డాన్ విప్లవ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించబోతున్న ఇంకొక కొసాక్కును కలిసే అవకాశం గ్రెగరికి నవంబరులో వచ్చింది. అతను కలిసిన ఆ వ్యక్తి పేరు ఫ్యోదోర్ పోడ్తియోల్కొవ్. కొంత ఊగిసలాట తర్వాత మరలా పూర్వపు సత్యాలు గ్రెగరి మనసును వెంటాడాయి.
ఆ రోజు మధ్యాహ్నం నుండి మంచు వర్షం కురుస్తూ ఉంది. సాయంత్రానికి ఆకాశం కాస్త తెరిపినపడింది. గ్రెగరి తన స్టానిట్సాకి చెందిన 28 వ రెజిమెంటు వాడైన జూనియర్ కార్నెట్ ద్రోజ్దొవ్ ను కలవాలని నిర్ణయించుకున్నాడు.ఒక పావుగంట తర్వాత తన బూట్లని కింద ఉన్న పట్టాతో తుడుచుకుంటూ,ద్రోజ్దొవ్ ఇంటి తలుపు తట్టాడు. ఆ గదిలో సామాగ్రి అస్తవ్యస్తంగా ఉంది,రబ్బరు మొక్కలు ఓ పక్క వరుసగా పెట్టి ఉన్నాయి.ఆ గదిలో ద్రోజ్దొవ్ పక్కన ఇంకో మనిషి ఉన్నాడు. సార్జంట్ మేజర్ దుస్తులను ధరించిన అతను తన వీపును కిటికీ వైపు పెట్టి కూర్చుని ఉన్నాడు. నల్లటి ఊలు ప్యాంటు ధరించిన అతను తన కాళ్ళను వెడల్పుగా చేసి, ముందుకు వంగి, తన చేతులను మోకాళ్ళ మీద ఉంచాడు. అతని కోటు పొట్ట దగ్గర బిగుతుగా ఉంది,చేతుల దగ్గర ముడతలు పడి ఉంది. తలుపు తీస్తున్న శబ్దం వినబడగానే,అతను తన పొట్టి మెడను వెనక్కి తిప్పి ,గ్రెగరి వైపు తీక్షణంగా చూసాడు.
‘గ్రీషా,రా. ఈయన పోడ్తియోల్కొవ్,ఉస్త్ ఖోప్యోర్స్కాయా కి చెందినవాడు,మా పొరుగువాడే.’
గ్రెగరి, పోడ్తియోల్కొవ్ నిస్సబ్దంగా కరచాలనం చేసుకున్నారు. గ్రెగరి చిరునవ్వుతో ద్రోజ్దొవ్ కి సమీపంలో కింద కూర్చున్నాడు.
‘మీ నేలను పాడు చేసాను,నన్ను క్షమించండి!’
‘అదేం పట్టించుకోవాల్సిన విషయం కాదు. పనమ్మాయి అంతా శుభ్రం చేస్తుంది.టీ తాగుతావా?’
పొట్టిగా ఉన్న ద్రోజ్దొవ్ కోతిలా వేగంగా,పొగాకు అంటుకున్న తన చేతి వేళ్ళతో సమోవర్ ను గట్టిగా పట్టుకుని, ‘టి చల్లారిపోయింది’,అన్నాడు.
‘నాకు టీ వద్దు.’
గ్రెగరి పోడ్తియోల్కొవ్ ముందు తన సిగరెట్టు పెట్టె అందించాడు. ఆ పెట్టెలో ఎక్కువ సిగరెట్లు ఉండటం వల్ల లావుగా ఉన్న పోడ్తియోల్కొవ్ చేతి వేళ్ళు అందులో సరిగ్గా సిగరెట్టు తీసుకోవడానికి ఇమడలేదు. ఆ ఇబ్బందికర వాతావరణంలో పోడ్తియోల్కొవ్ ముఖం కందిపోయినట్టు గులాబీ రంగులోకి మారిపోయింది. ‘బయటకు రా, నిన్ను …’అని తనలో తానే సిగరెట్టును తిట్టాడు పోడ్తియోల్కొవ్.
చివరకు ఎలాగో ఆ సిగరెట్టూ పెట్టెలో నుండి ఒక సిగరెట్టూ తీసుకున్న అతను తల పైకెత్తి సగం మూసిన కళ్ళతో ఒక చిరునవ్వు నవ్వుతూ గ్రెగరి వైపు చూసాడు. గ్రెగరికి అతని మనస్తత్వం నచ్చింది. ‘ఏ గ్రామం మీది?’అని అడిగాడు.
‘నేను క్రుతోవ్స్కి గ్రామంలో పుట్టాను. అక్కడే నేను పుట్టి పెరిగినా,తర్వాత నేను ఉస్త్ కాలినోవ్స్కాయా లో నివసించాను. నీకు క్రుతోవ్స్కి తెలిసే ఉండాలి. తప్పక ఆ పేరు వినే ఉంటావని అనుకుంటున్నాను.ఎలన్ స్కాయా కి కుడి వైపున ఉంటుంది. నీకు ప్లెషాకోవిస్కి గ్రామం తెలుసా? దాని వెనుకే మాత్యేవేస్కి ఉంది,దానికి కొంచెం దూరంలో త్యుకోనోవిస్కి గ్రామం ఉంది.అక్కడికి వస్తే నేను పుట్టిన ప్రాంతమైన దిగువ,ఎగువ ప్రాంతాలున్న క్రుతోవ్స్కి వస్తుంది.’
ఎటువంటి భేషజాలు లేకుండా అతను ఎంతో కలుపుగోలుగా మాట్లాడాడు. ఆ మాటల మధ్యలో స్నేహితుల భుజం మీద చేయి వేసినట్టు గ్రెగరి భుజం మీద ఓసారి చేయి కూడా వేసాడు. అతని పెద్ద ముఖం,చక్కగా కత్తిరించి ఉన్న మీసం; తడిగా ఉన్న అతని తల ఒక వైపుకి దువ్వి ఉంది. ఎత్తుగా ఉన్న ముక్కు,కళ్ళు తప్పిస్తే అతను చూడటానికి బావున్నాడు. మొదటిసారి చూసినప్పుడు గ్రెగరికి ఆ కళ్ళల్లో ఏ ప్రత్యకత కనబడలేదు, కానీ ఎప్పుడైతే సమీపం నుండి చూసాడో అప్పుడు ఆ కళ్ళల్లో గాంభీర్యం కనిపించింది. చిన్నగా ఉన్న ఆ కళ్ళు తన వైపు దృష్టి మరల్చిన వారిని తీక్షణంగా గమనిస్తున్నట్టు ఉన్నాయి.
గ్రెగరి కుతూహలంతో అతన్నే చూస్తూ ఒక విషయం కనిపెట్టాడు.అదేమిటంటే,ఎంతో అరుదుగా తప్ప పోడ్తియోల్కొవ్ కనురెప్ప వేయలేదు. మాట్లాడుతున్నప్పుడు,తన దృష్టిని మాట్లాడే వ్యక్తీ వైపే కేంద్రీకరిస్తూ ,మధ్య మధ్యలో అక్కడ ఉన్న వస్తువులవైపు ,తర్వాత ఆ వ్యక్తి వైపుకి మరలా తిరుగుతున్నాయి ఆ కళ్ళు. కేవలం ఒకటి రెండుసార్లు మాత్రమే ఆ కనుబొమ్మలు పైకి లేచాయి.
‘చాలా హాస్యాస్పదంగా ఆ విషయం జరిగింది!’,అంటూ గ్రెగరి ద్రోజ్దొవ్ ని ,పోడ్తియోల్కొవ్ ఉద్దేశించి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ‘యుద్ధం ముగిసిపోయాక,మేము ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాము. ఉక్రెయిన్ ను రాడా పాలిస్తే, మమ్మల్ని ఆర్మీ కౌన్సిల్ పాలిస్తుంది.’
‘అంటే అటామన్ కాలేదిన్ పాలిస్తాడని నీ అభిప్రాయం,అంతేగా ?’ పోడ్తియోల్కొవ్ గ్రెగరి మాటల్ని సరిచేస్తూ అన్నాడు.
‘రెండిటికి తేడా ఏముంది ?’
‘నిజానికి ఏ తేడా లేదు’, పోడ్తియోల్కొవ్ గ్రెగరి మాటలతో ఏకిభవించాడు.
‘అవును,మేము ఇప్పుడు మా మాతృభూమి రష్యాకి వీడ్కోలు పలికాము’, ఇజ్వారిన్ ప్రసంగాన్ని అనుసరిస్తూ గ్రెగరి చెప్తూ, ద్రోజ్దొవ్,అలాగే ఆ కొత్తగా పరిచయం అయిన వ్యక్తి నుండి ఎటువంటి స్పందన ఉంటుందో అని కుతూహలంగా కొనసాగించాడు. ‘మనకు మన సొంత ప్రభుత్వం ఉంటుంది, వ్యవహారాలు మన పద్ధతిలో జరుగుతాయి. మన నేలలో ఉన్న ఉక్రేనియన్లను తరిమి కొట్టి వాళ్ళు మరలా మన ప్రాంతంలో అడుగు పెట్టకుండా సరిహద్దులు గట్టిగా ఏర్పాటు చేస్తాము. మన పూర్వికులు గతంలో గొప్పగా బతికినట్టే మనం కూడా జీవిస్తాము. నిజానికి ఈ విప్లవం ఒకందుకు మంచిదే జరిగిందని అనిపిస్తుంది. నువ్వు ఏమనుకుంటున్నావు ,ద్రోజ్దొవ్?’
ద్రోజ్దొవ్ చిరునవ్వు నవ్వాడు.
‘అవును, గతం కన్నా మెరుగ్గానే ఉంటుంది. ఆ శ్రామికులు మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. అయినా మనకు ఈ వైస్ అటామన్లు ఎందుకు ? వాళ్ళందరూ జర్మన్లే,వాళ్ళు మెల్లగా ఈ భూమిని తమ వారికి దక్కేలా చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా మనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలము.’
‘కానీ రష్యా ఇదంతా చూస్తూ ఊరుకుంటుందా?’పోడ్తియోల్కొవ్ ఎవరిని ఉద్దేశించి కాకుండా నెమ్మదిగా అడిగాడు.
‘ఊరుకోక తప్పదు’, గ్రెగరి ధీమాగా బదులిచ్చాడు.
‘ఇక ఎప్పుడూ జరిగేదే ఇప్పుడు జరుగుతుంది……ఒకటే మందు సీసానే వేరు.’
‘అంటే ఏమంటున్నారు మీరు?’
‘అటామన్లు సామాన్య జనాలని ,శ్రామికులను ఇదివరకటి లాగే దోచుకుంటారు. మీరు ఆ అటామన్ల దగ్గర వంగి వంగి సలాములు చేస్తారు. అయినా ఆ జీవితం బాగానే ఉంటుందిలే …. దీని కన్నా మీ మెడలకి రాళ్ళు కట్టుకుని నదిలో దూకడం మేలు.’
గ్రెగరి లేచి నిలబడ్డాడు. ఇరుగ్గా ఉన్న ఆ గదిలో పచార్లు చేస్తూ,పోడ్తియోల్కొవ్ ముందు ఆగి,అడిగాడు.
‘అయితే ఇది ఎలా ఉండాలంటారు?’
‘ఇప్పుడు ప్రారంభించిన దానికి మంచి ముగింపు ఇవ్వండి.’
‘ఏ ముగింపు?’
‘ఒకసారి మొదలుపెట్టాక, చెదలు మొత్తాన్ని ఏరిపారెయ్యాలి. ఈ జారును,విప్లవ వ్యతిరేకులను నిర్ములించాక,అధికారం ప్రజలకు దక్కేలా చూడాలి. ఇది కాకుండా మిగిలిన విషయాలు అన్ని కూడా పిల్లలకు చెప్పే కల్పిత కథలు మాత్రమే.పూర్వం జార్లు మాత్రమే అధికారం చెలాయించేవారు కానీ ఇప్పుడు అలాంటివారు ఎందరో ఉన్నారు.’
‘అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు,పోడ్తియోల్కొవ్ ?’
ఆ ఇరుకు గదిలో ఆ కళ్ళు చుట్టూ చూసి,తర్వాత గ్రెగరి ముఖం దగ్గర ఆగాయి.
‘ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వమే ఏర్పాటు కావాలి. ఒక్కసారి మళ్ళి ఇదే రకమైన దౌర్జన్యమైన వ్యవస్థ కొనసాగితే,మళ్ళి యుద్ధం రాక మానదు. అది కాదు మనకు కావాల్సింది. ఎక్కడా ప్రజలు అణచివేతకు గురి కాకుండా,ప్రజలను పొట్టన బెట్టుకునే యుద్ధాలే అవసరం లేనిసమాజాన్ని సృష్టించే ప్రభుత్వం ప్రతి చోటా రావాలి. లేకపోతే ఏమవుతుంది? నీ చిరిగిపోయిన ప్యాంటును తిప్పి తొడుక్కున్నా అవే బొక్కలు మరలా ప్రత్యక్షమవుతాయి.మన పాత పద్ధతులని సమూలంగా నాశనం చేసి సక్రమమైన దారిలో నడవకపోతే జార్లను మించిన ప్రమాదం ఎదురవుతుంది ’, నవ్వుతూ అన్నాడు పోడ్తియోల్కొవ్.
గాలిలో ఏదో పట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాడిలా గ్రెగరి ఒక ప్రశ్నను చివరికి అడగగలిగాడు.
‘అంటే మనం మన భూమిని వదులుకోవాలా? వాటిని భాగాలుగా చేసి అందరికీ పంచిపెట్టాలా?’
‘లేదు …ఎందుకు వదులుకోవాలి? ‘, కొంత ఇబ్బంది పడుతూ ,గందరగోళంలో పడుతూనే పోడ్తియోల్కొవ్ కొనసాగించాడు. ‘మనం మన భూమిని వదులుకోము. మనలో మనమే అంటే కొసాక్కుల మధ్యే పంచుకుంటాము.భూస్వాముల నుండి భూమిని తీసుకుంటాము. కానీ వాటిని పేదలకు పంచిపెట్టము.ఎందుకంటే మన పరిస్థితి కూడా పెద్ద మెరుగ్గా లేదు. వాళ్ళకి ఇవ్వడం మొదలుపెడితే మనం బికారులుగా మిగిలిపోతాము.’
‘అయితే మనల్ని ఎవరు పాలిస్తారు?’
‘మనల్ని మనమే పాలించుకుంటాము’, పోడ్తియోల్కొవ్ ఉత్సాహంగా అందుకున్నాడు. ‘మనమే అధికారం లోకి వస్తాము,ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. ఏమైనా ఎదురు తిరిగితే అటామన్ల తోకలు కత్తిరిస్తాము!’
గ్రెగరి కిటికీ దగ్గర నిలబడి దానిలో నుండి పక్క వీధిలో ఉన్న ఒక ఇంటి దగ్గరి తోటలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ;అక్కడ ద్రోజ్దేవ్ ,పోడ్తియోల్కొవ్ లు వాదించుకుంటున్న విషయం మీద ధ్యాస లేకుండా,తన మనసులో ఏర్పడిన గందరగోళం నుండి స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
ఒక పది నిమిషాలు అలాగే నిలబడి, కిటికీ ఊచలవైపే చూస్తూ ఉండిపోయాడు. బయట ఒక ఇంటి కప్పు పైన సూర్యుడు సాయంత్రం అయినా తన విశ్వ రూపం చూపిస్తూనే ఉన్నాడు,ఆ సూర్యబింబం కాషాయ వర్ణంలో ఆ పైకప్పుకి ఒక మూల నీడలా పడుతూ ఉంది. అంతకుముందు కురిసిన వాన వల్ల రాలిపోయిన ఆకులు నేల పైన మనుషులు కదిలినప్పుడల్లా చప్పుడు చేస్తూ ఉన్నాయి పక్కన ఉన్న పార్కులో.
* * *
అధ్యాయం-3
బోల్షివిక్ విప్లవానికి వెన్ను చూపిన వారందరికీ కూడా నోవోచేర్కాస్క్ ఒక స్థావరంగా మారింది. ఒకప్పుడు రష్యాలో సైనిక అధికారులుగా ఒక వెలుగు వెలిగిన వారంతా కూడా ఇప్పుడు డాన్ ప్రాంతంలో ఉంటూ,అక్కడి మద్దతు కోసం ఎదురు చూస్తూ,ఆ ప్రోత్సాహంతో రష్యాలోని సోవియట్ లను ఎదుర్కోవాలన్న ఆలోచనలో ఉన్నారు.
మెజార్ షార్పోన్ తో కలిసి మేజర్ అలేక్సేవ్ నవంబరు 2 న నోవోచేర్కాస్క్ కి వచ్చాడు. కాలేదిన్ తో మాట్లాడిన తర్వాత, స్వచ్చంద బృందాలను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించుకున్నాడు అలేక్సేవ్. భవిష్యత్తులో ఆ స్వచ్చంద బృందాలనే గొప్ప సైన్యంగా తీర్చిదిద్దాలని,దాని కోసం ఫిబ్రవరి విప్లవానికి వ్యతిరేకంగా పోరాడిన అధికారులను, సైనికులను ; అలాగే విద్యార్ధులను ,కోసాక్కుల్లో విప్లవాన్ని వ్యతిరేకించే వారిని,అలాగే డబ్బు కోసం సాహసానికి సిద్ధంగా ఉండే వారిని అందులో భాగం చేయాలని అనుకున్నాడు.
నవంబరు ఆఖరి రోజుల్లో జనరల్ డెనికిన్ , లుకోంస్కి, మార్కొవ్ ,ఎర్దేలి వచ్చారు. ఆ సమయానికి అలేక్సేవ్ బృందాలు వెయ్యికి పైగా ఆయుధాలను సిద్ధం చేసుకోగలిగాయి.
తన అంగరక్షకులు దారిలో దూరం కాగా, ఎలాగో డాన్ సరిహద్దులకు మారువేషంలో చేరుకున్నాడు కోర్నిలోవ్. డిసెంబర్ 6 కి కోర్నిలోవ్ నోవోచేర్కాస్క్ చేరుకున్నాడు.
ఆస్ట్రేలియా,రోమానియా,జర్మనీ సరిహద్దుల్లో పని చేసిన కొసాక్కు రెజిమెంట్లను పిలిపించి, వారిని నోవోచేర్కాస్క్ ,చేర్త్కోవో ,రోస్తోవ్ రైలు మార్గం దగ్గర ఉంచాడు. కానీ అప్పటికే మూడేళ్ళు యుద్ధం చేసి అలసిపోయి ఉన్న కొసాక్కులు బోల్షివిక్కుల మీద యుద్ధానికి ఏ మాత్రం ఉత్సాహం చూపించలేదు. ఎక్కువ శాతం రెజిమెంట్లలో కేవలం మాడవ వంతు సైనికులు మాత్రమే చురుగ్గా ఉన్నారు. ఎక్కువ మంది సైనికులు ఉన్న 27 వ ,44 వ మరియు రెండవ రిజర్వులను కామెన్ స్కాయాలో ఉంచారు. అటామన్ లైఫ్ గార్డ్స్ ను ,కొసాక్కు లైఫ్ గార్డ్స్ ను కూడా పెట్రోగ్రాడ్ నుండి అక్కడికే పంపించారు. 58,52,43,28,12,29,35,10 ,39,23,8 మరియు 14 రెజిమెంట్లను , వాటితో పాటు 6,32 ,28 ,8,14 బాటరీ (రెజిమెంట్లతో పోలిస్తే చిన్న సైనిక బృందాలు )లను చేర్త్కోవో ,మిల్లెరోవో ,లిఖాయా,గ్లుబోకాయా ,వేరేవో వంటి చోట్ల ఉంచడం జరిగింది. ఖోప్యోర్ ,ఉస్త్ -మెడ్ వేదిత్స జిల్లాలకు చెందిన రెజిమెంట్లు ఫిలోనోవో,ఉర్యుపిన్స్కాయ ,సేబ్రయకోవో వంటి చోట్ల కొన్నాళ్ళు ఉండి తర్వాత అక్కడి నుండి తమ చోటుకు వెళ్ళిపోయారు.
ఇంటికి వెళ్ళాలన్న కోరిక కొసాక్కుల్లో బలపడిపోయింది, దాన్ని అడ్డుకునే శక్తి దేనికి లేకుండా పోయింది.డాన్ ప్రాంతానికి చెందిన రెజిమెంట్లలో కేవలం ఒకటి,నాలుగు ,పద్నాలుగు రెజిమెంట్లు మాత్రమే పెట్రోగ్రాడ్ లో ఉన్నాయి, వారి కూడా ఎక్కువ కాలం అక్కడ లేదు.
కాలేదిన్ సైనికుల్లో తనకు నమ్మకస్తులుగా అనిపించిన వారిని తప్పించాలని,లేకపోతే వారిని తనకు నమ్మకస్తులైన వారితో కలిపి ఉంచాలని అనుకున్నాడు.
నవంబరు ఆఖరికి,రోస్తోవ్ కి వ్యతిరేకంగా ఉన్న సరిహద్దు సైన్యాలను మట్టి కరిపించాలని అతను చేసిన మొదటి ప్రయత్నంలో భాగంగా కొసాక్కులు అక్సాయిక్ వరకూ వెళ్ళినా, అక్కడ యుద్ధం చేయాలన్న కోరిక లేకపోవడం వల్ల వెనక్కి తిరిగారు.
అప్పటికే బలహీనపడుతున్న సైనికులలో కొందరిని మరలా చురుగ్గా చేయడంలో కొంతవరకూ విజయం సాధించాడు. నవంబరు 27 కల్లా కాలేదిన్ స్వతంత్రంగా తన సైనిక బృందాలను బలపరుస్తునే ,అప్పటికే ఎన్నో బెటాలియన్లను తయారు చేసిన అలేక్సేవ్ నుండి కొంత సైన్యాన్ని అడిగే స్థాయికి వచ్చాడు.
డిసెంబర్ రెండు కల్లా రోస్తోవ్ ను స్వచ్చంద దళాలు ఆక్రమించుకోవడం,తర్వాత కోర్నిలోవ్ అక్కడికి వచ్చేసరికి ,స్వచ్చంద సైన్య కార్యకలాపాల కేంద్రంగా అది మారింది. ఇక కాలేదిన్ తన సొంత పద్ధతులు అనుసరించాల్సి వచ్చింది. తన కొసాక్కు బృందాలను ఆ ప్రాంతపు సరిహద్దుల్లోనూ, జారిసన్ ప్రాంత సమీపంలో ,సారటోవ్ ప్రావిన్సు సరిహద్దు దగ్గర ఉంచి; ముఖ్యమైన పనులకు మాత్రం అధికారులతో కూడిన సైన్య దళాలను ఉంచాడు.
కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక బృందాలను డొనేట్ మైనర్స్ దగ్గరకు పంపించడం జరిగింది. 58 వ కొసాక్కు రెజిమెంటు ఉన్న మేకేవ్కా జిల్లాకు మేజర్ చేర్నేత్సోవ్ వెళ్ళాడు. ఇక నోవోచేర్కాస్క్ లో సేమిల్తోవ్ ,గ్రేకోవ్ లు హడావుడిగా సైనిక బృందాలను సిద్ధం చేసుకున్నారు;వారితో పాటు ఇంకెన్నో స్వచ్చంద సైనిక దళాలు కూడా ఏర్పడ్డాయి. ఉత్తరాన ఖోప్యోర్ జిల్లాలో అధికారులు ,వారికి మద్దతుదారులు కలిసి స్టెంకా రాజిన్ పేరుతో ఒక ప్రత్యేక సైనిక సమూహంగా ఏర్పడ్డారు. కానీ అప్పటికే రెడ్ గార్డ్ లు మూడు దిక్కుల నుండి మోహరించే ప్రయత్నంలో ఉన్నారు. పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి ఖార్కొవ్ ,వోరోనేజ్ ప్రాంతాలలో అప్పటికే ఏకం అవుతూ ఉన్నారు. తుఫాను సృష్టించడానికి సిద్ధం అన్నట్టు మేఘాలు డాన్ దిగువ ప్రాంతంలో ఆకాశంలో దట్టంగా పట్టి ఉన్నాయి. అప్పటికే ఉక్రెయిన్ గాలులు తుపాకి పేలుళ్ళ ధ్వనిని మోసుకొస్తూ ఉంది. ఆ ప్రాంతానికి కఠినమైన రోజులను కాలం తనలో దాచుకుంది. వాతావరణం లానే ఆ ప్రాంతపు భవిష్యత్తు కూడా మబ్బు పట్టబోతుంది.
* * *
అధ్యాయం-4
పసుపు తెలుపు కలగలిసిన మేఘాలు, పాత నౌకల వంకర ముందు భాగంలా గుండ్రంగా కనిపిస్తూ, నోవోచెర్కాస్క్ నగరం మీద నెమ్మదిగా తేలుతూ ఉన్నాయి.మెరిసే గుడి గోపురంపైన నీలి ఆకాశంలో ఒక మేఘం కదలకుండా నిలిచింది. ఆ మేఘం అక్కడి నుండే క్రివ్యాన్ స్కాయా వైపుకి జారిపోయింది.
అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ప్రకాశవంతంగా లేడు అయినా అటామన్ భవనపు ముందు కురిసిన వాన తేమ వల్ల ఆ ఇంటి పైకప్పు దగ్గర ఉన్న ఎర్మార్క్ కంచు విగ్రహం మాత్రం మెరుస్తూ ఉంది. ఎర్మార్క్ కంచు విగ్రహం మాత్రం క్రితం పడిన వాన తేమ వల్ల మెరుస్తూ ఉంది.ఆ విగ్రహం నిలబడి తన చేతిలో సైబిరియా కిరీటాన్ని ఉత్తరం వైపు చూపిస్తూ ఉంది.
కొసాక్కులు ఎపిఫని కొండ దగ్గరకు కవాతు చేస్తున్నారు. సూర్యకాంతి వల్ల వారి ఆయుధాలు మెరుస్తూ ఉన్నాయి. ఎంతో నిశ్శబ్దంగా ఉన్న ఆ ఉదయంలో అప్పుడప్పుడు వచ్చే పాదచారుల అడుగుల చప్పుడు,సైనికుల అడుగుల ధ్వని తప్ప ఇంకేమి లేవు.
ఆ ఉదయమే మాస్కో రైలులో ఇల్యా బంచక్ నోవోచేర్కాస్క్ వచ్చాడు. ఆ రైలులో ఆఖరున దిగిన వాడు అతనే. తర్వాత ప్లాట్ ఫారం మీద మామూలు పౌరుడిలా ఒక ఓవర్ కోటు ధరించాడు.ఆ దుస్తుల్లో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు.
ఒక సైనిక అధికారి,ఇద్దరు ఆడపిల్లలు ఆ ప్లాట్ ఫారం మీద నవ్వుతూ తిరుగుతున్నారు. బంచక్ పాడై ఉన్న తన సూట్ కేసును చంక కింద పెట్టుకుని పట్టణం వైపు నడిచాడు. అక్కడి నుండి ఆ పట్టణం పొలిమేర ప్రాంతానికి వచ్చే వరకూ ఒక్క మనిషి కూడా తారసపడలేదు. ఒక అరగంట తర్వాత, ఆ పట్టణాన్ని ఒక అడ్డ దారిలో దాటాక, శిధిలావస్థలో ఉన్న ఒక చిన్న ఇంటి ముందు ఆగాడు.చూడటానికి జాలి గొలిపేలా ఉంది. కాలంతో పాటు ఆ ఇంటి పైకప్పు కూడా కృంగిపోయింది. గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కిటికీల ఆకృతే మారిపోయింది,తలుపులు కూడా విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బంచక్ గేటు తెరిచి గబగబా వాకిలిలోకి పరిగెత్తాడు.
ఆ వరండాలో ఒక మూల ఒక పెట్టె సగం స్థలం ఆక్రమించింది. బంచక్ మోకాలు ఆ పెట్టెకి తగిలింది,కానీ అతను అదేమీ పట్టించుకోకుండా తలుపు తెరవడానికి పరిగెత్తాడు. ముందు గది ఖాళీగా ఉంది. రెండవ గదిలోకి నడిచి ,అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో ,ఆ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. పరిచయం ఉన్న ఆ ఇంటి జ్ఞాపకాలతో అతని తల తిరిగిపోయింది. అతని కళ్ళు ఒక్కసారిగా అక్కడ ఉన్న సామాగ్రి వైపు దృష్టి కేంద్రీకరించాయి; ముందు గదిలో ఒక మూల క్రీస్తు బొమ్మ,ఒక మంచం ,చిన్న బల్ల,దాని పైన అద్దం, దానిపైన వేలాడుతూ ఉన్న ఫోటోలు,పక్కనే కొన్ని చెక్క కుర్చీలు,కుట్టు మిషను ,మరకలు పట్టి ఉన్న సమోవర్. ఒక్కసారిగా గుండె వేగం పెరిగినట్టై ,నోటితో శ్వాస పీల్చుకుంటూ ,బంచక్ వెనక్కి తిరిగి,తన సూట్ కేసు కింద పడేసి,వంటగది వైపు చూసాడు. మరకలతో ఉన్న స్టవ్,నీలం రంగు కర్టెన్ వెనుక నుండి చూస్తున్న పిల్లి;దాని కళ్ళల్లో మనుషుల తెలివి, ఆసక్తి; చూస్తూ ఉంటే అక్కడకి ఎవరూ రారన్న విషయం స్పష్టమవుతూ ఉంది. ఒక పక్క బల్ల మీద తోమని గిన్నెలు,దాని పక్కన ఉన్న కుర్చీలో ఒక నూలు ఉండ,దానికి చుట్టి ఉన్న సూదులు ఉన్నాయి.
ఎనిమిదేళ్ళల్లో ఏమి మారలేదు. నిన్న మొన్నే అక్కడి నుండి వెళ్ళినట్లు ఉంది బంచక్ కి. బయటకి పరిగెత్తాడు. బయట ఒక మూల ఉన్న షెడ్డు ఒక వృద్ధురాలు,తలుపు తెరచుకుని బయటకు వచ్చింది.తన తల్లిని చూసిన సంతోషంతో బంచక్ తన టోపీ కింద పడేసి ఆమె దగ్గరకు పరిగెత్తాడు.
‘నీకు ఎవరు కావాలి ?ఎందుకు వచ్చావు?’ఆ వృద్ధురాలు అనుమానంగా అడిగింది.
‘అమ్మా ….నువ్వు నన్ను గుర్తు పట్టలేదా ?’బంచక్ బొంగురు పోయిన స్వరంతో అడిగాడు.
ఆ మాట ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. ముడతలు పడిన ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు.
‘ఇల్యా ,నా ప్రియమైన ఇల్యా….నేను నిన్ను గుర్తు పట్టలేకపోయాను. ఎక్కడి నుండి వచ్చావు ?’ గుసగుసగా అన్నట్టు అడిగింది.
ఆ ఇద్దరూ ఇంటిలోపలికి వెళ్ళారు.ఆ భావోద్వేగ స్థితి నుండి బయటపడిన కొంచెం సేపటికి మరలా అద్దెకి తెచ్చి ధరించిన ఓవర్ కోటు బంచక్ ని ఇబ్బందిపెట్టసాగింది. అది చాలా బిగుతుగా ఉంది, చేతుల దగ్గర పట్టేసి, చిరిగిపోయేలా అనిపించడంతో బంచక్ కదలడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.దాన్ని విప్పేసి కింద పడేసి, బల్ల కింద కూర్చున్నాడు.
‘నేను మళ్ళి నిన్ను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు!మనిద్దరం ఒకరినొకరం చూసుకుని ఎన్నాళ్ళు అయ్యింది? ఎంత ఎదిగిపోయావు కన్నా! నేనే నిన్ను గుర్తు పట్టలేకపోయాను!”
‘అమ్మా!నువ్వు ఎలా ఉన్నావు?’ బంచక్ నవ్వుతూ అడిగాడు.
సమోవర్ లో బొగ్గు వేసి వెలిగిస్తూ, ఆ బొగ్గు మరకలు ఆమె బుగ్గలకు అంటుకున్నా,అదేమీ పట్టించుకోకుండా కొడుకుతో మాట్లాడుతూనే ఉంది ఆ తల్లి. పదేపదే ఆమె కొడుకు దగ్గరకు వెళ్ళి, అతని చేతులు నిమిరి,వణుకుతున్న తన దేహాన్ని అతని భుజాలకు ఆనించింది. స్వయంగా తానె నీళ్ళు వేడి చేసి,అతనికి తల స్నానం చేయించి, పెట్టె దిగువున శుభ్రంగా ఉన్న లోదుస్తులు అతనికి ఇచ్చి, అతనికి సంతృప్తిగా భోజనం పెట్టి,అర్థరాత్రి వరకూ కొడుకు పక్కనే కూర్చుని,కళ్ళు రెప్ప వాల్చకుండా ,కొడుకుని అనేక ప్రశ్నలు అడుగుతూ,మధ్యమధ్యలో తన తల ఊపుతూ అలాగే ఉండిపోయింది.
అర్దరాత్రి రెండయ్యాక దగ్గరలో గంట మ్రోగాక బంచక్ నిద్రకు ఉపక్రమించాడు. అతనికి వెంటనే నిద్ర పట్టింది, ప్రస్తుత సందర్భంతో పని లేకుండా అతను ఓ కల కన్నాడు. దగ్గరలో ఉన్న స్కూలులో ఉన్న పిల్లలతో కలిసి రోజంతా అల్లరి చేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు.అప్పుడు తల్లి వంటగది తలుపు దగ్గర నిలబడి, ‘ఇల్యుషా,రేపటి హోంవర్క్ చేసావా?అని అడిగింది. చిరునవ్వుతో అతను నిద్ర పోతున్నాడు.
ఆ రాత్రి అతను నిద్ర పోతున్న సమయంలో అతని తల్లి అనేకసార్లు అతని పక్క దుప్పట్లు,దిండు సరి చేసి, అతని నుదురుపై ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఒక రోజు గడిచిన తర్వాత బంచక్ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ రోజు ఉదయం ఒక సైనికుడి దుస్తుల్లో ఒక కామ్రేడ్ ఆ ఇంటి దగ్గరకు వచ్చి, గుసగుసగా ఏదో బంచక్ తో చెప్పాడు. అది విన్న వెంటనే బంచక్ తన సూట్ కేసును గబగబా సర్దుకుని, అందులో తల్లి శుభ్రంగా ఉతికి ఇచ్చిన లోదుస్తులను కూడా పెట్టుకుని,కొద్దిగా ఇబ్బంది పెడుతూనే కోర్టు పైకి లాక్కుని సర్దుకున్నాడు. త్వరగా తల్లికి వీడ్కోలు చెప్పి,ఒక నెలలో తిరిగి వస్తానని మాట ఇచ్చాడు.
‘ఇల్యుషా .ఎక్కడికి వెళ్తున్నావు?’
‘రోస్తోవ్ కి వెళ్తున్నాను అమ్మా.నేను త్వరగా తిరిగి వస్తాను. ….బాధపడకమ్మా!’అంటూ తల్లిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేసాడు.
ఆమె గబగబా తన మెడలో ఉన్న సిలువను బయటకి తీసి, అతనికి ముద్దు పెట్టి,అది అతని మెడలో వేసింది.
‘ఇది ఎప్పుడూ నీతోనే ఉంచుకో,ఇల్యుషా.మైరాకి చెందిన సెయింట్ నికొలాస్ సిలువ ఇది. ఆ సెయింట్ నిన్ను కాపాడుతూ ,నీకు రక్షణగా ఉండాలని ప్రార్థిస్తున్నాను….’ ఆమె చిన్నగా ప్రార్ధిస్తున్న స్వరంలో అంది.
ఆమె కొడుకును కౌగలించుకుంది;ఆమె పెదవుల కొసలు వణుకుతూ ఉన్నాయి.ఆమె కన్నీరు ధారలా అతని చేతి మీద పడుతూ ఉన్నాయి. తల్లి కౌగిలి నుండి విడిపించుకుని,బయటకు పరిగెత్తాడు బంచక్.
* * *
రోస్తోవ్ స్టేషన్ పశువుల షెడ్డులా ఉంది. కింద నేల అంతా సిగరెట్ పీకలతో,పొద్దుతిరుగుడు గింజల పొట్టుతో నిండిపోయింది. స్టేషన్ కూడలి వద్ద స్థానిక సైనికులు సైన్యాధికారుల దుస్తులను, పొగాకును,దొంగిలించిన వస్తువులను అమ్ముతున్నారు. దక్షిణ సముద్రప్రాంత పట్టణాల్లో ఉండే జనాభా రద్దీ అక్కడా కూడా ఉంది.
‘అస్మోలోవ్స్కి సిగరెట్లు, తక్కువ ధరకే…కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి!’సిగరెట్లు అమ్ముతున్న ఒక చిన్న పిల్లవాడు అరుస్తూ ఉన్నాడు.
‘మీకు చాలా చౌకగా దొరుకుతాయి సార్ ‘అంటూ చూడటానికి అనుమానించదగిన వాడిలా ఉన్న ఒకతను బంచక్ చెవిలో గుసగుసగా అంటూ,కన్ను కొట్టాడు.
‘పొద్దుతిరుగుడు గింజలు, వేయించి ఎండబెట్టినవి! ఇక్కడే ఉన్నాయి ,తీసుకోండి!’బాలికలు,స్త్రీలు అరుస్తూ ఉన్నారు.
ఆరుగురు నల్ల సముద్ర సైనికులు జనసమూహం నుండి తోసుకుంటూ గట్టిగా మాట్లాడుతూ,నవ్వుతూ ముందుకు వెళ్తున్నారు. వారు ముందుకు వెళ్తూ ఉంటె జనాలు గౌరవంతో వెనక్కి తగ్గారు.
బంచక్ నెమ్మదిగా ఆ జనం నుండి మెల్లగా ముందుకు వెళ్ళాడు.
‘దీన్ని బంగారం అంటారా? నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా ?దొంగ బంగారం ….నాకు కళ్ళు కనబడటం లేదనుకుంటున్నావా?’సైన్యంగా టెలిగ్రాఫిస్ట్ గా పని చేసిన ఒక పొట్టివాడు కోపంగా అరుస్తున్నాడు.
‘ఏం కనిపిస్తుంది?ఇది బంగారమే.నీకు ఇప్పుడు హాల్ మార్క్ చిహ్నం కావాలా ?పో …..కొనే ముఖమేనా అది ?అయితే నీకు ఇది అవసరం లేదా ?’అంటూ ఒకబంగారపు గొలుసును చూపిస్తూ గట్టిగా అన్నాడు.
‘నావికాదళం అలాంటివి సహించదు ……అది పనికిమాలిన విషయం !’దగ్గరలో ఉన్న ఒక స్వరం అంది.
‘ఎందుకు ఊరుకోదు ?’
‘ఆ విషయమే ఈ వార్తాపత్రికల్లో రాసింది …’
‘అది ఇక్కడికి తీసుకురా ,పిల్లాడా …’
‘మేము బోల్షివిక్కులకే ఓటు వేసాము….ఇంకెవరు వేసారు?’
‘ఇప్పుడు నీకు ఎంత కావాలో చెప్పు.’
‘రైళ్ళు ఉంటాయని ఆయన నాకు మాట ఇచ్చాడు. మేము రేపు బయలుదేరుతాము.’
బంచక్ పార్టీ కమిటి భవనం కనుక్కుని దాని మొదటి అంతస్తుకి వెళ్ళాడు. జపాన్ తుపాకి పట్టుకున్న ఒక రెడ్ గార్డ్ అతని దారిని అడ్డగించాడు.
‘కామ్రేడ్ ,ఎవరిని కలవడానికి వచ్చావు?’
‘కామ్రేడ్ అబ్రంసన్.ఆయన ఉన్నాడా?’
‘ఎడమ వైపు మూడో గదిలో ఉన్నారు.’
పెద్ద ముక్కు,నల్లటి జుట్టుతో, తన ఎడమ చేతి వేళ్ళను తన కోటు జేబులో ఉంచిన ఒక పొట్టి వ్యక్తి తన కుడి చేత్తో ఎదో సైగ చేస్తూ ఒక పెద్ద వయసువాడైన ఒక రైల్వే ఉద్యోగితో మాట్లాడుతూ ఉన్నాడు.
అప్పటికే అయోమయ స్థితిలో,పశ్చాత్తాప భావనతో ఉన్న ఆ రైల్వే ఉద్యోగి తనను తానూ రక్షించుకోవడానికి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ,కానీ ఆ నల్ల జుట్టు అతను మాత్రం ఆ అవకాశమే ఇవ్వడం లేదు. కోపంతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్న ధోరణితో ఆ రైల్వే ఉద్యోగి చూపులను,మాట్లాడే ప్రయత్నాన్ని పట్టించుకోనట్టు ఉండిపోయాడు.
‘మిచెంకో ని వెంటనే తిసేయ్యాలి. మీ మధ్యలో జరుగుతున్నది అంత తేలికగా వదిలేసే విషయం కాదు.వేర్కొత్స్కి మన విప్లవ న్యాయస్థానం ముందు సమాధానం చెప్తాడు. అతన్ని అరెస్ట్ చేసారా ? నేనైతే అతన్ని కాల్చి పడేస్తాను! ‘కోపంగా మాట్లాడుతూ, ఎర్రగా ఉన్న తన ముఖాన్ని బంచక్ వైపుకి తిప్పాడు;ఇంకా ఆ కోప స్థితి నుండి తనను తానూ నిగ్రహించుకోకముందే, ‘నీకేం కావాలి?’అని బంచక్ ని అడిగాడు.
‘అబ్రంసన్ అంటే మీరేనా?’
‘అవును.’
పెట్రోగ్రాడ్ ఉన్నత స్థాయిలో ఉన్న ఒక కామ్రేడ్ ఇచ్చిన కాగితాలు,ఉత్తరం ఇచ్చి, కిటికీ పక్కన కూర్చున్నాడు బంచక్.
అబ్రంసన్ ఆ ఉత్తరం వెంటనే చదివి, ఒక నవ్వు నవ్వాడు(అదుపు తప్పిన తన ప్రవర్తనకు సిగ్గు పడ్డాడు).
‘కొద్ది సేపు ఆగు ,నేను నీతో మాట్లాడతాను.’
ఆ రైల్వే ఉద్యోగిని పంపించేసి అతను ఆ గది బయటకు వెళ్ళాడు. ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అతను ఎత్తుగా ఉండి,శుభ్రంగా గడ్డం చేసుకుని,మిలిటరీ దుస్తులు ధరించి,కింది దవడ దగ్గర గాయాల మచ్చ ఉన్న ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు.
‘ఇతను మన మిలిటరీ విప్లవ కమిటీ సభ్యుడు. ఇతను కామ్రేడ్ …..క్షమించు,నీ పేరు మర్చిపోయాను ….’
‘బంచక్.’
‘కామ్రేడ్ బంచక్ ……నువ్వు సుశిక్షుతుడివి అయిన మెషిన్ గన్నర్ (ఫిరంగులు పేల్చడంలో నిపుణుడు ) కదా ?’
‘అవును.’
‘అదే మాకు కావాల్సింది!’అంటూ ఆ మిలిటరీ వ్యక్తి నవ్వాడు.
‘నువ్వు మా రెడ్ గార్డ్ సైనికులను మెషిన్ గన్ బృందంలా తయారయ్యేలా శిక్షణ ఇవ్వగలవా?ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా …’
‘నేను ప్రయత్నించగలను.కానీ అది సమయానికి సంబంధించిన విషయం.’
‘నీకు ఎంత సమయం కావాలి?ఒక వారం ?రెండు వారాలు?మూడు?’ఆ మిలిటరీ వ్యక్తి బంచక్ వైపు వంగుతూ,నవ్వుతూ అడిగాడు.
‘కొన్ని రోజులు.’
‘అద్భుతం.’
‘ మన రక్షక దళాలు నైతికంగా దెబ్బ తిని ఉన్నాయి. నిజానికి వాటికి ఇప్పుడు పెద్ద విలువ లేదు. ఇటు చూడు,కామ్రేడ్ బంచక్ …ఎక్కడైనా ఇదే పరిస్థితి అనుకుంటా…మనం పని వాళ్ళ మీదే ఆధారపడాలి.నావికులు పర్లేదు కానీ …. సైనికులు మాత్రం ….అందుకే,మా సొంత మెషిన్ గన్నర్స్ దళం కావాలని మేము అనుకుంటున్నది …’ అబ్రంసన్ నుదురు రుద్దుకుంటూ, చిరాగ్గా అని,కాసేపు ఆగి, ‘ఇంతకు నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు ? ఏమనుకోకు ,నీ విషయం మేము చూసుకుంటాము . ఏమైనా తిన్నావా? తిని ఉండవులే!’అని ఆపేక్షగా అన్నాడు.
‘మీరు కూడా ఆకలితోనే ఉండి ఉంటారు,ఎవరు తిన్నారో ,లేదో ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. ఎంత దుఃఖం,భీభత్సం చూడకపోతే ఈ స్థాయికి వచ్చి ఉంటారు? ‘బంచక్ ఆ వ్యక్తి గురించి ఆప్యాయంగా తనలో తానే అనుకున్నాడు. అబ్రంసన్ సూచించిన నివాస ప్రదేశానికి వెళ్తున్నప్పుడు కూడా అతని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ‘నాకు తగిన మనిషి ఈయన,అసలైన బోల్షివిక్కు!ఎంత కఠినంగా ఉండగలడో అంత దయ,కరుణా కూడా చూపగలడు. వేర్ఖోత్స్కి లాంటి వాడికి మరణ శిక్ష విధించడగలడు,అలాగే ఒక కామ్రేడ్ ను దయతో దగ్గరకి తీసుకోగలడు.’
అబ్రంసన్ ని కలిసిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే,టాగన్ రాగ్ వీధి చివరలో ఉన్న ఒక ఇంటికి నడిచి,అబ్రంసన్ ఇచ్చిన ఉత్తరాన్ని ఆ ఇంటి యజమానురాలికి ఇచ్చాడు. ఆమె చూపించిన పుస్తకాలతో ఉన్న చిన్న గదిలో కాసేపు విశ్రాంతి తీసుకుని, రాత్రి భోజనం చేసాడు.మంచం మీద వాలి ,కళ్ళు మూయగానే అతనికి వెంటనే నిద్ర పట్టేసింది.
* * *
అధ్యాయం -5
నాలుగు రోజులు పాటు బంచక్ తన దగ్గరికి పార్టీ వర్కర్స్ పంపించిన వారికి ఉదయం,రాత్రి అని తేడా లేకుండా శిక్షణ ఇచ్చాడు. వారు మొత్తం పదహారు మంది. వారిలో వివిధ వృత్తులకు,వయసులకు,దేశాలకు చెందిన వారున్నారు.ఖ్వలిచ్ కో కి చెందిన ఇద్దరు ఓడరేవులో పని చేసే వ్యక్తులు,పోల్తావా మూలాలున్న ఒక ఉక్రేనియావాడు, మిఖాలిడికి చెందినా వాడు,గ్రీకు మూలాలున్న రష్యా వాడు, రైల్వే డిపోలో పని చేసే ఇద్దరు పనివాళ్ళు,పారమోనోవ్ మైనులో పని చేసే వాడు,లోహాశాలలో పని చేసే ఎనిమిది మంది, ఆర్మేనియాకి చెందిన ఒక బెకరి షాపు నడిపేవాడు,ఇలాంటి ఎందరో ఉన్నారు వారిలో. పదిహేడో మనిషిగా సైనికుల దుస్తుల్లో,తన పాదాలకు పెద్దగా ఉన్న బూట్లతో వచ్చిన ఒక స్త్రీ వచ్చింది.
ఆమె తెచ్చిన ఒక అధికార పత్రాన్ని,ఉత్తరాన్ని అందుకున్న బంచక్ ఆమె వచ్చిన కారణాన్ని ఊహించలేక, ‘నువ్వు వెనక్కి వెళ్ళేటప్పుడు ప్రధాన కార్యాలయం నుండి ఫోన్ చేయించగలవా?’అని అడిగాడు.
ఆమె నవ్వి,ముఖం మీదకి జారిపడుతున్న వెంట్రుకలను వెనక్కి సర్దుకుని,సిగ్గు పడుతూ, ‘నన్ను ఇక్కడికి శిక్షణ పొందడం కోసం పంపించారు….మెషిన్ గన్నర్ శిక్షణ’,అంది.
బంచక్ కి కోపం ముంచుకొచ్చింది.
‘ఏమనుకుంటున్నారు…ఏమైనా పిచ్చి పట్టిందా? నేను ఇక్కడ స్త్రీల బెటాలియన్ ను తయారు చేస్తున్నానా? …ఏమనుకోవద్దు ,కానీ ఇది స్త్రీలు చేసే పని కాదు. మగవాడి బలం కావాలి దీనికి …నేను నిన్ను తీసుకోలేను’,అన్నాడు.
నుదురు చిట్లించుకుంటూ,ఆమె తీసుకువచ్చిన అధికారపత్రాన్ని చదివాడు. పార్టీ సభ్యురాలైన అన్నా పోగుడ్కో ని అతని దగ్గరకి శిక్షణ కోసం పంపించారన్న వార్త పొడిగా ఉంది. దానితో పాటు అబ్రంసన్ రాసిన ఉత్తరాన్ని అనేకసార్లు బంచక్ చదివాడు.
ప్రియమైన కామ్రేడ్ బంచక్,
నేను నీ దగ్గరకు అన్నా పోగుడ్కో అనే కామ్రేడ్ ని పంపిస్తున్నాను. ఆమె సామర్థ్యాలను గమనించాకే,ఆమెను ఒక మెషిన్ గన్నర్ గా రూపొందిస్తావన్న నమ్మకంతో ఆమెను నీ దగ్గరకు పంపిస్తున్నాము. నాకు ఈ అమ్మాయి బాగా తెలుసు. మంచి వర్కర్ కానీ కొంత యవ్వనంలో ఉండే ఉద్రేకం ఉంది. ఆ ఉద్రేకంతో బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తే ఆమెను కనిపెట్టుకుని ఉండు.
నీ బృందంలో ఆ ఎనిమిది మంది లోహశాల కార్మికులే బలమైన వారు;ముఖ్యంగా కామ్రేడ్ బోగోవోయ్ పట్ల శ్రద్ధ చూపించు. ఆటను సంస్థకు ఎంతో విలువైన వాడు,విప్లవం పట్ల అంకిత భావం కలవాడు. నువ్వు ప్రస్తుతం తయారు చేస్తున్న ఈ దళం ప్రపంచవ్యాప్తి అవుతుంది,అది చాలా మంచి విషయం,అది గొప్ప పోరాట దళంగా మారుతుంది.
శిక్షణ వేగం పెంచు. ఇప్పటికే కాలేదిన్ మన మీద యుద్ధానికి వస్తున్న వార్తలు వస్తున్నాయి.
శుభాశిస్సులతో
ఎస్.అబ్రంసన్
బంచక్ తన ఎదురుగా నిలబడి ఉన్న అమ్మాయి వైపు చూసాడు(మాస్కో వీధిలో ఉన్న ఒక ఇంటి బేస్మెంట్ లో ట్రెయినింగ్ జరిగే ప్రదేశంలో వారు అప్పుడు ఉన్నారు).
‘సరే అయితే …ఇది నీ స్వీయ ఆలోచన అయ్యి,దానికి అబ్రంసన్ మద్దతు ఉంటే …నువ్వు ఇక్కడ ఉండొచ్చు’,అన్నాడు బంచక్ ఆమెతో.
* * *
బంచక్ ఆయుధాలను ముఖ్యంగా తుపాకిలను వాడాల్సిన పద్ధతుల గురించి,వాటి భాగాల గురించి వేగం గురించి, ఎలా ప్రయోగిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి వంటి అనేక విషయాల గురించి వివరంగా అందరికి శిక్షణ ఇస్తూ ఉన్నాడు. అలాగే శత్రువు నుండి నేర్పుగా ఎలా తప్పించుకోవాలో అన్న అంశం కూడా ఆ శిక్షణలో ఒక భాగం.
గెర్వోఖంట్స్ అనే బెకర్ తప్ప అందరూ ఆ విషయాలు తేలికగానే నేర్చుకోగలిగారు. ఏ విషయం కూడా సులభంగా అతనికి అర్థమయ్యేది కాదు. ఎన్ని సార్లు బంచక్ అతనికి తుపాకి ఎలా తయారు చేసుకోవాలో నేర్పించినా అతను ఆ విషయంలో అయోమయంగానే వ్యవహరించేవాడు.
