రెండు స్వప్నాల మద్య గోడ

Spread the love

తలుపు తాళమేస్తూ అతడు బయటికి చూశాడు. చిన్నగా ముసురు పడుతోంది. బిరబిరా మెట్లెక్కివస్తూ ఎదురైంది కోమలి.

తల తడవకుండా చీరకొంగు కప్పుకుంది. అతడు కనిపించగానే ముఖం వెలిగింది.

“అదేంటీ, డ్యూటీకి ఇప్పుడు వెళుతున్నారా.. ఇంత లేటుగా?’ అంది.

అతడు బదులు చెప్పలేదు. నిలబెట్టిన విగ్రహంలా కనీసం నవ్వలేదు. నేలచూపులు చూశాడు. అతను కనిపించిన ప్రతిసారీ కోమలి చొరవగా పలుకరిస్తుంది. అన్నిసార్లూ తత్తరపడిపోతాడు. అతని మెదడుకూ దేహానికీ మధ్య నెట్వర్క్ జామ్ అవుతుంది. క్షణాల వ్యవధిలో గుండె చలనాన్ని పెంచీ, తగ్గించే శక్తి ఏదో ఆమెలో ఉందని మాత్రమే అనుకుంటాడు.

“బయట వాన.. చేతిలో గొడుగు లేకుండా పోతున్నరు, తడిసిపోతారు”  

దీనికీ మొహమాటపడ్డాడు. ముఖంలో బంజరు భూమిలాంటి నవ్వు. బిడియంగా తలొంచుకొని వెళ్ళిపోయాడు.

కోమలి చిన్నబుచ్చుకోలేదు. తన ధోరణి తెలిసిందే. ఇద్దరూ ఒకే కమ్యునిటీలో పక్కపక్క పోర్షన్లలో ఉంటారు. నడుమ గోడ మాత్రమే అడ్డు. దాదాపు రోజూ ఎదురుపడతారు. కోమలి స్నేహంగా నవ్వుతుంది. పలకరింపుగా ఏదో అంటుంది. సంభాషణ పొడిగిస్తుంది. అతడు వింటున్నదీ లేనిదీ చూడకుండా గలగల మాట్లాడేస్తుంది. అన్యమనస్కంగా తలాడించి వెళ్ళిపోతాడు. మరీ తప్పదనిపిస్తే అరుదుగా రెండు పొడి మాటలు. అంతమాత్రానికే ఆమె సంతోషిస్తుంది.

పది కుటుంబాలుండే గృహ సముదాయమది. లోయర్ మిడిల్ క్లాస్ కమ్యూనిటీ. అన్నీ సింగిల్ రూం పోర్షన్లే. ఒకే నమూనాలో పాతపద్ధతి నిర్మాణం. ఎన్నేళ్లుగానో యే మార్పులు, మరమ్మతులు లేకుండా కొనసాగుతున్న స్థితి. ఆవరణ మధ్య ఖాళీస్థలంలో బోరు పంపు. అందరికి అదొక్కటే నీటి వనరు. బట్టలుతకడం, గిన్నెలు కడగడం, నీళ్ళు పట్టడం అన్నీ అక్కడే.

అందరూ సగటు జీవులే. తెల్లారిందంటే ఎవరిపనుల్లో వాళ్లు వెళ్లిపోతారు.

పది పోర్షన్లలో ఎనిమిది ఫ్యామిలీలు. మిగతా ఒకదాంట్లో నడివయసు బ్యాచిలర్. రెండో దాంట్లో ఏడేళ్ళ బాబుతో కోమలి.   

తనకు ముప్పయ్ ఐదేళ్లంటే ఆ బ్యాచిలర్ ఆశ్చర్యపోతాడు. కానీ పెళ్లీడు దాటిపోయిందన్న ఫీలింగ్ ఉన్నట్టు కనిపించడు. గుడ్ లుకింగేమీ కాదు. జస్ట్ యావరేజ్. సన్నగా పొడుగ్గా, కండరాల కంటే ఎముకల ఆధిపత్యం ఎక్కువ. ఓసారి చూస్తే తొందరగా మర్చిపోయే ముఖం. కళ్ళకు పాతతరం జోడు. మడతపెట్టినట్టు దువ్విన జుట్టు. అతనిపై అలిగి నవ్వు ఎప్పుడు పారిపోయిందో తెలియని సీరియస్ ముఖం. మెరిసే కళ్ళు మాత్రమే అతడింకా యువకుడని చెపుతాయి.

అతని గురించి వివరంగా అక్కడెవరికి తెలియదు. ఏదైనా చెప్పుకునే చనువు ఎవరితోనూ లేదు. స్నేహితులో, చూట్టాలో తన గదికొచ్చి పోవడం ఎవరూ చూళ్ళేదు. పొద్దున ఎనిమిదికే భుజానికి బ్యాగ్ తగిలించుకొని పోతాడు. తిరిగి చీకటికీ అర్ధరాత్రికీ మధ్య ఎప్పుడో ఇల్లు చేరుకుంటాడు.   

