తోడబుట్టిన తోడు

Spread the love

రాములు పెళ్లి కుదిరి రెండు రోజులన్న కాలేదు. పిల్లోళ్ళు వచ్చి పప్పున్నం తిని పోయినప్పటి నుంచి రాములు లేవలేకుండ పడిండు. లేకలేక పెళ్లి కుదిరింది  అని ఇల్లంతా సంబురపడేలోపే రాములు రెండు రోజులసంది  లేవకుండ పడేటాలకు లచ్చిందేవికి ఎక్కడ తోయకుండ అయ్యింది.   “ఏందీ గీ జెరం,  రాత్రి పూట పట్టి పగలు ఇడుస్తుంది. ఎన్నడూ లేనిది కాళ్ళు చేతులు కప్పుల్లాగ ఉబ్బినయి. ” అని బాధపడుకుంటనే ఊర్లో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ కు చూపించింది. ‘ ఏం కాదు భయపడుకుండ్రి ‘ అని అప్పటిమందం రెండు సూదులిచ్చి, కొన్ని గోళీలిచ్చిండు. జెరం తగ్గింది గానీ కాళ్ళుచేతుల వాపు తగ్గలేదు.

”  ఏం సంబంధమో సంబంధం పాడుగానీ, ఈ పెళ్ళి కుదిరినప్పటి నుంచి పిలగాడు హలతు లేకుండా  ఇట్లా పడిపోయిండు.బిడ్డొచ్చిన యాల్ల, గొడ్డొచ్చిన యాల్ల అని ఊకనే అనలేదు గదా ‘ అని చుట్టుప్రక్కలోళ్ళు వచ్చి చూసిపోతు అనుకుంటున్నరు. మంచి దేవుని దగ్గరకు తీసుకొని పోమ్మని సలహా ఇచ్చిండ్రు. ఆటో మాట్లాడుకొని దేవుని దగ్గరకు తీసుకొని పోయింది లచ్చిందేవి.

పక్కూర్లో ప్రతి శుక్రారం ఒక ఆడమనిషి శిగమూగుతది. పెయ్యి మీదకు దేవుడొస్తడు. వారం వారం ఎల్లమ్మ దేవుని కొలుపు చెప్పుతది. అక్కడికి తీసుకొని పోతే దేవుడు ఏం చెప్పుతడో అని ఆ ఊరికి రాములును తీసుకొని పోయిండ్రు. ఐదు నిమ్మ కాయలను, ఐదు పాలకాయలను వెంట తీసుకపోయిండ్రు. ఆ దేవుని దగ్గరకు పోతే ఏదైనా నరదృష్టి ఉంటే పోతదని ప్రజల నమ్మకం.గాలి సోకినా ,  పెయ్యి మీద దెయ్యం ఉన్నా ఆమె దగ్గరకు పోతే ఆమె కొట్టె దెబ్బలకు దెంకపోతదని ఆ గుడికి వచ్చేటోలు చెప్పుకుంటరు. అమాస, పున్నాలు వస్తే ఆ గుడి దగ్గర లైను ఎంతో పెద్దగుంటది. సుట్టుముట్టు ఊరివాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో చెప్పించుకోవడానికి వస్తరు. సదువుకున్నోళ్ళు పెద్ద పెద్ద కార్లల్ల వచ్చి చేతులు జోడించి నిలబడుతారు.

తమ్ముడి చేయి పట్టుకొని దేవుడమ్మ ముందు కూర్చుంది లచ్చిందేవి. ఏం చెప్పుతదో అని ఊపిరి బిగపట్టుకోని వింటున్నది.

‘ తలె నిండ పెట్టుకొని బువ్వ తినే యాల్లకు బువ్వల మన్ను పోసినట్లు చేసిండ్రు. మీ తమ్ముడు అంటే గిట్టనోళ్ళే చేతబడి చేసిండ్రు. తినే బువ్వల గలిపి మందు పెట్టిండ్రు. నీ తమ్ముని కడుపుల మందు ఉంది. నేను చూసుకుంట  పొమ్మని ‘ నిమ్మకాయలు మంత్రించి చేతిల పెట్టింది దేవుడమ్మ. పసుపు బొట్టు నుదుటికి రాసింది. వీరగోల తోటి వీపు మీద మూడు సార్లు గట్టిగా సరిసింది. ఐదు వారాలు తిరిగితే అంత నయమైతని మల్ల వారం రమ్మని చెప్పింది .

మంత్రించిన నిమ్మకాయలను తీసుకొని లచ్చిందేవి, తమ్ముడు ఇద్దరు ఇంటి కొచ్చిండ్రు. తమ్ముడికి రోగం  నయం కావాలని లచ్చిందేవి కోటొక్క దేవునికి మొక్కుకుంది. మైసమ్మకు మేకపోతు కొస్తనని మొక్కుకుంది. సైదులు దేవుని దర్గా దగ్గర కందూరు చేస్తనని మొక్కుకుంది.
ఇంటికొచ్చినంక దేవుడు చెప్పినట్టు నిప్పుల మీద ఊదు చల్లి పొగేసింది. ఆ రోజు రాత్రి కొంచెం నిమ్మళంగా నిద్రపోయిండు రాములు.
•••
పూటపూటకు వాపులు పెరుగుతున్నయి గానీ తగ్గుత లేవు .
లచ్చిందేవి ఇంటిపక్కలున్న పటేలమ్మను పిలిచి చూపించింది.

‘ గద్దెకు పోతే సుద్దులు తక్కువనా?పిలగాడు లేవలేకుండ పడితే దేవుడు దయ్యమని తిప్పుతరేందే ? ముందు
మీ తమ్ముడిని మంచి దవఖానకు తీసుకుపొమ్మని’ రాములయ్యను  చూడడానికి వచ్చిన  పటేలమ్మ అన్నది.
లచ్చిందేవి మొగుడు అంజయ్యను తిట్టింది. ‘ వాళ్ళకంటే తెల్వదు, నీకైనా తెల్వదా అంజి ‘ అని గట్టిగనే చెప్పింది పటేలమ్మ.

పరిగిలో ఉన్న చిన్న దవఖానకు తీసుకొని పోయిండ్రు.
కాళ్ళు చేతులు వాచినయి అంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఏదైన పెద్ద హాస్పిటల్ తీసుకపొమ్మని అక్కడున్న డాక్టర్ చెప్పిండు. ‘ సీరియస్ గానే ఉంది, ఆలస్యం చేయోద్దని ‘ తెలిసిన కిడ్నీ  హాస్పిటల్ అడ్రస్ ఇచ్చిండు డాక్టర్ .

“ఏందో ఈ గాశారం పాడుగాను, మంచిగైతుండు. తాగుడు బంజేసిండు. నా తమ్ముడు ఓ ఇంటోడు అయితుండని అనుకున్నంతలనే ఇట్ల జరుగుతుందని మొగన్ని పట్టుకొని ఏడ్చింది లచ్చిందేవి.

” ఏంగాదే, ఏమయ్యింది చెప్పు ఇపుడు, ఎంత పెద్ద రోగమొచ్చినా  నయం చేసే పెద్ద పెద్ద మందులొచ్చినయి. భయపడకు’ అని ఊకుంచిండు లచ్చిందేవి మొగడు అంజయ్య.

‘ చిన్నగున్నపుడే మా అమ్మనాయిన సచ్చిపోయిండ్రు.
మేక సండ్లోలో ఇద్దరం మా అమ్మనాయినకు. ఎన్నడూ అక్కలాగ చూడలే. నా కడుపున పుట్టిన కొడుకులాగనే పెంచుకున్న. అమ్మయినా, నాయినైనా మా తమ్ముడే  నాకు . తోడబుట్టిన తోడు ఏడ దొరుతది ?  ఎంత ఖర్చు అయినా సరే మంచి దవఖానకు తీసుకపోదాం ‘  అని ఏడ్చుకుంటనే చెప్పింది లచ్చిందేవి.

అక్కకు తమ్ముడంటే పానం. తమ్మునికి అక్కంటే పానం.
లచ్చిందేవిని ఊర్లనే చూసి ఇచ్చిండ్రు. అంజయ్య వరుసకు బావైతడు. నెమ్మదస్తుడు. నాలుగు ఎకురాల భూమి, వంద గొర్లు ఉన్నయి. లచ్చిందేవి వాళ్ళ అమ్మనాయిన సచ్చిపోయినప్పటి నుంచి రాములు అక్క దగ్గరే పెరిగిండు. ఎంత కష్టం చేసినా ‘పటు అని చెయ్యికి పదిరూపాయలు ఇచ్చేటోడు కాదు’ . అయినా తమ్ముడు కండ్లముందట ఉంటే చాలనుకునేది. చూడనీక ఎర్రగ బుర్రగ బాగనే ఉంటుడు కానీ ఏం తెల్వదు . ఎవరైనా పనికి పిలిస్తే రెండు రెక్కలు ఇరిచి వస్తడు. వాళ్ళు పెట్టింది తింటడు. రాములు ఎద్దులాగా కష్టం చేస్తడు. చేసిన కష్టం చేసినట్టే  దోస్తులకు తినిపిస్తడు. తాగిస్తడు. ఊర్లే అంతా రాములు సొమ్ము తినేటోళ్ళే గానీ పెట్టెటోళ్ళు లేరు. మనసొచ్చిన రోజు ఏడనన్న మేకను కోస్తుంటే యేటకూర తెచ్చి వండమని అక్క చేతికిస్తడు. ఎన్నడు తమ్ముని సొమ్ముకు ఆశపడింది కాదు.
‘ఓ పనోడు అయితే వాని జీవితం బాగుపడుతదని, వానిల్లు నిలబడుతదని ‘ తండ్లాట. చిన్నప్పుడు ఒక దొర దగ్గర జీతం పెట్టింది. నెల, రెంన్నేళ్ళు చేసిండో లేదో జీతానికి పోనని మొండికేసిండు. ‘  ఏ పని సక్కని చేయడు. ఏ పొయ్యిల బూడిది పడనీయడనే ‘ పేరు  కొనుక్కొచ్చుకుండు. వీనితోటి ఇట్లా కాదని బావతో పాటు బోరుబండి మీదకు తోలింది. దాని మీద కూడా ఎక్కువ రోజులు పనిచెయ్యలే. చివరాఖరుకు తెలిసినోళ్ళ లారీ మీద క్లినర్ గా పనికి కుదిరిండు. నెలకో, రెండునెళ్ళకో  ఓసారి వచ్చి అక్కను చూసి పోయేది. ఓ ఇంటి పిల్లను తెచ్చి చేస్తే తాగుడు మానుతడని, కాపురం నిలవడుతదని ఓ సంబంధం మాట్లాడుకొచ్చిండ్రు. అంతల్నే ఇట్లా తమ్ముడు లేవలేకుండ పడిపోవడంతోటి మనిషి కాలేకపోతుంది లచ్చిందేవి.

పెయ్యి మీది సొమ్ములు కుదువబెట్టి అయినా పైసలు తెస్త  అని చెవులకున్న గెంటీలు చేతిల పెట్టింది.  ‘మొత్తం నేను చూసుకుంటలేవే, నాకు బామ్మర్ది గాడా ? ముందు గెంటీలు చెవులకు పెట్టుకోమ్మని’  అన్నడు. అంజయ్య తెలిసినోళ్ళకు ఫోన్ చేసి మాట్లాడిండు. పైసలు ఎంతైతవో అని ఇన్ని ఎక్కువ డబ్బులే సుదురాయించుకుండు. అదే రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ లో ఉన్న కిడ్ని దవఖానకు తీసుకొని పోయిండ్రు. కాళ్ళ వాపులతో పాటు పెయ్యి మీద మచ్చలు మచ్చలు ఎర్రగా . గ్లూకోజు పెట్టడానికి కూడా నరం  దొరుకుతలేనంతగా వాచినయి.

•••
అద్దమోలో మెరుస్తున్నది పట్నం దవాఖాన. పెషెంటును కూసోవెడితే పైస . నిలబెడితే పైస.  కంటితో చూస్తే పైస. చెయ్యితో ముట్టుకుంటే పైస.  ఈ పైసల దవఖానలన్ని పైసల్ని తిని బలుస్తున్నవా అన్నట్లు ఉన్నవి.

రాములును హాస్పిటల్ లో జెయిన్ చేసుకొని మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు చేసిండ్రు. తమ్ముడి రక్తం తీస్తుంటే అక్క పానం ఎల్లుక పోతున్నట్టు గిలగిల కొట్టుకుంటుంది. రిపోర్టులు వచ్చినంక డాక్టర్ దగ్గరకు తీసుకొని పోయిండ్రు.
‘ మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువ పోతున్నయి. ‘ అందుకే ఇట్లా అయిందని డాక్టర్ చెప్పిండు. రోజుకు నాలుగు గుడ్లు పెట్టమని చెప్పిండు. ‘ కిడ్నీలు రెండు బాగనే ఉన్నయి.కిడ్ని కి ఇన్ ఫెక్షన్ అయ్యింది. మందులు వాడితే తగ్గిపోతుంది. పది రోజులు ఇక్కడే ఉండాలని’ డాక్టర్ చెప్పిండు. తమ్ముడికి తాగొద్దని చెప్పమని డాక్టర్ కాళ్ళ మీద పడి దండం పెట్టింది.

‘ ఏం రాములు,  తాగుడు బంజేయ్యాలి. బంజేస్తవా ?’
బందు చేస్త సార్ .
‘ నీ కిడ్నీ పాడైయ్యింది. ఇట్లనే తాగితే ఎక్కువ రోజులు బతకవు.’
‘ సరే సార్ , ఏం తాగను’ .

ఏదడిగినా ఒక్క మాటలోనే చెబుతుండు తప్ప నోరు తెరిచి మాట్లాడుత లేడు. డాక్టరొచ్చి మాట్లాడిపోయినంక లచ్చిందేవి రెండు ముద్దలు కడుపునిండా తిన్నది.

మూడు రోజులకే లక్ష రూపాయలు చేతుల మీద మాయం అయినయి. పది రోజులు ఉండాలంటే పైసలెక్కువైతవని భయపడ్డరు. తెలిసినోళ్ళ తోటి ఫీజు మాట్లాడించారు గానీ అక్కడోళ్ళు ఎవరి మాట వింటలేరు. ‘ బెడ్ చార్టీ రోజుకు మూడు వేలు.  ఇష్టమయితే ఉంచండి. లేకపోతే తీసుపొమ్మన్నట్లు ముఖం మీద, తలుపేసినట్లు మాట్లాడింది ‘  నర్సు. సూదులకు, గ్లూకోజులకు, పరీక్షలకు కలిపి రోజుకు పది వేలకు పైనంగనే కావట్టె. ఇంకా వారం పది రోజులు ఇక్కడే ఉండాల్సిది వస్తదని చెప్పిండ్రు.

లచ్చిందేవి, అంజయ్య పక్కకొచ్చి నిలబడి మాట్లాడుకున్నరు.
గిన్ని పైసలు అయితవని లచ్చిందేవి అనుకోలే.
‘ గీ పైసలు కట్టుడు మనతోని గాదు. ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని పోదామని’  ఒక మాట మీది కొచ్చి పాణం నిమ్మలం చేసుకున్నరు.  ‘ చేసిన కష్టం చేసినట్టె కడుపుల పోసుకుండు. రెక్కల కష్టం బొక్కల పులుసు. ఇంత కష్టం చేసిండు అని పేరే గానీ ఒక్క పైస కూడబెట్టుకోలె.ఇట్లాంటి ఆపదొస్తే ఎవరైతరు? వానికెప్పుడు తెలిసొస్తదో ఏమో ‘ అని తమ్మునికి వినపడేట్లే లచ్చిందేవి మాట్లాడింది.

‘పానానికి ఏం ఆపద లేదు కదా, ఏడైనా గానీ గ్లూకోజులే ఎక్కిస్తరు కదా అని ‘ ఉస్మానియా దవాఖానకు తీసుకొని పోదామని అనుకున్నరు. అక్కడి నుంచి ఉస్మానియా దవాఖానకు తీసుకొని పోయిండ్రు.

అక్కడ కూడా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేసిండ్రు. కొన్ని
రిపోర్టులు రానీక రెండు రోజుల టైం పడుతదని చెప్పిండ్రు.
వాపులు తగ్గినయి . మునుపటి కంటే బాగా తిరుగుతుండు.

డాక్టర్ రాములు దగ్గరికొచ్చి నిలబడిండు. పక్కనే అంజయ్య, లచ్చిందేవి నిలబడ్డరు. రూంలకు రమ్మని చెప్పి పిలుచుక పోయిండు.

‘ రాములు ఏం పని చేస్తాడమ్మా  ‘
‘ లారీ మీద పోతడు సార్’
‘  తిరుగుడు అలవాటు ఉందా?’
” దారిన ఓ పండు కనబడితే, ఆకలితోటి తీసుకొని తినాలని అనుకునే పిచ్చోడు సార్ . పండు పుచ్చుపోయిందా? పురుగు పట్టిందా ? అని చూసుకొని తినాలని తెల్వని అమాయకుడు. తెలివిలేదు. మన్ను లేదు సారూ. “
మీ ఇంట్లో ఎవరికైనా ఎయిడ్స్ ఉందా?
‘ ఎవరికి లేదు సార్ ‘
“మీ తమ్ముడికి హెచ్ .ఐ . వి వచ్చిందమ్మా “

డాక్టర్ మాటలు వింటున్న లచ్చిందేవికి నెత్తి మీద పిడుగు పడినట్లు అయ్యింది.

” మీరు ఏ కాలంల ఉన్నరయ్యా? మీ  బామ్మర్థి ఏం చదువుకోలేదా? ఇంతనన్న తెలివి లేదు. ఒక్క సెఫ్టీ  వాడితే ఇంత జరుగకపోవుకదా. చూస్తే చిన్నోడిలాగనే ఉన్నడు.
చేతులార జీవితం పాడు చేసుకున్నడు. ఇక చేసేదేం లేదు, మందులు జాగ్రత్తగా వాడండి” అంజయ్య దిక్కు చూసుకుంట నిర్మోహమాటంగా ముఖం మీదనే మాట్లాడుకుంట బయటకు వెళ్ళిపోతుండు  డాక్టరు.

‘ ఆ దేవుడు మా ఎంబడే ఎందుకు పడుతుండో ‘ అని భోరున ఏడుస్తుంటే అక్కడున్న నర్సులు తిట్టిండ్రు. పెషెంటును పిలిచి
అంతా చెప్పిండ్రు. రాయోలో నిలవడ్డడు. డాక్టర్ తోటి అంజయ్య మాట్లాడుతుంటే లచ్చిందేవి పక్కనున్న కిటికీ పక్కనే నిలబడి ఆలోచనలో పడ్డది. గతాన్ని తలుచుకుంది.
” ఊర్ల ఇప్పటికే మమ్మల్ని చిన్నచూపు చూస్తరు. అమ్మ నాయినను  తాగుబోతోళ్ళు అని లోకం అంటుంటే చూసి చూడనట్టు బతికినం. గతిలేనోళ్ళు అంటే
బాధ కడుపుల దాసుకున్నం. దేవుడా ఈ నింద ఎట్ల మోయాలి అని కంటికి పుట్టెడు ఏడుస్తుంది.  ఈ విషయం లోకానికి తెలిస్తే ఎట్ల చూస్తరో అని తలుచుకుంటూనే వణుకుతుంది. “నేను, నా తమ్ముడు ఇంత మందు తాగి సస్తే బాగు. ఒకే సారి పాణం పోతదని ” కండ్లల్ల నీళ్ళు తీసుకుంట గోడకు ఒరిగింది.  ట్లాబ్లెట్లు వాడితే అందరిలాగనే మాములు మనిషిలాగ బతుకుతడని డాక్టర్ చెప్పె మాటలు ఏవీ లచ్చిందేవికి  వినబడుత లేవు. నెల నెల ఫించను కూడా వస్తదని ఒక డాక్టరమ్మ ఒక కాగితం తెచ్చి ఇచ్చింది. లచ్చిందేవి మనసు ఇక్కడ లేదు.

ధైర్యం చేసుకొని ‘ ఇంతకు ముందు దవాఖానల చూపెడితే మంచిగనే ఉందని చెప్పిండ్రు కదా సార్’  అన్నది.
‘ ఇప్పుడు బయటపడింది అమ్మా.ఎప్పుడైనా బయటపడొచ్చు ‘ అని డాక్టర్ చెప్పిండు. ‘ దసరా ఎల్లంగనే పెళ్ళి పెట్టుకున్నం సార్! పెళ్ళి చేయొచ్చున? ‘ అనడిగింది. ” ఈ రోగం గురించి చెప్పకుండా మాత్రం పెళ్ళి చేయకండి. ముందు మందులు ఎట్లా వాడాలో అది చూడండి. ” విసుగ్గానే డాక్టర్ మాట్లాడుకుంట పోయిండు.

డిశ్చార్జి అయినంక అందరు గూడ అంబులెన్సులో పోతున్నారు. డ్రైవర్ పక్కసీట్లో అంజయ్య కూసుండు.  వెనుక బెడ్డు మీద రాములు పడుకొని ఉండు. పక్కనే లచ్చిందేవి కూసుంది. అంబులెన్సు ఒక్కో ఊరును దాటుకుంట పోతుంది.

లచ్చిందేవి రాములు చేయి పట్టుకుంది. ప్రశాంతంగా కండ్లు మూసి ఉన్న తమ్ముడు  మోడులాగ కనబడిండు. ఎన్ని రోజులున్నా ఇట్లా ఒంటికొమ్మలాగనే బతకాలేమో అనుకుంట లోపలి నుంచి కురుస్తున్న దుఃఖాన్ని బయటకు కనబడకుండా దాచుకుంది.

“ఆకుకు పురుగు వడితే పురుగు మీద మందు చల్లాలేగానీ చెట్టును నరికేస్తామా?? అనుకుంది. “ఎన్ని కష్టాలను దాటి రాలేదు, ఇదొక కష్టం అనుకుంట’  అని గుండెను రాయి చేసుకుంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు. కొడుకులు లేరు.
వీణ్ణి నా కొడుకు లెక్క బ్రతికినన్ని రోజులు పెంచుకుంట’ అనుకొని ధైర్యం తెచ్చుకుంది.

‘ ఓ  కిడ్నీ ఖరాబైతే ఎట్లనో చేసి బతికించుకుందుము.
లివరు పాడైతే దగ్గుకుంటనో, మూలుగుకుంటనో బతుకు.
ఇదెక్కడి రోగము, ఎక్కడ తగిలిచ్చుకుండు దేవుడా ‘ అని నెత్తికి చేతులు పెట్టింది. ‘ రోజుకొక్క దాన్ని బైకు ఎనుక ఏసుకొని పోయేటోళ్లు ఎంత మంది లేరు? ఈ రోగము నా తమ్ముడికే రావాలా?’ అనుకుంట కండ్ల నిండా నీళ్ళు తీసుకుంది.

” మందులు లేని రోగమే. నయం గాని రోగమే . కాని మన చేతిల ఏముంది? రోగమొచ్చిందని చావు నోట్లో తలపెట్టె బదులు ,  రోగం గురించి ముందే తెలిసి మంచిదైంది.  ” అని తమ్ముడికి ఏమేమి చెప్పాలో ఆలోచిస్తూ  ఉంటే అంబులెస్సు గుట్టలను దాటి పోతుంది. అప్పుడే రాములును  చేసుకోబోయే పిల్ల ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తి బుద్ధి కాలేదు.
‘ ఈ రోగముందని బయటకు చెప్పలేను. వీడు చూస్తనేమో ఇట్లుండే. వాళ్ళేమో పెండ్లెప్పుడు పెండ్లెప్పుడూ అనవట్టిరి. వాళ్ళకు ఏం చెప్పాలి? తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల బతుకు మీద మన్ను పోయలేను గదా?  ఇన్ని రోజులంటే ఏదో చెప్పి నమ్మించినము. ఇప్పుడు పిల్ల తల్లిదండ్రికి ఏమని చెప్పాలి ?  ఎవరైన మనిషే గదా ?నా బిడ్డ ఎక్కువొచ్చి , ఆ పిల్ల తక్కువ రాలేదు. ‘ అని ఆలోచిస్తుంటే ఆగకుండా వస్తున్న ఫోన్ ను కట్ చేసింది. ఇల్లు ఎప్పుడొస్తదా అని దారి దిక్కు చూసుకుంట ఆలోచనలో పడ్డది లచ్చిందేవి.

తగుళ్ళ గోపాల్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *