పేల్చేశారట
కూల్చేశారట
శత్రుదేశపు కుతంత్రాలను ఆకాశంనుంచి
రాల్చేశారట
చిమ్మచీకట్ల రాత్రివేళలో
నిరపరాధులు, నిస్సహాయులు
ఆశల దుప్పటి కింద పడుకొని
చిక్కటి భయాలు పేరిన కళ్ళూ, బెదరు చూపులూ అదిరే గుండెలు
చిమ్మిన కాంతులు, పేలిన ధ్వనులూ
చెదిరిన ప్రాణాల్, చినిగిన ఆశలు
ధరిత్రి అంతా
మనసులనిండా పేరుకుపోయిన
సంకుచితత్వం, సమ్మోహత్వం
నేనూ, నువ్వూ, నాదీ, నీదీ, నాకూ, నీకూ,
భావోద్వేగాల్, భాషాద్వేషాల్, మతోన్మాదాల్, మదోన్మాదాల్
కాల్చే గుళ్లకు కాలే గుండెల
కారు చిచ్చుకు, కారు మబ్బులకు
అంతం ఎప్పుడు?
ఆగేదెవరు? ఆపేదెవరు?
అంతంలేని ఆవేశాలూ ఆక్రందనలూ ఆగేదెప్పుడు?
మనిషి మనిషిగా బతికేదెప్పుడు?