కోమలి కరెంట్ ఆఫీసులో పనిచేస్తుంది. పెద్దగా చదువుకోలేదు. చూడగానే చప్పున అందగత్తె అనిపించదు. కానీ తెల్లగా, బొద్దుగా నిండైన శరీర సౌష్టవం మంత్రించి వేస్తుంది. ఎప్పుడూ నవ్వినట్టుండే ముఖం. గలగలపారే చైతన్యం. ఒంటరిగా ఉంటుంది గనుక ఆమె మారిటల్ స్టేటస్ చెప్పలేం. బాబున్నాడు గనుక పెళ్లి అయిందనుకోవాలి. అయితే భర్త ఎప్పుడూ కనిపించడు. అక్కడెవరూ చూడలేదు. వయసులో ఉన్న స్త్రీ అట్లా మగదిక్కు లేకుండా ఎందుకుంటుందో ఆ కమ్యూనిటీలో ఎవరికి అర్థంకాదు. ఒక పద్ధతిలో సాగిపోయే ఆమె జీవనశైలి, నడవడి, గౌరవంగా బతుకుతున్న తీరూ అక్కడందరి ఆదరణ పొందేలా చేసింది.   

గోడకు ఆటువైపు నుంచి ఆమె గొంతు ఎప్పుడూ మంద్రస్థాయిలో వినిపిస్తుంది. మాటలు ఇటుపక్కన అతని చెవుల్లో దూరిపోతుంటాయి.

“స్కూలుకి టైమై పోతుంది, అన్నం తిను బిడ్డా” కొడుకుని బుజ్జగిస్తుంది.  

“త్వరగా డ్రస్సు వేసుకోరా”  

“ఏ రోజు ఇచ్చిన హోంవర్క్ ఆరోజే పూర్తిచెయ్యాలి తెలిసిందా?”

“క్లాసు పుస్తకాలు అట్లా చింపొద్దురా. ఏడాదంతా ఉండేవి, భద్రంగా కాపాడుకోవాలి”

కొడుకుతో మాట్లాడినప్పుడు తప్ప ఇతరత్రా ఆమె గొంతు వినిపించదు. తల్లికొడుకులకి ఆ ఒంటి గది పొర్షను అమిరినట్టు సరిపోతుంది. బాబుకు చిన్న మంచం. నేలపైన ఆమెకు ఈతచాప. బట్టలకోసం రెండు చెక్కపెట్టెలు. పెద్ద సూటుకేసు. రెండు రాతెండి బిందెలు. రెండు ప్లాస్టిక్ బకెట్లు. ఏవో కొన్ని వంటపాత్రలు.   

అతనికి ఆసక్తిలేకున్నా కోమలి తన సొంత విషయాల్లో ప్రాధాన్యత ఇస్తుంది. ఆరోజు పిల్లవాడు అన్నం తినకుండా మొండికేస్తున్నాడు. ఆమె ప్రేమగా బుజ్జగిస్తోంది.“అన్నం చల్లారిపోతే బాగుండదు, తిను బిడ్డా.. నీకిష్టమని కోడికూర వొండిన..”  

“నాకొద్దు .. నేను తినను” బాబు మారాం.  

“పిల్లోడు పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. మంకు చేస్తున్నడు. కొంచెం మీరైనా చెప్పండి, మీమాట వింటడు” అప్పుడే బయట్నుంచి వొచ్చిన అతనికి ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పింది. పిల్లవాడు గుమ్మంలో కూర్చునున్నాడు. ఆమె చేతిలో ప్లేటు పట్టుకుని ఉంది. అతడు వినిపించనట్టే గది తాళం తీశాడు. పిల్లాడితో ఏమీ చెప్పలేదు. కానీ రెండుక్షణాలు వాడి ముఖంలోకి సూటిగా చూశాడు. ఆ మాత్రానికే వాడేం గ్రహించాడో గాని చటుక్కున లేచి తల్లి చేతిలోని ప్లేటు తీసుకొని మౌనంగా తినసాగాడు.

అదిచూసి కోమలి సంబరపడితే, అతడు ఆశ్చర్యపోయాడు. తన చూపుని వాడు అంతలా మన్నించడం చిత్రమనిపించింది.

కోమలీ, అతడూ పలుమార్లు గుమ్మాల ముందో మెట్లదగ్గరో తారసపడతారు. ఆమె పలకరిస్తే అతడు మౌనం వహిస్తాడు. అయినా ఊరుకోకుండా ఆ రోజు విశేషాలన్నీ ఏకరువు పెడుతుంది. కాస్సేపు తలొంచుకొని విని అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు. ఎన్నిసార్లయినా ఆమెదే చొరవ. అది కలివిడితనమో, స్నేహమో కావొచ్చు. లేదా అంతకు మించి కూడా కావొచ్చు. ఏమైనా అతని ముందు ఆమె ఆనందంతో కనిపిస్తుంది.     