‘ఎందుకు ఇది సరిగ్గా అమరడం లేదు?ఇదంతా నా తప్పే …..అటువైపు నుండి పెట్టాలి…..అయినా కుదరడం లేదు …ఎందుకు ?’అని వాపోతూ ఉండేవాడు.
‘ఎందుకంటే నువ్వు పెట్టాల్సిన బలం,ఒత్తిడి పెట్టకుండా మందకొడిగా వ్యవహరిస్తున్నావు కాబట్టి. ఇది ఇలా చేయాలి.నాకు చిన్నప్పటి నుండే మిలిటరీ విషయాల పట్ల ఆసక్తి ఉంది.నేను అలా పని చేస్తున్న క్రమంలోనే నేను తయారు చేసిన ఒక బాంబు ఒకటి పేలిపోయింది.అందుకే నా మొహం మీద ఈ మచ్చలు ఏర్పడ్డాయి.అప్పట్లో అధ్వాన్నంగా ఉన్నా,తర్వాత మెరుగు పడ్డాను ’ నుదురు,బుగ్గల మీద మచ్చలు ఉన్న బోగోవోయ్ అన్నాడు.
బోగోవోయ్ మిగిలిన వారి కంటే మెషిన్ గన్స్ విషయంలో మెరుగ్గా ఉండేవాడు,అన్ని విషయాలు సులువుగా గ్రహించేవాడు.అందరిలో గెర్వోఖంట్స్ మాత్రం మందబుద్ధిలా వ్యవహరిస్తూ ఉండేవాడు. ‘మళ్ళి తప్పు జరిగింది! ఎందుకు ?నాకు తెలియదు’,అతని ఏడుపు గొంతు పదేపదే వినిపిస్తూ ఉండేది.
‘గాడిద మెరుగు ఇతని కన్నా. ఈ మొత్తం నఖిచివాన్ లోనే వీడంత దద్దమ్మ ఉండనే ఉండడు!’ప్రతి చిన్న విషయానికి ఆవేశపడే మిఖాలిడి అనేవాడు.
‘ఎంత తెలివితక్కువ వాడు’, రెబిందర్ ఒప్పుకుంటూ అనేవాడు.
‘తనకు తెలియకపోతే నేర్పించాలి కానీ ఇలా హేళన చేయడం మంచి పద్ధతి కాదు’, కేవలం స్టెపనోవ్ మాత్రమే అతన్ని సమర్థించేవాడు.
పెద్ద కళ్ళు,బలిష్టమైన భుజాలు ఉన్న క్రుతోగోరోవ్ కూడా అతన్ని వెనకేసుకొచ్చేవాడు. ‘కామ్రేడ్ బంచక్,ఈ జట్టులో మెరుగైన వారిని దయ్యాల దగ్గరికి పంపడానికి సిద్ధంగా ఉండండి. ఒక పక్క విప్లవం ప్రమాదంలో ఉంటె,వీళ్ళు ఇక్కడ ఎకసెక్కలాడుతూ ఉంటారు. వీళ్ళు పార్టీ సభ్యులని చెప్పుకునేది!జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు!’గంభీరమైన గొంతుతో అనేవాడు.
అన్నా పోగుడ్కో ప్రతి విషయాన్ని ఆసక్తితో గమనించేది. ఎప్పుడూ బంచక్ కి ఆనుకునే దూరంలో ఉంటూ,మెషిన్ గన్ ని వదలకుండా ఉండేది.
‘ఒకవేళ ఆ శీతల భాగం(కూలింగ్ చాంబర్ )లో నీరు గడ్డ కడితే ఏమవుతుంది?గాలి బలంగా ఉన్నప్పుడు ఎంత మేరకు విచలనం ఉండాలి? ఇదేంటి,కామ్రేడ్ బంచక్ ?’పెద్ద నల్లటి కళ్ళతో కుతూహలంతో ఎప్పుడూ బంచక్ ను ప్రశ్నలు వేస్తూ ఉండేది.
ఆమె సమక్షంలో అతనికి ఏదో అసౌకర్యంగా అనిపించేది. ఆమెతో ఉన్న ప్రతిసారీ,అతన్ని ఏదో తెలియని ఉద్వేగం ఇబ్బంది పెడుతూ ఉండేది. ఆ ఇబ్బందితో పాటు ఏదో తెలియని అనుభూతి అతన్ని ఉత్సాహపరిచేది కూడా. ప్రతి ఉదయం కచ్చితంగా ఏడున్నర గంటలకు ఆమె కోటు జేబులో చేతులు పెట్టుకుని, సైనికుల బూట్లు వేసుకొని శిక్షణ ఇచ్చే స్థలానికి వచ్చేసరికి అతను తడబడిపోయేవాడు. ఆమె అతనికంటే కొద్దిగా తక్కువ ఎత్తు, కాని ఆరోగ్యవంతమైన యువతులకు సహజంగా ఉండే ఆకర్షణతో నిండిన శరీరాకృతి కలిగినదీ. ఆమె భుజాలు బలంగా ఉండేవి. ఆమె ముఖంలో పెద్దగా ఆకర్షణేమీ లేకపోయినా, పెద్దగా ఉన్న ఆ గంభీరమైన కళ్ళు మొత్తం ముఖాన్ని ప్రాణంతో నింపినట్లుగా అనిపించేవి.
వారు కలిసి నాలుగు రోజులు అయినప్పటికీ అతను ఒక్కసారి కూడా ఆమె వైపు సరిగ్గా చూడలేకపోయాడు. ఆ స్థలంలో తక్కువ కాంతి ఉండటం,వ్యవధి లేకుండా ఉండటం వల్ల ఆమెను సరిగ్గా చూడలేకపోయాడు. ఐదవ రోజు ఇద్దరు కలిసి ఆ శిక్షణా ప్రదేశం నుండి బయటకు బయల్దేరారు. ఆమె ముందు ఉంది,ఆఖరి మెట్టు దగ్గరకు వచ్చాక,ఆమె ఏదో అడగటానికి వెనక్కి తిరిగింది.ఆ సాయంకాలపు వెలుతురులో బంచక్ ఆమె మొహాన్ని చూశాడు. ఆమె తన జుట్టు సరిచేసుకుంటూ,అతని సమాధానం కోసం ఎదురుచూస్తూ,అతన్ని చూస్తూ ఉంది. కానీ బంచక్ ఆ ప్రశ్నను వినలేదు, ఒక రకమైన ఉద్విగ్నతతో ఉన్న అతను మెల్లగా మెట్లు ఎక్కుతూ ఉన్నాడు.
ఏదో పెద్ద విషయం జరగబోతున్నప్పుదల్లా అతనిలో అలాంటి ఉద్విగ్నత సంభవించేది. అనుకోని దాడి జరిగిన సమయంలోనూ,ప్రమాదం సంభవించే ప్రతి సారి అతనిలో తలెత్తే ఆ రకమైన భావనలు గులాబీ రంగులో ఉన్న ఆమె బుగ్గలను ,పెద్ద కళ్ళను చూస్తున్నప్పుడు కూడా తలెత్తుతున్నాయి.
బంచక్ ఆమె ప్రశ్నను తప్పించుకోవడానికి, ‘అన్నా పోగుడ్కో ….నువ్వు ఒకరు ఎంత సంతోషంగా ఉండగలరో అంత అందంగా ఉన్నావు’,అన్నాడు.
‘అబద్ధం!నేను రేపు ఏ సమయానికి రావాలి? అని అడుగుతున్నాను’,నవ్వుతూ అంది.
* * *
