“వాళ్లందరిలో ఏదో ఒక అసాధారణత్వం నీకు కనిపించింది కదూ!”
యోగిబాబా లా కనిపిస్తున్న ఆ వృద్ధుడు అలా అడిగేసరికి నాకు ఉత్సహం వచ్చి “సరిగ్గా అదే లోపల అనుకుంటున్నాను” అన్నాను
“వాళ్లలో ఎవరికీ హృదయం లేదు” యోగిబాబా చాలా స్పష్టంగా, బరువుగా చెప్పాడు.
“హృదయం లేదా? కానీ వాళ్ళందరూ మనుషులు కదా ! యంత్రాలు కాదు కదా ! హృదయం లేకుండా మనుషులు ఎలా వుంటారు?”
“నిజమే! శాస్త్రీయంగా చూస్తే వాళ్లకు హృదయం వుంది. కానీ ఆ హృదయం లో ఎలాంటి అనుభూతులూ లేవు.”
యోగిబాబా చెప్పింది నాకు హాస్యాస్పదంగా అనిపించింది. తన్నుకొచ్చే నవ్వును అతి కష్టం మీద ఆపుకుని “అంటే ఏమిటర్ధం?” అన్నాను
“చూడు తల్లీ!” యోగి బాబా సహనం ఉట్టిపడే స్వరంతో ” దేవుడు మన హృదయంలోకి జీవాన్ని నింపేటప్పుడు దాని చుట్టూ మిల మిలా మెరిసే బంగారు రంగు పూత పూస్తాడు.మనం యవ్వనం లో వున్నప్పుడు ఆ పూత ద్రవస్థితిలో ఉంటుంది. వారు పెరిగే కొద్దీ అది గడ్డకడుతూ చాలా కఠినంగా తయారవుతుంది. కానీ కొన్ని మినహాయింపులు వున్నాయి. కొంతమంది హృదయం ఎప్పటికీ సున్నితంగా, మృదువుగా ఉంటుంది. అంత మృదువైన హృదయం వున్న వాళ్ళ జీవితం , చాలా కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. నిరంతర వత్తిడి తో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది.ఈ కష్టాన్ని తప్పించుకోవడం కోసం కొంతమంది హృదయం చుట్టూ వున్న ఆ బంగారు పూతను
తీసి భూ గర్భంలోనో, చెట్ల తొర్రలలోనో, దాచిపెడతారు. కొంతమంది దాన్ని గోనె సంచులలో చుట్టి దుర్గమారణ్యాలలో పడవేస్తారు. కొంతమంది మూటకట్టి నదులలోనో, సముద్రాలలోనో విసిరివేస్తారు, లేకపోతే అగ్నిలో దహించి వేస్తారు. కానీ ఇలా చేస్తున్నట్టు వాళ్లకు అస్సలు తెలియదు. వాళ్లలో ఎవరినైనా అడిగి చూడు తమకేమీ తెలియదని నటిస్తారు. ఆ ప్రకాశవంతమైన, బంగారు రంగు పూతను దూరం పెట్టడానికి వాళ్ళు వాళ్లకు తెలిసిన ఏ దారినీ, ఏ అవకాశాన్నీ వదులుకోరు. అలాంటి వాళ్లలో కొంత మంది ఈ ప్రదేశం లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అందుకే వాళ్లంతా నీకు అలా అసాధారణంగా, ప్రత్యేకంగా కనిపించారు”
“ఎంత దురదృష్టవంతులు” మనసులోపల అనుకున్నాను. వాళ్ళను చూడగానే నాకు కలిగిన మొదటి అభిప్రాయాన్ని నేనే నిందించుకున్నాను.
“చివరి వరకు వాళ్ళు అలా ఉండవలసిందేనా?” కొంచెం కుతూహలంగా అడిగాను.
“అలా ఉండవలసిందే. వాళ్ళే కాదు వాళ్ళ సంతానం కూడా ఆ ఉదాసీన వారసత్వాన్ని కొనసాగించాల్సిందే! క్షణం లో ఏ వెయ్యో వంతులోనో అదృష్టం కలిసి వచ్చి ఎవరైనా హృదయం చుట్టూ ఉన్న ఆ బంగారు పూతతో పుడితే, మిగతా వాళ్ళు వాడిని అలా బతకనివ్వరు. ఆ పూత ను చించేయడానికి ప్రయత్నం చేస్తారు”
“ఇందులోనుండి బయట పడటానికి వేరే మార్గం ఏమీ లేదా?” “వాళ్లకు మనం ఏమీ సహాయం చేయలేమా?”
“నేనేమీ చేయలేను కానీ, ఒక దారి వుంది ” అని అర్ధోక్తి లో ఆగిపోయాడు యోగిబాబా
“ఏమిటో చెప్పండి ఆ మార్గం ?” అసహనం గొంతులో ధ్వనిస్తుండగా అడిగాను
” ఎవరైనా ఒక దయార్ద్ర హృదయం గల ఒక స్త్రీ, ప్రేమామృతం నిండిన కుండను తీసుకుని వచ్చి కొన్ని అమృత బిందువులు వాళ్ల మీద చిలకరిస్తే, మీరు చూడాలి అనుకుంటున్న మామూలు మనుషులుగా మారిపోతారు.” మెల్లగా చెప్పాడు యోగిబాబా
“నేను చేస్తాను ఆ పని” వెంటనే అన్నాను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా. అకస్మాతుగా నా హృదయం తో దాక్షిణ్యం తో నిండిపోయింది. ఆ ప్రేమామృతం తెచ్చి వీళ్ళ మీద చిలకరించి మానవత్వం నశించిపోకుండా కాపాడతాను అనుకున్నాను లోపల
“మీరు నిజంగానే అంటున్నారా? అదంత సులువు అయినదేమీ కాదు.” హెచ్చరిస్తున్నటుగా చెప్పాడు యోగి బాబా
“ఎంత కష్టం అయినా ఫరవాలేదు. నేను చేస్తానా పని. నాకో అవకాశం ఇవ్వండి. ఏం చేయాలో చెప్పండి ఆ అమృత కలశం తీసుకునిరావడానికి నేను అభ్యర్ధించాను
యోగి బాబా నావంక ఒక్క క్షణం పాటు తీక్షణంగా చూసాడు. క్రమేపీ ఆయన పెదవుల మీద ఒక చల్లటి చిరునవ్వు విరిసింది.
“మంచిది తల్లీ ! నువ్వు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడకు వెళ్ళాక ఆ పరిసరాలను చూశాక అదే నువ్వు చేరవలసిన ప్రదేశం అని నీకు అర్ధం అవుతుంది. ఒక్కసారి అక్కడకు వెళ్ళాక కొంత అమృతాన్ని తీసుకుని రా! ఇక్కడ నేను ఈ మనుషుల మీద అమృతం చిలకరించే ఏర్పాట్లు చేస్తాను.” మాట్లాడుతూనే యోగిబాబా పక్కకు తిరిగి నావ ఆకారం లో వున్న పెద్ద కట్టలోనుండి ఏదో బయటకు తీశాడు.
“ఇవి కొన్ని ఔషధ మూలికలు. వీటిని నీ దగ్గర ఉంచుకో. ఎవరికీ తెలుసు? నువ్వు ఎలాంటి కష్టాలు పడాల్సి వస్తుందో! గాయాలు తగలవచ్చు. ముళ్ళు చీరుకుని పోవచ్చు, ఏదైనా గోతిలో పడి దెబ్బలు తగిలించుకోవచ్చు, నీ శక్తి అంతా హరించుకుపోవచ్చు, ఏది జరిగినా దేవుడి దయ వల్ల నువ్వు వాటిని అన్నింటినీ అధిగమిస్తావు. అగ్నిపరీక్షలు నిన్ను కచ్చితంగా అలసటకు గురి చేస్తాయి. అసలే సున్నితమైన స్త్రీ శరీరం కదా ! కానీ ఎప్పుడూ నువ్వు భయ పడవద్దు. ఈ ఔషధ మూలికను ఇలా నీ శరీరం మీద రాసుకో! క్షణం లో నువ్వు కోల్పోయిన శక్తి అంతా తిరిగి వస్తుంది. ఎప్పటి లాగే నువ్వు బలంగా, దృఢంగా తయారవుతావు.”
“మరి నా హృదయం మాటేమిటి? యోగి బాబా! శరీరానికి మందు ఇచ్చావు సరే! నా హృదయానికి కూడా ఏదయినా ఔషధం ఇవ్వవా?” వెంటనే అడిగాను. యోగిబాబా మాట్లాడకుండా మీటను జరిపినపుడు దానంతట అదే కరుచుకునే ఒక సాధనముతో(జిప్) మూసి ఉన్న నీలం రంగు జోలె ను తీసుకుని దానిలో కొన్ని ఔషధ మూలికలు ,మాత్రలు వేసి జోలె మూసివేసి నా భుజానికి తగిలించాడు. జోలె రంగు నా చీర రంగు సరి సమానంగా వున్నాయి.
అగమ్య గమ్యంలోకి నా ప్రయాణం మొదలు అయింది.
చాలా దూరం ప్రయాణించాక నేనొక మార్మికమైన, అతీంద్రియ ప్రదేశానికి చేరుకున్నాను. ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా ఉన్నదా ప్రదేశం. ప్రపంచం లో ఉన్న విలాసాలు అన్నీ అక్కడే ఉన్నట్టుంది. జనమంతా ధగ ధగ మెరిసే బంగారు నగలు ధరించి, విందులు ఆరగిస్తున్నారు. యువతీ యువకుల అత్యుల్లాస జీవితం గురించి చెప్పే పనే లేదు. వాళ్ళు ఆనందంగా ఎదురువచ్చి నన్ను తీసుకుని వాళ్ళ సమూహం లో కలిపేసుకున్నారు. వాళ్ళు నాకు ఎంతగానో నచ్చారు. జీవితాన్ని చివరి అంచు వరకు ఎలా అనుభవించాలో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. యోగి బాబా కి చేసిన ప్రమాణం గుర్తుకువచ్చేవరకు నేను అంతా మరచిపోయాను. అసలా ప్రదేశాన్ని వదిలి వెళ్లాలన్న ఆలోచన లేశ మాత్రమైనా కలగలేదు నాకు. యోగిబాబా అభావమైన మొహం, నాలో పెట్టుకున్న నమ్మకం నన్ను వెంటాడం మొదలు పెట్టాక నా యువ మిత్రులను అక్కడే వదిలివేసి ఆ అద్భుతమైన ప్రదేశానికి వీడ్కోలు చెప్పాను
ఆ తరువాత నా కోసం ఎదురు చూస్తున్న దుస్థితి ని వివరించడానికి నేను నేర్చుకున్న భాష చాలదు. వెళుతున్న దారి దుర్గమమైనది. నడవడానికి ఏమాత్రం వీలుగా లేదు. ఆ దారిపొడవునా గుంతలు, ముళ్ల తీగలు ఒకదానిని మరొకటి పెనవేసుకుని దారంతా పరచుకుని వున్నాయి. ప్రతి అడుగూ అత్యంత జాగరూకత తో వేయాల్సి వస్తోంది. రాళ్లు గుట్టలు కప్పేసిన అగాథాలు చాలా వున్నాయి. ఒక్క తప్పటడుగు పడినా తెలియని లోతులలోకి జారిపడటం ఖాయం. పర్వతాల మీద నుండి కిందకు దూకే నీటి ప్రవాహాలు, ఆ ప్రవాహాలను దాటేందుకు రెండు ఒడ్డులను కలుపుతూ వేసిన తాటి బొత్తల వంతెనలు. ఒక్కోసారి రెండు పర్వత శిఖరాలను కలుపుతూ వేసిన తీగలను పట్టుకుని ప్రయాణించాల్సి వచ్చేది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా బతుకు మీద ఆశ వదులుకోకడమే. అలా ప్రయాణిస్తున్నప్పుడు అనిపించింది “మనుషులు ఎందుకు ఇంత ప్రమాద భరితమైన ప్రయాణాలు చేస్తూ వుంటారు?” అని. మళ్ళీ నాలోకి నేను చూసుకుంటే నేనెందుకు ఇలా స్వచ్ఛందంగా ఈ ప్రయాణం పెట్టుకోవాలి అనిపించింది.
ఏదో ఒక అతీంద్రియశక్తి నన్ను నడిపించడం చేత మాత్రమే, నేనా కష్ట సాధ్యమైన దారిని దాటుకుని, ఒక నదీ తీరం చేరాను. ఆ నది చాలా విశాలంగా వుంది. అవతలి ఒడ్డు ఎక్కడో కనపడటం లేదు. ఎలా ఈ నదిని దాటడం? ఎలాగైనా నదిని దాటి తీరాలి. వేరే మార్గం ఏదీ లేదు. పడవ కానీ పడవలు నడిపే మనుషులు కానీ ఎవరైనా కనిపిస్తారేమోనని తేరిపారా చూశాను. సుదూరంలో మనిషి అన్న జాడే లేదు. అలా నదీ తీరం వెంట నడుచుకుంటూ వెళ్ళాను.ఎంత దూరం వెళ్లానో తెలియదు . అలా నడుస్తూ ఉండగా కొంచెం దూరం లో ఒక చెట్టుకు కట్టేసిన తెప్ప ఒకటి కనిపించింది. దగ్గరకు వెళ్లి చూసాను. అది బాగా పాడైపోయివున్న తెప్ప. ఈ తెప్ప పట్టుకుని ఈ నదిని దాటడమా? తెలివైన పనేనా? అనిపించింది. వేరే ప్రత్యామ్నాయం లేదు. నెమ్మదిగా తెప్పలోకి ఎక్కి చెట్టుకు కట్టిన తాడుముడి విప్పాను. నెమ్మదిగా,నిశ్శబ్దంగా ప్రార్ధన చేస్తూ తెప్పతో నదిలోకి దిగాను. ఈ తెప్ప నన్ను సరిగ్గా అవతలి ఒడ్డు కి చేరుస్తుందా? లేకపోతే మధ్యలోనే తిరగబడి నన్ను నదిలో ముంచేస్తుందా? అదే జరిగితే “భగవంతుడా ఏది దారి?” ఇలా రకరకాల ఆలోచనలతో నా మెదడు వేడెక్కుతున్నది. కానీ నా ఆలోచనలతో సంబంధం లేనట్టు తెప్ప మెల్లగా నదిలో కదులుతూ వుంది. అలా కదిలీ, కదిలీ నన్ను చాలా సేపటికి అవతలి ఒడ్డుకు చేర్చింది.
అవతలి ఒడ్డు కి చేరేసరికి నేనెంత మాత్రమూ ఊహించని సన్నివేశం ఒకటి ఎదురువచ్చింది. అవతల వొడ్డున ఒక మంచు మైదానం. దాని విస్తృతి ఎంతో అర్ధం కాలేదు. అదొక అపారమైన విస్తృతి కలిగిన మంచు మైదానం. కనుచూపు సోకినంత మేరా గడ్డకట్టిన వట్టి మంచు తప్ప మరేమీ లేదు. ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ కంటికి ఆనడం లేదు. అప్పటికి సూర్యుడు అస్తమించడానికి సిద్ధం అవుతున్నాడు. మంచు మైదానం నారింజ కాంతిలో స్నానం చేస్తోంది. భయం నన్ను గట్టిగా పట్టుకుని కుదిపేస్తున్నా ఆ అద్భుతమైన సౌందర్యాన్ని ఆస్వాదించడం లో నా కళ్ళు వెనుకడుగు వేయడం లేదు. కానీ ఈ విశాలమైన మంచు మైదానం లో ఎక్కడని నేనా అమృత కలశాన్ని వెతకను? యోగిబాబా చెప్పిందే నిజం అయితే ఆ అమృతకలశం తనను తానే వెల్లడి చేసుకుంటుంది. ఆ క్షణం వచ్చినప్పుడు నేనా అమృత కలశాన్ని గుర్తుపడితే చాలు కదా! కానీ నా అన్వేషణ అంతా వ్యర్థం అనిపిస్తోంది
నిజానికి యోగిబాబా కి తెలుసా? నా జీవితం మొత్తం ప్రేమామృతం కోసం చేసిన తీరని అన్వేషణే అని? ఈ అన్వేషణ అక్కడి హృదయం లేని మనుషుల కోసం కాక కేవలం నాకోసం నేను చేస్తున్న అన్వేషణ అని అతడికి తెలుసా? ఆలోచనలతో తల పగిలిపోతుండగానే నాకో సందేహం కలిగింది. నిజంగా అలాంటి అద్భుతమైన, అనుపమానమైన , మార్మికమైన ప్రేమామృతం ఉన్నదా? లేక నేను మాయలో పడి పరుగెత్తుతున్నానా? నేనా చాలా దూరం ప్రయాణించి వచ్చాను. దగ్గర దగ్గర ఆ అమృతకలశం దగ్గరకు వచ్చాను, కానీ దాన్ని గుర్తుపట్టలేకపోతున్నాను. ఆ అమృతకలశాన్ని గుర్తుపట్టకపోతే ఏమి జరుగుతుంది? యోగిబాబా చెప్పిన అన్ని ప్రమాదాలు దాటుకుని వచ్చాను. నా శరీరం చిట్లి,చిట్లి గాయపడింది. కానీ నేనేమీ భయపడలేదు. గాయం తగిలిన ప్రతిసారీ, అలసట వేధించిన ప్రతిసారీ యోగిబాబా ఇచ్చిన ఆ మూలికలతో శరీరం మీద అలా రాసుకునేదానిని. నా గాయాలు అన్నీ మానిపోయి కొత్త శక్తి తిరిగి వచ్చేది. నెమ్మదిగా చీకటి దట్టం గా పరచుకుంటున్నది ఆ ఆ మంచు మైదానం మీద. నిద్ర మెల్లగా నన్ను తనలోకి లాగేసుకుంది.
పొద్దున్నే పక్షుల కిలకిలారవాలతో మెలకువ వచ్చింది. లేచి కూచుని కళ్ళునులుముకుంటూ చుట్టూ చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఆ విశాలమైన మంచుమైదానం అదృశ్యం అయిపొయింది. ఆ స్థానం లో ఒక పెద్ద ఉద్యానవనం. పూచిన పూలు, పండిన ఫలాల తో కనువిందు చేస్తున్న ఆకుపచ్చని చెట్లు. నేను మెల్లగా లేచి ముందుకు నడిచి కొన్ని పూలు, కొన్ని పళ్ళు కోసుకున్నాను. ఎంతో ప్రశాంతంగా వుంది. ఈ అనుభవం అద్వితీయంగా, అలౌకికంగా వుంది. “స్వర్గం లో ఉన్నానా?” అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. దట్టమైన చెట్ల ఆకుల సందులలోనుండి సన్నటి సూర్య కిరణాలు జాలువారి భూమి మీద రంగవల్లికలు వేసినాయి. నా ఎదురుగా ఒక పెద్ద గుహ. గుహ అంచులను చుట్టుకునిఆకుపచ్చని తీగలు వాటికి పూచి ఘుమ ఘుమ ల పరిమళాలు వెదజల్లుతున్న ఊదా రంగు పూలు. ఆ దృశ్యం ఎవరో దివ్యమైన చిత్రకారుడు తన నైపుణ్యం అంతా వుపయోగించి గీసిన అద్భుత చిత్రం లాగా వుంది. జాగ్రత్తగా నేను లోపలకు అడుగుపెట్టాను. లోపల అంతా ఒక పెద్ద రాజప్రాసాదం లాగా వుంది. మరో రెండడుగులు ముందుకు వేసాను. నా కళ్ళను పలకరించిన ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఒక్క క్షణం పాటు శ్వాస తీసుకోవడం మరచి పోయాను.
పోలిష్ చేసిన నేల మీద శంఖం ఆకారం లో ఉన్న ఒక పాత్ర నిలిచి ఉంది. దానిలోపల ద్రవ రూప బంగారం లాంటిది ఏదో మిలమిలా మెరుస్తూ కనిపిస్తోంది. ఆ ద్రవం లో తామర రేకులు తేలియాడుతున్నాయి. రెండో ఆలోచన లేకుండా నేను కనిపెట్టగలిగాను, అది నేను వెతుకుతున్న ప్రేమామృతం.
ఆ పాత్ర వంక విప్పారిన నేత్రాలతో, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. నా భుజానికి వేలాడుతున్న బ్యాగ్ లోని ప్లాస్టిక్ నీళ్ళ సీసాను ను అప్రయత్నంగా తడిమాను. ఆ సేస్సాలోనే నేనా ప్రేమామృతాన్ని తీసుకుని వెళ్ళాలి. నేను సాధించిన విజయానికి నన్ను నేనే గర్వంగా అభినందించుకున్నాను.నేను మెల్లగా ఆ పాత్ర వంక కదిలాను.
అకస్మాత్తుగా పరిచితమైన పరిమళం గుహ అంతా నిండిపోయింది. ఆ పరిమళం నా తొలి యవ్వన రోజుల లో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన పరిమళం, నా జీవితం మొత్తాన్ని తన అధీనం లోకి తీసుకున్న ప్రేమపూరిత పరిమళం, ఎలాంటి జ్ఞాపకాలను నాకోసం మోసుకుని వస్తున్నదా పరిమళం? హఠాత్తుగా వినపడిన అడుగుల చప్పుడు విని ఆశర్యపోయి వెను తిరిగాను
ఓహ్! ఆదిత్య !అతడు ఆదిత్య
నా ఎదురుగా నిలచిన ఆ ఆకృతి వంక కళ్ళు విచ్చుకుని చూసాను. మంచు తెరలచాటు నుండి సగమే రూపు కట్టింది ఆ ఆకృతి. నెమ్మదిగా మంచు తొలగి ఆకృతి స్పష్ష్టంగా కనిపించింది. చివరిసారి అతడు నన్ను ఎలా చూశాడో ఇప్పుడు కూడా అతడు అలాగే, సరిగ్గా అలాగే చూశాడు. అతడి మొహం పాలిపోయి, పెదవులు ముడుచుకుని వున్నాయి. గాలికి ఎగిరిన కొన్ని ముంగురులు కళ్ళ మీద వేలాడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా నేను వినకుండా తప్పించుకుంటున్న కొన్ని అర్ధం లేని మాటలు అతడి పేలవమైన పెదవుల మధ్య ఘనీభవించాయి. ఆ అర్ధం లేని మాటలను పట్టుకుని గుదిగుచ్చి ఒక అర్ధవంతమైన వాక్యం లా చేయాలని ప్రయత్నం చేసాను కానీ అది కూడా అర్ధం లేకుండానే మిగిలిపోయింది. అతడి కళ్ళలోకి చూడకుండా నేను నిగ్రహించుకున్నాను కానీ అతడి చూపులు నామీదే వున్నాయి అని అర్ధం అవుతున్నది.
నేను కచ్చితంగా ఆ అమృత కలశాన్ని చేరుకోవాలి. నా దృష్టిని ఆ అమృత కలశం మీద నుండి ఎవరూ తప్పించలేరు. ఆదిత్య కూడా ! ఆ అమృత కలశం దగ్గరకు వెళ్లి అందులోని అమృతాన్ని నా ప్లాస్టిక్ నీళ్ల సీసాలో ఒంపుకుని యోగిబాబా కి ఇవ్వాలి, వెంటనే చూపులు తిప్పుకుని కలశం లోని బంగారు రంగు ద్రవం వంక చూసాను.
హఠాత్తుగా నా వెనుక నేల మీద ఏదో పడిన శబ్దం వినిపించింది. ఏమైందా అని నేను వెనక్కుతిరిగాను.వెనుక ఆదిత్య లేదు. ఒక నీడ మెల్లగా అదృశ్యం అవుతూ కనిపించింది. కింద పడింది ఏమిటి? నేల మీద కొన్ని ముక్కలు అటూ ఇటూ వెదజల్లబడి వున్నాయి. నా శరీరానికి తడిగా ఏదో తగిలినట్టు అనిపించింది. కొంత తడిగా, కొంత జిగటగా వున్నది అది. చేతివేళ్ళతో ఆ ద్రవాన్ని తుడిచాను
రక్తం
నా చేతి వేళ్ళవంక భయంతో ఆశ్చర్యంగా చూసాను. కింద పడి పగిలిపోయింది ఏమిటీ? ఆదిత్య తనతో ఏమైనా తీసుకుని వచ్చాడా?
ఆలోచనలతో నేను చూస్తూ ఉండగానే, శంఖాకారపు పాత్రలోని బంగారు రంగు ద్రవం రంగు మారసాగింది. మొదట అది ఆకుపచ్చగా మారి ఆ తరువాత కోపోద్రిక్తమైన నారింజ రంగులోకి మారింది. నెమ్మదిగా అది రక్తం రంగులోకి మారిపోయింది. తేలియాడుతున్న తామర రేకులు అసహ్యమైన పురుగులు గా మారి ఆ రక్తం లో పిచ్చిగా ఈదటం మొదలుపెట్టాయి.
నా వెన్నులోంచి వణుకు జరాజరా పాకింది. నేను గట్టిగా అరిచాను. కానీ ఆ అరుపు గొంతు దాటి బయటకు రాలేదు.
ఆదిత్య ఎక్కడ?
“ఆదిత్యా! వెనక్కి వచ్చేయ్. దయచేసి వెనక్కు వచ్చేయి. నువ్వు నాకు కావాలి” గొంతు చించుకుని అరిచాను. కానీ ఏ సమాధానమూ వినిపించలేదు. నా అరుపులు గుహ అంతా ప్రతిధ్వనించాయి. నేను ముందుకు పరుగెత్తాను ఆదిత్య కోసం చూస్తూ. కానీ అక్కడ ఎవరూ లేరు నేనూ, గుహ తప్ప. గుహను ముంచెత్తిన పరిమళం కూడా వెళ్ళిపోయింది. అంతటా ఒక స్మశాన నిశబ్దం ఆవరించుకుంది. నీలి సిరా తో ఏవో కొన్ని అక్షరాలు రాసిన కాయితం ముక్కలు కొన్ని గాలిలో ఎగురుతూ కనిపించి నెమ్మదిగా పైకి, పైకి , పైపైకి వెళ్లి నల్లటి శూన్యం లో కలసిపోయాయి.
మోకాళ్ళ మీద నిలబడి “యోగిబాబా ! నన్ను క్షమించు. నేను అనుకున్న పని చేయలేకపోయాను. నేను అపజయం పాలయ్యాను. నేను అమృతాన్ని తీసుకుని రాలేకపోయాను.” నా కళ్ళనుండి కన్నీళ్లు ఎడతెగకుండా కారుతున్నాయి
“నన్ను క్షమించు ఆదిత్యా!” అవే మాటలు పదే పదే చెపుతూ ఉండిపోయాను.
నా కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. కిటికీ సందులలోనుండి పడుతున్న ప్రకాశవంతమైన సూర్యకిరణాలు, నేను ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్ లో నేను మంచం మీద పడుకుని వున్నాను అని చెపుతున్నాయి. నా కనుకొలకుల చివరల నుండి జారిన కన్నీటి తడి నాకు తెలుస్తున్నది. వాటిని తుడుచుకునే ప్రయత్నం ఏదీ నేను చేయలేదు. గోడమీది గడియారం లోని ముళ్ళు ఎనిమిది దాటింది అని చెపుతున్నాయి. నేను హడావిడిగా లేవబోయాను. హఠాతుగా గుర్తుకొచ్చింది. ఇవాళ ఆదివారం.

మార్మికమైన చాలా మంచి కథ