కోమలి బిగ్గరగా నవ్వడం ఉండదు. ఎప్పుడూ చిన్నగా మందహాసం. కళ్లు ఆప్యాయత కురుస్తాయి. మాట్లాడుతుంటే దగ్గరితనం కనిపిస్తుంది. అతనిపట్ల అతి చొరవ, మితిమీరిన భావోద్వేగాలెప్పుడూ ప్రదర్శించదు. అందుకే ఎన్నిరోజులైనా వాళ్ళ పరిచయం అంతే ఉండిపోయింది.

ఆమె దినచర్య పద్ధతిగా ఉంటుంది. పొద్దున్నే ఇంటి పనులన్నీ పూర్తిచేస్తుంది. కొడుకుని స్కూలుకి రెడీ చేసి, వాడిని పంపించేందుకు తనూ బయలుదేరుతుంది. రావొద్దని వాడు వారిస్తున్నాసరే, వీధి చివరిదాకా వెళ్ళి తిరిగొస్తుంది. అలాంటి సందర్భంలో అతడుగానీ ఎదురైతే ఒకింత సిగ్గుపడి “వాడి వెంట స్కూలుకు రావొద్దని గొడవ చేస్తాడు. స్నేహితులతో కలిసి వెళ్ళడమే  వానికిష్టం” అంటుంది.

నిజానికి కోమలి మాటలకి సహజంగానే అతడేదైనా స్పందించాలి.“ఫరవాలేదు, ఫ్రెండ్స్ ఉన్నారుగా వెళతాడులే” అని అనొచ్చు. కానీ కనీసం ముఖంలో చిరునవ్వయినా లేకుండా ఉంటాడు. అతడు మౌనంగా వుంటే కోమలి మరో అంశాన్ని ప్రస్తావిస్తుంది.

ఇక తప్పేట్టులేదనుకుంటే “ఊ” కొడుతూ చిన్నగా తలూపుతాడు.

ఆమె చొరవ అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. తెలియకుండానే ఏదో సందర్భంలో భాగస్వామి అవుతాడు.

ఓరోజు సాయంత్రం మార్కెట్లో కలిసిందామె. అప్పటికే ఏవో చాలా కొన్నది.

“వారంలో ఒక్కసారే మార్కెట్ కొస్తాను. అవసరమైనవన్ని అప్పుడే కొనేస్తాను” అంది. రెండుచేతుల్లో రెండు బ్యాగులు పట్టుకొని చిన్నగా నడుస్తూ మాట్లాతుంది. ఆమె పక్కన నిప్పులమీద నడిచినట్టు బిగపట్టి అడుగులేశాడు.   

“అట్లున్నరేంటి, ఒంట్లో బాగలేదా?” అడిగింది.

“అదేం లేదు. ఈరోజు బాగా అలసిపోయాను, కొంచెం తలనొప్పి అంతే…” 

“టాబ్లెట్ కొనుక్కొని వేసుకొండి. ఇంటికి పోయాక వేడిగా టీ పెట్టిస్తా”

“ఫర్వాలేదులే, తగ్గిపోతుంది”

ఆమెతో అట్లా నడవడం అతనికి ఇబ్బందిగా అనిపించింది. ఎవరన్నా చూస్తారని కాదు, ఎందుకో తనకే అతనికే తెలియదు.  

“నా వాగుడుతో ఇబ్బంది పెడుతున్న గదా?” అంది.

“అదేం లేదు.”

“మీరెప్పుడూ ముభావంగ ఉంటారు. ఎవరితోనూ మాట్లాడరు ఎందుకని?”

“ఏమో.. చిన్నప్పట్నుంచి నేనంతే..”

కోమలి చిన్నగా నవ్వింది. మనోహరమైన నవ్వు. గుడిగోపురం మీద పావురాలు ఎగిరినట్టు. అతడు ముగ్ధుడై చూశాడు.   

“మీకు ఆఫీసులో పని వొత్తిడి ఎక్కువనుకుంటా. అదే ధ్యాసలో టెన్షన్ పడుతారు.. అవునా?”

అతడు మాట్లాడలేదు. తనకు స్థిరంగా ఒక ఆఫీసంటూ లేదని, టెన్షన్ పడే అవకాశం కూడా ఉండదని చెప్పలేకపోయాడు.

ఇబ్బంది నుంచి బయటపడేందుకు ఏదో గుర్తొచ్చినట్టు హఠాత్తుగా పక్కసందులోకి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు. 

అతడు డ్యూటీ నుంచి వొచ్చాడంటే గదిలోనే వుంటాడు. ఎప్పుడూ రేడియోలో పాటలు వినిపిస్తాయి. పాత సినిమా పాటలంటే అతనికి ఇష్టమని ఇట్టే తెలిసిపోతుంది. చిన్న గాజుకుండీ ఆక్వేరియంలో చేపపిల్లలకి ఇష్టంగా దాణా వేస్తుంటాడు. బుద్ధిపుడితే కొద్దిసేపు చెస్ బోర్డు ముందు కూర్చుని ఇరువైపులా తనే పావులు కదుపుతాడు. ఇంకా టైము దొరికితే బొమ్మలు గీస్తాడు. మూడ్ బాగాలేదనిపిస్తే బాటిల్ తెరిచి పెగ్గేస్తాడు. మూడ్ కొద్దికొద్దిగా బాగైతే పెగ్గు మీద పెగ్గు లాగించి బాటిల్ ఖాళీ చేసేస్తాడు.

ఇక అక్కణ్ణుంచి మనసు గుర్రమెక్కి స్వారీ చేస్తుంది. ఉత్సాహంగా రేడియోలో గాయకుని గొంతుతో శృతి కలుపుతాడు. మామూలుగా బయట పొడిపొడి మాటలు పలికే అతని స్వరం అప్పుడు గాయకుణ్ణి ఓవర్టేక్ చేస్తూ పెద్దగా వినిపిస్తుంది.

కమ్యూనిటీలో అందరూ నిద్రపోయిన వేళ వాకిట్లోకొచ్చి కాస్సేపు పచార్లు చేస్తాడు. తలపైకెత్తి ఆకాశంలో చుక్కల్నీ, వెన్నముద్ద లాంటి చందమామనూ ఎప్పుడూ చూడాలనుకోడు. అతనికా ధ్యాసుండదు. పోగొట్టుకున్న వస్తువేదో వెతుకుతున్నట్టు కిందికి చూస్తూ అడుగులేస్తాడు. విసుగుపుట్టగానే గదిలో కొచ్చి పడుకుంటాడు.

నిద్రలో అతడో కల గంటాడు. చిత్రంగా తరచూ అదే స్వప్నం. కలలో అతడు తనలా ఉండడు. వయసు బాగా తగ్గిపోయి ఇరవైయేళ్ల అందమైన యువకుడవుతాడు. హఠాత్తుగా ఒక జత విశాలనేత్రాలు తనని వెంటాడుతూ వొస్తాయి. దేవకన్య లాంటి ఒక సౌందర్యరాశి తనకు సమీపం లోంచి వయ్యారంగా నడిచిపోతుంది. అతడామెకు ఆయస్కాంతానికి అతుక్కున్న ఖనిజమైపోతాడు.

మోహపరవశుడై ఆమెకు సన్నిహితంగా వెళ్ళి మనసులోని ప్రేమను వ్యక్తం చెయ్యాలనుకుంటాడు. ఆమెతో కలిసుంటే జీవితం కొత్తగా కనిపిస్తుందని, ఏనాడో తనలో అంతరించిన ఆత్మవిశ్వాసం తిరిగి పుట్టుకొస్తుందని భావిస్తాడు. ఆ స్త్రీమూర్తిని అతి దగ్గరగా స్పష్టంగా చూడాలని ప్రయత్నిస్తాడు. ఇంతలోనే వీచిన గాలితెరకు పైటచెంగు ఎగిరి ఆమె ముఖాన్ని కప్పేస్తుంది. చివరికి తనే స్వయంగా దగ్గరై  విచిత్రంగా అతనిలో లీనమవుతుంది. అక్కడితో నిద్రాభంగమై లేచి కూర్చుంటాడు.

‘ఎవరా సౌందర్యమూర్తి? పదేపదే కలలోకి ఎందుకొస్తోంది? ఆమెపై ఏమిటీ ఆకర్షణ? స్వప్నంలోనూ మనసులో మాట చెప్పలేక పోయాడెందుకు? తనలోని తక్కువభావం వల్లనా? లేక ఆమె ముందు వెలవెలపోతానన్న భయంతోనా?

తనే ఆడపిల్లకూ ఛాయిస్ కాడని అతనికి తెలుసు. తనకే ప్రత్యేకతా లేదని కూడా తెలుసు. కానీ ఆమె ఎవరు? పదేపదే కలలో కొచ్చి ఎంతో  దగ్గర మనిషిలా తనలో ఎందుకు కలిసిపోతుంది?

కలగన్న ప్రతిసారీ ఉలికిపాటుతో లేస్తాడు. ఆమెతో అనుబంధం దగ్గరకూ దూరానికీ మధ్య ఊగిసలాడుతుంది. మనసు కొత్త ఊహల్లో తేలియాడుతుంది. గుండెగదిలో సువాసనల ఆనవాళ్ళు గుభాళిస్తయి.

ఒక ఆదివారం కోమలికి డ్యూటీ లేదు. అతనూ ఇంట్లోనే ఉన్నాడు. మెల్లగా వొచ్చి గడప ముందు కూర్చొని శ్రద్ధగా తలకి నూనె రాసుకుంటూ “బాగా బిజీలో ఉన్నట్టున్నరు అవునా?” అంది పలుకరింపుగా.

లోపల పెయింటింగ్ వేసుకోవడంలో లీనమై ఉన్న అతడు విన్నాడు. కానీ జవాబివ్వలేదు. కనీసం తలెత్తి చూడలేదు. మధ్యలో ఓసారి పని ఆపేసి చాలాసేపు గట్టిగా దగ్గాడు.  

“మీరు ఇంట్లో ఆఫీసు పనేందుకు చేస్తారు? సెలవురోజు రెస్టు తీస్కోవొచ్చు గద”

“ఊ” అన్నాడు చిన్నగా ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.    

“మీ పనికి అడ్డొస్తుస్తున్ననా ఏంది..?” అంది అప్పుడే గుర్తొచ్చినట్టు.

“అదేం లేదు” అన్నాడు. మళ్ళీ దగ్గుతెర వొచ్చింది.  

“బాగా నీరసంగ కన్పిస్తున్నరు. పైగా దగ్గుతున్నరు. రెస్టు తీసుకోండి”

“ఏం లేదు.. కొద్దిగా జ్వరం”

“అయ్యో.. డాక్టరుకు చూపించుకుంటే మంచిది. పోదాం పదండి.. నేనూ వస్తా”

“వొద్దొద్దు.. టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోతుందిలే”

ఆమె కొంచెం ముందుకు వొంగి గదిలోకి చూసింది. అతడు ఏకాగ్రతతో పనిచేసుకుంటున్నాడు.    

“ఛాయ్ తాగుతారా.. చేసుకొస్తాను”

“వొద్దొద్దు.. అవసరం లేదు”

“నా ముచ్చట్లతో మీ పని చెడగొడుతున్ననా? అయితే వెళ్ళిపోతా” అంది. కానీ కూర్చున్నచోటు నుంచి లేవలేదు. వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు. పొడవాటి జుట్టును తాపీగా దువ్వెనతో దువ్వుతూ చిక్కులు తీసుకుంటోంది.  

“ఉండండి.. ఫరవాలేదు” అన్నాడు చిన్నగా.

అతడామాట చెప్పగానే గలగలా మాట్లాడసాగింది. తన పుట్టినూరు, ప్రేమించి పెళ్లిచేసుకోవడం, మొగుడితో కలిసి పట్నం రావడం.

అతడు మధ్యలో అడ్డుపడి “మీ ఆయన ఎక్కడుంటాడు? ఎప్పుడూ కనిపించలేదే?” అన్నాడు.  

కోమలి కాస్సేపు మౌనంగా ఉండి తర్వాత అంది “ఆయన లేడు, చనిపోయి చాలా కాలమైంది.” 

“అయ్యో.. ఆదెట్లా?”

“నాకైతే ఇప్పటికీ తెల్వది. కరెంటు శాఖలో హెల్పర్ పనిచేసేటోడు. ఎప్పుడూ ఫీల్డు మీద పని. ఒకరోజు మామూలుగనే డ్యూటీకి పోయిండు. వెళ్ళిన గంటసేపట్లనే వార్తొచ్చింది. ఆయన కరెంటు స్తంభం మీద పనిచేస్తూ కిందపడ్డడు”

“అయ్యో పాపం.. ఎట్లా జరిగింది?”

“ఆయనేమీ జారిపడలేదు. కరెంట్ షాక్ కొట్టింది. పోల్ మీద పనిచేస్తుంటే ఎవరో చూసుకోకుండా లైను ఆన్ చేసిండ్రు. అంతెత్తు నుంచి కింద బండరాళ్ళ మీద పడ్డడు. ఆసుపత్రికి తీసుకొని పోయారని చెపితే అక్కడికి పరుగెత్తిన. కానీ అప్పటికే పాణం పోయింది” చెమర్చిన కళ్ళను చీరచెంగుతో తుడుచుకుంది.

“ఇది జరిగి ఎంతకాలమైంది” ప్రశ్నించి అతడాశ్చర్యపోయాడు, తనేమిటి ఇంత చొరవగా ప్రశ్నలేస్తున్నాడు?

“నాలుగేళ్ళయింది. అప్పట్నించి ఒక్కదాన్నే పిల్లోడితో బతుకుతున్న. ఆయన ఉద్యోగం నాకొచ్చింది. అంటే నేను పెద్దగ చదువుకోలేదు గనుక ఆఫీసులో అటెండరు నౌకరీ”

అతనికి మళ్ళీ తీవ్రమైన దగ్గుతెర వొచ్చి బొమ్మ గీయడం ఆపేశాడు. ఆయాసంతో లేచివెళ్ళి నీళ్లు ముంచుకొని తాగాడు.

“అయ్యో.. మంచినీళ్లు నేనిచ్చేదాన్ని కదా” నొచ్చుకుందామె.

“ఫరవాలేదు” వొచ్చి కూర్చున్నాడు.“మీకెవరూ లేరా? మీ పుట్టింటివాళ్ళు, మీ భర్త తరఫు వాళ్ళు, ఇంకా బంధువులు?” అడిగాడు.  

“నా పెనిమిటికి అమ్మ, నాయన లేరు. మాది కులాంతర పెండ్లి. పెద్దోళ్లకు ఇష్టం లేకుండే. అందుకే ఇద్దరం లేచిపోయి పెండ్లి చేసుకున్నం. మమ్మల్ని ఊర్లోకి రానివ్వరని తెలిసి మేమెప్పుడూ అటువైపు పోలేదు. ఇన్నేండ్లలో మాదగ్గరికి కూడ ఎవ్వరు రాలేదు. మా ఆయనకు దోస్తులు కూడ పెద్దగా లేరు” చెప్పడం ముగించి లేచి నిలబడింది. అప్పటికి ఆమె తల దువ్వుకోవడం పూర్తయింది. పొడవాటి జుట్టు. రబ్బరు బాండు బిగించి వొదిలేసింది.

రోజూ ఆమెని చూస్తూనే ఉన్నా ఈ రోజెందుకో అతనికి కొత్తగా కనిపించింది. తెల్లగా, కొంచెం బొద్దుగా, కానీ ఆరోగ్యంగా. చైతన్యం తొణికిసలాడుతూ ఆకర్షించింది. ఆమె ఉనికి అతన్నెప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. అంతేకాదు, ఆమెను మరెక్కడో కొత్తకొత్త రూపాల్లో చూసినట్టూ, సన్నిహితమైనట్టూ భావన కలుగుతుంది. కానీ ఎక్కడో గుర్తుకు రాదు.

***

ఆ రోజు మామూలుగానే కమ్యూనిటీలో అంతా ఎవరి పనులమీద వారు పోయారు.

ఉదయం ఎనిమిదప్పుడు అతడూ వెళ్లిపోయాడు. సాయంత్రం ఆరింటికల్లా కోమలి ఆఫీసు నుంచి తిరిగొచ్చింది. కానీ రాత్రి తొమ్మిది దాటినా అతడు రాలేదు. ఎక్కడికెళ్లాడో తెలియదు. ఇదో విషయం కాదు గనుక ఎవరూ పట్టించుకోలేదు. కానీ కోమలి పట్టించుకుంది. అర్ధరాత్రి వరకు ఆందోళనగా ఎదురుచూసింది.

ఆ రాత్రే కాదు, తర్వాత నాలుగు రోజులైనా అతని జాడలేదు. ‘వాళ్ళ ఊరికి పోయాడేమో. ఏదైనా అర్జంటేమో. కానీ తనతో ఒక్కమాట చెప్పలేదే..? చెపితే ఈ దిగులుండేది కాదు’ అనుకుంది. కానీ అతనెవరు? నేనెవరు? నాకెందుకు చెప్పిపోవాలన్న ఆలోచన ఆమెకు రాలేదు.

వారం రోజులు గడిచాయి. ఒకనాడు పొద్దునే కమ్యూనిటీ యజమాని ఊడిపడ్డాడు. వొస్తూనే అందరికి ఓ పిడుగులాంటి వార్త చెప్పాడు.

అతడు కరోనాతో పోరాడుతూ ఆస్పత్రిలో కన్నుమూశాడు.

విషయం విన్నవాళ్ళంతా నివ్వెరపోయారు. సానుభూతి వ్యక్తం చేశారు.

ఓనరు చెప్పసాగాడు “వారం క్రితం దగ్గు, తీవ్రంగా జ్వరమూ వుంటే వెళ్ళి పరీక్ష చేయించుకున్నాడు. కోవిడ్ సోకిందని తేలగానే ఆస్పత్రిలో చేరిపోయాడు. ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు. చెప్పడానికి అతనికి ఎవరూ లేరు. అనాథ, పాపం అనాథగానే చచ్చిపోయాడు. దిక్కులేని కోవిడ్ మృతుల జాబితాలో చేర్చబడి సామూహిక అంత్యక్రియల్లో కాలిపోయాడు.”

సగటు జీవులు నివాసముండే ఆ కమ్యూనిటీ, అతి సామాన్యుడైన అతడి అకాల మరణానికి ఎంతగానో చింతించింది. ఎవరి ప్రేమకూ నోచని, ఎవరినీ ఆకర్షించలేని నడివయసు ఒంటరి బ్యాచిలర్ ఒక అనామకుడిలా రాలిపోవడం అందర్నీ కలచివేసింది. అంతా అతని మంచితనాన్ని గుర్తుచేసుకుని బాధపడ్డారు. కమ్యూనిటీ ఓనరు అందరి సమక్షంలో అతని గది తలుపులు తెరిపించాడు. అందరూ ఆసక్తిగా లోపలికెళ్లారు. పక్క వాటా లోంచి కోమలి బయటికొచ్చింది. ఆమె దుఃఖించిన ఛాయలు లేవు. ఆంతరంగంలో సంఘర్షణ ఏదైనా ఉంటే అది బయటికి వ్యక్తం కానివ్వలేదు. కళ్ళుమాత్రం ఎర్రబడి ఉన్నయి. మొదటిసారి అతని గదిలోకి అడుగుపెట్టింది.

లోపల వస్తువులన్నీ ఒక పద్ధతి లేకుండా పడిఉన్నయి. రోజుల తరబడి శుభ్రం చేయనట్టు పేరుకపోయిన దుమ్ము. గోడలకు చిక్కులు చిక్కులుగా వేలాడుతున్న బూజు. అంతా అదే కమ్యూనిటీలో కలిసి ఉంటున్నా ఎవరూ అతని గదికొచ్చిన సందర్భం లేదు. అతడెవరికీ అంత చనువు ఇవ్వలేదు. గదిలో ఒక మూలన కొన్ని వంటపాత్రలు బోర్లించి ఉన్నయి. కడగాల్సిన పాత్రలు మరికొన్ని గచ్చులో పడిఉన్నయి. చిన్న నవారు మంచం. పక్కనే దండెం మీద బట్టలు బరువుగా వేలాడుతున్నయి. ఇంకొన్ని కింద చిందరవందరగా పడిఉన్నయి. సరైన నిర్వహణ లేక గది ముక్కవాసన వేస్తోంది. తలుపుకు ఎడమపక్క చిన్న స్టూలు మీద గాజుకుండి ఆక్వేరియం. అందులో కొన్ని రోజులుగా ఆహారం లేక బలహీనంగా కదిలే చేపపిల్లలు. గదిలో టీవీ లాంటిది లేదు. చిన్న ట్రాన్సిస్టర్ కనిపించింది. పక్కనే చదరంగం బోర్డులో అమర్చిపెట్టిన పావులు. ఒకవైపు గోడకు ఫ్రేమ్ కట్టిన రెండు పెయింటింగ్స్, మరికొన్ని స్వయంగా చిత్రించిన బొమ్మలు టేపుతో అంటించబడి ఉన్నయి.

దండెం మీద వేలాడుతున్న బట్టల వెనుకనుంచి కనిపించిన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది.

అవతల గదికి, అతని గదికి మధ్య గోడలో ఏర్పాటు చేసిన నిలువెత్తు ద్వారం. ప్రస్తుతం దాని తలుపులు మూసి ఉన్నయి.

ఇంటి ఓనరుతో సహా అందరూ దిగ్భ్రాంతిగా చూస్తుండి పోయారు. రెండు పోర్షన్ల మధ్య గోడలో ఎవరికీ తెలియకుండా నిర్మించుకున్న దర్వాజ. రహస్యంగా ఏర్పాటు చేసుకున్నాడా? ఎందుకోసం? దర్వాజ తలుపులు కూడా మామూలువి కావు. ఎంతో అందంగా నగిషీలు చెక్కి చక్కటి డిజైన్లతో ఉన్నయి. దర్వాజ తలుపులు మూసి గొళ్ళెంపెట్టి ఉంది.

కాస్సేపటికి ఆ దర్వాజ అంతరార్థం బోధపడి నోళ్ళు తెరిచారు.

గోడలో నిర్మించబడిన ద్వారం వైపే కోమలి గుడ్లప్పగించి చూస్తుండి పోయింది.  

“ఇదన్నమాట అసలు రహస్యం” ఒకతను పైకే అన్నాడు.

“ఎప్పటినుంచి సాగుతుందో ఈ భాగోతం” గొణిగినట్టు మరొకరు.

“బయట పొడిపొడిగా మాట్లాడుకునే వీళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం. రెండు పోర్షన్ల మధ్య తలుపు ఏర్పాటు చేసుకొని గుట్టుగా రంకు సాగిస్తున్నారు. వీళ్ళ అసలు రంగు ఇదన్నమాట” ఎవరో గట్టిగా అన్నారు.

అకాల మరణం పొందిన అతని మీద అప్పటివరకూ వాళ్లకున్న సానుభూతి, గౌరవం తొలగిపోయినయి.  

ఇంటి యజమాని కోమలిని తీక్షణంగా చూస్తూ “ఈ సిగ్గులేని పనేందమ్మా? ఇష్టమైతే ఇద్దరూ పెళ్లి చేసుకుంటే పోయేదిగా.. ఎవరొద్దన్నారు? అంతా సంతోషించేవాళ్ళం. అలా కాకుండా రెండు పోర్షన్ల నడుమ తలుపు పెట్టుకొని గుట్టుగా నీతిమాలిన పని చేస్తున్నారా?” అన్నాడు.

కోమలి మౌనంగా తలదించుకుంది. జరుగుతున్న అవమానానికి అక్కడే భూమిలో కుంగిపోతే బాగుండనుకుంది.

అక్కడ తలా ఒక మాట అంటున్నారు. అందరికి ఆమెనే కేంద్ర బిందువైంది.

ఈలోగా ఒకతను గోడ వద్దకు వెళ్ళి తలుపు తెరవబోయాడు. మరుక్షణం షాక్ తగిలినట్టు అడుగు వెనక్కివేసి విభ్రాంతితో నిలబడిపోయాడు.

అతనేకాదు, చూసిన వాళ్ళంతా శిలావిగ్రహాలే అయ్యారు. నిజానికి అక్కడ గోడలో ఎలాంటి ద్వారం లేదు. తలుపులూ, గొళ్ళెమూ లేదు. అది అచ్చంగా దర్వాజను పోలిన నిలువెత్తు పెయింటింగ్. గొప్ప ప్రతిభతో గీయబడి అచ్చం దర్వాజలా భ్రమింపజేస్తోంది.

గోడమీది చిత్రం అంతరార్థం బోధపడి అందరి మనసులు సానుభూతితో బరువెక్కినయి.

గోడకు అవతలి వైపున కోమలిపై అతడు పెంచుకున్న ఆరాధన. మనసులో ఆమెని ప్రతిష్టించుకొని, ఊహల్లో ఆమెతో జీవితాన్ని పంచుకున్న  వైనం. ఆమె ఎదురుగా వెల్లడి కాలేక, తన ప్రేమని గుండెలోనే దాచుకున్న స్థితి.

రెండు పోర్షన్ల నడుమ ఒక ద్వారాన్ని సృష్టించుకొని తద్వారా రెంటినీ ఒకే కుటుంబంగా చేసుకున్నాడు. అతడామెను తన జీవిత భాగస్వామిగా భావించుకొని, ఆ భావనతో సంతృప్తి చెందినట్టు తెలిసిపోతుంది.  

అతని ఆంతరంగ చిత్రం కోమలికి అర్థమై పిచ్చిదానిలా గోడమీది బొమ్మనే చూడసాగింది. మనసులో ఎగిసిపడిన అలజడి ఆమె ముఖంలో వ్యక్తమైంది. గుండెను మెలితిప్పే బాధతో విలవిల్లాడుతూ నేలపై కుప్పకూలింది. రెండు చేతుల్లో ముఖం కప్పుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆమె ఆవేదన కన్నీళ్లతో కలగలిసి చేతివేళ్ళ గుండా ప్రవహించింది.

డాక్టర్.ఎ. ఎం. అయోధ్యా రెడ్డి

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. నలభై యేళ్లుగా హైదరాబాదులో నివాసం. పొలిటికల్ సైన్సులో ఎమ్మె, పిహెచ్.డి చేశారు.1983లో పత్రికా రంగంలో ప్రవేశించారు. ‘ఉదయం’ దినపత్రికలో సబ్ ఎడిటరుగా మొదలైన జర్నలిస్టు ప్రయాణం, మూడున్నర దశాబ్దాలు కొనసాగి ‘దక్కన్ క్రానికల్’ సంస్థలో న్యూస్ ఎడిటరుగా పదవీ విరమణ.
పఠనాభిలాశ తనకు ఆకలి కంటే తీవ్రమైందని చెప్పుకునే వీరు, స్కూలు రోజుల్నుంచీ పుస్తక పఠనం పట్ల ప్రాణంగా ఉన్నారు. సాహిత్యం విస్తృతంగా చదివారు. కాలేజీ రోజుల్లోనే రచన చేపట్టి కథా, అనువాద సృజన చేస్తున్నారు. ఇప్పటివరకు70కి పైగా కథలు, ఒక నవల రాశారు. 50 వరకు వివిధ దేశాల ఉత్తమ కథలను, ఒక ఆఫ్రికన్ నవలను అనువదించారు.
‘సమకాలీన రాజకీయాలు తెలుగు సాహిత్యం’ అనే వ్యాస గ్రంథం; ‘ఆహారయాత్ర’, ‘అక్కన్నపేట రైల్వేస్టేషన్’, ‘సీతంబాయి పొలం’ అనే మూడు కథా సంపుటాలు తెచ్చారు. సుప్రసిద్ధ ఆఫ్రికన్ రచయిత గుగివా థియాంగో రాసిన ‘వీప్ నాట్ ఛైల్డ్’ నవలను ‘ఏడవకు బిడ్డా’ పేరుతో అనువదించి వెలువరించారు. ప్రపంచ దిగ్గజ రచయితల ఇరవై క్లాసిక్ కథల అనువాద సంపుటి ‘కథాసంగమం’ అన్విక్షికి ప్రచురించింది. అరబిక్ దేశాలకు చెందిన 20 ఉత్తమ కథల అనువాద సంపుటి “అరబ్ షాట్స్” ప్రస్తుతం ప్రచురణ దశలో ఉంది.
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, సాహితిగౌతమి అవార్డు, పాకాల యశోదారెడ్డి, మాడభూషి రంగాచార్య, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ తదితర పురస్కారాలు పొందారు.


Spread the love

5 thoughts on “రెండు స్వప్నాల మద్య గోడ

  1. ‘ రెండు స్వప్నాల నడుమ గోడ‘ అంతర్మఖుని అంతరంగ వేదన. రోజూ మనకు ఎదురయ్యే పాత్రలే కళ్ళ ముందు నిలబడి కథ చెప్పాయి. అతని, కోమలి తన అక్షర విన్యాసంతో సజీవం చేశారు రచయిత.
    గోడ కనబడగానే నేనూ… తడబడ్డా. కానీ ముగింపు వాక్యాలతో ఎడ చెమ్మ బయటకు వచ్చింది. అభినందనలు సార్

  2. కథ ఎంత కదిలించేసిందో చెప్పలేను!

    అందుకే కథనం, వాక్యాలపై నేను ౘదువుతూ అల్లుకున్న పలుకులను ఇక్కడ ప్రకటింౘ లేక పోతున్నాను.

    వందనములార్యా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *