హెచ్చరిక

Spread the love

మేఘాల నీడ తప్ప
రాకెట్ బాంబుల కౌగిలి వద్దు

కిరణాల కరచాలనం తప్ప
బుల్లెట్ల స్పర్శలు వద్దు

వర్షాల తోడు తప్ప
మిలిటరీ మార్చ్ లు వద్దు

ఎంత చెప్పినా వినరేమి
అడవికి కావాల్సింది
విషపూరిత రాజకీయాలు కాదు
డాంబార్ నిండిన భూమి కాదు
సిమెంటు నిండిన గాలి కాదు
కాంక్రీట్ జలపాతాలు కానేకాదు
సూర్యచంద్రుల కాంతులు చాలు
మానవుల ప్రేమలు చాలు
మట్టి మనుషులు కొందరైనా చాలు

నదీ జలాలతో
ఏనుగు తొండాలతో
బుల్డోజర్లు గెలవలేవు
పక్షులు విలపిస్తే
నీ కుర్చీ విరిగిపోక తప్పదు
జింక పిల్లలు హృద్ఘోషతో గెంతులాడితే
నీ రాజ భవనాలకు భూకంపం తప్పదు
జిరాఫీలు తల తిప్పితే
నీ అద్దాల మేడలు అరక్షణంలో పటాపంచలు

నాగులను నాగాజాతి ప్రాణులను హింసిస్తే
ఎంతటి నవాబులకైనా
ఊపిరి దొరకదు.
నెమలి నాట్యానికి నీ హస్తాలు అడ్డుపడితే
చెట్టు వేర్లు
నీ గొంతుకు చుట్టబడతాయి జాగ్రత్త!
దొంతం చరణ్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *